కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాస్తవానికి నరకం అంటే ఏమిటి?

వాస్తవానికి నరకం అంటే ఏమిటి?

వాస్తవానికి నరకం అంటే ఏమిటి?

“నరకం” అనగానే మీ మనస్సుకు ఎలాంటి తలంపు వచ్చినప్పటికీ, అధిక శాతం ప్రజలు నరకం అంటే పాపాలకు శిక్ష వేయబడే స్థలం అని భావిస్తారు. పాపాన్ని గురించి, దాని ప్రభావాన్ని గురించి బైబిలు ఇలా చెబుతోంది: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:​12) “పాపమువలన వచ్చు జీతము మరణము” అని కూడా లేఖనాలు నివేదిస్తున్నాయి. (రోమీయులు 6:​23) పాపము చేసినందుకు శిక్ష మరణము కాబట్టి, నరకానికి నిజమైన అర్థం ఏమిటో నిర్ధారించుకోవడానికి మనం అడగవలసిన ప్రాథమిక ప్రశ్న: మనం మరణించినప్పుడు మనకు ఏమి సంభవిస్తుంది?

మరణం తర్వాత ఏదో ఒక రూపంలో మరో విధమైన జీవం కొనసాగుతుందా? నరకం అంటే ఏమిటి, అక్కడికి ఎటువంటి ప్రజలు వెళతారు? నరకంలో ఉన్నవారికి ఏమైనా నిరీక్షణ ఉందా? ఈ ప్రశ్నలకు బైబిలు నిజమైన మరియు సంతృప్తికరమైన సమాధానాలను ఇస్తుంది.

మరణం తర్వాత జీవితం

మన శరీరం మరణించిన తర్వాత మనలో ఉన్న ఆత్మ వంటిది ఏదైనా మరణాన్ని తప్పించుకుంటుందా? మొదటి మానవుడైన ఆదాము జీవాన్ని ఎలా పొందాడో పరిశీలించండి. ‘దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదెను’ అని బైబిలు నివేదిస్తోంది. (ఆదికాండము 2:⁠7) నరుడికి ఒక ఆత్మ ఇవ్వబడలేదని గమనించండి; కాబట్టి, నరుడు సజీవంగా స్పృహగల వ్యక్తిగా ఉండడానికి ఆయనలో ఒక ఆత్మ నివసించాల్సిన అవసరం లేదు. ఊపిరి పీల్చుకోవడం అనే ప్రకియ ఆయన ప్రాణమును నిలిపి ఉంచినా ఆయన నాసికారంధ్రములలోకి “జీవవాయువు” ఊదడంలో కేవలం ఆయన ఊపిరితిత్తులలోకి గాలి ఊదడం కన్నా ఎక్కువే ఇమిడి ఉంది. దేవుడు, ఆదాము యొక్క నిర్జీవ శరీరంలోకి జీవపు నిప్పుకణికను అంటే సమస్త భూప్రాణులలో చురుకుగా పనిచేసే “జీవశక్తి”ని ఊదాడు. (ఆదికాండము 7:⁠22, NW) ఆ జీవశక్తి లేదా జీవపు నిప్పుకణికను విద్యుచ్ఛక్తితో పోల్చవచ్చు. విద్యుచ్ఛక్తి ఒక యంత్రానికి లేదా ఉపకరణానికి శక్తినిచ్చి అది పని చేసేటట్లు చేస్తుంది. విద్యుచ్ఛక్తి ఏ పరికరానికి శక్తినిస్తుందో దాని గుణలక్షణాలను ఎలాగైతే సంతరించుకోదో అలాగే తాను చైతన్యవంతం చేసే జీవి యొక్క ఏ లక్షణాలనూ ఈ జీవశక్తి అవలంబించుకోదు. దానికి వ్యక్తిత్వం గానీ ఆలోచనా సామర్థ్యం గానీ లేదు.

అయితే, కీర్తన 146:4వ వచనంలో ప్రస్తావించబడిన “ప్రాణము” అంటే ఏమిటి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దానికి ఏమి జరుగుతుంది? ఆ వచనంలో ఇలా ఉంది: “వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు; వారి సంకల్పములు నాడే నశించును.” బైబిలు రచయితలు “ప్రాణము” అనే పదాన్ని ఉపయోగించినప్పుడు శరీరం మరణించిన తర్వాత జీవాన్ని కొనసాగించే అశరీరమైన ఆత్మ వారి మనసులో లేదు కానీ మన సృష్టికర్త నుండి వచ్చిన జీవశక్తిని వారు సూచించారు. ఒక వ్యక్తి మరణించినప్పుడు “ప్రాణము” (జీవశక్తి) శరీర కణాలను చైతన్యవంతం చేయడం మానుతుంది, ఆ పూర్తి మనిషి మరణిస్తాడు. (కీర్తనలు 104:​29) మరి, “ఆత్మ దాని దయచేసిన దేవునియొద్దకు మరల పోవును” అని చెబుతున్న ప్రసంగి 12:7వ వచనం భావమేమిటి? ఇక్కడ “ఆత్మ” అన్న పదానికి ఉపయోగించబడిన హీబ్రూ పదం జీవశక్తిని సూచిస్తుంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు అది “దేవునియొద్దకు మరల పోవును” అంటే ఆ వ్యక్తి భవిష్యత్‌ జీవితానికి సంబంధించిన నిరీక్షణ ఇప్పుడు కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉన్నదని అర్థం.

మరి, మరణించిన వారి పరిస్థితి ఏమిటి? ఆదాముకు శిక్ష విధించేటప్పుడు యెహోవా, “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని” చెప్పాడు. (ఆదికాండము 3:​19) దేవుడు ఆదామును నేలమంటితో నిర్మించి ఆయనకు జీవాన్ని ఇవ్వక ముందు ఆదాము ఎక్కడున్నాడు? ఆయన అసలు ఉనికిలోనే లేడు! ఆదాము మరణించినప్పుడు కూడా మళ్ళీ ఉనికిలో లేకుండా పోయాడు. చనిపోయిన వారి పరిస్థితి గురించి ప్రసంగి 9:​5, 10 వచనాల్లో స్పష్టంగా తెలియజేయబడింది, అక్కడ మనం ఇలా చదువుతాం: “చచ్చినవారు ఏమియు ఎరుగరు . . . నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” బైబిలు ప్రకారం, మరణం అంటే ఉనికిలో లేకుండా పోయే స్థితి. మరణించినవారికి ఏమీ తెలియదు, అనుభూతులు ఉండవు, ఆలోచనలు ఉండవు.

నిత్య హింసలా లేక సమాధా?

తమ చుట్టూ ఏమి జరుగుతున్నది తెలుసుకునేందుకు మృతులు ఉనికిలో ఉండరు కనుక, మరణం తర్వాత దుష్టులు బాధించబడే నరకం అని పిలువబడే అగ్నితో కూడిన ప్రదేశం ఉండడం అసంభవం. చనిపోయినవారి ఆత్మలు శిక్షించబడతాయి అని చెప్పబడే నరకం వంటి లోకాన్ని సూచించడానికి ప్రాచీన గ్రీకులు తరచూ ఉపయోగించే హేడిస్‌ అనే పదాన్ని బైబిలు రచయితలు కూడా ఉపయోగించడం వల్ల ఈ గందరగోళం ఏర్పడింది. కొన్ని ప్రాంతాలలో ఈ పదం నరకం అని కూడా అనువదించబడింది. హేడిస్‌ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు బైబిలు రచయితలు ఉద్దేశించినది ఏమిటి? ఈ పదం మన తెలుగు బైబిలులో ఎలా అనువదించబడిందో పరిశీలించడం, ఆ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది. యేసు మరణించిన తర్వాత ఆయనకు ఏమి జరిగిందో బైబిలు రచయిత లూకా ఇలా చెబుతున్నాడు: ‘క్రీస్తు పాతాళములో [గ్రీకులో హేడిస్‌] విడువ బడలేదు, ఆయన శరీరము కుళ్లిపోలేదు.’ * (అపొస్తలుల కార్యములు 2:​31) యేసు వెళ్ళినటువంటి ఈ హేడిస్‌ లేక పాతాళము ఎక్కడ వుంది? అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నాకియ్యబడిన ఉపదేశమును . . . మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.” (1 కొరింథీయులు 15:​3, 4) కాబట్టి యేసు పాతాళములో లేదా హేడిస్‌లో, అంటే సమాధిలో ఉన్నాడు కానీ ఆయన అక్కడ వదిలివేయబడలేదు, మూడవ రోజున ఆయన లేపబడ్డాడు లేదా పునరుత్థానం చేయబడ్డాడు.

ఎంతో బాధను అనుభవించిన నీతిమంతుడైన యోబు విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. తన బాధావస్థనుంచి తప్పించుకోవాలన్న కోరికతో ఆయన ఇలా వేడుకొన్నాడు: ‘నీవు పాతాళములో [హీబ్రూ షియోల్‌, గ్రీకు హేడిస్‌] నన్ను దాచినయెడల ఎంతోమేలు నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలు.’ * (యోబు 14:​13) యోబు, కాపుదల కోసం అగ్నితో మండుతున్న ప్రదేశానికి వెళ్ళాలని కోరుకున్నాడు అని తలంచడం ఎంత అవివేకం! యోబు దృష్టిలో హేడిస్‌ లేక షియోల్‌ అంటే కేవలం పాతాళము లేక సమాధి మాత్రమే, అక్కడ అతని బాధ అంతమవుతుంది. కాబట్టి బైబిలులోని హేడిస్‌ మరియు షియోల్‌, మంచి ప్రజలు చెడు ప్రజలు అందరూ వెళ్ళే మానవజాతి యొక్క సామాన్య సమాధిని సూచిస్తున్నాయి.

నరకాగ్ని​—⁠అంతటినీ దహించివేస్తుందా?

నరకంలోని అగ్ని, అంతటినీ దహించివేయడానికి లేదా పూర్తి నాశనానికి సూచనగా ఉపయోగించబడిందని చెప్పడానికి అవకాశం ఉందా? ప్రకటన 20:13వ వచనంలో అగ్ని అనే పదం ఎలా ఉపయోగించబడిందో గమనించండి, ఆ లేఖనం ఇలా చెబుతోంది: ‘మరణమును మృతుల లోకమును [గ్రీకులో హేడిస్‌] అగ్నిగుండములో పడవేయబడెను.’ ఇక్కడ ప్రస్తావించబడిన “గుండము” సూచనార్థకమైనది ఎందుకంటే అందులో పడవేయబడిన మరణాన్ని, మృతుల లోకాన్ని (హేడిస్‌) అక్షరార్థంగా దహించడం సాధ్యం కాదు. “ఈ అగ్నిగుండము రెండవ మరణము”​—⁠ఈ మరణము నుండి మళ్ళీ జీవాన్ని పొందే నిరీక్షణ లేదు.​—⁠ప్రకటన 20:⁠14.

ఈ అగ్నిగుండము, యేసు మాట్లాడిన “నరకాగ్ని” (గ్రీకులో గెహెన్నా) అనే పదంతో సమానార్థాన్ని కలిగి ఉంది. (మత్తయి 5:​22; మార్కు 9:​47, 48) గెహెన్నా అనే పదం క్రైస్తవ గ్రీకు లేఖనాలలో 12 సార్లు కనిపిస్తుంది, అది యెరూషలేము గోడల బయట ఉన్న హిన్నోము లోయను సూచిస్తుంది. యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఈ లోయ “నేరస్థుల మృతదేహాలు, జంతువుల కళేబరాలు, ప్రతి విధమైన చెత్తాచెదారం పడవేయబడే” చెత్తకుప్పగా ఉపయోగించబడేది. (స్మిత్స్‌ డిక్షనరీ ఆఫ్‌ ద బైబిల్‌) చెత్తను కాల్చడానికి మంటలు ఎప్పుడూ మండుతూనే ఉండేలా గంధకం వేయబడేది. యేసు ఆ లోయను శాశ్వత నాశనాన్ని సూచించడానికి తగిన చిహ్నంగా ఉపయోగించాడు.

గెహెన్నా శాశ్వత నాశనాన్ని సూచించినట్లే అగ్నిగుండము కూడా శాశ్వత నాశనాన్ని సూచిస్తుంది. మానవజాతి పాపము నుండి, మరణం అనే శిక్ష నుండి విడిపించబడినప్పుడు, మరణం మరియు మృతుల లోకము (హేడిస్‌) సమూలంగా నాశనం చేయబడతాయి అని సూచించడానికి అవి అగ్నిగుండములో ‘పడవేయబడతాయి.’ ఇష్టపూర్వకముగా పాపము చేసేవారు, పశ్చాత్తాపపడని పాపులు కూడా ఆ అగ్నిగుండములో “పాలు” పొందుతారు. (ప్రకటన 21:⁠8) వారు కూడా పూర్తిగా నాశనం చేయబడతారు. మరోవైపున, పాతాళములో (హేడిస్‌)​—⁠మానవజాతి యొక్క సాధారణ సమాధిలో​—⁠ఉన్నవారిలో ఎవరైతే దేవుని జ్ఞాపకంలో ఉంటారో వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది!

ఖాళీ చేయబడిన హేడిస్‌!

ప్రకటన 20:13వ వచనం ఇలా చెబుతోంది: ‘సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును [హేడిస్‌] వాటి వశముననున్న మృతుల నప్పగించెను.’ అవును, బైబిలులో చెప్పబడిన హేడిస్‌ ఖాళీ చేయబడుతుంది. యేసు వాగ్దానం చేసినట్లుగా, ‘ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు [యేసు] శబ్దము విని బయటికి వచ్చెదరు.’ (యోహాను 5:​28, 29) వారు ప్రస్తుతం ఏ రూపంలోనూ ఉనికిలో లేనప్పటికీ, యెహోవా దేవుని జ్ఞాపకంలో ఉన్న లక్షలాది మృతులు పునఃస్థాపించబడిన భూ పరదైసులోకి పునరుత్థానం చేయబడతారు లేదా తిరిగి జీవానికి తీసుకురాబడతారు.​—⁠లూకా 23:​43; అపొస్తలుల కార్యములు 24:⁠14, 15.

దేవుని నూతన లోకంలోకి పునరుత్థానం చేయబడిన మానవులు ఆయన నీతియుక్త నియమాలకు విధేయత చూపితే వారు మళ్ళీ ఎన్నడూ మరణించవలసిన అవసరం ఉండదు. (యెషయా 25:⁠8) యెహోవా “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” నిజానికి, అప్పటికి ‘మొదటి సంగతులు గతించిపోయి ఉంటాయి.’ (ప్రకటన 21:⁠4) పాతాళములో (హేడిస్‌లో)​—⁠“సమాధులలో”⁠—⁠ఉన్నవారికి ఎంత ఆనందకరమైన నిరీక్షణో కదా! యెహోవా గురించీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించీ మరింత జ్ఞానమును సంపాదించుకోవడానికి ఈ నిరీక్షణ మంచి కారణాన్ని ఇస్తుంది.​—⁠యోహాను 17:3.

[అధస్సూచీలు]

^ పేరా 9 క్రైస్తవ గ్రీకు లేఖనాలలో పది సార్లు కనిపించే హేడిస్‌ అనే గ్రీకు పదం మన తెలుగు బైబిలులో ఒక్కచోట తప్ప మిగతాచోట్ల “పాతాళము” అని అనువదించబడింది. లూకా 16:​19-31 వచనాల్లోని తెలుగు అనువాదం, పాతాళములో ఉండే హింసల గురించి కూడా పేర్కొంటోంది, కానీ ఆ నివేదిక అంతటికీ సూచనార్థకమైన భావం ఉంది. యెహోవాసాక్షులు ప్రచురించిన జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకంలోని 88వ అధ్యాయం చూడండి.

^ పేరా 10 హీబ్రూ పదమైన షియోల్‌ మూల హీబ్రూ లేఖనాలలో 65 సార్లు కనబడుతుంది. అది తెలుగు బైబిలులో “పాతాళము” “మృతుల లోకం” మరియు “సమాధి” అని అనువదించబడింది.

[5వ పేజీలోని చిత్రం]

యోబు పాతాళములో కాపుదల కోసం ప్రార్థించాడు

[6వ పేజీలోని చిత్రం]

అగ్నితో కూడిన నరకం​—⁠శాశ్వత నాశనానికి సూచన

[7వ పేజీలోని చిత్రం]

‘సమాధులలో నున్నవారందరు బయటికి వచ్చెదరు’