చదవడం నేర్చుకోగలిగినందుకు వారు ఎంతో సంతోషిస్తున్నారు!
చదవడం నేర్చుకోగలిగినందుకు వారు ఎంతో సంతోషిస్తున్నారు!
సాలమన్ దీవుల్లోని కొన్ని భాగాల్లో, ఇప్పుడు యెహోవాసాక్షులైన దాదాపు 80 శాతం మంది ఒకప్పుడు నిరక్షరాస్యత వల్ల చాలా కష్టపడేవారు. దీనివల్ల వారు వారపు సంఘ కూటాల్లో అంతగా పాల్గొనలేకపోయేవారు, అంతేగాక ఇతరులకు రాజ్య సత్యాలను బోధించడం కూడా వారికి చాలా కష్టమయ్యేది. పెన్సిల్ కూడా ఎన్నడూ పట్టుకోని వయోజనులు అక్షరాస్యులు కావడం నిజంగా సాధ్యమేనా?
సాలమన్ దీవులన్నిటిలో దాదాపు యెహోవాసాక్షుల ప్రతి సంఘంలోని అక్షరాస్యతా తరగతుల్లోనూ యెహోవాసాక్షులు ప్రచురించిన అప్లై యువర్‌సెల్ఫ్ టు రీడింగ్ అండ్ రైటింగ్ అనే బ్రోషుర్ ఉపయోగించబడింది. తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వందల మందికి ఈ కార్యక్రమం ద్వారా ఎలా సహాయం అందించబడిందో ఈ క్రింది అనుభవాలు చూపిస్తాయి. మరింత ప్రాముఖ్యంగా, చదవడం నేర్చుకున్నందువల్ల వారు తమ విశ్వాసం గురించి మరింత చక్కగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు.—1 పేతురు 3:15, 16.
వందకన్నా ఎక్కువమంది రాజ్య ప్రచారకులున్న సంఘానికి నియమించబడిన ఒక మిషనరీ, వారం వారం కావలికోట ఉపయోగిస్తూ బైబిలు అధ్యయనం జరిగేటప్పుడు చాలా తక్కువమంది దగ్గరే కావలికోటలు ఉంటున్నాయనీ ఇంకా తక్కువమంది మాత్రమే వ్యాఖ్యానిస్తున్నారనీ గమనించింది. దానికి కారణమేమిటి? నిరక్షరాస్యత. చదవడం, వ్రాయడం నేర్పించడానికి ఒక పాఠశాలను ప్రారంభించబోతున్నామని సంఘం ప్రకటించినప్పుడు ఈ మిషనరీ, బోధకురాలిగా ఉండడానికి తనకు తానుగా ఆనందంగా ముందుకు వెళ్ళింది. మొదట్లో చాలా తక్కువమంది విద్యార్థులు వచ్చారు, కానీ త్వరలోనే అన్ని వయస్సులకూ చెందిన 40 కన్నా ఎక్కువమంది హాజరవ్వడం ప్రారంభించారు.
ఫలితాలు ఎలా ఉన్నాయి? మిషనరీ ఇలా తెలియజేస్తోంది: “అక్షరాస్యతా తరగతులు ప్రారంభమైన కొంతకాలానికి, ఒకరోజు ఉదయం ఆరు గంటల సమయంలో నేను మిషనరీ హోమ్ కోసం ఆహారపదార్థాలు కొనడానికి మార్కెట్‌కు వెళ్ళాను. అక్కడ నేను కొంతమంది విద్యార్థులను చూశాను, వారిలో చాలా చిన్నవయస్సు వారు కూడా కొబ్బరికాయలు, కూరగాయలు అమ్ముతున్నారు. ఎందుకు? ఎందుకంటే అక్షరాస్యతా తరగతిలో ఉపయోగించడానికి పెన్ను,
నోట్‌బుక్కు కొనుక్కోవడానికి తగినంత డబ్బు కోసం వారా పని చేస్తున్నారు! అంతేగాక, ఆ తరగతికి హాజరవ్వడానికి అసలు కారణం తమ సొంత కావలికోట ప్రతిని కలిగి ఉండాలన్నదే.” ఆమె ఇంకా ఇలా చెబుతోంది: “ఇప్పుడు సంఘ కావలికోట అధ్యయనం జరిగేటప్పుడు పెద్దలూ పిన్నలూ ఒకేలా పాల్గొంటున్నారు, ఇప్పుడు ఆ అధ్యయనాలు ఎంతో ఉత్సాహవంతంగా ఉంటున్నాయి.” ఆ తరగతిలోని నలుగురు సభ్యులు తాము బహిరంగ ప్రకటనా పనిలో పాల్గొనవచ్చా అని అడిగినప్పుడు ప్రాముఖ్యంగా ఈ మిషనరీ చాలా సంతోషించింది, ఎందుకంటే వారి మాటల్లోనే చెప్పాలంటే వారికి ఇక “ఏమాత్రం భయం లేదు.”అక్ష్యరాస్యతా తరగతుల్లోని విద్యార్థులకు లభించిన ప్రయోజనకరమైన ఫలితాలు కేవలం చదవడం, వ్రాయడం మాత్రమే కాదు. ఉదాహరణకు ఒక సాక్షి యొక్క అవిశ్వాసియైన భార్య చాలా సంవత్సరాల నుండి సంఘానికి ఎంతో వ్యాకులత కలిగిస్తోంది. ఆమెకు కాస్త చికాకు కలిగించినా ఇతరులపైకి రాళ్ళు విసిరేది, ఇతర స్త్రీలను కర్ర తీసుకుని కూడా కొట్టేది. ఆమె అప్పుడప్పుడూ తన భర్తతో కలిసి క్రైస్తవ కూటాలకు వచ్చినప్పుడు తన భర్తను చూసి ఎంతగా అసూయపడేదంటే ఆయన వేరే స్త్రీల వైపు చూస్తున్నాడని ఆమె నిందించకుండా ఉండేలా ఆయన నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు.
అయితే అక్షరాస్యతా తరగతులు ప్రారంభమైన కొంత కాలానికి ఈ స్త్రీ నెమ్మదిగా ఇలా అడిగింది: “నేను కూడా ఆ తరగతికి రావచ్చా?” రావచ్చుననే సమాధానం లభించింది. అప్పటి నుండి ఆమె ఎన్నడూ ఒక్క తరగతికి గానీ సంఘ కూటానికి గానీ రావడం మానలేదు. చదివే పాఠాలను నేర్చుకోవడానికి ఆమె చాలా కష్టపడి అద్భుతమైన రీతిలో అభివృద్ధిని సాధించింది, అది ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆమె తర్వాతి విన్నపం ఏమిటంటే, “నాతో బైబిలు అధ్యయనం చేస్తారా?” ఆమె భర్త అమితానందంగా ఆమెతో అధ్యయనం చేయడం ప్రారంభించాడు, ఆమె చదవడం వ్రాయడంలోనే కాక బైబిలు జ్ఞానాన్ని పొందడంలో కూడా అభివృద్ధి సాధిస్తోంది.
ఎన్నడూ పెన్సిల్ కూడా పట్టుకోని ఏభై ఏళ్ళ వ్యక్తికి పెన్సిల్ పట్టుకుని అక్షరాలు దిద్దడమే పర్వతమంత అవరోధంగా అనిపించవచ్చు. నేర్చుకుంటున్న క్రొత్తలో కొందరు పేపరు, పెన్సిల్ పట్టుకుని వ్రాయడానికి ఎంత బలం ఉపయోగిస్తారంటే వాళ్ళ వ్రేళ్ళకు బొబ్బలు వచ్చేస్తాయి. కొంతమంది విద్యార్థులు పెన్సిల్ సరిగ్గా పట్టుకోవడానికే అనేక వారాలపాటు పోరాడిన తర్వాత “నేను పేపరు మీద చెయ్యి నెమ్మదిగా కదపగలుగుతున్నానోచ్” అని ఎంతో ఆనందంతో కేకలు వేస్తారు. విద్యార్థులు అభివృద్ధి సాధించడాన్ని చూడడం ఉపదేశకులకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక ఉపదేశకురాలు ఇలా అంటోంది: “ఒక తరగతికి బోధించడం నిజంగా ఎంతో ఆనందకరమైన విషయం, యెహోవా చేసిన ఈ ఏర్పాటు పట్ల విద్యార్థులకున్న నిజమైన కృతజ్ఞతను తరచూ తరగతి ముగింపులో వాళ్ళు కొట్టే చప్పట్లు వ్యక్తం చేస్తాయి.”
మిషనరీలతో పాటు ఇప్పుడు అక్షరాస్యులైన ఈ సాక్షులు ఆనందిస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే వీరు తాము చదవగల, వ్రాయగల సామర్థ్యాన్ని ఇప్పుడు యెహోవాకు ఘనతను తీసుకువచ్చే విధంగా ఉపయోగించవచ్చు.
[8, 9వ పేజీలోని చిత్రాలు]
పిన్నలూ పెద్దలూ అక్షరాస్యత తరగతుల విషయమై కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు