ఆలోచనా సామర్థ్యం మిమ్మల్ని ఎలా కాపాడగలదు?
ఆలోచనా సామర్థ్యం మిమ్మల్ని ఎలా కాపాడగలదు?
ఉవ్వెత్తున ఎగసిపడే సముద్ర కెరటాలు చూడడానికి అద్భుతంగా కనబడతాయి, కానీ నావికులకు అవి ప్రమాదాన్ని సూచిస్తాయి. అలా ఎగసిపడే కెరటాలు వాళ్ళ ప్రాణాలను పొట్టన పెట్టుకోగలవు.
అదేవిధంగా దేవుని సేవకులు తమను ముంచివేస్తాయన్నంత భయాన్ని కలిగించే అధిక ఒత్తిళ్ళను ఎదుర్కొంటుండవచ్చు. అల తర్వాత అలలాగ వచ్చే కష్టాలూ శోధనలూ క్రైస్తవులను అణచివేస్తాయని మీరు గుర్తించి ఉండవచ్చు. మీ ఆధ్యాత్మిక ఓడ బ్రద్దలు కాకుండా ఉండాలనే దృఢసంకల్పం గలవారిగా మీరు వాటిని స్థిరనిశ్చయంతో ఎదుర్కోవాలని తప్పకుండా కోరుకుంటారు. (1 తిమోతి 1:19) మిమ్మల్ని కాపాడే విషయంలో ఆలోచనా సామర్థ్యానికి ప్రధానమైన భాగం ఉంది. అసలు ఆలోచనా సామర్థ్యం అంటే ఏమిటి? దాన్నెలా పొందవచ్చు?
“ఆలోచనా సామర్థ్యం” అని అనువదించబడిన హీబ్రూ పదం మజీమాహ్, అది “ప్రణాళిక వేయడం లేదా ఉపాయం పన్నడం” అనే అర్థాన్నిచ్చే మూలపదం నుండి వచ్చింది. (సామెతలు 1:4) అందుకే కొన్ని బైబిలు భాషాంతరీకరణాలు మజీమాహ్‌ను “ముందుజాగ్రత్త” లేదా “ముందుచూపు” అని అనువదిస్తాయి. బైబిలు విద్వాంసులైన జామసన్, ఫాసెట్, బ్రౌన్‌లు మజీమాహ్‌ను “చెడు నుండి తప్పించుకొని మంచిని సంపాదించుకునేందుకు అవసరమైన అప్రమత్తత” అని వర్ణించారు. మన చర్యలవల్ల కలిగే తక్షణ ఫలితాలతోపాటు దీర్ఘకాల పర్యవసానాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అది సూచిస్తుంది. ఆలోచనా సామర్థ్యం ఉంటే, మనం చర్య తీసుకోవడానికి ముందు ప్రత్యేకించి ప్రాముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు మనం ఎంపిక చేసుకోవడానికిగల అవకాశాలను జాగ్రత్తగా పరిశీలిస్తాం.
ఆలోచనా సామర్థ్యం గల ఒక వ్యక్తి భవిష్యత్తు గురించి గానీ తన ప్రస్తుత పరిస్థితుల గురించి గానీ నిర్ణయాలను తీసుకుంటే, వాటివల్ల ఎదురయ్యే అవకాశమున్న అపాయాలను గానీ చిక్కులను గానీ మొదట జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఎదురయ్యే అవకాశమున్న ప్రమాదాలను ఒకసారి గుర్తించాక వాటినుండి తానెలా తప్పించుకోవచ్చో ముందుగానే నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయం తీసుకునేటప్పుడు తన పరిసరాల సహవాసాల ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాడు. ఆ విధంగా ఆయన మంచి ఫలితాలను బహుశా దేవుని ఆశీర్వాదాలను కూడా తీసుకురాగల ప్రణాళికను వేసుకోగలుగుతాడు. ఈ ప్రక్రియను చూపించే కొన్ని ఆచరణాత్మకమైన ఉదాహరణలను మనం పరిశీలిద్దాం.
లైంగిక అనైతికత అనే ఉచ్చును తప్పించుకోండి
గాలి, బలమైన కెరటాలను ఒక పడవ ముందు భాగం వైపుకు నెట్టినప్పుడు, సముద్రం ఎదురు వస్తున్నట్లు ఆ పరిస్థితి వర్ణించబడుతుంది. పడవ ముందు భాగాన్ని కెరటాలకు అభిముఖంగా నేరుగా పోనిస్తూ అలా పైకెగసే కెరటాలను నావికులు నైపుణ్యంతో ఎదుర్కోకపోతే వారి పడవ తిరగబడే ప్రమాదం ఉంది.
లైంగికత ప్రభావంలో కూరుకుపోయిన లోకంలో నివసిస్తున్నాం కాబట్టి మనం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటాం. ప్రతిదినం భోగేచ్ఛల ఆలోచనల, ప్రతిరూపాల కెరటాలు మనకు ఎదురవుతాయి. మన సహజమైన లైంగిక కోరికల మీద అవి చూపించగల ప్రభావాన్ని మనం నిర్లక్ష్యం చేయలేం. అయితే మనం మన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి కొట్టుకొనిపోకుండా ఆ శోధనను దృఢ నిశ్చయతతో ఎదుర్కోవాలి.
ఉదాహరణకు, స్త్రీలంటే ఏ మాత్రం గౌరవమివ్వకుండా వారిని కేవలం సెక్స్ కోరికలు తీర్చేవారిగా మాత్రమే పరిగణించే వారితో క్రైస్తవ పురుషులు తరచుగా పని చేస్తుంటారు. తోటి పనివారి సంభాషణల్లో అసభ్యకరమైన జోకులు ద్వంద్వార్థాలున్న మాటలు ఉండవచ్చు. ఇలాంటి పరిసరాలు
చివరికి ఒక క్రైస్తవుని మనస్సులో అనైతిక ఆలోచనలను నాటగలవు.ఒక క్రైస్తవ స్త్రీ ఉద్యోగం చేయాల్సి రావచ్చు, ఆ కారణంగా ఆమె కూడా అనేక కష్టాలను అనుభవించవచ్చు. ఆమె తను పాటించే నైతిక ప్రమాణాలను అంతగా పట్టించుకోని స్త్రీ పురుషులతో కలిసి పని చేస్తుండవచ్చు. బహుశా తన తోటి పనివారిలో ఒక వ్యక్తి తనపై ఆసక్తి చూపిస్తుండవచ్చు. మొదట్లో ఆయన ఆమె బాగోగులను తెలుసుకుంటుండవచ్చు, చివరికి ఆమె మతసంబంధ దృక్కోణాలనుబట్టి ఆమెను గౌరవిస్తుండవచ్చు. ఆయన నిరంతరం చూపించే ఆసక్తి వల్లా ఆయన ఎప్పుడూ కళ్ళెదుటే కనబడడం వల్లా ఆమె ఆయనతో మరింత సన్నిహిత సహవాసాన్ని కోరుకునేలా పురిగొల్పబడే అవకాశముంది.
క్రైస్తవులుగా అలాంటి పరిస్థితుల్లో మనకు ఆలోచనా సామర్థ్యం ఎలా సహాయపడగలదు? మొదటిగా, అది ఆధ్యాత్మిక ప్రమాదాల గురించి మనల్ని అప్రమత్తులను చేయగలదు. రెండవదిగా, సరైన చర్య తీసుకోవడానికి ప్రణాళిక వేసుకునేందుకు మనల్ని పురికొల్పగలదు. (సామెతలు 3:21-23) ఇలాంటి పరిస్థితుల్లో లేఖనాధారితమైన మన నమ్మకాల కారణంగా మన ప్రమాణాలు భిన్నమైనవన్న ఒక స్పష్టమైన సందేశాన్ని తోటి పనివారికి తెలపాల్సి రావచ్చు. (1 కొరింథీయులు 6:18) మన మాటలూ ప్రవర్తనా ఆ సందేశాన్ని బలపరచగలవు. అంతేగాక తోటి పనివారిలో కొందరితో మన వ్యవహారాలను పరిమితం చేసుకోవలసిన అవసరం ఉండవచ్చు.
అయినప్పటికీ అనైతికతకు దారితీసే పరిస్థితులు ఉద్యోగ స్థలానికే పరిమితం కావు. ఒక వివాహిత జంట తమ ఐక్యతను బలహీనపరచడానికి సమస్యలను అనుమతించినప్పుడు కూడా అలాంటి పరిస్థితులు తలెత్తవచ్చు. ఒక ప్రయాణ సేవకుడు ఇలా వ్యాఖ్యానించాడు: “వివాహ బంధం అకస్మాత్తుగా తెగిపోదు. ఆ జంట బహుశా పరస్పరం అడపా దడపా మాత్రమే మాట్లాడుకుంటూ లేదా చాలా అరుదుగా కలిసి సమయం గడుపుతూ నెమ్మది నెమ్మదిగా దూరమవుతుండవచ్చు. వారు తమ వైవాహిక జీవితంలోని శూన్యతను పూరించుకోవడానికి భౌతిక సంపదలను ఆర్జించడంలో కొనసాగుతుండవచ్చు. అంతేగాక వారు పరస్పరం చాలా అరుదుగా ప్రశంసించుకోవడం వల్ల తాము మరో వ్యక్తి వైపుకు ఆకర్షితులవుతున్నట్లుగా భావించవచ్చు.”
అనుభవం గల ఈ సేవకుడు ఇంకా ఇలా చెబుతున్నాడు: “తమ బాంధవ్యానికి ఏదైనా హాని కలిగిస్తోందా అని కూర్చొని మాట్లాడుకోవడానికి భార్యాభర్తలిద్దరూ అప్పుడప్పుడు సమయం తీసుకోవాలి. తాము కలిసి అధ్యయనం చేసుకోవడానికీ ప్రార్థన చేసుకోవడానికీ కలిసి ప్రకటించడానికీ ప్రణాళిక వేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలు కలిసి మాట్లాడుకునేటట్లుగా వారు ‘ఇంట్లోనూ రోడ్డుమీదా పడుకునేటప్పుడూ లేచునప్పుడూ’ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ద్వారా చాలామట్టుకు ప్రయోజనం పొందుతారు.”—ద్వితీయోపదేశకాండము 6:7-9.
క్రైస్తవ విరుద్ధమైన ప్రవర్తనను విజయవంతంగా ఎదుర్కోవడం
ఆలోచనా సామర్థ్యం నైతిక శోధనలను విజయవంతంగా ఎదుర్కోవడానికి మనకు సహాయం చేయడంతోపాటు తోటి క్రైస్తవులతో వచ్చే సమస్యలను విజయవంతంగా ఎదుర్కోవడానికి కూడా సహాయపడగలదు. పడవ వెనక భాగం వైపుకు కెరటాలు వచ్చేలా గాలి వీచినప్పుడు, పడవను సముద్రం వెంటాడుతున్నట్లు ఉంటుంది. ఆ కెరటాలు పడవ వెనక భాగాన్ని లేపి ప్రక్కకు నెట్టేయగలవు. అలా చేయడం వల్ల పడవ ప్రక్క భాగం కెరటాలు వస్తున్న వైపుకు తిరిగి, ఆ కెరటాల ధాటికి పడవ దెబ్బతింటుంది.
ఊహించని వైపునుండి వచ్చే ప్రమాదానికి మనం కూడా గురవుతుండవచ్చు. మన విశ్వసనీయులైన అనేకమంది క్రైస్తవ సహోదర సహోదరీలతో “యేకమనస్కులై” మనం యెహోవాను సేవిస్తాం. (జెఫన్యా 3:9) వారిలో ఎవరైనా క్రైస్తవ విరుద్ధమైన రీతిలో ప్రవర్తిస్తే మన నమ్మకానికి గండిపడినట్లనిపిస్తుంది, అది మనల్ని తీవ్రమైన వ్యధకు గురిచేయవచ్చు. మనం అదుపు తప్పిపోకుండా, ఎక్కువగా గాయపడకుండా మనల్ని ఆలోచనా సామర్థ్యం ఎలా కాపాడవచ్చు?
“పాపము చేయనివాడు ఒకడును లేడు” అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. (1 రాజులు 8:46) కాబట్టి ఎప్పుడైనా ఒక క్రైస్తవ సహోదరుడు మనకు చిరాకు కలిగించినా మనసు నొప్పించినా అది మనల్ని ఆశ్చర్యపరచకూడదు. ఈ విషయం తెలిసిన మనం అలాంటి సంఘటనలకు సిద్ధంగా ఉండి ఎలా ప్రతిస్పందించాలో ముందుగానే ఆలోచించుకోగలం. అపొస్తలుడైన పౌలు తన క్రైస్తవ సహోదరులు కొందరు తన గురించి మనసు నొప్పించే విధంగా తృణీకరించినట్లు మాట్లాడినప్పుడు ఎలా ప్రతిస్పందించాడు? ఆయన తన ఆధ్యాత్మిక సమతుల్యతను కోల్పోవడానికి బదులు మనుష్యుల ఆమోదం కంటే యెహోవా ఆమోదం పొందడం అత్యంత ప్రాముఖ్యమనే ముగింపుకు వచ్చాడు. (2 కొరింథీయులు 10:10-18) మనం రెచ్చగొట్టబడినప్పుడు వెంటనే ప్రతిచర్య తీసుకోకుండా ఉండడానికి అటువంటి ధోరణి మనకు సహాయపడుతుంది.
అలాంటి సందర్భం ఒకవిధంగా మన బొటన వేలికి పొత్రం రాయి తగిలినట్లుగా ఉంటుంది. అలా తగిలినప్పుడు, మనకు ఒకటి రెండు నిమిషాల పాటు అసలు ఏమీ తోచకపోవచ్చు. కానీ నొప్పి కాస్త తగ్గిన తర్వాత మనం ఆ దెబ్బ తగలడానికి కారణమేమిటో ఆలోచించగలం మామూలుగా ప్రవర్తించగలం. అదేవిధంగా నిర్దయగా చేసే వ్యాఖ్యానానికి లేదా చర్యకు
మనం వెంటనే ప్రతిచర్య తీసుకోకూడదు. బదులుగా కాస్సేపాగి అనాలోచితంగా ప్రతీకారం తీర్చుకుంటే వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించండి.అనేక సంవత్సరాల నుండి మిషనరీగా సేవ చేస్తున్న మల్కమ్, తన మనసు నొప్పించబడినప్పుడు ఆయన ఏమి చేస్తారో చెబుతున్నారు. “మొట్ట మొదట నేను చేసేది, అంతకు ముందు తయారుచేసి పెట్టుకున్న ఒక ప్రశ్నల పట్టికను చూసుకోవడం: నేను ఈ సహోదరునితో కోపంగా ఉన్నది మా వ్యక్తిత్వాలు భిన్నంగా ఉన్నందుకేనా? ఆయన ఏమన్నాడో అది నిజంగా ప్రాముఖ్యమైనదేనా? నాకొచ్చిన మలేరియా నేను ఎక్కువగా చిరాకుపడేలా చేస్తోందా? మరికొన్ని గంటల్లో నేను పరిస్థితులను మరోవిధంగా చూస్తానా?” మల్కమ్ గ్రహించినట్లు తరచుగా భేదాభిప్రాయం అంత ప్రాముఖ్యమైనది కాదు, దాన్ని ఉపేక్షించవచ్చు. *
మల్కమ్ ఇంకా ఇలా అంటున్నారు: “కొన్నిసార్లు పరిస్థితిని చక్కబెట్టడానికి నేను ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ కూడా అవతలి సహోదరుని ధోరణి వైరభావంతోనే ఉంటుంది. అది నన్ను కలత పెట్టనీయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఒకసారి నేను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశాక ఆ విషయాన్ని వేరే విధంగా చూస్తాను. మానసికంగా నేను ఆ విషయాన్ని వ్యక్తిగత ఫైలులా కాకుండా ఒక ‘పెండింగు ఫైలు’లా చూస్తాను. ఆ విషయం ఆధ్యాత్మికంగా నాకు హాని చేయడానికి గానీ యెహోవాతోనూ నా తోటి సహోదరులతోనూ నా సంబంధాన్ని ప్రభావితం చేయడానికి గానీ అనుమతించను.”
మల్కమ్‌లాగే ఒక వ్యక్తి అనుచితమైన ప్రవర్తన మనల్ని అధికంగా కలతపెట్టడానికి మనం అనుమతించకూడదు. ప్రతీ సంఘంలోనూ ఆహ్లాదకరమైన యథార్థవంతులైన అనేకమంది సహోదర సహోదరీలు ఉన్నారు. వారితో కలిసి క్రైస్తవ మార్గంలో ‘ఏక మనస్సుతో’ నడవడం ఆనందదాయకంగా ఉంటుంది. (ఫిలిప్పీయులు 1:27,28) మన పరలోకపు తండ్రి ఇచ్చే ప్రేమపూర్వకమైన మద్దతును గుర్తు చేసుకోవడం కూడా విషయాలను సరైన కోణంలో చూసేందుకు సహాయపడుతుంది.—కీర్తన 23:1-3; సామెతలు 5:1, 2; 8:12.
లోకానికి చెందిన వాటిని ప్రేమించకపోవడం
వెంటనే గ్రహించలేని మరొక ఒత్తిడిని ఎదుర్కోవడానికి కూడా ఆలోచనా సామర్థ్యం మనకు సహాయపడగలదు.
కొన్నిసార్లు పడవ అడ్డదూలానికి లేదా పక్క భాగం వైపుకు కెరటాలు వచ్చి తగిలేలా గాలి వీస్తుంది. మామూలు పరిస్థితుల్లో అయితే అది పడవను నెమ్మదిగా వెళ్తున్న దిశనుండి మరోవైపుకు నెట్టుతుంది. కానీ తుఫాను సమయంలోనైతే పడవను తలక్రిందులు చేయగలదు.అదేవిధంగా మనం ఈ దుష్ట లోకం ఇవ్వగలిగేదాన్నంతటినీ అనుభవించాలనే ఒత్తిడికి లొంగిపోతే వస్తుసంబంధమైన ఈ జీవన శైలి మన ఆధ్యాత్మిక బండి పట్టాలు తప్పేలా చేయగలదు. (2 తిమోతి 4:10) ఈ లోకం మీది ప్రేమను మనం హద్దుల్లో ఉంచుకోకపోతే చివరికి అది మన క్రైస్తవ జీవన శైలిని పూర్తిగా వదిలిపెట్టేందుకు కూడా కారణం కాగలదు. (1 యోహాను 2:15) అయితే ఆలోచనా సామర్థ్యం మనకు ఎలా సహాయపడగలదు?
మొదటిగా, మనం ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశముందో వాటి గురించి అంచనా వేసుకోవడానికి అది మనకు సహాయపడుతుంది. ఈ లోకం మనల్ని వలలో వేసుకోవడానికి అన్ని రకాల వ్యాపార యుక్తులనూ ఉపయోగిస్తోంది. అది ప్రతి ఒక్కరూ అనుసరించాలని తలంచబడే ఒక జీవన శైలిని అంటే ధనవంతుల, గ్లామరున్న వాళ్ల, “విజయవంతుల” డంబపు జీవన శైలిని నిర్విరామంగా ప్రోత్సహిస్తోంది. (1 యోహాను 2:16) ఈ జీవన శైలిని బట్టి మనం ప్రతి ఒక్కరి ప్రశంసలనూ ఆమోదాన్నీ ప్రత్యేకించి మన తోటివారి నుండి, పొరుగువారి నుండి పొందుతామని నమ్మించబడతాం. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఆలోచనా సామర్థ్యం సహాయం చేస్తుంది. “నిన్ను ఏమాత్రమును విడువను” అని యెహోవా మనకు వాగ్దానం చేశాడు కాబట్టి ‘ధనాపేక్షలేనివారమై’ ఉండాల్సిన ప్రాముఖ్యతను అది మనకు గుర్తుచేస్తుంది.—హెబ్రీయులు 13:5.
రెండవదిగా, ‘సత్యము విషయములో తప్పిపోయిన’ వారిని అనుసరించకుండా ఆలోచనా సామర్థ్యం మనల్ని అడ్డుకుంటుంది. (2 తిమోతి 2:17, 18) మనం ప్రేమించిన వారితో నమ్మిన వారితో విభేదించడం చాలా కష్టం. (1 కొరింథీయులు 15:12, 32-34) క్రైస్తవ మార్గాన్ని వదిలేసిన వారిచేత మనం కేవలం కొంతమేరకే ప్రభావితమైనా కూడా అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలను నిరోధించగలదు, చివరికి మనల్ని ప్రమాదంలో పడేయగలదు. మనం, వెళ్ళాల్సిన మార్గం నుండి కేవలం ఒకే ఒక్క డిగ్రీ ప్రక్కకు వెళ్లే ఓడలా కాగలం. అది సుదీర్ఘ ప్రయాణం చేసేసరికి తాను చేరాల్సిన తీరం నుండి చాలా దూరానికి వెళ్ళిపోతుంది.—హెబ్రీయులు 3:12.
ఆధ్యాత్మిక భావంలో మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయాలను ధ్రువీకరించుకోవడానికి ఆలోచనా సామర్థ్యం మనకు సహాయం చేయగలదు. బహుశా మనం క్రైస్తవ కార్యకలాపాల్లో మరింత ఎక్కువగా పాల్గొనాల్సిన అవసరం ఉందని గుర్తిస్తాం. (హెబ్రీయులు 6:11, 12) ఒక యువ సాక్షి తన ఆధ్యాత్మిక లక్ష్యాలను ఖచ్చితంగా అనుసరించడానికి సహాయంగా ఆలోచనా సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకున్నాడో గమనించండి: “నాకు జర్నలిజంలో కొనసాగే అవకాశం లభించింది. అది నన్ను బాగా ఆకర్షించింది కానీ నేను ‘లోకము గతించిపోవుచున్నది’ అని చెప్పే బైబిలు వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, అయితే ‘దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.’ (1 యోహాను 2:17) నా జీవన విధానం నా నమ్మకాలను ప్రతిబింబించాలని ఆలోచించుకున్నాను. నా తల్లిదండ్రులు క్రైస్తవ విశ్వాసాన్ని వదిలేశారు, నేను వారి మాదిరిని అనుసరించదలుచుకోలేదు. అందుకే నేను సంకల్పంగల జీవితాన్ని సాగించాలని నిర్ణయించుకుని క్రమ పయినీరుగా పూర్తికాల పరిచర్యను చేపట్టాను. సంతృప్తికరమైన నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత, నేను ఎంపిక చేసుకున్నది సరైనదేనని నాకు తెలుసు.”
ఆధ్యాత్మిక తుఫానులను విజయవంతంగా ఎదుర్కోవడం
నేడు మనం ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించడం ఎందుకు అత్యవసరం? నావికులు ప్రమాదకరమైన సూచనలను ప్రత్యేకించి ఉధృతమవుతున్న తుఫాను సూచనలను గుర్తించడానికి అప్రమత్తంగా ఉండాలి. వాతావరణం చల్లబడి బలమైన గాలులు వీస్తే వాళ్ళు ఓడ డెక్కుకు అడుగున ఉండే తలుపును తెరిచి అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. అదేవిధంగా ఈ దుష్ట విధానం దాని అంతాన్ని సమీపిస్తుండగా వచ్చే తీవ్రమైన ఒత్తిడులను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. సమాజంలో నైతికతకు విలువ లేకుండా పోతోంది, ‘దుర్జనులు అంతకంతకు చెడిపోతారు.’ (2 తిమోతి 3:13) నావికులు వాతావరణ సూచనలకు అవధానమిచ్చినట్లే మనమూ దేవుని ప్రేరేపిత వాక్యంలోని ప్రవచనపు హెచ్చరికలపై అవధానం ఉంచాలి.—కీర్తన 19:7-11.
మనం ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించినప్పుడు నిత్యజీవానికి నడిపించే పరిజ్ఞానాన్ని ఆచరణలో పెడతాం. (యోహాను 17:3) సమస్యలను ముందుగానే గ్రహించి వాటిని ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించుకోగలుగుతాం. ఆ విధంగా మనం క్రైస్తవ మార్గం నుండి ప్రక్కకు తొలగిపోకుండా స్థిరంగా ఉండాలన్న కృతనిశ్చయం చేసుకుని ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకొని వాటిని ధ్యేయంగా అనుసరించడం ద్వారా ‘రాబోవు కాలం కోసం మంచి పునాది’ వేసుకోగలుగుతాం.—1 తిమోతి 6:18, 19.
ఆచరణాత్మకమైన జ్ఞానాన్నీ ఆలోచనా సామర్థ్యాన్నీ కాపాడుకుంటే “ఆకస్మికముగా భయము కలుగునప్పుడు” మనం భయపడాల్సిన అవసరం ఉండదు. (సామెతలు 3:21, 25, 26) బదులుగా దేవుని వాగ్దానం నుండి మనం ఓదార్పును పొందగలుగుతాం: ‘జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన [“ఆలోచనా సామర్థ్యం,” NW] నీకు కావలికాయును.’—సామెతలు 2:10, 11.
[అధస్సూచి]
^ పేరా 19 క్రైస్తవులు మత్తయి 5:23, 24 వచనాల్లో ఉన్న ఉపదేశం ప్రకారం శాంతిని పెంపొందించడానికి కృషి చేయాలి. ఆ విషయంలో గంభీరమైన పాపాలు ఉంటే మత్తయి 18:15-17 వచనాల్లో స్థూలంగా తెలియజేసిన ప్రకారం వారు తమ సహోదరుని తిరిగి పొందడానికి ప్రయత్నించాలి. అక్టోబరు 15, 1999 కావలికోటలోని 17-22 పేజీలు చూడండి.
[23వ పేజీలోని చిత్రం]
క్రమంగా సంభాషించుకోవడం వివాహ బంధాన్ని దృఢపరుస్తుంది