యోగం కేవలం వ్యాయామమేనా లేక ఇంకేమైనా ఇమిడివుందా?
యోగం కేవలం వ్యాయామమేనా లేక ఇంకేమైనా ఇమిడివుందా?
తమ శరీరం నాజూగ్గా ఆరోగ్యంగా ఉండాలని నేడు ప్రజలు ఎంతగానో కోరుకుంటున్నారు. అందుకే చాలామంది వ్యాయామశాలలనూ హెల్త్ క్లబ్బులనూ ఆశ్రయిస్తున్నారు. ఆ కారణాల వల్లే పాశ్చాత్య దేశాలలోని వేలాదిమంది ప్రజలు ప్రాచ్య దేశాలకు చెందిన యోగం (Yoga) కళను ఆశ్రయించారు.
ఒత్తిడి, కృంగుదల, ఆశాభంగం వల్ల బాధపడుతున్న ప్రజలు కూడా ఉపశమనం కోసం పరిష్కారాల కోసం యోగంను ఆశ్రయించారు. ప్రత్యేకించి హిప్పీల, ఫ్లవర్ చిల్డ్రెన్‌ల దశాబ్దమైన 1960ల నుండి ప్రాచ్య మతాల మీదా వారి మార్మిక ఆచారాల మీదా ఆసక్తి పాశ్చాత్య దేశాలన్నిటిలోకి వ్యాపించింది. యోగం నుండే వచ్చిన తాదాత్మ్య చింతన అనే కళను సినీ తారలు, రాక్ సంగీతకారులు ప్రసిద్ధి చేశారు. యోగంపై పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా మనం ఇలా ప్రశ్నించవచ్చు: ‘యోగం కేవలం దాన్ని ఆచరించే వ్యక్తికి ఆరోగ్యవంతమైన నాజూకైన శరీరాన్నీ కొంత మనశ్శాంతినీ ఇచ్చే వ్యాయామ కార్యక్రమం మాత్రమేనా? ఏ మతపరమైన సూచనలూ లేకుండా యోగంను ఆచరించవచ్చా? యోగం క్రైస్తవులకు తగినదేనా?’
యోగం నేపథ్యం
యోగం అనే సంస్కృత పదం, ఐక్యంచేయడం లేదా ఒక కాడి క్రిందకు తీసుకురావడం, అదుపు చేయడం అన్న అర్థాలను కలిగివుండవచ్చు. ఒక హిందువుకు యోగం అనేది గొప్ప మానవాతీత శక్తితో లేదా ఆత్మతో ఏకమవ్వడానికి నడిపించే ఒక నైపుణ్యం లేదా బోధ. అది “శరీరంలోని అన్ని శక్తులనూ అంటే మనస్సునూ ఆత్మనూ దేవునితో జతచేయడం” అని వర్ణించబడింది.
యోగం ఎంత ప్రాచీనమైనదని చరిత్ర చెబుతుంది? వేర్వేరు యోగాసనాలు వేసిన వ్యక్తుల రూపాలు చెక్కబడివున్న ముద్రలను సింధు లోయలో అంటే ప్రస్తుతదిన పాకిస్తాన్‌లో కనుగొన్నారు. పురాతత్త్వ శాస్త్రజ్ఞుల ప్రకారం సింధు లోయ నాగరికత సా.శ.పూ. మూడవ, రెండవ సహస్రాబ్దులకు చెందినది, ఇది మెసొపొటేమియా సంస్కృతి కాలానికి చాలా దగ్గరి సమయంలోనిది. సింధు లోయకు మెసొపొటేమియాకు చెందిన కళాకృతులు, ఒక దేవతకు ప్రాతినిధ్యం వహిస్తూ జంతువుల కొమ్ములను కిరీటంలా ధరించి, జంతువుల మధ్య ఉన్న వ్యక్తిని చిత్రీకరిస్తున్నాయి, ఆ వ్యక్తి “పరాక్రమముగల వేటగాడు” అయిన నిమ్రోదును మనకు జ్ఞప్తికి తెస్తాడు. (ఆదికాండము 10:8, 9) యోగాసనాలు వేసి కూర్చుని ఉన్న ఆ రూపాలు దేవుడైన శివుడి ప్రతిమలు అని హిందువులు అంటారు. జంతువుల దేవుడు, యోగం దేవుడు అయిన శివుడు తరచూ లింగం రూపంలో ఆరాధించబడతాడు. కాబట్టి హిండూ వరల్డ్ అనే పుస్తకం యోగం గురించి ఇలా తెలియజేస్తోంది, “ఇది వైరాగి ఆచారాల నియమావళి, ప్రాముఖ్యంగా ఆర్యులకంటే ముందు కాలానికి చెందినది, దీనిలో ప్రాచీన తలంపులకు ఆచారాలకు సంబంధించిన స్మృతిచిహ్నాలున్నాయి.”
యోగంకు సంబంధించిన పద్ధతులు మొదట్లో మౌఖికంగా అందజేయబడ్డాయి. ఆ తర్వాత పతంజలి అనే ఋషి వాటిని యోగసూత్ర అనే పుస్తకంలో వివరించి వ్రాశాడు. అదే, యోగం గురించిన ప్రాథమిక ఉపదేశ పుస్తకంగా ఉంది. పతంజలి అభిప్రాయం ప్రకారం యోగం అంటే, “మానవ నైజంలోని వివిధ శారీరక మానసిక అంశాలను అదుపు చేసుకోవడం ద్వారా పరిపూర్ణతను సాధించడానికి చేసే క్రమబద్ధమైన కృషి.” యోగం దాని ప్రారంభం నుండి ఇప్పటివరకు, ప్రాచ్య మతాల్లోనూ ఇప్పుడు ప్రత్యేకించి హిందూ జైన బౌద్ధ మతాల్లోనూ అంతర్భాగంగా ఉంది. యోగం, సర్వాంతర్యామితో ఏకమవ్వడం ద్వారా మోక్షాన్ని లేదా విముక్తిని పొందడానికి తమను నడిపిస్తుందని దాన్ని ఆచరించే కొందరు నమ్ముతారు.
కాబట్టి మరోసారి మనమిలా ప్రశ్నించవచ్చు: ‘మతంతో ఏ సంబంధం లేకుండా, ఆరోగ్యవంతమైన శరీరాన్నీ ప్రశాంతమైన మనస్సునూ పెంపొందించుకోవడానికి యోగంను కేవలం ఒక వ్యాయామంగా ఆచరించవచ్చా?’ దాని నేపథ్యం దృష్ట్యా ఈ ప్రశ్నకు సమాధానం మనం అలా చేయలేము అనే చెప్పాల్సి ఉంటుంది.
యోగం మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది?
ఒక బోధగా యోగంను ఆచరించడంలోని ఉద్దేశం, ఒక వ్యక్తి మానవాతీత ఆత్మతో కలవడం లేదా ఏకమవ్వడం అనే ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి అతడిని నడిపించడమే. కానీ అది ఏ ఆత్మ అయ్యుంటుంది?
హిండూ వరల్డ్ అనే పుస్తకంలో రచయిత బెంజమిన్ వాకర్ యోగం గురించి ఇలా అంటున్నాడు: “ఇది మంత్రాలకు సంబంధించిన ఆచారాల తొలి పద్ధతి అయ్యుండవచ్చు, ఇప్పటికీ కూడా యోగంకువున్న అర్థంలో ఇంద్రజాలం, పిశాచాలతో మాట్లాడడం చూఛాయగా కనిపిస్తాయి.” యోగంను ఆచరించడంలోని అసలు లక్ష్యం అతి ప్రాకృతిక శక్తులను పొందడం కాదని సాధారణంగా హిందూ తత్వవేత్తలు వాదించినప్పటికీ యోగంను ఆచరించడం అతి ప్రాకృతిక శక్తులను ఇవ్వగలదని వారు అంగీకరిస్తున్నారు. ఉదాహరణకు, ఇండియన్ ఫిలాసఫీ అనే పుస్తకంలో ఇండియా మాజీ రాష్ట్రపతి అయిన డా. ఎస్. రాధాకృష్ణన్ యోగి గురించి వ్యాఖ్యానిస్తూ “వేర్వేరు భంగిమల ద్వారా శరీరాన్ని ఆధీనంలో ఉంచుకోవడం అత్యంత వేడిని గానీ అత్యంత చల్లదనాన్ని గానీ తట్టుకోవడానికి నడిపిస్తుంది. . . . యోగి ఎక్కడో జరుగుతున్నవాటిని చూడగలడు, వినగలడు . . . సాధారణంగా సంప్రదించే విధానాల ప్రమేయం లేకుండానే ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి తలంపులు ప్రసారం చేయబడడం సాధ్యమే. . . . యోగి తన శరీరాన్ని అదృశ్యంగా చేసుకోగలడు.”
ఒక యోగి మేకుల పరుపు మీద పడుకోవడం లేదా మండుతున్న నిప్పుల మీద నడవడం వంటి చిత్రాలు కొంతమందికి మోసంలాగా మరికొందరికి హాస్యాస్పదంగానూ అనిపించవచ్చు. కానీ ఇండియాలో ఇవి సర్వసాధారణంగా జరిగే సంఘటనలు. రెప్పవేయకుండా సూర్యుణ్ణి సూటిగా చూస్తూ ఒంటి కాలిమీద గంటల తరబడి నిలబడడం, ఒక వ్యక్తిని ఇసుకలో చాలాకాలం వరకు పూడ్చి ఉంచడాన్ని సాధ్యం చేసేలా శ్వాసను అదుపు చేసుకోవడం వంటివి కూడా సాధారణమే. మూడున్నర సంవత్సరాల ఒక బాలిక కడుపు మీదనుండి 750 కిలోల కంటే ఎక్కువ బరువున్న ఒక కారును వెళ్ళడానికి అనుమతించినప్పుడు ఆ బాలిక అపస్మారకంగా ఉండిపోయిందని 1995, జూన్‌లో ద టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఆ అమ్మాయి తిరిగి లేచినప్పుడు ఆమెకు ఏ అపాయం కలగకుండా సురక్షితంగా ఉండడం చూసి అక్కడవున్న జనం ఆశ్చర్యపోయారు. ఆ నివేదిక ఇంకా ఇలా అంటుంది: “అది కేవలం యోగశక్తి వల్లే సాధ్యమైంది.”
ఏ సాధారణ మానవుడూ ఇలాంటి పనుల్లో వేటినీ చేయలేడనడంలో సందేహం లేదు. కాబట్టి, ఒక క్రైస్తవుడు ఇలా ప్రశ్నించుకోవాలి: ఇలాంటి సాహసాలు దేన్ని సూచిస్తున్నాయి? అవి ‘సర్వలోకములో మహోన్నతుడైన’ యెహోవా నుండి వచ్చినవా లేక వేరే ఏ మూలం నుండైనా వచ్చినవా? (కీర్తన 83:18) ఈ అంశం విషయంలో బైబిలు సమాధానం స్పష్టం. కనానీయులు నివసిస్తున్న వాగ్దాన దేశంలోకి ఇశ్రాయేలీయులు ప్రవేశించబోతుండగా యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు కుమారులకు ఇలా చెప్పాడు: “ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.” ఏ ‘హేయకృత్యములు’? ‘సోదె చెప్పడం, మేఘశకునములనుగాని సర్పశకునములనుగాని చెప్పడం, చిల్లంగితనం, మాంత్రికవిద్య’ వంటి వాటి గురించి మోషే హెచ్చరించాడు. (ద్వితీయోపదేశకాండము 18:9, 10) ఈ పనులు దేవునికి హేయమైనవి, ఎందుకంటే అవి దయ్యాల కార్యములు, పాపభరితమైన శరీరకార్యములు.—గలతీయులు 5:19-21.
క్రైస్తవులకు తగినది కాదు
పై సమాచారానికి వ్యతిరేకంగా ఆరోగ్య ఉపదేశకులు ఏమి చెప్పినప్పటికీ యోగం కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. హిండూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరిమనీస్ అనే పుస్తకం, ఒక గురువు నడిపింపు క్రింద యోగం చేయడం ప్రారంభించిన ఇద్దరు వ్యక్తుల అనుభవాలను చెబుతుంది. ఒక వ్యక్తి ఇలా అన్నట్లు అందులో చెప్పబడింది: “నా ఊపిరిని సాధ్యమైనంత ఎక్కువ సేపు బిగబట్టుకోవడానికి నేను మానవాతీత ప్రయత్నాలు చేశాను, ఇక స్పృహ కోల్పోబోతుండగా ఊపిరి పీల్చుకున్నాను. . . . ఒకరోజు మిట్ట మధ్యాహ్నం, అటు ఇటు కదులుతున్నట్లు అనిపించే ప్రకాశవంతమైన చంద్రుణ్ణి చూసినట్లు నాకు అనిపించింది. ఇంకోసారి, మధ్యాహ్నం నేను కటిక చీకటిలో ఉన్నట్లు ఊహించుకున్నాను. నేను ఈ దర్శనాల గురించి నా ఉపదేశకుడికి చెప్పినప్పుడు . . . ఆయన చాలా సంతోషించాడు. . . . నేను నా తపస్సు ద్వారా మరింత ఆశ్చర్యకరమైన ప్రతిఫలాలను అనుభవించే కాలం ఎంతో దూరంలో లేదని ఆయన నాకు హామీ ఇచ్చాడు.” రెండవ వ్యక్తి ఇలా చెబుతున్నాడు: “నా శరీర భంగిమను మార్చకుండా, నా కనురెప్పలార్పకుండా ఆకాశం వైపు చూడమని అతడు నన్ను ఒత్తిడి చేసేవాడు. . . . కొన్నిసార్లు నేను గాలిలో నిప్పు కణికలను చూస్తున్నట్లు నాకు అనిపించేది; వేరే సమయాల్లో మండుతున్న అగ్ని గోళాలను, ఇతర ఉల్కలను చూస్తున్నట్లు అనిపించేది. నా ప్రయత్నాలు ఫలించినందుకు నా ఉపాధ్యాయుడు చాలా సంతోషించాడు.”
అలాంటి అసాధారణమైన దృశ్యాలే యోగంకు సంబంధించిన వ్యాయామాల నిజమైన లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడే సరైన ఫలితాలు కావచ్చునని ఆ గురువులు అనుకున్నారు. అవును, యోగం చివరి లక్ష్యం మోక్షమే, అది అశరీర గొప్ప ఆత్మతో ఏకమవ్వడమని వివరించబడుతోంది. “దానంతట అదే జరిగే ఆలోచనా ప్రక్రియను (ఉద్దేశపూర్వకంగా) నిలిపివేయడం” అని అది వర్ణించబడింది. ఇది క్రైస్తవుల కోసం ఏర్పర్చబడిన లక్ష్యానికి పూర్తి విరుద్ధంగా ఉంది. వారు ఇలా చేయమని ఉద్బోధించబడ్డారు: “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”—రోమీయులు 12:1, 2.
ఎలాంటి శారీరక వ్యాయామాన్ని చేయాలన్నది వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవలసిన విషయం. అయితే క్రైస్తవులు యెహోవా దేవునితో తమకున్న సంబంధాన్ని పాడు చేయడానికి దేనినీ అనుమతించరు. అది శారీరక శిక్షణ, తినడం, త్రాగడం, వస్త్రధారణ, వినోదం, లేదా మరేదైనా సరే. (1 కొరింథీయులు 10:31) కేవలం తమ ఆరోగ్యం కోసమే వ్యాయామం చేసేవారికి అభిచారం, అతీంద్రియవాదం వంటి ప్రమాదాల నుండి దూరంగా ఉంచే అనేక ఇతర విధానాలు అందుబాటులో ఉన్నాయి. అబద్ధమతంలో వేళ్ళూనుకునివున్న ఆచారాలకు నమ్మకాలకు దూరంగా ఉండడం ద్వారా దేవుని నీతియుక్తమైన నూతనలోకంలో ఆయన ఆశీర్వాదాల కోసం మనం ఎదురుచూడవచ్చు. ఆ నూతనలోకంలో మనం నిత్యం పరిపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యాన్ని అనుభవించవచ్చు.—2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4.
[22వ పేజీలోని చిత్రాలు]
చాలామంది, అభిచారానికి తమను గురిచేయని ఆరోగ్యవంతమైన కార్యకలాపాలను ఆనందిస్తారు