కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మతపరమైన పటములు వాటి ప్రాచీన మూలాలు

మతపరమైన పటములు వాటి ప్రాచీన మూలాలు

మతపరమైన పటములు వాటి ప్రాచీన మూలాలు

“దేవుని యొక్క ఆయన పవిత్ర జనుల యొక్క మంచితనాన్నీ పరిశుద్ధతనూ చేరుకోవడానికి పటాలు ఒక మార్గం.”​—ఆస్ట్రేలియాలోని గ్రీక్‌ ఆర్థడాక్స్‌ ఆర్చిడయోసిస్‌.

ఆగస్టు నెల, సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఏజీయన్‌ సముద్రంలో ఉన్న టీనోస్‌ ద్వీపంలోని “అతి పవిత్రురాలైన దేవుని తల్లి” అనే మఠానికి నడిపించే సిమెంటు మెట్లు సూర్యుని ప్రతాపానికి వేడెక్కిపోయి ఉన్నాయి. అయినా ఆ వేడి 25,000కు పైగా ఉన్న గ్రీకు ఆర్థడాక్స్‌ చర్చి తీర్థయాత్రికుల దృఢ సంకల్పాన్ని ఏమాత్రం నీరుగార్చలేకపోతోంది. వాళ్ళు నెమ్మదిగా ముందుకు నడుస్తూ సర్వాంగ సుందరంగా అలంకరించబడిన యేసు తల్లి పటాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఒక కుంటి యౌవనస్థురాలు చాలా బాధలో ఉందని స్పష్టమవుతోంది, ఆమె కళ్ళల్లో అర్థింపు కనబడుతోంది. ఆమె మోకాళ్ళ నుండి రక్తం కారుతున్నా అలాగే ప్రాకుతూ ముందుకు సాగిపోతోంది. ఆమెకు కాస్త ఇవతల ఉన్న ఒక వృద్ధురాలు దేశంలోని ఆ కొన నుండి వచ్చింది. ఆమె నిస్సత్తువతో ఉంది, అలసిపోయిన తన శరీరాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి విఫలయత్నం చేస్తోంది. ఎంతో ఆత్రుతతో ఒక మధ్యవయస్కుడు ఒళ్ళంతా చెమటలు కక్కుకుంటూ జనం మధ్య నుండి దారిచేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. వీళ్ళ లక్ష్యం మరియ పటాన్ని చేరుకుని దాన్ని ముద్దు పెట్టుకుని దాని ముందు సాష్టాంగ నమస్కారం చేయాలన్నదే.

ఎంతో భక్తినిష్ఠలతో కనిపిస్తున్న ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలన్న కోరికతో హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే, మతపరమైన పటాలను ఈ విధంగా భక్తితో పూజించే ఆచారం క్రైస్తవత్వం ఉద్భవించడానికి శతాబ్దాల పూర్వమే ప్రారంభమైందని వీరిలో ఎంతమంది గ్రహిస్తారు?

పటాలు ఎంత విస్తృతంగా ఉన్నాయి?

ఆర్థడాక్స్‌ మతాన్ని అనుసరించే అన్ని ప్రాంతాల్లోనూ పటాలు కనిపిస్తాయి. చర్చీల్లో యేసు మరియల పటాలు, ఇంకా అనేకమంది “పరిశుద్ధుల” పటాలు ప్రస్ఫుటంగా కనిపించేలా వ్రేలాడదీస్తారు. వీటిని నమ్ముకునేవారు ఈ పటాలను ముద్దుపెట్టుకుంటారు, వీటికి ధూపం వేస్తారు, వీటి ముందు క్రొవ్వొత్తులు వెలిగిస్తారు. దీనికి తోడు దాదాపు ఆర్థడాక్స్‌ మతానికి చెందిన ఇళ్ళన్నింట్లోను ఒక మూల పటాలు ఉంటాయి, వీటి ముందు నిలబడో కూర్చునో వారు ప్రార్థనలు చేస్తారు. ఆర్థడాక్స్‌ క్రైస్తవులు తాము పటం ముందుండి దాన్ని పూజిస్తున్నప్పుడు దేవుడికి దగ్గరైనట్లుగా భావిస్తామని చెప్పడం పరిపాటి. ఈ పటాల్లో దేవుని అనుగ్రహం ఉట్టిపడుతోందనీ, వాటిలో అద్భుత శక్తులు దాగివున్నాయనీ అనేకులు నమ్ముతారు.

కానీ, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు దేవుని ఆరాధనలో పటాలను ఉపయోగించడాన్ని అంగీకరించలేదని ఈ విశ్వాసులు తెలుసుకుంటే బహుశా చాలా ఆశ్చర్యపోతారు. బైజాంటియమ్‌ అనే పుస్తకం ఇలా పేర్కొంటోంది: “తొలి క్రైస్తవులు యూదా మతం నుండి విగ్రహారాధన పట్ల ఏహ్యతను వారసత్వంగా పొందారు, వారు పరిశుద్ధుల చిత్రాలకు భక్తిని ప్రదర్శించడాన్ని తిరస్కారంతో చూశారు.” అదే పుస్తకం ఇలా కూడా చెబుతోంది: “ఐదవ శతాబ్దం నుండి, పటాలు లేదా ప్రతిమల వినియోగం . . . బహిరంగ ఆరాధనలోను వ్యక్తిగత ఆరాధనలోను ప్రబలమవుతూ వచ్చింది.” మతపరమైన పటాలను ఉపయోగించడం మొదటి శతాబ్దపు క్రైస్తవత్వం నుండి వచ్చింది కానట్లైతే మరి, ఎక్కడినుండి వచ్చినట్లు?

వాటి మూలాల జాడను వెలికితీయడం

పరిశోధకుడైన విటాలీ ఇవాన్యిచ్‌ పెట్రెన్కో ఇలా వ్రాశాడు: “ప్రతిమల ఉపయోగమూ వాటి ఆచారమూ క్రైస్తవ శకానికి ఎంతో ముందే ప్రారంభమైంది, దాని మూలాలు ‘ప్రాచీన అన్యమతాల్లో’ ఉన్నాయి.” పటాలను పూజించే ఆచార మూలాలు ప్రాచీన బబులోను (బాబిలోన్‌), ఐగుప్తు (ఈజిప్ట్‌), గ్రీసు దేశాల్లోని మతాల్లో ఉన్నాయని అనేకమంది చరిత్రకారులు అంగీకరిస్తారు. ఉదాహరణకు, ప్రాచీన గ్రీసులో మతపరమైన పటాలు విగ్రహాల రూపాన్ని సంతరించుకున్నాయి. వీటిలో దైవీక శక్తులు దాగివున్నాయని ప్రజలు నమ్మేవారు. ఈ ప్రతిమల్లో కొన్ని నిజానికి చేతులతో చేసినవి కావనీ, పరలోకం నుండే భూమ్మీద పడ్డాయనీ ప్రజలు అనుకునేవారు. కొన్ని ప్రత్యేక పండుగల్లోనైతే అలాంటి విగ్రహాలను నగరమంతటా ఊరేగించి, వాటికి బలుల్ని కూడా అర్పించేవారు. “అసలు దేవతకూ దేవతా విగ్రహానికీ తేడా ఉన్నదని చెప్పే . . . ప్రయత్నాలు జరిగినా ప్రతిమలే దేవతలని భక్తులు పరిగణించేవారు” అని పెట్రెన్కో అన్నాడు.

అసలు అలాంటి తలంపులు, ఆచారాలు క్రైస్తవత్వంలోకి ఎలా ప్రవేశించాయి? పైన పేర్కొన్న పరిశోధకుడే, క్రీస్తు అపొస్తలులు చనిపోయిన తర్వాతి శతాబ్దాల్లో, ప్రాముఖ్యంగా ఐగుప్తులో, “క్రైస్తవ నమ్మకాలను ‘అన్యమతాల సమ్మిళిత నమ్మకాలు’ సవాలు చేశాయి” అని చెబుతున్నాడు. “ఆ సమ్మిళిత నమ్మకాల్లో ఐగుప్తీయుల, గ్రీకుల, యూదుల, ప్రాచ్యుల, రోమన్ల ఆచారాలూ నమ్మకాలూ ఉన్నాయి. వీటిని ఆ తర్వాత క్రైస్తవ నమ్మకాలతో ఆచారాలతో కలగలిపి పాటించడం జరిగింది.” తత్ఫలితంగా, “క్రైస్తవ హస్తకళాకారులు [సమ్మిళిత మతవిశ్వాసాలను] స్వీకరించి, అన్యమత చిహ్నాలను ఉపయోగించారు. ఆ చిహ్నాల్లో మార్పులు చేర్పులు చేసి క్రొత్త చిహ్నాలుగా రూపొందించారు, కానీ వాటిని అన్యమత ప్రభావాల నుండి మాత్రం పూర్తిగా శుద్ధీకరించలేదు.”

కొంతకాలానికి పటాలు అటు వ్యక్తిగత జీవితాల్లోను ఇటు ప్రజా జీవనసరళిలోను మతపరంగా కేంద్రస్థానాన్ని ఆక్రమించుకున్నాయి. విశ్వాస యుగం (ఆంగ్లం) అనే పుస్తకంలో చరిత్రకారుడైన విల్‌ డ్యూరంట్‌, అసలు ఇదెలా సంభవించిందో వివరిస్తున్నాడు: “ఆరాధించబడుతున్న పరిశుద్ధుల సంఖ్య ఎక్కువవుతుండగా, వారిని గుర్తించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది; వారి చిత్రాలూ మరియ చిత్రాలూ పెద్ద సంఖ్యలో ఉత్పత్తిచేయబడ్డాయి; క్రీస్తు విషయంలోనైతే, ఆయన రూపాన్ని ఊహించుకుని గీసిన చిత్రాలు మాత్రమే కాక ఆయన సిలువ కూడా పూజార్హమైనదిగా మారిపోయింది​—⁠చివరికి సామాన్య మానవుడి దృష్టిలో ఇవి మాయాశక్తిగల తాయెత్తుల్లా తయారయ్యాయి. ప్రజల్లో సహజంగా ఉండే ఊహాశక్తి మూలంగా పవిత్ర వస్తువులు, చిత్రాలు, విగ్రహాలు వంటివి పూజార్హమైనవిగా మారిపోయాయి; ప్రజలు వాటి ముందు సాగిలపడ్డారు, వాటిని ముద్దు పెట్టుకున్నారు, వాటి ముందు క్రొవ్వొత్తులను వెలిగించారు, ధూపం వేశారు, పువ్వులు ఉంచారు, వాటి మాయా ప్రభావం మూలంగా అద్భుతాలు జరుగుతాయని ఎదురుచూశారు. . . . ఈ ప్రతిమలు దేవతలు కాదనీ దేవతలను గుర్తు చేయడానికి మాత్రమే ఉపయోగించబడుతున్నాయనీ ఫాదర్లు పదే పదే వివరించారు, చర్చి సభల్లోనూ అలానే చెప్పబడింది; అయితే ప్రజలు రెంటికీ మధ్య తేడాను అంతగా పట్టించుకోవడానికి ఇష్టపడలేదు.”

నేడు, మతపరమైన ప్రతిమలను ఉపయోగించే అనేకులు కూడా వాటికి తాము కేవలం గౌరవాన్ని మాత్రమే చూపిస్తున్నామనీ, వాటిని ఆరాధించడం లేదనీ వాదిస్తారు. దేవుని ఆరాధనలో సహాయకాలుగా మతపరమైన వర్ణచిత్రాలు ఉపయోగించడం న్యాయమేననీ చివరికి అవి ఉండాల్సిందేననీ కూడా వాదిస్తుండవచ్చు. బహుశ మీరు కూడా అలానే భావిస్తుండవచ్చు. కానీ ప్రశ్నేమిటంటే, దీని గురించి దేవుడు ఎలా భావిస్తున్నాడు? మతపరమైన పటాన్ని గౌరవంతో చూడడం దాన్ని ఆరాధించడంతో సమానమౌతుందా? అలాంటి ఆచారాలు నిజానికి ఏమైనా అదృశ్య ప్రమాదాలను కొనితెస్తాయా?

[4వ పేజీలోని బాక్సు/చిత్రం]

పటము అంటే ఏమిటి?

రోమన్‌ క్యాథలిక్కుల ఆరాధనలో విస్తృతంగా ఉపయోగించబడే విగ్రహాలకు భిన్నంగా పటాలకు రెండు కొలతలు (పొడవు, వెడల్పు) మాత్రమే ఉంటాయి; ఉదాహరణకు క్రీస్తు, మరియ, “పరిశుద్ధులు,” దేవదూతలు, బైబిలులోని వ్యక్తులు, సంఘటనలు లేదా ఆర్థడాక్స్‌ చర్చీ చరిత్రలోని సంఘటనలు వంటివాటి పటాలు తయారు చేయబడతాయి. సాధారణంగా పటాలను ఎక్కడికైనా తీసుకుపోగల చెక్క బోర్డులపై చిత్రిస్తారు.

ఆర్థడాక్స్‌ చర్చి అభిప్రాయం ప్రకారం “పరిశుద్ధుల పటాలు సాధారణ రక్త మాంసాలతో కూడిన వ్యక్తుల చిత్రాలుగా కనిపించవు.” సాధారణంగా, “నీడలు కనిపించవు, లేదా పగలో రాత్రో తెలిపే సూచనలేవీ ఉండవు.” ఒక పటం ఉన్న చెక్క, అందులోని రంగులు “దేవుని ప్రత్యక్షతతో నిండిపోగలవు” అని కూడా నమ్ముతారు.

[4వ పేజీలోని చిత్రం]

ప్రతిమల ఉపయోగం మూలాలు అన్యమత ఆచారాల్లో ఉన్నాయి

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

© AFP/CORBIS