కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తన ప్రజలను వెలుగుతో శృంగారిస్తాడు

యెహోవా తన ప్రజలను వెలుగుతో శృంగారిస్తాడు

యెహోవా తన ప్రజలను వెలుగుతో శృంగారిస్తాడు

‘[“ఓ స్త్రీ,” NW] నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.’​—⁠యెషయా 60:⁠1.

1, 2. (ఎ) మానవజాతి పరిస్థితి ఏమిటి? (బి) మానవజాతిని అంధకారం అలుముకోవడానికి కారణం ఎవరు?

“యెషయాకు లేదా పౌలుకు ఉన్నటువంటి నైతికత, జ్ఞానము ఉన్నవారు మనకెంతగా అవసరమో కదా!” వెనుకటికి 1940లలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న హ్యారీ ట్రూమన్‌ అలా విలపించాడు. ఆయనెందుకు అలా అన్నాడు? ఎందుకంటే తన కాలంలో, ప్రపంచానికి అత్యున్నత స్థాయిలో నైతికతగల నాయకుల అవసరత ఉందని ఆయన గుర్తించాడు. మానవజాతి అప్పుడే 20వ శతాబ్దంలోని అతి అంధకారమయమైన సంవత్సరాల నుండి, అంటే రెండవ ప్రపంచ యుద్ధం నుండి బయటపడింది. అయితే యుద్ధం ముగిసినా ప్రపంచంలో శాంతి నెలకొనలేదు. అంధకారం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి, ఆ యుద్ధం ముగిసి ఇప్పటికి 57 సంవత్సరాలు గడుస్తున్నా ప్రపంచం ఇంకా అంధకారంలోనే ఉంది. అధ్యక్షుడైన ట్రూమన్‌ నేడు కూడా జీవించివుంటే, యెషయాకు లేదా అపొస్తలుడైన పౌలుకు ఉన్నటువంటి నైతికతగల నాయకుల అవసరం ఉందని ఆయన ఇప్పటికీ భావించివుండేవాడు.

2 అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌కి తెలుసో తెలీదో గాని, మానవజాతిని క్రమ్ముకొనివున్న అంధకారాన్ని గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు, ఆయన దాని గురించి తన వ్రాతల్లో హెచ్చరించాడు. ఉదాహరణకు ఆయన తన తోటి విశ్వాసులను ఇలా హెచ్చరించాడు: “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” (ఇటాలిక్కులు మావి.) (ఎఫెసీయులు 6:​12) ఈ మాటల్లో పౌలు, లోకాన్ని అలుముకుని ఉన్న ఆధ్యాత్మిక అంధకారం గురించి తనకు తెలియడం మాత్రమే కాక, దానికి నిజమైన మూలం “లోకనాథుల”ని వర్ణించబడిన బలమైన పైశాచిక శక్తులని కూడా తనకు తెలుసునని చూపిస్తున్నాడు. లోకాంధకారానికి కారణం శక్తిమంతులైన ఆత్మప్రాణులు గనుక దాన్ని ఛేదించడానికి నరమాత్రులు ఏమి చేయగలరు?

3. మానవజాతి అంధకారంలో ఉన్నప్పటికీ విశ్వసనీయులకు యెషయా ఎలాంటి భవిష్యత్తును ప్రవచించాడు?

3 అదే విధంగా యెషయా కూడా మానవజాతిని పట్టిపీడిస్తున్న అంధకారం గురించి మాట్లాడాడు. (యెషయా 8:​22; 59:⁠9) అయితే, ఆయన మన కాలం గురించి ముందుగానే తెలియజేస్తూ యెహోవా, వెలుగును ప్రేమించేవారి దృక్కోణాన్ని ఈ అంధకారయుగంలో సహితం ప్రకాశమానం చేస్తాడని ఆయన దైవప్రేరేపణతో ప్రవచించాడు. అవును, పౌలు గానీ యెషయా గానీ మనతో ఇప్పుడు లేకపోయినా వారు దైవప్రేరేపణతో వ్రాసిన లేఖనాలు మన దగ్గర ఉన్నాయి. యెహోవాను ప్రేమించేవారికి అవి ఎలాంటి ఆశీర్వాదాలను తీసుకువస్తాయో తెలుసుకోవడానికి, యెషయా పుస్తకంలోని 60వ అధ్యాయంలో కనుగొనబడే ఆయన ప్రవచనాత్మక మాటలను మనం పరిశీలిద్దాము.

ఒక ప్రవచనార్థక స్త్రీ వెలుగును ప్రసరిస్తుంది

4, 5. (ఎ) ఏమి చేయమని యెహోవా ఆ స్త్రీని ఆజ్ఞాపించాడు, ఆమెకు ఎలాంటి వాగ్దానం చేశాడు? (బి) యెషయా 60వ అధ్యాయంలో పులకరింపజేసే ఎలాంటి సమాచారం ఉంది?

4 యెషయా 60వ అధ్యాయంలోని తొలి మాటలు, చాలా దుఃఖకర పరిస్థితిలో అంటే అంధకారంలో నేలపై ముడుచుకుని పడుకొనివున్న ఒక స్త్రీని సంబోధించి చెప్పబడ్డాయి. అకస్మాత్తుగా ఆ చీకటిని ఛేదిస్తూ వెలుగు ప్రసరించింది, అప్పుడు యెహోవా ఇలా అంటున్నాడు: ‘[“ఓ స్త్రీ,” NW] నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.’ (యెషయా 60:⁠1) ఆ స్త్రీ లేచి నిలబడి, దేవుని మహిమ అనే వెలుగును ప్రతిబింబించడానికి సమయం ఆసన్నమైంది. ఎందుకని? దానికి జవాబు మనం తర్వాతి వచనంలో చూస్తాము: “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది; యెహోవా నీమీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీమీద కనబడుచున్నది.” (యెషయా 60:⁠2) ఆ స్త్రీ యెహోవా ఆజ్ఞకు విధేయత చూపిస్తే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆమెకు హామీ ఇవ్వబడింది. యెహోవా ఇలా అంటున్నాడు: “జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.”​—⁠యెషయా 60:⁠3.

5 ఈ మూడు వచనాల్లోని పులకరింపజేసే మాటలు యెషయా 60వ అధ్యాయానికి అటు ఉపోద్ఘాతంగాను, ఇటు మిగతా అధ్యాయానికంతటికీ సారాంశంగాను ఉన్నాయి. ఆ అధ్యాయం ఒక ప్రవచనార్థక స్త్రీ యొక్క అనుభవాలను ప్రవచిస్తోంది, అలాగే మానవజాతినంతటిని అంధకారం అలుముకుని ఉన్నప్పటికీ మనం యెహోవా వెలుగులో ఎలా ఉండగలమో వివరిస్తోంది. అయితే, ఈ మూడు ఉపోద్ఘాత వచనాల్లో ఉపయోగించబడిన సూచనలకు అర్థాలు ఏమిటి?

6. యెషయా 60వ అధ్యాయంలోని స్త్రీ ఎవరు, భూమ్మీద ఎవరు ఆమెకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

6యెషయా 60:1-3 లోని స్త్రీ, ఆత్మ ప్రాణులతో కూడిన యెహోవా పరలోక సంస్థ అయిన సీయోనే. ఆత్మాభిషిక్త క్రైస్తవుల అంతర్జాతీయ సంఘం అయిన “దేవుని ఇశ్రాయేలు”లోని మిగిలివున్న సభ్యులు నేడు ఆ సీయోనుకు భూమ్మీద ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరికి పరలోకంలో క్రీస్తుతో రాజులుగా పరిపాలించే నిరీక్షణ ఉంది. (గలతీయులు 6:​16) చివరికి ఈ ఆధ్యాత్మిక జనాంగంలో 1,44,000 మంది సభ్యులు ఉంటారు, యెషయా 60వ అధ్యాయం ఆధునిక నెరవేర్పు, “అంత్యదినములలో” భూమ్మీద జీవించివున్న ఆ సభ్యుల చుట్టూ పరిభ్రమిస్తుంది. (2 తిమోతి 3:⁠1; ప్రకటన 14:⁠1) ఈ అభిషిక్త క్రైస్తవుల సహవాసులైన “వేరే గొఱ్ఱెల”కు చెందిన “గొప్ప సమూహము” గురించి కూడా ఈ ప్రవచనం ఎంతగానో మాట్లాడుతోంది.​—⁠యోహాను 10:⁠16; ప్రకటన 7:⁠9.

7. సీయోను పరిస్థితి 1918 లో ఎలా ఉంది, దాని గురించి ముందే ఎలా ప్రవచించబడింది?

7 “దేవుని ఇశ్రాయేలు”కు ఆ ప్రవచనార్థక స్త్రీ పూర్వఛాయగా ఉంది కాబట్టి, ఆ స్త్రీలానే “దేవుని ఇశ్రాయేలు” గతంలో ఎప్పుడైనా అంధకారంలో ఉన్నదా? అవును ఉంది, ఇది 80 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం సంభవించింది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో సాక్ష్యపు పనిని ఆపకుండా కొనసాగించడానికి అభిషిక్త క్రైస్తవులు తీవ్రమైన కృషి సలిపారు. కానీ యుద్ధం చివరి సంవత్సరమైన 1918 లో సంస్థీకృత ప్రకటనా పని దాదాపు స్తంభించిపోయింది. అప్పట్లో ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిపై పైవిచారణ జరుపుతున్న జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌పైనా, మరితర ప్రముఖ క్రైస్తవులపైనా బూటకపు ఆరోపణలు మోపి వారికి సుదీర్ఘమైన జైలు శిక్షలు వేశారు. ఆ కాలంలో భూమ్మీద ఉన్న అభిషిక్త క్రైస్తవులు, ‘ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరుగల ఆ మహాపట్టణపు సంతవీధిలో పడియున్న’ శవాలుగా ప్రకటన గ్రంథంలో ప్రవచనార్థకంగా వర్ణించబడ్డారు. (ప్రకటన 11:⁠8) భూమ్మీద తన అభిషిక్త పిల్లలను ప్రతినిధులుగా కలిగివున్న సీయోనుకు అది నిజంగానే అంధకారమయమైన సమయంగా ఉంది!

8. ఎలాంటి నాటకీయమైన మార్పు 1919 లో సంభవించింది, ఫలితం ఏమిటి?

8 అయితే, 1919 లో నాటకీయమైన మార్పు సంభవించింది. యెహోవా సీయోనుపై వెలుగు ప్రసరింపజేశాడు! దేవుని ఇశ్రాయేలులో మిగిలివున్నవారు సువార్త ప్రకటనా పనిని నిర్భయంగా తిరిగి చేపట్టి, దేవుని వెలుగును ప్రతిబింబించడానికి కావలసిన చర్యలు గైకొన్నారు. (మత్తయి 5:​14-16) ఈ క్రైస్తవుల పునరుజ్జీవిత ఆసక్తి కారణంగా యెహోవా వెలుగు వైపు ఇతరులు కూడా ఆకర్షితులయ్యారు. మొదట్లో ఆ క్రొత్తగా వచ్చినవారు దేవుని ఇశ్రాయేలులోని అదనపు సభ్యులుగా అభిషిక్తులయ్యారు. వారు దేవుని పరలోక రాజ్యంలో క్రీస్తుతోపాటు సహపరిపాలకులుగా ఉండనైయున్నారు కాబట్టి, యెషయా 60:3 లో వారు రాజులని పిలువబడ్డారు. (ప్రకటన 20:⁠6) ఆ తర్వాత, వేరే గొఱ్ఱెలకు చెందిన ఒక గొప్ప సమూహము యెహోవా వెలుగు వైపు ఆకర్షితులవడం ప్రారంభమైంది. ఆ ప్రవచనంలో “జనములు” అని పిలువబడింది వీరే.

ఆ స్త్రీ పిల్లలు ఇంటికి వస్తారు!

9, 10. (ఎ) ప్రవచనార్థక స్త్రీ ఎలాంటి గమనార్హమైన దృశ్యాన్ని చూసింది, అది దేనికి పూర్వఛాయగా ఉంది? (బి) సీయోను ఉత్సహించడానికి ఎలాంటి కారణం ఉంది?

9 ఇప్పుడు, యెషయా 60:​1-3 వచనాల్లో క్లుప్తంగా ఉన్న సమాచారానికి యెహోవా మరిన్ని వివరాలను జోడించనారంభిస్తున్నాడు. ఆయన ఆ స్త్రీకి మరో ఆజ్ఞనిస్తున్నాడు. ఆయనేమంటున్నాడో వినండి: “కన్నులెత్తి చుట్టు చూడుము!” ఆ స్త్రీ కన్నులెత్తి చూసింది, ఎంత అద్భుతమైన దృశ్యమో కదా అది! ఆమె పిల్లలు ఇంటికి వస్తున్నారు. లేఖనం ఇలా కొనసాగుతోంది: “వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.” (యెషయా 60:⁠4) ప్రపంచవ్యాప్తంగా 1919 లో ప్రారంభమైన రాజ్య ప్రకటనా పని మూలంగా యెహోవా సేవ వైపుకి వేలాది మంది ఆకర్షితులయ్యారు. వీరు కూడా సీయోనుకు “కుమారులు”గా “కుమార్తెలు”గా, అంటే దేవుని ఇశ్రాయేలులోని అభిషిక్త సభ్యులుగా అయ్యారు. ఆ విధంగా, యెహోవా 1,44,000 మందిలోని చివరి సభ్యులను వెలుగులోనికి తీసుకురావడం ద్వారా సీయోనును శృంగారించాడు.

10 తన పిల్లలు తన దగ్గర ఉన్నందుకు సీయోను ఎంత ఉత్సహించి ఉంటుందో మీరు ఊహించగలరా? కానీ, సీయోను ఉత్సహించడానికి యెహోవా మరిన్ని కారణాలను ఇస్తున్నాడు. మనమిలా చదువుతాం: “నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.” (యెషయా 60:⁠5) ఆ ప్రవచనాత్మక వచనాలకు అనుగుణంగా భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణగల క్రైస్తవులు, 1930ల నుండి పెద్ద సంఖ్యలో సీయోను వద్దకు సమకూడారు. వారు, దేవుని నుండి దూరమైన మానవజాతి అనే “సముద్రము”లో నుండి బయటికి వచ్చారు, వారు అన్యజనములలోని వనరులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు “అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు.” (హగ్గయి 2:⁠7; యెషయా 57:​20) ఈ “యిష్టవస్తువులు” ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టరన్నది కూడా గమనించండి. లేదు, అలా ఎంతమాత్రమూ జరగదు, వారు తమ అభిషిక్త సహోదరుల సహవాసంలో ఆరాధించడానికి వచ్చి, ‘ఒక్క కాపరి’ క్రింద ‘ఒక్క మంద’గా ఉండి సీయోను సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తారు.​—⁠యోహాను 10:⁠16.

వాణిజ్యవేత్తలు, కాపరులు, వర్తకులు సీయోను దగ్గరికి వస్తారు

11, 12. సీయోను వైపు పయనిస్తున్న జనసమూహాలను వర్ణించండి.

11 ప్రవచించబడిన ఈ సమకూర్పు ఫలితంగా యెహోవా స్తుతికర్తల సంఖ్యలో అసాధారణమైన పెరుగుదల సంభవిస్తుంది. ఇది ప్రవచనంలోని తర్వాతి మాటల్లో ముందే చెప్పబడింది. ప్రవచనార్థక స్త్రీతో సీయోను పర్వతంపై మీరు నిలుచున్నారని ఊహించుకోండి. మీరు తూర్పుకు చూస్తారు, మీకక్కడ ఏమి కనిపిస్తుంది? “ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలును నీ దేశముమీద వ్యాపించును. వారందరు షేబనుండి వచ్చెదరు. బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.” (యెషయా 60:⁠6) వర్తకుల సమూహాలు తమ ఒంటెల బిడారులను యెరూషలేముకు దారితీసే మార్గాల్లో నడిపిస్తున్నాయి. అంతెందుకు, వరదలు దేశమంతటిలో వ్యాపిస్తున్నట్లుగా ఒంటెల సమూహాలు వ్యాపిస్తున్నాయి! వర్తకులు విలువైన కానుకలను​—⁠“బంగారమును ధూపద్రవ్యమును”​—⁠తీసుకువస్తున్నారు. ఈ వర్తకులు యెహోవాను బహిరంగంగా స్తుతించేందుకు, ‘యెహోవా స్తోత్రములను ప్రకటించేందుకు’ ఆయన వెలుగులోనికి వస్తున్నారు.

12 తరలివస్తున్నది వర్తకులు మాత్రమే కాదు. పశువుల కాపరులు కూడా సీయోను దగ్గరికి సమకూడుతున్నారు. ప్రవచనం ఇంకా ఇలా చెబుతోంది: “నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును. నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును.” (యెషయా 60:⁠7ఎ) మందకాపరుల తెగలకు చెందినవారు తమ మందలలోని సర్వశ్రేష్ఠమైన వాటిని యెహోవాకు సమర్పించేందుకు పరిశుద్ధ నగరానికి తరలివస్తున్నారు. వారు సీయోనుకు పరిచర్య చేయడానికి చివరికి తమను తాము కూడా సమర్పించుకుంటారు! యెహోవా ఈ అన్యులకు ఎలా స్వాగతం పలుకుతాడు? దేవుడే సమాధానమిస్తున్నాడు: “అవి నా బలిపీఠముమీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.” (యెషయా 60:⁠7బి) ఆ అన్యులు తీసుకువచ్చిన కానుకలను, వారి సేవలను యెహోవా దయాపూర్వకంగా స్వీకరిస్తాడు. వారు ఆయన ఆలయంలో ఉండడమే ఆ ఆలయానికి శృంగారముగా ఉంటుంది.

13, 14. పశ్చిమం నుండి ఏమి రావడం కనిపిస్తుంది?

13 ఇప్పుడు మీ తలను త్రిప్పి పశ్చిమం వైపు చూడండి. మీకేం కనబడుతోంది? అల్లంత దూరాన, సముద్రతలంపై ఏదో తెల్లని మేఘంలా వ్యాపించి ఉన్నట్లు కనబడుతోంది. మీ మనస్సులో తలెత్తిన ప్రశ్నను యెహోవాయే అడుగుతున్నాడు: “మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?” (యెషయా 60:⁠8) యెహోవా తానే తన ప్రశ్నకు జవాబిస్తున్నాడు: “నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.”​—⁠యెషయా 60:⁠9.

14 మీరు ఆ దృశ్యాన్ని ఊహించుకోగలరా? ఆ తెల్లని మేఘం కొంచెం దగ్గరయింది, ఇప్పుడది దూరాన పశ్చిమదిశలో ఉన్న తెల్లని చుక్కలుగా అగుపడుతోంది. అది సముద్ర తరంగాలకు పైగా ఎగసివస్తున్న పక్షుల సమూహంలా కనబడుతోంది. కానీ అవి ఇంకా దగ్గరయినప్పుడు, తెరచాపలు విప్పుకుని గాలి సహాయంతో ముందుకు వస్తున్న ఓడలని మీరు గ్రహిస్తారు. యెరూషలేము వైపుగా ఎన్ని ఓడలు వస్తున్నాయంటే అవి గువ్వల సమూహాల్లా కనిపిస్తున్నాయి. సుదూరాన్నున్న ఓడరేవుల నుండి ఆ నౌకాదళం అతి వేగంతో వస్తోంది, యెహోవాను ఆరాధించడానికి విశ్వాసులను యెరూషలేముకు తీసుకువస్తోంది.

యెహోవా సంస్థ విస్తరిస్తుంది

15. (ఎ) యెషయా 60:4-9 లోని మాటలు ఎలాంటి అభివృద్ధిని గురించి ముందే చెబుతున్నాయి? (బి) యథార్థ క్రైస్తవులు ఎలాంటి స్ఫూర్తిని ప్రదర్శిస్తారు?

15 నాలుగు నుండి తొమ్మిది వచనాలు, ప్రపంచవ్యాప్తంగా 1919 నుండి జరిగిన విస్తరణ గురించిన ఎంతటి విస్పష్టమైన ప్రవచనార్థక చిత్రాన్ని చిత్రిస్తున్నాయో కదా! సీయోనుకు అంతటి పెరుగుదలను ఆశీర్వాదంగా యెహోవా ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే, దేవుని ఇశ్రాయేలు 1919 నుండి విధేయతతో ఎడతెగక యెహోవా వెలుగును ప్రతిబింబించింది. అయితే, క్రొత్తగా వచ్చేవారు 7వ వచనం ప్రకారం ‘[దేవుని] బలిపీఠముమీదకు’ వస్తున్నారని మీరు గమనించారా? బలిపీఠము అంటే యాగములు అర్పించబడే స్థలం, ప్రవచనంలోని ఈ అంశం యెహోవా సేవలో యాగములు అర్పించాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని మనకు గుర్తుచేస్తోంది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని . . . మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.” (రోమీయులు 12:⁠1) పౌలు మాటలకు అనుగుణంగా, యథార్థ క్రైస్తవులు ఏదో వారానికి ఒక్కసారి మతపరమైన కూటాలకు హాజరవడంతోనే తృప్తిపడిపోరు. వారు తమ సమయాన్ని, శక్తిని, వనరులను స్వచ్ఛారాధనను వృద్ధి చేయడానికి వెచ్చిస్తారు. అలాంటి అంకితభావంగల ఆరాధకులు ఉండడం యెహోవా ఆలయాన్ని శృంగారించదా? అవునని యెషయా ప్రవచనం చెప్పింది. అలా, ఆసక్తిగల అటువంటి ఆరాధకులు యెహోవా దృష్టిలో అందమైన వారన్న నిశ్చయతను మనం కలిగివుండగలము.

16. ప్రాచీన కాలాల్లో పునర్నిర్మాణ పనిలో ఎవరు సహాయం చేశారు, ఆధునిక కాలంలో అలా ఎవరు చేస్తున్నారు?

16 క్రొత్తగా వచ్చేవారు పని చేయాలని కోరుకుంటారు. ఆ ప్రవచనం ఇంకా ఇలా కొనసాగుతోంది: “అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు.” (యెషయా 60:​10) బబులోను చెర నుండి తిరిగి వస్తుండగా ఈ మాటల తొలి నెరవేర్పు జరిగినప్పుడు, దేవాలయాన్ని యెరూషలేము నగరాన్ని పునర్నిర్మించడంలో ఇతర జనాంగముల రాజులూ మరితరులూ నిజంగానే సహాయం చేశారు. (ఎజ్రా 3:⁠7; నెహెమ్యా 3:​26) ఆధునిక దిన నెరవేర్పులో, సత్యారాధనను నిర్మించడంలో అభిషిక్త శేషానికి గొప్ప సమూహము మద్దతునిచ్చింది. క్రైస్తవ సంఘాలను నిర్మించి, యెహోవా సంస్థ యొక్క నగరంలాంటి “ప్రాకారములను” బలపరచడంలో వారు సహాయం చేశారు. వారు ఒక అక్షరార్థమైన నిర్మాణ పనిలో​—⁠రాజ్యమందిరాలు, అసెంబ్లీ హాళ్ళు, బేతేలు భవనాల నిర్మాణ పనిలో కూడా పాల్గొంటున్నారు. ఈ మార్గాలన్నింట్లో వారు, విస్తరిస్తున్న యెహోవా సంస్థ అవసరాలపట్ల శ్రద్ధవహించడంలో తమ అభిషిక్త సహోదరులకు మద్దతునిస్తున్నారు.

17. యెహోవా తన ప్రజలను శృంగారించే ఒక మార్గం ఏమిటి?

17యెషయా 60:10 లోని చివరి మాటలు ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నాయో కదా! యెహోవా ఇలా అంటున్నాడు: “నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.” అవును, వెనుకటికి 1918/19 లో యెహోవా తన ప్రజలపై క్రమశిక్షణా చర్యలను తీసుకున్నాడనడంలో సందేహం లేదు. కానీ అది గతం. ఇప్పుడు, యెహోవా తన అభిషిక్త సేవకులపైనా వారి సహవాసులైన వేరే గొఱ్ఱెలపైనా జాలి పడాల్సిన సమయం. ఇది వాస్తవమనేందుకు ఆయన వారికి అసాధారణమైన పెరుగుదలను ఆశీర్వాదముగా ఇచ్చి, ఒక విధంగా చెప్పాలంటే, వారిని ‘శృంగారించడమే’ రుజువుగా ఉంది.

18, 19. (ఎ) యెహోవా తన సంస్థలోకి వస్తున్న క్రొత్తవారికి సంబంధించి ఏమని వాగ్దానం చేస్తున్నాడు? (బి) యెషయా 60వ అధ్యాయంలోని మిగతా వచనాలు మనకు ఏమి చెబుతున్నాయి?

18 ప్రతి సంవత్సరం లక్షలాదిమంది అదనపు “అన్యులు” యెహోవా సంస్థతో సహవసించడం ప్రారంభిస్తున్నారు, మరి ఈ మార్గం మరింకా అనేకులు రావడానికి తెరిచేవుంటుంది. యెహోవా సీయోనుతో ఇలా అంటున్నాడు: “నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.” (యెషయా 60:​11) కొందరు వ్యతిరేకులు ఆ “ద్వారముల”ను మూయడానికి ప్రయత్నిస్తారు, కానీ వారు విజయం సాధించలేరని మనకు తెలుసు. ఏది ఏమైనా ద్వారములు తెరిచే ఉంటాయని యెహోవాయే చెప్పాడు. పెరుగుదల కూడా కొనసాగుతుంది.

19 యెహోవా తన ప్రజలను ఇంకా ఇతర మార్గాల్లో కూడా ఆశీర్వదించాడు, ఈ అంత్యదినాల్లో వారిని శృంగారించాడు. యెషయా 60వ అధ్యాయంలోని మిగతా వచనాలు ఆ మార్గాలేమిటో ప్రవచనార్థకంగా వెల్లడిచేస్తున్నాయి.

మీరు వివరించగలరా?

• దేవుని “స్త్రీ” ఎవరు, ఆమెకు భూమ్మీద ఎవరు ప్రతినిధులుగా ఉన్నారు?

• సీయోను పిల్లలు నేలపై ముడుచుకుని ఎప్పుడు పడుకొనివున్నారు, వారు ఎప్పుడు ఎలా ‘లేచారు’?

• వేర్వేరు సూచనలను ఉపయోగిస్తూ యెహోవా, రాజ్య ప్రచారకుల నేటి పెరుగుదలను గురించి ఎలా ప్రవచించాడు?

• యెహోవా ఏయే మార్గాల్లో తన ప్రజలపై తన వెలుగు ప్రసరించేలా చేశాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రం]

“స్త్రీ”ని లెమ్మని యెహోవా ఆజ్ఞాపించాడు

[12వ పేజీలోని చిత్రం]

నౌకాదళం పశ్చిమాన గువ్వల్లా కనిపిస్తున్నాయి