పేరుపెట్టబడని దైవం కోసం బలిపీఠం
పేరుపెట్టబడని దైవం కోసం బలిపీఠం
అపొస్తలుడైన పౌలు గ్రీసులోని ఏథెన్సును దాదాపు సా.శ. 50 లో సందర్శించాడు. అక్కడ, తెలియబడని దేవునికి ప్రతిష్ఠించబడిన బలిపీఠాన్ని ఆయన చూశాడు, ఆ తర్వాత యెహోవా గురించి చక్కని సాక్ష్యమిచ్చేటప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించాడు.
మార్స్ కొండ లేదా అరేయొపగుపై తన ప్రసంగాన్ని ప్రారంభించేటప్పుడు పౌలు ఇలా అన్నాడు: “ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై యున్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద—తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.”—అపొస్తలుల కార్యములు 17:22-31.
ఏథెన్సులోని ఆ బలిపీఠము కనుగొనబడలేదు, అయితే అదేవిధమైన బలిపీఠాలు గ్రీసులోని ఇతర ప్రాంతాలలో ఉండేవి. ఉదాహరణకు, రెండవ శతాబ్దపు గ్రీకు భూగోళశాస్త్రజ్ఞుడు పౌసన్యాస్, ఏథెన్సుకు సమీపంలోని ఫాలెరాన్‌లో ఉన్న “తెలియబడని అని పేరుపెట్టబడిన దేవుళ్ళ” బలిపీఠముల గురించి ప్రస్తావించాడు. (డిస్క్రిప్షన్ ఆఫ్ గ్రీస్, అట్టికా I, 4) ఒలింపియాలో “తెలియబడని దేవుళ్ళ బలిపీఠము” ఉండేదని కూడా ఆ పుస్తకము చెబుతుంది.—ఈలీ I, XIV, 8.
ద లైఫ్ ఆఫ్ అపోలోనియస్ ఆఫ్ ట్యానా (VI, III) అనే తన పుస్తకంలో గ్రీకు రచయిత ఫిలోస్ట్రేటస్ (సా.శ. ఇంచుమించు 170 నుండి ఇంచుమించు 245 వరకు), ఏథెన్సులో “తెలియబడని దేవుళ్ళ గౌరవార్థం కూడా బలిపీఠములను ఏర్పాటు చేశారు” అని చెప్పాడు. లైవ్స్ ఆఫ్ ఫిలాసఫర్స్ (1.110), అనే తన పుస్తకంలో డయేజ్నీజ్ లేర్షిస్, (సా.శ. ఇంచుమించు 200-250) ఏథెన్సులోని వివిధ ప్రాంతాలలో “పేరులేని బలిపీఠములు” కనిపిస్తాయని వ్రాశాడు.
రోమన్లు కూడా పేరులేని దైవాల కోసం బలిపీఠములను నెలకొల్పారు. ఇక్కడ చూపించబడినది సా.శ.పూ. మొదటి లేదా రెండవ శతాబ్దానికి చెందినది. ఇది ఇటలీలోని రోములో ఉన్న పాలాటైన్ ఆంటిక్వేర్యమ్‌లో భద్రపరచబడి ఉంది. ఈ బలిపీఠం మీద లాటిన్ భాషలో చెక్కబడి ఉన్న మాటలు, అది “ఒక దేవునికి లేదా ఒక దేవతకు” ప్రతిష్ఠించబడిందని సూచిస్తున్నాయి. అది “చెక్కబడిన మాటలలో గానీ సాహిత్యాలలో గానీ ఉండే ప్రార్థనలలో లేదా ప్రతిష్ఠీకరణ సూత్రాల్లో తరచూ కనిపించే” వాక్యము.
“జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు” ఇప్పటికీ చాలామందికి తెలియదు. కానీ పౌలు ఏథెన్సు వాసులకు చెప్పినట్లు ఆ దేవుడు—యెహోవా—“మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.”—అపొస్తలుల కార్యములు 17:24, 26, 27.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
బలిపీఠం: Soprintendenza Archeologica di Roma