కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నన్ను వెంబడించడంలో కొనసాగండి”

“నన్ను వెంబడించడంలో కొనసాగండి”

“నన్ను వెంబడించడంలో కొనసాగండి”

“క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.”​1 పేతురు 2:​21.

1, 2. బోధకుడిగా పరిపూర్ణమైన యేసు మాదిరి మనం అనుకరించలేనంత ఉన్నతమైనది ఎందుకు కాదు?

యేసుక్రీస్తు ఇప్పటివరకు భూమిపై జీవించిన వారిలోకెల్లా అత్యంత గొప్ప బోధకుడు. అంతేగాక ఆయన పరిపూర్ణుడు, మానవుడిగా తన జీవితమంతటిలోనూ ఎన్నడూ పాపం చేయలేదు. (1 పేతురు 2:​22) అయితే దాని భావం, బోధకుడిగా యేసు ఉంచిన మాదిరి అపరిపూర్ణ మానవులమైన మనం అనుకరించలేనంత ఉన్నతమైనదనా? ఎంతమాత్రం కాదు.

2 మనం ముందటి ఆర్టికల్‌లో చూసినట్లుగా యేసు బోధకు పునాది ప్రేమ. ప్రేమను మనమందరం పెంపొందించుకోవచ్చు. ఇతరులకు ప్రేమ చూపించడంలో అభివృద్ధి సాధించమనీ దాన్ని మెరుగుపరుచుకోమనీ దేవుని వాక్యం తరచూ మనల్ని ఎంతో ప్రోత్సహిస్తోంది. (ఫిలిప్పీయులు 1:​9-11; కొలొస్సయులు 3:​14) యెహోవా తాను సృష్టించిన ప్రాణుల నుండి వారు చేయలేని దాన్ని ఎన్నడూ కోరడు. వాస్తవానికి “దేవుడు ప్రేమాస్వరూపి” కాబట్టీ మనల్ని తన రూపంలో సృష్టించాడు కాబట్టీ మనం ప్రేమ చూపించగల రీతిలోనే ఆయన మనల్ని రూపొందించాడని చెప్పవచ్చు. (1 యోహాను 4:⁠8; ఆదికాండము 1:​27) అందుకే, మన చర్చాంశానికి కీలకమైన లేఖనంలో నమోదు చేయబడివున్న అపొస్తలుడైన పేతురు మాటలను మనం చదివినప్పుడు, మనం విజయం సాధించగలమనే నిశ్చయతతో ప్రతిస్పందించవచ్చు. మనం క్రీస్తు అడుగుజాడలను సన్నిహితంగా అనుసరించగలము. వాస్తవానికి “నన్ను వెంబడించడంలో కొనసాగండి” అని యేసు స్వయంగా ఇచ్చిన ఆజ్ఞకు మనం విధేయులం కాగలం. (లూకా 9:​23, NW) మొదటగా, క్రీస్తు తాను బోధించిన సత్యాల మీద చూపించిన ప్రేమనూ ఆ తర్వాత ఆయన తానెవరికి బోధించాడో వారిమీద చూపించిన ప్రేమనూ మనం ఎలా అనుకరించవచ్చో పరిశీలిద్దాము.

మనం నేర్చుకునే సత్యాలపై ప్రేమను పెంపొందించుకోవడం

3. కొందరికి అధ్యయనం చేయడం ఎందుకు కష్టంగా ఉంటుంది, కానీ సామెతలు 2:1-5 వచనాల్లో ఎలాంటి ప్రోత్సాహం ఉంది?

3 మనం ఇతరులకు బోధించే సత్యాలను ప్రేమించాలంటే మొదట మనం ఆ సత్యాలను నేర్చుకోవడాన్ని ప్రేమించాలి. నేటి ప్రపంచంలో ఎల్లప్పుడూ అలాంటి ప్రేమ అంత సులభంగా వృద్ధి కాదు. సరైన విద్య లేకపోవడం, యౌవనంలో ఏర్పడిన చెడ్డ అలవాట్లు చాలామంది అధ్యయనమంటే పూర్తిగా అయిష్టతను ఏర్పరచుకునేలా చేస్తాయి. అయితే, మనం యెహోవా నుండి నేర్చుకోవడం చాలా ముఖ్యం. సామెతలు 2:1-5 వచనాలు ఇలా చెబుతున్నాయి: ‘నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల [“గుప్త ధనం కోసం గాలించినట్లు దానికోసం గాలిస్తే,” పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం] యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును.’

4. హృదయపూర్వకముగా ‘అభ్యసించడం’ అంటే ఏమిటి, అలా చేయడానికి ఏ దృక్కోణం మనకు సహాయం చేస్తుంది?

4 ఒకటి నుండి నాలుగు వరకున్న వచనాల్లో, ‘అంగీకరించడానికి,’ ‘దాచుకొనడానికి’ మాత్రమే గాక ‘వెదకడంలో’ కొనసాగడానికి, ‘గాలించడంలో’ కొనసాగడానికి కూడా కృషి చేయమని మనం పదేపదే ప్రోత్సహించబడుతున్నామని గమనించండి. దీనినంతటినీ చేయడానికి మనల్ని ఏది పురికొల్పాలి? ‘హృదయపూర్వకముగా వివేచన నభ్యసించడం’ అనే వాక్యాన్ని గమనించండి. ఈ ఉద్బోధ “కేవలం అవధానం ఇవ్వమని చేయబడుతున్న విన్నపం కాదు; ఫలానా దృక్పథాన్ని అంటే బోధలపై అత్యాకాంక్షతో కూడిన స్వీకరించే సుముఖతను కలిగివుండమని అధికారంతో అడగడం.” యెహోవా మనకు బోధించేదాని మీద స్వీకరించే సుముఖతా అత్యాకాంక్షా ఉండేలా ఏది చేయగలదు? మన దృక్కోణం. “దేవుని గూర్చిన విజ్ఞానము”ను మనం “వెండి”గా, “దాచబడిన ధనము”గా దృష్టించవలసిన అవసరం ఉంది.

5, 6. (ఎ) కొంత కాలానికి ఏమి జరగవచ్చు, దాన్ని మనం ఎలా నివారించవచ్చు? (బి) మనం బైబిలులో కనుగొన్న జ్ఞానసంపదలకు ఎందుకు ఇంకా ఎక్కువ చేర్చుకుంటూనే ఉండాలి?

5 అలాంటి దృక్కోణాన్ని ఏర్పరచుకోవడం కష్టమేమీ కాదు. ఉదాహరణకు, మీరు నేర్చుకున్న “దేవుని గూర్చిన విజ్ఞానము”లో నమ్మకమైన మానవజాతి భూ పరదైసులో నిరంతరం జీవించాలని యెహోవా సంకల్పించాడన్న సత్యం కూడా బహుశా ఇమిడి ఉండవచ్చు. (కీర్తన 37:​28, 29) మీరు ఆ సత్యాన్ని మొదట నేర్చుకున్నప్పుడు నిస్సందేహంగా దాన్ని నిజమైన సంపదగా, మీ మనస్సును హృదయాన్ని నిరీక్షణతోనూ ఆనందంతోనూ నింపేసిన ఒక వాస్తవంగా దృష్టించి ఉంటారు. అయితే ఇప్పటి మాటేమిటి? సమయం గడుస్తుండగా, మీ సంపద మీద మీకున్న మెప్పు మెరుగుతగ్గిపోయిందా? అలాగైతే రెండు పనులు చేయడానికి ప్రయత్నించండి. మొదటగా, మీకున్న మెప్పును పునర్నవీకరించుకోండి, అంటే యెహోవా మీకు బోధించిన ప్రతి సత్యాన్నీ అది మీరు ఎన్నో సంవత్సరాల క్రితం నేర్చుకున్నదే అయినా మీరు దాన్ని ఎందుకు విలువైనదిగా ఎంచుతున్నారనే దాని విషయమై క్రమంగా మీ మనస్సును పునరుత్తేజపరచుకోండి.

6 రెండవదిగా, మీ సంపదకు మరిన్ని సంపదలను చేర్చుకోండి. మీరు ఒక అమూల్యమైన రత్నాన్ని త్రవ్వి తీసారే అనుకుందాం, మీరు దాన్ని జేబులో వేసుకుని సంతృప్తిపడి అక్కడి నుండి వెళ్ళిపోతారా? లేక ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని చూడడానికి మరింత త్రవ్వుతారా? దేవుని వాక్యం నిండా సత్యపు రత్నాలూ బంగారుముద్దలూ ఉన్నాయి. మీరు ఇప్పటికే ఎన్నో కనుగొన్నప్పటికీ మీరు ఇంకా ఎక్కువ కనుగొనగలరు. (రోమీయులు 11:​33) మీరు ఒక్కో సత్యపు బంగారుముద్దను వెలికి తీస్తూ మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘దీన్ని ఒక సంపదగా ఏది చేస్తుంది? ఇది నాకు యెహోవా వ్యక్తిత్వం గురించి లేదా ఆయన సంకల్పాల గురించి లోతైన అంతర్దృష్టిని ఇస్తుందా? ఇది నేను యేసు అడుగుజాడల్లో నడవడానికి నాకు సహాయంచేసే కొంత ఆచరణాత్మకమైన నడిపింపును ఇస్తుందా?’ ఇలాంటి ప్రశ్నలను ధ్యానించడం యెహోవా మీకు బోధించిన సత్యాల మీద మీరు ప్రేమను పెంపొందించుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

మనం బోధించే సత్యాలంటే ప్రేమను చూపించడం

7, 8. మనం బైబిలు నుండి నేర్చుకున్న సత్యాలను ప్రేమిస్తున్నామని ఇతరులకు చూపించగల కొన్ని మార్గాలు ఏవి? ఒక ఉదాహరణ ఇవ్వండి.

7 మనం ఇతరులకు బోధిస్తుండగా దేవుని వాక్యం నుండి మనం నేర్చుకున్న సత్యాలను మనం ప్రేమిస్తున్నామని ఎలా చూపించగలము? యేసు మాదిరిని అనుసరిస్తూ, మనం ప్రకటించేటప్పుడూ బోధించేటప్పుడూ పూర్తిగా బైబిలుపై ఆధారపడతాము. ఇటీవలి కాలాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజలు తమ బహిరంగ పరిచర్యలో బైబిలును ఎక్కువగా ఉపయోగించమని ప్రోత్సహించబడ్డారు. మీరు ఆ సలహాను అన్వయించుకుంటుండగా బైబిలు నుండి మీరు పంచుకుంటున్నదాన్ని మీరు స్వయంగా విలువైనదిగా ఎంచుతున్నారని గృహస్థులు అర్థంచేసుకోగలిగేలా చేయడానికి మార్గాల కోసం వెదకండి.​—⁠మత్తయి 13:​52.

8 ఉదాహరణకు, న్యూయార్క్‌ నగరంలో గత సంవత్సరం జరిగిన తీవ్రవాదుల దాడి తర్వాత ఒక క్రైస్తవ సహోదరి తన పరిచర్యలో కలిసిన ప్రజలకు కీర్తన 46:​1, 11 వచనాలను చదివి వినిపించింది. ఈ దుర్ఘటన నుండి మీరెలా కోలుకుంటున్నారని ఆమె మొదట ప్రజలను అడిగింది. వారి ప్రతిస్పందనను జాగ్రత్తగా విని దాన్ని అంగీకరించి తర్వాత ఇలా అడిగింది: “ఈ కష్టసమయంలో నాకు నిజంగా ఓదార్పునిచ్చిన ఒక లేఖనాన్ని మీకు చూపించనా?” చాలా తక్కువమంది మాత్రమే నిరాకరించారు, ఎన్నో చక్కని చర్చలు జరిగాయి. యౌవనస్థులతో మాట్లాడేటప్పుడు ఆ సహోదరే తరచూ ఇలా అడిగేది: “నేనిప్పటికి 50 సంవత్సరాలుగా బైబిలు బోధిస్తున్నాను, అయితే మీకో విషయం చెప్పనా? పరిష్కరించడానికి ఈ పుస్తకం సహాయం చేయలేని ఒక్క సమస్య కూడా నాకు ఇంతవరకు ఎదురుకాలేదు.” నిష్కపటంగా ఉత్సాహంగా సంభాషించడం ద్వారా మనం దేవుని వాక్యం నుండి నేర్చుకున్నవాటిని విలువైనవిగా ఎంచుతున్నామనీ వాటిని ప్రేమిస్తున్నామనీ ప్రజలకు చూపిస్తాము.​—⁠కీర్తన 119:97, 105.

9, 10. మన నమ్మకాల గురించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు బైబిలును ఉపయోగించడం ఎందుకు ప్రాముఖ్యం?

9 ప్రజలు మన నమ్మకాల గురించి ప్రశ్నించినప్పుడు, మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామని చూపించే చక్కని అవకాశం మనకు లభిస్తుంది. యేసు ఉదాహరణను అనుసరిస్తూ మనం కేవలం మన సొంత తలంపుల ఆధారంగా సమాధానాలు చెప్పము. (సామెతలు 3:​5, 6) బదులుగా వారికి సమాధానం ఇవ్వడానికి మనం బైబిలును ఉపయోగిస్తాము. మీరు సమాధానం చెప్పలేని ఏదైనా ఒక ప్రశ్నను ఎవరైనా అడుగుతారేమోననే భయం మీకుందా? మీరు తీసుకోగల రెండు ఆచరణాత్మకమైన చర్యలను పరిశీలించండి.

10సిద్ధంగా ఉండడానికి మీరు చేయగలిగింది చేయండి. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: ‘నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను [“గౌరవముతోనూ,” NW] సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.’ (1 పేతురు 3:​15, 16) మీ నమ్మకాలను సమర్థించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉదాహరణకు, మీరు ఏదైనా లేఖనరహితమైన ఆచారంలో గానీ అలవాటులో గానీ ఎందుకు భాగం వహించరో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే “అది నా మతానికి వ్యతిరేకం” అని చెప్పేసి ఊరుకోకండి. అలాంటి సమాధానం, మీరు మీ కోసం ఇతరులు నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతిస్తారనీ కాబట్టి, మీరు ఏదైనా మతతెగకు చెందినవారై ఉండవచ్చనీ సూచించవచ్చు. బదులుగా “దేవునివాక్యమైన బైబిలు దాన్ని నిషేధిస్తుంది” లేదా “అది దేవునికి అప్రీతికరమైనది” వంటి సమాధానాలు చెప్పడం మంచిది. ఆ తర్వాత దానికి కారణమేమిటో సహేతుకంగా వివరించండి.​—⁠రోమీయులు 12:⁠1.

11. దేవుని వాక్య సత్యాలను గురించిన ప్రశ్నలకు సమాధానాలతో సిద్ధంగా ఉండడానికి మనకు ఏ పరిశోధనా పరికరం సహాయం చేయవచ్చు?

11 మీరు సిద్ధంగా లేరని మీకనిపిస్తే, చర్చనీయ బైబిలు అంశములు అనే పుస్తకం మీ భాషలో ఉంటే దాన్ని అధ్యయనం చేయడంలో కొంత సమయం ఎందుకు గడపకూడదు? * ప్రజలు అడుగుతారని మీకు అనిపించిన కొన్ని అంశాలను ఎంపిక చేసుకోండి, కొన్ని లేఖనాధారిత అంశాలను కంఠస్థం చేసుకోండి. చర్చనీయ బైబిలు అంశములు అనే చిన్న పుస్తకాన్నీ, బైబిలునూ వెంటనే అందుకోగలిగేలా దగ్గర ఉంచుకోండి. ప్రశ్నలకు బైబిలు సమాధానాన్ని కనుగొనడంలో ఉపకరించే ఒక పరిశోధనా పరికరం మీ దగ్గర ఉందని చెబుతూ ఆ రెండింటినీ ఉపయోగించడానికి సంకోచించకండి.

12. ఒక బైబిలు ప్రశ్నకు సమాధానం మనకు తెలియకపోతే మనం ఎలా ప్రతిస్పందించవచ్చు?

12అనవసరంగా చింతించకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఏ అపరిపూర్ణ మానవుడి దగ్గరా అన్ని సమాధానాలూ లేవు. కాబట్టి మీరు సమాధానం చెప్పలేని బైబిలు సంబంధిత ప్రశ్నేదైనా ఎవరైనా అడిగితే మీరు ఎల్లప్పుడూ ఈ విధంగా సమాధానం చెప్పవచ్చు: “అలాంటి ఆసక్తికరమైన ప్రశ్న వేసినందుకు కృతజ్ఞతలు. నిజం చెప్పాలంటే దానికి సమాధానం నాకు తెలీదు, కానీ బైబిలులో దాని గురించి ప్రస్తావించబడి ఉంటుందని మాత్రం నేను నిశ్చయంగా చెప్పగలను. దీని గురించి బైబిలు పరిశోధన చేయడం నాకెంతో ఇష్టం, కాబట్టి నేను మీ ప్రశ్నను పరిశీలించి దానికి సమాధానంతో తిరిగి వస్తాను.” అలాంటి నిజాయితీగల, అణుకువతో కూడిన విధానం మరిన్ని చర్చలు జరగడానికి మార్గాన్ని సుగమం చేయవచ్చు.​—⁠సామెతలు 11:⁠2.

మనం ఎవరికి బోధిస్తామో ఆ ప్రజలపై ప్రేమ

13. మనం ఎవరికి ప్రకటిస్తామో వారి మీద ఎందుకు ఆశాజనకమైన దృక్కోణాన్ని కలిగి ఉండాలి?

13 యేసు తాను ఎవరికి బోధించాడో ఆ ప్రజలపై ప్రేమను చూపించాడు. ఈ విషయంలో మనం ఆయనను ఎలా అనుకరించవచ్చు? మనం మన చుట్టూ ఉన్న ప్రజల మీద ఎన్నడూ కఠినమైన దృక్పథాన్ని ఏర్పరుచుకోకూడదు. నిజమే “దేవుని మహాదినమున జరుగు యుద్ధము” అంతకంతకూ దగ్గరవుతోంది, కోటానుకోట్ల మానవులలో అనేకులు నాశనం చేయబడతారు. (ప్రకటన 16:​14; యిర్మీయా 25:​33) అయినా ఎవరు జీవిస్తారో ఎవరు మరణిస్తారో మనకు తెలీదు. ఆ తీర్పు భవిష్యత్తులో జరగనుంది, యెహోవా నియమించిన యేసుక్రీస్తే ఆ తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చబడేంత వరకు మనం ప్రతి ఒక్కరినీ యెహోవా సేవకుడయ్యే సాధ్యతగల వ్యక్తిగానే దృష్టిస్తాము.​—⁠మత్తయి 19:​24-26; 25:​31-33; అపొస్తలుల కార్యములు 17:​31.

14. (ఎ) మనకు ప్రజలంటే తదనుభూతి ఉందో లేదో మనల్ని మనం ఎలా పరిశీలించుకోవచ్చు? (బి) మనం ఇతరులపై తదనుభూతిని, వ్యక్తిగత ఆసక్తిని ఏ ఆచరణాత్మకమైన విధాల్లో చూపించవచ్చు?

14 కాబట్టి యేసు వలె మనం ప్రజల మీద తదనుభూతి కలిగి ఉండడానికి ప్రయత్నిస్తాము. మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఈ లోక మతాల, రాజకీయాల, వాణిజ్యాల యుక్తితో కూడిన అబద్ధాలచే, వంచనలచే మోసగించబడిన ప్రజలంటే నాకు జాలి ఉందా? వారి కోసం మనం తీసుకువెళ్ళే సందేశానికి వారు ఉదాసీనత చూపిస్తున్నట్లనిపిస్తే, వారలా ఎందుకు భావిస్తున్నారో అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తానా? నేను గానీ ప్రస్తుతం నమ్మకంగా యెహోవా సేవ చేస్తున్న ఇతరులు గానీ ఒకప్పుడు అలా భావించిన వాళ్ళమేనని నేను గుర్తిస్తానా? దానికి అనుగుణంగా నేను నా ప్రకటనా విధానాన్ని మలచుకుంటానా? లేక వీళ్ళు మారడం అసాధ్యమని వాళ్ళను వదిలేస్తానా?’ (ప్రకటన 12:⁠9) మనకు నిజంగా తదనుభూతి ఉందని ప్రజలు గ్రహించినప్పుడు, వారు మన సందేశానికి ప్రతిస్పందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. (1 పేతురు 3:⁠8) తదనుభూతి పరిచర్యలో మనం కలిసే ప్రజలపై ఎంతో ఆసక్తి చూపించడానికి కూడా మనల్ని కదిలించవచ్చు. వారి ప్రశ్నల గురించీ చింతల గురించీ వ్రాసి పెట్టుకోవచ్చు. మనం తిరిగి వెళ్ళినప్పుడు, గత సందర్శనంలో వారు చేసిన వ్యాఖ్యానాల గురించి మనం ఆలోచించామని వారికి చూపించవచ్చు. ఆ సమయంలో వారు దేని కోసమైనా అత్యవసరంలో ఉంటే ఆచరణాత్మకమైన సహాయాన్ని అందించగలమని తెలియజేయండి.

15. మనం ప్రజలలోని మంచిని ఎందుకు చూడాలి, దాన్ని మనమెలా చేయవచ్చు?

15 యేసు వలె మనం ప్రజలలో మంచిని చూస్తాము. ఒక ఒంటరి తల్లి తన పిల్లలను పెంచడానికి ప్రశంసనీయమైన రీతిలో కృషి చేస్తుండవచ్చు. ఒక వ్యక్తి తన కుటుంబానికి మద్దతునివ్వడానికి తీవ్రంగా కష్టపడుతుండవచ్చు. వయస్సు పైబడిన ఒక వ్యక్తి ఆధ్యాత్మిక విషయాలంటే ఆసక్తి చూపిస్తుండవచ్చు. మనం కలిసే ప్రజల్లో మనమలాంటి విషయాలను గమనించి, తగిన విధంగా వారిని ప్రశంసిస్తామా? అలా చేయడం ద్వారా మన మధ్య పరస్పర అవగాహన ఏర్పడడానికి పునాదివేసి రాజ్యం గురించి సాక్ష్యమివ్వడానికి మనం మార్గం ఏర్పరుచుకోవచ్చు.​—⁠అపొస్తలుల కార్యములు 26:2, 3.

ప్రేమ చూపించడంలో నమ్రత అత్యావశ్యకం

16. మనం ఎవరికి ప్రకటిస్తామో వారంటే సాత్వికతతో, గౌరవప్రదంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

16 మనం ఎవరికి బోధిస్తామో ఆ ప్రజలంటే మనకున్న ప్రేమ “జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును” అని బైబిలు ఇస్తున్న జ్ఞానయుక్తమైన హెచ్చరికను లక్ష్యపెట్టడానికి మనల్ని కదిలిస్తుంది. (1 కొరింథీయులు 8:⁠1) యేసుకు గొప్ప జ్ఞానం ఉండేది, అయినా ఆయన ఎన్నడూ అహంకారంగా ఉండలేదు. కాబట్టి మీరు మీ నమ్మకాలను పంచుకునేటప్పుడు వాగ్వివాద ధోరణిని గానీ నేనే ఉన్నతుడనన్న భావాన్ని గానీ నివారించండి. ప్రజల హృదయాలను చేరుకుని, మనం ఎంతో ప్రేమించే సత్యాల వైపుకు వారిని ఆకర్షించాలన్నదే మన లక్ష్యం. (కొలొస్సయులు 4:⁠6) సమర్థించుకోవడానికి సిద్ధంగా ఉండమని పేతురు క్రైస్తవులకు ఉపదేశించినప్పుడు మనం ‘సాత్వికముతోను భయముతోను [“గౌరవముతోను,” NW]’ అలా చేయాలనే జ్ఞాపికను కూడా ఆయన జత చేశాడని గుర్తుంచుకోండి. (1 పేతురు 3:​15, 16) మనం సాత్వికులము, గౌరవము ఇచ్చేవారమైతే ప్రజలను మనం ఆరాధించే దేవుని వైపుకు ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

17, 18. (ఎ) పరిచారకులముగా మనకున్న యోగ్యతలను గురించిన విమర్శనాత్మకమైన దృక్పథాలకు మనమెలా ప్రతిస్పందించాలి? (బి) బైబిలు విద్యార్థులకు ప్రాచీన బైబిలు సంబంధిత భాషల గురించిన పరిజ్ఞానం ఎందుకు అత్యావశ్యకం కాదు?

17 మనం మన జ్ఞానముతోనో విద్యతోనో ప్రజలను ముగ్ధులను చేయవలసిన అవసరం లేదు. మీ ప్రాంతంలోని వారెవరైనా ఫలాని విశ్వవిద్యాలయ డిగ్రీలు లేదా బిరుదులు లేని వారు చెప్పేది వినడానికి నిరాకరిస్తే, వారి దృక్పథం మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి అనుమతించకండి. యేసు తన కాలంలోని గౌరవప్రదమైన రబ్బీల పాఠశాలలకు తాను వెళ్ళలేదని తెలిపిన అభ్యంతరాన్ని ఎంతమాత్రం లక్ష్యపెట్టనూ లేదు; తనకున్న గొప్ప జ్ఞానముతో ప్రజలను ముగ్ధులను చేయడానికి ప్రయత్నించడం ద్వారా ప్రజలలో వ్యాపించి ఉన్న పక్షపాతాలకు తలవంచనూ లేదు.​—⁠యోహాను 7:​15.

18 క్రైస్తవ పరిచారకులకు లౌకిక విద్య ఎంత ఉన్నా నమ్రత, ప్రేమ ఉండడం చాలా చాలా ముఖ్యం. గొప్ప బోధకుడైన యెహోవా మనల్ని పరిచర్యకు యోగ్యులుగా చేస్తాడు. (2 కొరింథీయులు 3:​5, 6) క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతనాయకులు కొందరు ఏమన్నప్పటికీ దేవుని వాక్య బోధకులమయ్యేందుకు మనం ప్రాచీన బైబిలు సంబంధిత భాషలను నేర్చుకోవలసిన అవసరమేమీ లేదు. దాదాపు ప్రతి ఒక్కరూ బైబిలులోని అమూల్యమైన సత్యాలను గ్రహించగలిగేలా యెహోవా ఎంతో స్పష్టమైన, నిర్దిష్టమైన పదాలతో అది వ్రాయబడేలా ప్రేరేపించాడు. ఆ సత్యాలు వందల కొలది భాషల్లోకి అనువదించబడినప్పుడు కూడా చెక్కుచెదరకుండా ఉంటాయి. కాబట్టి ప్రాచీన భాషల గురించిన పరిజ్ఞానం అప్పుడప్పుడూ ఉపయోగకరమైనదే అయినప్పటికీ అది అత్యావశ్యకం మాత్రం కాదు. అంతేగాక, భాషాపరమైన సామర్థ్యాన్ని బట్టి కలిగే గర్వం, నిజక్రైస్తవులకు అత్యంత ఆవశ్యకమైన గుణాన్ని కోల్పోయేలా చేస్తుంది, అదేమిటంటే బోధించబడగల గుణం.​—⁠1 తిమోతి 6:⁠4.

19. మన క్రైస్తవ పరిచర్య ఏ భావంలో ఒక సేవ?

19 మన క్రైస్తవ పరిచర్య నమ్రతగల దృక్పథం కలిగివుండవలసిన అవసరమున్న పని అనడంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు. మనం తరచుగా వ్యతిరేకతను, ఉదాసీనతను, చివరికి హింసను కూడా ఎదుర్కొంటాము. (యోహాను 15:​20) అయినా మనం మన పరిచర్యను నమ్మకంగా నెరవేర్చడం ద్వారా ఒక ముఖ్యమైన సేవ చేస్తున్నాము. మనం ఈ పనిలో నమ్రతతో ఇతరులకు సేవచేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రజలపై చూపించిన ప్రేమను మనం అనుకరిస్తున్నట్లే. దీన్ని పరిశీలించండి: మనం గొఱ్ఱెవంటి ఒక్క వ్యక్తిని చేరుకోవడానికి ఉదాసీనతగల లేదా వ్యతిరేకించే వెయ్యిమందికి ప్రకటించవలసి వస్తే అది కృషికి తగిన ఫలితం కాదంటారా? తప్పకుండా తగిన ఫలితమే! కాబట్టి ఎన్నడూ విడిచిపెట్టకుండా పనిలో పట్టుదల కలిగి ఉంటే మనం ఇంకా చేరుకోవలసి ఉన్న గొఱ్ఱెవంటి వారికి నమ్మకంగా సేవ చేస్తున్నట్లే. అంతం రాక ముందు అలాంటి అమూల్యమైన వ్యక్తులు ఇంకా అనేకమంది కనుగొనబడేలా యెహోవా, యేసుక్రీస్తు శ్రద్ధ తీసుకుంటారనడంలో సందేహం లేదు.​—⁠హగ్గయి 2:⁠7.

20. మనం మన ఉదాహరణ ద్వారా బోధించగల కొన్ని మార్గాలు ఏవి?

20 ఇతరులకు సేవ చేయడానికి మనకున్న సుముఖతను చూపించడానికి మరో మార్గం మన ఉదాహరణ ద్వారా బోధించడమే. ఉదాహరణకు ‘శ్రీమంతుడగు [“సంతోషంగల,” NW] దేవుడు’ అయిన యెహోవాను సేవించడమనేది మనం జీవించగల సర్వశ్రేష్ఠమైన, అత్యంత సంతృప్తికరమైన జీవన విధానమని ప్రజలకు బోధించాలని మనం కోరుకుంటున్నామనుకుందాం. (1 తిమోతి 1:​8-11) మన ప్రవర్తన, మన వ్యవహారాలు మన పొరుగువారితోనూ తోటివిద్యార్థులతోనూ తోటి ఉద్యోగస్థులతోనూ ఎలా ఉన్నాయనేది వారు గమనిస్తుండగా, మనం సంతోషంగా సంతృప్తిగా ఉన్నామని వారు చూడగలరా? అలాగే ఉదాసీనత, క్రూరత్వం గల ఈ లోకంలో క్రైస్తవ సంఘం ఎడారిలో నీటి చెలమ లాంటిదని మనం మన బైబిలు విద్యార్థులకు బోధిస్తాము. మనం సంఘంలోని వారినందరిని ప్రేమిస్తామనీ ఒకరితో ఒకరం సమాధానంగా ఉండడానికి తీవ్రంగా కృషి చేస్తామనీ మన విద్యార్థులు వెంటనే చూడగలరా?​—⁠1 పేతురు 4:⁠8.

21, 22. (ఎ) మన పరిచర్య గురించిన స్వయం పరిశీలన ఏ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు మనల్ని నడిపించగలదు? (బి) దీని తర్వాతి కావలికోట సంచికలోని ఆర్టికల్స్‌లో ఏమి చర్చించబడుతుంది?

21 మనం చేసే పరిచర్య మీద మనకున్న సానుకూల దృక్పథం కొన్నిసార్లు మనల్ని మనం పునఃపరిశీలించుకోవడానికి పురికొల్పవచ్చు. అనేకులు యథార్థంగా అలా చేసి, పూర్తికాల పరిచర్య సేవను చేపట్టడం ద్వారా లేదా అవసరత ఎక్కువగా ఉన్నచోట్ల సేవ చేయడానికి అక్కడికి వెళ్ళడం ద్వారా తాము తమ సేవను విస్తృతపరచుకొనే స్థితిలో ఉన్నామని గ్రహిస్తారు. ఇతరులు, తమ సొంత ప్రాంతంలోనే అంతకంతకూ అధికమవుతున్న శరణార్థులకు సేవ చేయడానికి ఒక విదేశీ భాషను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మీకు అలాంటి అవకాశాలుంటే వాటి గురించి జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. సేవలో గడిపే జీవితం గొప్ప ఆనందాన్నీ సంతృప్తినీ మనశ్శాంతినీ తెస్తుంది.​—⁠ప్రసంగి 5:​12.

22 మనకు సాధ్యమైనన్ని రీతుల్లో, మనం బోధించే సత్యాలపై మనం ఎవరికి బోధిస్తామో ఆ ప్రజలపై మనకున్న ప్రేమను పెంపొందించుకోవడం ద్వారా మనం యేసుక్రీస్తును అనుకరించడంలో కొనసాగుదాం. ఈ రెండు అంశాల్లో ప్రేమను వృద్ధిచేసుకుని, దాన్ని చూపించడం క్రీస్తువంటి బోధకులమై ఉండడానికి చక్కని పునాది వేసుకునేందుకు మనకు సహాయం చేస్తుంది. అయితే, ఆ పునాదిపై మనం ఎలా నిర్మించవచ్చు? దీని తర్వాతి కావలికోట సంచికలో, యేసు ఉపయోగించిన కొన్ని నిర్దిష్టమైన బోధనా పద్ధతులను చర్చించే ఆర్టికల్‌ల పరంపర ఉంటుంది.

[అధస్సూచి]

^ పేరా 11 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీరెలా సమాధానమిస్తారు?

• బోధకుడిగా యేసు ఉదాహరణ మనం అనుకరించలేనంత ఉన్నతమైనది కాదనడానికి మనకు ఏ హామీ ఉంది?

• మనం బైబిలు నుండి నేర్చుకున్న సత్యాలను ప్రేమిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?

• మనం జ్ఞానమందు ఎదుగుతుండగా నమ్రతతో ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

• మనం ఎవరికి బోధించడానికి కృషి చేస్తున్నామో వారిపై ప్రేమ చూపించడానికి కొన్ని మార్గాలు ఏవి?

[అధ్యయన ప్రశ్నలు]

[16వ పేజీలోని చిత్రాలు]

సిద్ధంగా ఉండడానికి మీరు చేయగలిగింది చేయండి

[16, 17వ పేజీలోని చిత్రాలు]

మీరు “దేవుని గూర్చిన విజ్ఞానమును” విలువైనదిగా ఎంచితే మీరు బైబిలును సమర్థవంతంగా ఉపయోగించవచ్చు

[18వ పేజీలోని చిత్రం]

మనం ప్రజలతో సువార్తను పంచుకోవడం ద్వారా వారిమీద ప్రేమను చూపిస్తాము