“మీకు మాదిరి ఉంచాను”
“మీకు మాదిరి ఉంచాను”
‘కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారైయున్నారు.’—హెబ్రీయులు 5:12.
1. హెబ్రీయులు 5:12 లోని మాటలు ఒక క్రైస్తవునికి సహజంగానే ఎందుకు కొంచెం చింతను కలిగించవచ్చు?
మన ముఖ్యాంశ లేఖనంలోని ప్రేరేపిత మాటలను చదువుతుండగా, మీ గురించి మీకు కొంచెం చింతగా ఉందా? అలాగైతే అలాంటి చింత ఉన్నది మీకొక్కరికే కాదు. క్రీస్తు అనుచరులముగా మనం బోధకులమై ఉండాలని మనకు తెలుసు. (మత్తయి 28:19, 20) నేడు మనం జీవిస్తున్న కాలాలు, మనం సాధ్యమైనంత చక్కగా బోధించడం ఆవశ్యకమయ్యేలా చేస్తాయని మనకు తెలుసు. మనం బోధించేవారికి మన బోధ జీవన్మరణ విషయం కూడా కాగలదని మనకు బాగా తెలుసు! (1 తిమోతి 4:16) కాబట్టి సహజంగానే మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ఎలాంటి బోధకుడనై ఉండాలో నిజంగా అలాగే ఉన్నానా? నేను ఎలా మెరుగుపరుచుకోగలను?’
2, 3. (ఎ) మంచి బోధకు పునాదిని ఒక బోధకుడు ఎలా వర్ణించాడు? (బి) బోధ విషయంలో యేసు మనకు ఏ మాదిరిని ఉంచాడు?
2 అలాంటి చింతలు మనల్ని నిరుత్సాహపరచనవసరం లేదు. బోధ అనేది కొన్ని ప్రత్యేకమైన సాంకేతిక నైపుణ్యాలు అవసరమైన అంశం మాత్రమేనని మనం అనుకుంటే, దాన్ని మెరుగుపరుచుకోవడం చాలా కష్టమని మనం భావించవచ్చు. అయితే మంచి బోధకు పునాది నైపుణ్యం కాదు, అంతకంటే ఎంతో ప్రాముఖ్యమైనది మరొకటుంది. అనుభవజ్ఞుడైన ఒక బోధకుడు బోధకు సంబంధించిన ఒక పుస్తకంలో ఏమి వ్రాశాడో గమనించండి: “మంచి బోధ నిర్దిష్టమైన నైపుణ్యాలకు లేదా శైలిలకు, ప్రణాళికలకు లేదా చర్యలకు సంబంధించిన అంశం కాదు. . . . బోధ ప్రధానంగా ప్రేమకు సంబంధించిన విషయం.” నిజమే, ఆయన మాట్లాడుతున్నది లౌకిక బోధకుడి గురించే. అయినా, క్రైస్తవులముగా మనం చేసే బోధకు ఆయన చెబుతున్న విషయాన్ని మరింత ఎక్కువగా అన్వయించవచ్చు. అదెలా?
3 బోధకుడిగా మన మాదిరికర్త, “మీకు మాదిరి ఉంచాను” అని తన అనుచరులకు చెప్పిన యేసుక్రీస్తే. (యోహాను 13:15, NW) నమ్రతను చూపించడంలో తాను ఉంచిన మాదిరి గురించి ఇక్కడ ఆయన సూచిస్తున్నాడు, కానీ యేసు మన కోసం ఉంచిన మాదిరిలో ఈ భూమిపై మానవునిగా ఆయన చేసిన ప్రధానమైన పని అంటే దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రజలకు బోధించడమనే పని తప్పక ఇమిడి ఉంది. (లూకా 4:43) కాబట్టి, యేసు పరిచర్యను వర్ణించడానికి మీరు కేవలం ఒకే ఒక్క పదాన్ని ఎంపిక చేయాలనుకుంటే బహుశా “ప్రేమ” అనే పదాన్ని ఎంపిక చేసుకుంటుండవచ్చు, కాదంటారా? (కొలొస్సయులు 1:15; 1 యోహాను 4:8) యేసుకు తన పరలోక తండ్రియైన యెహోవా మీద ఉన్న ప్రేమ సర్వోత్కృష్టమైనది. (యోహాను 14:31) అయితే యేసు ఒక బోధకుడిగా ప్రేమను రెండు అదనపు మార్గాల్లో చూపించాడు. ఆయన తాను బోధించిన సత్యాలనూ తాను ఎవరికి బోధించాడో ఆ ప్రజలనూ ప్రేమించాడు. ఆయన మన కోసం ఉంచిన మాదిరిలోని ఈ రెండు అంశాలను మనం మరింత నిశితంగా పరిశీలిద్దాము.
దైవిక సత్యాలమీద నిరంతరం నిలిచే ప్రేమ
4. యేసు, యెహోవా బోధలంటే ప్రేమను ఎలా పెంపొందించుకున్నాడు?
4 ఒక బోధకుడికి తాను బోధించే విషయంపై ఉండే దృక్పథం ఆయన బోధనా నాణ్యతపై చెప్పుకోదగినంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఏ మాత్రం అనాసక్తి ఉన్నా అది బయటికి తెలిసిపోతుంది, ఆయన విద్యార్థుల వరకూ అది చేరిపోతుంది. యేసు యెహోవా గురించి, ఆయన రాజ్యం గురించి తాను యెషయా 50:4, 5 వచనాల్లో ఈ సముచితమైన మాటలు వ్రాయబడి ఉన్నాయి: “అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు. వినకుండ నేను తొలగిపోలేదు.”
బోధిస్తున్న అమూల్యమైన సత్యాలంటే ఉదాసీనత చూపించలేదు. ఈ విషయంలో యేసుకున్న ప్రేమ ప్రగాఢమైనది. ఒక విద్యార్థిగా ఆయన దాన్ని పెంపొందింపజేసుకున్నాడు. తాను మానవునిగా జన్మించడానికి ముందటి సుదీర్ఘమైన యుగాలన్నిటిలోనూ అద్వితీయ కుమారుడు అత్యంత ఆసక్తితో నేర్చుకునేవాడు.5, 6. (ఎ) యేసు తన బాప్తిస్మం సమయంలో ఎలాంటి అనుభవాన్ని పొందాడని స్పష్టమవుతోంది, అది ఆయనపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? (బి) దేవుని వాక్యాన్ని ఉపయోగించే విషయంలో యేసుకు సాతానుకు మధ్య ఎలాంటి తేడాను మనం చూస్తాము?
5 ఈ భూమిపై యేసు మానవునిగా పెరుగుతున్నప్పుడు దైవిక జ్ఞానాన్ని ప్రేమించడం కొనసాగించాడు. (లూకా 2:52) ఇక ఆయన తన బాప్తిస్మం సమయంలో ఒక విశేషమైన అనుభవాన్ని పొందాడు. ‘ఆకాశము తెరవబడింది’ అని లూకా 3:21 చెబుతోంది. అప్పుడు యేసు తన మానవపూర్వపు ఉనికిని గుర్తుకు తెచ్చుకోగలిగాడని స్పష్టమవుతోంది. ఆ తర్వాత ఆయన ఉపవాసముంటూ 40 రోజులపాటు అరణ్యంలో గడిపాడు. ఆయన తాను పరలోకంలో యెహోవా నుండి ఉపదేశాన్ని పొందుతూ గడిపిన అనేక సందర్భాల గురించి ధ్యానించడంలో మిక్కుటమైన ఆనందాన్ని పొంది ఉండవచ్చు. అయితే ఎంతోకాలం గడవక ముందే దేవుని సత్యాల మీద ఆయనకున్న ప్రేమ పరీక్షకు గురైంది.
6 యేసు అలసిపోయి ఆకలితో ఉన్నప్పుడు సాతాను ఆయనను శోధించడానికి ప్రయత్నించాడు. దేవుని ఈ ఇద్దరు కుమారుల మధ్య మనం ఎంత తేడాను చూస్తామో కదా! ఇద్దరూ హీబ్రూ లేఖనాల నుండే ఎత్తి చెప్పారు—కానీ పూర్తిగా భిన్నమైన దృక్పథాలతో వారాపని చేశారు. సాతాను తన సొంత స్వార్థపూరిత ఉద్దేశాల కోసం దేవుని వాక్యాన్ని అగౌరవంగా ఉపయోగిస్తూ దాన్ని వక్రీకరించాడు. నిజంగా, ఆ తిరుగుబాటుదారుడికి దైవిక సత్యాలపై ఉన్నది తృణీకార భావమే తప్ప మరేమీ కాదు. మరో వైపున, యేసు ప్రతీ సమాధానంలోనూ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తూ ప్రస్ఫుటమైన ప్రేమతో లేఖనాలు ఉల్లేఖించాడు. ఆ ప్రేరేపిత మాటలు మొదటిసారి వ్రాయబడడానికి ఎంతోకాలం ముందే యేసు ఉనికిలో ఉన్నాడు, అయినా ఆయన వాటిని ఎంతో ఉన్నతమైనవిగా ఎంచాడు. అవి ఆయనకు తన పరలోక తండ్రి నుండి వచ్చిన అమూల్యమైన సత్యాలు! యెహోవా నుండి వచ్చిన ఆ మాటలు తనకు ఆహారం కన్నా ప్రాణాధారమైనవని ఆయన సాతానుకు చెప్పాడు. (మత్తయి 4:1-11) అవును, యెహోవా తనకు బోధించిన సత్యాలన్నింటినీ యేసు ప్రేమించాడు. అయితే, ఒక బోధకుడిగా ఆయన ఆ ప్రేమను ఎలా చూపించాడు?
తాను బోధిస్తున్న సత్యాలపట్ల ఉన్న ప్రేమ
7. యేసు తన సొంత బోధలను ఎందుకు కల్పించుకోలేదు?
7 యేసుకు తాను బోధిస్తున్న సత్యాలంటే ఉన్న ప్రేమ ఎల్లప్పుడూ స్పష్టమయ్యేది. ఆయన సులభంగా తన సొంత తలంపులను వృద్ధి చేసుకుని ఉండగలిగేవాడే. ఆయనకు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఉండేవి. (కొలొస్సయులు 2:3) అయినప్పటికీ, ఆయన తను బోధిస్తున్న ప్రతీది తన పరలోక తండ్రి తనకు బోధించినదే గానీ తన సొంత బోధ కాదని తన శ్రోతలకు పదేపదే గుర్తు చేశాడు. (యోహాను 7:16; 8:28; 12:49; 14:10) దైవిక సత్యాల స్థానంలో తన సొంత ఆలోచనా విధానాన్ని ఉంచలేనంతగా ఆయన వాటిని ప్రేమించాడు.
8. యేసు తన పరిచర్య ప్రారంభంలో, దేవుని వాక్యంపై ఆధారపడడం విషయంలో ఎలా ఒక మాదిరిని ఉంచాడు?
8 యేసు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించిన వెంటనే మనకు ఒక మాదిరిని ఉంచాడు. వాగ్దానం చేయబడిన మెస్సీయ తానేనన్న విషయాన్ని దేవుని ప్రజలకు మొదటిసారిగా ఏవిధంగా ప్రకటించాడో గమనించండి. ఆయన జనసమూహాల ముందుకి వచ్చి తనను తాను అభిషిక్తునిగా ప్రకటించుకుని, తాను చెబుతున్న విషయాన్ని నిరూపించుకోవడానికి మహాశ్చర్యకరమైన అద్భుతాలు చేశాడా? లేదు. దేవుని ప్రజలు వాడుక చొప్పున లేఖనాలను చదివే సమాజమందిరానికి ఆయన వెళ్ళాడు. అక్కడాయన యెషయా 61:1, 2 వచనాల్లోని ప్రవచనాన్ని బిగ్గరగా చదివి, ఈ ప్రవచనార్థక సత్యాలు తనకు అన్వయిస్తాయని వివరించాడు. (లూకా 4:16-22) ఆయన చేసిన అనేక అద్భుతాలు ఆయనకు యెహోవా మద్దతు ఉందని నిరూపించాయి. అయినా, బోధించేటప్పుడు ఎప్పుడూ ఆయన దేవుని వాక్యంపైనే ఆధారపడ్డాడు.
9. పరిసయ్యులతో తన వ్యవహారాలలో, దేవుని వాక్యమంటే తనకున్న యథార్థమైన ప్రేమను యేసు ఎలా చూపించాడు?
9 యేసును మతసంబంధమైన వ్యతిరేకులు సవాలు చేసినప్పుడు ఆయన వాగ్వివాదంతో వారిని ఓడించడానికి ప్రయత్నించలేదు, అలా చేసి ఉంటే ఆయన వారిపై చాలా సులభంగానే విజయం సాధించి ఉండేవాడు. బదులుగా, వారు తప్పని దేవుని వాక్యం నిరూపించేలా అనుమతించాడు. ఉదాహరణకు, యేసు అనుచరులు పంటచేలలో నుండి వెళ్తున్నప్పుడు కొన్ని వెన్నులు త్రుంచుకొని తిన్నందుకు వారు విశ్రాంతి దినాన చేయకూడనిది చేస్తున్నారని పరిసయ్యులు అరోపించిన సంఘటనను గుర్తు తెచ్చుకోండి. యేసు ఇలా సమాధానమిచ్చాడు: మత్తయి 12:1-5) స్వనీతిపరులైన ఆ వ్యక్తులు 1 సమూయేలు 21:1-6 వచనాల్లో వ్రాయబడి ఉన్న ప్రేరేపిత వృత్తాంతాన్ని చదివే ఉంటారు. కానీ, దానిలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని గ్రహించడంలో వారు విఫలులయ్యారు. అయితే యేసు ఆ వృత్తాంతాన్ని చదవడం కంటే ఎక్కువే చేశాడు. ఆయన దాని గురించి ఆలోచించి, దాన్ని హృదయంలోకి తీసుకున్నాడు. ఆ వృత్తాంతం ద్వారా యెహోవా బోధించిన సూత్రాలను ఆయన ప్రేమించాడు. కాబట్టి, ధర్మశాస్త్రానికున్న సమతుల్యమైన స్ఫూర్తిని వెల్లడిచేయడానికి ఆ వృత్తాంతాన్నీ మోషే ధర్మశాస్త్రం నుండి ఒక ఉదాహరణనూ ఆయన ఉపయోగించాడు. అలాగే, దేవుని వాక్యమంటే యేసుకున్న యథార్థమైన ప్రేమ, ఆ వాక్యాన్ని తమ సొంత ఉద్దేశాల అనుసారంగా వక్రీకరించడానికీ మానవ సాంప్రదాయాల బురద క్రింద కప్పిపెట్టడానికీ మతనాయకులు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా దాన్ని సమర్థించేలా ఆయనను పురికొల్పింది.
“తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొని యుండగా దావీదు చేసిన దానిగూర్చి మీరు చదువలేదా?” (10. యేసు తన బోధ యొక్క నాణ్యతకు సంబంధించిన ప్రవచనాలను ఎలా నెరవేర్చాడు?
10 యేసుకు తాను బోధిస్తున్న విషయం మీదున్న ప్రేమ, విసుగు కలిగించేలా లేదా యాంత్రికంగా కేవలం కంఠస్థం చేసి బోధించేలా ఆయనను ఎన్నడూ అనుమతించదు. మెస్సీయ “ఇంపైన మాటలు” ఉపయోగిస్తూ “పెదవులమీద దయారసము పోయబడి”నట్లు మాట్లాడతాడని ప్రేరేపిత ప్రవచనాలు సూచించాయి. (ఆదికాండము 49:21; కీర్తన 45:2) యేసు తాను ఎంతో ప్రేమించిన సత్యాలను బోధించేటప్పుడు ‘మనోహరమైన మాటలను’ ఉపయోగిస్తూ తన సందేశాన్ని ఆసక్తికరంగా, సుస్పష్టంగా ఉంచడం ద్వారా ఆ ప్రవచనాలను నెరవేర్చాడు. (లూకా 4:22, NW) నిస్సందేహంగా ఆయనలో ఉన్న ఉత్సాహం ఆయన ముఖకవళికల్లో కనిపించి ఉంటుంది, తాను బోధిస్తున్నదానిలో ఆయనకున్న ఉత్తేజవంతమైన ఆసక్తితో ఆయన కళ్ళు ప్రకాశమానమై ఉంటాయి. ఆయన చెప్పేది వినడం ప్రజలకు ఎంత ఆనందాన్నిచ్చి ఉండవచ్చు! మనం నేర్చుకున్న వాటి గురించి ఇతరులతో మాట్లాడేటప్పుడు అనుకరించడానికి మనకు ఎంత చక్కని మాదిరి!
11. బోధకునిగా యేసుకున్న సామర్థ్యాలు ఆయన ఎన్నడూ గర్వంతో ఉబ్బిపోకుండా ఎలా చేశాయి?
11 దైవిక సత్యాల గురించి యేసుకున్న అపారమైన అవగాహన, ప్రసంగించడంలో ఆయనకున్న కౌశలం ఆయన గర్వంతో ఉబ్బిపోయేలా చేశాయా? మానవ బోధకుల విషయంలో తరచూ అలా జరుగుతుంది. అయితే యేసు దైవిక మార్గంలో జ్ఞానవంతంగా ఉన్నాడని గుర్తుంచుకోండి. అలాంటి జ్ఞానం అహంకారాన్ని అనుమతించదు, ఎందుకంటే “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.” (సామెతలు 11:2) అయితే యేసు గర్విష్టిగా గానీ అహంకారిగా గానీ మారకుండా కాపాడినది మరొకటుంది.
యేసు తానెవరికి బోధించాడో ఆ ప్రజలను ప్రేమించాడు
12. యేసు తన అనుచరులు తనకు భయపడాలని కోరుకోవడం లేదని ఎలా చూపించాడు?
12 యేసుకు ప్రజలంటే ఉన్న ప్రేమ ఆయన చేసే బోధలో ప్రతిబింబించేది. ఆయన బోధ, అహంకారులైన మానవుల బోధలా ప్రజలను ఎన్నడూ భయపెట్టేది కాదు. (ప్రసంగి 8:9) యేసు చేసిన అద్భుతాల్లో ఒకదాన్ని చూసిన తర్వాత పేతురు ఎంతో విస్మయమొంది యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. కానీ తన అనుచరులు తనంటే అనారోగ్యకరమైన భయం కలిగి ఉండాలని యేసు కోరుకోలేదు. ఆయన కనికరంతో “భయపడకుము” అన్నాడు. ఆ తర్వాత యేసు, పేతురు భాగం వహించబోయే శిష్యులనుచేసే ఉత్తేజవంతమైన పని గురించి ఆయనకు చెప్పాడు. (లూకా 5:8-10) యేసు తన శిష్యులు తమ ఉపదేశకుడి మీది భయంతో కాదుగానీ దేవుని గురించిన అమూల్యమైన సత్యాలపై తమకున్న ప్రేమను బట్టి కదిలించబడాలని కోరుకున్నాడు.
13, 14. యేసు ప్రజలపై తదనుభూతిని ఏ యే విధాలుగా చూపించాడు?
13 యేసు తాను ఎవరికి బోధించాడో ఆ ప్రజలంటే ఆయనకున్న ప్రేమ, వారిపై ఆయన చూపించిన తదనుభూతిలో కూడా స్పష్టమయ్యింది. ‘ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడెను.’ మత్తయి 9:36) వారున్న దుర్భరమైన స్థితిని బట్టి ఆయన వారిపై జాలిపడి, వారికి సహాయం చేయడానికి కదిలించబడ్డాడు.
(14 మరో సందర్భంలో యేసు చూపించిన తదనుభూతిని గమనించండి. రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ సమూహంలో ఉన్న ఆయనను సమీపించి ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు, ఆమె అద్భుతమైన రీతిలో స్వస్థపరచబడింది. తనలో నుండి ప్రభావము బయలువెళ్ళిందని యేసు గ్రహించాడు, కానీ ఎవరు స్వస్థపరచబడ్డారో ఆయన చూడలేదు. స్వస్థపరచబడిన ఆ స్త్రీ ఎవరో కనుక్కోవాలని ఆయన పట్టుబట్టాడు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని లేదా శాస్త్రుల పరిసయ్యుల నియమాలను ఉల్లంఘించినందుకు ఆమెను విమర్శించడానికి మాత్రం కాదు, అలా విమర్శిస్తాడేమోనని ఆమె భయపడి ఉండవచ్చు. బదులుగా ఆమెతో ఆయనిలా అన్నాడు: “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక.” (మార్కు 5:25-34) ఆ మాటల్లోని తదనుభూతిని గమనించండి. ఆయన కేవలం “స్వస్థత పొందు” అని అనలేదు. కానీ, “నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక” అన్నాడు. మార్కు ఇక్కడ అక్షరార్థంగా “కొరడాతో కొట్టడం” అనే భావాన్నివ్వగల పదాన్ని ఉపయోగిస్తున్నాడు, సాధారణంగా హింసించడానికి ఇలా కొరడాతో కొడతారు. ఆమె అనారోగ్యం ఆమెకు బాధను బహుశా తీవ్రమైన శారీరక, మానసిక వేదనను కలిగించి ఉండవచ్చునని యేసు అంగీకరించాడు. ఆయనకు ఆమెపై తదనుభూతి ఉంది.
15, 16. యేసు పరిచర్యలోని ఏ సంఘటనలు ఆయన ప్రజలలో మంచి కోసం చూసేవాడని తెలియజేస్తాయి?
15 యేసు ప్రజలలో మంచి కోసం చూడడం ద్వారా కూడా వారిపై ప్రేమను చూపించాడు. ఆ తర్వాత అపొస్తలుడిగా మారిన నతనయేలును ఆయన కలిసినప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. “యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి—ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను.” యేసు అద్భుతరీతిగా నతనయేలు హృదయంలోకి చూసి ఆయన గురించి ఎంతో తెలుసుకున్నాడు. నిజమే నతనయేలు పరిపూర్ణుడేమీ కాదు. మనందరిలాగే ఆయనలోనూ లోపాలున్నాయి. వాస్తవానికి, ఆయన యేసు గురించి విన్నప్పుడు “నజరేతులో నుండి మంచిదేదైన రాగలదా?” అంటూ ఒక మోస్తరు కరుకుగా వ్యాఖ్యానించాడు. (యోహాను 1:45-51) అయితే, నతనయేలు గురించి చెప్పగల వాటన్నిటిలో యేసు ప్రశంసనీయమైన ఒక విషయాన్ని అంటే ఆయనకున్న నిజాయితీని ఎంచుకున్నాడు.
16 అలాగే బహుశా, అన్యుడూ రోమీయుడూ అయిన ఒక సైనికాధికారి యేసును సమీపించి తన దాసుని స్వస్థపరచమని అడిగినప్పుడు, ఆ సైనికాధికారిలో లోపాలున్నాయని యేసుకు తెలుసు. ఆ రోజుల్లో సాధారణంగా ఒక సైనికాధికారికి ఎన్నో దౌర్జన్యాలు చేసిన, ఎంతో రక్తం చిందించిన, అబద్ధ ఆరాధనలో పాల్గొన్న గతచరిత్రే ఉండేది. అయినా యేసు మంచి విషయంపైనే అంటే ఆయనకున్న అసాధారణమైన విశ్వాసంపైనే దృష్టి కేంద్రీకరించాడు. (మత్తయి 8:5-13) ఆ తర్వాత, యేసు తన ప్రక్కన హింసా కొయ్యపై వ్రేలాడదీయబడిన దొంగతో మాట్లాడుతూ ఆ వ్యక్తిని ఆయన చేసిన గత నేరాల గురించి గద్దించలేదు గానీ భవిష్యత్తు గురించిన ఒక నిరీక్షణతో ఆయనను ప్రోత్సహించాడు. (లూకా 23:43) ఇతరుల గురించి ప్రతికూలంగా విమర్శనాత్మకంగా ఆలోచించడం, వారిని నిరుత్సాహపరచడానికే పనికొస్తుందని యేసుకు బాగా తెలుసు. ఇతరులలో ఉన్న మంచిని కనుగొనడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, అనేకులు తమను తాము మెరుగుపరచుకోవడానికి వారిని ప్రోత్సహించాయనడంలో సందేహం లేదు.
ప్రజలకు సేవ చేయడానికి సంసిద్ధత
17, 18. యేసు భూమి మీదికి వచ్చే నియామకాన్ని అంగీకరించడం ద్వారా ఇతరులకు సేవ చేయడానికి సంసిద్ధతను ఎలా చూపించాడు?
17 యేసు తాను ఎవరికి బోధించాడో ఆ ప్రజలంటే ఆయనకున్న ప్రేమకు మరో శక్తివంతమైన నిదర్శనం వారికి సేవ చేయడానికి ఆయన కలిగివున్న సంసిద్ధత. దేవుని కుమారుడు తన మానవపూర్వపు జీవితంలో ఎల్లప్పుడూ మానవజాతిని బట్టి ఆనందించేవాడు. (సామెతలు 8:30, 31) యెహోవా “వాక్యము”గా లేదా ప్రతినిధిగా మానవులతో ఎన్నో వ్యవహారాలను ఆయన ఆనందించి ఉండవచ్చు. (యోహాను 1:1) అయితే, మానవజాతికి ప్రత్యక్షంగా బోధించాలన్నది ఆయన భూమి మీదికి రావడానికి పాక్షికంగా కారణం, ఆయన పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని వదిలి ‘దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు.’ (ఫిలిప్పీయులు 2:7; 2 కొరింథీయులు 8:9) యేసు భూమి మీద ఉన్నప్పుడు ఇతరులు తనకు సేవ చేయాలని ఎప్పుడూ ఎదురు చూడలేదు. దానికి భిన్నంగా “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని” ఆయన అన్నాడు. (మత్తయి 20:28) యేసు పూర్తిగా ఆ మాటలకు అనుగుణంగా జీవించాడు.
18 యేసు తాను ఎవరికి బోధించాడో వారి అవసరాలకు తగినట్లు నమ్రతగా సేవచేస్తూ సంసిద్ధతతో తనను తాను వారి కోసం వెచ్చించుకున్నాడు. సాధ్యమైనంతమందికి సువార్త ప్రకటించాలనే ప్రయత్నంలో ఆయన వాగ్దాన దేశంలో వందల కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణించాడు. అహంకారులైన పరిసయ్యులకు శాస్త్రులకు భిన్నంగా ఆయన నమ్రతతో, అందరూ సమీపించగలిగేలా ఉన్నాడు. అన్ని రకాల ప్రజలు—ఉన్నతాధికారులు, సైనికులు, న్యాయవాదులు, స్త్రీలు, పిల్లలు, పేదలు, రోగులు, చివరికి సమాజం నుండి వెలివేయబడినవారు—ఆత్రుతతో నిర్భయంగా ఆయనను సమీపించారు. పరిపూర్ణుడే అయినప్పటికీ యేసు మానవుడు, ఆయనకు కూడా అలసటా ఆకలీ ఉండేవి. అయితే, ఆయన అలసిపోయినప్పుడు లేదా విశ్రాంతి తీసుకోవలసిన అవసరం ఉన్నప్పుడు లేదా ప్రార్థన కోసం ప్రశాంతమైన సమయం అవసరమైనప్పుడు తన సొంత అవసరాల కంటే ఇతరుల అవసరాలకే ఆయన ప్రాధాన్యతనిచ్చాడు.—మార్కు 1:35-39.
19. యేసు తన శిష్యులతో నమ్రతతో సహనంతో దయతో వ్యవహరించడంలో ఎలాంటి మాదిరిని ఉంచాడు?
19 యేసు తన సొంత శిష్యులకు సేవ చేయడంలో కూడా అంతే సంసిద్ధతను చూపించాడు. వారికి దయతో సహనంతో బోధించడం ద్వారా ఆయనాపని చేశాడు. కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలను వారు వెంటనే గ్రహించలేకపోయినప్పుడు ఆయన అంతటితో ఆశలు వదులుకోలేదు, కోపం తెచ్చుకోలేదు లేదా వారిని గద్దించనూ లేదు. తాను చెప్పేది వారు అర్థం చేసుకునేందుకు సహాయం చేయడానికి ఆయన క్రొత్త క్రొత్త మార్గాలను అవలంబించేవాడు. ఉదాహరణకు, తమలో ఎవరు గొప్పవారనే దాని గురించి శిష్యులు ఎంత తరచుగా తగవులాడుకున్నారో ఒకసారి ఆలోచించండి. పదేపదే చివరికి యేసు తనకు శిక్ష అమలుచేయబడడానికి ముందు రాత్రి వరకూ కూడా ఒకరితో ఒకరు నమ్రతగా మెలగాలని వారికి బోధించడానికి క్రొత్త మార్గాలను వెదికాడు. ఇతర విషయాలన్నిటిలోలాగే ఈ నమ్రత విషయంలో కూడా యేసు “మీకు మాదిరి ఉంచాను” అని సరిగ్గా చెప్పగలిగాడు.—యోహాను 13:5-15, NW; మత్తయి 20:25; మార్కు 9:34-37.
20. ఏ బోధనా విధానం యేసును పరిసయ్యుల నుండి భిన్నంగా ఉంచింది, ఆ విధానం ఎందుకు ప్రభావవంతమైనది?
20 యేసు వారికి కేవలం చెప్పడం ద్వారా మాత్రమే కాక చేయడం ద్వారా “మాదిరి” ఉంచాడని గమనించండి. ఆయన తన ఉదాహరణ ద్వారా వారికి బోధించాడు. పాటించమని తాను వారికి చెబుతున్న విషయాలను తాను పాటించడం అంత ప్రాముఖ్యం కాదన్నట్లుగా, తనను తాను వారికంటే ఉన్నతుడనని పరిగణించుకుంటున్నట్లుగా ఆయన వారిని తక్కువ చేసి మాట్లాడలేదు. పరిసయ్యులు అలా ప్రవర్తించేవారు. “వారు చెప్పుదురే గాని చేయరు” అని యేసు వారి గురించి చెప్పాడు. (మత్తయి 23:3) యేసు తన బోధల ఖచ్చితమైన భావమేమిటో తాను వాటి అనుసారంగా జీవించడం ద్వారా, వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా నమ్రతగా తన విద్యార్థులకు చూపించాడు. ధనాపేక్షలేని సరళమైన జీవితాన్ని గడపమని ఆయన తన అనుచరులను ఉద్బోధించినప్పుడు, అదేమిటో వారు ఊహించుకోనవసరం లేకపోయింది. “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని” ఆయన అన్న మాటల్లోని వాస్తవికతను వారు చూడగలిగారు. (మత్తయి 8:20) యేసు తన శిష్యులకు నమ్రతతో మాదిరిని ఉంచడం ద్వారా వారికి సేవ చేశాడు.
21. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?
21 నిస్సందేహంగా యేసు భూమి మీద జీవించినవారిలోకెల్లా అత్యంత గొప్ప బోధకుడు! యేసు తాను బోధిస్తున్న దానిపై తాను ఎవరికి బోధిస్తున్నాడో ఆ ప్రజలపై ఆయనకున్న ప్రేమ ఆయనను చూసిన, ఆయన మాటలు విన్న యథార్థ హృదయులందరికీ స్పష్టమయ్యింది. ఆయన ఉంచిన మాదిరిని నేడు అధ్యయనం చేసే మనకు కూడా అది అంతే స్పష్టంగా ఉంది. అయితే మనం క్రీస్తు పరిపూర్ణమైన ఉదాహరణను ఎలా అనుసరించగలము? తర్వాతి ఆర్టికల్ ఆ ప్రశ్నను చర్చిస్తుంది.
మీరెలా సమాధానమిస్తారు?
• మంచి బోధకు పునాది ఏమిటి, దాన్ని ఎవరు సోదాహరణంగా చూపించారు?
• యేసు తాను బోధించిన సత్యాలపై ప్రేమను ఏ యే విధాలుగా చూపించాడు?
• యేసు తాను ఎవరికి బోధించాడో వారిమీద ప్రేమను ఎలా కనబరిచాడు?
• యేసు తాను ఎవరికి బోధించాడో వారికి సేవ చేయడానికి నమ్రతతో కూడిన ఆయన సంసిద్ధతను ఏ యే ఉదాహరణలు చూపిస్తున్నాయి?
[అధ్యయన ప్రశ్నలు]
[12వ పేజీలోని చిత్రం]
దేవుని వాక్యంలో ఉన్న సూత్రాలను తాను ప్రేమిస్తున్నానని యేసు ఎలా చూపించాడు?