కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మహిమ ఆయన ప్రజలపై ప్రకాశిస్తుంది

యెహోవా మహిమ ఆయన ప్రజలపై ప్రకాశిస్తుంది

యెహోవా మహిమ ఆయన ప్రజలపై ప్రకాశిస్తుంది

“యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును.”​యెషయా 60:⁠20.

1. యెహోవా విశ్వసనీయులుగా ఉన్న తన ప్రజలను ఎలా ఆశీర్వదిస్తాడు?

“యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును.” (కీర్తన 149:⁠4) అలాని ప్రాచీనకాలపు కీర్తనకర్త అన్నాడు, మరి ఆ మాటల్లోని సత్యాన్ని చరిత్ర రుజువుచేసింది. యెహోవా ప్రజలు ఆయనకు విశ్వసనీయులై ఉన్నప్పుడు ఆయన వారిపట్ల శ్రద్ధవహిస్తాడు, వారిని ఫలభరితం చేస్తాడు, వారిని కాపాడతాడు. ప్రాచీన కాలాల్లో ఆయన వారికి వారి శత్రువులపై విజయాన్ని ప్రసాదించాడు. నేడు, ఆయన వారిని ఆధ్యాత్మికంగా బలంగా ఉంచుతూ యేసు బలి ఆధారంగా రక్షణను హామీగా ఇస్తున్నాడు. (రోమీయులు 5:⁠9) వారు ఆయన దృష్టిలో అందమైనవారు గనుకనే ఆయనిలా చేస్తున్నాడు.

2. దేవుని ప్రజలకు వ్యతిరేకత ఎదురైనా వారు దేని విషయమై నిశ్చయతతో ఉండగలరు?

2 నిజమే, అంధకారంలో మగ్గిపోతున్న ఈ లోకంలో ‘సద్భక్తితో బ్రదికే’ వారికి వ్యతిరేకత ఎదురవుతుందనడంలో సందేహం లేదు. (2 తిమోతి 3:​12) అయితే, యెహోవా వ్యతిరేకులను గమనిస్తున్నాడు, ఆయన వారిని ఇలా హెచ్చరిస్తున్నాడు: “నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు; అట్టి జనములు నిర్మూలము చేయబడును.” (యెషయా 60:​12) నేడు, వ్యతిరేకత అనేక రూపాల్లో ప్రదర్శితమవుతోంది. కొన్ని దేశాల్లో, యథార్థ క్రైస్తవులు యెహోవాకు చెల్లించే ఆరాధనను పరిమితం చేయడానికి లేదా పూర్తిగా నిషేధించడానికి వ్యతిరేకులు ప్రయత్నిస్తారు. మరితర దేశాల్లో, మతఛాందసవాదులు యెహోవా ఆరాధకులపై దాడిచేస్తూ వారి ఆస్తులను కాల్చివేస్తారు. అయితే గుర్తుంచుకోండి, తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలాంటి వ్యతిరేకత ఎదురైనా దాని పర్యవసానం ఏమై ఉంటుంది అనేది యెహోవా ఇప్పటికే నిర్ణయించేశాడు. వ్యతిరేకులు విఫలులవుతారు. భూమ్మీద తన పిల్లలను తనకు ప్రతినిధులుగా కలిగివున్న సీయోనుకు విరుద్ధంగా పోరాడేవారు విజయం సాధించలేరు. ఇది, మన గొప్ప దేవుడైన యెహోవా నుండి వచ్చిన హృదయరంజకమైన హామీ కాదా?

ఆశలకు మించిన ఆశీర్వాదాలు

3. యెహోవా ఆరాధకుల అందానికీ, వారి ఫలసమృద్ధికీ ఏవి సూచనగా ఉన్నాయి?

3 వాస్తవమేమిటంటే, ఈ విధానపు అంత్యదినాల్లో యెహోవా తన ప్రజలను వారి ఆశలకు మించి ఆశీర్వదించాడు. ప్రత్యేకంగా ఆయన క్రమేణా తన ఆరాధనా స్థలాన్నీ, అలాగే అందులో తన నామాన్ని ధరించిన వారినీ శృంగారించాడు. యెషయా ప్రవచనం ప్రకారం, ఆయన సీయోనుతో ఇలా అంటున్నాడు: “నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను.” (యెషయా 60:​13) పచ్చని చెట్లతో నిండిన అడవులను అచ్ఛాదనంగా కప్పుకుని ఉన్న పర్వతాలు నిజంగా మనోహరంగా కనబడతాయి. కాబట్టి, పచ్చని వృక్షాలు యెహోవా ఆరాధకుల అందానికీ, వారి ఫలసమృద్ధికీ తగిన సూచనలుగా ఉన్నాయి.​—⁠యెషయా 41:​20; 55:⁠13.

4. ‘పరిశుద్ధాలయము’ మరియు ‘యెహోవా పాదస్థలము’ అంటే ఏమిటి, అవి ఎలా శృంగారించబడ్డాయి?

4యెషయా 60:13 లో పేర్కొనబడిన ‘పరిశుద్ధాలయము’ మరియు ‘యెహోవా పాదస్థలము’ అనే మాటలు వేటిని సూచిస్తున్నాయి? మన ఆరాధనలో యేసుక్రీస్తు ద్వారా యెహోవాను సమీపించడానికి చేయబడిన ఏర్పాటు యెహోవా యొక్క గొప్ప ఆధ్యాత్మిక దేవాలయం. ఆ దేవాలయపు ఆవరణలను ఆ మాటలు సూచిస్తున్నాయి. (హెబ్రీయులు 8:​1-5; 9:​2-10, 23) ఆరాధన నిమిత్తం అన్ని జనాంగముల నుండి ప్రజలను ఆ ఆధ్యాత్మిక ఆలయంలోకి తీసుకు రావడం ద్వారా దానిని మహిమపరచాలన్న తన సంకల్పాన్ని యెహోవా పేర్కొన్నాడు. (హగ్గయి 2:⁠7) యెహోవా యొక్క ఉన్నతపరచబడిన ఆరాధనా పర్వతం వద్దకు ప్రవాహంలా అన్ని జనాంగముల నుండి వస్తున్న జనసమూహాలను యెషయా ఇంతకు ముందు స్వయంగా చూశాడు. (యెషయా 2:​1-4) వందలాది సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో, ‘ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చిన . . . యొక గొప్పసమూహమును’ చూశాడు. “వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు.” (ప్రకటన 7:​9, 15) ఈ ప్రవచనాలు మన కాలంలో నెరవేరుతుండగా యెహోవా మందిరము మన కట్టెదుటే శృంగారించబడింది.

5. సీయోను పిల్లలు ఎలాంటి మంచి మార్పులను అనుభవించారు?

5 ఇదంతా సీయోను విషయంలో ఎంత మంచి మార్పులను తీసుకువచ్చిందో కదా! యెహోవా ఇలా అంటున్నాడు: “నీవు విసర్జింపబడుటనుబట్టియు ద్వేషింపబడుటనుబట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను.” (యెషయా 60:​15) మొదటి ప్రపంచ యుద్ధం ముగింపుకు వస్తుండగా “దేవుని ఇశ్రాయేలు” నిజంగానే కొంతకాలంపాటు విడిచిపెట్టబడింది. (గలతీయులు 6:​16) భూమ్మీద ఆమె పిల్లలు తమ విషయంలో దేవుని చిత్తమేమిటో స్పష్టంగా గ్రహించలేదు కాబట్టి ఆమె నిజంగానే తను ‘విసర్జించబడినట్లు’ భావించింది. అప్పుడు, 1919వ సంవత్సరంలో, యెహోవా తన అభిషిక్త సేవకులను పునరుజ్జీవులను చేశాడు, ఇక అప్పటినుండి ఆయన వారిని అద్భుతమైన ఆధ్యాత్మిక సమృద్ధితో ఆశీర్వదించాడు. అంతేకాదు, ఈ వచనంలోని వాగ్దానం మనకు ఉత్తేజభరితంగా లేదూ? యెహోవా సీయోనును “శోభాతిశయముగా” దృష్టిస్తాడు. అవును, సీయోను పిల్లలూ, అలాగే యెహోవా కూడా సీయోను విషయంలో అతిశయిస్తారు. ఆమె “సంతోషకారణముగా” ఉంటుంది, హద్దుల్లేని ఆనందానికి కారణమవుతుంది. అయితే ఇది కేవలం కొంతకాలంపాటు ఉండేది కాదు. భూమ్మీద తన పిల్లలను తనకు ప్రతినిధులుగా కలిగివున్న సీయోను యొక్క అనుగ్రహ స్థితి “బహు తరములకు” కొనసాగుతుంది. అది ఎన్నడూ అంతం కాదు.

6. జనాంగములకు చెందిన వనరులను నిజ క్రైస్తవులు ఎలా ఉపయోగించుకుంటున్నారు?

6 ఇప్పుడు మరో దైవిక వాగ్దానం గురించి వినండి. సీయోనుతో మాట్లాడుతూ యెహోవా ఇలా సెలవిస్తున్నాడు: “యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.” (యెషయా 60:​16) సీయోను ఎలా “జనముల పాలు కుడిచి,” “రాజుల చంటి పాలు” త్రాగుతుంది? ఎలాగంటే, అభిషిక్త క్రైస్తవులు, వారి “వేరే గొఱ్ఱెల” సహవాసులు స్వచ్ఛారాధనను అభివృద్ధి చేయడానికి జనములకు చెందిన విలువైన వనరులను ఉపయోగిస్తారు. (యోహాను 10:​16) స్వచ్ఛందంగా ఇవ్వబడిన విరాళాల మూలంగా భారీ ఎత్తున అంతర్జాతీయ ప్రకటనా బోధనా పనిని కొనసాగించడం వీలవుతుంది. ఆధునిక సాంకేతికతను జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవడం వందలాది భాషల్లో బైబిళ్ళను, బైబిలు సాహిత్యాలను ప్రచురించడాన్ని సాధ్యం చేస్తుంది. నేడు చరిత్రలో ఇంతకు మునుపెన్నడూ కనీవినీ ఎరుగనంత ఎక్కువ మంది ప్రజలకు బైబిలు సత్యము అందుబాటులో ఉంది. తన అభిషిక్త సేవకులను ఆధ్యాత్మిక చెరలోనుండి విమోచించిన యెహోవాయే నిజంగా రక్షకుడని అనేకానేక దేశాల్లోని పౌరులు నేర్చుకుంటున్నారు.

సంస్థాగత పురోభివృద్ధి

7. సీయోను పిల్లలు ఎలాంటి అద్భుతమైన పురోభివృద్ధిని అనుభవించారు?

7 యెహోవా తన ప్రజలను మరో రీతిలో కూడా శృంగారించాడు. ఆయన వారిని సంస్థాగత పురోభివృద్ధితో ఆశీర్వదించాడు. యెషయా 60:17 లో మనం ఇలా చదువుతాము: “నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.” ఇత్తడికి ప్రతిగా బంగారాన్ని తీసుకురావడమనేది మెరుగైనదే, అలాగే ఇక్కడ పేర్కొన్న ఇతర పదార్థాల విషయంలో కూడా అదే విధంగా చెప్పవచ్చు. దీనికి అనుగుణంగా, దేవుని ఇశ్రాయేలు అంత్యదినాలంతట్లో సంస్థాగతంగా నిరంతరమైన మెరుగులను సంతరించుకుంది. కొన్ని ఉదాహరణలు గమనించండి.

8-10. దేవుని ప్రజల మధ్య 1919 నుండి జరిగిన కొన్ని సంస్థాగతమైన పురోభివృద్ధులను పేర్కొనండి.

8 దేవుని ప్రజల సంఘాల్లో 1919కి ముందు, పెద్దలు మరియు డీకన్లు కార్యనిర్వహణను చూసుకునేవారు, వీరందరినీ సంఘ సభ్యులు ప్రజాస్వామ్య విధానంలో ఎన్నుకునేవారు. ఆ సంవత్సరం మొదలుకొని ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు,’ ప్రతి సంఘంలోను క్షేత్ర సేవా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక సేవా నిర్దేశకుణ్ణి నియమించడం ప్రారంభించాడు. (మత్తయి 24:​45-47) అయితే, అనేక సంఘాల్లో ఆ ఏర్పాటు అంత బాగా పనిచేయలేదు, ఎందుకంటే ఎన్నిక చేయబడిన పెద్దలు కొందరు సువార్త ప్రకటనా పనికి పూర్తిగా మద్దతునివ్వలేదు. దాంతో, 1932 లో పెద్దలను, డీకన్లను ఎన్నుకోవడం ఆపేయాలని సంఘాలను నిర్దేశించడం జరిగింది. బదులుగా, వారు సేవా నిర్దేశకుడితోపాటు సేవా కమిటీలో పనిచేసే పురుషులను ఎన్నుకోవలసి ఉంది. అది “కఱ్ఱకు” ప్రతిగా “ఇత్తడి” వచ్చినట్లుగా ఉంది​—⁠చాలా పెద్ద అభివృద్ధే!

9 ప్రపంచవ్యాప్తంగా సంఘాలన్నీ మరింత మెరుగైన ఏర్పాటును స్వీకరించాలని 1938 లో తీర్మానం చేసుకున్నాయి, ఇది లేఖనాధారిత పూర్వ మాదిరికి మరింత అనుగుణంగా ఉంది. సంఘ కార్యనిర్వహణ ఒక కంపెనీ (సంఘ) సేవకుడికీ మరితర సేవకులకూ అప్పగించబడింది, వీరందరూ నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుని పైవిచారణ క్రిందే నియమించబడేవారు. ఇకపై ఎలక్షన్లకు స్వస్తి! ఆ విధంగా సంఘ నియామకాలు దైవపరిపాలనా విధానంలో చేయబడ్డాయి. అది “రాళ్లకు ప్రతిగా ఇనుము” లేదా “ఇత్తడికి ప్రతిగా బంగారము” వచ్చినట్లయ్యింది.

10 అప్పటి నుండి అభివృద్ధి కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు 1972 లో, ఏ ఒక్క పెద్దా మిగతా పెద్దలపై అధికారాన్ని కలిగివుండకుండా, దైవపరిపాలనా విధానంలో నియమించబడి, ఒకరికొకరు సహకరించుకునే ఒక పెద్దల సభ, సంఘాన్ని పైవిచారణ చేయడం అనే విధానం, తొలి శతాబ్దపు క్రైస్తవ సంఘాల్లో కార్యనిర్వహణ ఎలా జరిగేదో దానికి మరింత దగ్గరగా ఉన్నట్లు కనుగొనబడింది. ఇంకా చూస్తే, ఇటీవల రెండు సంవత్సరాల క్రితం మరో ముందడుగు వేయడం జరిగింది. కొన్ని చట్టపరమైన కార్పొరేషన్ల డైరెక్టర్ల విషయంలో ఒక మార్పు జరిగింది, తద్వారా పరిపాలక సభకు చట్టపరమైన దైనందిన కార్యకలాపాల మూలంగా అవధాన భంగం కలగడానికి బదులుగా దేవుని ప్రజల ఆధ్యాత్మిక ఆసక్తులపై వారు పూర్తి ఏకాగ్రతను ఉంచడం సాధ్యమైంది.

11. యెహోవా ప్రజల మధ్య సంస్థాగతమైన మార్పులకు ఎవరు బాధ్యులు, ఆ మార్పుల మూలంగా ఏర్పడిన ఫలితాలేమిటి?

11 పురోభివృద్ధికరమైన ఈ మార్పుల వెనుక ఎవరున్నారు? ఎవరో కాదు, యెహోవా దేవుడే. “నేను . . . బంగారమును తెచ్చుచున్నాను” అని అంటున్నది ఆయనే. “సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను” అని కూడా అంటున్నది ఆయనే. అవును, తన ప్రజలపై పైవిచారణ చేసే బాధ్యత ఉన్నది యెహోవాకే. ప్రవచించబడిన సంస్థాగతమైన పురోభివృద్ధులు అనేవి ఆయన తన ప్రజలను శృంగారించే పనిలో ఒక భాగం. తత్ఫలితంగా యెహోవాసాక్షులు అనేక విధాల్లో ఆశీర్వదించబడ్డారు. యెషయా 60:18 లో మనమిలా చదువుతాము: “ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.” ఈ మాటలు ఎంత శ్రవణానందకరంగా ఉన్నాయో కదా! కానీ అవి ఎలా నెరవేరాయి?

12. నిజ క్రైస్తవుల మధ్య సమాధానం ఏలడం ఎలా ప్రారంభమైంది?

12 నిజ క్రైస్తవులు నిర్దేశం కోసం నడిపింపు కోసం సూటిగా యెహోవావైపు చూస్తారు, దాని ఫలితం యెషయాచే ప్రవచించబడింది: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.” (యెషయా 54:​13) అంతేగాక, యెహోవా ఆత్మ తన ప్రజలపై పనిచేస్తుంది, మరి ఆ ఆత్మ ఫలములో ఒకటి సమాధానము. (గలతీయులు 5:​22-24) ఫలితంగా, యెహోవా ప్రజల్లో ఉన్న సమాధానమనే లక్షణం వారిని ఈ హింసాయుత లోకంలో సేదదీర్పునిచ్చే ఒయాసిస్సుగా చేస్తుంది. నిజ క్రైస్తవుల్లో ఒకరిపట్ల ఒకరికి ఉండేలాంటి ప్రేమపై ఆధారపడిన వారి సమాధానకరమైన స్థితి నూతన లోకంలోని జీవితాన్ని ఇప్పుడే రుచిచూపిస్తున్నట్లుగా ఉంది. (యోహాను 15:​17; కొలొస్సయులు 3:​14) ఆ సమాధానకర స్థితిని అనుభవించడంలోను, దానికి దోహదపడడంలోను మనలో ప్రతి ఒక్కరం ఎంతో పులకరింతను అనుభవిస్తున్నామనడంలో సందేహం లేదు. ఆ సమాధాన స్థితి మన దేవునికి స్తుతిని ఘనతను తీసుకువస్తుంది, అంతేకాదు అది మన ఆధ్యాత్మిక పరదైసులో ఒక విశిష్ట భాగం కూడాను.​—⁠యెషయా 11:⁠9.

యెహోవా వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది

13. యెహోవా వెలుగు తన ప్రజలపై ప్రకాశించడం మానదని మనం ఎందుకు నిశ్చయతను కలిగివుండగలము?

13 యెహోవా వెలుగు ఆయన ప్రజలపై ప్రకాశిస్తూనే ఉంటుందా? తప్పకుండా! యెషయా 60:​19, 20 లో మనం ఇలా చదువుతాము: “ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు; యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును.” ఆధ్యాత్మిక భావంలో చెరలో ఉన్నవారి “దుఃఖదినములు” 1919 లో ముగిసినప్పుడు యెహోవా వెలుగు వారిపై ప్రకాశించడం ప్రారంభమైంది. 80కి పైగా సంవత్సరాల తర్వాత యెహోవా వెలుగు ప్రకాశిస్తూ ఉండగా వారు ఇప్పటికీ ఆయన అనుగ్రహాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఆ అనుగ్రహం ఎన్నడూ అంతం కాదు. తన ఆరాధకుల విషయంలో మన దేవుడు సూర్యుడిలా “అస్తమింపడు,” లేదా చంద్రుడిలా “క్షీణింపడు.” బదులుగా, ఆయన వారిపై నిత్య భవిష్యత్తంతా వెలుగును ప్రకాశింపజేస్తూనే ఉంటాడు. ఈ అంధకార బంధురమైన లోకపు అంత్యదినములలో జీవిస్తున్న మనకు అది ఎంతటి అద్భుతమైన హామీనిస్తుందో కదా!

14, 15. (ఎ) దేవుని ప్రజలందరూ ఎలా “నీతిమంతులని” తీర్చబడ్డారు? (బి) యెషయా 60:⁠21 సంబంధంగా, వేరే గొఱ్ఱెలు ఏ ప్రాముఖ్యమైన నెరవేర్పు కోసం ఎదురుచూస్తున్నారు?

14 వినండి, ఇప్పుడు యెహోవా సీయోను యొక్క భూ ప్రతినిధియైన దేవుని ఇశ్రాయేలుకు సంబంధించి మరో వాగ్దానాన్ని చేస్తున్నాడు. యెషయా 60:⁠21 ఇలా అంటోంది: “నీ జనులందరు నీతిమంతులై యుందురు; నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.” 1919 లో అభిషిక్త క్రైస్తవులు క్రియాశీలతకు పునరుద్ధరించబడినప్పుడు వారు ఎంతో అసాధారణమైన ప్రజలుగా ఉన్నారు. పూర్తిగా పాపంలో కూరుకుపోయిన లోకంలో, క్రీస్తుయేసు అర్పించిన విమోచన క్రయధన బలిపై వారు కలిగివున్న అచంచలమైన విశ్వాసం ఆధారంగా “నీతిమంతులని తీర్చ”బడ్డారు. (రోమీయులు 3:​24; 5:⁠1) ఆ తర్వాత, బబులోను చెరలో నుండి విడుదల చేయబడిన ఇశ్రాయేలీయుల్లా వారు ఒక “దేశాన్ని,” ఒక ఆధ్యాత్మిక దేశాన్ని లేదా కార్యకలాపాల పరిధిని స్వాధీనం చేసుకున్నారు, అందులో వారు ఒక ఆధ్యాత్మిక పరదైసును అనుభవిస్తారు. (యెషయా 66:​8, NW) ఒక పరదైసులో ఉండేటటువంటి సౌందర్యం ఆ దేశంలో నుండి ఎన్నడూ తొలగిపోదు, ఒక జనాంగముగా చూస్తే దేవుని ఇశ్రాయేలు ప్రాచీన ఇశ్రాయేలీయుల్లా విశ్వాసఘాతుకంగా తయారుకాదు. వారి విశ్వాసము, వారి సహనము, వారి ఆసక్తి ఎన్నడూ దేవుని నామానికి ఘనతను తీసుకురాకుండా ఉండవు.

15 ఆ ఆధ్యాత్మిక జనాంగములోని సభ్యులందరూ క్రొత్త నిబంధనలోకి ప్రవేశించారు. యెహోవా ధర్మవిధి వారందరి హృదయాలపై వ్రాయబడింది, యేసు అందించిన విమోచన క్రయధన బలి ఆధారంగా యెహోవా వారి పాపాలను క్షమించాడు. (యిర్మీయా 31:​31-34) ఆయన వారిని ‘పుత్రులుగా’ నీతిమంతులని తీర్పుతీరుస్తాడు, వారు పరిపూర్ణులన్నట్లే ఆయన వారితో వ్యవహరిస్తాడు. (రోమీయులు 8:​15, 16, 29, 30) వారి సహవాసులైన వేరే గొఱ్ఱెల పాపాలు కూడా యేసు బలి ఆధారంగా క్షమించబడ్డాయి, విశ్వాసము ద్వారా వారు అబ్రాహాము విషయంలోలానే దేవుని స్నేహితులుగా నీతిమంతులని తీర్పుతీర్చబడ్డారు. వారు “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.” వేరే గొఱ్ఱెలైన ఈ సహవాసులు మరో అత్యద్భుతమైన ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నారు. “మహాశ్రమల” నుండి సజీవులుగా బయటికి వచ్చిన తర్వాత లేదా పునరుత్థానులైన తర్వాత, వారు భూమంతా ఒక పరదైసుగా మారినప్పుడు యెషయా 60:21 లోని మాటల అక్షరార్థ నెరవేర్పును చూస్తారు. (ప్రకటన 7:​14; రోమీయులు 4:​1-3) అప్పుడు “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు.”​—⁠కీర్తన 37:​11, 29.

పెరుగుదల కొనసాగుతోంది

16. యెహోవా ఎలాంటి అద్భుతమైన వాగ్దానాన్ని చేశాడు, అదెలా నెరవేరింది?

16యెషయా 60 లోని చివరి వచనంలో మనం ఈ అధ్యాయపు చివరి వాగ్దానాన్ని యెహోవా ఇవ్వడం గురించి చదువుతాము. ఆయన సీయోనుతో ఇలా అంటున్నాడు: “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును, ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” (యెషయా 60:​22) మన కాలంలో యెహోవా తన మాటను నిలబెట్టుకున్నాడు. అభిషిక్త క్రైస్తవులు 1919 లో కార్యశీలతకు పునరుద్ధరించబడినప్పుడు వారు సంఖ్యాపరంగా చాలా కొద్దిమందే ఉన్నారు​—⁠నిజంగానే “ఒంటరియైనవాడు” అని చెప్పవచ్చు. అదనపు ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు తీసుకురాబడుతుండగా వారి సంఖ్య పెరిగింది. ఆ తర్వాత, వేరే గొఱ్ఱెలు పెద్ద సంఖ్యలో వారి దగ్గరికి సమకూడడం ప్రారంభించారు. దేవుని ప్రజల సమాధానకర స్థితి, వారి ‘దేశము’లో ఉన్న ఆధ్యాత్మిక పరదైసు ఎంతమంది యథార్థహృదయులను ఆకర్షించిందంటే “ఎన్నికలేనివాడు” నిజంగానే “బలమైన జన”మయ్యాడు. ప్రస్తుతం, దేవుని ఇశ్రాయేలు మరియు అరవై లక్షలకు పైగా ఉన్న సమర్పిత “అన్యులు” కలిసివున్న ఈ ‘జనము’ ప్రపంచంలోని ఎన్నో స్వతంత్ర దేశాలకంటే ఎక్కువ జనాభాతో ఉంది. (యెషయా 60:​10) దాని పౌరులందరూ యెహోవా వెలుగును ప్రతిబింబించడంలో పాల్గొంటున్నారు, అదే వారిని ఆయన దృష్టిలో అందమైనవారిగా చేసేది.

17. యెషయా 60వ అధ్యాయాన్ని గురించిన ఈ చర్చ మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది?

17 నిజంగా, యెషయా 60వ అధ్యాయంలోని ముఖ్యాంశాలను పరిశీలించడం విశ్వాసాన్ని ఎంతో బలపరిచేదిగా ఉంది. తన ప్రజలు ఆధ్యాత్మిక చెరలోకి వెళతారనీ తిరిగి పునరుద్ధరించబడతారనీ యెహోవాకు ఎంతో ముందుగానే తెలుసని గ్రహించడం ఎంతో ఓదార్పుకరంగా ఉంది. మన కాలంలో సత్యారాధకుల సంఖ్యలో గొప్ప పెరుగుదల ఉంటుందని యెహోవా అంత ముందుగానే తెలుసుకున్నాడన్న విషయం మనకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేగాక, యెహోవా మనల్ని ఎన్నడూ విడనాడడని గుర్తుంచుకోవడం మనకెంత ఓదార్పునిస్తుంది! “నిత్యజీవం పట్ల సరైన మనోవైఖరి” గలవారిని ఆప్యాయంగా ఆహ్వానించడానికి ఈ “పట్టణ” పురద్వారాలు ఎల్లప్పుడు తెరిచే ఉంటాయన్న హామీ ఎంత ప్రేమపూర్వకంగా ఉంది! (అపొస్తలుల కార్యములు 13:​48, NW) యెహోవా తన ప్రజలపై ప్రకాశిస్తూనే ఉంటాడు. సీయోను పిల్లలు తమ వెలుగును ఇంకా ఇంకా కాంతివంతంగా ప్రకాశింపచేస్తూ ఉండగా సీయోను నిరంతరం శోభాతిశయానికి కారణంగా ఉంటుంది. (మత్తయి 5:​16) మనం దేవుని ఇశ్రాయేలుకు సన్నిహితంగా ఉండాలనీ, యెహోవా వెలుగును ప్రతిబింబించే మన ఆధిక్యతను అమూల్యమైనదిగా ఎంచాలనీ మునుపటికన్నా ఎక్కువ కృత నిశ్చయంతో ఉన్నామనడంలో సందేహం లేదు.

మీరు వివరించగలరా?

• వ్యతిరేకత విషయంలో మనం ఏ విషయాన్ని గురించి నిశ్చయత కలిగి ఉన్నాము?

• సీయోను పిల్లలు ఎలా ‘జనముల పాలు కుడిచారు’?

• యెహోవా ఏ యే మార్గాల్లో “కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని” తీసుకువచ్చాడు?

యెషయా 60:​17, 21 లో ఏ రెండు లక్షణాలు ఉన్నతపరచబడ్డాయి?

• “ఎన్నికలేనివాడు” ఎలా ఒక “బలమైన జన”మయ్యాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[18వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

యెషయా ప్రవచనం సర్వమానవాళికి వెలుగు

ఈ ఆర్టికల్స్‌లోని సమాచార సారాంశం 2001/02 లో జరిగిన “దేవుని వాక్యాన్ని బోధించేవారు” జిల్లా సమావేశాల్లోని ఒక ప్రసంగంలో సమర్పించబడింది. ఆ సమావేశాలు జరిగిన అత్యధిక ప్రాంతాల్లో ప్రసంగీకులు తమ ప్రసంగం చివర్లో యెషయా ప్రవచనం​—⁠సర్వమానవాళికి వెలుగు, సంపుటి రెండు అనే ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. అంతకు ముందటి సంవత్సరం, యెషయా ప్రవచనం​—⁠సర్వమానవాళికి వెలుగు, సంపుటి ఒకటి విడుదల చేయబడింది. ఈ క్రొత్త ప్రచురణ విడుదలతో ఇప్పుడు యెషయా పుస్తకంలోని దాదాపు ప్రతి వచనంపై తాజా వ్యాఖ్యానం అందుబాటులోకి వచ్చింది. విశ్వాసాన్ని బలపరిచే ప్రవచనాత్మక పుస్తకమైన యెషయాను లోతుగా అర్థం చేసుకోవడంలోను దానిపట్ల మెప్పుదలను పెంపొందించుకోవడంలోను ఈ సంపుటులు ఎంతో చక్కని సహాయకాలుగా నిరూపించబడుతున్నాయి.

[15వ పేజీలోని చిత్రాలు]

హింసాత్మకమైన వ్యతిరేకత ఉన్నా, ‘యెహోవా తన ప్రజలను రక్షణతో అలంకరిస్తాడు’

[16వ పేజీలోని చిత్రాలు]

దేవుని ప్రజలు స్వచ్ఛారాధనను పెంపొందించడానికి జనాంగముల నుండి విలువైన వనరులను ఉపయోగిస్తారు

[17వ పేజీలోని చిత్రం]

యెహోవా తన ప్రజలను సంస్థాగతమైన పురోభివృద్ధులతోను సమాధానముతోను ఆశీర్వదించాడు