కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రోమన్‌ చరిత్ర నుండి ఒక పాఠం

రోమన్‌ చరిత్ర నుండి ఒక పాఠం

రోమన్‌ చరిత్ర నుండి ఒక పాఠం

“మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల” అన్న 1 కొరింథీయులు 15:​32 లోని మాటలు అపొస్తలుడైన పౌలు రోమన్ల ఎరీనాలో (పోరాట ప్రదర్శనశాలలోని రంగస్థలం) పోరాడేందుకు శిక్షించబడ్డాడని సూచిస్తున్నాయని కొందరు అనుకుంటారు. ఆయనలా శిక్షించబడినా శిక్షించబడకపోయినా ఆ కాలంలో ఎరీనాల్లో ప్రాణం పోయేంత వరకు చేసే పోరాటాలు సర్వసాధారణమే. ఎరీనా గురించీ అక్కడ జరిగే సంఘటనల గురించీ చరిత్ర మనకు ఏమి చెబుతోంది?

క్రైస్తవులుగా, మనం మన మనస్సాక్షిని యెహోవా ఆలోచనా సరళికి అనుగుణంగా మలుచుకోవాలని కోరుకుంటాం, ఆధునిక కాల వినోద కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు ఆయన ఆలోచనాసరళి మనకు సహాయపడగలదు. ఉదాహరణకు, బలాత్కారం గురించి దేవుడు ఎలా భావిస్తాడో ఆలోచించండి, అది ఈ మాటల్లో వ్యక్తం అవుతోంది: “బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయ గోరవద్దు.” (సామెతలు 3:​31) ఈ సలహా, తొలి క్రైస్తవుల చుట్టుప్రక్కల ఉన్న చాలామంది రోమన్‌ గ్లాడియేటర్ల పోటీలకు ఉత్తేజితులవుతున్నప్పుడు వారికి మార్గదర్శకంగా ఉండేది. అలాంటి సంఘటనల్లో ఏమి జరిగేదో పరిశీలిస్తుండగా, నేటి క్రైస్తవుల కోసం ఏ పాఠం స్పష్టంగా అవగతమవుతుందో మనం చూద్దాం.

రోమన్‌ ఎరీనాలో సాయుధులైన ఇద్దరు గ్లాడియేటర్లు ఒకరినొకరు ఎదుర్కొంటారు. డాలుమీద పడే మొదటి కత్తి దెబ్బలకు, వెర్రి ఆవేశంతో ఉన్న ప్రేక్షకులు తమ అభిమానిని ప్రోత్సహిస్తూ కేకలు వేస్తారు. అదొక ప్రమాదభరితమైన పోరాటం. కొద్ది సేపట్లోనే ఒక వ్యక్తి గాయపడి ఇక పోరాడలేక తన ఆయుధాలను క్రిందపడేసి మోకరిల్లుతాడు, తన ఓటమిని అంగీకరించి తనను కరుణించమని ఆ విధంగా వేడుకుంటాడు. ప్రేక్షకులు ఇంకా బిగ్గరగా కేకలు వేస్తారు. ప్రేక్షకుల్లో కొందరు ఆయనను కరుణించమనీ, మరి కొందరు చంపేయమనీ గట్టిగా అరుస్తారు. అందరి కళ్ళు చక్రవర్తి మీదే నిలుస్తాయి. ఆయన జనాభిప్రాయాన్ని జాగ్రత్తగా గమనించి, ఓడిపోయిన యోధుడ్ని వదిలిపెట్టవచ్చు లేదా బొటనవేలును కిందికి వంచడం ద్వారా చంపేయమని ఆజ్ఞాపించవచ్చు.

గ్లాడియేటర్ల ప్రదర్శనలు చూడడమంటే రోమన్లు వెర్రి ఉత్సాహం చూపించేవారు. అలాంటి పోరాటాలు మొదట్లో ప్రముఖ వ్యక్తుల అంత్యక్రియల్లో జరిగేవని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. ఇప్పుడు మధ్య ఇటలీ అని పిలువబడుతున్న ప్రాంతంలో ఒకప్పుడు నివసించిన ఒస్కన్‌ లేదా సామ్‌నైట్‌ ప్రజలు, చనిపోయిన వారి ఆత్మలను శాంతింపజేయడానికని ఇచ్చే మానవ బలుల నుండి ఈ పోటీలు పుట్టాయని విశ్వసించబడుతోంది. అలాంటి పోరాటం మూనుస్‌ అంటే బహుమతి (బహువచనం మూనెరా) అని పిలువబడేది. మొదటిసారిగా నమోదు చేయబడిన క్రీడలు రోమ్‌లో సా.శ.పూ 264 లో జరిగాయి. అప్పుడు మూడు జతల గ్లాడియేటర్లు పశువులను అమ్మే స్థలంలో పోరాడారు. మార్కుస్‌ ఏమిలియస్‌ లెపిడస్‌ అంత్యక్రియల సందర్భంగా 22 జతల మంది పోరాడారు. పుబ్లియస్‌ లిసినియస్‌ అంత్యక్రియల సందర్భంగా 60 జతల మంది ఒకరినొకరు ఎదుర్కొన్నారు. సా.శ.పూ. 65 లో జూలియస్‌ సీజర్‌ 320 జతల మందిని ఎరీనాకు పంపించాడు.

“ఉన్నత వంశీయుల అంత్యక్రియలు రాజకీయ లక్ష్యాలకు మార్గాలుగా ఉపయోగించబడేవి, అంత్యక్రియల్లో జరిగే క్రీడలు ఓట్లు వేసే పౌరుల ఆదరణను పొందాయి గనుక . . . అంత్యక్రియల క్రీడలతో రాజకీయాలు మిళితమై ఉండేవి. వాస్తవానికి, గ్లాడియేటర్ల ప్రదర్శనల వైభవం అధికమవడానికి కారణం అధికార వాంఛగల ఉన్నత వంశీయుల మధ్య ఉండే రాజకీయ పోటీయే” అని చరిత్రకారుడైన కెయిత్‌ హాప్‌కిన్స్‌ అంటున్నాడు. అగస్టస్‌ పరిపాలనా కాలానికల్లా (సా.శ.పూ. 27 నుండి సా.శ. 14 వరకు) ప్రజల వినోదం కోసం దేశంలోని ధనవంతులైన అధికారులు తమ రాజకీయ పరపతిని పెంచుకోవడానికి ఇచ్చే ఎంతో ఖరీదైన బహుమతులుగా మూనెరా మారిపోయాయి.

పాల్గొనేవారూ, శిక్షణా

అయితే ‘గ్లాడియేటర్లు ఎవరు?’ అని మీరు అడుగుతుండవచ్చు. వారు బానిసలే కావచ్చు, మరణశిక్ష విధించబడిన నేరస్థులే కావచ్చు, యుద్ధ ఖైదీలే కావచ్చు, ఉత్తేజితులైన ప్రజలేకావచ్చు, ధనప్రతిష్ఠలను సంపాదించవచ్చన్న ఆశకు ఆకర్షితులైన మామూలు ప్రజలే కావచ్చు. అయితే అందరూ చెరసాలల్లాంటి పాఠశాలల్లో శిక్షణపొందినవారే. జోకీ ఇ స్పెటాకొలీ (క్రీడలు, ప్రదర్శనలు) అనే పుస్తకం, శిక్షణపొందే గ్లాడియేటర్లు “అన్నివేళలా కాపలాదారుల నిఘాలో ఉండేవారు, కఠినమైన క్రమశిక్షణకు, అత్యంత కఠోరమైన నియమాలకు లోబడి ఉండవలసి వచ్చేది. ప్రత్యేకించి క్రూరమైన శిక్షలకు కూడా గురయ్యేవారు. . . . ఆ విధానం తరచుగా ఆత్మహత్యకు, ఎదురుతిరగడానికి, తిరుగుబాటుకు దారితీసేది” అని నివేదించింది. రోమ్‌లోని అతి పెద్దదైన గ్లాడియేటర్ల పాఠశాలలో కనీసం వెయ్యిమంది ఉండేందుకు చిన్న చిన్న గదులుండేవి. ఒక్కో వ్యక్తిలో ఒక్కో ప్రావీణ్యత ఉండేది. కొందరు కవచము, కత్తి, డాలుతోనూ మరికొందరు వల, త్రిశూలంతోనూ పోరాడేవారు. ఇంకా కొందరైతే వేట అని పిలిచే ప్రఖ్యాతిగాంచిన మరొక ప్రదర్శనకు అంటే క్రూర జంతువులతో పోరాడేందుకు శిక్షణను పొందేవారు. పౌలు సూచిస్తున్న సంఘటన అలాంటిదే అయ్యుండవచ్చా?

ప్రదర్శన నిర్వాహకులు వర్తకుల నుండి సహాయం పొందేవారు, ఆ వర్తకులు 17, 18 ఏండ్ల వయస్సుగలవారిని తీసుకువచ్చి గ్లాడియేటర్లుగా వారికి శిక్షణను ఇప్పిస్తుండేవారు. మానవ జీవితాలతో చేసే ఈ వర్తకం లాభదాయకమైన వ్యాపారంగా ఉండేది. ట్రాజన్‌ చక్రవర్తి సైనిక విజయాన్ని ఉత్సవంగా జరుపుకోవడానికి 10,000 గ్లాడియేటర్లు, 11,000 జంతువులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన అసాధారణమైనది.

ఎరీనాలో ఒక రోజు

ఎరీనాలో ఉదయం పూటలను వేటలకే అంకితం చేసేవారు. అన్ని రకాల క్రూర జంతువులను ఎరీనాలోకి బలవంతంగా తోలేవారు. ప్రత్యేకించి ఎద్దు, ఎలుగుబంటుల పోరాటాన్ని ప్రేక్షకులు ఆనందించేవారు. వాటిలో ఒకటి చనిపోయేంత వరకు పోరాటం జరగాలని తరచుగా వాటిని ఒకదానికొకటి కట్టేసేవారు, గెలిచి బ్రతికినదాన్ని ఆ తర్వాత ఒక వేటగాడు అంతమొందించేవాడు. జనాదరణ పొందిన ఇతర పోటీలు సింహాలకు పులులకు మధ్యగానీ, ఏనుగులకు ఎలుగుబంట్లకు మధ్య గానీ జరిగేవి. ఖర్చుల గురించి ఖాతరు చేయకుండా సామ్రాజ్య నలుమూలల నుండి తీసుకువచ్చిన అసాధారణ జంతువులను​—⁠చిరుతపులులను, ఖడ్గమృగాలను, నీటి గుర్రాలను, జిరాఫీలను, సివంగులను, ఒంటెలను, తోడేళ్ళను, అడవిపందులను, జింకలను​—⁠చంపివేయడంలో వేటగాళ్ళు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు.

ఆకర్షణీయంగా ఉండే కృత్రిమ ప్రకృతి దృశ్యాలు వేటలను మరచిపోకుండా చేసేవి. అడవుల్లా కనబడేందుకు రాళ్ళను, మడుగులను, చెట్లను ఉపయోగించేవారు. కొన్ని ఎరీనాల్లో, ఇంద్రజాలంలో కనబడ్డట్టు జంతువులు అండర్‌గ్రౌండ్‌ ఎలివేటర్ల ద్వారా, మూసివున్న తలుపుల వెనక నుండి అకస్మాత్తుగా బయటకు వచ్చేవి. ఊహకందని జంతువుల ప్రవర్తన ఉత్సాహాన్ని అధికం చేసేది, కానీ వేటలను అంత ఆకర్షణీయంగా చేసింది వాటిలోని క్రూరత్వమే అనిపిస్తుంది.

ఈ కార్యక్రమంలోకి మరణ దండనలు తర్వాత వచ్చాయి. వాటిని చాలా సహజంగా ఉంచేందుకు ప్రయత్నించేవారు. పౌరాణిక నాటకాల ప్రదర్శనల్లోనైతే నటులు నిజంగానే మరణించేవారు.

మధ్యాహ్న సమయాల్లో, భిన్నమైన పద్ధతుల్లో శిక్షణ పొందిన వివిధ రీతుల్లో ఆయుధాలను ధరించిన వేర్వేరు తరగతుల గ్లాడియేటర్ల గుంపులు ఒకదానితో ఒకటి పోరాడేవి. శవాలను బయటకు లాక్కుపోయేవారిలో కొందరు పాతాళలోకపు దేవతల్లా దుస్తులను ధరించుకొనేవారు.

ప్రేక్షకులపై ప్రభావం

పోరాటమంటే జనానికి తీరని కాంక్షగా ఉండేది, అందుకే పోరాడడానికి తిరస్కరించే వాళ్లను కొరడాలతోనూ, కాల్చి ముద్రలు వేసే ఇనుప కడ్డీలతోనూ అదిలించేవారు. జనాలు ఇలా అరిచేవారు: “అతడు కత్తిని పిరికివాడిలాగా ఎందుకు ఎదుర్కొంటున్నాడు? అతడెందుకలా బలం లేనట్లు కొడుతున్నాడు? అతడు [ఇష్ట పూర్వకంగా] ఎందుకు చావడం లేదు? అతడు పోరాటానికి దిగేలా అతడ్ని కొరడాతో కొట్టండి! వాళ్లను తమ అనాచ్ఛాదిత ఛాతీమీద దెబ్బకు దెబ్బ తిననివ్వండి, కత్తి వేటుకు గురికానివ్వండి!” ఒక విరామ సమయంలో చేయబడిన ప్రకటన గురించి రోమన్‌ రాజనీతిజ్ఞుడైన సెనేక ఇలా వ్రాశాడు: “తర్వాతి కార్యక్రమం ప్రారంభమయ్యేంత వరకు కొద్దిగా గొంతు కోయడం ఉంటుంది!”

సెనేక తాను ఇంటికి తిరిగి వచ్చేసరికి తాను “మరింత క్రూరుడిగా, నిర్దయుడిగా” అయ్యానని ఒప్పుకుంటున్నాడు, అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఒక ప్రేక్షకుడు అలా యథార్థంగా ఒప్పుకోవడం మనల్ని గంభీరంగా ఆలోచించేలా చేస్తోంది. అదే విధంగా నేటి కొన్ని క్రీడల సంఘటనలు కూడా ప్రేక్షకులు ‘మరింత క్రూరులుగా, నిర్దయులుగా’ మారేలా వారిని ప్రభావితం చేస్తాయా?

ఇంటికి క్షేమంగా తిరిగి రావడమే తమ అదృష్టం అని కూడా కొందరు అనుకొని ఉండవచ్చు. ఎందుకంటే ఒకసారి ఒక ప్రేక్షకుడు దమిషన్‌ చక్రవర్తి గురించి చమత్కరించినందుకు, ఆ చక్రవర్తి ఆయనను కూర్చున్నచోటు నుండి లాక్కొచ్చి కుక్కల ముందు పడవేయించాడు. కలిగ్యల చక్రవర్తి, వధించడానికి నేరస్థులు తక్కువైనప్పుడు ఒక భాగంలోని ప్రేక్షకులను బలవంతంగా తీసుకువచ్చి జంతువుల ముందు పడేయమని ఆజ్ఞాపించాడు. క్లోడియస్‌ చక్రవర్తి, వేదిక మీది యంత్రాలు ఆయన కోరినట్లు పనిచేయనప్పుడు, ఆ యంత్రాలను మరమ్మత్తు చేసేవారు ఎరీనాలో పోరాడాలని ఆజ్ఞాపించాడు.

ప్రేక్షకుడి వెర్రి ఉత్సాహం కూడా వినాశనాలకు, గొడవలకు దారి తీసింది. ఒక నివేదిక ప్రకారం, అలాంటి వెర్రి ఉత్సాహం కారణంగానే ఉత్తర రోమ్‌లోని ఒక ఆంఫి థియేటర్‌ (పోరాట ప్రదర్శనశాల) నాశనమై వేలాదిమంది చనిపోయారని నివేదించబడింది. సా.శ. 59 లో పాంపాయిలో ప్రదర్శన జరుగుతుండగా స్థానిక సమూహానికీ ప్రత్యర్థులకూ మధ్య అల్లరి చెలరేగింది, ఒకరినొకరు కించపరుచుకోవడంతో ప్రారంభమైన గొడవ రాళ్లు విసురుకోవడం వరకూ వచ్చి చివరికి కత్తులు దూసుకోవడంతో ముగిసింది. ఎంతోమంది అంగవిహీనులవడం, గాయపడడంతోపాటు అనేకమంది చనిపోయారు కూడా.

స్పష్టంగా ఒక పాఠం

ఇటీవల రోమ్‌లోని కలోసియమ్‌లో జరిగిన ఒక ప్రదర్శన (సంగ్వె ఇ అరీన, “రక్తమూ, ఇసుకా”) మూనెరాకు ఆధునిక నమూనాలను సూచించింది. అది చూపించిన కొన్ని వీడియో భాగాల్లో పశువులతో పోరాటం, ముష్టియుద్ధం, కారు రేసుల్లోనూ మోటారు సైకిల్‌ రేసుల్లోనూ జరిగే భయంకరమైన ప్రమాదాలు, పోటీల్లో అదుపు లేకుండా అథ్లెట్లు పోరాడడం, ప్రేక్షకుల్లో జరిగే అదుపు తప్పిన పోట్లాట ఉండడం గమనార్హం. ఆ ప్రదర్శన కలోసియమ్‌ యొక్క విహంగావలోకిత దృశ్యంతో ముగిసింది. సందర్శకులు ఎలాంటి ముగింపుకు వచ్చి ఉంటారని మీరనుకుంటున్నారు? ఎంతమంది పాఠం నేర్చుకొని ఉంటారు?

నేడు కొన్ని దేశాల్లో కుక్కల పోరాటాలు, కోడి పందాలు, పశువులతో పోరాటాలు, హింసాత్మక క్రీడల వంటివి సర్వసాధారణం. విరగబడి చూసే జనాన్ని పులకరింపజేసేందుకు కొందరు కారు రేసుల్లోనూ మోటారు సైకిల్‌ రేసుల్లోనూ ప్రాణాలకు తెగించి పాల్గొంటారు. అంతేకాదు, ప్రతి రోజూ టెలివిజన్‌లో కనిపించే దృశ్యాల గురించి ఆలోచించండి. ఒక పాశ్చాత్య దేశంలో జరిపిన అధ్యయనాలు, టీవీ చూసే సగటు పిల్లవాడు పదేళ్ల వయస్సు వచ్చేసరికి 10,000 హత్యలకు, 1,00,000 హింసాత్మక చర్యలకు సాక్షి అవుతుండవచ్చని తెలియజేస్తున్నాయి.

ఆ ప్రదర్శనలు అందించిన వినోదానికీ “నిజమైన మతానికి, సత్య దేవునికి చూపించే యథార్థమైన విధేయతకూ పొత్తు కుదరదు” అని మూడవ శతాబ్దపు రచయిత టెర్టూలియన్‌ అన్నారు. అలాంటి ప్రదర్శనలకు హాజరయ్యేవారిని చంపుతున్నవారి సహచరులుగా ఆయన ఎంచాడు. నేటి విషయం ఏమిటి? నేను ‘రక్తపాతాన్ని మరణాన్ని లేదా హింసను టీవీలో గానీ ఇంటర్‌నెట్‌లో గానీ చూసి ఆనందిస్తున్నానా?’ అని ఎవరైనా అడుగవచ్చు. కీర్తన 11:5 లోని “యెహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు” అన్న మాటలను జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది.

[28వ పేజీలోని బాక్సు]

“మరణించినవారిని శాంతపరచడానికి” పోరాటాలు

గ్లాడియేటర్ల పోరాటాల ఆరంభం గురించి మూడవ శతాబ్దపు రచయిత టెర్టూలియన్‌ ఇలా చెబుతున్నాడు: “ఇలాంటి ప్రదర్శన ద్వారా, మరణించినవారికి సేవ చేస్తున్నామని వెనకటి మనుషులు అనుకున్నారు, ఆ తర్వాతి కాలంలో దాన్ని ఆధునీకరించి దానికి మరింత క్రూరత్వాన్ని అంటగట్టారు. ప్రాచీన కాలంలో, మరణించినవారి ఆత్మలు మానవ రక్తంతో శాంతిస్తాయనే విశ్వాసంతో, అంత్యక్రియల్లో ఖైదీలను లేదా తాము కొన్న బడుగు జాతి బానిసలను బలి అర్పించేవారు. ఆ తర్వాత వారు ఆ ఆచారాన్ని ఒక వినోద క్రీడగా మార్చడం ద్వారా తమ దుష్టత్వాన్ని మరుగుపరచడం మంచిదని వారికి అనిపించింది. సమకూర్చబడిన వ్యక్తులు ఆ కాలంలో లభ్యమయ్యే ఆయుధాలతో, తమ సామర్థ్యమంతా ఉపయోగించి శిక్షణ పొందిన తర్వాత నియమిత అంత్యక్రియల రోజున సమాధుల దగ్గర చంపబడేవారు, చంపబడడాన్ని నేర్చుకోవడమే వారు పొందే శిక్షణ! మరణించినవారి కోసం అలా చంపడం ద్వారా వారు ఓదార్పు పొందేవారు. ఆ విధంగా మూనుస్‌ ఆవిర్భవించింది. కాని కాలక్రమేణా ప్రదర్శనలు ఎంతగా వృద్ధి చెందాయంటే క్రూరత్వం కూడా ఒక వినోద క్రీడగా మారిపోయింది. క్రూర జంతువులు మనుష్యుల శరీరాలను ముక్కలు ముక్కలుగా చీల్చి చెండాడడంలో భాగం వహించకపోతే, పండగ సంబరం వెలితిగా ఉండేది. మరణించినవారిని శాంతపరచడానికి అర్పించేదాన్ని అంత్యక్రియల ఆచారంగా భావించబడేది.”

[27వ పేజీలోని చిత్రం]

ప్రాచీనకాలంలో గ్లాడియేటర్లు ధరించే శిరస్త్రాణం, ముంగాళ్ళ కవచం

[29వ పేజీలోని చిత్రాలు]

తొలి క్రైస్తవులు దౌర్జన్యపూరిత వినోదం అనంగీకారమైనదని గ్రహించారు. మరి మీరు?

[చిత్రసౌజన్యం]

ముష్టియుద్ధం: Dave Kingdon/Index Stock Photography; కారు విరిగిపడడం: AP Photo/Martin Seppala

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

Phoenix Art Museum, Arizona/Bridgeman Art Library