కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మానవజాతి సమస్యలు ఎప్పటికైనా అంతమౌతాయా?

మానవజాతి సమస్యలు ఎప్పటికైనా అంతమౌతాయా?

మానవజాతి సమస్యలు ఎప్పటికైనా అంతమౌతాయా?

“ప్రపంచ జనాభాలోని నాలుగవ వంతు పేదరికంలో జీవిస్తోంది, 130 కోట్లమంది రోజుకు 50 రూపాయిల కంటే తక్కువ డబ్బుతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారు, 100 కోట్లమంది నిరక్షరాస్యులున్నారు, 130 కోట్లమందికి త్రాగడానికి సురక్షితమైన నీరు లభించడం లేదు, రోజుకు 100 కోట్లమంది ఆకలితో అలమటిస్తున్నారు” అని ప్రపంచ పరిస్థితిని గురించి ఐర్లాండ్‌నుంచి వచ్చిన ఒక నివేదిక చెబుతోంది.

ప్రపంచ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనడంలో మానవుని అసమర్థతపై ఎంత విచారకరమైన నేరారోపణో కదా! ఆ నివేదికలో వర్ణించబడిన వారిలో అధికశాతం మంది భద్రతలేని స్త్రీలు, పిల్లలు అని మీరు తెలుసుకున్నప్పుడు ఆ సమస్యలు మరింత విషాదకరంగా కనిపిస్తాయి. ఇప్పుడు కూడా, అంటే 21వ శతాబ్దంలో కూడా వారి హక్కులు “లెక్కించలేనంత విస్తారమైన సంఖ్యలో ప్రతి రోజు అతిక్రమించబడుతూనే ఉన్నాయి” అన్న విషయం భయం కలుగజేసేదిగా లేదా?​—⁠ద స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్స్‌ చిల్డ్రన్‌ 2000.

“ఒక్క తరంలోనే ఒక క్రొత్త లోకం”

“భూవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాలపై ఈ మోసాలు . . . కప్పిన విషాదభరితమైన ముసుగు తీసివేయబడగలదు” అని ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి తన నమ్మకాన్ని వ్యక్తపరిచింది. నిస్సహాయులైన ఈ కోట్లాదిమంది, ప్రస్తుతం అనుభవించాల్సి వస్తున్న ఘోరమైన పరిస్థితులు “అనివార్యమైనవి కావు లేదా మార్చలేనివి కావు” అని ఈ సంస్థ చెబుతుంది. నిజానికి, “ఒక్క తరంలోనే ఒక క్రొత్త లోకం తీసుకువచ్చేందుకు ప్రజలందరికీ” ఆ సంస్థ పిలుపునిచ్చింది. ఆ లోకంలో మానవజాతి అంతా “పేదరికం, జాతివిచక్షణ, దౌర్జన్యం, రోగాల నుండి విముక్తి చేయబడుతుంది” అని అది నిరీక్షిస్తుంది.

ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తపర్చేవారు, “అంతులేనట్టు అనిపిస్తున్న వివాదాల, క్లిష్టపరిస్థితుల పరంపర” యొక్క దుఃఖభరితమైన పర్యవసానాల తీవ్రతను తగ్గించడానికి శ్రద్ధగల ప్రజలు ఎంతో కృషి చేస్తున్నారన్న వాస్తవం నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఉదాహరణకు, గత 15 సంవత్సరాలలో చెర్నోబెల్‌ చిల్డ్రన్స్‌ ప్రాజెక్టు, “న్యూక్లియర్‌ ఫాల్‌అవుట్‌ కలుగజేసిన కాన్సర్‌కు గురైన వందలాది మంది పిల్లల బాధను తగ్గించడానికి సహాయం చేసింది.” (ది ఐరిష్‌ ఎగ్జామినర్‌, ఏప్రిల్‌ 4, 2000) యుద్ధాలకు, విపత్తులకు బలైపోయిన లెక్కలేనంత మంది జీవితాలపై, చిన్నా పెద్దా సహాయక సంస్థలు నిశ్చయంగా గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి.

అయినప్పటికీ, ఇలాంటి మానవతా దృక్పథంతో చేసే ప్రయత్నాలలో పాల్గొనేవారు వాస్తవికవాదులు. మనం ఎదుర్కొంటున్న సమస్యలు “దశాబ్దం క్రితం ఉన్నవాటికన్నా మరింత విస్తృతంగా ఉన్నాయి, స్థిరంగా పాతుకుపోయాయి” అని వారికి తెలుసు. మొజాంబిక్‌లో వినాశకరమైన వరదలు వచ్చినప్పుడు, “సిబ్బంది, మద్దతుదారులు, దాతలు అద్భుతంగా స్పందించారు” అని ఐరిష్‌ చారిటీ కన్సర్న్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన డేవిడ్‌ బెగ్‌ చెబుతున్నారు. “కాని అంతటి భయంకర విపత్తులను మనం ఒంటరిగా ఎదుర్కోలేము” అని కూడా ఆయన అన్నారు. ఆఫ్రికాలో చేయబడిన సహాయక ప్రయత్నాల గురించి ఆయన నిష్పాక్షికంగా ఇలా ఒప్పుకున్నారు: “నిరీక్షణకు గల కొన్ని కారణాలు కూడా, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న రెపరెపలాడుతున్న దీపాల్లా ఉన్నాయి.” ఈ వ్యాఖ్యానం భూవ్యాప్త పరిస్థితిని కూడా చక్కగా క్లుప్తీకరించి చెబుతుందని చాలామంది భావించవచ్చు.

నిరీక్షించబడుతున్నట్లుగా, “ఒక్క తరంలోనే ఒక క్రొత్త లోకం” వస్తుందని మనం వాస్తవికంగా ఎదురుచూడవచ్చా? నేడు మానవతా దృక్పథంతో చేయబడుతున్న ప్రయత్నాలు నిజంగా మెచ్చుకోదగినవైనప్పటికీ, నీతియుక్తమైన శాంతియుతమైన క్రొత్త లోకం కోసం మరొక అంశాన్ని పరిశీలించడం ఖచ్చితంగా జ్ఞానయుక్తమైనది. బైబిలు ఆ అంశాన్ని సూచిస్తుంది, తర్వాతి ఆర్టికల్‌ దాన్ని పరిశీలిస్తుంది.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

3వ పేజీ, పిల్లలు: UN/DPI Photo by James Bu