కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నరకాగ్నికి ఏమయ్యింది?

నరకాగ్నికి ఏమయ్యింది?

నరకాగ్నికి ఏమయ్యింది?

“నరకం” అనగానే మీ మనస్సుకు ఎలాంటి తలంపు వస్తుంది? మీరు నరకమంటే అగ్ని గంధకాలతో మండే అక్షరార్థమైన ఒక స్థలమనీ నిరంతరం శిక్షననుభవించే తీవ్రమైన బాధలతో ఉండే స్థలమనీ ఊహించుకుంటారా? లేక నరకమంటే బహుశా ఒక పరిస్థితి గురించిన సూచనార్థకమైన వర్ణన అనుకుంటారా?

పాపులకు లభించే నిశ్చయ భవిష్యత్తు, తీవ్రమైన బాధలతో కూడిన హింసలూ, ఆరని అగ్నీ ఉండే నరకమేనని క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు శతాబ్దాలుగా వర్ణించారు. ఈ తలంపు అనేక ఇతర మత గుంపులలో ఇప్పటికీ పాతుకుపోయి ఉంది. “నరకం అన్న పదాన్ని అందరికీ బాగా పరిచయం ఉన్న పదంగా చేసింది బహుశా క్రైస్తవత్వమే, కానీ ఆ సిద్ధాంతం కేవలం క్రైస్తవత్వానికి మాత్రమే సంబంధించినది కాదు. మరణానంతర జీవితంలో బాధాకరమైన దండన ఉంటుందని భయపెట్టే ఈ తలంపుకు సంబంధించిన బోధలు ప్రపంచంలోని ప్రాముఖ్యమైన మతాలన్నింటిలోనూ కొన్ని చిన్న మతాలలోనూ ఉన్నాయి” అని యు.ఎస్‌.న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ చెబుతోంది. హిందువులు, బౌద్ధ మతస్థులు, ముస్లింలు, జైనులు, టావోయిస్ట్‌లు ఏదో ఒక విధమైన నరకాన్ని నమ్ముతారు.

అయితే నరకం, ఆధునిక ఆలోచనా విధానంలో మరో భావాన్ని సంతరించుకుంది. “నరకం అగ్నిమయం అన్న సాంప్రదాయిక తలంపును విశ్వసించేవారు ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ, నరకంలో శాశ్వతంగా శిక్షించబడడం అంటే ఎంతో ఘోరమైన ఏకాంత నిర్బంధానికి గురికావడమే అన్న ఆధునిక తలంపులు ఉనికిలోకి రావడం ప్రారంభించాయి; ఒకప్పుడు విశ్వసించబడినట్లు నరకం మంటలతో ఉండే అక్షరార్థమైన స్థలం అయ్యుండకపోవచ్చు అని ఈ తలంపులు సూచిస్తున్నాయి” అని ముందు ప్రస్తావించిన పత్రిక నివేదిస్తోంది.

జెసూట్‌ల పత్రిక లా సివిల్టా కాట్టోలికా ఇలా వ్యాఖ్యానించింది: “దేవుడు, దయ్యాలను ఉపయోగించుకొని దోషులను అగ్నిలో కాల్చుతూ భయంకరమైన హింసలను విధిస్తాడన్న ఆలోచన . . . తప్పుదారి పట్టిస్తుంది.” ఆ పత్రిక ఇంకా ఇలా అంది: “నరకం ఒక స్థలాన్ని కాదుగానీ ఒక పరిస్థితిని సూచిస్తుంది, దేవునికి దూరమైనప్పుడు ఒక వ్యక్తి అనుభవించే తీవ్రమైన మానసిక బాధే ఆ పరిస్థితి.” పోప్‌ జాన్‌ పాల్‌ II 1999వ సంవత్సరంలో ఇలా అన్నాడు: “నరకం అనేది ఒక స్థలాన్ని సూచించడం లేదు, బదులుగా సమస్త జీవానికీ ఆనందానికీ మూలమైన దేవుడి నుండి తమను తాము ఇష్టపూర్వకంగా పూర్తిగా వేరుచేసుకునే ప్రజల పరిస్థితిని సూచిస్తుంది.” నరకం అంటే అగ్నితో ఉండే స్థలము అన్న తలంపుల గురించి ఆయన ఇలా అన్నాడు: “అది దేవుడు లేని జీవితమనీ పూర్తి నిరాశతో శూన్యంగా ఉండే జీవితమనీ ఆ తలంపులు సూచిస్తున్నాయి.” ఒకవేళ పోప్‌ నరకాన్ని “మంటలతో, ఎర్రని దుస్తులు ధరించిన దయ్యాలు త్రిశూలాలు పట్టుకొని ఉండే” ప్రదేశంగా వర్ణించి ఉంటే “ప్రజలు దాన్ని నమ్మేవారు కాదు” అని చర్చి చరిత్రకారుడు మార్టిన్‌ మార్టీ అంటున్నాడు.

ఇతర మత సంస్థల్లో కూడా ఇలాంటి మార్పులే జరుగుతున్నాయి. చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు సంబంధించిన డాక్ట్రిన్‌ కమీషన్‌ నుండి వచ్చిన ఒక నివేదిక ఇలా తెలియజేస్తోంది: “నరకం అంటే నిత్య హింసలు కాదు; బదులుగా అది, ఉనికిలో లేకుండాపోవడమనే పర్యవసానంతో, దేవునికి ఖచ్చితంగా సంపూర్ణంగా వ్యతిరేకమైన జీవితమార్గాన్ని చివరి ఎంపికగా, తిరుగులేని ఎంపికగా చేసుకోవడమే.”

అమెరికా ఎపిస్కోపల్‌ చర్చి యొక్క ప్రశ్నోత్తర బోధ, “దేవుణ్ణి తిరస్కరించినందుకు కలిగే శాశ్వతమైన మరణం” అని నరకాన్ని నిర్వచిస్తుంది. “దుష్టుల అంతము నాశనమే, శాశ్వతమైన బాధ కాదు” అన్న తలంపును ప్రోత్సహించే ప్రజల సంఖ్య పెరుగుతూనే ఉంది అని యు.ఎస్‌. న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ చెబుతోంది. “చివరికి దేవుణ్ణి తిరస్కరించినవారు నరకం యొక్క ‘దహించే అగ్నిలో’ పూర్తిగా ఉనికిలో లేకుండా పోతారు అని [వారు] అనుకుంటున్నారు.”

అగ్ని గంధకం అనే ఆలోచనా విధానాన్ని తిరస్కరించడం ఆధునిక దిన ధోరణి అయినప్పటికీ, చాలామంది నరకం బాధాకరమైన అక్షరార్థ స్థలం అనే నమ్మకాన్ని అంటిపెట్టుకునే ఉంటున్నారు. “నరకం అగ్నితో హింసించే నిజమైన స్థలం అని లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి” అని అమెరికాలో కెంటకీలోని లూయీవిల్‌లో ఉన్న సదర్న్‌ బాప్టిస్ట్‌ థియోలాజికల్‌ సెమినరీకి చెందిన ఆల్బర్ట్‌ మోలర్‌ అంటున్నాడు. ఇవాంజిలికల్‌ అలాయన్స్‌ కమీషన్‌ ద్వారా తయారుచేయబడిన నరకం అంటే (ఆంగ్లం) అనే రిపోర్టు ఇలా నివేదిస్తోంది: “నరకం అంటే తిరస్కారం మరియు హింస గురించి తెలుసుకొని ఉండడం.” ఆ నివేదిక ఇంకా ఇలా అంటోంది: “భూమ్మీద చేసిన పాపాల తీవ్రతను బట్టి నరకంలోని శిక్షలు, బాధలు వివిధ స్థాయిల్లో ఉంటాయి.”

మరి, నరకం అంటే శాశ్వతమైన హింసలతో కూడిన అగ్నిమయ స్థలమా లేక సర్వనాశనమా? లేక అది కేవలం దేవుని నుండి వేరుచేయబడే పరిస్థితా? అసలు నరకం అంటే ఏమిటి?

[4వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

నరకాగ్ని గురించిన క్లుప్తమైన చరిత్ర

క్రైస్తవులం అని చెప్పుకునేవారు నరకాగ్నికి సంబంధించిన నమ్మకాన్ని ఎప్పుడు స్వీకరించారు? యేసుక్రీస్తు, ఆయన అపొస్తలుల కాలం తర్వాత వారు ఆ నమ్మకాన్ని స్వీకరించారు. “నరకంలో దుష్టులు అనుభవించే శిక్షనూ హింసలనూ వర్ణించేందుకు వ్రాయబడిన మొదటి క్రైస్తవ [కల్పితగాథల] పుస్తకం అపోకలిప్స్‌ ఆఫ్‌ పీటర్‌ (పేతురు వ్రాసిన ప్రకటన గ్రంథం) (సా.శ. రెండవ శతాబ్దం)” అని ఫ్రెంచ్‌ ఎన్‌సైక్లోపీడియా యూనివర్సాలిస్‌ నివేదిస్తోంది.

అయితే, తొలి చర్చి ఫాదర్‌లలో నరకం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండేవి. జస్టిన్‌ మార్టిర్‌, అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్‌, టెర్టూలియన్‌, సిప్రియన్‌లు నరకం అంటే అగ్నితో మండే ప్రదేశమని విశ్వసించారు. ఆరిజెన్‌ మరియు నైసాలోని దైవశాస్త్రపండితుడైన గ్రెగరీ నరకం అంటే దేవుని నుంచి వేరుచేయబడడం అని, అంటే ఆధ్యాత్మిక బాధ అని తలంచాడు. మరోవైపున హిప్పోకు చెందిన అగస్టీన్‌, నరకంలోని బాధ ఆధ్యాత్మికమైనదీ శారీరకమైనదీ అని నమ్మాడు, ఈ అభిప్రాయం ప్రజాదరణ పొందింది. “పాపులకు ఈ జీవితం తర్వాత రెండవ అవకాశం ఉండదు మరియు వారిని నాశనం చేసే అగ్ని ఎప్పటికీ ఆరదు అన్న నమ్మకం ఐదవ శతాబ్దానికల్లా ప్రతిచోటా ప్రబలమయ్యింది” అని ప్రొఫెసర్‌ జె.ఎన్‌.డి.కెల్లీ వ్రాశాడు.

16వ శతాబ్దంలో, మార్టిన్‌ లూథర్‌ మరియు జాన్‌ కాల్విన్‌ వంటి ప్రొటస్టెంట్‌ సంస్కర్తలు అగ్నితో కూడిన నరకయాతన, దేవుని నుండి వేరుచేయబడి శాశ్వతంగా అలాగే ఉండడాన్ని సూచిస్తుందని అర్థం చేసుకున్నారు. కానీ, తర్వాతి రెండు శతాబ్దాలలో, నరకం అంటే హింసలతో కూడిన స్థలమన్న తలంపు తిరిగి వచ్చింది. ప్రొటస్టెంట్‌ ప్రచారకుడు జోనాథాన్‌ ఎడ్వర్డ్స్‌, 18వ శతాబ్దంలో వలసప్రాంతాల్లోని అమెరికన్ల హృదయాలలో గుబులు పుట్టించడానికి నరకాన్ని విస్పష్టంగా వర్ణించేవాడు.

అయితే, ఆ తర్వాత కొంత కాలానికి నరకంలోని మంటలు ఆరిపోవడం ప్రారంభించాయి. “20వ శతాబ్దం దాదాపు నరకం యొక్క మరణాన్ని చూసింది” అని యు.ఎస్‌.న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ నివేదించింది.

[చిత్రాలు]

నరకం అంటే అగ్నితో మండే ప్రదేశమని జస్టిన్‌ మార్టిర్‌ నమ్మాడు

హిప్పోకు చెందిన అగస్టీన్‌, నరకంలోని బాధ ఆధ్యాత్మికమైనదీ శారీరకమైనదీ అని బోధించాడు