కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దైవిక అధికారానికి యథార్థంగా లోబడండి

దైవిక అధికారానికి యథార్థంగా లోబడండి

దైవిక అధికారానికి యథార్థంగా లోబడండి

“యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు.”​యెషయా 33:​22.

1. ప్రాచీన ఇశ్రాయేలు ఇతర జనాంగాల్లోకెల్లా విశిష్టమైనదిగా ఉండడానికి గల కారకాలు ఏవి?

ఇశ్రాయేలు జనాంగం సా.శ.పూ. 1513 లో రూపొందించబడింది. ఆ సమయంలో దానికి రాజధానీ లేదు సొంత దేశమూ లేదు దృశ్యమైన ఒక రాజు కూడా లేడు. దాని పౌరులు గతంలో బానిసలు. అయినప్పటికీ ఆ నూతన జనాంగం మరొక రీతిలో కూడా విశిష్టంగా ఉండేది. యెహోవా దేవుడు ఆ జనాంగానికి అదృశ్యమైన న్యాయాధిపతిగా శాసనకర్తగా రాజుగా ఉండేవాడు. (నిర్గమకాండము 19:​5, 6; యెషయా 33:​22) వేరే ఏ జనాంగానికి కూడా అలా చెప్పుకునే అవకాశం లేదు!

2. ఇశ్రాయేలు వ్యవస్థీకరించబడిన విధానం గురించి ఎలాంటి ప్రశ్న ఉదయిస్తుంది, దాని జవాబు మనకెందుకంత ప్రాముఖ్యమైనది?

2 యెహోవా దేవుడు క్రమబద్ధుడు సమాధానకర్త. అందుకే, ఆయన పరిపాలించే ఏ దేశమైనా చక్కగా వ్యవస్థీకరించబడుతుందని మనం ఎదురుచూస్తాం. (1 కొరింథీయులు 14:​33) ఇశ్రాయేలు విషయంలో అలాగే జరిగింది. కానీ భూసంబంధమైన ఒక దృశ్య సంస్థ, అదృశ్యుడైన దేవుని చేత ఎలా నిర్దేశించబడుతుంది? యెహోవా ఆ ప్రాచీన జనాంగాన్ని పరిపాలించిన విధానాన్ని పరిశీలించడం మనకు ప్రయోజనకరం, ప్రత్యేకించి ఆయన ఇశ్రాయేలుతో వ్యవహరించిన విధానం దైవిక అధికారానికి యథార్థంగా లోబడాల్సిన ప్రాముఖ్యతను ఎలా ఎత్తిచూపిందో గమనించడం మనకు మంచిది.

ప్రాచీన ఇశ్రాయేలు పరిపాలించబడిన విధానం

3. తన ప్రజలకు మార్గాన్ని నిర్దేశించడానికి యెహోవా ఏ ఆచరణాత్మకమైన ఏర్పాట్లను చేశాడు?

3 ఇశ్రాయేలుకు యెహోవా అదృశ్యంగా ఉండి పరిపాలించే రాజే అయినప్పటికీ, ఆయన తన దృశ్య ప్రతినిధులుగా యథార్థమైన మనుష్యులను నియమించాడు. ప్రజలకు ఉపదేశించడానికీ న్యాయం తీర్చడానికీ వారిలో ప్రధానులు, ముఖ్యులు, పెద్దలు ఉండేవారు. (నిర్గమకాండము 18:​25, 26; ద్వితీయోపదేశకాండము 1:​15) అయినా బాధ్యతగల ఆ వ్యక్తులు దేవుని నడిపింపు లేకుండా ఖచ్చితమైన వివేచన అవగాహనలతో విషయాలను ఎలాగైనా పరిష్కరించగలిగేవారనే ముగింపుకు మాత్రం మనం అస్సలు రాకూడదు. వారు పరిపూర్ణులూ కాదు, తమ తోటి ఆరాధకుల హృదయాలను చదవగలిగేవారూ కాదు. అయినా దేవుని భయమున్న న్యాయాధిపతులు తమ తోటి విశ్వాసులకు సహాయకరమైన సలహాలను ఇవ్వగలిగేవారు, దానికి కారణం వారిచ్చే సలహా యెహోవా ధర్మశాస్త్రంపై ఆధారపడి ఉండడమే.​—⁠ద్వితీయోపదేశకాండము 19:​15; కీర్తన 119:​97-100.

4. యథార్థవంతులైన ఇశ్రాయేలు న్యాయాధిపతులు ఏ స్వభావాలకు దూరంగా ఉండాలని ఆతృత చూపించారు, ఎందుకు?

4 అయితే, ఒక న్యాయాధిపతిగా ఉండాలంటే ధర్మశాస్త్రం గురించి తెలుసుకోవడం కంటే ఎక్కువే చేయాలి. ఆ పెద్దలు అపరిపూర్ణులు కావడం మూలంగా తమలో ఉన్న మొండి స్వభావాలను అంటే స్వార్థం, పక్షపాతం, అత్యాశ వంటివాటిని అదుపులో పెట్టుకోవడానికి అప్రమత్తతతో ఉండాల్సివచ్చేది. ఎందుకంటే అవి తామిచ్చే తీర్పును పెడదారి పట్టించే అవకాశముంది. మోషే వారితో ఇలా అన్నాడు: “మీరు . . . తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్షపాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు.” (ఇటాలిక్కులు మావి.) అవును ఇశ్రాయేలు న్యాయాధిపతులు దేవుని తరఫున తీర్పు తీరుస్తున్నారు. అది ఎంతటి భయోత్పాదకమైన ఆధిక్యతో కదా!​—⁠ద్వితీయోపదేశకాండము 1:​16, 17.

5. యెహోవా తన ప్రజలను చూసుకోవడానికి న్యాయాధిపతుల ఏర్పాటుతోపాటు ఇంకా ఏ ఏర్పాట్లు చేశాడు?

5 యెహోవా తన ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి ఇతర ఏర్పాట్లను కూడా చేశాడు. వారు వాగ్దాన దేశానికి చేరుకోవడానికి ముందే, సత్యారాధనకు కేంద్రమైన మందిరాన్ని నిర్మించమని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ధర్మశాస్త్రాన్ని బోధించడానికీ జంతు బలులను అర్పించడానికీ ఉదయం సాయంత్రం ధూపం వేయడానికీ ఆయన ఒక యాజకత్వాన్ని కూడా ఏర్పాటు చేశాడు. దేవుడు మోషే అన్న అహరోనును ఇశ్రాయేలు మొదటి ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠించాడు, అహరోనుకు విధుల నిర్వహణలో సహాయపడేందుకు ఆయన కుమారులను నియమించాడు.​—⁠నిర్గమకాండము 28:⁠1; సంఖ్యాకాండము 3:​10; 2 దినవృత్తాంతములు 13:​10, 11.

6, 7. (ఎ) యాజకులకూ యాజకులు కాని లేవీయులకూ మధ్య ఎలాంటి సంబంధం ఉండేది? (బి) లేవీయులు విభిన్నమైన నియమిత పనులను నిర్వహించారన్న వాస్తవం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (కొలొస్సయులు 3:​23)

6 కొన్ని లక్షలమంది ఆధ్యాత్మిక అవసరాలను చూడడమంటే చాలా పెద్ద పని, యాజకులు చాలా కొద్దిమందే ఉండేవారు. అందుకే లేవీ గోత్రంలోని ఇతర సభ్యుల ద్వారా వారికి సహాయం అందేలా ఏర్పాటు చేయబడింది. యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలోనుండి అతని వశము చేయబడినవారు.”​—⁠సంఖ్యాకాండము 3:​9, 39.

7 లేవీయులు చక్కగా సంస్థీకరించబడ్డారు. వారు గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు అనబడే మూడు వంశాల ప్రకారం విభాగించబడ్డారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నియమించబడింది. (సంఖ్యాకాండము 3:​14-17, 23-37) కొన్ని నియామకాలు వేరే వాటికంటే చాలా ప్రాముఖ్యమైనవిగా అనిపించవచ్చు కానీ అన్నీ ప్రాధాన్యమైనవే. కహాతీయులు చేసే పని వారిని పవిత్రమైన నిబంధన మందసానికీ మందిరపు ఉపకరణాలకూ అతి సమీపంగా తీసుకువచ్చింది. అయినప్పటికీ ప్రతీ లేవీయుడు​—⁠కహాతీయుడైనా కాకపోయినా​—⁠అద్భుతమైన ఆధిక్యతలను అనుభవించాడు. (సంఖ్యాకాండము 1:​51, 53) విషాదకరంగా, కొందరు తమ ఆధిక్యతలను విలువైనవిగా ఎంచలేదు. దైవిక అధికారానికి యథార్థంగా లోబడడానికి బదులు వారు అసంతృప్తి చెంది, గర్వము అధికారకాంక్ష అసూయ వంటి వాటిని పెంపొందించుకోవడం ఆరంభించారు. కోరహు అనే లేవీయుడు అలాంటి వారిలో ఒకడు.

‘మీరు యాజకత్వాన్ని కూడా కోరుకుంటున్నారా?’

8. (ఎ) కోరహు ఎవరు? (బి) కోరహు యాజకులను పూర్తిగా మానవ దృక్కోణంతో చూడడం ప్రారంభించడానికిగల కారణం ఏమై ఉండవచ్చు?

8 కోరహు అటు లేవీయుల పితరుల కుటుంబానికి గానీ ఇటు కహాతీయుల కుటుంబాలకు గానీ ప్రధానుడు కాదు. (సంఖ్యాకాండము 3:​30, 32) అయినప్పటికీ ఆయన ఇశ్రాయేలులో గౌరవనీయుడైన ఒక ప్రధాని. కోరహు చేసే పనులు అహరోనుతోనూ ఆయన కుమారులతోనూ సన్నిహితంగా సహవసించేలా చేసి ఉండవచ్చు. (సంఖ్యాకాండము 4:​18, 19) వారి అపరిపూర్ణతలను ప్రత్యక్షంగా చూసిన కోరహు ఇలా ఆలోచించి ఉండవచ్చు: ‘ఈ యాజకులు ఖచ్చితంగా అపరిపూర్ణులే అయినా నేను వారికి లోబడి ఉండాల్సి వస్తోంది! కొద్దికాలం ముందే అహరోను బంగారు దూడను చేశాడు. ఆ దూడను ఆరాధించడం వల్ల మా ప్రజలు విగ్రహారాధనలో పడిపోయారు. ఇప్పుడు మోషే అన్న అహరోను ప్రధాన యాజకుడిగా సేవ చేస్తున్నాడు! ఎంత పక్షపాతం! అంతేకాదు అహరోను కుమారులు నాదాబు, అబీహుల విషయమేమిటి? వాస్తవానికి వారు తమ నియామకాలపట్ల ఎంతో అగౌరవం చూపించారు, అందుకే యెహోవా వారిని చంపెయ్యాల్సి వచ్చింది!’ * (నిర్గమకాండము 32:​1-5; లేవీయకాండము 10:​1, 2) కోరహు ఆలోచన ఏదైనప్పటికీ ఆయన యాజకత్వాన్ని మానవ దృక్కోణంతో చూడడం ప్రారంభించాడని స్పష్టమవుతోంది. అది ఆయన మోషేకు, అహరోనుకు చివరికి యెహోవాకే ఎదురు తిరిగేలా నడిపించింది.​—⁠1 సమూయేలు 15:​23; యాకోబు 1:​14, 15.

9, 10, కోరహు, అతని తోటి విరోధులు మోషేను ఏమని నిందించారు, వారికి ఏ విషయం బాగా తెలిసి ఉండాలి?

9 పలుకుబడి గల ఒక వ్యక్తిగా, తన లాంటి దృక్కోణమే ఉన్న ఇతరులను తనవైపు తిప్పుకోవడం కోరహుకు పెద్ద కష్టమేమీ కాలేదు. దాతాను అబీరాములతోపాటు తన అభిప్రాయంతో ఏకీభవించే 250 మందిని ఆయన పోగుచేసుకున్నాడు​—⁠అందరూ సమాజ ప్రధానులే. వారంతా కలిసి మోషే అహరోనుల దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: ‘ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారు?’​—⁠సంఖ్యాకాండము 16:​1-3.

10 ఆ విరోధులు తమకు తెలిసినదాన్ని బట్టి మోషే అధికారాన్ని ఎదిరించకుండా ఉండాల్సింది. దానికి కొద్దికాలం ముందే, అహరోను మిర్యాములు ఇదేవిధంగా మోషే అధికారాన్ని ఎదిరించారు. నిజానికి వాళ్ళు కూడా కోరహు ఉపయోగించిన తర్కాన్నే ఉపయోగించారు! సంఖ్యాకాండము 12:⁠1, 2 ప్రకారం, “మోషేచేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేతను పలికింపలేదా?” అని వాళ్ళు అడిగారు. యెహోవా ఇది వింటున్నాడు. ఆయన తాను ఎంపిక చేసుకునే నాయకుణ్ణి సూచించేందుకు మోషే, అహరోను, మిర్యాములను ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గరకు రమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడు యెహోవా, “మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడుకాడు. అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు” అని చాలా స్పష్టంగా అన్నాడు. ఆ తర్వాత, యెహోవా మిర్యాముకు తాత్కాలికంగా కుష్ఠురోగం వచ్చేలా చేశాడు.​—⁠సంఖ్యాకాండము 12:​4-7, 10.

11. కోరహుకు సంబంధించిన పరిస్థితితో మోషే ఎలా వ్యవహరించాడు?

11 కోరహుకు, అతనితోపాటు పోగైనవారికి ఆ సంఘటన గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. వారి తిరుగుబాటు సమర్థింపదగినది కాదు. అయినప్పటికీ వారికి వాస్తవాన్ని నిరూపించడానికి మోషే ఓర్పుతో ప్రయత్నించాడు. తమ ఆధిక్యతలపట్ల మరింత కృతజ్ఞత కలిగి ఉండమని ఆయన వారికిలా ఉద్బోధించాడు: ‘మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరుపరచుట మీకు అల్పముగా కనబడునా?’ లేదు, అది ‘అల్పమైనది’ కాదు! లేవీయులు అప్పటికే ఎంతో పొందారు. అంతకంటే ఎక్కువ ఇంకా ఏమి కోరవచ్చు? “మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు” అన్న మోషే తర్వాతి మాటలు వారి హృదయంలోని ఆలోచనలను బహిర్గతం చేశాయి. * (సంఖ్యాకాండము 12:⁠3; 16:⁠9, 10) అయినా దైవిక అధికారానికి వ్యతిరేకంగా చేసిన ఈ తిరుగుబాటు చర్యకు యెహోవా ఎలా ప్రతిస్పందించాడు?

ఇశ్రాయేలు న్యాయాధిపతి జోక్యం చేసుకుంటాడు

12. ఇశ్రాయేలు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండడం దేనిపై ఆధారపడి ఉంది?

12 యెహోవా ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రము ఇచ్చినప్పుడు, వారు తనకు విధేయులుగా ఉంటే తన “పరిశుద్ధమైన జనముగా” అవుతారనీ తను చేసిన ఏర్పాటును అనుసరించినంత వరకు ఆ జనాంగం పరిశుద్ధంగా ఉంటుందనీ ఆయన వారికి చెప్పాడు. (నిర్గమకాండము 19:​5, 6) ఇప్పుడు అక్కడ తిరుగుబాటు బహిరంగంగా వృద్ధి చెందుతోంది, అంటే ఇశ్రాయేలు న్యాయాధిపతీ శాసనకర్తా జోక్యం చేసుకోవాల్సిన సమయమది! మోషే కోరహుతో ‘నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెను’ అని చెప్పాడు.​—⁠సంఖ్యాకాండము 16:​16, 17.

13. (ఎ) విరోధులు యెహోవా ఎదుట ధూపం వేయడం, అహంకారంతో కూడిన చర్య ఎందుకు అవుతుంది? (బి) విరోధులతో యెహోవా ఎలా వ్యవహరించాడు?

13 దేవుని ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు మాత్రమే ధూపము వేయాలి. యాజకులుకాని లేవీయులు యెహోవా ఎదుట ధూపము వేయడం అనే యోచన ఆ విరోధులను స్పష్టంగా ఆలోచించేలా చేసి ఉండాల్సింది. (నిర్గమకాండము 30:⁠7; సంఖ్యాకాండము 4:​16) కోరహు, అతని మద్దతుదారులు ఏ మాత్రం చలించలేదు! ఆ మరుసటి రోజు కోరహు ‘ప్రత్యక్షపు గుడారము ద్వారము వద్ద సర్వసమాజమును [మోషే అహరోనులకు] విరోధముగా పోగుచేశాడు.’ ఆ వృత్తాంతం మనకిలా చెబుతోంది: ‘అప్పుడు యెహోవా​—⁠మీరు ఈ సమాజములోనుండి అవతలికి వెళ్లుడి. క్షణములో నేను వారిని కాల్చివేయుదును అని మోషే అహరోనులతో చెప్పాడు.’ కానీ మోషే అహరోనులు ప్రజలను విడిచిపెట్టమని వేడుకున్నారు. యెహోవా వారి విన్నపాన్ని అంగీకరించాడు. ఇక కోరహు అతని సమూహము విషయానికి వస్తే “యెహోవాయొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.”​—⁠సంఖ్యాకాండము 16:​19-22, 35. *

14. ఇశ్రాయేలు సమాజానికి వ్యతిరేకంగా యెహోవా దృఢమైన చర్యను ఎందుకు తీసుకున్నాడు?

14 ఆశ్చర్యకరంగా యెహోవా ఆ విరోధులతో వ్యవహరించిన విధానాన్ని చూసిన ఇశ్రాయేలీయులు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదు. “మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు​—⁠మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను.” ఇశ్రాయేలీయులు కుట్రదారుల పక్షాన చేరుతున్నారు! చివరికి యెహోవా సహనం నశించింది. ఇక ఎవ్వరూ, చివరికి మోషే గానీ అహరోను గానీ ఇప్పుడు ఆ ప్రజల తరఫున జోక్యం చేసుకోలేరు. యెహోవా ఆ అవిధేయుల మీదికి తెగులు వచ్చేలా చేశాడు, దానివల్ల “కోరహు తిరుగుబాటున చనిపోయినవారు గాక పదునాలుగువేల ఏడువందలమంది ఆ తెగులుచేత చచ్చిరి.”​—⁠సంఖ్యాకాండము 16:​41-49.

15. (ఎ) ఇశ్రాయేలీయులు ఏయే కారణాలవల్ల మోషే అహరోనుల నాయకత్వాన్ని సంకోచించకుండా అంగీకరించి ఉండాల్సింది? (బి) ఈ వృత్తాంతం యెహోవా గురించి మీకు ఏమి నేర్పించింది?

15 ఆ విషయాల్లో తమ తర్కనా శక్తిని ఉపయోగించి ఉంటే ఆ ప్రజలందరూ తమ ప్రాణాలను సులభంగా కాపాడుకోగలిగేవారు. వాళ్లు, ‘తమ ప్రాణాలకు తెగించి ఫరో దగ్గరకు ఎవరు వెళ్లారు? ఇశ్రాయేలీయులను విడిచిపెట్టమని ఎవరు అడిగారు? ఇశ్రాయేలు జనాంగం విడుదల అయిన తర్వాత హోరేబు కొండమీదికి వెళ్ళి దేవుని దూతతో ముఖాముఖి మాట్లాడడానికి ఆహ్వానించబడిన ఒకే ఒక వ్యక్తి ఎవరు?’ అని తమను తాము ప్రశ్నించుకోవాల్సింది. మోషే అహరోనుల విశిష్టమైన జీవిత వృత్తాంతాలు, వారు యెహోవాపట్ల యథార్థత ప్రజలపై ప్రేమ చూపించారనడానికి రుజువునిచ్చాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. (నిర్గమకాండము 10:​28; 19:​24; 24:​12-15) ఆ విరోధులను చంపడంలో యెహోవాకేమీ సంతోషం కలగలేదు. కానీ ప్రజలు తిరుగుబాటు చేయడంలో పట్టువదలకుండా కొనసాగుతున్నారని గమనించగానే ఆయన నిష్కర్షగా చర్య తీసుకున్నాడు. (యెహెజ్కేలు 33:​11) ఇదంతా నేడు మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు?

నేటి మాధ్యమాన్ని గుర్తించడం

16. (ఎ) యేసు యెహోవా ప్రతినిధి అని మొదటి శతాబ్దంలోని యూదులను ఏ రుజువు నమ్మించి ఉండవచ్చు? (బి) లేవీయుల యాజకత్వాన్ని యెహోవా ఎందుకు మార్చాడు, దేనితో మార్చాడు?

16 నేడు కూడా యెహోవా అదృశ్య న్యాయాధిపతిగా శాసనకర్తగా రాజుగా ఉన్న ఒక క్రొత్త ‘జనము’ ఉంది. (మత్తయి 21:​43) ఆ ‘జనము’ సా.శ. మొదటి శతాబ్దంలో ఉనికిలోకి వచ్చింది. ఆ సమయానికి మోషే కాలంనాటి గుడారం స్థానంలోకి యెరూషలేములోని అందమైన ఒక ఆలయం వచ్చింది, లేవీయులు అక్కడే తమ విధులను ఇంకా నిర్వహిస్తుండేవారు. (లూకా 1:​5, 8, 9) అయినప్పటికీ, సా.శ. 29వ సంవత్సరంలో మరొక ఆలయం అంటే ఆధ్యాత్మిక ఆలయం ఉనికిలోకి వచ్చింది, దాని ప్రధానయాజకుడు యేసుక్రీస్తు. (హెబ్రీయులు 9:​9, 11) దైవిక అధికారం గురించిన ప్రశ్న మరొకసారి తలెత్తింది. ఈ క్రొత్త ‘జనమును’ నడిపించడానికి యెహోవా ఎవరిని ఉపయోగించుకోబోతున్నాడు? దేవునికి సంపూర్ణ యథార్థవంతుడిగా యేసు తానే స్వయంగా రుజువుపరచుకున్నాడు. ఆయన ప్రజలను ప్రేమించాడు. ఆయన అనేకమైన అద్భుత క్రియలను చేశాడు. అయినప్పటికీ తలబిరుసుగల తమ పూర్వీకుల్లాగే లేవీయుల్లో చాలామంది యేసును స్వీకరించడానికి నిరాకరించారు. (మత్తయి 26:​63-68; అపొస్తలుల కార్యములు 4:​5, 6, 18; 5:​17) చివరిగా, యెహోవా లేవీయుల యాజకత్వం స్థానంలో దానికి పూర్తి భిన్నంగా ఉండే​—⁠రాజులైన యాజకసమూహాన్ని ఉంచాడు. ఆ రాజులైన యాజకసమూహము నేటి వరకు కొనసాగుతోంది.

17. (ఎ) నేడు ఏ సమూహముతో రాజులైన యాజకసమూహము రూపొందించబడింది? (బి) రాజులైన యాజకసమూహాన్ని యెహోవా ఎలా ఉపయోగిస్తాడు?

17 రాజులైన ఈ యాజకసమూహము నేడు ఎవరితో రూపొందించబడింది? అపొస్తలుడైన పేతురు తన మొదటి ప్రేరేపిత పత్రికలో ఆ ప్రశ్నకు జవాబు ఇస్తున్నాడు. క్రీస్తు శరీరంలోని అభిషిక్త సభ్యులకు, “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు” అని పేతురు వ్రాశాడు. (1 పేతురు 2:⁠9) ఈ మాటలతో స్పష్టమయ్యేదేమిటంటే, యేసు అడుగుజాడల్లో నడిచే అభిషిక్తులతో ఒక సమూహముగా “రాజులైన యాజకసమూహము” రూపొందించబడింది, దీనినే పేతురు “పరిశుద్ధజనము” అని కూడా అన్నాడు. యెహోవా ఏర్పాటు చేసిన మాధ్యమంగా వారు పనిచేస్తారు, తన ప్రజలకు ఉపదేశాన్నీ ఆధ్యాత్మిక నిర్దేశాన్నీ ఇవ్వడానికి ఆయన ఈ మాధ్యమాన్ని ఉపయోగిస్తాడు.​—⁠మత్తయి 24:​45-47.

18. నియమిత పెద్దలకూ రాజులైన యాజకసమూహానికీ మధ్య ఎలాంటి సంబంధం ఉంది?

18 భూవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజల సంఘాల్లో బాధ్యతాయుత స్థానాల్లో ఉండి సేవ చేస్తున్న నియమిత పెద్దలు రాజులైన యాజకసమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు అభిషిక్తులైనా కాకపోయినా మన గౌరవాన్నీ సంపూర్ణ హృదయంతో ఇచ్చే మద్దతునూ పొందడానికి అర్హులు. ఎందుకు? కారణం ఈ పెద్దలను యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ స్థానాల్లో నియమించడమే. (హెబ్రీయులు 13:​7, 17) అదెలా జరుగుతుంది?

19. పెద్దలు ఏ భావంలో పరిశుద్ధాత్మ చేత నియమించబడ్డారు?

19 ఈ పెద్దలు దేవుని వాక్యంలో చెప్పబడిన అర్హతలకు తగినట్లుగా ఉంటారు, ఆ వాక్యం దేవుని పరిశుద్ధాత్మ చేత రూపొందించబడింది. (1 తిమోతి 3:​1-7; తీతు 1:​5-9) కాబట్టి వారి నియామకం దేవుని పరిశుద్ధాత్మ ద్వారా చేయబడిందని చెప్పవచ్చు. (అపొస్తలుల కార్యములు 20:​28) ఈ పెద్దలు తప్పకుండా దేవుని వాక్యంతో బాగా సుపరిచితులై ఉండాలి. తీర్పు ఇచ్చేటప్పుడు పక్షపాతం అనిపించే దేనినైనా, తమను నియమించిన సర్వోన్నత న్యాయాధిపతి ఎలా అసహ్యించుకుంటాడో అలాగే వారు కూడా అసహ్యించుకోవాలి.​—⁠ద్వితీయోపదేశకాండము 10:​17, 18.

20. కష్టపడి పనిచేసే పెద్దలను మీరు ఎంత ఉన్నతులుగా ఎంచుతారు?

20 కష్టపడి పనిచేస్తున్న మన పెద్దల అధికారాన్ని ఎదిరించడానికి బదులు మనం వారిని నిజంగా అభినందిస్తాం! తరచుగా అనేక దశాబ్దాలకు పైగా యథార్థంగా సేవ చేసిన వారి చరిత్ర మన నమ్మకాన్ని ప్రేరేపిస్తుంది. వారు సంఘ కూటాలకు యథార్థంగా సిద్ధపడి వాటిని నిర్వహిస్తారు, ‘రాజ్య సువార్తను’ ప్రకటించడంలో మనతో కలిసి పనిచేస్తారు, మనకు అవసరమైనప్పుడు లేఖనాధారిత సలహాను ఇస్తారు. (మత్తయి 24:​14; హెబ్రీయులు 10:​23-25; 1 పేతురు 5:⁠2) మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు మనల్ని కలవడానికీ సంతాపంలో ఉన్నప్పుడు ఓదార్చడానికీ వారు వస్తారు. వారు రాజ్య సంబంధ విషయాలకు యథార్థతతో నిస్వార్థంతో మద్దతునిస్తారు. యెహోవా ఆత్మ వారిపైన ఉంది, వారికి ఆయన ఆమోదం ఉంది.​—⁠గలతీయులు 5:​22-24.

21. పెద్దలు ఏ విషయంలో అప్రమత్తులై ఉండాలి, ఎందుకు?

21 పెద్దలు పరిపూర్ణులు కాదన్న విషయం నిజమే. వారు తమ పరిమితులను గుర్తుంచుకొని ‘దేవుడు తమకు అప్పగించిన’ మందపై ప్రభువులై ఉండడానికి ప్రయత్నించరు. బదులుగా, వారు తమను తాము తమ సహోదరుల ‘ఆనందానికి సహకారులుగా’ పరిగణించుకుంటారు. (1 పేతురు 5:⁠3; 2 కొరింథీయులు 1:​24) కష్టపడి పనిచేసే అణకువగల పెద్దలు యెహోవాను ప్రేమిస్తారు, తాము యెహోవాను ఎంత బాగా అనుకరించగలిగితే సంఘానికి అంత బాగా ప్రయోజనాన్ని చేకూర్చగలమని వారికి తెలుసు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రేమా సానుభూతీ సహనమూ వంటి దేవుని లక్షణాలను పెంపొందించుకోవడానికి వారు నిరంతరం కృషి చేస్తుంటారు.

22. కోరహు వృత్తాంతపు పునర్విచారణ యెహోవా దృశ్య సంస్థ మీద మీ విశ్వాసాన్ని ఎలా బలపరచింది?

22 యెహోవా మన అదృశ్య పరిపాలకుడిగా, యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడిగా, రాజులైన యాజకసమూహంలోని అభిషిక్త సభ్యులు మన బోధకులుగా, యథార్థవంతులైన క్రైస్తవ పెద్దలు మన ఉపదేశకులుగా ఉన్నందుకు మనమెంత సంతోషించాలి! మానవులచే నడిపించబడే ఏ సంస్థా పరిపూర్ణమైనది కాకపోయినప్పటికీ మనం దైవిక అధికారానికి సంతోషంగా లోబడి ఉండే నమ్మకమైన మన తోటి విశ్వాసులతో కలిసి దేవుణ్ణి సేవించగలుగుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాం!

[అధస్సూచీలు]

^ పేరా 8 అహరోను వేరే ఇద్దరు కుమారులు ఎలియాజరు, ఈతామారు యెహోవాకు చేసిన సేవలో మాదిరికరంగా ఉన్నారు.​—⁠లేవీయకాండము 10:⁠6.

^ పేరా 11 కోరహు తోటి కుట్రదారులైన దాతాను, అబీరాములు రూబేనీయులు. దాన్నిబట్టి వారు బహుశా యాజకత్వాన్ని కోరి ఉండకపోవచ్చు. కానీ, వారు మోషే నాయకత్వం మీదా వాగ్దాన దేశం చేరుకోవాలన్న తమ నిరీక్షణ ఇంకా నెరవేరనందువల్లా ఆగ్రహంతో ఉన్నారు.​—⁠సంఖ్యాకాండము 16:​12-14.

^ పేరా 13 ప్రాచీన కాలాల్లో, ప్రతి కుటుంబ పెద్ద దేవుని ఎదుట తన భార్యాపిల్లలకు ప్రాతినిధ్యం వహించేవాడు, వారి తరఫున బలులు కూడా అర్పించేవాడు. (ఆదికాండము 8:​20; 46:⁠1; యోబు 1:⁠5) అయితే ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు అహరోను కుటుంబంలోని మగవారిని యెహోవా యాజకులుగా నియమించాడు, వారి ద్వారానే బలులు అర్పించబడాలి. ఆ 250 మంది విరోధులు ఈ కార్యసరళిలోని సవరణతో సహకరించడానికి ఇష్టపడలేదని స్పష్టంగా అర్థమవుతోంది.

మీరేమి నేర్చుకున్నారు?

• ఇశ్రాయేలీయుల క్షేమం కోసం యెహోవా ఎలాంటి ప్రేమపూర్వకమైన ఏర్పాట్లను చేశాడు?

• మోషే అహరోనులకు వ్యతిరేకంగా కోరహు చేసిన తిరుగుబాటు ఎందుకు క్షమించరానిది?

• యెహోవా తిరుగుబాటుదారులతో వ్యవహరించిన తీరు నుండి మనం ఏమి పాఠం నేర్చుకోవచ్చు?

• యెహోవా నేడు చేస్తున్న ఏర్పాట్లకు మనం కృతజ్ఞులమై ఉన్నామని ఎలా చూపించగలం?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రం]

యెహోవా సేవలోని ఏ నియామకాన్నైనా మీరు ఒక ఆధిక్యతగా పరిగణిస్తారా?

[10వ పేజీలోని చిత్రం]

‘యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారు?’

[13వ పేజీలోని చిత్రం]

నియమిత పెద్దలు రాజులైన యాజకసమూహానికి ప్రాతినిధ్యం వహిస్తారు