‘అందరియెడల మేలు చేయుదము’
“నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును”
‘అందరియెడల మేలు చేయుదము’
దేవుని రాజ్య సువార్తను ప్రకటించి, బోధించడమే యేసు ప్రధానంగా చేసిన పని. (మార్కు 1:14, 15; లూకా 8:1) క్రీస్తు అనుచరులు ఆయనను అనుసరించాలని కోరుకుంటారు కాబట్టి, వారు దేవుని రాజ్యం గురించి బైబిలు సందేశాన్ని బోధించే పనిని తాము తమ జీవితంలో చేయవలసిన ప్రాముఖ్యమైన పనిగా దృష్టిస్తారు. (లూకా 6:40) యేసు భూమిమీద ఉన్నప్పుడు రాజ్య సందేశం ప్రజలకు శాశ్వతమైన ఉత్తేజాన్నిచ్చినట్టే, నేడు కూడా రాజ్య సందేశాన్ని అంగీకరించేవారు శాశ్వతమైన ఉత్తేజం పొందడాన్ని చూడడం యెహోవాసాక్షుల హృదయాలకు నిజంగా ఆనందకరమైనది.—మత్తయి 11:28-30.
యేసు, దేవుని వాక్యాన్ని బోధించడంతో పాటు రోగులను బాగుచేయడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం వంటి ఇతర మంచి పనులు కూడా చేశాడు. (మత్తయి 14:14-21) అదేవిధంగా యెహోవాసాక్షులు తమ బైబిలు బోధనా పనికి అనుబంధంగా, అవసరంలో ఉన్న ప్రజలకు సహాయకరమైన పనులను చేస్తారు. వాస్తవానికి లేఖనాలు క్రైస్తవుల్ని “ప్రతి సత్కార్యమునకు” సిద్ధంచేసి, ‘అందరి యెడల మేలు చేయమని’ ప్రోత్సహిస్తున్నాయి. (ఇటాలిక్కులు మావి.)—2 తిమోతి 3:16, 17; గలతీయులు 6:10.
“మన సహోదరులు వచ్చారు”
1999 సెప్టెంబరులో తైవాన్‌లో వినాశకరమైన భూకంపం సంభవించింది. కొన్ని నెలల తర్వాత భారీ వర్షాలు, హిమానీపాతాలు కలిసి వెనిజులా చరిత్రలోనే అతిఘోరమైన ప్రకృతి వైపరీత్యాన్ని కలుగజేశాయి. ఇటీవలే తీవ్రమైన వరదలు మొజాంబిక్ దేశాన్ని నాశనం చేశాయి. ఈ మూడు సందర్భాలలోనూ బాధితుల కోసం ఆహార పదార్థాలు, నీళ్ళు, మందులు, వస్త్రాలు, టెంట్‌లు, వంట సామాగ్రి తీసుకుని యెహోవాసాక్షులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. వైద్యపర నిపుణతలున్న స్వచ్ఛంద సేవకులు గాయపడినవారికి చికిత్స చేయడానికి తాత్కాలిక వైద్యశాలలను నెలకొల్పారు, స్వచ్ఛంద నిర్మాణ సేవకులు ఇళ్ళు పోగొట్టుకున్నవారికి క్రొత్త ఇళ్ళు కట్టారు.
తమకు లభించిన సమయానుకూలమైన సహాయానికి బాధితులు కదిలించబడ్డారు. “మేము ఎంతో నిరాశతో ఉన్నప్పుడు, మన సహోదరులు వచ్చారు” అని మల్యోరీ చెబుతోంది. ఆమె ఇల్లు వెనిజులాలో హిమానీపాతం మూలంగా నాశనం చేయబడింది. స్వచ్ఛంద సేవకులు ఆమె కుటుంబం కోసం క్రొత్త *
ఇంటిని నిర్మించిన తర్వాత మల్యోరీ పట్టరాని సంతోషంతో “యెహోవా మా కోసం చేసిన దానికంతటికీ సరిపడినన్ని కృతజ్ఞతలు మేము ఆయనకు ఎప్పటికీ చెల్లించుకోలేము!” అని అన్నది. మొజాంబిక్‌లోని వరద బాధితులు క్రొత్తగా నిర్మించబడిన తమ ఇండ్ల తాళాలను అందుకున్నప్పుడు, అక్కడ ఉన్న వారందరూ అకస్మాత్తుగా “యెహోవా మన ఆశ్రయము” అనే రాజ్య గీతాన్ని పాడడం మొదలుపెట్టారు.అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం స్వచ్ఛంద సేవకులకు కూడా పునరుత్తేజాన్నిచ్చింది. “ఎంతో బాధను అనుభవించిన ఈ సహోదరులకు సహాయపడడానికి నేను సంతోషించాను” అని మొజాంబిక్‌లోని ఒక శరణార్థ శిబిరంలో నర్సుగా సేవచేసిన మార్సెలో చెప్పాడు. తైవాన్‌లో ఒక స్వచ్ఛంద సేవకుడైన హ్వాన్ ఇలా అన్నాడు: “అవసరంలో ఉన్న సహోదరులకు ఆహారాన్నీ టెంట్‌లనూ ఇచ్చిరావడం నాకు అమితానందాన్నిచ్చింది. అది నా విశ్వాసాన్ని బలపర్చింది.”
ఫలవంతమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమం
స్వచ్ఛంద సేవ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాదిమంది ఖైదీలకు ఆధ్యాత్మిక పునరుత్తేజాన్ని కూడా ఇచ్చింది. అదెలా? యెహోవాసాక్షులు, ఇటీవలి సంవత్సరాలలో కేవలం అమెరికాలోనే దాదాపు 4,000 చెరసాలల్లో నిర్బంధించబడిన 30,000 మందికి బైబిలు సాహిత్యాన్ని అందించారు. అంతేకాకుండా, సాధ్యమైన ప్రాంతాలలో ఖైదీలతో బైబిలు అధ్యయనం చేయడానికీ క్రైస్తవ కూటాలను నిర్వహించడానికీ సాక్షులు చెరసాలలను వ్యక్తిగతంగా సందర్శిస్తారు. మరి ఖైదీలు ప్రయోజనం పొందుతారా?
బైబిలును అధ్యయనం చేస్తున్న కొంతమంది ఖైదీలు తమ తోటిఖైదీలతో దేవుని వాక్యపు ఆహ్లాదకరమైన బోధలను పంచుకోవడం ప్రారంభించారు. దాని ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక చెరసాలల్లో ఇప్పుడు యెహోవాను కలిసి ఆరాధించే ఖైదీల గుంపులు ఉన్నాయి. 2001వ సంవత్సరంలో అమెరికాలోని ఓరేగాన్‌లోని ఒక చెరసాలలో ఒక ఖైదీ ఇలా నివేదించాడు: “మా గుంపు అభివృద్ధి చెందుతోంది, మా దగ్గర ఏడుగురు రాజ్య ప్రచారకులు ఉన్నారు, వారు 38 బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రసంగానికీ కావలికోట అధ్యయనానికీ 25 కంటే ఎక్కువమంది హాజరవుతారు, [క్రీస్తు మరణ] జ్ఞాపకార్థ ఆచరణకు 39 మంది హాజరయ్యారు. త్వరలోనే మరో ముగ్గురు వ్యక్తులు బాప్తిస్మం తీసుకోబోతున్నారు!”
ప్రయోజనాలు, ఆనందాలు
ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమం నిజంగా పనిచేస్తోందని చెరసాల అధికారులు గమనించారు. అయితే అధికారులను ఎక్కువగా ప్రభావితం చేసేది, ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమ శాశ్వత ప్రయోజనమే. ఒక నివేదిక ఇలా చెబుతోంది: “ఈ కార్యక్రమం అమలులో ఉన్న పది సంవత్సరాలలో, చెరసాలలోని యెహోవాసాక్షులలో ఒకరిగా బాప్తిస్మం పొందిన ఒక్క ఖైదీ కూడా తిరిగి చెరసాలకు రాలేదు, దీనికి భిన్నంగా ఇతర గుంపులకు చెందినవారిలో చెరసాలకు తిరిగివచ్చే వారి సంఖ్య 50 నుండి 60 శాతం ఎక్కువగా ఉంటుంది.” ఇడాహోలోని ఒక చెరసాల మతగురువు సాక్షులైన స్వచ్ఛంద సేవకులు సాధించిన ఫలితాలను బట్టి కదిలించబడి, యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయానికి తాను వ్రాసిన ఉత్తరంలో ఇలా అన్నాడు: “నేను వ్యక్తిగతంగా మీ మత విశ్వాసాలను అంగీకరించకపోయినప్పటికీ, మీ సంస్థ నన్ను ముగ్ధుడిని చేసింది.”
చెరసాలలో ఉన్నవారికి సహాయం చేయడం స్వచ్ఛంద సేవకులకు కూడా ప్రతిఫలదాయకంగా ఉంటుంది. రాజ్య గీతాన్ని మొదటిసారిగా పాడిన ఒక ఖైదీల గుంపుతో కూటాన్ని నిర్వహించిన తర్వాత ఒక స్వచ్ఛంద సేవకుడు ఇలా వ్రాశాడు: “28 మంది పురుషులు కలిసి యెహోవాకు స్తుతిగీతాలు పాడడాన్ని చూడడం ఎంతో ప్రోత్సాహాన్నింది. వాళ్ళు బిగ్గరగా పాడారు! అలాంటి ప్రత్యేకమైన సందర్భంలో అక్కడ ఉండడం ఎంతటి ఆధిక్యతో కదా!” ఆరిజోనాలోని చెరసాలలను సందర్శిస్తున్న ఒక స్వచ్ఛంద సేవకుడు ఇలా అన్నాడు: “ఈ ప్రత్యేకమైన పనిలో భాగం వహించడం ఎంత ఆశీర్వాదకరం!”
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాక్షులైన స్వచ్ఛంద సేవకులు, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని చెప్పిన యేసుతో సంతోషంగా ఏకీభవిస్తారు. (అపొస్తలుల కార్యములు 20:35) అందరికీ మేలు చేయమని బైబిలు ఇస్తున్న ఉపదేశాన్ని అనుసరించడం నిజంగా పునరుత్తేజాన్నిస్తుందని వారు నిశ్చయపరుస్తున్నారు.—సామెతలు 11:25.
[అధస్సూచి]
^ పేరా 7 యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవా స్తుతి గీతములు అనే పాటల బ్రోషుర్‌లోని 11 (85)వ పాటను చూడండి.
[8వ పేజీలోని చిత్రం]
వెనిజులా
[8వ పేజీలోని చిత్రం]
తైవాన్
[8వ పేజీలోని చిత్రం]
మొజాంబిక్