కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్వసనీయత గురించి వక్ర దృక్కోణాలున్న లోకం

విశ్వసనీయత గురించి వక్ర దృక్కోణాలున్న లోకం

విశ్వసనీయత గురించి వక్ర దృక్కోణాలున్న లోకం

ఒక చల్లని శుక్రవారం సాయంత్రం ఇజ్రాయిల్‌లోని టెల్‌ అవీవ్‌లో ఒక నైట్‌ క్లబ్బు బయట ఎదురుచూస్తున్న ఒక యువకుల గుంపులోకి ఒక యువకుడు వచ్చి చేరాడు. ఆ తర్వాత కొద్ది క్షణాలకు జరిగిన ఒక విధ్వంసక విస్ఫోటనం ఆ గుంపును ఛిన్నాభిన్నం చేసేసింది.

మరొక ఆత్మాహుతి దళ సభ్యుడు తన ప్రాణాన్ని అర్పించి మరో 19 మంది యౌవనుల ప్రాణాలను హింసాత్మకంగా బలిగొన్నాడు. “ఎటు చూసినా శరీర భాగాలు, వాళ్ళందరూ యౌవనులే, చాలా చిన్న వయస్సు వాళ్ళు​—⁠నేను ఇంతవరకూ చూడనంతటి భయంకరమైన దృశ్యం అది” అని ఒక డాక్టర్‌ రిపోర్టర్లతో చెప్పాడు.

“యుద్ధాలు మొదలయ్యే అవకాశాలను ఎక్కువ చేయగల, యుద్ధాలు ముగియడాన్ని మరింత కష్టతరం చేయగల విశ్వసనీయత లాంటి లక్షణాలనే ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు” అని ద లాన్సెట్‌ అనే పుస్తకంలో థర్స్‌టన్‌ బ్రూవిన్‌ వ్రాశారు. అవును క్రైస్తవమత సామ్రాజ్యపు క్రూసేడ్ల నుండి, నాజీ జర్మన్లు ఒక ప్రణాళిక ప్రకారం జరిపిన సామూహిక సంహారాల వరకూ విశ్వసనీయత పేరుతో చంపబడినవారి రక్తపు మరకలతో మానవ చరిత్ర మలినమైపోయింది.

అధికమవుతున్న అవిశ్వసనీయతా బాధితులు

ఉన్మాదంతో కూడిన విశ్వసనీయత వినాశకరం కాగలదన్నది నిరాకరించలేని నగ్న సత్యం, కానీ విశ్వసనీయత లేకపోవడమన్నది కూడా సమాజాన్ని ఛిన్నాభిన్నం చేయగలదు. విశ్వసనీయంగా ఉండడమంటే ఒక వ్యక్తికి లేదా ఒక విషయానికి నమ్మకంగా ఉండడం, విడిచిపెట్టేలా చేసే లేదా నమ్మకద్రోహం చేసేలా ఎలాంటి శోధన ఎదురైనా వదలిపెట్టకుండా దృఢంగా నిలబడడం అని సూచిస్తుంది. అలాంటి విశ్వసనీయతను తాము అభినందిస్తున్నట్లు అత్యధికులు చెప్పుకున్నప్పటికీ అతి ప్రాథమిక స్థాయిలోనే అంటే కుటుంబస్థాయిలోనే సమాజం తీవ్రమైన అవిశ్వసనీయతను అనుభవిస్తోంది. తమ సొంత కోరికలను తీర్చుకోవడానికే ప్రాధాన్యతనివ్వడం, దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు, శ్రమలు, అధికమవుతున్న భార్యాద్రోహ ప్రభావం లేదా భర్తృద్రోహ ప్రభావం లాంటివి విడాకుల రేటును చాలా ఉద్ధృతంగా పెంచేశాయి. టెల్‌ అవీవ్‌లో జరిగిన బాంబు విస్ఫోటనంలోని హతులవలె తరచుగా దీనికి అమాయకులైన యౌవనులే బలైపోతున్నారు.

“విడాకులు తీసుకోవడం, విడిగా జీవించడం, ఒంటరి తల్లి లేదా తండ్రి పోషణ వంటి వాటి కారణంగా ఏర్పడే కుటుంబపు అస్థిరత్వం వల్ల తరచుగా దెబ్బతినేవాటిలో పిల్లవాడి విద్యాభ్యాసం ఒకటి” అని ఒక నివేదిక తెలియజేస్తోంది. ప్రత్యేకించి తల్లి ఒక్కర్తే ఉన్న కుటుంబాల్లోని అబ్బాయిల విద్యాభ్యాసం కుంటుపడుతోందనిపిస్తోంది, అంతేగాక వారు ఆత్మహత్యలు చేసుకోవడానికీ బాల్యనేరాలు చేయడానికీ పాల్పడుతున్నారనిపిస్తోంది. అమెరికాలో ప్రతి సంవత్సరం పదిలక్షల మంది పిల్లలు తమ తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడాన్ని చవిచూస్తున్నారు, అంతేగాక ఏదైనా ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఆ దేశంలోని వివాహిత తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో సగం మంది తమకు 18 ఏళ్ళు వచ్చేసరికి బహుశా విడాకుల బాధితులవుతుండవచ్చు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని అనేకమంది యౌవనుల భవిష్యత్తు కూడా ఇలాగే హృదయవిదారకంగా ఉంటోందని గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి.

విశ్వసనీయత​—⁠కాపాడుకోలేనంతటి ఉన్నతమైన ప్రమాణమా?

నేటి సాంప్రదాయిక విశ్వసనీయతా వైఫల్యం, ‘యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు [“విశ్వసనీయులు,” NW] లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి’ అని దావీదు రాజు అన్న మాటలు ఇంతకు ముందటి కంటే ఇప్పుడు మరింత సమంజసమైనవిగా అనిపించేలా చేస్తోంది. (కీర్తన 12:⁠1) అవిశ్వసనీయత ఎందుకింతగా వ్యాపించింది? టైమ్‌ పత్రికలో రాజర్‌ రోజన్‌బ్లాట్‌ ఇలా వ్యాఖ్యానించారు: “విశ్వసనీయత ఒక ఉన్నతమైన ప్రమాణమే అయినప్పటికీ నైతికపరంగా బలహీన మానవులమైన మనం, విశ్వసనీయతా ప్రమాణాన్ని అనుసరించకుండా మన ప్రాథమిక మానవ లక్షణాలైన అధిక భయం, మనపై మనకే అపనమ్మకం, అవకాశవాదం, పేరుప్రతిష్ఠలు పొందాలనే కోరిక వంటివి అడ్డుపడుతున్నాయి.” బైబిలు మనం జీవిస్తున్న కాలాన్ని వర్ణిస్తూ ‘మనుష్యులు స్వార్థప్రియులు, . . . అపవిత్రులు [“విశ్వసనీయత లేనివారు,” NW], అనురాగరహితులు’గా ఉంటారని నిక్కచ్చిగా తెలియజేస్తోంది.​—⁠2 తిమోతి 3:​1-5.

ఒక వ్యక్తి ఆలోచనపైనా చర్యలపైనా విశ్వసనీయత గానీ అవిశ్వసనీయత గానీ చూపించే ప్రభావాన్ని పరిశీలించిన తర్వాత ‘మన విశ్వసనీయతకు న్యాయంగా ఎవరు అర్హులు?’ అని మనం ప్రశ్నించవచ్చు. దీని తర్వాతి ఆర్టికల్‌ ఈ ప్రశ్న గురించి ఏమి చెబుతుందో గమనించండి.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

పై ఫోటో: © AFP/CORBIS