కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నీతిని విత్తండి, దేవుని ప్రేమపూర్వక దయను కోయండి

నీతిని విత్తండి, దేవుని ప్రేమపూర్వక దయను కోయండి

నీతిని విత్తండి, దేవుని ప్రేమపూర్వక దయను కోయండి

“ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.” (సామెతలు 11:​15) ఈ చిన్న సామెత బాధ్యతాయుత స్పృహతో చర్య తీసుకోవాలని ఎంత దృఢంగా ప్రోత్సహిస్తోందో కదా! అపనమ్మకస్థుడైన ఎదుటివాడి అప్పు కోసం పూటబడితే అంటే పూచీపడితే కష్టాలను ఆహ్వానించినట్లవుతుంది. పూటబడకుండా ఉంటే ఆర్థిక చిక్కుల్లో పడకుండా ఉంటాం.

దీనిలోని ముఖ్యమైన సూత్రం: ‘మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు’ అన్నది స్పష్టం. (గలతీయులు 6:⁠7) ‘నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను [“ప్రేమపూర్వక దయ అను,” NW] కోత కోయుడి’ అని హోషేయ స్పష్టంగా తెలియజేశాడు. (హోషేయ 10:​12) అవును, దేవుడు చేసే రీతిలో పనులు చేస్తూ నీతిని విత్తండి, ఆయన ప్రేమపూర్వక దయను కోయండి. ఈ సూత్రాన్ని పదే పదే ఉపయోగిస్తూ ఇశ్రాయేలు రాజైన సొలొమోను, సరైన చర్యనూ నీతివంతమైన మాటనూ సరైన మనోవైఖరినీ బలంగా ప్రోత్సహిస్తున్నాడు. ఆయన జ్ఞానయుక్తమైన మాటలను తదేక దీక్షతో పరిశీలించడం నీతి ఫలించేలా మనం విత్తనం విత్తేందుకు నిజమైన ప్రోత్సాహాన్నిస్తుంది.​—⁠సామెతలు 11:​15-31.

‘దయను’ విత్తండి, ‘ఘనతను’ కోయండి

“నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.” అని అంటున్నాడు జ్ఞానియైన రాజు. (సామెతలు 11:​16) ఈ లేఖనము, నెనరుగల​—⁠దయగల​—⁠స్త్రీ పొందగలిగే శాశ్వతమైన ఘనతకూ బలిష్ఠులు సంపాదించుకునే తాత్కాలిక సంపదలకూ మధ్యనున్న భిన్నత్వాన్ని చూపిస్తోంది.

ఘనతను తీసుకువచ్చే దయను ఒక వ్యక్తి ఎలా సంపాదించుకోగలడు? ‘లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము అవి నీ మెడకు అలంకారముగా ఉండును’ అని సొలొమోను ఉపదేశించాడు. (సామెతలు 3:​21, 22) ‘ఒక రాజు పెదవులమీద దయారసము పోయబడియున్నది’ అని కీర్తనకర్త అన్నాడు. (కీర్తన 45:​1, 2) అవును ఆచరణాత్మకమైన జ్ఞానము, వివేచన, సరిగా ఉపయోగించే నాలుకవంటివి ఒక వ్యక్తికి విలువను, దయను తీసుకువస్తాయి. తెలివైన ఒక స్త్రీ విషయంలోనూ అది ఖచ్చితంగా నిజం. అందుకు మూర్ఖుడైన నాబాలు భార్య అబీగయీలు ఒక ఉదాహరణ. ఆమె “సుబుద్ధిగలదై రూపసియై యుండెను,” దావీదు రాజు ఆమెను “బుద్ధి”గల స్త్రీ అని ప్రశంసించాడు.​—⁠1 సమూయేలు 25:​3, 33.

నిజమైన దయగల ఒక భక్తురాలు తప్పకుండా ఘనపరచబడుతుంది. ఆమె మంచిపేరును సంపాదిస్తుంది. ఆమె గనుక వివాహిత అయితే తన భర్త దృష్టిలో ఘనతను పొందుతుంది. వాస్తవానికి, ఆమె తన మొత్తం కుటుంబానికే ఘనతను తెస్తుంది. ఆమె ఘనత తాత్కాలికమైనది కాదు. “గొప్ప ఐశ్వర్యముకంటె మంచి పేరును, వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.” (సామెతలు 22:⁠1) ఆమె దేవుని దృష్టిలో సంపాదించుకునే మంచిపేరుకు శాశ్వతమైన విలువుంది.

ఒక బలిష్ఠుని​—⁠‘దౌర్జన్యపరుని’ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. (సామెతలు 11:​16, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) దౌర్జన్యపరుడు దుష్టుల, యెహోవా ఆరాధకుల శత్రువుల కోవలోకి వస్తాడు. (యోబు 6:​23; 27:​13) అలాంటి వ్యక్తి ‘తన ఎదుట దేవుణ్ణి ఉంచుకోడు.’ (కీర్తన 54:⁠3) అలాంటి వ్యక్తి, అమాయకులను అణగద్రొక్కుతూ వారి నుండి స్వార్థపూరిత లాభాన్ని పొందుతూ ‘ధూళి అంత విస్తారముగా వెండిని పోగు’ చేసుకుంటుండవచ్చు. (యోబు 27:​16) కానీ ఒకానొక సమయంలో అతను మళ్లీ లేవకుండా పడుకుంటాడు, ఏదో ఒకరోజు అతను కళ్ళు తెరిచినా అదే చివరిసారి కావచ్చు. (యోబు 27:​19) అతని ధనమూ అతను సాధించినవీ అన్నీ కూడా అప్పుడు విలువలేనివే అవుతాయి.​—⁠లూకా 12:​16-21.

సామెతలు 11:16 లోనిది ఎంత ప్రాముఖ్యమైన పాఠం! ఇశ్రాయేలు రాజు దయా దౌర్జన్యాల ప్రతిఫలాలను సంక్షిప్తంగా మన ఎదుట ఉంచడం ద్వారా నీతిని విత్తేలా మనల్ని ఉద్బోధిస్తున్నాడు.

“ప్రేమపూర్వక దయ” మేలు చేస్తుంది

మానవ సంబంధాల విషయంలో మరొక పాఠాన్ని బోధిస్తూ సొలొమోను ఇలా అంటున్నాడు: ‘దయగలవాడు [“ప్రేమపూర్వక దయగలవాడు,” NW] తనకే మేలు చేసికొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును.’ (సామెతలు 11:​17) “ఈ సామెతలోని సారాంశమేమిటంటే, ఒక వ్యక్తి ఇతరులతో మంచిగా ప్రవర్తించినా చెడుగా ప్రవర్తించినా దానికి హఠాత్పరిణామాలు లేదా ఊహించని పర్యవసానాలు ఉంటాయి” అని ఒక విద్వాంసుడు అంటున్నాడు. లీసా అనే ఒక యువతి గురించి ఆలోచించండి. * ఆమె సదుద్దేశం గల వ్యక్తే అయినప్పటికీ నిర్ణీత సమయానికి ఆమె ఎప్పుడూ వచ్చేది కాదు. ప్రకటనా పనికి ఇతర రాజ్య ప్రచారకులను కలుసుకునేందుకు చేసే ఏర్పాట్లకు 30 నిమిషాలు గానీ అంతకంటే ఎక్కువ సమయం గానీ ఆలస్యంగా రావడం ఆమెకు సర్వసాధారణమైన విషయం. లీసా తనకు మేలు చేకూరే విధంగా ప్రవర్తించడం లేదు. కాబట్టి తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవడం వల్ల ఇతరులు విసిగిపోయి ఇక ముందు ఆమెతో వెళ్ళేందుకు నిర్ణయించుకోకపోతే, ఆమె వాళ్ళను నిందించవచ్చా?

పరిపూర్ణతావాది​—⁠అనుకున్న పనులను సాధించడానికి మరీ ఉన్నతమైన ప్రమాణాలను ఏర్పరిచే వ్యక్తి​—⁠కూడా క్రూరుడే. అతను అసాధ్యమైన లక్ష్యాలను చేరుకోవాలని నిర్విరామంగా కృషి చేస్తున్నాడు, అతను తనను తాను అలసటకూ నిరాశకూ గురిచేసే పరిస్థితుల్లో పెట్టుకుంటున్నాడు. మరోవైపున మనం ఆచరణాత్మకమైన, సహేతుకమైన లక్ష్యాలను పెట్టుకుంటే మనకు మేలు చేకూరే విధంగా ప్రవర్తిస్తాం. బహుశా మనం ఇతరులు గ్రహించినంత వేగంగా విషయాలను గ్రహించలేకపోతుండవచ్చు. లేదా అనారోగ్యమో వృద్ధాప్యమో మనపై ప్రతిబంధకాలను విధిస్తుండవచ్చు. మన ఆధ్యాత్మిక ఎదుగుదల విషయమై బాధతో చిరాకుపడకుండా మన బలహీనతలతో వ్యవహరించేటప్పుడు ఎల్లప్పుడూ సహేతుకతను చూపిద్దాం. మనకున్న సామర్థ్యాల్లో మన “శక్తికి తగినట్లు కృషి” చేసినప్పుడు సంతోషంగా ఉంటాం.​—⁠2 తిమోతి 2:​15, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; ఫిలిప్పీయులు 4:⁠5.

ఒక నీతిమంతుడు తనకు తాను ఎలా మేలు చేకూర్చుకుంటాడో ఒక క్రూరుడు తనకు తాను ఎలా హాని చేకూర్చుకుంటాడో ఇంకా వివరిస్తూ జ్ఞానియైన రాజు ఇలా అంటున్నాడు: “భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.”​—⁠సామెతలు 11:​18-21.

ఈ లేఖనాలు విభిన్న మార్గాల్లో ఈ ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెబుతున్నాయి: నీతిని విత్తి దాని ప్రతిఫలాన్ని కోయండి. తేరగా సంపాదించేందుకు దుష్టుడు పన్నాగం పన్నవచ్చు లేదా జూదమాడవచ్చు. అలాంటి సంపాదన న్యాయసమ్మతమైనది కాదు కాబట్టి అతనికి ఆశాభంగమే కలుగుతుండవచ్చు. యథార్థంగా పనిచేసే వ్యక్తికి వచ్చే నిజమైన సంపాదనలో ఆయనకు భద్రత ఉంది. దేవుని అంగీకారం ఉన్న నిష్కళంకమైన వ్యక్తికి నిత్యజీవం పొందే నిరీక్షణ ఉంది. కానీ ఒక చెడు వ్యక్తికి ఏమవుతుంది? మోసం చేయడానికి పన్నాగం పన్నినప్పటికీ, దుష్టుడు శిక్ష నుండి తప్పించుకోలేడు. (సామెతలు 2:​21, 22) నీతిని విత్తడానికి ఇది ఎంత చక్కని ప్రబోధం!

వివేకముగల వ్యక్తి కోసం నిజమైన అందం

“వివేకములేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది” అంటూ సొలొమోను ముందుకు సాగుతున్నాడు. (సామెతలు 11:​22) ముక్కుపోగులు అలంకరించుకోవడం బైబిలు కాలాల్లోని ప్రజలకు చాలా ఇష్టం. ఒక స్త్రీని చూడగానే కనిపించే ఆభరణం బంగారు ముక్కుపోగు, దాన్ని ముక్కుకు ఒక వైపు గానీ నాసికా రంధ్రాలను వేరుచేసే మధ్యగోడకు గానీ ధరించేవారు. అలాంటి అందమైన ఆభరణము ఒక పంది ముక్కుకు ఉండడం ఎంతటి అనుచితం! “వివేకము” లోపించిన బాహ్య సౌందర్యం గల యువతి విషయం కూడా అంతే. ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా కేవలం బాహ్య అలంకరణ ఆ వ్యక్తిని మంచి వ్యక్తిగా చేయదు. అది అనుచితమైనది​—⁠ఎంత మాత్రం ఆకర్షణీయంగా ఉండదు.

మనం ఇతరులకు ఎలా కనబడుతున్నామో అని ఆలోచించడం సహజమే. కానీ మన ముఖం గురించి గానీ మన భౌతిక రూపం గురించి గానీ అధిక చింత లేదా అసంతృప్తి ఎందుకుండాలి? మన అవయవాల్లోని ఎన్నో ఆకృతులు మన అదుపులో లేవు. అంతేగాక కేవలం భౌతిక రూపమే సర్వస్వం కాదు. మనం ఇష్టపడి ముగ్ధులమైన అనేకమంది పూర్తి సాదా సీదాగా కనబడతారనే విషయం నిజం కాదా? సంతోషానికి కీలకం భౌతిక ఆకర్షణ కాదు. ఎల్లప్పుడూ దేవుని లక్షణాలను వ్యక్తం చేయడం వల్ల కలిగే ఆత్మ సౌందర్యమే నిజంగా విలువైనది. కాబట్టి మనం వివేకంగా ఉండి ఆ లక్షణాలను పెంపొందించుకొందాం.

‘ఔదార్యముగలవారు వర్ధిల్లుతారు’

రాజైన సొలొమోను “నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది” అని అంటున్నాడు. ఎందుకో వివరిస్తూ ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు, తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.”​—⁠సామెతలు 11:​23, 24.

మనం దేవుని వాక్య పరిజ్ఞానాన్ని కష్టపడి వెదజల్లుతుండగా​—⁠ఇతరులకు అందిస్తుండగా​—⁠దాని “వెడల్పు పొడుగు లోతు ఎత్తు”లను ఇంకా ఎక్కువగా తప్పకుండా గ్రహిస్తాం. (ఎఫెసీయులు 3:​15-18) మరోవైపు, తన పరిజ్ఞానాన్ని ఉపయోగించని వ్యక్తి తనకున్న పరిజ్ఞానాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అవును “కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును.”​—⁠2 కొరింథీయులు 9:⁠6.

‘ఔదార్యముగలవారు పుష్టినొందుదురు [వర్ధిల్లుతారు]. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును’ అంటూ రాజు కొనసాగుతున్నాడు. (సామెతలు 11:​25) మనం సత్యారాధనను ముందుకు సాగించడానికి మన సమయాన్నీ వనరులనూ ఔదార్యంగా ఉపయోగించినప్పుడు, యెహోవా మన విషయంలో ఎక్కువ సంతోషిస్తాడు. (హెబ్రీయులు 13:​15, 16) ఆయన ‘ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడు.’ (మలాకీ 3:​10) నేటి ఆయన సేవకుల ఆధ్యాత్మిక సమృద్ధి వైపు ఒకసారి చూడండి!

నీతిమంతుని, దుష్టుని భిన్నమైన కోరికల గురించి మరొక ఉదాహరణను ఇస్తూ సొలొమోను ఇంకా ఇలా అంటున్నాడు: “ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును.” (సామెతలు 11:​26) ధరలు తక్కువగా ఉన్నప్పుడు సరుకులు కొనేసి సరఫరా ఆగిపోయేంత వరకు వాటిని నిల్వచేసి ఆ తర్వాత ధరలు పెంచి వాటిని అమ్మడం లాభదాయకం కాగలదు. పరిమితంగా వాడి నిలువ ఉంచుకోవడం వల్ల కొంత ప్రయోజనాన్ని పొందినప్పటికీ ప్రజలు సాధారణంగా అలాంటి వ్యక్తిని అతని స్వార్థం కారణంగా ఈసడించుకుంటారు. మరోవైపున, అత్యవసర పరిస్థితుల్లో ఆ పరిస్థితిని వినియోగించుకుంటూ డబ్బును ఎక్కువ సంపాదించుకోవాలనుకోని వ్యక్తి ప్రజల దీవెనను పొందుతాడు.

మంచిదాన్ని లేదా నీతిని కోరుకోవడంలో కొనసాగమని మనల్ని ప్రోత్సహిస్తూ ఇశ్రాయేలు రాజు ఇలా అంటున్నాడు: “మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడుచేయ గోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును; నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు.”​—⁠సామెతలు 11:​27, 28.

నీతిమంతుడు ఇతరులను రక్షిస్తాడు

మూర్ఖపు చర్య హానికరమైన పర్యవసానాలను ఎలా తీసుకువస్తుందో తెలియజేస్తూ సొలొమోను ఇలా వ్యక్తంచేస్తున్నాడు: “తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును.” (సామెతలు 11:​29ఎ) ఆకాను తప్పుడు చర్య అతణ్ణి ‘బాధల’ పాలు చేసింది, అతడూ అతని కుటుంబ సభ్యులూ రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు. (యెహోషువ, 7వ అధ్యాయం) నేడు, తప్పుడు చర్యవల్ల వచ్చే ఫలితాలను బట్టి ఒక క్రైస్తవ కుటుంబ పెద్దా ఆయన కుటుంబంలోని ఇతరులూ క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడవచ్చు. దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా ప్రవర్తించడంలో వ్యక్తిగతంగా విఫలమవ్వడం ద్వారా తన కుటుంబంలోనే గంభీరమైన తప్పుడు పనులను అనుమతించడం ద్వారా ఒక వ్యక్తి తన సొంత కుటుంబాన్ని బాధలపాలు చేస్తాడు. అతనూ బహుశా అతని కుటుంబంలోని ఇతరులూ పశ్చాత్తాపపడని తప్పిదస్థులుగా క్రైస్తవ సహవాసం నుండి బహిష్కరించబడుతుండవచ్చు. (1 కొరింథీయులు 5:​11-13) ఆ వ్యక్తి ఏమి సంపాదిస్తాడు? కేవలం గాలి​—⁠అదొక నిజమైన పదార్థమూ కాదు, దానికి నిజమైన విలువా లేదు.

లేఖనం ఇంకా ఇలా కొనసాగుతుంది: “మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును.” (సామెతలు 11:​29బి) మూఢునిలో ఆచరణాత్మక జ్ఞానం తక్కువ కాబట్టి అతనికి ఎక్కువ బాధ్యతలు అప్పగించబడవు. అంతేకాదు, అతని స్వకార్యాల అస్తవ్యస్త నిర్వహణ అతను ఏదో ఒకవిధంగా మరొకరికి బద్ధుడయ్యేలా చేయవచ్చు. అలాంటి అవివేకి ఒక ‘జ్ఞానహృదయునికి దాసుడు’ కావచ్చు. అలాంటప్పుడు, మనం మన కార్యకలాపాలన్నింటిలోను సరైన వివేచననూ ఆచరణాత్మక జ్ఞానాన్నీ ఉపయోగించడం చాలా ముఖ్యమన్నది స్పష్టం.

“నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు” అని జ్ఞానియైన రాజు మనకు హామీ ఇస్తున్నాడు. (సామెతలు 11:​30) అదెలా జరుగుతుంది? ఒక నీతిమంతుడు తన మాటల ద్వారా తన ప్రవర్తన ద్వారా ఇతరులకు ఆధ్యాత్మిక పోషణనిస్తాడు. యెహోవా సేవ చేయడానికి వారు ప్రోత్సహించబడతారు, చివరికి వారు దేవుడు సాధ్యం చేసే జీవాన్ని కూడా పొందవచ్చు.

‘పాపి మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుతాడు’

ముందు ప్రస్తావించిన సామెతలు నీతిని విత్తడానికి మనల్ని ఒప్పించే విధంగా ఎంత చక్కగా ఉద్బోధిస్తున్నాయో కదా! “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అనే సూత్రాన్ని సొలొమోను మరో విధంగా కూడా అన్వయిస్తూ ఇలా వ్యక్తం చేస్తున్నాడు: “నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా?”​—⁠సామెతలు 11:​31.

ఒక నీతిమంతుడు సరైనది చేయడానికి కృషి చేస్తున్నప్పటికీ ఆయన అప్పుడప్పుడూ తప్పులు చేస్తాడు. (ప్రసంగి 7:​20) ఆయన తన పొరపాట్ల ‘ప్రతిఫలాన్ని’ క్రమశిక్షణ రూపంలో పొందుతాడు. అయితే బుద్ధి పూర్వకంగా చెడు ప్రవర్తనను కోరుకుని, నీతి మార్గం వైపు తిరగడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయని దుష్టుని సంగతి ఏమిటి? అతడు మరింత గొప్ప “ప్రతిఫలము”​—⁠తీవ్రమైన శిక్షను పొందడానికి పాత్రుడు కాడా? అపొస్తలుడైన పేతురు, “నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?” అని వ్రాశాడు. (1 పేతురు 4:​18) కాబట్టి, మన ప్రయోజనం కోసం ఎల్లప్పుడూ నీతిని విత్తడానికి దృఢ నిశ్చయంతో ఉందాం.

[అధస్సూచి]

^ పేరా 11 ఇక్కడ పేరు మార్చబడింది.

[28వ పేజీలోని చిత్రం]

“దయ” అబీగయీలుకు “ఘనత”ను తెచ్చింది

[30వ పేజీలోని చిత్రాలు]

‘దుష్టుని సంపాదన మోసపూరితమైనది, నీతిమంతుని సంపాదన నిజమైనది’

[31వ పేజీలోని చిత్రం]

‘సమృద్ధిగా విత్తండి, సమృద్ధిగా పంటకోయండి’