కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మార్గాల్లో నడవడం సమృద్ధికరమైన ప్రతిఫలాలనిస్తుంది

యెహోవా మార్గాల్లో నడవడం సమృద్ధికరమైన ప్రతిఫలాలనిస్తుంది

యెహోవా మార్గాల్లో నడవడం సమృద్ధికరమైన ప్రతిఫలాలనిస్తుంది

మీరెప్పుడైనా పర్వతాల మీదికి ఎక్కారా? ఎక్కినట్లైతే మీరు లోకానికి పైన ఉన్నట్లు మీకు అనిపించి ఉండవచ్చు. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం, సుదూరాల వరకూ చూడడం ప్రకృతి అందాన్ని ఆస్వాదించడం ఎంత ఆహ్లాదకరమో కదా! బహుశా అప్పుడు లౌకిక చింతలన్నీ అంత ప్రాముఖ్యమైనవిగా అనిపించకపోవచ్చు.

చాలామంది అలాంటి వినోదయాత్రలు తక్కువగా చేస్తారు, చాలా అరుదుగా చేస్తారు, కానీ మీరు సమర్పిత క్రైస్తవులైతే, ఆధ్యాత్మిక భావంలో మీరు కొంత కాలంగా ఉన్నతమైన పర్వతాల మీద నడుస్తుండవచ్చు. “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము” అని ప్రాచీన కీర్తనకర్త ప్రార్థించినట్లే మీరు కూడా ప్రార్థించారనడంలో సందేహం లేదు. (కీర్తన 25:⁠4) మీరు యెహోవా మందిరపర్వతం మీదికి మొట్టమొదటిసారి ఎక్కినప్పుడు, ఉన్నతస్థలాల్లో నడవడం ప్రారంభించినప్పుడు ఎలాంటి అనుభూతిని పొందారో మీకు గుర్తుందా? (మీకా 4:⁠2; హబక్కూకు 3:​19) నిస్సందేహంగా, స్వచ్ఛారాధన యొక్క ఉన్నత మార్గాల్లో నడవడం మీకు రక్షణనూ ఆనందాన్నీ ఇచ్చిందని మీరు త్వరలోనే గ్రహించారు. కీర్తనకర్త, “శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు” అని అన్నప్పుడు ఆయన పొందిన భావానుభూతులను మీరు అనుభవించడం ప్రారంభించారు.​—⁠కీర్తన 89:​15.

అయినప్పటికీ, పర్వతారోహణం చేసేవారు కొన్నిసార్లు పర్వత ప్రాంతాల్లో పొడవుగా నిటారుగా ఉండే ఏటవాలు ప్రాంతాలతో తంటాలుపడాల్సి వస్తుంది. వాళ్ళ కాళ్ళు నొప్పి పుట్టడం మొదలవుతుంది, వాళ్ళు నీరసపడిపోతారు. మనం కూడా దేవుని సేవలో కష్టాలను అనుభవించవచ్చు. ఇటీవలే మన అడుగుల్లో శక్తి కాస్త సన్నగిల్లిపోయుండవచ్చు. మనం మన శక్తినీ ఆనందాన్నీ తిరిగి ఎలా పొందగలం? మొదటి అడుగు ఏమిటంటే యెహోవా మార్గాల ఔన్నత్యాన్ని గుర్తించడమే.

యెహోవా ఉన్నతమైన నియమాలు

యెహోవా మార్గములు ‘మానవుల మార్గములకంటె ఎత్తుగా’ ఉన్నాయి, ఆయన ఆరాధన ‘పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడి’ ఉంది. (యెషయా 55:⁠9; మీకా 4:⁠1) యెహోవా జ్ఞానము “పైనుండివచ్చు జ్ఞానము.” (యాకోబు 3:​17) ఆయన నియమాలు ఇతర నియమాలన్నిటికంటే ఉన్నతమైనవి. ఉదాహరణకు, కనానీయులు పిల్లలను బలిగా ఇచ్చే క్రూరమైన ఆచారాలను పాటిస్తున్న కాలంలో యెహోవా ఇశ్రాయేలీయులకు నియమాలను ఇచ్చాడు. అవి నైతికంగా ఉన్నతమైనవీ సానుభూతిపూర్వకమైనవిగా ప్రఖ్యాతిగాంచినవీ. ఆయన వారితో ఇలా అన్నాడు: “బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; . . . మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను.”​—⁠లేవీయకాండము 19:​15, 34.

పదిహేను శతాబ్దాల తర్వాత యేసు, యెహోవా ‘ఘనమైన ఉపదేశాలకు’ మరిన్ని ఉదాహరణలను ఇచ్చాడు. (యెషయా 42:​21) కొండమీది ప్రసంగంలో, ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు: “మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి.” (మత్తయి 5:​44) ఆయన ఇంకా ఇలా అన్నాడు: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది.”​—⁠మత్తయి 7:​12.

ప్రతిస్పందించే ప్రజల హృదయాలపై ఉన్నతమైన ఈ నియమాల ప్రభావం ఉంది, తాము ఆరాధించే దేవుణ్ణి పోలి నడుచుకోవాలని ఆ నియమాలు వారిని ప్రేరేపిస్తున్నాయి. (ఎఫెసీయులు 5:⁠1; 1 థెస్సలొనీకయులు 2:​13) పౌలులో వచ్చిన మార్పు గురించి ఆలోచించండి. బైబిలు ఆయన గురించి మొదటిసారి ప్రస్తావించినప్పుడు, ఆయన స్తెఫను “చావునకు సమ్మతించెను,” “సంఘమును పాడుచేయుచుండెను” అని చెబుతోంది. అటు తర్వాత కేవలం కొన్ని సంవత్సరాలకే ఆయన థెస్సలొనీకలోని క్రైస్తవులతో, “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా” సౌమ్యంగా ప్రవర్తించాడు. దేవుని బోధ, ఒకప్పుడు హింసకుడిగా ఉన్న పౌలును శ్రద్ధ చూపించే క్రైస్తవుడిగా మార్చేసింది. (అపొస్తలుల కార్యములు 7:​60; 8:​3; 1 థెస్సలొనీకయులు 2:⁠7) క్రీస్తు బోధ తన వ్యక్తిత్వాన్ని మలచినందుకు ఆయన కృతజ్ఞుడై ఉన్నాడనడంలో సందేహం లేదు. (1 తిమోతి 1:​12, 13) అలాంటి కృతజ్ఞత, మనం దేవుని ఉన్నతమైన మార్గాల్లో నడుస్తూ ఉండడానికి మనకు ఎలా సహాయపడగలదు?

కృతజ్ఞతతో నడవడం

పర్వతారోహకులు ఎత్తైన పర్వతాల మీది నుండి కనిపించే సుందరమైన దృశ్యాలకు పరవశించిపోతారు. తాము నడిచేదారి ప్రక్కలనున్న చిన్న చిన్న వాటికి అంటే ప్రత్యేకంగా కనిపించే ఒక రాయిని చూసినా అందమైన ఒక పువ్వును చూసినా ఒక అడవి జంతువు క్షణకాలం కనబడినా వాళ్ళు ఆనందించడం నేర్చుకుంటారు. అదేవిధంగా, దేవునితో కలిసి నడవడం వల్ల వచ్చే ప్రతిఫలాలను, అవి పెద్దవైనా చిన్నవైనా సరే వాటిని గుర్తించడానికి మనం ఆధ్యాత్మికంగా అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ అప్రమత్తత మనం నూతన శక్తితో నడిచేలా చేస్తుంది, అలసిపోయిన నడకను చైతన్యవంతమైన నడకగా మారుస్తుంది. దావీదు పలికిన ఈ మాటలతో మనం ఏకీభవిస్తాం: “నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. . . . నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.”​—⁠కీర్తన 143:⁠8.

అనేక సంవత్సరాల నుండి యెహోవా మార్గాలలో నడుస్తున్న మేరీ ఇలా అంది: “నేను యెహోవా సృష్టిని చూసేటప్పుడు, కేవలం అందులోని సంక్లిష్టమైన రూపకల్పనను మాత్రమే కాక దేవుని ప్రేమపూర్వకమైన వ్యక్తిత్వాన్ని కూడా చూస్తాను. అది ఒక జంతువైనా ఒక పక్షైనా ఒక పురుగైనా కానీ ప్రతి ఒక్కటీ పరవశింపజేసే ఒక చిన్న ప్రపంచమే. అదేవిధమైన ఆనందం ఒక్కో సంవత్సరం గడుస్తున్న కొద్దీ మరింత స్పష్టమయ్యే ఆధ్యాత్మిక సత్యాల నుండి కలుగుతుంది.”

మన కృతజ్ఞతను ఎలా అధికం చేసుకోవచ్చు? యెహోవా మన కోసం చేస్తున్న దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఉండడం ద్వారా కొంత మేరకు అధికం చేసుకోవచ్చు. “యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి” అని పౌలు వ్రాశాడు.​—⁠1 థెస్సలొనీకయులు 5:​15-18; కీర్తన 119:​62.

వ్యక్తిగత అధ్యయనం కృతజ్ఞతా స్ఫూర్తిని అలవరచుకోవడానికి సహాయపడుతుంది. కొలస్సయిలోని క్రైస్తవులను పౌలు ఇలా ఉద్బోధించాడు: “క్రీస్తుయేసును స్వీకరించిన విధంగానే ఆయనలో నడుచుకొంటూ ఉండండి. . . . విశ్వాసంలో సుస్థిరం అవుతూ కృతజ్ఞతలతో ఉప్పొంగిపోతూ నడుచుకోండి.” (కొలస్సయి [కొలొస్సయులు] 2:⁠6, 7, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) బైబిలు చదవడం, చదివిన దానిగురించి ధ్యానించడం మన విశ్వాసాన్ని బలపరుస్తాయి, మనల్ని బైబిలు గ్రంథకర్తకు మరింత సన్నిహితుల్ని చేస్తాయి. దానిలోని అన్ని పేజీల్లోనూ మనల్ని ‘కృతజ్ఞతలతో ఉప్పొంగిపోవడానికి’ పురిగొలిపే నిధులున్నాయి.

మన సహోదరులతోపాటు యెహోవా సేవచేయడం కూడా ఆ మార్గాన్ని సులభతరం చేస్తుంది. కీర్తనకర్త తన గురించి తానిలా చెప్పుకున్నాడు: “నీయందు భయభక్తులు గలవారందరికిని . . . నేను చెలికాడను.” (కీర్తన 119:​63) మనం గడిపే అత్యంత సంతోషకరమైన కొన్ని సమయాలు ఏవంటే, మనం సమావేశమయ్యే క్రైస్తవ సమావేశాలు లేదా మన సహోదరుల సహవాసంలో గడిపే ఇతర సందర్భాలు. మన అమూల్యమైన ప్రపంచవ్యాప్త క్రైస్తవ కుటుంబం, యెహోవా వల్ల ఆయన ఉన్నతమైన మార్గాల వల్ల ఉనికిలో ఉందని మనం గుర్తిస్తాం.​—⁠కీర్తన 144:​15బి.

యెహోవా ఉన్నతమైన మార్గాల్లో నిరంతరం ముందుకు సాగిపోవడానికి కృతజ్ఞతా స్ఫూర్తితోపాటు బాధ్యతాయుత స్పృహ కూడా మనల్ని బలపరుస్తుంది.

బాధ్యతాయుత స్పృహతో నడవడం

పర్వతారోహకులు తాము తప్పిపోకుండా లేదా దారితప్పి ప్రమాదకరమైన శిఖరపు అంచులను సమీపించకుండా ఉండడానికి జాగ్రత్తగా నడవాల్సిన అవసరం ఉందని బాధ్యతాయుత స్పృహతో గుర్తిస్తారు. నైతిక స్వేచ్ఛ గలవారిగా స్వతంత్రతను చొరవను తీసుకోవడానికి యెహోవా మనల్ని కొంత మేరకు అనుమతిస్తాడు. కానీ మనం మన క్రైస్తవ విధులను నెరవేర్చేటప్పుడు ఆ స్వతంత్రతకు తోడు బాధ్యతాయుత స్పృహ కూడా ఉండాల్సిన అవసరముంది.

ఉదాహరణకు, తన సేవకులు తమ తమ విధులను బాధ్యతాయుతంగా నెరవేరుస్తారనే నమ్మకం యెహోవాకు ఉంది. అంతేగానీ మనం క్రైస్తవ కార్యకలాపాల్లో ఇంత సమయాన్ని ఇంత శక్తిని వెచ్చించాలని గానీ ఆర్థికంగా లేదా ఇతర మార్గాల్లో ఎంత మేరకు తోడ్పడాలన్నది గానీ ఆయన నిర్దేశించడు. దానికి భిన్నంగా, “ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను” అని పౌలు కొరింథీయులకు వ్రాసిన మాటలు మనందరికీ వర్తిస్తాయి.​—⁠2 కొరింథీయులు 9:⁠7; హెబ్రీయులు 13:​15, 16.

క్రైస్తవులు బాధ్యతాయుత స్పృహతో ఇచ్చేవాటిలో సువార్తను ఇతరులతో పంచుకోవడం కూడా ఉంది. ప్రపంచవ్యాప్త రాజ్య ప్రకటనా పనికి విరాళాలివ్వడం ద్వారా కూడా మనం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నామని చూపిస్తాం. గర్‌హార్ట్‌ అనే ఒక పెద్ద, తానూ తన భార్యా తూర్పు యూరప్‌లోని ఒక సమావేశానికి హాజరైన తర్వాత ఎక్కువ విరాళాలివ్వడం ప్రారంభించామని చెబుతున్నాడు. “అక్కడున్న మన సహోదరులు బీదవాళ్ళైనప్పటికీ మన బైబిలు సాహిత్యమంటే ఎంతో కృతజ్ఞత కలిగి ఉండడాన్ని మేము చూశాం, అందుకే ఇతర దేశాల్లో అవసరతలో ఉన్న మన సహోదరులకు సాధ్యమైనంత వరకు మద్దతునివ్వాలని మేము నిర్ణయించుకున్నాం.”

మన సహనాన్ని అధికం చేసుకోవడం

పర్వత ప్రాంతాల్లో నడవడానికి శక్తి అవసరం. పర్వతారోహకులు వీలైనప్పుడల్లా వ్యాయామం చేస్తారు, సుదీర్ఘ పాదయాత్రలకు తమను తాము సిద్ధం చేసుకునేందుకు చాలామంది దగ్గరి దగ్గరి ప్రాంతాలకు నడిచి వెళ్తుంటారు. అదేవిధంగా, మనం మన ఆధ్యాత్మిక దృఢత్వాన్ని కాపాడుకునేందుకు దైవపరిపాలనా కార్యకలాపాల్లో నిమగ్నులమై ఉండాలని పౌలు సిఫార్సు చేశాడు. ‘[యెహోవాకు] తగినట్టుగా నడుచుకోవాలని,’ ‘బలపరచబడాలని’ కోరుకునేవారు “ప్రతి సత్కార్యములో సఫలులగుచు” ముందుకు సాగాలని ఆయన చెప్పాడు.​—⁠కొలొస్సయులు 1:​9-12.

పర్వతారోహకుల సహన శక్తిని ప్రేరకం అధికం చేస్తుంది. ఎలా? దూరాన ఉన్న కొండలాంటి స్పష్టంగా కనబడే ఒక లక్ష్యస్థానంపై మనసు కేంద్రీకరించి ఉంచడం ప్రభావవంతమైన ప్రేరణనిస్తుంది. ఒక పర్వతారోహకుడు మార్గమధ్యంలోని గుర్తింపు చిహ్నాలను చేరుకున్నప్పుడు, తన అంతిమ లక్ష్యస్థానానికి ఎంత దగ్గరయ్యాడో ఆయన అంచనా వేసుకోగలుగుతాడు. తను అప్పటివరకు ప్రయాణించిన దూరాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆయన సంతృప్తిగా భావిస్తాడు.

అదేవిధంగా, మన నిత్యజీవ నిరీక్షణ మనలను బలపరుస్తుంది, ప్రేరేపిస్తుంది. (రోమీయులు 12:​12) ఈ లోగా, మనం యెహోవా మార్గాల్లో నడుస్తూ క్రైస్తవ లక్ష్యాలను పెట్టుకోవడంలోనూ వాటిని చేరుకోవడంలోనూ విజయం సాధిస్తాం. సంవత్సరాలుగా మనం నమ్మకంగా చేస్తున్న సేవ గురించి గానీ మన వ్యక్తిత్వంలో చేసుకున్న మార్పుల గురించి గానీ ఆలోచించినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో కదా!​—⁠కీర్తన 16:​11.

ఎక్కువ దూరం నడవడానికీ శక్తిని కాపాడుకోవడానికీ పర్వతారోహకులు స్థిరమైన వేగంతో ఎక్కుతారు. అలాగే, చక్కని దైనందిన కార్యక్రమంలో క్రమంగా కూటాలకూ క్షేత్ర పరిచర్యకూ వెళ్ళడం వంటివి ఉండాలి, అవి మనం మన లక్ష్యం వైపు స్థిరంగా ముందుకు సాగేలా చేస్తాయి. అందుకే పౌలు తోటి క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము.”​—⁠ఫిలిప్పీయులు 3:​16.

నిజానికి, యెహోవా మార్గాల్లో మనం ఒంటరిగా నడవము. “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము” అని పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 10:​24, 25) మంచి ఆధ్యాత్మిక సహవాసం, మనం తోటి విశ్వాసులతో స్థిరమైన వేగంతో నడవడాన్ని సులభతరం చేస్తుంది.​—⁠సామెతలు 13:​20.

చివరిగా, అన్నింటికన్నా ప్రాముఖ్యంగా యెహోవా ఇచ్చే శక్తిని మనం ఎన్నడూ మరచిపోకుండా ఉండాలి. యెహోవాలో బలం పొందేవారు “నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు.” (కీర్తన 84:​5, 7) కొన్నిసార్లు మనం ఎత్తుపల్లాలుగల ప్రాంతాల గుండా ప్రయాణించడం తప్పనిసరి అవుతుంది, అయినప్పటికీ యెహోవా సహాయంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం.