కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“దేవుని గొప్పకార్యముల” చేత పురికొల్పబడ్డారు

“దేవుని గొప్పకార్యముల” చేత పురికొల్పబడ్డారు

“దేవుని గొప్పకార్యముల” చేత పురికొల్పబడ్డారు

‘వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నాము.’​—⁠అపొస్తలుల కార్యములు 2:​11.

1, 2.యెరూషలేములో సా.శ. 33 పెంతెకొస్తు దినమున ఏ అద్భుతం జరిగింది?

స్త్రీపురుషులున్న యేసుక్రీస్తు శిష్యుల గుంపొకటి సా.శ. 33వ సంవత్సరంలోని వసంతకాలపు చివర్లోని ఒక ఉదయం యెరూషలేములో ఒక మేడగదిలో కూడి ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ‘వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతా నిండింది. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు వారికి కనబడ్డాయి, అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై అన్యభాషలతో మాటలాడసాగారు.’​—⁠అపొస్తలుల కార్యములు 2:​2-4, 15.

2 ఆ ఇంటి ముందు గొప్ప జనసమూహము సమావేశమయ్యింది. వారిలో ప్రతి జనములో నుండి వచ్చిన “భక్తిగల” యూదులున్నారు, వారు పెంతెకొస్తు పండుగ చేసుకోవడానికి యెరూషలేముకు వచ్చారు. వారిలోని ప్రతి ఒక్కరు, యేసు శిష్యులు తమ భాషలో “దేవుని గొప్పకార్యముల” గురించి మాట్లాడడం విని విభ్రాంతినొందారు. మాట్లాడే వాళ్ళందరూ గలిలయులే అయినప్పుడు అదెలా సాధ్యం?​—⁠అపొస్తలుల కార్యములు 2:​5-8, 11.

3.అపొస్తలుడైన పేతురు పెంతెకొస్తు దినమున జనసమూహానికి ఏ సందేశాన్ని ఇచ్చాడు?

3 ఆ గలిలయుల్లో ఒకరు అపొస్తలుడైన పేతురు. కొన్ని వారాల క్రితమే అనీతిమంతుల చేతుల్లో యేసుక్రీస్తు చంపబడ్డాడని ఆయన వివరించాడు. అయినప్పటికీ దేవుడు తన కుమారుణ్ణి మృతులలో నుండి లేపాడు. అటు తర్వాత యేసు, పేతురుకు అక్కడ హాజరైవున్న ఇతరులతోపాటు అనేకమంది తన శిష్యులకు కనిపించాడు. కేవలం పదిరోజుల క్రితమే యేసు పరలోకానికి ఆరోహణమయ్యాడు. తన శిష్యుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించింది ఆయనే. దీనిలో పెంతెకొస్తు పండుగ జరుపుకునే వారి కోసం ఏమైనా సూచనార్థముందా? నిజంగానే ఉంది. తమ పాపాలకు క్షమాపణను పొందడానికీ ఆయనపై విశ్వాసం ఉంచినట్లైతే “పరిశుద్ధాత్మ అను వరము”ను పొందడానికీ యేసు మరణం వారి కోసం మార్గాన్ని సిద్ధం చేసింది. (అపొస్తలుల కార్యములు 2:​22-24, 32, 33, 38) అక్కడికి వచ్చినవారు తాము విన్న ‘దేవుని గొప్పకార్యములకు’ ఎలా స్పందించారు? ఈ వృత్తాంతం యెహోవాకు మనం చేస్తున్న సేవను బేరీజు వేసుకోవడానికి ఏ విధంగా సహాయపడగలదు?

కార్యసాధనకు కదిలించబడ్డారు!

4.సా.శ. 33 పెంతెకొస్తు దినమున నెరవేరిన యోవేలు ప్రవచనం ఏది?

4 పరిశుద్ధాత్మను పొందిన యెరూషలేములోని శిష్యులు సువార్తను ఇతరులతో పంచుకోవడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు, ఆ ఉదయం అక్కడ కూడిన జనసమూహంతో వెంటనే పంచుకోవడం ప్రారంభించారు. వారి ప్రకటనా పని విశిష్టమైన ఒక ప్రవచనాన్ని నెరవేర్చింది, ఎనిమిది శతాబ్దాలకు ముందు పెతూయేలు కుమారుడు యోవేలు చేత అది నమోదు చేయబడింది: ‘యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు, నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును.’​—⁠యోవేలు 1:⁠1; 2:​28, 29, 31; అపొస్తలుల కార్యములు 2:​17, 18, 20.

5.మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏ విధంగా ప్రవచించారు? (అధస్సూచి చూడండి.)

5 అంటే దేవుడు దావీదు, యోవేలు, దెబోరాల వంటి స్త్రీ పురుషులున్న ప్రవక్తల ఒక తరాన్ని లేవనెత్తి, భవిష్యత్‌ సంఘటనలను చెప్పడానికి వారిని ఉపయోగించుకుంటాడని దానర్థమా? కాదు. క్రైస్తవ ‘కుమారులు, కుమార్తెలు, పనివారు, పనికత్తెలు’ ప్రవచిస్తారు అంటే, యెహోవా ఇప్పటివరకు చేసిన “గొప్పకార్యములను,” ఇకముందు చేయబోయే “గొప్పకార్యములను” ప్రకటించడానికి యెహోవా పరిశుద్ధాత్మ చేత వారు పురిగొల్పబడతారు. ఆ విధంగా వారు సర్వోన్నతుని తరఫున మాట్లాడే ప్రతినిధులుగా సేవ చేస్తారు. * అయితే, ఆ జనసమూహం ఎలా ప్రతిస్పందించింది?​—⁠హెబ్రీయులు 1:⁠1, 2.

6.పేతురు ప్రసంగం విన్న తర్వాత జనసమూహంలోని అనేకమంది ఏమి చేయడానికి కదిలించబడ్డారు?

6 పేతురు చెప్పిన వివరణను విన్న తర్వాత జనసమూహంలోని అనేకమంది చర్య తీసుకోవడానికి పురిగొల్పబడ్డారు. “అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి; ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి.” (అపొస్తలుల కార్యములు 2:​41) యూదులుగా యూదామత ప్రవిష్టులుగా వారికి అప్పటికే లేఖనాల గురించిన ప్రాథమిక పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానం, పేతురు నుండి తాము తెలుసుకున్న దానిపై విశ్వాసంతో జత కలిసిన తర్వాత “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములో” వారు బాప్తిస్మం పొందడానికి అది ఆధారాన్నిచ్చింది. (మత్తయి 28:​19) బాప్తిస్మం పొందిన తర్వాత వారు ‘అపొస్తలుల బోధయందు ఎడతెగక ఉన్నారు.’ అదే సమయంలో, తాము క్రొత్తగా పొందిన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడం ప్రారంభించారు. నిజంగానే ‘వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, . . . దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందారు.’ వారలా సాక్ష్యమిచ్చినదానికి ఫలితంగా ‘ప్రభువు [“యెహోవా,” NW] రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.’ (అపొస్తలుల కార్యములు 2:​42, 46, 47) ఈ క్రొత్త విశ్వాసులు నివసించిన అనేక ప్రాంతాల్లో క్రైస్తవ సంఘాలు రూపొందాయి. ఈ పెరుగుదల కనీసం కొంతమేరకు వారు తమ ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత ఆసక్తితో సువార్తను ప్రకటించడానికి చేసిన ప్రయత్నాల ఫలితం అనడంలో సందేహం లేదు.​—⁠కొలొస్సయులు 1:​23.

దేవుని వాక్యం బలమైనది

7.(ఎ)నేడు అన్ని దేశాల ప్రజలను యెహోవా సంస్థ వైపు ఏది ఆకర్షిస్తోంది? (బి) ప్రపంచవ్యాప్తంగానూ స్థానికంగానూ ఇంకా అభివృద్ధి చెందడానికి గల ఎలాంటి అవకాశాలను మీరు చూస్తున్నారు? (అధస్సూచిని చూడండి.)

7 నేడు దేవుని సేవకులవ్వాలని కోరుకునేవారి విషయమేమిటి? వారు కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అలా చేస్తుండగా వారు యెహోవాను “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల” దేవుడిగా తెలుసుకుంటారు. (నిర్గమకాండము 34:⁠6; అపొస్తలుల కార్యములు 13:​48) యెహోవా యేసుక్రీస్తు ద్వారా చేసిన విమోచన క్రయధనమనే దయాపూర్వక ఏర్పాటు గురించి వారు తెలుసుకుంటారు, యేసు చిందించిన రక్తం పాపమంతటి నుండి వారిని పవిత్రులనుగా చేయగలదు. (1 యోహాను 1:⁠7) ‘నీతిమంతులను అనీతిమంతులను పునరుత్థానము’ చేయాలన్న దేవుని సంకల్పం గురించి తెలుసుకోవడం వల్ల కూడా వారు కృతజ్ఞులై ఉంటారు. (అపొస్తలుల కార్యములు 24:​14, 15) ఈ “గొప్పకార్యముల” మూలకారకునిపై వారి హృదయాలు ప్రేమతో నిండిపోయి, ఈ అమూల్యమైన సత్యాలను ప్రకటించడానికి వారు ప్రేరేపించబడతారు. అప్పుడు వారు, సమర్పించుకొని బాప్తిస్మం పొందిన దేవుని సేవకులుగా “దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు” కొనసాగుతారు. *​—⁠కొలొస్సయులు 1:​9-12; 2 కొరింథీయులు 5:​14.

8-10.(ఎ)దేవుని వాక్యం ‘బలముగలది’ అని ఒక క్రైస్తవ స్త్రీ అనుభవం ఎలా రుజువు చేస్తోంది? (బి) ఈ అనుభవం మీకు యెహోవా గురించీ ఆయన తన సేవకులతో వ్యవహరించే విధానం గురించీ ఏమి నేర్పించింది? (నిర్గమకాండము 4:​12)

8 దేవుని సేవకులు తమ బైబిలు అధ్యయనం ద్వారా పొందే పరిజ్ఞానం, పై పై జ్ఞానం కాదు. ఆ పరిజ్ఞానం వారి హృదయాలను పురిగొల్పుతుంది, వారి ఆలోచనా ధోరణిని మారుస్తుంది చివరికది వారిలోనే ఇంకిపోతుంది. (హెబ్రీయులు 4:​12) ఉదాహరణకు కమీల్‌ అనే ఒక స్త్రీ, వృద్ధుల బాగోగులను చూసుకునే ఉద్యోగం చేస్తోంది. ఆమె అలా చూసుకుంటున్నవారిలో ఒకరు మార్త, ఆమె ఒక యెహోవాసాక్షి. మార్త, డెమెన్‌షియాకు (మెదడుకు సంబంధించిన ఒక వ్యాధికి) చాలా తీవ్రంగా గురైంది కాబట్టి, ఆమెకు అన్నివేళలా పర్యవేక్షణ అవసరం ఉండేది. ఆమెను తినమనీ చివరికి నోట్లోని ఆహారాన్ని మింగమని కూడా ఆమెకు జ్ఞాపకం చేయాల్సివచ్చేది. అయితే, ఒక విషయం మార్త మనస్సులో శాశ్వతంగా ఉండిపోయింది, దాన్ని మనం చూద్దాం.

9 ఒకరోజు కమీల్‌ తన వ్యక్తిగత సమస్యల ఒత్తిడి కారణంగా ఏడుస్తుంటే మార్త చూసింది. అప్పుడు మార్త, కమీల్‌ భుజాల చుట్టూ తన చేతులను వేసి ఆమెతో బైబిలు అధ్యయనం చేస్తానని ఆమెను ఆహ్వానించింది. కానీ మార్త పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎవరైనా బైబిలు అధ్యయనం నిర్వహించగలరా? అవును, ఆమె నిర్వహించగలదు! ఆమె తన జ్ఞాపకశక్తిని చాలామట్టుకు కోల్పోయినప్పటికీ మార్త తన గొప్ప దేవుణ్ణీ మరచిపోలేదు, బైబిలు నుండి తాను నేర్చుకున్న అమూల్యమైన సత్యాలనూ మరచిపోలేదు. మార్త అధ్యయనం చేసేటప్పుడు, ప్రతీ పేరాను చదవమనీ పేర్కొన్న లేఖనాలను చూడమనీ పేజి దిగువభాగాన ఉన్న ప్రశ్నను చదివి జవాబు ఇవ్వమనీ కమీల్‌ను నిర్దేశించేది. అలా కొంతకాలం కొనసాగింది, మార్తకు పరిమితులు ఉన్నప్పటికీ కమీల్‌ బైబిలు పరిజ్ఞానంలో అభివృద్ధి చెందింది. దేవుణ్ణి సేవించాలనే ఆసక్తిగల ఇతరులతో కమీల్‌ సహవాసం చేయాల్సిన అవసరం ఉందని మార్త గ్రహించింది. ఆ ఉద్దేశంతో మార్త, తన విద్యార్థిని రాజ్య మందిరంలో మొదటిసారి కూటమికి హాజరైనప్పుడు తగినట్లు వస్త్రాలు ధరించుకోవాలని, ఒక డ్రెస్సునూ ఒక జత చెప్పులనూ కమీల్‌కు ఇచ్చింది.

10 మార్త చూపించిన ప్రేమపూర్వక శ్రద్ధకూ మాదిరికీ దృఢవిశ్వాసానికీ కమీల్‌ చలించిపోయింది. మార్త తను లేఖనాల నుండి నేర్చుకున్నవి తప్ప దాదాపు అన్నీ మరచిపోయింది కాబట్టి, ఆమె తనకు బైబిలు నుండి నేర్పించడానికి ప్రయత్నిస్తున్నది చాలా ప్రాముఖ్యమైనదనే నిర్ధారణకు కమీల్‌ వచ్చింది. ఆ తర్వాత కమీల్‌ మరొక చోటికి బదిలీ అయినప్పుడు, అది తను చర్య తీసుకోవాల్సిన సమయమని గ్రహించింది. అవకాశం దొరకగానే ఆమె ఒక రాజ్య మందిరానికి వెళ్ళి బైబిలు అధ్యయనం కావాలని అడిగింది, ఆమె అప్పుడు మార్త ఇచ్చిన డ్రెస్సునూ చెప్పులనూ ధరించింది. కమీల్‌ త్వరలోనే చక్కని ప్రగతి సాధించి బాప్తిస్మం పొందింది.

యెహోవా ప్రమాణాలను ప్రతిఫలింపజేయడానికి పురికొల్పబడ్డారు

11.మనం రాజ్య సందేశం చేత పురిగొల్పబడ్డామని ప్రకటనా పనిలో ఆసక్తిగా ఉండడంతోపాటు ఇంకా ఏ విధంగా చూపించవచ్చు?

11 నేడు 60 లక్షల కంటే ఎక్కువమంది యెహోవాసాక్షులు మార్తలాగే​—⁠ఇప్పుడు కమీల్‌లాగా​—⁠ప్రపంచవ్యాప్తంగా “రాజ్య సువార్త”ను ప్రకటిస్తున్నారు. (మత్తయి 24:​14; 28:​19, 20) మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే వీరు కూడా “దేవుని గొప్పకార్యముల” చేత ఎంతో ప్రేరేపించబడ్డారు. వారు యెహోవా పేరును ధరించే ఆధిక్యతను పొందినందుకూ ఆయన తమపై తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నందుకూ కృతజ్ఞులై ఉంటారు. తత్ఫలితంగా, వారు తమ జీవితంలోని ప్రతి విషయంలోనూ యెహోవా ప్రమాణాలను అన్వయించుకుంటూ ‘అన్ని విషయములలో ప్రభువును [యెహోవాను] సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనడానికి’ అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. దీనిలో ఇతర విషయాలతో పాటు వస్త్రాలంకరణ కేశాలంకరణలకు సంబంధించిన దేవుని ప్రమాణాలను గౌరవించడం కూడా ఉంది.​—⁠కొలొస్సయులు 1:​9-12; తీతు 2:​9, 10.

12.వస్త్రాలంకరణ, కేశాలంకరణకు సంబంధించి 1 తిమోతి 2:​9, 10 లో మనకు ఎలాంటి నిర్దిష్టమైన సలహా కనబడుతుంది?

12 అవును, మనం ఎలా కనబడాలనే విషయంలో యెహోవా ప్రమాణాలను ఏర్పరిచాడు. ఈ విషయానికి సంబంధించి దేవుడు కోరే కొన్నింటిని అపొస్తలుడైన పౌలు సూచించాడు. ‘స్త్రీలు అణకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.’ * ఈ మాటల నుండి మనం ఏమి నేర్చుకుంటాం?​—⁠1 తిమోతి 2:​9, 10.

13.(ఎ)‘తగుమాత్రపు వస్త్రములు’ అంటే అర్థమేమిటి? (బి) యెహోవా ప్రమాణాలు సహేతుకమైనవని మనం ఎందుకు చెప్పవచ్చు?

13 క్రైస్తవులు “తగుమాత్రపు వస్త్రముల”ను ధరించాలని పౌలు మాటలు చూపిస్తున్నాయి. వారు మురికిగా, అపరిశుభ్రంగా లేదా చింపిరిగా కనబడకూడదు. ప్రతి ఒక్కరూ చివరికి పేదవారైనా సరే తమ బట్టలు చక్కగా శుభ్రంగా మాన్యమైనవిగా ఉండేలా జాగ్రత్తపడడం ద్వారా ఇలాంటి సహేతుకమైన ప్రమాణాలను పాటించగలుగుతారు. ఉదాహరణకు, దక్షిణ అమెరికాలోని ఒక దేశంలో ఉన్న సాక్షులు ప్రతి సంవత్సరం తమ జిల్లా సమావేశానికి హాజరవడానికి అనేక కిలోమీటర్లు అడవి గుండా నడిచి, ఆ తర్వాత తెడ్లపడవలో గంటల కొలది ప్రయాణం చేస్తారు. అలా చేసే ప్రయాణంలో ఎవరైనా నీటిలో పడిపోవడం లేదా ముళ్ళకంపలకు తట్టుకొని బట్టలు చినగడం సర్వసాధారణం. కాబట్టి అలా సమావేశానికి బయల్దేరినవారు సమావేశ స్థలానికి చేరుకునేసరికి తరచుగా కాస్త అపరిశుభ్రంగా కనిపిస్తారు. అందుకే వారు కాస్త సమయం తీసుకొని ఊడిపోయిన గుండీలను కుట్టుకోవడం జిప్పులను సరిచేసుకోవడం సమావేశంలో ధరించబోయే బట్టలను ఉతుక్కొని ఇస్త్రీ చేసుకోవడం లాంటివి చేస్తారు. వారు యెహోవా బల్ల దగ్గర భోజనం చేయడానికి తమకు అందిన ఆహ్వానాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతారు, అందుకే వారు దానికి తగినట్లు బట్టలను ధరించాలనుకుంటారు.

14.(ఎ)వస్త్రధారణ ‘అణకువతోను స్వస్థబుద్ధితోను’ ఉండడమంటే దాని అర్థం ఏమిటి? (బి) మనం ‘దైవభక్తిగల ప్రజలమని’ వ్యక్తమయ్యే విధంగా బట్టలు ధరించుకోవడంలో ఏమి ఇమిడివుంది?

14 మన వస్త్రధారణ ‘అణకువతోను స్వస్థబుద్ధితోను’ ఉండాలని కూడా పౌలు సూచించాడు. దానర్థం మన వస్త్రధారణ ఆడంబరంగా, అనాగరికంగా, రెచ్చగొడుతున్నట్లుగా, అంగ ప్రదర్శన చేస్తున్నట్లుగా, లేదా అతి ఫ్యాషన్‌గా కనబడకూడదు. అంతేగాక “దైవభక్తి” వ్యక్తమయ్యే విధంగా మన వస్త్రధారణ ఉండాలి. ఇది మనం ఆలోచించాల్సిన విషయం, కాదంటారా? ఇది కేవలం సంఘ కూటాలకు హాజరైనప్పుడు సరైన బట్టలు వేసుకోవడం, మిగతా సమయాల్లో సూచనలన్నింటినీ గాలికి వదిలేయడం కాదు. మనం కనబడే తీరు ఎల్లప్పుడూ భక్తి గౌరవాలను వ్యక్తం చేయాలి, ఎందుకంటే మనం రోజులోని 24 గంటలూ క్రైస్తవులమే, పరిచారకులమే. మన పని బట్టలూ, స్కూలు బట్టలూ సందర్భానికి తగినట్టుగా ఉండాలన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఆ సందర్భాల్లో కూడా మన బట్టలు చక్కగా గౌరవప్రదంగా ఉండాలి. మన వస్త్రధారణ దేవునిపై మనకున్న విశ్వాసాన్ని అన్ని సమయాల్లోనూ ప్రతిఫలిస్తున్నట్లయితే మనం కనబడే తీరును బట్టి సిగ్గుపడుతూ అనియత సాక్ష్యం ఇవ్వలేమని ఎప్పుడూ భావించము.​—⁠1 పేతురు 3:​15, 16.

‘ఈ లోకమును ప్రేమింపకుడి’

15, 16.(ఎ)వస్త్రధారణ, కేశాలంకరణల విషయాల్లో మనం ఈ లోకాన్ని అనుకరించకుండా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? (1 యోహాను 5:​19) (బి) వస్త్రధారణ, కేశాలంకరణల వ్యామోహం నుండి మనల్ని దూరంగా ఉంచే ఆచరణాత్మకమైన కారణం ఏమిటి?

15మొదటి యోహాను 2:​15, 16 లో నమోదు చేయబడిన ఉపదేశం కూడా మన వస్త్రధారణ కేశాలంకరణల ఎంపిక విషయంలో మార్గదర్శకాన్నిస్తోంది. అక్కడ మనమిలా చదువుతాం: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.”

16 ఆ ఉపదేశము ఎంత సమయోచితమైనది! తోటివారి ఒత్తిడి అతి తీవ్రంగా ఉన్న ఈ కాలంలో, అలంకరణ విషయంలో ఈ లోకం మనల్ని ఆదేశించడానికి అస్సలు అనుమతించకూడదు. ఇటీవలి సంవత్సరాల్లో బట్టల తీరూ కేశాలంకరణ తీరూ చాలా దిగజారిపోయింది. వ్యాపారవేత్తల, వృత్తి చేసుకునేవారి బట్టల తీరు కూడా క్రైస్తవులకు ఎల్లప్పుడూ ఆధారపడదగిన సరైన ప్రమాణాన్ని అందించదు. మనం దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవిస్తూ తద్వారా ‘అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించుకోవాలంటే’ మనం ‘ఈ లోక మర్యాదను అనుసరించకుండా’ ఉండాల్సిన అవసరం గురించి ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండడానికి ఇది మరొక కారణం.​—⁠రోమీయులు 12:⁠2; తీతు 2:​9, 10.

17.(ఎ)బట్టలు కొనుక్కునేటప్పుడు గానీ ఏదైనా ఒక స్టైలును ఎంపిక చేసుకునేటప్పుడు గానీ మనం ఏ ప్రశ్నలను పరిశీలించాలి? (బి) తమ కుటుంబ సభ్యులు కనబడే తీరుపై కుటుంబ శిరస్సులు ఎందుకు శ్రద్ధ చూపాలి?

17 ఏదైనా ఒక స్టైలున్న బట్టలను కొనాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ముందు, ‘ఈ స్టైలు నాకు ఎందుకు ఆకర్షణీయంగా కనబడుతోంది? ఇది ఎవరైనా నాకు బాగా నచ్చిన మనోరంజకునివల్ల ప్రసిద్ధి చెందినదా? ఇది ఏదైనా వీధి మూకకు చెందినవారిని గానీ స్వతంత్రాన్ని, తిరుగుబాటు స్ఫూర్తిని పురిగొలిపే గుంపును గానీ సూచిస్తోందా?’ అని ప్రశ్నించుకోవడం వివేకవంతమైనది. మనం ఆ బట్టలను పరిశీలనగా కూడా చూడాలి. అది డ్రెస్సు గానీ స్కర్టు గానీ అయితే అదెంత పొడవుంది? దాని ఆకృతి ఎలా ఉంది? అది నిరాడంబరంగా సముచితంగా మర్యాదకరంగా ఉందా లేక ఒంటికి అతుక్కున్నట్లు టైటుగా రెచ్చగొట్టేలా అస్తవ్యస్తంగా ఉందా? మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను దీన్ని ధరించడం అభ్యంతరకరంగా ఉంటుందా?’ (2 కొరింథీయులు 6:​3, 4, 8-10) మనం అలా ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే “క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు” అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 15:⁠3) క్రైస్తవ కుటుంబ శిరస్సులు తమ కుటుంబ సభ్యులు ఎలా కనబడాలనే విషయంలో తప్పకుండా శ్రద్ధ చూపాలి. కుటుంబ శిరస్సులు తాము ఆరాధించే మహిమాన్విత దేవునిపై గౌరవంతో స్థిరమైన, ప్రేమపూర్వకమైన ఉపదేశాన్ని అవసరమైనప్పుడు ఇవ్వడానికి వెనకాడకూడదు.​—⁠యాకోబు 3:​13.

18.మీ వస్త్రధారణ, కేశాలంకరణల విషయంలో జాగ్రత్తగా ఉండేందుకు మిమ్మల్ని ఏది ప్రేరేపిస్తుంది?

18 మనం అందించే సందేశం, గౌరవానికీ పరిశుద్ధతకూ విలక్షణ మాదిరి అయిన యెహోవా నుండి వచ్చినది. (యెషయా 6:⁠3) “ప్రియులైన పిల్లలవలె” ఆయనను అనుసరించమని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది. (ఎఫెసీయులు 5:⁠1) మన వస్త్రధారణ, కేశాలంకరణ మన పరలోకపు తండ్రికి అటు మంచిపేరైనా ఇటు చెడ్డపేరైనా తీసుకురాగలవు. మనం ఆయన హృదయాన్ని సంతోషపరచాలని తప్పకుండా కోరుకుంటాం!​—⁠సామెతలు 27:​11.

19.“దేవుని గొప్పకార్యములను” ఇతరులకు తెలియజేయడంవల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి?

19 మీరు నేర్చుకున్న “దేవుని గొప్పకార్యముల” గురించి మీరెలా భావిస్తున్నారు? నిజానికి, మనం సత్యం నేర్చుకున్నందుకు ఎంత కృతజ్ఞతతో ఉండాలి! యేసుక్రీస్తు ఒలికించిన రక్తంపై విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపాలకు క్షమాపణ పొందాము. (అపొస్తలుల కార్యములు 2:​38) తత్ఫలితంగా దేవుని ఎదుట మాట్లాడేందుకు మనకు స్వేచ్ఛ ఉంది. నిరీక్షణ లేనివారు భయపడేటట్లు మనం మరణమంటే భయపడం. బదులుగా ‘ఒక కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని బయటికి వచ్చెదరు’ అనే యేసు ఇచ్చిన హామీ మనకు ఉంది. (యోహాను 5:​28, 29) యెహోవా ఇవన్నీ మనకు దయతో బయలుపరుస్తున్నాడు. అంతేకాదు ఆయన తన ఆత్మను మనపై కుమ్మరించాడు. కాబట్టి, మనం ఈ మంచి కానుకలన్నీ పొందినందుకు చూపించే కృతజ్ఞత, ఆయన ఉన్నతమైన ప్రమాణాలను గౌరవించడానికీ ఈ “గొప్పకార్యములను” ఇతరులకు ప్రకటిస్తూ ఆసక్తితో ఆయనను స్తుతించడానికీ మనల్ని కదిలించాలి.

[అధస్సూచీలు]

^ పేరా 5 యెహోవా తన ప్రజల తరఫున ఫరోతో మాట్లాడడానికి మోషే అహరోనులను నియమించినప్పుడు ఆయన మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును.” (ఇటాలిక్కులు మావి.) (నిర్గమకాండము 7:1) అహరోను ఒక ప్రవక్తగా సేవ చేశాడు, అంటే భవిష్యత్‌ సంఘటనలను చెప్పడం ద్వారా కాదుగానీ, మోషే తరఫున మాట్లాడేవ్యక్తిగా అలా సేవచేశాడు.

^ పేరా 7 2002, మార్చి 28న ప్రభువురాత్రి భోజన వార్షిక ఆచరణకు హాజరైన బహుళ సంఖ్యలోని ప్రజల్లో లక్షలమంది ఇంకా యెహోవాను చురుగ్గా సేవించడం లేదు. ఆసక్తిగల వీరిలో అనేకమంది, సువార్త ప్రచారకులుగా ఉండే ఆధిక్యతకు అవసరమైన అర్హతలను పొందడానికి వారి హృదయాలు త్వరలోనే కదిలించబడాలని ప్రార్థిస్తున్నాం.

^ పేరా 12 పౌలు మాటలు క్రైస్తవ స్త్రీలను సంబోధించి చెప్పినవైనప్పటికీ క్రైస్తవ పురుషులకు, యువతకు కూడా అవే సూత్రాలు వర్తిస్తాయి.

మీరెలా జవాబిస్తారు?

• సా.శ. 33 పెంతెకొస్తు దినమున ప్రజలు ఏ “గొప్పకార్యముల” గురించి విన్నారు, వాటికి వారెలా ప్రతిస్పందించారు?

• ఒక వ్యక్తి యేసుక్రీస్తు శిష్యుడు ఎలా అవుతాడు? శిష్యరికంలో ఏమి ఉంది?

• మన వస్త్రధారణ, కేశాలంకరణలపై మనం శ్రద్ధ చూపించడం ఎందుకు ఆవశ్యకం?

• ఒక డ్రెస్సుగానీ స్టైలుగానీ సరైనదా కాదా అని నిర్ణయించుకోవడానికి ముందు ఏ విషయాలను ఆలోచించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

యేసు మృతులలో నుండి లేపబడ్డాడని పేతురు ప్రకటించాడు

[17వ పేజీలోని చిత్రాలు]

మీరు కనబడే తీరు మీరు ఆరాధించే దేవునికి మంచిపేరు తెస్తుందా?

[18వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవ తల్లిదండ్రులు తమ కుటుంబ సభ్యులు కనిపించే తీరుపై తప్పకుండా శ్రద్ధ చూపాలి