కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మోసపోకండి

మోసపోకండి

మోసపోకండి

మోసం అనేది దాదాపు మానవాళి ఆరంభం నుండీ ఉన్నదే. చరిత్రలో నమోదు చేయబడిన తొలి సంఘటనల్లో ఒకటి మోసపూరితమైన చర్యే. అది ఏదెను తోటలో సాతాను హవ్వను మోసగించినప్పటిది.​—⁠ఆదికాండము 3:​13; 1 తిమోతి 2:​14.

అప్పటి నుండి మోసం భూమిపై వ్యాపించని కాలమంటూ లేక పోయినప్పటికీ ప్రత్యేకించి అది నేడు సర్వత్రా వ్యాపించిపోయింది. ఆధునిక కాలాల గురించి బైబిలు ముందే సూచిస్తూ ఇలా హెచ్చరించింది: “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.”​—⁠2 తిమోతి 3:​13.

ప్రజలు అనేక రీతుల్లో మోసపోతున్నారు. కపటోపాయులు, తప్పుడు వాగ్దానాలతో వంచించేవారు డబ్బు రాబట్టడం కోసం ప్రజలను మోసగిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలో ఉండాలనే సంకల్పంతో కొందరు రాజకీయవేత్తలు తమ ఓటర్లనే మోసం చేస్తారు. ప్రజలు తమను తాము కూడా మోసగించుకుంటారు. అసంతృప్తి కలిగించే పచ్చి నిజాలను ఒప్పుకోవడానికి బదులుగా వారు పొగ త్రాగడం, మాదక ద్రవ్యాల వ్యసనం లేదా లైంగిక అనైతికత వంటి ప్రమాదకరమైన అలవాట్లలో ఏ విధమైన హానీ లేదని తమను తాము సమర్ధించుకుంటారు.

మత సంబంధ విషయాల్లో కూడా మోసం ఉంది. యేసు కాలంలోని మత నాయకులు ప్రజలను మోసం చేశారు. ఆ మోసగాళ్ళ గురించి యేసు ఇలా అన్నాడు: “వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా.” (మత్తయి 15:​14) అంతేకాదు, ప్రజలు మత సంబంధ విషయాల్లో తమను తామే మోసం చేసుకుంటారు. “ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును” అని సామెతలు 14:​12 చెబుతోంది.

యేసు కాలంలో జరిగినట్లే నేడు కూడా అనేకమంది మత సంబంధ విషయాల్లో మోసపోతున్నారు, దాంట్లో ఆశ్చర్యమేమీ లేదు! ‘దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము ప్రకాశింపకుండు నిమిత్తము’ సాతాను “అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు.​—⁠2 కొరింథీయులు 4:⁠4.

మనం కపటోపాయుల చేత మోసపోయినట్లైతే డబ్బు పోగొట్టుకుంటాం. ఒక రాజకీయవేత్త మనల్ని మోసగించినట్లైతే మనం మన స్వేచ్ఛను కొంత మట్టుకు కోల్పోతుండవచ్చు. కానీ యేసుక్రీస్తు గురించిన సత్యాన్ని తిరస్కరించేలా మనల్ని సాతాను మోసగించినట్లైతే, మనం నిత్యజీవాన్నే కోల్పోతాం! కాబట్టి మోసపోకండి. మీ మనస్సును, హృదయాన్ని తెరిచి మత సత్యానికి నిర్వివాదాంశ మూలమైన బైబిలును నిష్పక్షపాతంగా పరిశీలించండి. అలా చేయనట్లైతే మనం గొప్ప ప్రయోజనాన్ని కోల్పోయే ప్రమాదముంది.​—⁠యోహాను 17:⁠3.