కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

తల్లిదండ్రుల్లో ఒకరు యెహోవాసాక్షియై మరొకరు యెహోవాసాక్షి కానప్పుడు పిల్లలను పెంచడం గురించి లేఖనాలు ఎలాంటి మార్గదర్శకాన్నిస్తున్నాయి?

పిల్లల శిక్షణ విషయంలో సాక్షికాని భాగస్వామిగల సాక్షి అయిన తల్లికి/తండ్రికి రెండు ముఖ్యమైన సూత్రాలు మార్గదర్శకాన్నిస్తాయి. అందులో ‘[మనం] మనుష్యులకు కాదు దేవునికే లోబడవలెను’ అన్నది ఒకటి. (అపొస్తలుల కార్యములు 5:​29) మరొకటి, “క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు” అన్నది. (ఎఫెసీయులు 5:​23) రెండవ సూత్రం భర్త సాక్షి అయిన భార్యలకే కాదుగానీ భర్త సాక్షికాని భార్యలకు కూడా వర్తిస్తుంది. (1 పేతురు 3:⁠1) తమ పిల్లలకు బోధించేటప్పుడు సాక్షి అయిన ఒక తల్లి/తండ్రి ఈ సూత్రాలను సమన్వయంగా ఎలా పాటించగలరు?

భర్త యెహోవాసాక్షి అయినట్లైతే తన కుటుంబం కోసం భౌతిక సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన అవసరాలను తీర్చే బాధ్యత ఆయనదే. (1 తిమోతి 5:⁠8) అవిశ్వాసి అయిన తల్లి తన పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ సాక్షి అయిన తండ్రి తన పిల్లలకు ఇంట్లో ఆధ్యాత్మిక శిక్షణనివ్వడం ద్వారా క్రైస్తవ కూటాలకు వారిని తీసుకువెళ్ళడం ద్వారా బోధించాలి. కూటాల్లో నైతిక బోధన నుండీ మంచి సహవాసం నుండీ వాళ్ళు ప్రయోజనం పొందుతారు.

సాక్షికాని భార్య తన పిల్లలను తాను ఆరాధించే స్థలానికి తీసుకువెళ్తానని గానీ తన విశ్వాసాలను బోధిస్తానని గానీ పట్టుబడితే అప్పుడెలా? ఆ ప్రాంతపు చట్టం ఆమె అలా చేయడానికి హక్కును ఇవ్వవచ్చు. అలాంటి స్థలాల్లో ఆరాధనా క్రియల్లో పాల్గొనేలా పిల్లలు ప్రలోభానికి లొంగిపోతారా అన్నది, తండ్రి ఆ పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలను బోధించిన విధానంపై ఎక్కువగా ఆధారపడి ఉండవచ్చు. పిల్లలు పెరుగుతున్నప్పుడు, తమ తండ్రి ద్వారా పొందిన లేఖనాధారిత శిక్షణ దేవుని వాక్య సత్యాన్ని అనుసరించేలా వారికి సహాయం చేయాలి. తన పిల్లలు సత్యం వైపు స్థిరంగా ఉండడానికి నిర్ణయించుకుంటే సాక్షి అయిన తండ్రికి ఎంతటి సంతోషం!

తల్లి యెహోవాసాక్షి అయినట్లైతే ఆమె తన పిల్లల శాశ్వత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ శిరస్సత్వపు సూత్రాన్ని కూడా గౌరవించాలి. (1 కొరింథీయులు 11:⁠3) అనేక సందర్భాల్లో సాక్షికాని భర్త సాక్షి అయిన తన భార్య తమ పిల్లలకు నైతిక, ఆధ్యాత్మిక విషయాలను నేర్పిస్తానంటే ఏమీ అభ్యంతరం చెప్పడు, యెహోవా ప్రజల కూటాలు ఆ విషయంలో తగిన సహాయాన్ని అందజేస్తాయి. యెహోవా సంస్థ ద్వారా తమ పిల్లలు పొందుతున్న నిర్మాణాత్మకమైన శిక్షణలోని ప్రయోజనాలను తన భర్త గ్రహించేందుకు తల్లి సహాయపడగలదు. నైతికంగా దిగజారిపోతున్న లోకంలో తమ పిల్లలు జీవిస్తున్నారు కాబట్టి, బైబిలులోని నైతిక సూత్రాలను వారిలో నాటడం ఎంత శ్రేష్ఠమైనదో ఆమె చాకచక్యంగా నొక్కి చెప్పగలదు.

అయినప్పటికీ అవిశ్వాసి అయిన భర్త తన పిల్లలు తన మతాచారాలనే పాటించాలనీ వారిని తను ఆరాధించే స్థలానికి తీసుకెళ్తాననీ తన విశ్వాసానికి అనుగుణమైన మతసంబంధ శిక్షణను ఇస్తాననీ పట్టుబడుతుండవచ్చు. లేదా ఒక భర్త మతాలన్నింటినీ వ్యతిరేకిస్తుండవచ్చు, తన పిల్లలకు మతసంబంధమైన ఏ శిక్షణా వద్దని అంటుండవచ్చు. కుటుంబ శిరస్సుగా నిర్ణయం తీసుకునే బాధ్యత ముఖ్యంగా ఆయనదే. *

అయితే తన భర్త శిరస్సత్వాన్ని గౌరవిస్తూ ఒక సమర్పిత క్రైస్తవురాలిగా సాక్షి అయిన భార్య, ‘మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేము’ అని అపొస్తలులైన పేతురు, యోహానులు అన్న మాటలను తన మనస్సులో ఉంచుకుంటుంది. (అపొస్తలుల కార్యములు 4:​19, 20) పిల్లల ఆధ్యాత్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, సాక్షి అయిన ఒక తల్లి వారికి నైతిక మార్గనిర్దేశాన్నివ్వడానికి అవకాశాల కోసం వెదుకుతుంది. సత్యమని తనకు తెలిసినదాని గురించి ఇతరులకు బోధించవలసిన బాధ్యత యెహోవా ఎదుట ఆమెకు ఉంది, అలాగే ఆమె తన పిల్లలకు కూడా బోధించాలి. (సామెతలు 1:⁠8; మత్తయి 28:​19, 20). అలాంటి సందిగ్ధావస్థలో సాక్షి అయిన ఒక తల్లి ఎలా ప్రవర్తించగలదు?

ఉదాహరణకు, దేవునిపై నమ్మకం ఉంచడాన్ని గురించిన విషయాన్నే తీసుకోండి. భర్త పెట్టిన ఆంక్షల కారణంగా సాక్షి అయిన భార్యకు తన పిల్లలతో సరిగ్గా బైబిలు అధ్యయనం చేసే అవకాశం ఉండకపోవచ్చు. దాన్ని బట్టి ఆమె ఇక తన పిల్లలకు యెహోవా గురించి ఏమీ చెప్పకుండా ఉండాలా? లేదు. సృష్టికర్తపై ఆమెకున్న విశ్వాసాన్ని ఆమె మాటలు, క్రియలు సహజంగానే వ్యక్తం చేస్తాయి. ఆమె పిల్లలకు ఆ విషయంలో ప్రశ్నలుంటాయనడంలో సందేహం లేదు. ఆమె తనకున్న మత స్వేచ్ఛను బట్టి సృష్టికర్తపై తనకున్న విశ్వాసాన్ని ఇతరులతోపాటు తన పిల్లలకు యథేచ్ఛగా వ్యక్తం చేయాలి. తన పిల్లలతో బైబిలు అధ్యయనాన్ని నిర్వహించలేక పోయినా వారిని క్రమంగా కూటాలకు తీసుకువెళ్ళలేక పోయినా కూడా ఆమె యెహోవా దేవుని గురించిన పరిజ్ఞానాన్ని తన పిల్లల్లో నాటగలదు.​—⁠ద్వితీయోపదేశకాండము 6:⁠7.

ఒక విశ్వాసికీ ఆమె (లేక ఆయన) అవిశ్వాసి అయిన భాగస్వామికీ మధ్య ఉండే సంబంధం గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధపరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.” (1 కొరింథీయులు 7:​14) విశ్వాసియైన భాగస్వామిని బట్టి యెహోవా వైవాహిక సంబంధాన్ని పవిత్రమైనదిగా దృష్టిస్తాడు, పిల్లలు యెహోవా దృష్టిలో పవిత్రులుగా పరిగణించబడతారు. సాక్షి అయిన భార్య, తుది ఫలితాన్ని యెహోవాకు వదిలేసి, సత్యాన్ని అర్థం చేసుకొనేలా తన పిల్లలకు సహాయపడడంలో తాను చేయగలిగినదంతా చెయ్యాలి.

పిల్లలు పెద్దయ్యాక, తమ తల్లిదండ్రుల నుండి తాము పొందిన సమాచారం ఆధారంగా ఏ స్థానం వహించాలనేది తామే నిర్ణయించుకోవాలి. “తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు” అని యేసు చెప్పిన మాటలకు అనుగుణంగా ప్రవర్తించడానికి వారు నిర్ణయం తీసుకుంటుండవచ్చు. (మత్తయి 10:​37) వారికి ఇలా కూడా ఆజ్ఞ ఇవ్వబడింది: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి.” (ఎఫెసీయులు 6:⁠1) అనేకమంది యౌవనస్థులకు సాక్షికాని తమ తల్లి/తండ్రి నుండి బాధలు కష్టాలు ఎదురైనప్పటికీ అలాంటి తల్లికి/తండ్రికి బదులుగా ‘దేవునికే లోబడాలి’ అని వారు నిర్ణయించుకున్నారు. వ్యతిరేకత ఉన్నప్పటికీ తమ పిల్లలు యెహోవాను సేవించాలనే నిర్ణయం తీసుకోవడాన్ని చూడడం విశ్వాసి అయిన ఒక తల్లికి/తండ్రికి ఎంత తృప్తికరమో కదా!

[అధస్సూచి]

^ పేరా 7 ఒక భార్యకు చట్టబద్ధంగా ఉన్న మత స్వేచ్ఛా హక్కులో క్రైస్తవ కూటాలకు హాజరయ్యే హక్కు కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో భార్య కూటాలకు వెళ్ళిన సమయాల్లో తమ చిన్న పిల్లలను చూసుకోవడానికి ఆమె భర్త ఇష్టపడలేదు, అప్పుడు ప్రేమగల తల్లి పిల్లలను తనతోపాటు కూటాలకు తీసుకువెళ్ళడానికి బద్ధురాలయ్యింది.