మూఢనమ్మకాలు మీ జీవితాన్ని నియంత్రిస్తున్నాయా?
మూఢనమ్మకాలు మీ జీవితాన్ని నియంత్రిస్తున్నాయా?
మూఢనమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కొన్నిసార్లు అవి సాంస్కృతిక వారసత్వంలో ఒక భాగంగా గౌరవించబడతాయి. లేదా అవి జీవితాన్ని మరింత ఆసక్తికరంగా చేసే స్వల్పమైన విషయాలుగా పరిగణించబడవచ్చు. పాశ్చాత్య దేశాల్లో మూఢనమ్మకాలను సాధారణంగా గంభీరమైన విషయాలుగా పరిగణించరు. కానీ వేరే ప్రాంతాల్లో, ఉదాహరణకు ఆఫ్రికాలో మూఢనమ్మకాలు ప్రజల జీవితాలను ఎంతో ప్రభావితం చేయగలవు.
ఆఫ్రికా సంస్కృతి చాలా మట్టుకు మూఢనమ్మకం మీదే ఆధారపడి ఉంది. ఆఫ్రికాలోని సినిమాలు, రేడియో కార్యక్రమాలు, సాహిత్యం మూఢనమ్మకాన్నీ మార్మికత్వానికి సంబంధించిన ఇంద్రజాలం, పూర్వికుల ఆరాధన, తాయెత్తుల వంటి విషయాలనూ తరచూ ఉన్నతపరుస్తాయి. ప్రజలు, మూఢనమ్మకాలచే ఎందుకింతగా ప్రభావితం చేయబడుతున్నారు, మూఢనమ్మకాలు ఎక్కడి నుండి పుట్టుకొస్తాయి?
మూఢనమ్మకాల మూలం ఏమిటి?
మూఢనమ్మకాల్లో అనేకం ప్రాథమికంగా, మృతుల ఆత్మలను గురించిన లేదా ఏవో ఒక రకమైన ఆత్మలను గురించిన భయం నుండే పుట్టుకొస్తాయి. జరిగిన సంఘటనలను, ఈ ఆత్మలు జీవించివున్నవారిని బెదిరించడానికో హెచ్చరించడానికో లేదా ఆశీర్వదించడానికో వారితో మాట్లాడడానికి చేసే ప్రయత్నాలుగా వివరించడం జరుగుతుంది.
మూఢనమ్మకాలకు స్వస్థపర్చడంతోనూ మందులతోనూ చాలా దగ్గరి సంబంధం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని చాలామంది ప్రజలకు ఆధునిక కాల మందులు చాలా ఖరీదైనవి, తరచూ అవి వారి తాహతుకు మించినవి. కాబట్టి, చాలామంది పూర్వికుల ఆచారాలను, అభిచారాన్ని, మూఢనమ్మకాలను పాటించడం ద్వారా రోగాలను నయంచేసుకోవాలనీ అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ ప్రయత్నిస్తారు. ఒక డాక్టర్ని సంప్రదించడం కన్నా తమ ఆచారాలు తెలిసిన, తమ భాషే మాట్లాడే భూతవైద్యుడ్ని సంప్రదించడానికే వారు ఎక్కువగా ఇష్టపడతారు. అలా మూఢనమ్మకాలు వర్ధిల్లుతూనే ఉన్నాయి.
అనారోగ్యాలు, దుర్ఘటనలు కేవలం అనుకోకుండా జరిగే సంఘటనలు కాదుగానీ ఆత్మలోకంలోని శక్తులు జరిగించే సంఘటనలని మూఢనమ్మకానికి సంబంధించిన సాంప్రదాయాలు నమ్ముతాయి. చనిపోయిన పూర్వికుడు దేని గురించో వ్యాకులతతో ఉన్నాడని భూతవైద్యులు చెప్పవచ్చు. లేదంటే ప్రత్యర్థి భూతవైద్యుని ద్వారా ఎవరైనా బాధితుని శపించి ఉండవచ్చుననీ అందుకే అనారోగ్యం కలిగింది లేదా యాక్సిడెంట్ సంభవించిందనీ అభిచార మధ్యవర్తులు చెబుతుండవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా మూఢనమ్మకాలు వేర్వేరు విధాలుగా ఉంటాయి, వాటి వ్యాప్తి స్థానిక జానపద గాథల మీదా పురాణ గాథల మీదా ఆ యా పరిస్థితుల మీదా ఆధారపడివుంటుంది. కానీ వీటన్నింటిలోని సాధారణాంశం, అదృశ్య ఆత్మలోకంలోని ఎవరినైనా లేదా దేన్నైనా శాంతింపజేయాలన్నదే.
అపాయకరమైనవా నిరపాయకరమైనవా?
అధికశాతం కుటుంబాలకు కవల పిల్లలు జన్మించడం అనేది అరుదైన, ఆనందకరమైన సంఘటన. కానీ మూఢనమ్మకాలు గలవారు మాత్రం దాన్ని ఒక సూచనగా పరిగణించవచ్చు. పశ్చిమాఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో అనేకులు దాన్ని దైవాలు జన్మించడంగా దృష్టిస్తారు, ఆ కవలల్ని ఆరాధిస్తారు. ఆ కవలల్లో ఒకరు లేదా ఇద్దరూ మరణిస్తే వారి చిన్న విగ్రహాలు తయారు చేయబడతాయి, ఈ విగ్రహాలకు ఆ కుటుంబం ఆహారం అర్పించాలి. వేరే ప్రాంతాల్లో, ప్రజలు
కవలలు జన్మించడాన్ని శాపంగా దృష్టిస్తారు, కొంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లల్లో కనీసం ఒక్కరినైనా చంపడానికి వెనుకాడరు. ఎందుకు? ఇద్దరు పిల్లలూ ప్రాణాలతో ఉంటే ఏదో ఒకరోజున వారు తమను హత్య చేస్తారని ఆ తల్లిదండ్రులు నమ్ముతారు.కొన్ని మూఢనమ్మకాలు ఆకర్షణీయంగానూ హానికరం కానివిగానూ కనిపించవచ్చు, కానీ ఇతర మూఢనమ్మకాలు ప్రమాదకరంగా చివరికి ప్రాణాంతకంగా కూడా ఉండవచ్చని ఇటువంటి ఉదాహరణలు చూపిస్తాయి. కుటిలంగా వివరించి చెప్పడం వల్ల నిరపాయకరమైన ఒక సంఘటన అపాయకరమైన వ్యవహారంగా మార్చబడగలదు.
అవును, నిజానికి మూఢనమ్మకం ఒక విశ్వాసం, ఒకవిధమైన మతం. మూఢనమ్మకం యొక్క ప్రమాదకరమైన అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇలా ప్రశ్నించడం సముచితమే: మూఢనమ్మకాల వల్ల వాటికి సంబంధించిన ఆచారాల వల్ల వాస్తవానికి ఎవరు ప్రయోజనం పొందుతున్నారు?
మూఢనమ్మకాలకు మూలం
సాతాను ఉనికిలో ఉన్నాడని నిరూపించే రుజువులు ఉన్నప్పటికీ కొంతమంది ప్రజలు నేడు సాతాను ఉనికిని లేదా దుష్టాత్మల ఉనికిని నిరాకరించడానికే మొగ్గుచూపుతారు. అయితే యుద్ధ సమయంలో, ప్రమాదకరమైన శత్రువు ఉనికిని గుర్తించడాన్ని నిరాకరించడం విపత్తుకు మాత్రమే దారితీయగలదు. మానవాతీత ఆత్మ ప్రాణులతో జరిగే యుద్ధంలో కూడా అదే నిజం కావచ్చు, ఎందుకంటే మనం “దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఇటాలిక్కులు మావి.)—ఎఫెసీయులు 6:12.
మనం దుష్ట ఆత్మ ప్రాణులను చూడలేకపోతున్నప్పటికీ అవి ఉనికిలో ఉన్నాయి. మొదటి స్త్రీ అయిన హవ్వతో మాట్లాడి ఆమె దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా నడిపించడానికి ఒక అదృశ్య ఆత్మ ప్రాణి, వెంట్రిలాక్విజమ్ అనే కళ ద్వారా నోరు మెదపకుండా మాట్లాడే వ్యక్తి బొమ్మను ఎలా ఉపయోగిస్తాడో అలా సర్పాన్ని ఉపయోగించాడని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 3:1-5) ఈ ఆత్మ ప్రాణి ‘సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘటసర్పము’ అని బైబిలు గుర్తిస్తుంది. (ప్రకటన 12:9) ఇతర దూతలు కూడా తిరుగుబాటు చేసేలా వారిని ప్రలోభపెట్టడంలో సాతాను విజయం సాధించాడు. (యూదా 6) ఈ దుష్ట దూతలు దయ్యాలుగా అంటే దేవుని శత్రువులుగా తయారయ్యారు.
ప్రజలను పీడిస్తున్న దయ్యాలను యేసు వెళ్ళగొట్టాడు, ఆయన శిష్యులు కూడా అలాగే చేశారు. (మార్కు 1:34; అపొస్తలుల కార్యములు 16:18) ఈ ఆత్మలు చనిపోయిన పూర్వికులు కాదు, ఎందుకంటే “చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:5) బదులుగా ఆ ఆత్మలు, సాతాను ద్వారా తప్పుదారి పట్టించబడిన తిరుగుబాటుదారులైన దూతలు. వారిని సంప్రదించడం లేదా వారి ప్రభావానికి లోబడడం తేలికగా తీసుకోవలసిన విషయం కాదు, ఎందుకంటే వారు తమ నాయకుడైన అపవాదియగు సాతాను వలే మనల్ని మ్రింగివేయడానికి ఇష్టపడతారు. (1 పేతురు 5:8) మానవజాతికున్న ఒకే ఒక నిరీక్షణ అయిన దేవుని రాజ్యం నుండి మనల్ని ప్రక్కకు మళ్ళించాలన్నదే వారి లక్ష్యం.
సాతాను, అతని దయ్యాలు ఉపయోగించే ఒక పద్ధతిని బైబిలు వెల్లడి చేస్తుంది: “సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు.” (2 కొరింథీయులు 11:14) సాతాను, తాను మనకు మంచి జీవితాన్ని ఇవ్వగలడని మనం నమ్మేలా మనల్ని మోసం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి, దుష్టాత్మలు జోక్యం చేసుకోవడం ద్వారా కొన్ని తాత్కాలిక ప్రయోజనాలు చేకూరుతున్నట్లు అనిపించవచ్చు. కానీ వారు శాశ్వతమైన పరిష్కారాలను అందించలేరు. (2 పేతురు 2:4) వారు ఎవ్వరికీ నిత్యజీవాన్ని ఎంతమాత్రం ఇవ్వలేరు, అంతేగాక వారు త్వరలోనే నాశనం చేయబడతారు. (రోమీయులు 16:20) మన సృష్టికర్త మాత్రమే నిత్య జీవానికీ నిజమైన ఆనందానికీ మూలం, దుష్టాత్మ శక్తుల నుండి అత్యుత్తమమైన రక్షణ ఆయనే.—యాకోబు 4:7.
అభిచారానికి సంబంధించిన ఆచారాల ద్వారా సహాయాన్ని పొందడాన్ని దేవుడు ఖండిస్తున్నాడు. (ద్వితీయోపదేశకాండము 18:10-12; 2 రాజులు 21:6) అలా చేయడం శత్రువుతో సహవాసం చేసి, దేవుణ్ణి వంచించినవారితో సంబంధాన్ని ఏర్పర్చుకోవడం అవుతుంది! రాశిచక్రాన్ని సంప్రదించడం, భూత వైద్యుని దగ్గర విచారణ చేయడం, అభిచారానికి సంబంధించిన ఏవైనా ఆచారాలలో పాల్గొనడం వంటివి చేస్తే మీ జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలను దుష్టాత్మలు నియంత్రించడానికి అనుమతించినట్లే అవుతుంది. అది, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో ఆ దుష్టాత్మలతో చేతులు కలపడంతో సమానం.
కీడు నుండి రక్షణ—సాధ్యమేనా?
నైగర్‌లో నివసిస్తున్న ఆడే * అనే వ్యక్తి, యెహోవాసాక్షుల పూర్తికాల ప్రచారకుడితో బైబిలు అధ్యయనం చేస్తున్నాడు. తన దుకాణంలో తాయెత్తు ఎందుకు ఉందో ఇలా వివరించాడు: “నాకు చాలామంది శత్రువులున్నారు.” నిజమైన రక్షణకై నమ్మదగినవాడు కేవలం యెహోవాయే అని ఆడేకు బైబిలును బోధిస్తున్న సాక్షి చూపించాడు. “యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును” అని చెబుతున్న కీర్తన 34:7వ వచనాన్ని ఆడేకు చదివి వినిపించాడు. ఆడే ఈ నిర్ణయానికి వచ్చాడు: “యెహోవా నన్ను నిజంగా రక్షించగలిగితే, నేను ఆ తాయెత్తును తీసివేస్తాను.” ఎన్నో సంవత్సరాల తర్వాత, ప్రస్తుతం ఆయన ఒక పెద్దగా, పూర్తికాల పరిచారకుడిగా సేవచేస్తున్నాడు. ఆయన శత్రువుల్లో ఏ ఒక్కరూ ఆయనకు హాని చేయలేదు.
మనకు మూఢనమ్మకాలు ఉన్నా లేకపోయినా, కాలవశానికీ అనూహ్య సంఘటనలకూ మనమందరం గురౌతామని బైబిలు చూపిస్తుంది. (ప్రసంగి 9:11, NW) కానీ యెహోవా ఎన్నడూ మనల్ని హానికరమైన వాటితో పరీక్షించడు. (యాకోబు 1:13) ఆదాము ద్వారా సంక్రమించిన పాపము వల్లనే మరణం, అపరిపూర్ణత వచ్చాయి. (రోమీయులు 5:12) ఈ కారణం చేతనే, అందరం అప్పుడప్పుడూ అనారోగ్యానికి గురౌతాము, విపత్కరమైన పర్యవసానాలకు దారితీయగల పొరపాట్లను కూడా చేస్తాము. కాబట్టి, అనారోగ్యానికి గానీ జీవితంలోని సమస్యలకు గానీ దుష్టాత్మల చర్యలే కారణమని భావించడం తప్పు. అలాంటి నమ్మకం, ఏదో ఒకవిధంగా ఆత్మలను శాంతింపజేయడానికి ప్రయత్నించేలా మనలను శోధిస్తుంది. * మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు సరైన వైద్యసహాయాన్ని పొందాలి కానీ “అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు” అయిన సాతాను సలహాను కాదు. (యోహాను 8:44) పూర్వికులకు సంబంధించిన మూఢనమ్మకాలు ప్రబలంగా ఉన్న దేశాలలో నివసిస్తున్న ప్రజలు, ఇతర దేశాలలో నివసిస్తున్న ప్రజల కంటే ఎక్కువ కాలమేమీ జీవించడం లేదనీ వారికంటే మెరుగైన జీవితాలేమీ గడపడం లేదనీ గణాంకాలు చూపిస్తున్నాయి. కాబట్టి, మూఢనమ్మకాలు ఆరోగ్యానికి ప్రయోజనకరం కావన్నది సుస్పష్టం.
ఏ దుష్టాత్మ కంటే కూడా దేవుడే అధిక శక్తిమంతుడు, ఆయన మన సంక్షేమంపట్ల ఆసక్తి కలిగివున్నాడు. “ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి.” (1 పేతురు 3:12) కాపుదల కోసం జ్ఞానం కోసం ఆయనకు ప్రార్థించండి. (సామెతలు 15:29; 18:10) ఆయన పరిశుద్ధ వాక్యమైన బైబిలును అర్థం చేసుకోవడానికి కృషి చేయండి. బైబిలు గురించిన ఖచ్చితమైన జ్ఞానమే మనం కలిగివుండగలిగే అత్యుత్తమమైన కాపుదల. అది, చెడు విషయాలు ఎందుకు జరుగుతాయో సర్వశక్తిగల దేవుని అనుగ్రహాన్ని ఎలా పొందాలో గ్రహించడానికి సహాయపడుతుంది.
దేవుని గురించిన జ్ఞానం వల్ల లభించే ప్రయోజనాలు
యెహోవా గురించిన ఆయన సంకల్పాల గురించిన ఖచ్చితమైన జ్ఞానం—అజ్ఞానానికీ మూఢనమ్మకానికీ విరుద్ధమైనది—నిజమైన కాపుదలను పొందడానికి కీలకం. బెనిన్‌కు చెందిన జాన్ అనే వ్యక్తి విషయంలో ఇది నిజమని నిరూపించబడింది. జాన్ కుటుంబంలో మూఢనమ్మకాలు లోతుగా పాతుకుపోయి ఉండేవి. మూఢనమ్మకానికి సంబంధించిన ఆచారాల ప్రకారం, అప్పుడే కొడుకును ప్రసవించిన స్త్రీ ప్రత్యేకంగా కట్టబడిన గుడిసెలో తొమ్మిది రోజులు ఉండాలి. ఆమె కూతురిని ప్రసవిస్తే గుడిసెలో ఏడు రోజులు ఉండాలి.
1975 లో జాన్ భార్య అందమైన మగ శిశువుకు జన్మనిచ్చింది, వారు ఆ బాబుకు మార్క్ అని పేరు పెట్టారు. వారికున్న బైబిలు జ్ఞానం ఆధారంగా జాన్, ఆయన భార్యా దుష్టాత్మలతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదనుకున్నారు. అయితే, వారు భయానికీ మూఢనమ్మకాన్ని పాటించమని చేయబడే ఒత్తిడికీ లోనవుతారా? ఆ తల్లి గుడిసెలో ఉంటుందా? లేదు, వారు ఈ మూఢనమ్మకాన్ని తిరస్కరించారు.—రోమీయులు 6:16; 2 కొరింథీయులు 6:14, 15.
జాన్ కుటుంబానికి ఏదైనా కీడు సంభవించిందా? ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, మార్క్ ఇప్పుడు యెహోవాసాక్షుల స్థానిక సంఘంలో పరిచర్య సేవకుడిగా సేవ చేస్తున్నాడు. మూఢనమ్మకం తమ జీవితాన్ని ప్రభావితం చేయడానికీ తమ ఆధ్యాత్మిక సంక్షేమాన్ని అపాయంలో పడవేయడానికీ వారు అనుమతించనందు వల్ల వారి కుటుంబమంతా ఆనందంగా ఉంది.—1 కొరింథీయులు 10:21, 22.
నిజ క్రైస్తవులు మూఢనమ్మకానికి సంబంధించిన దుష్ట ఆచారాలను తమ జీవితాలనుండి దూరంగా ఉంచి, సృష్టికర్త అయిన యెహోవా ఆయన కుమారుడైన యేసుక్రీస్తూ అందించే ఆధ్యాత్మిక వెలుగును స్వీకరించాలి. అలా చేసినప్పుడు వారు, తాము దేవుని దృష్టిలో సరైనదే చేస్తున్నామన్న జ్ఞానం నుండి వచ్చే నిజమైన మనశ్శాంతిని అనుభవించగలుగుతారు.—యోహాను 8:32.
[అధస్సూచీలు]
^ పేరా 20 పేర్లు మార్చబడ్డాయి.
^ పేరా 21 సెప్టెంబరు 1, 1999, కావలికోటలో “దుష్టాత్మలు మనల్ని రోగగ్రస్థులను చేస్తాయా?” అన్న ఆర్టికల్‌ను చూడండి.
[5వ పేజీలోని బాక్సు/చిత్రం]
ప్రపంచవ్యాప్తంగావున్న సర్వసాధారణమైన కొన్ని మూఢనమ్మకాలు
• అన్నం గిన్నెలో నిటారుగా ఉన్న చాప్ స్టిక్స్ మరణానికి సూచన
• సూర్యకాంతిలో గుడ్లగూబను చూడడం దురదృష్టాన్ని కలుగజేస్తుంది
• ఒక మతకర్మ జరుగుతున్నప్పుడు మధ్యలో దీపం ఆరిపోతే దుష్టాత్మలు దగ్గర్లోనే ఉన్నాయని అర్థం
• గొడుగును నేలమీద పడవేస్తే ఆ ఇంట్లో హత్య జరుగుతుందని అర్థం
• పరుపు మీద టోపీ పెట్టడం దురదృష్టాన్ని తెస్తుంది
• గంటల శబ్దం దయ్యాలను దూరంగా ఉంచుతుంది
• పుట్టినరోజు కేక్ మీద ఉన్న క్రొవ్వొత్తులను అన్నింటినీ మొదటి ప్రయత్నంలోనే ఆర్పేయడం ఆ వ్యక్తి కోరిక తీరేలా చేస్తుంది
• చీపురును పరుపుకు అడ్డంగా పెడితే, ఆ చీపురులోని దుష్టాత్మలు పురుపు మీద మంత్రం వేయగలవు
• ఒక నల్లపిల్లి మీ దారి దాటితే అది దురదృష్టానికి సూచన
• మీ చేతిలోనుండి ఫోర్క్ క్రింద పడితే ఎవరో మిమ్మల్ని సందర్శించడానికి వస్తున్నారు
• ఏనుగుల చిత్రం తలుపుకు ఎదురుగా ఉంటే అది అదృష్టాన్ని తెస్తుంది
• గుమ్మానికి ఎదురుగా గుఱ్ఱపు నాడా తగిలిస్తే అది అదృష్టాన్ని తెస్తుంది
• ఇంటిమీద పాకే తీగపాదు కీడు నుండి రక్షణనిస్తుంది
• నిచ్చెన క్రిందనుండి నడవడం దుశ్శకునం
• అద్దాన్ని పగలకొట్టడమంటే ఏడు సంవత్సరాల దురదృష్టం
• మిరియాల పొడి పడేస్తే మీకు మీ సన్నిహిత స్నేహితునితో వివాదం వస్తుంది
• ఉప్పు పడేయడం దురదృష్టాన్ని తెస్తుంది, అలా కాకూడదంటే మీ ఎడమ భుజం మీదుగా ఒక చిటికెడు ఉప్పును పడవేయాలి
• ఊగే కుర్చీలో ఎవ్వరు కూర్చోనప్పుడు కూడా దాన్నలా ఊగనివ్వడం దానిలో కూర్చోవడానికి దయ్యాలను ఆహ్వానిస్తుంది
• బూట్లను తిరగేసి ఉంచడం దురదృష్టాన్ని తెస్తుంది
• ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి ఆత్మ ఆ ఇంటిలోనుండి బయటకు వెళ్ళడానికి వీలుగా కిటికీలు తెరవాలి
[6వ పేజీలోని బాక్సు]
మూఢనమ్మకం ప్రభావాల నుండి విముక్తి పొందడం
దక్షిణాఫ్రికాలోని ఒక ప్రాంతంలో యెహోవాసాక్షులు ప్రకటిస్తున్నారు. వారు ఒక ఇంటి తలుపు తట్టినప్పుడు, సంగోమ (భూతవైద్యులు) ధరించే పూర్తి ప్రత్యేకమైన వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ తలుపు తెరిచి సాక్షుల ఎదుట నిలబడింది. వారు వెళ్ళిపోవాలనుకున్నారు, కానీ వారి సందేశం ఏమిటో చెప్పి వెళ్ళమని ఆ స్త్రీ బలవంత పెట్టింది. అభిచారానికి సంబంధించిన ఆచారాల గురించి దేవుని ఉద్దేశాన్ని ఆ స్త్రీకి చూపించడానికి ఆ సాక్షుల్లో ఒకరు ద్వితీయోపదేశకాండము 18:10-12 చదివారు. ఆ భూతవైద్యురాలు సందేశాన్ని విని బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించింది. సంగోమగా పనిచేయడం యెహోవా చిత్తానికి వ్యతిరేకమైనదని తన బైబిలు అధ్యయనం ద్వారా తాను ఒప్పించబడితే తాను దాన్ని ఆపేస్తానని ఆమె చెప్పింది.
బైబిలుతో పాటు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం నుండి 10 వ అధ్యాయాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఆమె తన దగ్గరవున్న క్షుద్రవిద్యకు సంబంధించిన వస్తువులన్నింటిని కాల్చివేసింది, రాజ్యమందిరంలో కూటాలకు హాజరవ్వడం ప్రారంభించింది. అంతేకాక, ఆమె తన భర్త నుండి 17 సంవత్సరాల పాటు వేరుగా ఉన్నప్పటికీ తన వివాహాన్ని చట్టబద్ధం చేసుకుంది. ఇప్పుడు ఇద్దరూ యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్న సాక్షులు.
[6వ పేజీలోని చిత్రం]
ఒక “సంగోమ” ఒక రోగి సమస్యకు కారణాన్ని తెలుసుకోవడానికి ఎముకలను విసురుతోంది
[7వ పేజీలోని చిత్రాలు]
దేవుని గురించిన ఖచ్చితమైన జ్ఞానము నిజమైన కాపుదలనూ ఆనందాన్నీ తెస్తుంది