మీరు ఎవరికి విశ్వసనీయంగా ఉండాలి?
మీరు ఎవరికి విశ్వసనీయంగా ఉండాలి?
“మా దేశం: . . . ఎల్లప్పుడూ సరైనదిగా ఉండునుగాక; తప్పైనా ఒప్పైనా అది మా దేశం.” —స్టీవన్ డెకటుర్, అమెరికా నౌకాసైన్యాధికారి, 1779-1820.
ఎలాంటి సందేహం లేకుండా దేశానికి విశ్వసనీయంగా ఉండడాన్ని అనేకమంది తమ సర్వోత్కృష్టమైన బాధ్యతగా పరిగణిస్తారు. ఇతరులు స్టీవన్ డెకటుర్ పలికిన మాటలను ‘నా మతం . . . ఎల్లప్పుడూ సరైనదిగా ఉండునుగాక; తప్పైనా ఒప్పైనా అది నా మతం’ అని మరోవిధంగా అంటారు.
వాస్తవానికి, మన విశ్వసనీయతను కోరే దేశం గానీ మతం గానీ మన జన్మస్థలాన్నిబట్టే నిశ్చయమవుతుంది, కానీ మనం ఎవరికి విశ్వసనీయంగా ఉండాలనే నిర్ణయం అవకాశానికి వదిలేయలేనంత ప్రాముఖ్యమైనది. అయితే ఒక వ్యక్తి ఏ విశ్వసనీయతా భావాలతో పెరిగి పెద్దవాడయ్యాడో వాటిని ప్రశ్నించడమంటే ధైర్యం కావాలి, అలా అడగడం సవాళ్ళను సృష్టిస్తుంది కూడా.
విశ్వసనీయతా పరీక్ష
జాంబియాలో పెరిగిన ఒక స్త్రీ “నేను చిన్నప్పటి నుండి మతసంబంధ విషయాలకు మ్రొగ్గు చూపేదాన్ని. మా ఇంట్లోని పూజగదిలో రోజూ ప్రార్థించడం, మతపరమైన దినాలను పాటించడం, క్రమంగా గుడికి వెళ్ళడం బాల్యం నుండి నాకివ్వబడిన
శిక్షణలో భాగంగా ఉండేవి. నా మతమూ నా ఆరాధనా నా సంస్కృతితోనూ సమాజంతోనూ కుటుంబంతోనూ బాగా మిళితమై ఉండేవి.”అయితే ఆమెకు పద్దెనిమిది పందొమ్మిది ఏండ్ల వయస్సప్పుడు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టింది, ఆ తర్వాత కొద్దికాలానికే ఆమె తన మతాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అది ద్రోహపూర్వక చర్యా?
స్లాట్‌కో బోస్నియాలో పెరిగి పెద్దవాడయ్యాడు, తన స్వదేశాన్ని ముంచివేసిన యుద్ధంలో ఆయన కొంతకాలంపాటు పోరాడాడు. ఆయన కూడా యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ఆరంభించాడు. ఆయన ఇప్పుడు ఎవ్వరి మీదికీ ఆయుధాలను ఎత్తడు. ఆయన ద్రోహం చేస్తున్నాడా?
ఆ ప్రశ్నలకు మీరు సమాధానమిచ్చే విధానం మీ దృక్కోణంపై ఆధారపడి ఉంటుంది. మొదట్లో ప్రస్తావించబడిన స్త్రీ, “మా సమాజంలో ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకోవడమంటే అదొక క్షమించరాని తప్పు; అది విశ్వసనీయత లేని చర్యగా తన కుటుంబానికీ సమాజానికీ వ్యతిరేకంగా చేసే విశ్వాసఘాతుకమైన చర్యగా పరిగణించబడేది” అని అంటోంది. అదేవిధంగా స్లాట్‌కో ముందటి మిలిటరీ సహవాసులు తమ పక్షాన పోరాడేందుకు నిరాకరించేవారిని దేశద్రోహులుగా దృష్టించేవారు. కానీ ఆ స్త్రీ, స్లాట్‌కో ఇద్దరూ తమ చర్యలకు పురికొల్పునిచ్చేది ఒక ఉన్నతమైన విశ్వసనీయత అంటే దేవునికి విశ్వసనీయంగా ఉండడమని భావిస్తున్నారు. అయితే, తనకు విశ్వసనీయంగా ఉండాలని కోరుకునేవారిని దేవుడు ఎలా దృష్టిస్తాడు? అన్నది చాలా ప్రాముఖ్యం.
నిజమైన విశ్వసనీయత—ప్రేమకు ఒక వ్యక్తీకరణ
‘దయ [“విశ్వసనీయత,” NW] గలవారియెడల నీవు దయ [“విశ్వసనీయత,” NW] చూపించుదువు’ అని దావీదు రాజు యెహోవా దేవునితో అన్నాడు. (2 సమూయేలు 22:26) ఇక్కడ “విశ్వసనీయత” అని అనువదించబడిన హీబ్రూ పదం, ఒకదానికి లేదా ఒక వ్యక్తికి సంబంధించి తన సంకల్పం నెరవేరే వరకూ దానితో లేదా ఆ వ్యక్తితో ప్రేమపూర్వకంగా అంటిపెట్టుకొని ఉండే దయను గురించిన తలంపును ఇస్తుంది. ఒక తల్లికి తన చంటిబిడ్డపై ఉండేటువంటి దృక్పథంతో యెహోవా తనకు విశ్వసనీయంగా ఉండేవారిని అంటిపెట్టుకొని ఉంటాడు. ప్రాచీన ఇశ్రాయేలులోని విశ్వసనీయులైన తన సేవకులతో యెహోవా “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను” అని అన్నాడు. (యెషయా 49:15) దేవునికి విశ్వసనీయంగా ఉండడాన్ని తమ జీవితంలో అన్నింటికంటే ప్రథమ స్థానంలో ఉంచుకోవడానికి ఇష్టపడేవారికి యెహోవా ప్రేమపూర్వక సంరక్షణ ఉంటుందనే హామీ ఉంది.
యెహోవాకు విశ్వసనీయంగా ఉండడమనేది ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. అది యెహోవా ప్రేమించేవాటిని ప్రేమించేలా యెహోవా అసహ్యించుకునే వాటిని అసహ్యించుకునేలా ఒక వ్యక్తిని పురికొల్పుతుంది. (కీర్తన 97:10) యెహోవా సర్వోన్నతమైన లక్షణం ప్రేమ కాబట్టి దేవునికి విశ్వసనీయంగా ఉండడం ఒక వ్యక్తిని ఇతరులతో ప్రేమరహితంగా ప్రవర్తించనీయకుండా అడ్డుకుంటుంది. (1 యోహాను 4:8) ఒక వ్యక్తి దేవునికి విశ్వసనీయంగా ఉండాలని తన మత విశ్వాసాలను మార్చుకుంటే ఆ వ్యక్తి ఇక తన కుటుంబాన్ని ప్రేమించడం లేదని దానర్థం కాదు.
దేవునికి విశ్వసనీయంగా ఉండడం—ప్రయోజనకరమైన ఒక శక్తి
మొదట్లో పేర్కొన్న ఆ స్త్రీ తన చర్యల గురించి ఇలా చెబుతోంది: “నేను చేసే బైబిలు అధ్యయనం ద్వారా యెహోవా సత్యదేవుడని తెలుసుకొని ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకున్నాను. నేను ఇంతకు ముందు ఆరాధించిన దేవుళ్ళలాంటి వాడు కాదాయన, ఆయన తన ప్రేమ, న్యాయం, జ్ఞానం, శక్తి చూపించడంలో సంపూర్ణంగా సమతుల్యంగా ఉంటాడు. యెహోవా సంపూర్ణ భక్తిని కోరతాడు కాబట్టి నేను ఇతర దేవుళ్ళను వదిలేశాను.
“నా తల్లిదండ్రులు తాము నా కారణంగా చాలా బాధపడ్డామనీ నేను వారిని నిరాశపరుస్తున్నాననీ నాతో పదేపదే అన్నారు. నా తల్లిదండ్రుల అంగీకారం నాకు చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళలా అనడం నాకు చాలా కష్టమనిపించింది. కానీ నేను బైబిలు సత్యపు పరిజ్ఞానంలో అభివృద్ధి చెందుతుండగా ఎంపిక చేసుకోవాల్సింది ఏదో నాకు స్పష్టమయ్యింది. నేను యెహోవాను నిరాకరించలేను.
“మత సాంప్రదాయాలకు బదులుగా యెహోవాకు విశ్వసనీయంగా ఉండడాన్ని ఎంపిక చేసుకుంటున్నానంటే అది నేను నా కుటుంబానికి ద్రోహం చేస్తున్నట్లేమీ కాదు. వారెలా భావిస్తున్నారో నేను అర్థం చేసుకుంటున్నానని నా మాటల ద్వారా చర్యల ద్వారా చూపించడానికి ప్రయత్నిస్తాను. కానీ నేను యెహోవాకు విశ్వసనీయంగా ఉండకపోతే అప్పుడు నా కుటుంబం ఆయన గురించి తెలుసుకోకుండా ఆపినదాన్ని అవుతాను, అదీ నిజమైన ద్రోహంతో కూడిన చర్య.”
అదేవిధంగా, దేవునికి విశ్వసనీయంగా ఉండడం రాజకీయాల్లో పాల్గొనకుండా తటస్థంగా ఉండాలనీ
ఇతరుల మీదికి ఆయుధాలను లేపకూడదనీ కోరితే వాటికి అనుగుణంగా ఉండే వ్యక్తి ద్రోహి అవ్వడు. స్లాట్‌కో తన చర్యల గురించి చెబుతూ ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు: “నేను నామమాత్రపు క్రైసవునిగా పెంచబడినప్పటికీ నేను క్రైస్తవురాలు కాని వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాను. యుద్ధం ఆరంభమైనప్పుడు ఇరు పక్షాలూ నా విశ్వసనీయతను కోరాయి. నేను ఏ వైపున పోరాడాలనేది ఎంపిక చేసుకునేలా ఒత్తిడి చేయబడ్డాను. మూడున్నర సంవత్సరాలపాటు యుద్ధం చేశాను. చివరికి నేనూ నా భార్యా క్రొయెషియాకు పారిపోయాం, మేము యెహోవాసాక్షులను కలుసుకున్నది అక్కడే.“మేము విశ్వసనీయంగా ఉండాల్సింది ప్రాముఖ్యంగా యెహోవాకేననీ మా పొరుగువారు ఏ మతంవారైనా గానీ ఏ జాతివారైనా గానీ వారిని మేము ప్రేమించాలని ఆయన కోరుతున్నాడనీ మా బైబిలు అధ్యయనం నుండి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నేనూ నా భార్యా యెహోవా ఆరాధనలో ఒక్కటయ్యాం, నేను నా పొరుగువారితో పోరాడుతూ దేవునికి విశ్వసనీయంగా ఉండలేనని కూడా నేను తెలుసుకున్నాను.”
ఖచ్చితమైన పరిజ్ఞానంచే మలచబడిన విశ్వసనీయత
యెహోవా మన సృష్టికర్త కాబట్టి, మనం విశ్వసనీయంగా ఉండాల్సిన మిగతా వాటన్నింటి కంటే కూడా ఆయనకు విశ్వసనీయంగా ఉండడమే న్యాయంగా మొదటి స్థానాన్ని వహిస్తుంది. (ప్రకటన 4:10, 11) అయినప్పటికీ దేవునికి విశ్వసనీయంగా ఉండడం ఉన్మాదంతో కూడిన వినాశకరమైన ఒక శక్తిగా మారకుండా అది ఖచ్చితమైన పరిజ్ఞానం చేత మలచబడాలి. ‘మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, . . . యథార్థమైన భక్తిగలవారై, [“నిజమైన విశ్వసనీయతగలవారై,” NW] దేవుని పోలికగా సృష్టించబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను’ అని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది. (ఎఫెసీయులు 4:23, 24) ఆ ప్రేరేపిత మాటలను వ్రాసిన ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి ఏ విశ్వసనీయతా భావాలతో పెరిగి పెద్దవాడయ్యాడో వాటిని ప్రశ్నించగల ధైర్యం ఆయనకుండేది. ఆయన చేసిన పరిశీలన ప్రయోజనకరమైన ఒక మార్పుకు నడిపించింది.
అవును మన కాలంలోని అనేకమందిలాగే సౌలు కూడా విశ్వసనీయతా పరీక్షను ఎదుర్కొన్నాడు. సాంప్రదాయాలను తూ.చా. తప్పకుండా పాటించే ఒక కుటుంబంలో ఆయన పెంచబడ్డాడు. తాను పుట్టిన మతానికి విశేషమైన రీతిలో ఆయన విశ్వసనీయంగా ఉండేవాడు. ఆయన తన మత ఉద్దేశాలకు విశ్వసనీయంగా ఉండడం, తన దృక్కోణాన్ని అంగీకరించని వారికి వ్యతిరేకంగా హింసాత్మక చర్యలు తీసుకునేలా కూడా ఆయనను పురికొల్పింది. క్రైస్తవుల ఇండ్లపై దాడి చేయడంలోనూ వారిని శిక్షించడానికి బయటికి ఈడ్చుకురావడంలోనూ చివరికి వారిని చంపడంలోనూ సౌలు పేరుగాంచాడు.—అపొస్తలుల కార్యములు 22:3-5; ఫిలిప్పీయులు 3:4-6.
కానీ సౌలు ఖచ్చితమైన బైబిలు పరిజ్ఞానాన్ని పొందిన తర్వాత, తన తోటివారు అనేకమంది ఊహించలేనిదిగా దృష్టించిన దాన్ని ఆయన చేశాడు. ఆయన తన మతాన్ని మార్చుకున్నాడు. సాంప్రదాయానికి బదులు దేవునికి విశ్వసనీయంగా ఉండాలని సౌలు ఎంపిక చేసుకున్నాడు, ఆయన ఆ తర్వాత అపొస్తలుడైన పౌలుగా మారి అదే పేరుతో అందరికీ ఎరుకయ్యాడు. ఖచ్చితమైన పరిజ్ఞానం ఆధారంగా దేవునికి విశ్వసనీయంగా ఉండడం, అంతకుముందు వినాశకరంగా ఉన్మాదంతో ప్రవర్తించే సౌలును సహనశీలిగా, ప్రేమగలవాడిగా, ప్రోత్సహించేవాడిగా ఉండేలా పురికొల్పింది.
విశ్వసనీయంగా ఎందుకు ఉండాలి?
మన విశ్వసనీయత దేవుని ప్రమాణాల చేత మలచబడడానికి అనుమతించడం ప్రయోజనాలను తీసుకువస్తుందన్నది స్పష్టం. ఉదాహరణకు, దీర్ఘకాలం నిలిచే సంతృప్తికరమైన వివాహాలకు కావలసిన ప్రధానమైన వాటిలో “నమ్మకం, విశ్వసనీయత . . . ఆధ్యాత్మికతా భావం” ఉన్నాయని 1999 లో ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ స్టడీస్ వారి ఒక నివేదిక తెలియజేసింది. అదే అధ్యయనంలో “దృఢమైన సంతృప్తికరమైన
వివాహాలు,” సంతోషంగా ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువకాలం జీవించడానికి స్త్రీ పురుషులకు దోహదపడతాయనీ, దృఢమైన వివాహాలు సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి పిల్లలకు ఒక చక్కని అవకాశాన్ని ఇస్తాయనీ కనుగొనబడింది.నేడు సందిగ్ధావస్థలో ఉన్న లోకంలో విశ్వసనీయత, అతి కష్టంమీద ఈదుతున్న ఒక ఈతగాడు రక్షక పడవ మీదికి చేరుకోవడానికి సహాయం చేసే తాడు లాంటిది. “ఈతగాడికి” విశ్వసనీయత లేనట్లైతే అలలకు, వీచే గాలికి కొట్టుకుపోతాడు. అతడు సరైన దానికి విశ్వసనీయంగా ఉండకపోతే, అది మునిగే పడవకు కట్టివున్న ప్రాణాలు కాపాడే తాడును పట్టుకున్నట్లు ఉంటుంది. సౌలులాగే ఆ వ్యక్తి వినాశకరమైన నడవడిలోకి లాక్కుపోబడతాడు. కానీ ఖచ్చితమైన పరిజ్ఞానం ఆధారంగా యెహోవాకు విశ్వసనీయంగా ఉండడం, మనకు స్థిరత్వాన్ని ఇవ్వడంతోపాటు మనల్ని రక్షణకు నడిపించే ప్రాణాలు కాపాడే తాడు.—ఎఫెసీయులు 4:13-15.
‘యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను [“విశ్వసనీయులను,” NW] విడువడు. వారెన్నటెన్నటికి కాపాడబడుదురు’ అని యెహోవా తనకు విశ్వసనీయంగా ఉండేవారికి వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తన 37:28) అతి త్వరలోనే యెహోవాకు విశ్వసనీయంగా ఉండేవారందరూ భూపరదైసులో ప్రవేశించడానికి అనుమతి పొందుతారు, అక్కడ వారు ఎటువంటి దుఃఖమూ వేదనా లేకుండా ఇతరులతో శాశ్వత సంబంధాలను ఆనందిస్తూ మతపరమైన రాజకీయపరమైన వర్గాలనేవి ఏవీ లేకుండా జీవిస్తారు.—ప్రకటన 7:9, 14; 21:3, 4.
ఇప్పుడు కూడా తాము యెహోవాకు విశ్వసనీయంగా ఉండడం ద్వారానే నిజమైన సంతోషం లభిస్తుందని ప్రపంచమంతటా లక్షలాదిమంది తెలుసుకున్నారు. విశ్వసనీయతపై మీకున్న దృక్కోణాన్ని బైబిలు సత్యపు వెలుగులో పరిశీలించేందుకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులను ఎందుకు అనుమతించకూడదు? బైబిలు మనకు ఇలా చెబుతోంది: “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి.”—2 కొరింథీయులు 13:5.
మన విశ్వాసాన్నీ మనం దానికి ఎందుకు విశ్వసనీయంగా ఉన్నామనేదాన్నీ ప్రశ్నించడమంటే ధైర్యం కావాలి, కానీ దాని ఫలితం మనల్ని యెహోవా దేవునికి సన్నిహితం చేసినప్పుడు మన కృషికి తగిన ప్రతిఫలాలు ఉండగలవు. “యెహోవాకు ఆయన ప్రమాణాలకు విశ్వసనీయంగా ఉండడం మనం మన కుటుంబాలతో వ్యవహరించేటప్పుడు సమతుల్యంగా ఉండేందుకూ సమాజంలో మంచి సభ్యులుగా అయ్యేందుకూ మనకు సహాయపడుతుందని నేను తెలుసుకున్నాను. మనకు ఎదురయ్యే పరీక్షలు ఎంతటి కష్టతరమైనవైనప్పటికీ యెహోవాకు మనం విశ్వసనీయంగా ఉంటే ఆయన మనకు ఎల్లప్పుడూ విశ్వసనీయంగా ఉంటాడు” అని మొదట్లో పేర్కొన్న ఆ స్త్రీ అంటున్నప్పుడు చాలామంది భావాలను ఆమె ప్రతిబింబిస్తోంది.
[6వ పేజీలోని చిత్రాలు]
సౌలు దేనికి విశ్వసనీయంగా ఉన్నాడో దాన్ని మార్చుకునేలా ఖచ్చితమైన పరిజ్ఞానం ఆయనను పురికొల్పింది
[7వ పేజీలోని చిత్రం]
మీరు మీ విశ్వసనీయతను బైబిలు సత్యపు వెలుగులో ఎందుకు పరిశీలించుకోకూడదు?
[4వ పేజీలోని చిత్రసౌజన్యం]
చర్చిల్, పైన ఎడమవైపు: U.S. National Archives photo; జోసెఫ్ గాబెల్స్, పైన కుడివైపు: Library of Congress