కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఉపమానము లేకుండా వారికేమియు బోధింపలేదు’

‘ఉపమానము లేకుండా వారికేమియు బోధింపలేదు’

‘ఉపమానము లేకుండా వారికేమియు బోధింపలేదు

‘యేసు జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేకుండా వారికేమియు బోధింపలేదు.’​మత్తయి 13:⁠35.

1, 2. (ఎ) సమర్థవంతమైన ఉపమానాలు ఎందుకంత సులభంగా మరపుకురావు? (బి) యేసు ఏ విధమైన ఉపమానాలను ఉపయోగించాడు, ఆయన ఉపమానాలను ఉపయోగించడం గురించి ఏ ప్రశ్నలు తలెత్తుతాయి? (అధస్సూచి కూడా చూడండి.)

అనేక సంవత్సరాల క్రితం బహుశా ఒక బహిరంగ ప్రసంగంలో విన్న ఒక ఉపమానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలరా? సమర్థవంతమైన ఉపమానాలను అంత త్వరగా మరచిపోలేము. ఉపమానాలు “చెవులను కళ్ళుగా మార్చి, శ్రోతలు తమ మనస్సులో దృశ్యాలను ఊహించుకునేలా వారికి స్వేచ్ఛనిస్తాయి” అని ఒక గ్రంథకర్త పేర్కొన్నాడు. అర్థం చేసుకోవడానికి ఊహాచిత్రాలు తరచూ చక్కని సహాయకాలు. కాబట్టి, ఉపమానాలు మనం విషయాలను సులభంగా గ్రహించేలా చేస్తాయి. ఉపమానాలు మాటలకు ప్రాణం పోయగలవు, ఆ విధంగా బోధించబడే పాఠాలు మన స్మృతిపథంలో స్థిరమైపోతాయి.

2 ఉపమానాలను ఉపయోగించడంలో యేసుక్రీస్తు చూపించిన నైపుణ్యం కంటే ఎక్కువ నైపుణ్యాన్ని భూమ్మీది ఏ బోధకుడూ చూపించలేదు. యేసు ఉపమానాలు చెప్పి దాదాపు రెండు వేల సంవత్సరాలు దాటింది, అయినా కూడా వాటిలో అనేక ఉపమానాలు సులభంగా గుర్తుకువస్తాయి. * యేసు ప్రత్యేకించి ఈ బోధనా పద్ధతిపైనే ఎందుకు ఎక్కువగా ఆధారపడ్డాడు? ఆయన ఉపమానాలు అంత సమర్థవంతంగా ఉండడానికి గల కారణమేమిటి?

యేసు ఉపమానాలతో ఎందుకు బోధించాడు?

3. (ఎ) మత్తయి 13:​34, 35 ప్రకారం యేసు ఉపమానాలను ఉపయోగించడానికి గల ఒక కారణం ఏమిటి? (బి) ఈ బోధనా పద్ధతిని యెహోవా విలువైనదిగా ఎంచుతాడని ఏది సూచిస్తోంది?

3 యేసు ఉపమానాలతో ఎందుకు బోధించాడనే దాని గురించి బైబిలు రెండు గమనించదగ్గ కారణాలను ఇస్తోంది. మొదటిది, ఆయనలా చేయడంవల్ల ప్రవచనం నెరవేరింది. అపొస్తలుడైన మత్తయి ఇలా వ్రాశాడు: “నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను . . . అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.” (మత్తయి 13:​34, 35) ఇక్కడ మత్తయి పేర్కొన్న “ప్రవక్త,” కీర్తన 78:2 వ్రాసిన వ్యక్తి. ఆ కీర్తనకర్త యేసు జన్మించడానికి శతాబ్దాలముందే దేవుని ఆత్మ ప్రేరణతో వ్రాశాడు. తన కుమారుడు ఉపమానాలతో బోధించాలని యెహోవా వందల సంవత్సరాలకు ముందే నిర్ణయించడం గమనించదగ్గ విషయం కాదా? యెహోవా ఈ బోధనా పద్ధతిని విలువైనదిగా ఎంచుతాడన్నది నిశ్చయం!

4. తాను ఉపమానాలను ఎందుకు ఉపయోగిస్తున్నానన్నది యేసు ఎలా వివరించాడు?

4 రెండవది, స్పందించని హృదయం గలవారిని వేరుపర్చడానికి తాను ఉపమానాలను ఉపయోగించానని యేసే స్వయంగా చెప్పాడు. ఆయన ‘జనసమూహాలకు’ విత్తువాని దృష్టాంతం చెప్పిన తర్వాత, ఆయన శిష్యులు ‘నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావు?’ అని అడిగారు. ‘పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది’ అని యేసు జవాబిచ్చాడు.​—⁠మత్తయి 13:⁠2, 10, 11, 13-15; యెషయా 6:​9, 10.

5. గర్వ హృదయులనుండి అణకువగల శ్రోతలను యేసు ఉపమానాలు ఎలా వేరుచేశాయి?

5 యేసు ఉపమానాల్లో ప్రజలను వేరు చేసింది ఏమిటి? కొన్ని సందర్భాల్లో, ఆయన మాటల పూర్తి భావాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన శ్రోతలు శ్రద్ధగా వెతుక్కోవాల్సి వచ్చేది. అణకువగల వ్యక్తులు మరింత సమాచారం కోసం ఆయనను అడిగేందుకు ప్రోత్సహించబడ్డారు. (మత్తయి 13:​36; మార్కు 4:​34) అప్పుడు, సత్యం కోసం ఆకలివున్న హృదయంగలవారికి యేసు ఉపమానాలు సత్యాన్ని వెల్లడి చేశాయి; అదేసమయంలో ఆయన ఉపమానాలు గర్వహృదయులకు సత్యాన్ని మరుగు చేశాయి. యేసు ఎంత విశిష్ఠతగల బోధకుడు! ఆయన ఉపమానాలను అంత సమర్థవంతమైనవిగా చేసిన కొన్ని కారకాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం.

వివరాలను పరిమితంగా ఉపయోగించడం

6-8. (ఎ) యేసు మొదటి శతాబ్దపు శ్రోతలకు అప్పటికింకా ఏ సదవకాశం లేదు? (బి) యేసు వివరాలను పరిమితంగా ఉపయోగించేవాడని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?

6 యేసు బోధను నేరుగా విన్న మొదటి శతాబ్దపు శిష్యులు ఎలా భావించి ఉంటారోనని మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా? యేసు గొంతు వినే గొప్ప ఆధిక్యత వారికి లభించినప్పటికీ ఆయన చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి లిఖిత గ్రంథాన్ని సంప్రదించే సదవకాశం వారికి అప్పటికింకా లేదు. బదులుగా వారు యేసు మాటలను తమ మనస్సుల్లోనూ హృదయాల్లోనూ ఉంచుకోవాల్సివచ్చేది. ఉపమానాలను నైపుణ్యవంతంగా ఉపయోగించడం ద్వారా యేసు తాను బోధించినవాటిని గుర్తుంచుకోవడాన్ని సులభతరం చేశాడు. ఏ విధంగా?

7 యేసు వివరాలను పరిమితంగా ఉపయోగించేవాడు. ఆ వివరాలు ఒక కథకు సంబంధించినవి గానీ ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి అవసరమైనవి గానీ అయితే వాటిని చేర్చేటప్పుడు ఆయన ఎంతో జాగ్రత్తపడేవాడు. అందుకే ఆయన, తప్పిపోయిన గొఱ్ఱె కోసం వెతుకుతున్నప్పుడు ఎన్ని గొఱ్ఱెలను యజమాని వదలి వెళ్ళాడో, ద్రాక్షతోటలో పనివారు ఎన్ని గంటలు పనిచేశారో, దాసులకు ఎన్ని తలాంతులు అప్పగించబడ్డాయో ఖచ్చితంగా చెప్పాడు.​—⁠మత్తయి 18:​11-14; 20:​1-16; 25:​14-30.

8 అదేసమయంలో, ఉపమానాల భావాన్ని గ్రహించడానికి అడ్డుపడే అవకాశమున్న అంతగా ప్రాముఖ్యత లేని విషయాలను యేసు వదిలేసేవాడు. ఉదాహరణకు నిర్దయుడైన దాసుని ఉపమానంలో ఆ దాసుడు పదివేల తలాంతుల అప్పు ఎలా చేశాడన్న విషయాన్ని వివరించలేదు. యేసు క్షమించాల్సిన అవసరాన్ని గురించి నొక్కి చెబుతున్నాడు. ఇక్కడ ఆ దాసుడికి అంత అప్పు ఎలా అయ్యిందన్నది కాదుగానీ ఆయన బాకీ ఎలా క్షమించబడిందీ అదే సమయంలో తన తోటి దాసుడు తనకు అతి తక్కువ డబ్బు బాకీ పడ్డందుకు ఆయన తన తోటి దాసుడితో ఎలా ప్రవర్తించాడన్నదీ ముఖ్యమైన విషయం. (మత్తయి 18:​23-35) అదేవిధంగా తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో చిన్న కుమారుడు ఆస్తి పంచి ఇవ్వమని అకస్మాత్తుగా ఎందుకు అడిగాడో దాన్ని దుర్వ్యయం ఎందుకు చేశాడో వివరాలు చెప్పలేదు. కానీ తన కుమారుడు మనసు మార్చుకొని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎలా భావించాడో ఎలా ప్రతిస్పందించాడో వివరంగా తెలిపాడు. యెహోవా “బహుగా క్షమించును” అని యేసు చెప్పదలచుకున్న ముఖ్యాంశానికి తండ్రి ప్రతిస్పందనను గురించిన అలాంటి వివరాలు ప్రాముఖ్యం.​—⁠యెషయా 55:⁠7; లూకా 15:​11-32.

9, 10. (ఎ) తన ఉపమానాల్లోని పాత్రలను వర్ణించేటప్పుడు యేసు ఏ విషయానికి అవధానమిచ్చాడు? (బి) యేసు తన శ్రోతలకు, ఇతరులకు తన ఉపమానాలను జ్ఞాపకం చేసుకోవడాన్ని ఎలా సులభతరం చేశాడు?

9 యేసు తన ఉపమానాల్లోని పాత్రలను వర్ణించే తీరులో కూడా వివేచనను ఉపయోగించాడు. తాను చెబుతున్న కథనాల్లోని పాత్రలు కనిపించే తీరు గురించి వివరాలు అధికంగా ఇచ్చేబదులు, యేసు తరచుగా ఆ పాత్రలు ఏమి చేశాయి లేదా తాను చెప్పిన సన్నివేశాల్లో అవి ఎలా ప్రతిస్పందించాయి అన్నవాటికే ప్రధానంగా అవధానమిచ్చాడు. అందుకే, స్నేహశీలియైన సమరయుడు ఎలా ఉంటాడన్నది వర్ణించకుండా, యేసు మరింత ముఖ్యమైన విషయాన్ని అంటే రోడ్డుమీద గాయాలతో పడివున్న యూదునికి సహాయం చేయడానికి సమరయుడు కనికరంతో ఎలా ముందుకు వచ్చాడన్న విషయాన్నే చెప్పాడు. పొరుగువారిపై ప్రేమ చూపడం అనేది మన సొంత జాతి ప్రజలనూ దేశ ప్రజలనూ ప్రేమించడమే కాకుండా ఇతరులను కూడా ప్రేమించాలన్న విషయాన్ని బోధించడానికి అవసరమైన వివరాలనే యేసు అందించాడు.​—⁠లూకా 10:​29, 33-37.

10 యేసు, వివరాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించడం ఆయన ఉపమానాలను సంక్షిప్తంగా గజిబిజి లేకుండా ఉంచాయి. ఆ విధంగా ఆయన తన మొదటి శతాబ్దపు శ్రోతలకేగాక ప్రేరేపిత సువార్తలను ఆ తర్వాత చదివే అసంఖ్యాక ప్రజానీకానికి కూడా ఆ ఉపమానాలను, అవి బోధించిన ఎంతో విలువైన పాఠాలను జ్ఞాపకం చేసుకోవడాన్ని సులభతరం చేశాడు.

దైనందిన జీవితానికి సంబంధించిన ఉపమానాలు

11. యేసు చెప్పిన ఉపమానాలు, ఆయన గలిలయలో పెరుగుతుండగా గమనించిన విషయాలను ప్రతిబింబించాయనడంలో సందేహం లేదనేందుకు ఉదాహరణలనివ్వండి.

11 ప్రజల జీవితాలకు సంబంధించిన ఉపమానాలను ఉపయోగించడంలో యేసు ప్రావీణ్యుడు. ఆయన చెప్పిన అనేక ఉపమానాల్లో ప్రతిబింబించిన విషయాలు, బహుశా ఆయన గలిలయలో పెరుగుతుండగా గమనించిన విషయాలై ఉండవచ్చు. ఆయన బాల్యపు దినాల గురించి ఒక్క క్షణం ఆలోచించండి. తన తల్లి పులిసిన రొట్టెను చేయడానికి అంతకు ముందు రొట్టెలు చేసేటప్పుడు పులిసిన పిండిలోనుండి చిన్న ముద్దను దాచిపెట్టి దాన్ని పిండిని పులియబెట్టడానికి ఉపయోగించడాన్ని ఎంత తరచుగా చూసివుంటాడు? (మత్తయి 13:​33) జాలరులు గలిలయ సముద్రపు స్పష్టమైన నీలిరంగు నీటిలో తమ వలలు వేయడం ఎన్నిసార్లు చూసివుంటాడు? (మత్తయి 13:​47) సంతవీధిలో పిల్లలు ఆడుకోవడాన్ని ఆయన ఎంత తరచుగా గమనించివుంటాడు? (మత్తయి 11:​16) అదేవిధంగా యేసు తన ఉపమానాల్లో ఉపయోగించిన​—⁠విత్తనాలు విత్తడాన్ని, వెన్నులో గింజలు ముదరడాన్ని, ఆనందభరితమైన వివాహ విందులు వంటి ఇతర సాధారణ విషయాలను కూడా గమనించాడు.​—⁠మత్తయి 13:​3-8; 25:​1-12; మార్కు 4:​26-29.

12, 13. స్థానిక పరిస్థితులతో ఆయనకు పరిచయముందని ఆయన చెప్పిన గోధుమల గురుగుల ఉపమానం ఎలా సూచిస్తోంది?

12 అలాంటప్పుడు యేసు చెప్పిన అనేక ఉపమానాల్లో దైనందిన జీవితపు పరిస్థితులు, స్థితిగతులు మిళితమై ఉన్నాయంటే అందులో ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ బోధనా పద్ధతిని ఉపయోగించడంలో ఆయనకున్న నైపుణ్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి, ఆయన మాటలు యూదులైన శ్రోతలకు ఏ భావాన్నిచ్చాయో పరిశీలించడం సహాయకరంగా ఉంటుంది. రెండు ఉదాహరణలను పరిశీలిద్దాం.

13 మొదటిది, గోధుమలు గురుగుల ఉపమానంలో ఒక వ్యక్తి మంచి గోధుమలను విత్తుతాడు, కానీ “శత్రువు” గోధుమల మధ్య గురుగులు విత్తిపోతాడని యేసు చెబుతాడు. యేసు ప్రత్యేకించి అలాంటి శత్రుసంబంధమైన చర్యను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? అది సరే, ఆయన ఈ ఉపమానాన్ని గలిలయ సముద్ర తీరాన చెప్పాడనీ గలిలయుల ప్రధాన జీవనవృత్తి వ్యవసాయమనీ గుర్తుంచుకోండి. తన పొలంలోకి ఒక శత్రువు రహస్యంగా ప్రవేశించి హానికరమైన కలుపుమొక్కల విత్తనాలను విత్తడంకంటే ఒక రైతుకు నష్టం కలిగించేది మరేదైనా ఉంటుందా? ఆ కాలంలో అలాంటి దాడులు జరిగాయని అప్పటి న్యాయసూత్రాలు తెలియజేస్తున్నాయి. తన శ్రోతలు అర్థం చేసుకోగల ఒక పరిస్థితిని యేసు ఉపయోగించాడన్నది స్పష్టమవడం లేదూ?​—⁠మత్తయి 13:​1, 2, 24-30.

14. స్నేహశీలియైన సమరయుని ఉపమానములో యేసు తాను చెప్పదలుచుకున్న ముఖ్యాంశాన్ని నొక్కి చెప్పడానికి “యెరూషలేమునుండి యెరికోపట్టణమునకు” వెళ్ళే త్రోవను ఉపయోగించడం ఎందుకు గమనించదగిన విషయం?

14 రెండవది, స్నేహశీలియైన సమరయుని ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసు ఇలా ప్రారంభించాడు: “ఒక మనుష్యుడు యెరూషలేమునుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగలచేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి.” (లూకా 10:​30) గమనించవలసిన విషయమేమిటంటే యేసు తాను చెప్పదలుచుకున్న ముఖ్యాంశాన్ని నొక్కి చెప్పడానికి “యెరూషలేమునుండి యెరికోపట్టణమునకు” వెళ్ళే త్రోవను ఉపయోగించాడు. ఈ ఉపమానము చెప్పేటప్పుడు ఆయన యెరూషలేముకు దగ్గర్లోనే ఉన్న యూదయలో ఉన్నాడు; కాబట్టి ఆయన ఉపమానంలో చెప్పిన త్రోవ గురించి ఆయన శ్రోతలకు బాగా తెలిసే ఉండవచ్చు. ఆ త్రోవ ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణం చేసేవారికి ప్రమాదకరమైనదన్నది అందరికీ విదితమే. జనసంచారంలేని ప్రాంతం గుండా వెళ్ళే ఆ త్రోవ మలుపులతో ఉండి దోపిడి దొంగలు నక్కి ఉండడానికి అనువుగా ఉండేది.

15. స్నేహశీలియైన సమరయుని ఉపమానంలోని యాజకుడు లేవీయుడు ఇద్దరూ చూపించిన నిర్లక్ష్యాన్ని ఎవరైనా న్యాయబద్ధంగా ఎందుకు సమర్థించలేరు?

15 యేసు “యెరూషలేమునుండి యెరికోపట్టణమునకు” వెళ్ళే త్రోవను సూచించడంలో గమనించవలసిన విషయం మరొకటుంది. ఆ కథనం ప్రకారం, ఆ త్రోవ గుండా మొదట ఒక యాజకుడు తర్వాత ఒక లేవీయుడు కూడా ప్రయాణించారు, వారిలో ఎవ్వరూ బాధితునికి సహాయపడడానికి ఆగలేదు. (లూకా 10:​31, 32) యాజకులు యెరూషలేములోని దేవాలయములో సేవ చేస్తుండేవారు, లేవీయులు వారికి సహాయం చేస్తుండేవారు. యెరికో, యెరూషలేము నుండి కేవలం 23 కిలోమీటర్ల దూరంలోనే ఉండేది కాబట్టి, చాలామంది యాజకులు, లేవీయులు దేవాలయంలో పని చేయనప్పుడు యెరికోలో నివసిస్తుండేవారు. ఆ కారణంగా వారు అప్పుడప్పుడు ఆ త్రోవ గుండా ప్రయాణించవలసి వచ్చేదనడంలో సందేహం లేదు. యాజకుడు, లేవీయుడు “యెరూషలేమునుండి” వెళ్తున్నారన్నది కూడా గమనించండి, అంటే దేవాలయం నుండి దూరంగా వెళ్తున్నారు. (ఇటాలిక్కులు మావి.) * కనుక ‘గాయపడిన ఆ వ్యక్తి చనిపోయినట్లు కనిపించాడు, శవాన్ని ముట్టుకుంటే దేవాలయంలో సేవచేయడానికి తాత్కాలికంగా అపవిత్రులమవుతామని వారు ఆ వ్యక్తి గురించి పట్టించుకోలేదు’ అంటూ వారి నిర్లక్ష్యాన్ని ఎవ్వరు కూడా న్యాయబద్ధంగా సమర్థించలేరు. (లేవీయకాండము 21:⁠1, 2; సంఖ్యాకాండము 19:11, 16) యేసు ఉపమానం, తన శ్రోతలకు పరిచయమున్న విషయాలనే ప్రతిబింబించిందన్నది స్పష్టమవడం లేదా?

సృష్టినుండి రూపొందించినవి

16. యేసుకు సృష్టితో బాగా పరిచయముందంటే ఎందుకు ఆశ్చర్యం కలిగించదు?

16 యేసు చెప్పిన అనేక ఉపమానాలు దృష్టాంతాలు, మొక్కలతోనూ జంతువులతోనూ ప్రకృతిలోని మార్పులతోనూ ఆయనకు పరిచయముందన్న విషయాన్ని వెల్లడి చేస్తాయి. (మత్తయి 6:​26, 28-30; 16:​2, 3) అలాంటి పరిజ్ఞానాన్ని ఆయన ఎక్కడ నుండి పొందాడు? గలిలయలో పెరుగుతుండగా యెహోవా సృష్టిని గమనించడానికి ఆయనకు తగినంత అవకాశం దొరికిందనడంలో సందేహం లేదు. అంతేగాక, యేసు ‘సర్వసృష్టికి ఆదిసంభూతుడు,’ యెహోవా మిగిలినన్నింటినీ సృష్టించడంలో ఆయనను “ప్రధానశిల్పి”గా ఉపయోగించుకున్నాడు. (కొలొస్సయులు 1:​15, 16; సామెతలు 8:​30, 31) అలాంటప్పుడు యేసుకు సృష్టితో బాగా పరిచయముండడం ఏమైనా ఆశ్చర్యకరమైన విషయమా? ఈ పరిజ్ఞానాన్ని ఆయన తన బోధలో ఎలా నైపుణ్యంగా ఉపయోగించాడో చూద్దాం.

17, 18. (ఎ) యోహాను 10వ అధ్యాయంలో నమోదుచేయబడ్డ యేసు మాటలు ఆయనకు గొఱ్ఱెల లక్షణాల గురించి బాగా తెలుసని ఎలా చూపిస్తున్నాయి? (బి) బైబిలు ప్రాంతాలను సందర్శించేవారు గొఱ్ఱెలకూ వాటి కాపరులకూ మధ్య ఉండే అనుబంధం విషయమై ఏమి గమనించారు?

17 యేసు చెప్పిన అత్యంత సున్నితమైన ఉపమానాల్లో ఒకటి యోహాను 10వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, దాంట్లో ఆయన తన అనుచరులతో తనకున్న సన్నిహిత సంబంధాన్ని ఒక గొఱ్ఱెలకాపరికి తన గొఱ్ఱెలతో ఉండే సంబంధంతో పోల్చాడు. యేసుకు పెంపుడు గొఱ్ఱెల లక్షణాల గురించి బాగా తెలుసని ఆయన మాటలు చూపిస్తున్నాయి. గొఱ్ఱెలు కాపరి తమను నడిపించడానికి ఇష్టపడుతూ అవి తమ కాపరిని నమ్మకంగా అనుసరిస్తాయనీ ఆయన సూచించాడు. (యోహాను 10:​2-4) గొఱ్ఱెలకూ గొఱ్ఱెలకాపరికీ మధ్య ఉండే విశిష్టమైన బంధాన్ని బైబిలు ప్రాంతాలను సందర్శించినవారు గమనించారు. 19వ శతాబ్దంలో, ప్రకృతిని అధ్యయనం చేసే హెచ్‌. బి. ట్రిస్ట్రమ్‌ ఇలా పేర్కొన్నాడు: “నేను ఒకసారి ఒక గొఱ్ఱెలకాపరి తన మందతో ఆడుకోవడం చూశాను. ఆయన పారిపోతున్నట్లు నటించాడు, గొఱ్ఱెలు ఆయన వెంటబడి ఆయన చుట్టూ చేరాయి. . . . చివరికి మంద మొత్తం ఆయన చుట్టూ ఒక వలయంలా చేరి గంతులు వేయడం మొదలుపెట్టింది.”

18 గొఱ్ఱెలు తమ కాపరిని ఎందుకు అనుసరిస్తాయి? “గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక” అని యేసు చెప్పాడు. (యోహాను 10:⁠4) గొఱ్ఱెలకు నిజంగా తమ కాపరి స్వరము తెలుసా? జార్జ్‌ ఎ. స్మిత్‌, ద హిస్టోరికల్‌ జియోగ్రఫీ ఆఫ్‌ ద హోలీ ల్యాండ్‌ అనే తన పుస్తకంలో తాను స్వయంగా గమనించిన విషయాన్ని గురించి ఇలా వ్రాశాడు: “ముగ్గురు నలుగురు గొఱ్ఱెలకాపరులు తమ మందలతో వచ్చే యూదా బావులలో ఒకదాని పక్కన మేము కొన్నిసార్లు మధ్యాహ్న సమయాల్లో విశ్రాంతి తీసుకుంటుండేవాళ్ళం. మందలు ఒకదానితో ఒకటి కలిసిపోయేవి, అది చూసి మేము ఆ కాపర్లు తమ తమ గొఱ్ఱెలను ఎలా గుర్తుపడతారా అని ఆశ్చర్యపోయేవాళ్ళం. కానీ గొఱ్ఱెలు నీళ్ళు త్రాగడం, ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఆ కాపరులు ఒకరి తర్వాత ఒకరు ఆ పల్లపు ప్రాంతంలో తలో వైపుకు వెళ్ళి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పిలిచేవారు; గొఱ్ఱెలు గుంపునుండి విడిపోయి తమ తమ కాపరులను చేరుకునేవి, అలా ఆ మందలు వచ్చినవిధంగానే ఎంతో చక్కగా తిరిగి వెళ్ళిపోయేవి.” కాబట్టి యేసు తాను చెప్పదలుచుకున్నదాన్ని నొక్కి చెప్పడానికి ఇంతకంటే శ్రేష్ఠమైన మార్గాన్ని కనుగొని ఉండేవాడు కాదు. మనం ఆయన బోధలను గుర్తించి వాటికి విధేయులమై ఉంటూ ఆయన మార్గనిర్దేశాన్ని అనుసరిస్తే అప్పుడు మనం “మంచి కాపరి” వాత్సల్యపూరితమైన ప్రేమపూర్వకమైన పరిరక్షణలోకి వస్తాం.​—⁠యోహాను 10:​11.

తన శ్రోతలకు తెలిసిన సంఘటనలనుండి రూపొందించినవి

19. ఒక తప్పుడు ఆలోచనను ఖండించడానికి స్థానికంగా జరిగిన ఒక విషాద సంఘటనను యేసు సమర్థవంతంగా ఎలా ఉపయోగించాడు?

19 సమర్థవంతమైన ఉపమానాలు పాఠాలు నేర్చుకోగలిగే అనుభవాల రూపంలో గానీ ఉదాహరణల రూపంలోగానీ ఉండవచ్చు. ఒక సందర్భంలో, శిక్షార్హులైనవారికే విషాద సంఘటనలు జరుగుతాయనే తప్పుడు ఆలోచనను ఖండించేందుకు యేసు ఒక తాజా సంఘటనను ఉపయోగించాడు. ఆయనిలా అన్నాడు: “సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా?” (లూకా 13:⁠4) విధి నిర్ణయించబడుతుందనే తర్కానికి వ్యతిరేకంగా యేసు చాలా శక్తివంతంగా వాదించాడు. ఆ పద్దెనిమిదిమంది దేవునికి కోపం తెప్పించే పాపం చేయడం వల్ల ఏమీ చనిపోలేదు. బదులుగా వారి విషాదకరమైన మరణం కాలవశం చేత అనూహ్యంగా జరిగింది. (ప్రసంగి 9:​11 NW) ఆ విధంగా ఆయన తన శ్రోతలకు బాగా తెలిసివున్న ఒక సంఘటనను పేర్కొనడం ద్వారా ఒక తప్పుడు బోధను ఖండించాడు.

20, 21. (ఎ) పరిసయ్యులు యేసు శిష్యులను ఎందుకు ఖండించారు? (బి) యెహోవా విశ్రాంతి దినానికి సంబంధించి తానిచ్చిన నియమాన్ని నిక్కచ్చిగా పాటించాలని ఎన్నడూ ఉద్దేశించలేదనే విషయాన్ని సోదాహరణంగా తెలియజేయడానికి ఏ లేఖనాధారిత వృత్తాంతాన్ని యేసు ఉపయోగించాడు? (సి) దీని తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

20 యేసు తన బోధలో లేఖనాధారిత ఉదాహరణలను కూడా ఉపయోగించాడు. విశ్రాంతి దినమున వెన్నులు త్రుంచి తిన్నందుకు పరిసయ్యులు తన శిష్యులను ఖండించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిజానికి, శిష్యులు దేవుని ధర్మశాస్త్రాన్ని కాదుగానీ విశ్రాంతి దినమున ఫలానా పనులు చేయడం నిషిద్ధమని పరిసయ్యులు కఠినంగా వివరించినదాన్ని అతిక్రమించారు. దేవుడు తన విశ్రాంతిదిన నియమానికి అలాంటి కఠోరమైన నిష్ఠను ఎన్నడూ ఉద్దేశించలేదని సోదాహరణంగా తెలియజేయడానికి యేసు 1 సమూయేలు 21:​3-6 వచనాల్లో నమోదైన ఒక సంఘటనను సూచించాడు. ఆకలైనప్పుడు దావీదు, ఆయన మనుష్యులు గుడారం దగ్గర ఆగి వెచ్చని రొట్టెలు వేసే రోజున తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తిన్నారు. పాత రొట్టెలను సాధారణంగా యాజకులు తినడం కోసం ఒక ప్రక్కన పెడతారు. అయినా ఆ పరిస్థితుల్లో దావీదు, ఆయన మనుష్యులు వాటిని తిన్నందుకు ఖండించబడలేదు. గమనించదగ్గ విషయమేమిటంటే, పాత రొట్టెలను యాజకులు కానివారు తిన్నారని తెలిపే ఒకే ఒక్క వృత్తాంతం అది. సరిగ్గా సరిపోయే వృత్తాంతాన్ని ఉపయోగించడం యేసుకు తెలుసు, యూదా శ్రోతలకు ఆ సంఘటన గురించి తెలుసనడంలో సందేహం లేదు.​—⁠మత్తయి 12:​1-8.

21 నిజంగానే యేసు ఒక గొప్ప బోధకుడు! ప్రాముఖ్యమైన సత్యాలను తన శ్రోతలకు అర్థమయ్యేవిధంగా తెలియజేసే అసమానమైన ఆయన సామర్థ్యానికి మనం నిజంగా ఆశ్చర్యపోతాం. అయితే మనం మన బోధలో ఆయనను ఎలా అనుకరించగలం? ఈ విషయం దీని తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 2 యేసు ఉపమానాలు అనేక రకాలు. వాటిలో ఉదాహరణలు, పోల్చడాలు, సారూప్యాలు, రూపకాలంకారాలు ఉన్నాయి. దృష్టాంతం ఉపయోగించడంలో ఆయన పేరుగాంచాడు, అది, “ఏదైనా ఒక నీతిని లేదా మతసంబంధమైన ఒక సత్యాన్ని తెలియజేసే చిన్న కథ, సాధారణంగా కల్పిత కథనం” అని నిర్వచించబడింది.

^ పేరా 15 యెరూషలేము యెరికో కంటే ఎత్తైన స్థలంలో ఉంది. కాబట్టి “యెరూషలేమునుండి యెరికోపట్టణమునకు” ప్రయాణించేటప్పుడు, ఉపమానంలో చెప్పబడినట్లు, ఒక ప్రయాణికుడు ‘దిగి వెళతాడు.’

మీకు జ్ఞాపకమున్నాయా?

• యేసు ఉపమానాలతో ఎందుకు బోధించాడు?

• యేసు తన మొదటి శతాబ్దపు శ్రోతలు అర్థం చేసుకోగల ఉపమానాలను ఉపయోగించాడని ఏ ఉదాహరణ చూపిస్తోంది?

• సృష్టికి సంబంధించిన తన పరిజ్ఞానాన్ని యేసు తన ఉపమానాల్లో నైపుణ్యంగా ఎలా ఉపయోగించాడు?

• యేసు తన శ్రోతలకు తెలిసిన సంఘటనలను ఏయే విధాలుగా ఉపయోగించుకున్నాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రాలు]

యేసు కేవలం కొన్ని తలాంతుల అప్పును క్షమించడానికి నిరాకరించిన దాసుని గురించీ తన ఆస్తి మొత్తం దుర్వ్యయం చేసిన కుమారుడ్ని క్షమించిన ఒక తండ్రి గురించీ చెప్పాడు

[16వ పేజీలోని చిత్రం]

స్నేహశీలియైన సమరయుని ఉపమానంలో యేసు చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏమిటి?

[17వ పేజీలోని చిత్రం]

గొఱ్ఱెలు తమ కాపరి స్వరాన్ని నిజంగా గుర్తిస్తాయా?