కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నీవు యోగ్యురాలివి’

‘నీవు యోగ్యురాలివి’

‘నీవు యోగ్యురాలివి’

ప్రశంసాపూర్వకమైన ఈ మాటలు ఒక యౌవన మోయాబీయురాలిని ఉద్దేశించి చెప్పబడ్డాయి. ఆమె పేరు రూతు. విధవరాలైన ఈమె ఇశ్రాయేలు స్త్రీయైన నయోమి కోడలు. 3000 సంవత్సరాల క్రితం, న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో ఇశ్రాయేలులో జీవించిన రూతు యోగ్యురాలు అని పేరు తెచ్చుకుంది. (రూతు 3:​11) ఆమె ఈ మంచిపేరును ఎలా సంపాదించుకుంది? ఆమె మాదిరి నుండి ఎవరు ప్రయోజనం పొందగలరు?

‘పనిచేయకుండా భోజనం’ చేయని రూతు పొలాలలో పరిగె ఏరుకుంటూ ఎక్కువ గంటలు కష్టపడి పనిచేసేది. ఆ శ్రమించే స్వభావమే ఆమెకు ప్రశంసను సంపాదించి పెట్టింది. పని భారాన్ని తగ్గించేందుకు సహాయం ఇవ్వబడినా, ఆమె తాను చేయవలసిన దానికంటే ఎక్కువ చేస్తూ శ్రమించి పనిచేయడంలో కొనసాగింది. ప్రాముఖ్యంగా ప్రశంసార్హమైన, గుణవతియైన, కష్టించి పనిచేసే భార్య గురించి బైబిలు చేసే వర్ణనకు ఆమె సరిగ్గా సరిపోయింది.​—⁠సామెతలు 31:​10-31; రూతు 2:​7, 15-17.

రూతు పొందిన మంచి పేరుకు ముఖ్యమైన కారకాలు ఆమెకున్న వినయం, స్వయం త్యాగపూరిత స్వభావం, యథార్థమైన ప్రేమ వంటి ఆధ్యాత్మిక గుణాలే. తన తల్లిదండ్రులనూ స్వదేశాన్నీ వదిలిపెట్టి, వివాహంవల్ల వచ్చే భద్రతను పొందే నిరీక్షణ లేకుండా, ఆమె నయోమిని అంటిపెట్టుకుని ఉంది. అదే సమయంలో, రూతు తన అత్తగారి దేవుడైన యెహోవాను సేవించాలనే తన కోరికను వ్యక్తపరిచింది. రూతు విలువను ఉన్నతపరుస్తూ, ఆమె ‘నయోమికి యేడుగురు కుమారులకంటె ఎక్కువగా’ ఉండెను అని లేఖన వృత్తాంతం చెబుతుంది.​—⁠రూతు 1:​16, 17; 2:​11, 12; 4:​15.

తన తోటి మానవుల మధ్య రూతుకు ఉన్న మంచి పేరు మెచ్చుకోదగినదే. అయితే, ఆమె గుణాలను దేవుడు ప్రశంసాత్మకంగా విలువకట్టడం, యేసుక్రీస్తుకు పూర్వికురాలయ్యే ఆధిక్యతతో ఆమెను ఆశీర్వదించడం మరింత గమనార్హమైన విషయాలు. (మత్తయి 1:⁠5; 1 పేతురు 3:⁠4) రూతు క్రైస్తవ స్త్రీలకే కాకుండా యెహోవాను ఆరాధిస్తున్నామని చెప్పుకునే వారందరికీ ఎంత చక్కని మాదిరో కదా!