కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మానవజాతి సమస్యలు త్వరలోనే అంతమౌతాయి!

మానవజాతి సమస్యలు త్వరలోనే అంతమౌతాయి!

మానవజాతి సమస్యలు త్వరలోనే అంతమౌతాయి!

“మానవతా దృక్పథంతో చేసే సహాయం, వివాదానికి ప్రధాన కారణమైన విషయాలతో వ్యవహరించడాన్ని లక్ష్యంగా కలిగివున్న ఒక విస్తృత పథకంలో భాగం కాకపోతే, అలాంటి లక్ష్యమే ఉన్న రాజకీయ మద్దతూ దానికి లేకపోతే ఆ సహాయానికి అంతగా విలువ ఉండదు. ప్రధానంగా రాజకీయ సంబంధ సమస్యలను కేవలం మానవతా దృక్పథంతో చేసే సహాయం మాత్రమే పరిష్కరించలేదని అనుభవం ఎన్నోసార్లు చూపించింది.”​—⁠ద స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్స్‌ రెఫ్యూజీస్‌ 2000.

మానవతా దృక్పథంతో ఎంతో సహాయం చేయబడుతున్నప్పటికీ, మానవజాతి సమస్యలు అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. రాజకీయపరంగా శాశ్వతమైన పరిష్కారం లభించే అవకాశం ఉందా? నిజం చెప్పాలంటే, ఆ అవకాశం చాలా తక్కువే. మరి మనం ఇక ఎటు వైపు చూడగలము? దేవుడు మానవజాతి సమస్యలన్నింటినీ ఎలా అంతం చేస్తాడన్నదాని గురించి అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు తాను వ్రాసిన పత్రిక ప్రారంభంలో గమనార్హమైన మాటలలో వివరించాడు. దాన్ని సాధించడానికి దేవుడు ఉపయోగించే సాధనాన్ని​—⁠నేడు మనందరిని బాధపెడుతున్న సమస్యలకు మూల కారణాలపై అవధానం నిలిపే సాధనాన్ని​—⁠గురించి కూడా ఆయన సూచించాడు. పౌలు ఏమి చెబుతున్నాడో మనం ఎందుకు పరిశీలించకూడదు? ఆ మాటలు ఎఫెసీయులు 1:​3-10 వచనాల్లో ఉన్నాయి.

“సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని”

‘కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటు [లేదా వ్యవహారాల నిర్వాహకత్వం] అని తాను అంటున్నదే దేవుని సంకల్పము అని అపొస్తలుడు చెబుతున్నాడు. దీని అర్థమేమిటి? ‘పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చేందుకు’ చర్య తీసుకోవడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడని దాని అర్థం. (ఎఫెసీయులు 1:​8-10) అవును, పరలోకములోనూ భూమి మీదా ఉన్న సమస్తాన్ని తన ప్రత్యక్ష అధికారం క్రింద మళ్ళీ సమైక్యంగా ఉంచుకునేందుకు దేవుడు ఒక ఏర్పాటును ప్రారంభించాడు. ఆసక్తికరంగా, ఇక్కడ ‘సమకూర్చడం’ అని అనువదించబడిన పదం గురించి బైబిలు పండితుడైన జె.హెచ్‌. తేయర్‌ ఇలా వ్యాఖ్యానించాడు: “(పాపం ద్వారా వేరుచేయబడిన) అన్ని వస్తువులను, ప్రాణులను క్రీస్తు సహవాసంలో ఒక సమైక్య స్థితికి . . . తన కోసం మళ్ళీ సమకూర్చుకోవడం.”

ఆ వ్యాఖ్యానం, మొదట అసలు అనైక్యత ఎలా మొదలయ్యిందనే దాన్ని పరిగణలోకి తీసుకుంటే, దేవుడు అలాంటి ఏర్పాటు చేయవలసిన అవసరం ఎందుకు ఏర్పడిందో సూచిస్తుంది. మానవ చరిత్ర ప్రారంభంలో, మన తొలి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో అపవాదియగు సాతానును అనుసరించారు. వారు ఏది మంచో ఏది చెడో తమకు తామే నిర్ణయించుకునే హక్కు రూపంలో స్వాతంత్ర్యాన్ని కోరుకున్నారు. (ఆదికాండము 3:​1-5) దైవిక న్యాయానికి అనుగుణంగా, వారు దేవుని కుటుంబం నుండి వెలివేయబడ్డారు, ఆయనతో తమకున్న సహవాసాన్ని పోగొట్టుకున్నారు. నేడు మనం అనుభవిస్తున్న ఘోరమైన పర్యవసానాలన్నిటితో కూడిన అపరిపూర్ణతలోకి వారు మానవజాతిని త్రోసివేశారు.​—⁠రోమీయులు 5:​12.

చెడుతనానికి తాత్కాలిక అనుమతి

‘వారు అలా చేయడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? ఆయన తన మహత్తరమైన శక్తిని ఉపయోగించి తన చిత్తం జరిగేటట్టు చూసి, మనం ఇప్పుడు అనుభవిస్తున్న బాధా వేదనలన్నిటిని ఎందుకు నివారించలేదు?’ అని కొందరు ప్రశ్నించవచ్చు. ఆ విధంగా ఆలోచించడం సహజమే కావచ్చు. కానీ ఆయన తన మహత్తర శక్తిని అలా ఉపయోగించడం ద్వారా నిజానికి ఏమి నిరూపించబడుతుంది? వ్యతిరేకత తలెత్తే అవకాశం ఉన్నట్టు మొదటి సూచన కనబడగానే, తనకు అధికారం ఉంది కదా అని వ్యతిరేకతనంతటినీ అణచివేసే వ్యక్తిని మీరు మెచ్చుకుంటారా, అతను చేసిన పని సరైనది అని అంగీకరిస్తారా? నిశ్చయంగా మీరు అలా చేయరు.

ఆ తిరుగుబాటుదారులు నిజానికి దేవునికున్న సర్వశక్తిని సవాలు చేయలేదు. బదులుగా, వారు ప్రత్యేకించి దేవుని పరిపాలనా హక్కునూ, ఆయన పరిపాలనా విధానం సరైనదా కాదా అన్న విషయాన్ని సవాలు చేశారు. లేవదీయబడిన ప్రాధమిక వివాదాంశాలను శాశ్వతంగా పరిష్కరించడానికి, తాను సృష్టించిన ప్రాణులు ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకుండా కొంత కాలంపాటు తమను తామే పరిపాలించుకోవడానికి యెహోవా అనుమతించాడు. (ప్రసంగి 3:⁠1; లూకా 21:​24) ఆ సమయం ముగిసినప్పుడు, భూమి మీద తన పూర్తి అధికారాన్ని మళ్ళీ అమలుచేయడానికి ఆయన జోక్యం చేసుకుంటాడు. అప్పటికల్లా కేవలం ఆయన పరిపాలనా విధానం మాత్రమే భూనివాసులకు శాశ్వతమైన శాంతిసంతోషాలూ సమృద్ధీ తీసుకురాగలదన్నది సుస్పష్టమవుతుంది. ఆ తర్వాత లోకంలో ఉన్న బాధించే వారందరూ శాశ్వతంగా నిర్మూలించబడతారు.​—⁠కీర్తన 72:​12-14; దానియేలు 2:​44.

“జగత్తు పునాది వేయబడకమునుపే”

ఇదంతా చేయాలని యెహోవా చాలా కాలం పూర్వమే సంకల్పించాడు. “జగత్తు పునాది వేయబడకమునుపే” అని పౌలు చెబుతున్నాడు. (ఇటాలిక్కులు మావి.) (ఎఫెసీయులు 1:⁠4-6) దానర్థం ఈ భూమిని, ఆదాము హవ్వలను సృష్టించకముందే అని కాదు. ఎందుకంటే ఆ జగత్తు “చాలమంచిదిగ” ఉండింది, దానిలో అప్పటికింకా తిరుగుబాటు మొదలవ్వలేదు. (ఆదికాండము 1:​31) మరైతే, “జగత్తు” అన్నప్పుడు అపొస్తలుడైన పౌలు దేన్ని సూచించాడు? ఆదాము హవ్వల సంతానం యొక్క జగత్తును​—⁠విమోచించబడే నిరీక్షణవున్న పాపభరిత, అపరిపూర్ణ మానవజాతి యొక్క జగత్తును ఆయన సూచించాడు. ఆదాము హవ్వలకు సంతానం కలగక ముందే, విమోచించబడదగిన ఆదాము సంతానానికి ఉపశమనాన్ని తీసుకురావడానికి తాను ఎలా వ్యవహరించాలో యెహోవాకు తెలుసు.​—⁠రోమీయులు 8:​20, 21.

అయితే, విశ్వ సర్వాధిపతి మానవులు వ్యవహరించినట్టే వ్యవహరించాలని కాదు. మానవులు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తవచ్చని గ్రహించి, దానితో వ్యవహరించడానికి వివరణాత్మకమైన వివిధ పథకాలు వేస్తారు. కానీ సర్వశక్తిగల దేవుడు కేవలం తన సంకల్పాన్ని తెలియజేసి దాన్ని నెరవేరుస్తాడు. అయినప్పటికీ, మానవజాతికి శాశ్వతమైన ఉపశమనాన్ని తీసుకురావడానికి విషయాలను ఎలా పరిష్కరించాలని యెహోవా నిర్ణయించుకున్నాడో పౌలు వివరిస్తున్నాడు. దేవుడు తీసుకున్న ఆ చర్యలు ఏమిటి?

ఉపశమనాన్ని ఎవరు తీసుకువస్తారు?

ఆదాము చేసిన పాపము ద్వారా కలిగిన హానిని తీసివేయడంలో క్రీస్తు యొక్క ఆత్మాభిషిక్త శిష్యులకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉందని పౌలు వివరిస్తున్నాడు. యేసుతో పాటు ఆయన పరలోక రాజ్యంలో పరిపాలించడానికి, యెహోవా “క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను” అని ఆయన అన్నాడు. దీన్ని ఇంకా వివరిస్తూ, “యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై” యెహోవా ‘మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొన్నాడు’ అని పౌలు అన్నాడు. (ఇటాలిక్కులు మావి.) (ఎఫెసీయులు 1:​4-6) అంటే యెహోవా వారిని ఒక్కొక్కరిగా ముందే ఎంపిక చేసుకోలేదు లేదా నిర్ణయించలేదు. అయితే, సాతాను ఆదాము హవ్వలతో కలిసి మానవ కుటుంబంపైకి తీసుకువచ్చిన హానిని తీసివేయడానికి క్రీస్తుతో పాటు కలిసి పనిచేసే నమ్మకమైన, సమర్పించుకున్న ప్రజల తరగతిని ఆయన ముందే నిర్ణయించుకున్నాడు.​—⁠లూకా 12:​32; హెబ్రీయులు 2:​14-18.

ఎంతటి అద్భుతమైన విషయం! దేవుని సర్వాధిపత్యాన్ని సాతాను తొలిసారి సవాలు చేసినప్పుడు, దేవుడు చేసిన మానవ సృష్టిలో లోపము ఉందని అతడు సూచించాడు, అంటే ఒత్తిడి చేయబడినప్పుడు గానీ ఆశ చూపించబడినప్పుడు గానీ వారందరూ దేవుని పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారని అతడు సూచించాడు. (యోబు 1:​7-12; 2:​2-5) చివరికి, యెహోవా దేవుడు తన ‘కృపామహిమను’ ఆశ్చర్యకరంగా ప్రదర్శిస్తూ, పాపభరితమైన ఆదాము కుటుంబం నుంచి కొంతమందిని తన ఆధ్యాత్మిక కుమారులుగా దత్తత తీసుకోవడం ద్వారా తన భూసంబంధ సృష్టిపై తనకున్న నమ్మకాన్ని చూపించాడు. ఈ చిన్న గుంపులోని వారు పరలోకంలో సేవ చేయడానికి తీసుకొనబడతారు. ఎందుకు?​—⁠ఎఫెసీయులు 1:​3-6; యోహాను 14:​2, 3; 1 థెస్సలొనీకయులు 4:​15-17; 1 పేతురు 1:⁠3, 4.

దేవుడు దత్తత తీసుకున్న ఈ కుమారులు, ఆయన పరలోక రాజ్యములో ‘క్రీస్తుతోడి వారసులు’ అవుతారు అని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. (రోమీయులు 8:​14-17) రాజులుగా, యాజకులుగా వీరు, మానవ కుటుంబం ఇప్పుడు అనుభవిస్తున్న బాధనుండి నొప్పినుండి దాన్ని విడిపించడంలో భాగం వహిస్తారు. (ప్రకటన 5:​9, 10) నిజమే, ‘సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నది.’ అయితే త్వరలోనే, ప్రత్యేకంగా ఎంపిక చేసుకోబడిన దేవుని ఈ కుమారులు, చర్య తీసుకోవడంలో యేసుక్రీస్తును అనుసరిస్తారు. విధేయులైన మానవులందరూ, ‘నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపించబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును’ తిరిగి ‘పొందుదురు.’​—⁠రోమీయులు 8:​18-22.

‘ఆయన రక్తము వలన విమోచనము’

ఇదంతా కూడా విమోచించబడదగిన మానవ జగత్తు పట్ల దేవుని అనర్హమైన దయ యొక్క అత్యద్భుతమైన, అత్యున్నతమైన వ్యక్తీకరణ అయిన యేసుక్రీస్తు ఇచ్చిన విమోచన క్రయధన బలి ద్వారా సాధ్యమయ్యింది. పౌలు ఇలా వ్రాస్తున్నాడు: ‘దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి [యేసుక్రీస్తు] రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.’​—⁠ఎఫెసీయులు 1:⁠7.

దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో యేసుక్రీస్తు ప్రధానమైన వ్యక్తి. (హెబ్రీయులు 2:​10) ఆయన విమోచన క్రయధన బలి, ఆదాము కుమారులలో నుంచి కొంతమందిని తన పరలోక కుటుంబంలోకి స్వీకరించడానికీ తన శాసనాలు, సూత్రాల యందు నమ్మకాన్ని తగ్గించకుండానే ఆదాము పాపము మూలంగా వచ్చిన పర్యవసానాలనుండి మానవజాతిని విడుదల చేయడానికీ యెహోవాకు చట్టబద్ధమైన ఆధారాన్ని కల్పిస్తుంది. (మత్తయి 20:​28; 1 తిమోతి 2:⁠6) తన నీతి ఉన్నతపరచబడే విధంగా, పరిపూర్ణ న్యాయము జరిగే విధంగా యెహోవా చర్య గైకొన్నాడు.​—⁠రోమీయులు 3:​22-26.

దేవుని “పరిశుద్ధ మర్మము”

భూమికి సంబంధించిన తన సంకల్పాన్ని తాను ఖచ్చితంగా ఎలా నెరవేరుస్తాడన్న విషయాన్ని దేవుడు వేలాది సంవత్సరాల వరకు వెల్లడి చేయలేదు. సా.శ. మొదటి శతాబ్దంలో ఆయన, ‘తన చిత్తమునుగూర్చిన పరిశుద్ధ మర్మమును [క్రైస్తవులకు] తెలియజేసెను.’ (ఎఫెసీయులు 1:​8, 9, NW) దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో యేసుక్రీస్తుకు నియమించబడిన మహిమాన్వితమైన పాత్రను పౌలు, ఆయన తోటి అభిషిక్త క్రైస్తవులు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఆయన పరలోక రాజ్యములో క్రీస్తుతోపాటు సహవారసులుగా తమకున్న ప్రత్యేక పాత్రను కూడా వారు గ్రహించడం ప్రారంభించారు. (ఎఫెసీయులు 3:​5, 6, 8-11) అవును, పరలోకంలోనే కాకుండా భూమిమీద కూడా శాశ్వతమైన శాంతిని తీసుకురావడానికి యేసుక్రీస్తు, ఆయన సహపరిపాలకుల చేతుల్లో ఉన్న రాజ్య ప్రభుత్వమే దేవుడు ఉపయోగించే సాధనము. (మత్తయి 6:​9, 10) దాని ద్వారా యెహోవా, ఈ భూమిని మొదట సంకల్పించిన స్థితికి తిరిగి తీసుకువస్తాడు.​—⁠యెషయా 45:​18; 65:​21-23; అపొస్తలుల కార్యములు 3:​21.

ఈ భూమిమీద నుండి అణచివేతను అన్యాయాన్ని పూర్తిగా తీసివేయడానికి యెహోవా తీసుకోబోయే ప్రత్యక్ష చర్యకు నియమించబడిన సమయం సమీప భవిష్యత్తులో ఉంది. అయితే ఆయన ఈ పునఃస్థాపన ప్రక్రియను సా.శ. 33 పెంతెకొస్తు నుండి మొదలుపెట్టాడు. ఎలా? అప్పటి నుండి, పరలోకములో క్రీస్తుతో పాటు పరిపాలించే వారిని అంటే ‘పరలోకములో ఉన్నవి’ సమకూర్చడాన్ని మొదలుపెట్టడంతో ఆయన ప్రారంభించాడు. ఎఫెసులోని క్రైస్తవులు కూడా అందులో ఇమిడి ఉన్నారు. (ఎఫెసీయులు 2:​4-7) ఇటీవల, మన కాలంలో, యెహోవా ‘భూమిమీద ఉన్నవి’ సమకూరుస్తున్నాడు. (ఎఫెసీయులు 1:​10) భూవ్యాప్త ప్రకటనా కార్యక్రమం ద్వారా, యేసుక్రీస్తు చేతుల్లోని తన రాజ్య ప్రభుత్వము గురించిన సువార్తను అన్ని జనాంగములకు తెలియజేస్తున్నాడు. ఆ సువార్తకు ప్రతిస్పందించేవారు ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక కాపుదల, స్వస్థత గల స్థలానికి సమకూర్చబడుతున్నారు. (యోహాను 10:​16) త్వరలోనే, శుభ్రం చేయబడిన పరదైసు భూమిపై వారు సమస్త అన్యాయాల నుండి బాధల నుండి పూర్తి స్వాతంత్ర్యాన్ని పొందుతారు.​—⁠2 పేతురు 3:​13; ప్రకటన 11:​18.

అణచివేయబడిన మానవజాతికి సహాయం చేసేందుకు జరిగిన మానవతా దృక్పథంతో చేసే ప్రయత్నాలలో “ఆశ్చర్యకరమైన అభివృద్ధి సాధించబడింది.” (ద స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్స్‌ చిల్డ్రన్‌ 2000) అయినప్పటికీ, పరలోక రాజ్య ప్రభుత్వంలో యేసుక్రీస్తు, ఆయన సహపరిపాలకులు జోక్యం చేసుకోవడమనేది అత్యంతాశ్చర్యకరమైన అభివృద్ధిగా ఉంటుంది. వివాదానికి మూలకారణాలను, మనకు ఎదురయ్యే సమస్త ఇతర కీడులను వారు సంపూర్ణంగా నిర్మూలిస్తారు. వారు మానవజాతి సమస్యలన్నింటినీ అంతం చేస్తారు.​—⁠ప్రకటన 21:​1-4.

[4వ పేజీలోని చిత్రాలు]

మానవతా దృక్పథంతో చేసే చర్యలు మానవజాతి సమస్యలను పరిష్కరించలేవు

[6వ పేజీలోని చిత్రం]

క్రీస్తు విమోచనా క్రయధన బలి, ఆదాము పాపమునుండి మానవజాతికి విముక్తిని కలుగజేసింది

[7వ పేజీలోని చిత్రం]

నేడు ఆధ్యాత్మిక కాపుదలను, స్వస్థతను కనుగొనడం సాధ్యమే

[7వ పేజీలోని చిత్రాలు]

త్వరలోనే, మెస్సీయా రాజ్యం ద్వారా సమస్యలనుండి పూర్తి విడుదల లభిస్తుంది