కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు

క్రైస్తవులు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు

క్రైస్తవులు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు

‘దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.’​—⁠యోహాను 4:⁠24.

1. దేవుణ్ణి ఎలాంటి ఆరాధన ప్రీతిపరుస్తుంది?

యెహోవా ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు తన పరలోక తండ్రిని ఎలాంటి ఆరాధన ప్రీతిపరుస్తుందో స్పష్టంగా సూచించాడు. సుఖారనే ఊరి వద్దనున్న ఒక బావి దగ్గర ఒక సమరయ స్త్రీకి హృదయాన్ని ఉత్తేజపరిచే విధంగా సాక్ష్యాన్నిస్తూ యేసు ఇలా అన్నాడు: ‘మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.’ (యోహాను 4:​22-24) ఈ మాటలను మనం ఎలా అర్థం చేసుకోవాలి?

2. సమరయులు తమ ఆరాధనను దేని ఆధారంగా చేసేవారు?

2 సమరయులకు మతపరంగా కొన్ని తప్పుడు దృక్కోణాలుండేవి. వారు పరిశుద్ధ లేఖనాల్లోని మొదటి ఐదు పుస్తకాలను మాత్రమే ప్రేరేపితమైనవిగా స్వీకరించేవారు. అది కూడా, ఆ ఐదు పుస్తకాలను సొంతంగా అనువదించుకుని వాటిని మాత్రమే స్వీకరించేవారు; వాటికి సమారిటన్‌ పెంటాటుక్‌ అని పేరు. నిజానికి, సమరయులకు దేవుని గురించి తెలియదు, కానీ యూదులకు మాత్రం లేఖన పరిజ్ఞానం అందించబడింది. (రోమీయులు 3:​1, 2) ఆ తర్వాత, విశ్వసనీయులైన యూదులకు, మరితరులకు యెహోవా అనుగ్రహాన్ని పొందడం సాధ్యమైంది. కానీ అందుకు వారేం చేయాల్సిన అవసరం ఉంది?

3. దేవుణ్ణి “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించాలంటే ఏమి అవసరం?

3 యెహోవాను ప్రీతిపరచడానికి యూదులు, సమరయులు, పూర్వం జీవించిన మరితరులు ఏమి చేయాల్సివుండింది? వారు ఆయన్ను ‘ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలసి’ ఉండింది. మనమూ అలాగే చేయాలి. దేవుని సేవ ఆత్మతో కూడినదిగా​—⁠అత్యంతాసక్తితోనూ, ప్రేమా విశ్వాసాలతో నిండిన హృదయంచే పురికొల్పబడినదిగానూ​—⁠ఉండాల్సినదైనప్పటికీ, ప్రాముఖ్యంగా మనం దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలంటే మనపై ఆయన పరిశుద్ధాత్మ ఉండాల్సిన, మనం దానిచే నడిపించబడడానికి దాన్ని అనుమతించాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి, దాన్ని అన్వయించుకొంటూ, మన ఆత్మను అంటే మన మనోవైఖరిని దేవుని మనోవైఖరికి పొందికగా మలచుకోవాలి. (1 కొరింథీయులు 2:8-12) మనం మన ఆరాధనను సత్యంతో కూడా చెల్లిస్తేనే అది యెహోవాకు అంగీకారయుక్తమైనదిగా ఉంటుంది. అది దేవుని వాక్యమైన బైబిలు ఆయన గురించీ ఆయన సంకల్పాలను గురించీ ఏమి వెల్లడి చేస్తోందో దానికి అనుగుణంగా ఉండాలి.

సత్యాన్ని కొనుగొనడం సాధ్యమే

4. కొందరు సత్యాన్ని ఎలా దృష్టిస్తారు?

4 కొందరు తత్త్వశాస్త్ర విద్యార్థులు పరమ సత్యం అనేది మానవులకు అందుబాటులో ఉండేటువంటిది కాదన్న దృక్కోణాన్ని పెంపొందించారు. నిజానికి, స్వీడన్‌ దేశ రచయిత అయిన ఆల్ఫ్‌ ఆల్బెర్గ్‌ ఇలా వ్రాశాడు: “తత్త్వశాస్త్రంలోని అనేక ప్రశ్నలు నిజానికి ఎలాంటివంటే, వాటికి ఖచ్చితమైన జవాబు చెప్పడం సాధ్యం కాదు.” అయితే కొందరు, ఎవరి దృష్టికి సరైనదిగా తోచే సత్యం వారికి ఉంటుందని అంటారు, అది వాస్తవమేనా? యేసుక్రీస్తు చెప్పేదాని ప్రకారమైతే కాదు.

5. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు?

5 మనం ఈ సంఘటనను ఇప్పుడు జరుగుతున్నట్లు ఊహించుకుందాము: అది సా.శ. 33వ సంవత్సరం తొలిభాగం; యేసు రోమా అధిపతియైన పొంతి పిలాతు ఎదుట నిలబడివున్నాడు. యేసు పిలాతుతో, “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను . . . యీ లోకమునకు వచ్చితిని” అన్నాడు. పిలాతు, “సత్యమనగా ఏమిటి?” అని అడిగాడు. కానీ యేసు ఏమి చెబుతాడో వినడానికి ఆయన ఆగలేదు.​—⁠యోహాను 18:​36-38.

6. (ఎ) “సత్యము” ఎలా నిర్వచించబడింది? (బి) యేసు తన అనుచరులకు ఎలాంటి నియామకాన్నిచ్చాడు?

6 “సత్యము” అంటే నిజమైన వస్తువుల, సంఘటనల, వాస్తవాల సముదాయం అని నిర్వచించబడింది. అయితే, యేసు ఏదో సాధారణ సత్యాన్ని గురించి సాక్ష్యమిచ్చాడా? లేదు. ఆయన మనస్సులో నిర్దిష్టమైన సత్యం ఉంది. ఆయన ఆ సత్యాన్ని ప్రకటించమని తన అనుచరులకు ఆజ్ఞాపిస్తూ వారికిలా చెప్పాడు: “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:​19, 20) ఈ విధానాంతానికి ముందే, యేసు యథార్థ అనుచరులు “సువార్త సత్యము”ను భూమియందంతటా ప్రకటించాల్సివుంది. (మత్తయి 24:⁠3; గలతీయులు 2:​14) ఇది యేసు పలికిన ఈ మాటల నెరవేర్పుగా జరుగుతుంది: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:​14) కాబట్టి, మనం జనాంగములన్నింటికీ రాజ్య సువార్తను ప్రకటిస్తూ సత్యాన్ని ఎవరు బోధిస్తున్నారో గుర్తించడం ఎంతో ఆవశ్యం.

మనం సత్యాన్ని ఎలా తెలుసుకోగలం?

7. యెహోవా సత్యానికి మూలమని మీరెలా రుజువుచేస్తారు?

7 ఆధ్యాత్మిక సత్యానికి యెహోవాయే మూలం. నిజానికి, కీర్తనకర్త అయిన దావీదు యెహోవాను “సత్యదేవా” అని పిలిచాడు. (కీర్తన 31:⁠5; 43:⁠3) యేసు, తన తండ్రి వాక్యము సత్యమని గుర్తించాడు, ఆయన ఇలా కూడా ప్రకటించాడు: “వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.” (యోహాను 6:​45; 17:​17; యెషయా 54:​13) కాబట్టి సత్యం కోసం అన్వేషిస్తున్నవారు మహోపదేశకుడైన యెహోవాచే బోధించబడాలన్నది స్పష్టం. (యెషయా 30:​20, 21) సత్యాన్ని వెదికేవారు “దేవుని గూర్చిన విజ్ఞానము” సంపాదించుకోవలసిన అవసరం ఉంది. (సామెతలు 2:⁠5) యెహోవా ప్రేమపూర్వకంగా వివిధ రీతుల్లో సత్యాన్ని బోధించాడు లేదా అందించాడు.

8. దేవుడు సత్యాన్ని ఏయే మార్గాల్లో బోధించాడు లేదా అందించాడు?

8 ఉదాహరణకు, యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని దేవదూతల ద్వారానే అందించాడు. (గలతీయులు 3:​19) పితరులైన అబ్రాహాము, యాకోబులకు ఆయన కలల్లో ఆశీర్వాదాలను వాగ్దానం చేశాడు. (ఆదికాండము 15:​12-16; 28:​10-19) చివరికి పరలోకం నుండి కూడా దేవుడు మాట్లాడాడు; ఉదాహరణకు, యేసు బాప్తిస్మం పొందినప్పుడు ఉత్తేజవంతమైన ఈ మాటలు భూమిపై వినబడ్డాయి: ‘ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను.’ (మత్తయి 3:​17) దేవుడు బైబిలు రచయితలను ప్రేరేపించి సత్యాన్ని అందించడాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞులమై ఉండాలి. (2 తిమోతి 3:​16, 17) కాబట్టి, దేవుని వాక్యం నుండి నేర్చుకోవడం ద్వారా మనం ‘సత్యమును నమ్మగలము.’​—⁠2 థెస్సలొనీకయులు 2:⁠13.

సత్యము మరియు దేవుని కుమారుడు

9. దేవుడు సత్యాన్ని వెల్లడి చేయడానికి తన కుమారుణ్ణి ఎలా ఉపయోగించుకున్నాడు?

9 ప్రాముఖ్యంగా దేవుడు మానవజాతికి సత్యాన్ని వెల్లడిచేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును ఉపయోగించుకున్నాడు. (హెబ్రీయులు 1:​1-4) నిజానికి, వేరే ఏ మానవుడూ మాట్లాడని విధంగా సత్యం గురించి యేసు మాట్లాడాడు. (యోహాను 7:​46) ఆయన పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత కూడా ఆయన తన తండ్రి దగ్గరి నుండి సత్యాన్ని వెల్లడిచేశాడు. ఉదాహరణకు, ‘త్వరలో సంభవింపనైయున్న సంగతులను దేవుడు తన దాసులకు కనుపరచుటకు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షతను’ అపొస్తలుడైన యోహాను యేసుక్రీస్తు నుండే పొందాడు.​—⁠ప్రకటన 1:​1-3.

10, 11. (ఎ) యేసు సాక్ష్యమిచ్చిన సత్యం దేనికి సంబంధించినది? (బి) సత్యం వాస్తవరూపం దాల్చేలా యేసు ఎలా చేశాడు?

10 యేసు తాను సత్యానికి సాక్ష్యమివ్వడానికే భూమి మీదకు వచ్చానని పొంతి పిలాతుతో చెప్పాడు. ఆ సత్యం, క్రీస్తు అయిన తాను దేవుని రాజ్యానికి రాజుగా ఉండి, ఆ రాజ్యం ద్వారా యెహోవా సర్వాధిపత్యపు హక్కును రుజువు చేయడానికి సంబంధించినదని యేసు తన పరిచర్యలో స్పష్టంగా వెల్లడిచేశాడు. కానీ యేసు సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడంలో కేవలం ప్రకటించడం, బోధించడం మాత్రమే ఇమిడి లేవు. ఆ సత్యాన్ని నెరవేర్చడం ద్వారా యేసు దానికి వాస్తవరూపం ఇచ్చాడు. తదనుగుణంగానే, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది.”​—⁠కొలొస్సయులు 2:16, 17.

11 సత్యం వాస్తవరూపం దాల్చిన ఒక సందర్భం ఏమిటంటే, బేత్లెహేములో యేసు పుట్టుక గురించి ప్రవచించబడడం. (మీకా 5:⁠2; లూకా 2:​4-11) మెస్సీయ 69 ‘వారముల సంవత్సరములు’ గతించిన తర్వాత ప్రత్యక్షమవడం గురించి దానియేలు పలికిన ప్రవచనార్థక మాటలు నెరవేరినప్పుడు కూడా సత్యము వాస్తవరూపం దాల్చింది. అది ఖచ్చితంగా సరైన సమయంలో సా.శ. 29వ సంవత్సరంలో యేసు, దేవుని ఎదుట తనను తాను నిలుపుకుని, పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు జరిగింది. (దానియేలు 9:​25, NW; లూకా 3:​1, 21, 22) యేసు రాజ్య ప్రచారకుడిగా జ్ఞానోదయాన్ని కలిగించే పరిచర్యను చేసినప్పుడు సత్యము మరోసారి వాస్తవరూపం దాల్చింది. (యెషయా 9:​1, 2, 6, 7; 61:​1, 2; మత్తయి 4:​12-17; లూకా 4:​18-21) ఆయన మరణ పునరుత్థానాల విషయంలో కూడా సత్యము వాస్తవరూపం దాల్చింది.​—⁠కీర్తన 16:​8-11; యెషయా 53:​5, 8, 11, 12; మత్తయి 20:​28; యోహాను 1:​29; అపొస్తలుల కార్యములు 2:​25-31.

12. యేసు ‘నేనే సత్యమును’ అని ఎందుకు చెప్పుకోగలిగాడు?

12 సత్యం యేసుక్రీస్తుపై కేంద్రీకృతమై ఉంది గనుక, ఆయన ఇలా చెప్పగలిగాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.” (యోహాను 14:⁠6) దేవుని సంకల్పంలో యేసు కలిగివున్న పాత్రను అంగీకరించడం ద్వారా ప్రజలు తమను తాము ‘సత్యసంబంధులుగా’ చేసుకున్నప్పుడు వారు ఆధ్యాత్మికంగా స్వతంత్రులుగా చేయబడతారు. (యోహాను 8:​32-36; 18:​37, 38) గొఱ్ఱెల్లాంటి వ్యక్తులు సత్యాన్ని స్వీకరించి, విశ్వాసంతో క్రీస్తును అనుకరిస్తారు కాబట్టి వారు నిత్యజీవాన్ని పొందుతారు.​—⁠యోహాను 10:​24-28.

13. ఏ మూడు రంగాల్లో మనం లేఖనానుసారమైన సత్యాన్ని పరిశీలిస్తాము?

13 యేసు, ఆయన ప్రేరేపిత శిష్యులు బయల్పరచిన సత్యాల సముదాయం నిజమైన క్రైస్తవ విశ్వాసంగా రూపొందుతుంది. కాబట్టి “విశ్వాసమునకు లోబడి”నవారు ‘సత్యమును అనుసరించి నడుచుకొంటారు.’ (అపొస్తలుల కార్యములు 6:⁠7; 3 యోహాను 3, 4) కాబట్టి, నేడు సత్యంలో నడుచుకుంటున్న వారు ఎవరు? జనాంగములన్నింటికీ సత్యాన్ని బోధిస్తున్నది ఎవరు? లాంటి ప్రశ్నలకు జవాబులను కనుగొనడంలో, మనం తొలి క్రైస్తవులపై దృష్టి కేంద్రీకరిస్తూ, (1) నమ్మకాలకు, (2) ఆరాధనా విధానానికి, (3) వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన లేఖనానుసారమైన సత్యాలను పరిశీలిద్దాము.

సత్యము మరియు నమ్మకాలు

14, 15. లేఖనాల విషయంలో తొలి క్రైస్తవులకు యెహోవాసాక్షులకు ఉన్న వైఖరి గురించి మీరేమి చెబుతారు?

14 యెహోవా లిఖిత వాక్యంపట్ల తొలి క్రైస్తవులు ఎంతో గౌరవాభిమానాలను కలిగివున్నారు. (యోహాను 17:​17) నమ్మకాలు ఆచారాల విషయంలో వారికి ఆ వాక్యమే ప్రమాణం. అలెగ్జాండ్రియాలోని రెండు, మూడు శతాబ్దాలకు చెందిన క్లెమెంట్‌ ఇలా అన్నాడు: “అత్యున్నత స్థాయిలో నాణ్యత కోసం శ్రమించేవారు, సత్యాన్వేషణలో ఉన్నప్పుడు లేఖనాల్లో కనబడే రుజువులు సంపాదించేంత వరకు విశ్రమించరు.”

15 తొలి క్రైస్తవుల్లానే యెహోవాసాక్షులు బైబిలును ఎంతో ఉన్నతంగా దృష్టిస్తారు. వారు ‘ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినదని, ఉపదేశించుటకు ప్రయోజనకరమై యున్నదని’ నమ్ముతారు. (2 తిమోతి 3:​16, 17) కాబట్టి, నేటి యెహోవా సేవకులు బైబిలును తమ ప్రధాన పాఠ్యగ్రంథముగా ఉపయోగించడం ద్వారా నేర్చుకున్న విషయాలను పరిగణలోకి తీసుకుంటూ, తొలి క్రైస్తవుల విశ్వాసాలను కొన్నింటిని మనం పరిశీలిద్దాము.

మృతుల గురించిన సత్యము

16. మృతుల గురించిన సత్యమేమిటి?

16 తొలి క్రైస్తవులు లేఖనాల్లో చెప్పబడిన విషయాలను నమ్మారు కాబట్టే వారు మృతుల గురించిన సత్యాన్ని బోధించారు. మానవులు చనిపోయినప్పుడు వారి శరీరాన్ని విడిచిపెట్టి, ఆ తర్వాత కూడా సజీవంగా ఉండే భాగమేదీ లేదని తొలి క్రైస్తవులు గుర్తించారు. “చచ్చినవారు ఏమియు ఎరుగరు” అన్న విషయం కూడా వారికి తెలుసు.​—⁠ప్రసంగి 9:⁠5, 10.

17. మృతుల నిరీక్షణను గురించి మీరెలా వివరిస్తారు?

17 అయినా యేసు తొలి శిష్యులు, దేవుని స్మృతిలో ఉన్న మృతులు పునరుత్థానులవుతారన్న​—⁠మళ్ళీ సజీవులవుతారన్న​—⁠ఖచ్చితమైన నిరీక్షణను కలిగివున్నారు. ఆ విశ్వాసాన్ని పౌలు ఇలా ప్రకటించినప్పుడు చక్కగా వ్యక్తీకరించాడు: ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని నేను దేవునియందు నిరీక్షించుచున్నాను.’ (అపొస్తలుల కార్యములు 24:​14, 15) ఆ తర్వాతి కాలంలో కూడా, క్రైస్తవుడనని చెప్పుకున్న మీనూక్యుస్‌ ఫెలిక్స్‌ ఇలా వ్రాశాడు: “తొలుత దేవుడే సృష్టించిన మానవుణ్ణి, ఆయనే పునఃసృష్టించలేడని ఏ బుద్ధిహీనుడు లేదా మూర్ఖుడు తలంచేందుకు సాహసిస్తాడు?” తొలి క్రైస్తవుల్లా యెహోవాసాక్షులు కూడా మృతులు మరియు పునరుత్థానం గురించిన లేఖనానుసారమైన సత్యానికి అంటిపెట్టుకుని ఉంటారు. ఇప్పుడు మనం దేవుడు, క్రీస్తుల గుర్తింపును పరిశీలిద్దాము.

సత్యము మరియు త్రిత్వము

18, 19. త్రిత్వము లేఖనానుసారమైన బోధ కాదని ఎందుకు చెప్పవచ్చు?

18 తొలి క్రైస్తవులు దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మలను త్రిత్వముగా దృష్టించలేదు. ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా అంటోంది: “త్రిత్వము అన్న పదం గానీ, అలాంటి స్పష్టమైన సిద్ధాంతం గానీ క్రొత్త నిబంధనలో కనిపించవు. యేసుకు గానీ ఆయన అనుచరులకు గానీ, ‘ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా’ అన్న షేమాను [ఒక హీబ్రూ ప్రార్థన] ఖండించాలన్న ఉద్దేశం లేదు. (ద్వితీ. 6:4).” క్రైస్తవులు రోమన్ల త్రిత్వాన్ని గానీ వేరే ఇతర దేవుళ్ళను గానీ ఆరాధించలేదు. యెహోవాను మాత్రమే ఆరాధించాలన్న యేసు మాటను వారు స్వీకరించారు. (మత్తయి 4:​10) అంతేగాక, వారు “తండ్రి నాకంటె గొప్పవాడు” అని పలికిన క్రీస్తు మాటలను కూడా నమ్మారు. (యోహాను 14:​28) నేడు యెహోవాసాక్షులు కూడా అలానే నమ్ముతారు.

19 యేసు తొలి అనుచరులు దేవునికీ క్రీస్తుకూ పరిశుద్ధాత్మకూ స్పష్టమైన తేడాలను చూపించారు. నిజానికి వారు, (1) తండ్రి నామమున, (2) కుమారుని నామమున, (3) పరిశుద్ధాత్మ నామమున శిష్యులకు బాప్తిస్మం ఇచ్చారు, త్రిత్వం నామమున కాదు. యెహోవాసాక్షులు కూడా అదేవిధంగా లేఖనానుసారమైన సత్యాన్ని బోధిస్తారు, అలా వారు దేవునికి, ఆయన కుమారునికి, పరిశుద్ధాత్మకు తేడా ఉందని చూపిస్తారు.​—⁠మత్తయి 28:​19.

సత్యము మరియు బాప్తిస్మము

20. బాప్తిస్మం పొందబోయే అభ్యర్థులకు ఎలాంటి పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది?

20 ప్రజలకు సత్యాన్ని బోధించి వారిని శిష్యులను చేయాలని యేసు తన అనుచరులకు నియామకాన్నిచ్చాడు. బాప్తిస్మానికి అర్హులు కావాలంటే వారికి లేఖనాల్లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ఉదాహరణకు, వారు తండ్రి యొక్క, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్థానాన్ని, అధికారాన్ని గుర్తించాలి. (యోహాను 3:​16) పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదు గానీ దేవుని చురుకైన శక్తియని కూడా బాప్తిస్మం పొందబోయే అభ్యర్థులు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.​—⁠అపొస్తలుల కార్యములు 2:​1-4.

21, 22. బాప్తిస్మం కేవలం విశ్వాసులకు మాత్రమేనని మీరెందుకు చెబుతారు?

21 పూర్తి సమాచారం పొంది, పశ్చాత్తాపం చెంది దేవుని చిత్తాన్ని చేయడానికి ఎలాంటి షరతులూ విధించకుండా తమను తాము సమర్పించుకున్నవారికే తొలి క్రైస్తవులు బాప్తిస్మం ఇచ్చారు. సా.శ. 33 పెంతెకొస్తునాడు యెరూషలేములో సమావేశమైవున్న యూదులకు, యూదామత ప్రవిష్టులకు అప్పటికే హీబ్రూ లేఖనాల్లో పరిజ్ఞానం ఉంది. అపొస్తలుడైన పేతురు మెస్సీయ అయిన యేసు గురించి మాట్లాడడం విన్న తర్వాత దాదాపు 3,000 మంది “వాక్యము అంగీకరించి,” “బాప్తిస్మము పొందిరి.”​—⁠అపొస్తలుల కార్యములు 2:​41; 3:⁠19–4:⁠4; 10:​34-38.

22 క్రైస్తవ బాప్తిస్మం విశ్వాసుల నిమిత్తమే. సమరయలోని ప్రజలు సత్యాన్ని స్వీకరించారు, “ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి.” (అపొస్తలుల కార్యములు 8:​12) యెహోవాను గురించిన పరిజ్ఞానం ఉన్న నిష్ఠగల యూదామత ప్రవిష్టుడైన ఐతియొపీయ నపుంసకుడు, మెస్సీయకు సంబంధించిన ప్రవచనాల నెరవేర్పును గురించి స్తెఫను వివరించినప్పుడు ఆ విషయాలను మొదట స్వీకరించి ఆ తర్వాత బాప్తిస్మం పొందాడు. (అపొస్తలుల కార్యములు 8:​34-38) ఆ తర్వాత పేతురు కొర్నేలీకి, మరితర అన్యులకు ‘ప్రతి జనములోను [దేవునికి] భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును’ అనీ, యేసుక్రీస్తులో నమ్మకముంచే ప్రతి ఒక్కరు పాప క్షమాపణను పొందుతారనీ చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 10:​35, 43; 11:​18) ఇదంతా ‘శిష్యులను చేయడం, తాను ఏ యే సంగతులను ఆజ్ఞాపించాడో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించడం’ అనే యేసు ఆజ్ఞతో పొందికగా ఉంది. (మత్తయి 28:​19, 20; అపొస్తలుల కార్యములు 1:⁠8) యెహోవాసాక్షులు అదే ప్రమాణాన్ని పాటిస్తారు, లేఖనాల్లో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారినే, దేవునికి సమర్పించుకున్నవారినే బాప్తిస్మానికి అనుమతిస్తారు.

23, 24. క్రైస్తవ బాప్తిస్మానికి సరైన విధానం ఏమిటి?

23 విశ్వాసులు నీటిలో పూర్తిగా మునిగి బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే సరైన పద్ధతి. యేసు యొర్దాను నదిలో బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన “నీళ్లలోనుండి ఒడ్డునకు” వచ్చాడు. (మార్కు 1:​10) ఐతియొపీయుడైన నపుంసకుడు బాప్తిస్మం పొందినప్పుడు ఆయనా ఫిలిప్పు “నీళ్లలోనికి దిగిరి,” ఆ తర్వాత ‘నీళ్లలోనుండి వెడలి వచ్చిరి.’ (అపొస్తలుల కార్యములు 8:​36-40) లేఖనాల్లో బాప్తిస్మాన్ని, పాతిపెట్టడంతో జతచేయడం కూడా నీటిలో పూర్తిగా మునగడం ద్వారా బాప్తిస్మం తీసుకోవాలనే సూచిస్తోంది.​—⁠రోమీయులు 6:​4-6; కొలొస్సయులు 2:⁠12.

24ది ఆక్స్‌ఫర్డ్‌ కంపానియన్‌ టు ద బైబిల్‌ ఇలా అంటోంది: “నూతన నిబంధనలోని బాప్తిస్మాల గురించిన నిర్దిష్టమైన వర్ణనలు, బాప్తిస్మం పొందే వ్యక్తి నీటిలో పూర్తిగా ముంచబడేవాడనే సూచిస్తున్నాయి.” ఫ్రెంచి భాషలోని 20వ శతాబ్దపు లారూస్‌ (పారిస్‌, 1928) అనే గ్రంథం చెప్పేదాని ప్రకారం, “తొలి క్రైస్తవులు నీళ్ళు కనబడిన ప్రతిచోట మునక ద్వారా బాప్తిస్మం పొందారు.” యేసు తర్వాత​—⁠క్రైస్తవత్వం విజయం అనే పుస్తకం (ఆంగ్లం) ఇలా అంటోంది: “అతి ప్రాథమిక రూపంలో చూస్తే [బాప్తిస్మం] అనే దానిలో అభ్యర్థి తన విశ్వాసాన్ని ప్రకటించడం, ఆ తర్వాత యేసు నామమున నీటిలో పూర్తిగా మునగడం ఇమిడివున్నాయి.”

25. తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి చర్చిస్తాము?

25 తొలి క్రైస్తవుల బైబిలు ఆధారిత విశ్వాసాలూ ఆచారాల గురించి పైన పేర్కొన్న అంశాలు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. వారి విశ్వాసాలకు యెహోవాసాక్షుల విశ్వాసాలకు మరితర సమాంతరాలను చాలా సులభంగా పేర్కొనవచ్చు. తర్వాతి ఆర్టికల్‌లో, ప్రజలకు సత్యాన్ని బోధించేవారిని గుర్తించేందుకు అదనపు మార్గాలను గురించి మనం చర్చిద్దాము.

మీరెలా జవాబిస్తారు?

• దేవుడు ఎలాంటి ఆరాధనను కోరుతున్నాడు?

• సత్యము యేసుక్రీస్తు ద్వారా ఎలా వాస్తవరూపం దాల్చింది?

• మృతుల గురించిన సత్యము ఏమిటి?

• క్రైస్తవ బాప్తిస్మం ఎలా ఇవ్వబడుతుంది, బాప్తిస్మ అభ్యర్థుల నుండి కోరబడేది ఏమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

[16వ పేజీలోని చిత్రం]

యేసు పిలాతుతో, “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను . . . వచ్చితిని” అన్నాడు

[17వ పేజీలోని చిత్రం]

యేసు ‘నేనే సత్యమును’ అని ఎందుకు చెప్పుకోగలిగాడో మీరు వివరించగలరా?

[18వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ బాప్తిస్మం గురించిన సత్యమేమిటి?