మూఢనమ్మకాలు నియంత్రించే జీవితం
మూఢనమ్మకాలు నియంత్రించే జీవితం
మీరు మీ ఇంట్లోనుండి బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఢీకొంటారు. అప్రయత్నంగా మీ కాలి బొటనవేలు ఒక రాయికి తగులుతుంది. రాత్రివేళ ఒక రకమైన పక్షి అరుస్తుంది. మీకు ఒకే కల మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇవన్నీ చాలామందికి నిరపాయకరమైన మామూలు సంఘటనలే. కానీ పశ్చిమాఫ్రికాలోని కొంతమందికి ఇవి ఆత్మలోకం నుండి వచ్చిన సూచనలుగా శకునాలుగా లేదా సందేశాలుగా ఉండగలవు. వచ్చిన సూచనను బట్టీ దానికి చెప్పబడుతున్న భావాన్ని బట్టీ మేలైనా కీడైనా తప్పకుండా జరుగుతుందని వారు భావిస్తారు.
ఆఫ్రికాలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా మూఢనమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. నాస్తికత్వం ఆధికారిక నమ్మకంగా ఉండిన సమాజాల్లో సంవత్సరాల పాటు జీవించినప్పటికీ, చైనాలోనూ మునుపటి సోవియట్ యూనియన్‌కు చెందిన రిపబ్లిక్ రాష్ట్రాల్లోనూ ఆశ్చర్యపర్చేంత ఎక్కువమంది ఇప్పటికీ మూఢనమ్మకాలను అంటిపెట్టుకునేవున్నారు. పాశ్చాత్య దేశాలలో చాలామంది తమ రాశిచక్రాన్ని సంప్రదిస్తారు, 13వ తేదీ శుక్రవారం అయితే భయపడతారు, నల్ల పిల్లుల్ని తప్పించుకుని తిరుగుతారు. ఉత్తరార్థగోళంలోని దేశాలలో నివసిస్తున్న కొంతమంది, ఉత్తర ధృవపు వెలుగు కిరణాలను యుద్ధానికీ తెగులుకూ ఒక శకునంగా దృష్టిస్తారు. ఇండియాలో, వేసవి కాలంలో తమ శరీరాన్ని సమశీతలంగా ఉంచుకోవడానికి లైంగిక సంబంధాలు కలిగివుండాలని విశ్వసించే ట్రక్కు డ్రైవర్లు ఎయిడ్స్ వ్యాధిని వ్యాపింపజేస్తున్నారు. జపాన్‌లో, ఒక సొరంగాన్ని నిర్మించడం పూర్తికాక ముందే ఒక స్త్రీ అందులోకి ప్రవేశిస్తే అది మంచి శకునం కాదని సొరంగంలో పనిచేసే వారు నమ్ముతారు. వృత్తిపరమైన క్రీడల్లో కూడా మూఢనమ్మకాలు వర్ధిల్లుతున్నాయి. ఒక వాలీబాల్ క్రీడాకారుడు తాను వరుసగా గెలుపొందడానికి కారణం, తెల్లని సాక్సులకు బదులు నల్లని సాక్సులు వేసుకోవడమేనని చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు అంతేలేదు.
మరి మీ సంగతి ఏమిటి? మీకు ఏదైనా రహస్యమైన, వివరించలేని భయం ఉందా? మీరు తార్కికపరంగా వివరణ ఏమీ లేనట్లు కనిపించే ఏదైనా ఒక నమ్మకాన్ని బట్టి గానీ నమ్మకంలోని కొంతభాగాన్ని బట్టి గానీ ఆచారాన్ని బట్టి గానీ ప్రభావితమవుతున్నారా? మీరిచ్చే సమాధానం, మీ జీవితం మూఢనమ్మకంచే నియంత్రించబడుతుందో లేదో చూపించగలదు, ఎందుకంటే “మూఢనమ్మకం” అంటే అదే.
ఒక వ్యక్తి, మూఢనమ్మకం తన నిర్ణయాలనూ దైనందిన జీవితాన్నీ ప్రభావితం చేయడానికి అనుమతిస్తే తనకు నిజంగా అర్థంకాని విషయం తనమీద అధికారం చెలాయించడానికి అనుమతిస్తున్నట్లే. అది జ్ఞానయుక్తమైనదేనా? మనల్ని మనం అలాంటి అస్పష్టమైన, బహుశా దుష్టమైన ప్రభావానికి లోబడేటట్లు చేసుకోవాలా? మూఢనమ్మకం నిరపాయకరమైన బలహీనతా లేక ప్రమాదకరమైనదా?