కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ బోధ ప్రభావవంతంగా ఉందా?

మీ బోధ ప్రభావవంతంగా ఉందా?

మీ బోధ ప్రభావవంతంగా ఉందా?

తల్లిదండ్రులు, పెద్దలు, సువార్త ప్రచారకులు అందరూ బోధకులై ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకూ పెద్దలు క్రైస్తవ సంఘ సభ్యులకూ సువార్త ప్రచారకులు ఆసక్తిగల క్రొత్తవారికీ బోధిస్తారు. (ద్వితీయోపదేశకాండము 6:​6, 7; మత్తయి 28:​19, 20; 1 తిమోతి 4:​13, 16) మీ బోధ మరింత ప్రభావవంతంగా ఉండేలా చేసుకోవడానికి మీరు ఏమి చేయవచ్చు? ఒక మార్గం ఏమిటంటే, దేవుని వాక్యంలో ప్రస్తావించబడిన సమర్థులైన బోధకుల పద్ధతిని, వారి మాదిరిని మీరు అనుకరించవచ్చు. ఎజ్రా అలాంటి బోధకుడే.

ఎజ్రా మాదిరి నుండి నేర్చుకోవడం

దాదాపు 2,500 సంవత్సరాల క్రితం బబులోనులో నివసించిన ఎజ్రా, అహరోను వంశీయుడైన యాజకుడు. సా.శ.పూ. 468వ సంవత్సరంలో, యెరూషలేములో నివసిస్తున్న యూదుల మధ్య పరిశుద్ధ ఆరాధనను పెంపొందించడానికి ఆయన యెరూషలేముకు వెళ్ళాడు. (ఎజ్రా 7:​1, 6, 12, 13) ఈ కార్యాన్ని సాధించేందుకు ఆయన ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించాల్నిన అవసరం ఏర్పడింది. ఎజ్రా తన బోధ ప్రభావవంతంగా ఉందని నిశ్చయపర్చుకోవడానికి ఏమి చేశాడు? ఆయన దానికి అవసరమైన కొన్ని చర్యలు తీసుకున్నాడు. ఎజ్రా 7:​10 లో వ్రాయబడి ఉన్నట్లుగా, ఆ చర్యలేమిటో గమనించండి:

‘ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించుటకును, దానిచొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను [“తన హృదయమును సిద్ధపర్చుకొనెను,” NW].’ ఈ చర్యలలో ఒక్కొక్క క్లుప్తంగా పరిశీలించి, వాటినుండి మనం ఏమి నేర్చుకోగలమో చూద్దాం.

‘ఎజ్రా తన హృదయమును సిద్ధపర్చుకొనెను’

ఒక రైతు విత్తనాలు నాటడానికి ముందు నాగలితో నేలను దున్నడం ద్వారా దాన్ని ఎలాగైతే సిద్ధపరుస్తాడో అదే విధంగా దేవుని వాక్యాన్ని గ్రహించడానికి ఎజ్రా తన హృదయాన్ని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపర్చుకున్నాడు. (ఎజ్రా 10:⁠1) వేరే మాటల్లో చెప్పాలంటే ఆయన యెహోవా బోధను “హృదయపూర్వకముగా” విన్నాడు.​—⁠సామెతలు 2:⁠2.

అదే విధంగా, రాజైన యెహోషాపాతు ‘దేవునియొద్ద విచారణచేయడానికి తన హృదయాన్ని సిద్ధపర్చుకొన్నాడు’ అని బైబిలు నివేదిస్తుంది. (2 దినవృత్తాంతములు 19:⁠3, NW) దానికి విరుద్ధంగా ‘హృదయమును సిద్ధపర్చుకొనని’ ఇశ్రాయేలీయుల ఒక తరము, ‘మూర్ఖత తిరుగుబాటుగల’ తరముగా వర్ణించబడింది. (కీర్తన 78:​6-8, NW) యెహోవా, “హృదయపు అంతరంగ స్వభావము”ను చూస్తాడు. (1 పేతురు 3:⁠4) అవును, ఆయన ‘తన మార్గమును దీనులకు నేర్పిస్తాడు.’ (కీర్తన 25:⁠9) కాబట్టి, నేడు బోధకులు మొదట తమ హృదయాన్ని ప్రార్థనాపూర్వకంగా సరైన స్థితికి తెచ్చుకోవడంలో ఎజ్రా మాదిరిని అనుసరించడం ఎంత ప్రాముఖ్యమో కదా!

‘యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించుటకు’

సమర్థవంతుడైన బోధకుడిగా ఉండడానికి ఎజ్రా దేవుని వాక్యాన్ని పరిశోధించాడు. మీరు సలహా కోసం ఒక డాక్టరు దగ్గరకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఆయన చెబుతున్నది లేదా నిర్దేశిస్తున్నది జాగ్రత్తగా విని, ఆయన చెప్పినదంతా మీకు అర్థమయ్యిందని నిశ్చయపర్చుకోరా? నిశ్చయంగా మీరు అలా చేస్తారు, ఎందుకంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. మరి యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా చెబుతున్న విషయాలను గానీ నిర్దేశిస్తున్న విషయాలను గానీ వినడానికి మనం ఇంకెంత ఎక్కువ అవధానమివ్వాలి? ఎంతైనా, ఆయన ఇచ్చే ఉపదేశం మన జీవితాలకు సంబంధించినది! (మత్తయి 4:4; 24:​45-47) డాక్టరు చెప్పింది కొన్నిసార్లు తప్పు కావచ్చు కానీ “ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది.” (కీర్తన 19:⁠7, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) ఒక డాక్టరు అభిప్రాయాన్ని ధృవీకరించుకోవడానికి మరో డాక్టరు సలహా తీసుకోవలసిన అవసరం రావచ్చు, కానీ యెహోవా ఉపదేశం విషయంలో ఎన్నడూ అలాంటి అవసరం రాదు.

బైబిలు పుస్తకాలైన దినవృత్తాంతములు (ఎజ్రా మొదట వీటిని ఒకే సంపుటిగా వ్రాశాడు) ఎజ్రా నిజంగా శ్రద్ధగల విద్యార్థి అని చూపిస్తున్నాయి. ఆ పుస్తకాలను వ్రాయడానికి ఆయన అనేక మూలాలను పరిశోధించాడు. * ఇటీవలే బబులోను నుండి తిరిగి వచ్చిన యూదులకు తమ జనాంగ చరిత్ర గురించి సంక్షిప్తంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. తమ మతాచారాల గురించీ ఆలయ సేవ గురించీ లేవీయులు చేయవలసిన పనుల గురించీ వారికి తగినంత జ్ఞానం లేదు. వంశానుక్రమ రికార్డులు వారికి చాలా ప్రాముఖ్యము. ఎజ్రా ఆ విషయాలకు ప్రత్యేకమైన అవధానాన్నిచ్చాడు. మెస్సీయా వచ్చే వరకు యూదులు తమ స్వంత దేశాన్ని, ఆలయాన్ని, యాజకత్వాన్ని, అధిపతిని కలిగి ఉన్న జనాంగముగా మిగిలి ఉండాలి. ఎజ్రా సమకూర్చిన సమాచారం వల్ల ఐక్యతా సత్యారాధనా కాపాడబడ్డాయి.

మీ అధ్యయన అలవాట్లు ఎజ్రాకున్న అధ్యయన అలవాట్లను పోలి ఉన్నాయా? మీరు బైబిలును శ్రద్ధగా అధ్యయనం చేయడం, బైబిలును ప్రభావవంతంగా బోధించడానికి సహాయపడుతుంది.

ఒక కుటుంబంగా ‘యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించండి’

యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించడం వ్యక్తిగత అధ్యయనానికే పరిమితం కాదు. అలా పరిశోధించడానికి కుటుంబ అధ్యయనం కూడా అద్భుతమైన అవకాశాన్నిస్తుంది.

నెదర్లాండ్స్‌లోని యాన్‌, యూలియా అనే వివాహిత జంట తమ ఇద్దరు కొడుకులకూ వారు పుట్టిన నాటి నుండే వారికి బిగ్గరగా చదివి వినిపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈవోకు 15 సంవత్సరాలు, ఏడొకు 14 సంవత్సరాలు. ఇప్పటికీ వారానికి ఒకసారి వాళ్ళు కుటుంబ అధ్యయనం చేసుకుంటారు. యాన్‌ ఇలా వివరిస్తున్నాడు: “అధ్యయనం చేసేటప్పుడు చాలా సమాచారాన్ని చర్చించాలన్నది కాదు కానీ చర్చించిన దాన్ని అబ్బాయిలు గ్రహించాలన్నదే మా ముఖ్యోద్దేశం.” ఆయన ఇలా కూడా అన్నాడు: “మా అబ్బాయిలు చాలా పరిశోధన చేస్తారు. వాళ్ళకు తెలియని పదాలను, బైబిలు వ్యక్తుల గురించిన సమాచారాన్ని​—⁠వాళ్ళు ఎప్పుడు జీవించారు, వాళ్ళు ఎవరు, వారి వృత్తి ఏమిటి, ఇంకా ఇతరత్రా వివరాలను​—⁠పరిశోధిస్తారు. వాళ్ళు చదవడం నేర్చుకున్నప్పటి నుండి, లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం), నిఘంటువులు, సర్వసంగ్రహ నిఘంటువులు ఉపయోగిస్తున్నారు. ఇది మా కుటుంబ అధ్యయనాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది. మా అబ్బాయిలు కుటుంబ అధ్యయనం కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు.” అదనపు ప్రయోజనం ఏమిటంటే, అబ్బాయిలిద్దరూ భాషాపరమైన సామర్థ్యాలకు సంబంధించి తమ తమ తరగతుల్లో ప్రథమ స్థానంలో ఉన్నారు.

నెదర్లాండ్స్‌లోని మరో జంట జాన్‌, టీనీలు తమ కుమారుడు ఎస్లీతో (ఇప్పుడు 24 సంవత్సరాలు, వేరే సంఘంలో పయినీరు సేవ చేస్తున్నాడు), కుమార్తె లిండాతో (ఇప్పుడు 20 సంవత్సరాలు, యౌవనస్థుడైన మంచి సహోదరుడిని వివాహం చేసుకుంది) అధ్యయనం చేశారు. అయితే, సాధారణంగా చేసే ప్రశ్నా జవాబుల పద్ధతిలో ఒక నిర్దిష్టమైన ప్రచురణనుండి అధ్యయనం చేసే బదులు, వారు తమ కుటుంబ అధ్యయనాన్ని తమ పిల్లల వయస్సుకు, వారి అవసరాలకు తగినట్లు మలుచుకున్నారు? వారు ఏ పద్ధతిని ఉపయోగించారు?

తన పిల్లలు “పాఠకుల ప్రశ్నలు” (కావలికోట నుండి), “బైబిలు ఉద్దేశం” (తేజరిల్లు! నుండి) వంటివాటి నుండి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఎంపిక చేసుకునేవారని జాన్‌ వివరిస్తున్నాడు. ఆ తర్వాత, వాళ్ళు తాము సిద్ధపడిన సమాచారాన్ని వివరించేవారు, అలా వివరించిన సమాచారం ఎల్లప్పుడూ ఆసక్తికరమైన కుటుంబ చర్చలకు దారితీసేది. ఈ విధంగా, ఆ యౌవనస్థులు పరిశోధన చేయడంలో, తమ అధ్యయన ఫలితాలను చర్చించడంలో అనుభవం సంపాదించుకున్నారు. మీరు మీ పిల్లలతో కలిసి ‘యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తారా?’ ఇది మీ వ్యక్తిగత బోధనా సామర్థ్యాన్ని అధికం చేయడమే కాక మీ పిల్లలు ప్రభావవంతమైన బోధకులయ్యేందుకు కూడా సహాయం చేస్తుంది.

“దానిచొప్పున నడచుకొనుటకు”

ఎజ్రా తాను నేర్చుకున్నదానిని అన్వయించుకున్నాడు. ఉదాహరణకు, బబులోనులో ఉన్నప్పుడే ఆయన స్థిరమైన జీవిత విధానాన్ని కలిగివుండి ఉండవచ్చు. కానీ, స్వదేశంలో ఉన్న తన ప్రజలకు తాను సహాయం చేయగలనని ఆయన గ్రహించినప్పుడు, బబులోను పట్టణంలోని సౌఖ్యాలను వదులుకుని, సుదూరపట్టణమైన యెరూషలేములో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, ప్రమాదాలు ఉన్నప్పటికీ అక్కడికే వెళ్ళాడు. ఎజ్రా బైబిలు జ్ఞానాన్ని సమకూర్చుకోవడమే కాక తాను నేర్చుకున్నదాని ప్రకారం చర్య తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడన్నది స్పష్టమౌతోంది.​—⁠1 తిమోతి 3:​13.

తర్వాత ఎజ్రా, యెరూషలేములో నివసిస్తున్నప్పుడు తాను నేర్చుకున్నదాన్ని తాను బోధిస్తున్నదాన్ని తాను అన్వయించుకుంటున్నానని మళ్ళీ చూపించాడు. అది, ఇశ్రాయేలు పురుషులు అన్య స్త్రీలను వివాహమాడడాన్ని గురించి ఆయన విన్నప్పుడు స్పష్టమయ్యింది. ఆయన ‘తన వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, తన తల వెండ్రుకలను తన గడ్డపు వెండ్రుకలను పెరికి వేసికొని విభ్రాంతిపడి కూర్చున్నాడు’ అని బైబిలు వృత్తాంతం మనకు చెబుతుంది. చివరికి యెహోవా వైపు ‘తన ముఖము ఎత్తికొనుటకు సిగ్గుపడి ఖిన్నుడయ్యాడు.’​—⁠ఎజ్రా 9:​1-6.

దేవుని ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ఆయనను ఎంతగా ప్రభావితం చేసింది! ప్రజల అవిధేయతవల్ల కలిగే ఘోరమైన పరిణామాల గురించి ఎజ్రాకు స్పష్టంగా తెలుసు. స్వదేశానికి తిరిగి వచ్చిన యూదులు చాలా కొద్దిమందే. ఒకవేళ వారు మిశ్రిత వివాహాలు చేసుకుంటే, క్రమంగా చుట్టుప్రక్కల ఉన్న అన్యదేశాలతో వారు కలిసిపోవచ్చు, స్వచ్ఛారాధన భూమ్మీది నుండి సులభంగా అదృశ్యమైపోగలదు!

సంతోషకరంగా, విశ్వాససహితమైన భయము, ఆసక్తుల విషయంలో ఎజ్రా చూపిన మాదిరి, ఇశ్రాయేలీయులు తమ మార్గాలను సరిదిద్దుకునేందుకు వారిని కదిలించింది. వారు తమ అన్య భార్యలను వదిలించుకున్నారు. మూడు నెలల్లో అన్నీ సరిజేయబడ్డాయి. దేవుని ధర్మశాస్త్రానికి ఎజ్రా వ్యక్తిగతంగా చూపిన యథార్థత, ఆయన బోధ ప్రభావవంతంగా ఉండేలా చేయడంలో ఎంతో సహాయపడింది.

ఈనాడు కూడా అది నిజం. ఒక క్రైస్తవ తండ్రి ఇలా చెప్పాడు: “పిల్లలు మీరు చెప్పినట్టు చేయరు; మీరు చేసినట్టు చేస్తారు!” క్రైస్తవ సంఘానికి కూడా అదే సూత్రం అన్వయిస్తుంది. మంచి మాదిరిని ఉంచే పెద్దలు, సంఘం తమ బోధలకు ప్రతిస్పందిస్తుందని ఆశించవచ్చు.

“ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు”

ఎజ్రా బోధ ప్రభావవంతంగా ఉండడానికి మరొక కారణం ఉంది. ఆయన తన స్వంత తలంపులను బోధించలేదు కానీ “కట్టడలను విధులను” బోధించాడు. అంటే యెహోవా కట్టడలను లేక నియమాలను బోధించాడు. ఇది యాజకుడిగా ఆయన బాధ్యత. (మలాకీ 2:⁠7) అంతేకాక ఆయన విధులను కూడా బోధించాడు, ఒక ప్రమాణం ప్రకారం ఏది సరైనదో దానికి న్యాయంగా నిష్పక్షపాతంగా హత్తుకుని ఉండడం ద్వారా తాను బోధించినదాని విషయంలో ఒక మాదిరిని ఉంచాడు. అధికారంలో ఉన్నవారు న్యాయంగా ఉంటే, స్థిరత్వం ఏర్పడుతుంది, శాశ్వతమైన ఫలితాలు కలుగుతాయి. (సామెతలు 29:⁠4) అదే విధంగా దేవుని వాక్యం బాగా తెలిసిన క్రైస్తవ పెద్దలు, తల్లిదండ్రులు, రాజ్య ప్రచారకులు, సంఘంలోనూ తమ కుటుంబాలలోనూ ఆసక్తిగలవారికీ యెహోవా కట్టడలను విధులను బోధించినప్పుడు ఆధ్యాత్మిక స్థిరత్వం ఏర్పడేలా చేస్తారు.

నమ్మకస్థుడైన ఎజ్రా మాదిరిని మీరు సంపూర్ణంగా అనుకరించినప్పుడు మీ బోధ మరింత ప్రభావవంతంగా తయారవ్వగలదని మీరు అంగీకరించరా? కాబట్టి, ‘యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించడానికి, దానిచొప్పున నడచుకోవడానికి, యెహోవా కట్టడలను విధులను బోధించడానికి మీ హృదయమును సిద్ధపర్చుకోండి.’​—⁠ఎజ్రా 7:​10, NW.

[అధస్సూచి]

^ పేరా 11 యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1, 444-5 పేజీలలో 20 మూలాలను గురించిన పట్టికను చూడవచ్చు.

[22వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఎజ్రా బోధను ఏది ప్రభావవంతంగా చేసింది? 

1. ఆయన తన హృదయాన్ని సరైన స్థితిలోకి తెచ్చుకున్నాడు

2. ఆయన యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించాడు

3. తాను నేర్చుకున్నదాన్ని అన్వయించుకోవడంలో మంచి మాదిరిని ఉంచాడు

4. లేఖనాధారిత ఉద్దేశాన్ని బోధించడానికి ముందు తాను దాన్ని శ్రద్ధగా అధ్యయనం చేశాడు