కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిండు జీవితం

నిండు జీవితం

జీ వి త క థ

నిండు జీవితం

మ్యురీల్‌ స్మిత్‌ చెప్పినది

మా ముందు గది తలుపును ఎవరో గట్టిగా తట్టడంతో అది ఊగింది. నేను, ఆ రోజు ఉదయం ప్రకటనా పని చేసి మధ్యాహ్నం భోజనం చేయడానికి అప్పుడే ఇంటికి వచ్చాను. అలవాటు ప్రకారం, నేను ఒక కప్పు టీ కోసం నీళ్ళు కాస్తున్నాను. ఒక అరగంటసేపు విశ్రాంతి తీసుకుందామన్నట్లుగా కాళ్ళు పైకి పెట్టుకోబోతున్నాను. తలుపు తడుతున్న చప్పుడు మళ్ళీ మళ్ళీ వినిపించింది. నేను తలుపు తెరవడానికి వెళ్తూ ఈ సమయంలో తలుపు తడుతున్నది ఎవరబ్బా అని అనుకున్నాను. ఎవరో వెంటనే తెలిసిపోయింది. మా గుమ్మం దగ్గర ఇద్దరు మగవాళ్లు నిలబడివున్నారు, తాము పోలీస్‌ అధికారులమని చెప్పారు. నిషేధించబడిన సంస్థయైన యెహోవాసాక్షులు తయారుచేసిన సాహిత్యం ఏమైనా మా ఇంట్లో ఉందేమో పరిశోధించడానికి వచ్చామని వాళ్ళు చెప్పారు.

ఆస్ట్రేలియాలో యెహోవాసాక్షులు ఎందుకు నిషేధించబడ్డారు, నేను వారిలో ఒకరిగా ఎలా అయ్యాను? 1910వ సంవత్సరంలో నాకు పదేళ్ళున్నప్పుడు మా అమ్మ నాకిచ్చిన ఒక బహుమానంతో అది మొదలైంది.

మాకుటుంబం, ఉత్తర సిడ్నీ శివారు ప్రాంతంలో ఉన్న క్రోజ్‌ నెస్ట్‌లోని కలప ఇంటిలో నివసించేది. నేను ఒకరోజు స్కూల్‌ నుండి ఇంటికి వచ్చినప్పుడు, ముందు తలుపు దగ్గర మా అమ్మ ఒక వ్యక్తితో మాట్లాడుతోంది. ఆ అపరిచితుడి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస నాకు కలిగింది, ఆయన సూట్‌లో ఉన్నాడు, ఆయన బ్యాగ్‌ నిండా పుస్తకాలు తెచ్చాడు. నేను ఎక్స్‌క్యూజ్‌మీ అంటూ సిగ్గుతో ఇంటిలోకి వెళ్ళిపోయాను. అయితే కొన్ని నిమిషాల తర్వాత అమ్మ నన్ను పిలిచి, “ఈయన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. అవి లేఖనాలకు సంబంధించినవి. త్వరలోనే నీ పుట్టిన రోజు వస్తోంది కదా, క్రొత్త డ్రెస్సు కావాలా లేదా ఈ పుస్తకాలు కావాలా నువ్వే ఎంపిక చేసుకోవచ్చు. నీకు ఏమి కావాలి?” అని అడిగింది.

“మమ్మీ నాకు పుస్తకాలు కావాలి. థ్యాంక్యూ” అని బదులిచ్చాను.

చార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ వ్రాసిన లేఖనాల్లో అధ్యయనాలు (ఆంగ్లం) మొదటి మూడు సంపుటులు అలా నాకు పదేళ్ళున్నప్పుడే నా దగ్గరున్నాయి. ఆ పుస్తకాలను అర్థం చేసుకోవడం నాకు కష్టంగా ఉండవచ్చు, కాబట్టి అమ్మ నాకు సహాయపడవలసిన అవసరముంటుందని గుమ్మంలో ఉన్న వ్యక్తి అమ్మకు చెప్పాడు. ఆ పని ఆనందంగా చేస్తానని అమ్మ ఆయనతో చెప్పింది. దుఃఖకరంగా, కొన్నాళ్ళ తర్వాత అమ్మ చనిపోయింది. మా నాన్న, తమ్ముణ్ణీ చెల్లినీ నన్నూ చాలా బాగా చూసుకునేవారు, అప్పుడు అదనపు బాధ్యతలు నా మీద పడ్డాయి. అవన్నీ నేను మోయలేనివని నాకు అనిపించింది. అయితే మరో ప్రమాదం పొంచివుంది.

1914 లో మొదటి ప్రపంచయుద్ధం మొదలైంది. కేవలం ఒక సంవత్సరం తర్వాత మా ప్రియమైన నాన్న చంపబడ్డాడు. అప్పుడు మేము అనాథలమయ్యాము. నా తమ్ముణ్ణీ చెల్లెల్నీ బంధువుల దగ్గరికి, నన్ను క్యాథలిక్‌ బోర్డింగ్‌ కాలేజీకి పంపించేశారు. కొన్నిసార్లు ఒంటరితనంతో చాలా బాధపడ్డాను. అయితే నాకెంతో ఇష్టమైన సంగీతం నేర్చుకునే అవకాశం ముఖ్యంగా పియానో వాయించడం నేర్చుకునే అవకాశాన్ని వాళ్ళు నాకిచ్చినందుకు నేనెంతో కృతజ్ఞురాలిని. సంవత్సరాలు గడిచాయి, నేను బోర్డింగ్‌ కాలేజీలో పట్టా సంపాదించుకున్నాను. 1919 లో, రాయ్‌ స్మిత్‌ని పెళ్ళి చేసుకున్నాను. ఆయన సంగీత వాద్యాల సేల్స్‌మ్యాన్‌. 1920 లో, మాకు ఒక బాబు పుట్టాడు. నేను మళ్లీ దైనందిన పనుల్లో మునిగిపోయాను. ఇంతకీ ఆ పుస్తకాల సంగతేమిటి?

ఒక పొరుగామె ఆధ్యాత్మిక సత్యాన్ని పంచుకోవడం

ఆ సంవత్సరాలన్నీ ఆ “బైబిలు పుస్తకాలు” నాతో పాటు ప్రయాణం చేశాయి. నిజానికి నేను వాటిని ఎప్పుడూ చదవకపోయినప్పటికీ, అందులో ఉన్న సమాచారం చాలా ప్రాముఖ్యమైనదని మాత్రం నాకు తెలుసు. తర్వాత 1920ల చివర్లో, మా పొరుగువారిలో ఒకరైన లిల్‌ బిమ్సన్‌ మా ఇంటికి వచ్చింది. మేము ముందు గదిలో కూర్చుని టీ త్రాగాము.

అకస్మాత్తుగా ఆమె “ఓహ్‌, మీ దగ్గర ఈ పుస్తకాలున్నాయా!” అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది.

ఆమె వేటి గురించి అడుగుతోందో అర్థంకాక, “ఏ పుస్తకాలు?” అని అడిగాను.

లిల్‌, బుక్‌కేసులో ఉన్న లేఖనాల్లో అధ్యయనాలు చూపించింది. వాటిని తిరిగి తెచ్చిస్తానని చెప్పి ఆ రోజే వాళ్ళింటికి పట్టుకెళ్ళి ఆతురతతో చదివింది. తను చదివిన సమాచారాన్ని బట్టి ఆమె ఎంత పులకించిపోయిందో త్వరలోనే చాలా స్పష్టంగా కనిపించింది. లిల్‌, బైబిలు విద్యార్థుల నుండి మరిన్ని సాహిత్యాలను సంపాదించింది, యెహోవాసాక్షులు అప్పట్లో బైబిలు విద్యార్థులు అని పిలువబడేవారు. అంతేకాక ఆమె తాను నేర్చుకుంటున్న విషయాలన్నింటినీ మాకు చెప్పకుండా ఉండలేకపోయింది. ఆమె సంపాదించుకున్న పుస్తకాల్లో ఒకటి దేవుని వీణ (ఆంగ్లం). ఆ పుస్తకం కొన్నాళ్ళకే మా ఇంటికి వచ్చింది. చివరికి యెహోవా సేవలో నా జీవితం, నేను ఈ బైబిలు ఆధారిత ప్రచురణను చదవడానికి సమయం కేటాయించినప్పుడు మొదలైంది. మా చర్చి నాకు జవాబు ఇవ్వలేకపోయిన ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు చివరికి నాకు అందులో కనిపించాయి.

సంతోషకరమైన విషయమేమిటంటే, బైబిలు సందేశానికి రాయ్‌ బాగా శ్రద్ధ చూపించారు, మేమిద్దరమూ ఆతురతగల బైబిలు విద్యార్థులమయ్యాము. మునుపు రాయ్‌ ఫ్రీమాసన్స్‌ సంస్థలో సభ్యుడిగా ఉండేవారు. ఇప్పుడు మా కుటుంబం సత్యారాధనలో ఐక్యమైంది, సహోదరుల్లో ఒకరు వారానికి రెండుసార్లు మా కుటుంబమంతటితో బైబిలు అధ్యయనం చేసేవారు. బైబిలు విద్యార్థులు నిర్వహించే కూటాలకు మేము హాజరవ్వడం మొదలుపెట్టినప్పుడు మాకు మరింత ప్రోత్సాహం లభించింది. సిడ్నీలో కూటాలు నిర్వహించబడే స్థలం, న్యూటౌన్‌ శివారు ప్రాంతంలో అద్దెకు తీసుకున్న చిన్న హాలు. ఆ సమయంలో దేశమంతటిలో సాక్షులు 400 వరకూ ఉండేవారు. కాబట్టి చాలామంది సహోదరులు, కూటాలకు క్రమంగా హాజరవ్వడానికి చాలా దూరం ప్రయాణించవలసి వచ్చేది.

మా కుటుంబం, కూటాలకు హాజరయ్యేందుకు సిడ్నీ హార్బర్‌ని దాటాలి. 1932 లో సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జ్‌ నిర్మించబడక ముందు, ఆ హార్బర్‌ని దాటేందుకు ప్రతీసారి పడవలో వెళ్ళవలసి వచ్చేది. ఆ ప్రయాణానికి ఎంత సమయం వెచ్చించవలసి వచ్చినా ఎంత ఖర్చు పెట్టవలసి వచ్చినా యెహోవా ఇచ్చిన ఆధ్యాత్మిక భోజనాల్లో దేనినీ జారవిడుచుకోకుండా ఉండేందుకు కఠినయత్నం చేసేవాళ్ళం. మేము సత్యంలో బలంగా నాటుకోవడానికి తీసుకున్న శ్రమ ప్రయోజనకరమైనది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది, తటస్థతా వివాదం మా కుటుంబంపై నేరుగా ప్రభావం చూపనుంది.

పరీక్షల, ప్రతిఫలాల సమయం

1930ల తొలి సంవత్సరాలు నాకూ మా కుటుంబానికీ చాలా పులకింత కలిగించిన సమయాలు. నేను 1930 లో బాప్తిస్మం పొందాను, 1931 లో ఒక చిరస్మరణీయమైన సమావేశానికి హాజరయ్యాను. ఆ సమావేశంలో అందరూ లేచి నిలబడి యెహోవాసాక్షులు అనే అందమైన పేరును స్వీకరించడానికి అంగీకరించారు. సంస్థ ప్రోత్సహించిన ప్రకటనా పద్ధతులన్నింటిలోనూ ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనడం ద్వారా నేనూ, రాయ్‌ ఆ పేరుకు తగ్గట్లు జీవించడానికి కఠినయత్నం చేశాము. ఉదాహరణకు, 1932 లో సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జ్‌ ప్రారంభోత్సవాన్ని చూడడానికి వచ్చిన జనసమూహాలను చేరుకునేందుకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బుక్‌లెట్‌ ప్రచార కార్యక్రమంలో మేము నిమగ్నులమయ్యాము. సౌండ్‌ సిస్టమ్‌లున్న కార్ల ఉపయోగం మాకు ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. సౌండ్‌ సిస్టమ్‌ అమర్చబడిన ఒక కారును సొంతంగా కలిగివుండే ఆధిక్యత మా కుటుంబానికి లభించింది. సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఇచ్చిన బైబిలు ప్రసంగాలను ఈ సాంకేతికత సహాయంతో, సిడ్నీ వీధుల్లో మారుమ్రోగేలా చేశాము.

అయితే పరిస్థితులు మళ్ళీ మారిపోయి మరింత కష్టతరమయ్యాయి. 1932 నాటికి ఆర్థిక మాంద్యం, ఆస్ట్రేలియా వాళ్ళకు ఎంతో భారంగా మారింది. కాబట్టి నేనూ, రాయ్‌ మా జీవితంలో ఆడంబరాలను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాము. అందుకు చర్య తీసుకోవడంలో భాగంగా సంఘానికి దగ్గర్లో ఉన్న ఒక ఇంట్లోకి మారాము, దాంతో మా ప్రయాణ ఖర్చులు చాలా మట్టుకు తగ్గాయి. అయితే, రెండవ ప్రపంచ యుద్ధ భీతి భూగోళమంతటా వ్యాపించినప్పుడు ఆర్థిక ఒత్తిళ్ళు చాలా చిన్నవిగా కనిపించాయి.

ఈ లోకంలో భాగమై ఉండవద్దని యేసు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు మరెక్కువగా హింసకు గురయ్యారు, ఆస్ట్రేలియాలోని సాక్షులూ మినహాయించబడలేదు. యుద్ధకాలపు ఆవేశంతో కొందరు మమ్మల్ని కమ్యూనిస్టులన్నారు. జపాన్‌ సేనకు సందేశాలను పంపించడానికి ఆస్ట్రేలియాలో తమకు సొంతంగా ఉన్న నాలుగు రేడియో స్టేషన్‌లను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్నారని ఆ వ్యతిరేకులు అబద్ధారోపణలు చేశారు.

సైనిక సేవకు పిలిపించబడిన యువ సహోదరులు రాజీపడేలా చాలా ఒత్తిడి చేయబడ్డారు. మా ముగ్గురు కొడుకులూ తమ నమ్మకాల పక్షంగా దృఢంగా నిలబడ్డారనీ తమ తటస్థతా వైఖరిని అలాగే కొనసాగించారనీ చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మా పెద్ద కొడుకు రిచర్డ్‌కి 18 నెలల కారాగార శిక్ష వేశారు. మా రెండవ కొడుకు కివన్‌, మనస్సాక్షినిబట్టి వ్యతిరేకిస్తున్నవాడిగా రిజిష్టర్‌ చేయించుకోగలిగాడు. అయితే దుఃఖకరంగా మా చిన్న కొడుకు స్టూవర్ట్‌, తటస్థ వివాదానికి సంబంధించి కోర్టులో డిఫెన్స్‌ను పూర్తిచేయడానికి బయలుదేరి మార్గమధ్యంలో మోటర్‌ సైకిల్‌ ప్రమాదంలో చనిపోయాడు. ఈ దుర్ఘటన నిజంగా ఎంతో మానసిక క్షోభను కలిగించింది. అయితే మేము రాజ్యం మీదా పునరుత్థానం గురించి యెహోవా చేసిన వాగ్దానం మీదా దృష్టిని కేంద్రీకరించడం, దుఃఖాన్ని అధిగమించేందుకు మాకు సహాయపడింది.

తమకు కావలసినదాన్ని కనుగొనలేకపోయారు

1941 జనవరిలో, ఆస్ట్రేలియాలో యెహోవాసాక్షులు నిషేధించబడ్డారు. అయితే యేసు అపొస్తలులు చేసినట్లుగానే నేనూ, రాయ్‌ మనుష్యుల కన్నా ఎక్కువగా పరిపాలకుడిగా దేవునికే విధేయత చూపించాము, రెండున్నర సంవత్సరాలు మేము రహస్యంగా పనిచేశాము. నేను మొదట చెప్పిన ఇద్దరు పోలీసులు మామూలు దుస్తుల్లో వచ్చి మా ఇంటి తలుపు కొట్టింది ఆ సమయంలోనే. అప్పుడు ఏమి జరిగింది?

నేను వాళ్ళను ఇంట్లోకి ఆహ్వానించాను. వాళ్ళు ఇంట్లోకి వస్తుండగా “మీరు మా ఇల్లు పరిశోధించే ముందు నేను టీ త్రాగడం పూర్తిచేయనా, మీకు అభ్యంతరమేమీ లేదు కదా?” అని అడిగాను. ఆశ్చర్యకరంగా వాళ్ళు అందుకు అంగీకరించారు, నేను వంటగదిలోకి వెళ్ళి యెహోవాకు ప్రార్థించి నా ఆలోచనలను ఓ కొలిక్కి తెచ్చుకున్నాను. నేను తిరిగి వచ్చినప్పుడు, ఒక పోలీసు మేము అధ్యయనం చేసే చోటికి వెళ్ళి వాచ్‌టవర్‌ చిహ్నంతో కనిపించిన ప్రతిదాన్నీ నా సాక్ష్యపు సంచిలోని సాహిత్యాన్నీ నా బైబిలునూ తీసుకున్నాడు.

“మీరు కార్టన్‌లలో దాచిపెట్టిన సాహిత్యాలు నిజంగానే ఇంకేమీ లేవా?” అని ఆయన అడిగాడు. “మీరు ఈ రోడ్డు చివరన ఉన్న ఒక హాలులో ప్రతివారం కూటానికి హాజరవుతారనీ అక్కడికి చాలా సాహిత్యాలను తీసుకువెళ్తారనీ మాకు సమాచారం అందింది” అని కూడా అన్నాడు.

“అది నిజమే, కానీ ఇప్పుడు అక్కడ ఏమీ లేవు” అని జవాబిచ్చాను.

“అవును మిసెస్‌ స్మిత్‌, మాకు ఆ విషయం తెలుసు. ఈ జిల్లాలో ఉన్న ప్రజల ఇళ్ళల్లో ఆ సాహిత్యం స్టోర్‌ చెయ్యబడిందని కూడా మాకు తెలుసు” అని ఆయన అన్నాడు.

మా అబ్బాయి పడకగదిలో ఫ్రీడమ్‌ ఆర్‌ రొమానిజమ్‌ అనే చిన్న పుస్తక ప్రతులు గల ఐదు కార్టన్లను వాళ్లు కనుగొన్నారు.

“మీ గ్యారేజ్‌లో నిజంగానే ఇంకేమీ లేవా?” అని ఆయన అడిగాడు.

“లేవు, అక్కడ ఏమీ లేవు” అని నేనన్నాను.

అప్పుడు ఆయన డైనింగ్‌ రూమ్‌లోని బీరువాను తెరిచాడు. సంఘ నివేదికను పూరించేందుకు ఉపయోగించే పూరించని ఫారమ్‌లు ఆయనకు కనిపించాయి. ఆయన వాటిని తీసుకుని గ్యారేజ్‌లో చూడాలని పట్టుబట్టాడు.

“అలాగైతే ఇలా రండి” అని చెప్పాను.

వాళ్ళు గ్యారేజ్‌కి నా వెంట వచ్చి దాన్ని పరిశోధించి చివరికి వెళ్ళిపోయారు.

ఆ ఐదు కార్టన్లలో తమకు కావలసింది ఉందని ఆ పోలీసులు అనుకున్నారు! అయితే, వాళ్ళు తమకు నిజంగా కావలసినదాన్ని అక్కడే వదిలేశారు. ఆ రోజుల్లో నేను సంఘ కార్యదర్శిగా సేవచేస్తున్నాను, నా దగ్గర సంఘ ప్రచారకుల లిస్టులు ఉండేవి, ప్రాముఖ్యమైన ఇతర సమాచారం కూడా ఇంట్లో ఉండేది. సంతోషకరమైన విషయమేమిటంటే అలాంటి పరిశోధనలకు సిద్ధంగా ఉండమని సహోదరులు మమ్మల్ని ముందే హెచ్చరించారు. నేను ఆ డాక్యుమెంట్లను జాగ్రత్తగా దాచిపెట్టాను. నేను వాటిని కవర్లలో పెట్టి టీ, పంచదార, పిండి మొదలైన డబ్బాల్లో అడుగున పెట్టాను. కొన్నింటిని గ్యారేజ్‌ దగ్గరున్న పక్షుల గూటిలో కూడా ఉంచాను. కాబట్టి పోలీసులు సరిగ్గా తమకు కావలసిన సమాచారం ప్రక్కనుంచి వెళ్ళిపోయారు.

పూర్తికాల సేవలో ప్రవేశించడం

1947 లో మా పెద్ద పిల్లలు తమ సొంత కాపురాలు మొదలుపెట్టారు. ఆ సమయంలో నేనూ, రాయ్‌ పూర్తికాల సేవను చేపట్టే స్థితిలో ఉన్నామని నిశ్చయించుకున్నాం. దక్షిణ ఆస్ట్రేలియా క్షేత్రంలో అవసరం ఉండడం వల్ల, మేము మా ఇంటిని అమ్మేసి ట్రెయిలర్‌ కొనుక్కున్నాము. దానికి మిస్పా అని పేరుపెట్టాము. దాని అర్థము “కావలికోట.” ఈ విధమైన జీవన విధానం వల్ల సుదూర ప్రాంతాల్లో ప్రకటించడం వీలయ్యింది. మేము తరచూ అనియమిత మారుమూల ప్రాంతాల్లో పని చేసేవాళ్ళము. నాకు ఆనాటి మధురస్మృతులు అనేకమున్నాయి. నేను అధ్యయనాలు చేసినవారిలో ఒకరు, బివర్లీ అనే యువతి. బాప్తిస్మం తీసుకునేంతగా ప్రగతి సాధించడానికి ముందే ఆమె ఆ ప్రాంతాన్ని విడిచివెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సమావేశంలో ఒక సహోదరి వచ్చి నేను బివర్లీని అని చెప్పినప్పుడు నాకెంత ఆనందం కలిగిందో ఊహించుకోండి! ఆమె తన భర్తా పిల్లలతోపాటు యెహోవాను సేవిస్తుందని అన్ని సంవత్సరాల తర్వాత తెలిసినప్పుడు నాకెంతో సంతోషం కలిగింది.

1979 లో, పయినీర్‌ సేవా పాఠశాలకి హాజరయ్యే ఆధిక్యత నాకు లభించింది. పాఠశాలలో నొక్కి చెప్పబడిన విషయాల్లో ఒకటి, పయినీరు పరిచర్యలో కొనసాగాలంటే వ్యక్తిగతంగా మంచి అధ్యయన అలవాట్లు ఉండి తీరాలి. అది నిజమని నేను రూఢిగా తెలుసుకున్నాను. అధ్యయనం, కూటాలు, పరిచర్య, ఇవే జీవితంగా ఉన్నాయి. 50 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా నేను క్రమ పయినీరుగా సేవ చేయడం ఒక ఆధిక్యతగా ఎంచుతున్నాను.

ఆరోగ్య సమస్యలను అధిగమించడం

అయితే, చివరి కొన్ని దశాబ్దాల్లో నాకు కొన్ని ప్రత్యేక సవాళ్ళు ఎదురయ్యాయి. 1962 లో, నాకు గ్లూకోమా ఉందని పరీక్షల్లో తేలింది. అప్పట్లో చికిత్స పరిమితంగా ఉండేది, నా కంటి చూపు చాలా త్వరితంగా మందగించనారంభించింది. రాయ్‌ ఆరోగ్యం కూడా క్షీణించింది. 1983 లో, ఆయనకు స్ట్రోక్‌ చాలా తీవ్రంగా వచ్చి, పక్షవాతం రావడంతో మాట పడిపోయింది. ఆయన 1986 లో చనిపోయారు. నా పూర్తికాల సేవలో ఆయన నిజంగా చాలా మద్దతునిచ్చారు, ఆయన లేకపోవడం నాకు తీరని లోటు.

అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నాకు మంచి ఆధ్యాత్మిక దినచర్య ఉండేలా ప్రయత్నించాను. అటు పట్టణమూ ఇటు గ్రామమూ కాని ప్రాంతంలో క్షేత్ర సేవ చేయడం కోసం నేను దృఢంగా ఉన్న ఒక కారును కొనుక్కుని, నా కూతురు జాయిస్‌ సహాయంతో పయినీరు సేవ కొనసాగించాను. నా కంటి చూపు క్రమక్రమంగా తగ్గిపోయి చివరికి, ఒక కన్ను పూర్తిగా కనిపించకుండా పోయింది. డాక్టర్లు దాని స్థానంలో గాజు కంటిని పెట్టారు. అయినప్పటికీ, పెద్దక్షరాల్లో ముద్రితమైన సాహిత్యాన్ని కాస్త కంటిచూపు మిగిలిన ఒక్క కంటితో, భూతద్దం సహాయంతో అధ్యయనం చేసేందుకు ప్రతిరోజు మూడు నుండి ఐదు గంటల వరకు వెచ్చించగలిగేదాన్ని.

అధ్యయన సమయం నాకు ఎల్లప్పుడూ ప్రశస్తమైనదిగా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం నేను అధ్యయనం చేస్తుండగా, అకస్మాత్తుగా నేను దేన్నీ చూడలేకపోయినప్పుడు నేను ఎంత కలవరపడ్డానో మీరు ఊహించవచ్చు. ఎవరో లైట్‌ ఆఫ్‌ చేసినట్లయ్యింది. అప్పుడిక నాకు కంటిచూపు పూర్తిగా పోయింది. మరి నేను నా అధ్యయనాన్ని ఎలా కొనసాగించాను? నాకు అసలు వినబడక పోయినప్పటికీ ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు నేను ఆడియోక్యాసెట్ల మీదా మా కుటుంబ సభ్యుల ప్రేమపూర్వక మద్దతు మీదా ఆధారపడతాను.

చివరి వరకూ సహించడం

నూరేళ్ళు నిండిన నాకు ఇప్పుడు ఆరోగ్య సంబంధంగా ఇంకొన్ని ఇబ్బందులు కలిగాయి. నాకు ఇంతకు ముందున్న వేగం లేదు. కొన్నిసార్లు నాకు అయోమయంగా ఉంటుంది. నాకు అసలేమీ కనిపించదు గనుక, కొన్నిసార్లు నేను నిజంగానే దారి కనుక్కోలేను! నాకు మళ్ళీ మరి కొన్ని బైబిలు అధ్యయనాలుంటే బాగుండునని ఆశిస్తాను, కానీ నా ప్రస్తుత ఆరోగ్యస్థితిని బట్టి నేను ఇక ఎన్నడూ బయటికి వెళ్ళి అధ్యయనాలు కనుగొనలేను. మొదట్లో ఈ పరిస్థితి నన్ను బాగా కృంగదీసింది. నేను నా పరిమితులను అంగీకరించి నేను చేయగలిగినదంతా చేసి దానితోనే తృప్తిపడడం నేర్చుకోవలసి వచ్చింది. కానీ అది అంత సులభమేమీ కాలేదు. అయినప్పటికీ ప్రతి నెలా మన గొప్ప దేవుడైన యెహోవా గురించి మాట్లాడుతూ కనీసం కొంత సమయమైనా నివేదించగలగడం ఎంత ఆధిక్యత. నర్సులు, వ్యాపారస్థులు, మరితరులు మా ఇంటికి వచ్చినప్పుడు బైబిలు గురించి మాట్లాడే అవకాశాలను నేను చేజిక్కించుకుంటాను, అదీ ఎంతో చాతుర్యంగా చిక్కించుకుంటాను.

మా కుటుంబంలోని నాలుగు తరాలవారు యెహోవాకు నమ్మకంగా సేవచేయడాన్ని చూడడం నాకు కలిగిన అత్యంత సంతృప్తికరమైన ఆశీర్వాదాల్లో ఒకటి. వీరిలో కొందరు, ఎక్కువ అవసరత ఉన్న ప్రాంతాల్లో పయినీరు పరిచారకులుగానూ కొందరు పెద్దలుగానూ కొందరు పరిచర్య సేవకులుగానూ సేవచేయగలిగేందుకు, కొందరు బేతేలులో సేవచేయగలిగేందుకు ఎంతో శ్రమపడ్డారు. నిజమే, నా తరంలోని చాలామందిలాగే నేను కూడా ఈ విధానాంతం అతి త్వరలోనే వస్తుందని ఎదురుచూశాను. అయితే నేను సేవచేసిన ఏడు దశాబ్దాల కాలంలో ఎంత పెరుగుదలను చూశాను! ఎంతో గొప్ప కార్యంలో నిమగ్నమయ్యానన్న విషయం నాకు ఎంతో తృప్తినిస్తుంది.

నన్ను సజీవంగా ఉంచుతున్నది బహుశా నా విశ్వాసమే కావచ్చు అని నన్ను సందర్శించే నర్సులు వ్యాఖ్యానిస్తారు. నేను వారితో ఏకీభవిస్తున్నాను. యెహోవా సేవలో క్రియాశీలంగా ఉండడమే జీవితాన్ని శ్రేష్ఠమైనదిగా చేస్తుంది. రాజైన దావీదులాగే నేనూ నిండు జీవితాన్ని అనుభవించానని నిజంగా చెప్పగలను.​—⁠1 దినవృత్తాంతములు 29:⁠28.

(ఈ ఆర్టికల్‌ పూర్తిచేయబడుతుండగా, 2002 ఏప్రిల్‌ 1న సహోదరి మ్యురీల్‌ స్మిత్‌ చనిపోయింది. ఆమె మరొక్క నెల జీవించి ఉంటే ఆమెకు 102 ఏళ్ళు నిండేవి. ఆమె విశ్వాస్యత విషయంలోను, సహనం విషయంలోను నిజంగా మాదిరికరంగా ఉంది.)

[24వ పేజీలోని చిత్రాలు]

నాకు దాదాపు ఐదేళ్ళున్నప్పుడు, నా 19వ ఏట నా భర్త రాయ్‌ని కలిసినప్పుడు

[26వ పేజీలోని చిత్రం]

మా కారు, మిస్పా అని మేము పేరుపెట్టుకున్న ట్రెయిలర్‌

[27వ పేజీలోని చిత్రం]

1971 లో నేను నా భర్త రాయ్‌తో