కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హృదయపూర్వకంగా పడే శ్రమను యెహోవా ఎప్పుడు ఆశీర్వదిస్తాడు?

హృదయపూర్వకంగా పడే శ్రమను యెహోవా ఎప్పుడు ఆశీర్వదిస్తాడు?

హృదయపూర్వకంగా పడే శ్రమను యెహోవా ఎప్పుడు ఆశీర్వదిస్తాడు?

‘తెల్లవారుతోంది గనుక నన్ను పోనివ్వు.’

‘నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యను.’

‘నీ పేరేమిటి?’

‘యాకోబు.’

‘నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు.’​—⁠ఆదికాండము 32:​26-28.

ఆసక్తికరమైన ఈ సంభాషణ, 97 ఏండ్ల యాకోబు బలాఢ్యుడిలా శక్తివంతంగా చాకచక్యంగా పోరాడడం మూలంగా జరిగింది. బైబిలు ఆయనను ఒక బలాఢ్యుడిగా వర్ణించడంలేదు కానీ, ఆయన ఒక దేవదూతతో రాత్రంతా కుస్తీపట్టాడు, పెనుగులాడాడు. ఎందుకని? తన పూర్వీకుడికి యెహోవా చేసిన వాగ్దానం గురించిన, అంటే తన వారసత్వం గురించిన చింత ఆయనకు చాలా ఉంది.

అనేక సంవత్సరాల క్రితం ఆయన అన్న ఏశావు, కొంచెం కలగూర వంటకం కోసం తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఏశావు 400 మంది మనుష్యులతో తన దగ్గరికి వస్తున్నాడని యాకోబు వింటాడు. వ్యాకులతతో ఉన్న యాకోబు, యొర్దాను నదికి అవతల ఉన్న దేశంలో తన కుటుంబం వర్ధిల్లుతుందని యెహోవా చేసిన వాగ్దానం ధ్రువీకరణ కోసం ప్రయత్నిస్తున్నాడన్నది అర్థం చేసుకోగల విషయమే. తన ప్రార్థనలకు అనుగుణంగా యాకోబు నిర్ణాయకమైన చర్య తీసుకుంటాడు. ఆయన తనకు ఎదురొస్తున్న ఏశావుకు ఉదారంగా బహుమానాలను పంపిస్తాడు. అలాగే ఆయన రక్షణ చర్యలు కూడా తీసుకుంటాడు. తన పరివారాన్ని రెండుగా విభజించి, తన భార్యలను పిల్లలను యబ్బోకు రేవు దాటిస్తాడు. ఇప్పుడు తనకున్న యావత్‌ శక్తినీ ఉపయోగించి తీవ్రంగా శ్రమిస్తూ కన్నీరు విడుస్తూ రాత్రంతా దేవదూతతో పెనుగులాడుతూ “దయ చూపమని ఆ దూతను ప్రాధేయపడ్డాడు.”​—⁠హోషేయ 12:​4, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం; ఆదికాండము 32:​1-32.

ఈ సంఘటనకు ముందు యెహోవా ఆశీర్వాదం కోసం శ్రమపడడంలో మాదిరివుంచిన రాహేలు గురించి ఆలోచించండి. ఆమె యాకోబు రెండవ భార్య, ఆయన మొదట ప్రేమించింది ఆమెనే. యాకోబును ఆశీర్వదిస్తానని యెహోవా చేసిన వాగ్దానం గురించి రాహేలుకు బాగా తెలుసు. ఆమె అక్క లేయా యాకోబు మొదటి భార్య. ఆమె నలుగురు కుమారులతో దీవించబడగా రాహేలు గొడ్రాలుగా ఉంది. (ఆదికాండము 29:​31-35) ఆమె తనపై తాను జాలిపడక, ప్రార్థనలో యెహోవాను యాచిస్తూ తన ప్రార్థనలకు పొందికగా చర్య తీసుకుంటుంది. తన పూర్వీకురాలైన శారా, హాగరు విషయంలో చేసినట్లు, రాహేలు తన దాసియైన బిల్హాను యాకోబుకు ఉపపత్నిగా ఇస్తుంది. ఎందుకిస్తుందంటే, పిల్లల కోసమే. ‘ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురు’ అని రాహేలే అంటుంది. * యాకోబు కోసం దాను, నఫ్తాలి అనే ఇద్దరు కుమారులకు బిల్హా జన్మనిస్తుంది. రాహేలు తాను భావోద్వేగపరంగా ఎంత శ్రమపడిందో నఫ్తాలి జన్మించినప్పుడు వ్యక్తం చేస్తూ, “నా అక్కతో పోరాడి గెలిచితి”నని అంటుంది! తర్వాత స్వయంగా రాహేలుకే ఇద్దరు కుమారులు కలిగి దీవించబడుతుంది, వాళ్ళ పేర్లు యోసేపు, బెన్యామీను.​—⁠ఆదికాండము 30:​1-8; 35:⁠24.

యాకోబూ రాహేలూ శారీరకంగాను భావోద్వేగపరంగాను పడిన శ్రమను యెహోవా ఆశీర్వదించడానికి గల కారణమేమిటి? ఏమిటంటే, వారు యెహోవా చిత్తం మీదే తమ మనస్సును కేంద్రీకరిస్తూ వచ్చారు, తమ వారసత్వాన్ని ఎంతో ప్రశస్తమైనదిగా ఎంచారు. తమ జీవితాల్లో ఆయన ఆశీర్వాదముండాలని వాళ్ళు హృదయపూర్వకంగా కోరుకున్నారు, దేవుని చిత్తానికీ తాము చేసుకున్న యాచనలకూ అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకున్నారు.

యెహోవా ఆశీర్వాదాన్ని పొందడానికి పట్టుదలతో శ్రమించడం అవసరమని నేడు చాలామంది యాకోబులా రాహేలులా రూఢిపరచగలరు. వాళ్ళు తరచూ కన్నీళ్ళతోను నిరుత్సాహముతోను నిరాశతోను అలా శ్రమించారు. ఒక క్రైస్తవ తల్లియైన ఎలిజబెతు, చాలా కాలం క్రైస్తవ కూటాలకు హాజరవ్వలేదు. కానీ ఆ తర్వాత, క్రమంగా హాజరవ్వడానికి హృదయపూర్వకంగా తాను పడిన శ్రమను గుర్తు చేసుకుంటోంది. ఆమె ఐదుగురు మగపిల్లలూ చిన్నవాళ్ళు, భర్త అవిశ్వాసి, రాజ్యమందిరం 30 కిలో మీటర్ల దూరంలో ఉంది, అదే వాళ్ళకు అతి దగ్గరలో ఉన్న రాజ్యమందిరం. అందుకే కూటలకు వెళ్ళడం ఆమెకు ఒక సవాలుగా ఉండేది. “క్రమంగా కూటాలకు వెళ్ళే ప్రయత్నం చేయాలంటే వ్యక్తిగతంగా క్రమశిక్షణ ఉండడం చాలా అవసరం. అది నాకూ నా కుమారులకూ మంచిదని నాకు తెలుసు. ఈ జీవన విధానం అవలంబించదగినదని గ్రహించేందుకు వారికది సహాయపడింది.” యెహోవా ఆమె పడ్డ శ్రమను ఆశీర్వదించాడు. క్రైస్తవ సంఘంలో క్రియాశీలంగా ఉన్న ఆమె ముగ్గురు కుమారుల్లో ఇద్దరు పూర్తికాల పరిచర్యలో ఉన్నారు. ఆమె, వారి ఆధ్యాత్మిక పురోగమనాన్ని బట్టి ఆనందిస్తూ “ఆధ్యాత్మిక ఎదుగుదలలో వాళ్ళు నన్ను మించిపోయారు” అని అంటోంది. ఆమె పడ్డ శ్రమకు అది ఎంత గొప్ప ఆశీర్వాదం!

హృదయపూర్వకంగా పడే శ్రమను యెహోవా ఆశీర్వదిస్తాడు

హృదయపూర్వకంగా శ్రమిస్తే గట్టిగా కృషిచేస్తే తప్పకుండా ప్రతిఫలాలు లభిస్తాయి. మనం ఒక పనికి లేదా ఒక నియామకానికి ఎంత ఎక్కువ శ్రమిస్తే మనం అంత సంతృప్తిని పొందుతాము. యెహోవా మనలను సృష్టించింది ఆవిధంగానే. “ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే” అని రాజైన సొలొమోను వ్రాశాడు. (ప్రసంగి 3:​13; 5:​18, 19) అయితే దేవుడి నుండి ఆశీర్వాదాన్ని పొందేందుకు, మనం శ్రమిస్తున్నది సరైన దాని కోసమా కాదా అన్నది మనం తప్పకుండా రూఢిపరచుకోవాలి. ఉదాహరణకు, ఆధ్యాత్మిక విషయాలను రెండవ స్థానానికి నెట్టివేసే జీవనశైలిపై యెహోవా ఆశీర్వాదం ఉంటుందని ఎదురుచూడడం సహేతుకమేనా? ఒక సమర్పిత క్రైస్తవుడు క్రైస్తవ కూటాల్లో విశ్వాసాన్ని బలపరిచే సహవాసాన్నీ ఉపదేశాన్నీ క్రమంగా జారవిడుచుకోవడానికి కారణమయ్యే ఉద్యోగానికి గానీ ప్రమోషన్‌లకు గానీ ఒప్పుకుంటే ఆయన యెహోవా ఆమోదం కోసం ఎదురుచూడగలడా?​—⁠హెబ్రీయులు 10:​23-25.

ఒక వ్యక్తి ఉద్యోగంలో పైకి వచ్చేందుకు గానీ భౌతిక సమృద్ధి కోసం గానీ జీవితాంతం కష్టపడి పనిచేసినా ఆధ్యాత్మిక విషయాలను ప్రక్కకు పెడితే ఆయనకు “క్షేమము” కలుగదు. విత్తనాలను విత్తువాడి గురించిన ఉపమానంలో, సరైనది కాని దాని కోసం శ్రమించడం వల్ల కలిగే పర్యవసానాలను యేసు వర్ణించాడు. “ముండ్లపొదలలో విత్తబడిన” విత్తనం గురించి చెబుతూ “వాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును” అని వివరించాడు. (మత్తయి 13:​22) పౌలు కూడా అదే ఉరి గురించి హెచ్చరిస్తూ వస్తుదాయకమైన జీవన విధానాన్ని అవలంబించేవారు “శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును” అని అన్నాడు. ఆధ్యాత్మిక వినాశనానికి దారితీసే అలాంటి జీవన విధానానికి విరుగుడు ఏమిటి? ‘వీటిని విసర్జించి, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడి’ అని కూడా పౌలు చెబుతున్నాడు.​—⁠1 తిమోతి 6:9, 11, 17.

మనకు ఎంత వయస్సున్నా మనం ఎంత కాలంగా యెహోవాను సేవిస్తున్నా మనమందరమూ హృదయపూర్వకంగా శ్రమించడంలో యాకోబు, రాహేలులను అనుకరించడం ద్వారా ప్రయోజనం పొందగలం. తమ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా ఎంత నిరాశ కలిగించేవిగా ఉన్నా దేవుని ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ దృష్టి తమ వారసత్వం మీదే ఉంది. నేడు, మనకు ఎదురయ్యే ఒత్తిళ్ళూ కష్టాలూ కూడా అంత భయంకరంగా, అంత నిరాశ కలిగించేవిగా కృంగదీసేవిగా ఉండవచ్చు. మనం వాటితో పోరాడడం మానుకుని సాతాను దాడికి బలయ్యేలా శోధన కలుగుతుంది. అతడు తన ఉద్దేశాలను సాధించేందుకు తన వశమున ఉన్న దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. అది వినోదమో వ్యాపకమో, క్రీడలో హాబీలో, ఉద్యోగాలో ఆర్థిక సమృద్ధో కావచ్చు. అభిలషణీయమైన ఫలితాల గురించి తరచూ వాగ్దానం చేయబడుతున్నాయి, కానీ ఆ ఫలితాలు నిజం కావడం చాలా అరుదు. అలాంటివాటిలో నిమగ్నమయ్యేలా మోసగించబడినవారే కానివ్వండి ప్రలోభపెట్టబడినవారే కానివ్వండి తరచూ చాలా నిరాశకు గురవుతారు. ప్రాచీన కాలపు యాకోబులా, రాహేలులా పట్టుదలతో పోరాడే వ్యక్తికుండే మనోభావాన్ని అలవరచుకుని సాతాను తంత్రాలపై గెలుపును సాధించుదాం.

‘పరిష్కరించబడుతుందన్న ఆశ లేదు. చేయగలిగింది ఏమీ లేదు. ప్రయత్నించడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు’ అని భావిస్తూ మనం ఓటమిని అంగీకరించాలన్నదే అపవాది కోరిక. ‘నన్ను ఎవ్వరూ ప్రేమించరు,’ ‘యెహోవా నన్ను మరిచిపోయాడు’ అని అనుకుంటూ పోరాడకుండా లొంగిపోయే దృక్పథం అలవడకుండా మనమందరమూ జాగ్రత్తపడడం ఎంతో ప్రాముఖ్యం. అలాంటి ఆలోచనలకు లొంగిపోవడం స్వనాశనానికి దారితీస్తుంది. మనం అలా లొంగిపోవడం పోరాటాన్ని విరమించుకుంటున్నామనీ ఒక ఆశీర్వాదం లభించే దాకా ఇక పోరాడమనీ సూచిస్తుందా? మనం హృదయపూర్వకంగా శ్రమించడాన్ని యెహోవా దీవిస్తాడని గుర్తుంచుకోండి.

యెహోవా ఆశీర్వాదం కోసం పోరాడుతూనే ఉండండి

మన ఆధ్యాత్మిక క్షేమం చాలావరకూ, యెహోవా సేవకుడిగా మన జీవితానికి సంబంధించిన రెండు ప్రాథమిక సత్యాలను గురించి మనకున్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. (1) సమస్యలూ జబ్బులూ జీవితంలో క్లిష్టమైన పరిస్థితులూ ఎవరో ఒక్కరికే లేవు (2) సహాయం కోసం ఆశీర్వాదం కోసం తనను హృదయపూర్వకంగా యాచించేవారి రోదనలను యెహోవా తప్పక వింటాడు.​—⁠నిర్గమకాండము 3:​7-10; యాకోబు 4:⁠8, 10; 1 పేతురు 5:​8, 9.

మీ పరిస్థితులు ఎంత క్లిష్టమైనవైనప్పటికీ మీకు ఎన్ని పరిమితులున్నట్లు మీకనిపించినప్పటికీ “సుళువుగా చిక్కులబెట్టు పాపము” అయిన విశ్వాస లేమికి లొంగిపోకండి. (హెబ్రీయులు 12:⁠1) మీరు ఒక ఆశీర్వాదాన్ని పొందే వరకూ పోరాడుతూనే ఉండండి. ఒక ఆశీర్వాదం కోసం రాత్రంతా పెనుగులాడిన వృద్ధ యాకోబును గుర్తు చేసుకుంటూ ఓపికపట్టండి. మీ ఆధ్యాత్మిక కార్యక్రమం ఎంత పరిమితంగా ఉన్నప్పటికీ, వసంత ఋతువులో విత్తనములు విత్తి పంట కోసం ఎదురు చూసే రైతులాగా మీరు మీ ఆధ్యాత్మిక కార్యక్రమంపై యెహోవా ఆశీర్వాదం కోసం ఓపికతో ఎదురు చూడండి. (యాకోబు 5:​7, 8) “కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు” అని కీర్తనకర్త చెప్పిన మాటలను ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకోండి. (కీర్తన 126:⁠5; గలతీయులు 6:⁠9) నిలకడగా ఉంటూ, పోరాడేవారిలో ఒకరిగా కొనసాగండి.

[అధస్సూచి]

^ పేరా 9 ధర్మశాస్త్ర నిబంధనకు ముందు ఉపపత్నులు ఉండేవారు, ధర్మశాస్త్రం దాన్ని అంగీకరించి నియంత్రణలను ఉంచింది. తాను మొదట్లో ఏదెను తోటలో నెలకొల్పిన ఏకపత్నీ ప్రమాణాన్ని యేసుక్రీస్తు వచ్చేంత వరకు పునఃస్థాపించక పోవడమే సముచితమని యెహోవా ఎంచాడు. అయితే ఆయన ఉపపత్నులకు చట్టం ద్వారా సంరక్షణనిచ్చాడు. ఉపపత్నులను అనుమతించడం, ఇశ్రాయేలులో జనాభా అతి శీఘ్రంగా పెరగడానికి దోహదపడింది.