కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘దేవుని వాక్యము శక్తి గలది’

‘దేవుని వాక్యము శక్తి గలది’

రా జ్య ప్ర చా ర కు ల ని వే ది క

‘దేవుని వాక్యము శక్తి గలది’

జమైకాలోని సూర్యకాంతితో ప్రకాశవంతంగా ఉండే కరేబియన్‌ దీవిలో నివసించే ప్రజలలో అధికశాతం మంది బైబిలుతో పరిచయం ఉన్నవారే. నిజానికి ప్రతి ఇంటిలోనూ కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ బైబిలు కనిపిస్తుంది, ‘దేవుని వాక్యము సజీవమైనది, శక్తి గలది’ అన్న వాస్తవాన్ని కొంతమంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కూడా. (హెబ్రీయులు 4:​12, NW) ఈ శక్తి జీవితాలను మార్చగలదని ఈ క్రింద ఇవ్వబడిన అనుభవం ఉదాహరిస్తుంది.

క్లీవ్‌లాండ్‌ అనే పేరుగల వ్యక్తి పని నుండి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే యెహోవాసాక్షుల్లో ఒకరు అతనిని సందర్శించారు. లేఖనాలనుండి కొన్ని విషయాలను పంచుకున్న తర్వాత, ఆ సాక్షి బైబిలు అధ్యయన సహాయకమైన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని ఆయనకు ఇచ్చి వెళ్ళాడు. దేవుని వాక్యం తన జీవితంపై ఎంత శక్తిని చూపగలదో క్లీవ్‌లాండ్‌ ఆ సమయంలో గ్రహించలేదు.

దేవుణ్ణి ఆరాధించడానికి సరైన విధానాన్ని కనుగొనడానికి తనకు సహాయం చేయమని క్లీవ్‌లాండ్‌ రోజుకు మూడుసార్లు దేవునికి ప్రార్థించేవాడు. తన తల్లిదండ్రులు చేస్తున్న ఆరాధన సరైనది కాదని క్లీవ్‌లాండ్‌కు రూఢిగా తెలుసు, కానీ ఇతర మతాలను పరిశీలించిన తర్వాత ఆయన నిరుత్సాహపడిపోయాడు. ఆయన యెహోవాసాక్షుల గురించి వినినప్పటికీ వారి దగ్గర సత్యము ఉందో లేదోనని సందేహించాడు. ఆయన తనకున్న సందేహాన్ని బట్టి వెనకాడినప్పటికీ తనను సందర్శించిన సాక్షితో బైబిలు అధ్యయనం చేయడానికి క్లీవ్‌లాండ్‌ అంగీకరించాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన సాక్షుల మతం తప్పని నిరూపించాలనుకున్నాడు!

ఇద్దరు స్త్రీలతో తనకున్న అనైతిక సంబంధాలు దేవునికి అప్రీతికరమని క్లీవ్‌లాండ్‌ త్వరలోనే నేర్చుకున్నాడు. (1 కొరింథీయులు 6:​9, 10) కేవలం రెండు అధ్యయనాల తర్వాత, ఆ స్త్రీలతో తనకున్న సంబంధాలను తెంచుకోవడానికి ఆయన ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. రాజ్యమందిరంలోని క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం కూడా ప్రారంభించాడు. కానీ ఇది ఆయన ముందు ఇంకొక పరీక్షను ఉంచింది.

క్లీవ్‌లాండ్‌ తన సమాజంలోని సాక్కర్‌ టీమ్‌లో చురుకైన సభ్యుడు, కానీ ఆ ఆటలు ఆయన కూటాలకు హాజరవ్వకుండా ఆటంకపరిచేవి. ఆయన ఏమి చేశాడు? తన టీమ్‌మేట్‌లనుండి కోచ్‌నుండి స్నేహితులనుండి విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పటికీ క్లీవ్‌లాండ్‌ సాక్కర్‌ టీమ్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అవును, దేవుని వాక్యము ఆయనపై తన శక్తిని చూపడం ప్రారంభించింది, ఆయన ప్రయోజనం పొందగలిగేలా ఆయనను ప్రభావితం చేసింది!

క్లీవ్‌లాండ్‌ తన బైబిలు జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం మొదలుపెట్టినప్పుడు దేవుని వాక్యానికున్న శక్తి మళ్ళీ ప్రదర్శితమైంది. (అపొస్తలుల కార్యములు 1:⁠8) దాని ఫలితంగా, ఆయన మాజీ టీమ్‌లోని ఇద్దరు సభ్యులు యెహోవాసాక్షుల కూటాలకు హాజరవ్వడం ప్రారంభించారు. క్లీవ్‌లాండ్‌ సువార్త ప్రచారకుడవ్వడానికి యోగ్యుడైన తర్వాత, ఇతరులకు సహాయం చేయడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ పరిచర్యలో ఎంతో ఆనందాన్ని అనుభవించాడు.

దేవుని వాక్య శక్తితో కదిలించబడుతూ క్లీవ్‌లాండ్‌ చివరకు యెహోవాకు తాను చేసుకున్న సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించాడు, పూర్తికాల సేవకుడిగా, సంఘంలో పరిచర్య సేవకుడిగా సేవచేసే ఆధిక్యత ఆయనకు లభించింది.

జమైకాలోనూ ప్రపంచవ్యాప్తంగానూ వేలాదిమంది దేవుని వాక్యము నిజంగానే ‘సజీవమైనది, శక్తి గలది’ అని తెలుసుకున్నారు.

[8వ పేజీలోని మ్యాపు/చిత్రం]

జమైకా

[చిత్రసౌజన్యం]

పటం, భూగోళం: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.