కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఎవ్వరూ ఎన్నడూ ఇలా మాట్లాడలేదు’

‘ఎవ్వరూ ఎన్నడూ ఇలా మాట్లాడలేదు’

‘ఎవ్వరూ ఎన్నడూ ఇలా మాట్లాడలేదు’

‘ఆయన నోటనుండి వచ్చిన దయగల [“మనోజ్ఞమైన,” Nw] మాటల కాశ్చర్యపడి అందరూ ఆయన గురించి [“అనుకూల,” Nw] సాక్ష్యమివ్వడం ప్రారంభించారు.’​—⁠లూకా 4:​22.

1, 2. (ఎ) యేసును బంధించి తీసుకురమ్మని పంపబడిన బంట్రౌతులు వట్టి చేతులతోనే ఎందుకు తిరిగివచ్చారు? (బి) యేసు బోధకు ముగ్ధులయ్యింది కేవలం బంట్రౌతులు మాత్రమే కాదని ఏది చూపిస్తోంది?

ఆబంట్రౌతులు తమకు అప్పగించబడిన పనిని పూర్తిచేయలేకపోయారు. వారు యేసుక్రీస్తును పట్టుకోవడానికి పంపబడ్డారు, కానీ వారు వట్టి చేతుల్తోనే తిరిగివచ్చారు. ప్రధానయాజకులు పరిసయ్యులు ‘ఎందుకు మీరాయనను తీసుకొని రాలేదు?’ అని వారిని గదమాయించారు. అయినా, ఏ మాత్రం ప్రతిఘటించని ఒక వ్యక్తిని ఆ బంట్రౌతులు ఎందుకు పట్టుకోలేదు? ఆ బంట్రౌతులు ‘ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు’ అని తెలియజేశారు. వారు యేసు బోధకు ఎంతగా ముగ్ధులయ్యారంటే శాంత స్వభావమున్న ఆ వ్యక్తిని బంధించేందుకు వారికి మనస్సు ఒప్పలేదు. *​—⁠యోహాను 7:​32, 45, 46.

2 యేసు బోధకు ముగ్ధులయ్యింది ఆ బంట్రౌతులు మాత్రమే కాదు. కేవలం ఆయన మాటలు వినడానికే ప్రజలు బహుళసంఖ్యలో వచ్చారని బైబిలు మనకు చెబుతోంది. ఆయన స్వగ్రామంలోని ప్రజలు ‘ఆయన నోటనుండి వచ్చిన దయగల [“మనోజ్ఞమైన,”NW] మాటలకు’ ఆశ్చర్యపోయారు. (లూకా 4:​22) గలిలయ సముద్రతీరాన గుమికూడిన పెద్ద పెద్ద జనసమూహములతో ఒకటి కంటే ఎక్కువసార్లే ఆయన పడవలో కూర్చుని మాట్లాడాడు. (మార్కు 3:⁠9; 4:⁠1; లూకా 5:​1-3) ఒక సందర్భంలో “బహు జనులు” ఏమీ తినకుండా ఆయనతో కొన్ని రోజులపాటు ఉండిపోయారు.​—⁠మార్కు 8:⁠1, 2.

3. యేసు విశిష్టమైన బోధకుడిగా ఉండడానికి గల ప్రాథమిక కారణం ఏమిటి?

3 యేసును విశిష్టమైన బోధకుడిగా చేసింది ఏమిటి? ప్రాథమిక కారణం ప్రేమ. * యేసు తాను బోధించిన సత్యాలను ప్రేమించాడు, తాను ఎవరికైతే బోధించాడో ఆ ప్రజలను ప్రేమించాడు. అంతేకాదు బోధనా పద్ధతులపైన అసాధారణమైన అవగాహన కూడా యేసుకు ఉంది. మనం ఈ సంచికలోని అధ్యయన ఆర్టికల్‌లలో ఆయన ఉపయోగించిన సమర్థవంతమైన కొన్ని బోధనా పద్ధతుల గురించీ వాటిని మనమెలా అనుకరించగలమన్న దాని గురించీ చర్చిద్దాం.

సరళత, స్పష్టత

4, 5. (ఎ) యేసు తన బోధలో సరళమైన భాషను ఎందుకు ఉపయోగించాడు, ఆయన అలా ఉపయోగించడంలో గమనించదగ్గ విషయం ఏమిటి? (బి) యేసు సరళమైన భాషతో బోధించాడనడానికి కొండమీది ప్రసంగం ఎలా ఒక ఉదాహరణగా ఉంది?

4 బాగా చదువుకున్న ప్రజలు తమ శ్రోతలు అర్థం చేసుకోలేని భాషను ఉపయోగించడం వింతైన విషయమేమీ కాదు. కానీ మనం చెప్పేది ఇతరులకు అర్థం కానట్లయితే వారు మన పరిజ్ఞానం నుండి ఎలా ప్రయోజనం పొందగలరు? ఒక బోధకుడిగా యేసు ఇతరులకు అర్థంకాని విధంగా ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన పదపరిజ్ఞాన పరిధి ఎంత విస్తారంగా ఉండేదో ఊహించండి. ఆయనకు అపారమైన పరిజ్ఞానం ఉంది, అయినా ఆయన తన గురించి కాకుండా తన శ్రోతల గురించే ఆలోచించాడు. వారిలో చాలామంది “విద్యలేని పామరులని” ఆయనకు తెలుసు. (అపొస్తలుల కార్యములు 4:​13) తాను చెప్పేది వారికి అర్థమయ్యేందుకు ఆయన అలాంటి ప్రజలు కూడా అర్థం చేసుకోగల భాషను ఉపయోగించాడు. ఆ మాటలు సరళంగా ఉండి ఉండవచ్చు, కానీ అవి అందజేసిన సత్యాలు మాత్రం అపారజ్ఞానం గలవి.

5 ఉదాహరణకు మత్తయి 5:​3–7:27 లో నమోదు చేయబడిన కొండమీది ప్రసంగాన్ని పరిశీలించండి. యేసు ఆ ప్రసంగాన్నివ్వడానికి కేవలం 20 నిమిషాలే వెచ్చించి ఉండవచ్చు. అయినా దానిలోని బోధలు వ్యభిచారం, విడాకులు, ధనాపేక్ష వంటి వాటి మూలకారకాల గురించి తెలిపే లోతైన విషయాలు. (మత్తయి 5:​27-32; 6:​19-34) అయినప్పటికీ వాటిలో సంక్లిష్టమైన మాటలో ఆడంబరమైన పదబంధాలో లేవు. నిజానికి అవి ఒక చిన్న పిల్లవాడు కూడా వెంటనే అర్థం చేసుకోగలిగేలా ఉన్నాయి మరి! ఆయన తన ప్రసంగాన్ని ముగించగానే రైతులు, గొర్రెల కాపరులు, చేపలు పట్టేవారు వంటి అనేకులతో ఉన్న జనసమూహాలు ‘ఆయన బోధకు ఆశ్చర్యపడడం’ అద్భుతమేమీ కాదు.​—⁠మత్తయి 7:​28.

6. సులభమైనవే అయినా అర్థవంతమైనవైన లోకోక్తులను యేసు ఎలా మాట్లాడాడో ఒక ఉదాహరణ ఇవ్వండి.

6 యేసు తరచూ స్పష్టంగా ఉండే చిన్న చిన్న పదబంధాలతో లోకోక్తులను పలికాడు, అవి సరళమైనవే అయినా ఎంతో అర్థవంతమైనవి. పుస్తకాలు ముద్రించబడడానికి ముందటి శకంలో ఆయన తన సందేశాన్ని మరపురాని విధంగా తన శ్రోతల మనస్సులపైనా హృదయాలపైనా ముద్రించాడు. కొన్ని ఉదాహరణలను గమనించండి: ‘ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.’ “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.” “మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.” “రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా.” “కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” ‘కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి.’ “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” * (మత్తయి 6:​24; 7:⁠1, 20; 9:​12; 26:​52; మార్కు 12:​17; అపొస్తలుల కార్యములు 20:​35) ఆ శక్తివంతమైన లోకోక్తులు ఇప్పుడు కూడా​—⁠యేసు ఆ మాటలు మాట్లాడి దాదాపు 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత​—⁠చాలా సులభంగా మనసులోకి వస్తాయి.

ప్రశ్నల ఉపయోగం

7. యేసు ప్రశ్నలు ఎందుకు అడిగేవాడు?

7 యేసు ప్రశ్నలను విశిష్టమైన రీతిలో ఉపయోగించాడు. ఆయన తరచూ అలా చేశాడు, చివరికి తన శ్రోతలకు అసలు విషయమేమిటో తెలుపడానికి తక్కువ సమయమే అవసరమయ్యే సందర్భాల్లో కూడా ఆయన ప్రశ్నలు వేసేవాడు. అలాంటి సందర్భాల్లో కూడా ఆయన ప్రశ్నలెందుకు అడిగాడు? ఆయన అప్పుడప్పుడూ, తన వ్యతిరేకుల ఉద్దేశాలను బట్టబయలు చేసి వారి నోరు మూయించేందుకు మనస్సులోకి చొచ్చుకుపోయేటటువంటి ప్రశ్నలను వేసేవాడు. (మత్తయి 12:​24-30; 21:​23-27; 22:41-46) అయితే అనేక సందర్భాల్లో యేసు సత్యాలను అందజేసేందుకు, తన శ్రోతల హృదయాల్లో ఏముందో తెలుసుకునేందుకు, తన శిష్యుల ఆలోచనను పురికొల్పి శిక్షణనిచ్చేందుకు సమయం తీసుకొని ప్రశ్నలు అడిగేవాడు. అపొస్తలుడైన పేతురు పాత్ర ఉన్న రెండు ఉదాహరణలను పరిశీలిద్దాం.

8, 9. దేవాలయపు పన్ను చెల్లించే విషయంలో పేతురు సరైన ముగింపుకు వచ్చేలా సహాయపడడానికి యేసు ప్రశ్నలను ఎలా ఉపయోగించాడు?

8 మొదటిగా, యేసు దేవాలయపు పన్ను చెల్లించడా అని పన్ను వసూలుచేసేవారు పేతురును అడిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. * కొన్నిసార్లు వెంటనే ప్రతిస్పందించే పేతురు ‘చెల్లించును’ అని జవాబిచ్చాడు. అయితే కొంత సమయం తర్వాత యేసు “సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరియొద్ద వసూలు చేయుదురు? కుమారులయొద్దనా అన్యులయొద్దనా?” అని తర్కించాడు. అందుకు “అన్యులయొద్దనే” అని పేతురు చెప్పినప్పుడు, “ఆలాగైతే కుమారులు స్వతంత్రులే” అని యేసు ఆయనతో అన్నాడు. (మత్తయి 17:​24-27) యేసు వేసిన ప్రశ్నలవల్ల చివరికి పేతురుకు విషయం స్పష్టంగా అర్థమయ్యింది. అదెలా అర్థమయ్యింది?

9 యేసు కాలంలో రాజ కుటుంబీకులు పన్ను చెల్లించడం నుండి మినహాయించబడినవారిగా గుర్తించబడేవారు. అందుకే ఆ దేవాలయంలో ఆరాధించబడుతున్న పరలోకపు రాజుకు ఏకైక కుమారుడిగా యేసుకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పేతురుకు సూటిగా సమాధానం చెప్పడానికి బదులు ఆయన సరైన ముగింపుకు వచ్చేలా, బహుశా మాట్లాడే ముందు మరింత జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించేందుకు సహాయపడడానికి యేసు సమర్థవంతమైన ప్రశ్నలనే ఉపయోగించినా సౌమ్యంగా ఉపయోగించాడన్నది గమనించండి.

10, 11. పేతురు సా.శ. 33 పస్కా పండుగ నాటి రాత్రి ఒక వ్యక్తి చెవి నరికేసినప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడు, ప్రశ్నలకున్న విలువను యేసు బాగా అర్థం చేసుకున్నాడని అదెలా చూపిస్తుంది?

10 రెండవ ఉదాహరణలో సా.శ. 33 పస్కా పండుగ నాటి రాత్రి యేసును బంధించడానికి ఒక గుంపు వచ్చిన సంఘటనకు సంబంధించినది. తనను కాపాడేందుకు మమ్మల్ని పోరాడమంటావా అని యేసును ఆయన శిష్యులు అడిగారు. (లూకా 22:​49) జవాబు కోసం ఆగకుండా పేతురు కత్తితో ఒక వ్యక్తి చెవి నరికేశాడు (పేతురు అంతకంటే దారుణంగానే గాయపరచాలని అనుకొని ఉండవచ్చు). పేతురు తన యజమాని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించాడు, ఎందుకంటే యేసు తనను తాను అప్పగించుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. యేసు ఎలా ప్రతిస్పందించాడు? శాంతంగా ఆయన పేతురును మూడు ప్రశ్నలు అడిగాడు: ‘తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె లోనిది నేను త్రాగకుందునా?’ “నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువమంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?” ‘నేను వేడుకొనిన యెడల—ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరును?’​—⁠యోహాను 18:​11; మత్తయి 26:​52-54.

11 ఆ వృత్తాంతం గురించి ఒకసారి ఆలోచించండి. యేసు కోపోద్రిక్తులైన ఒక గుంపు చేత ముట్టడించబడ్డాడు, తన మరణం సమీపించిందనీ తన తండ్రి నామముపైనున్న అపనిందను తొలగించడం, మానవాళిని విమోచించడం తన భుజస్కంధాలపై ఉన్నాయనీ ఆయనకు తెలుసు. అయినా కూడా ప్రశ్నల ద్వారా ప్రాముఖ్యమైన సత్యాలను పేతురు మనసులో ముద్రించేందుకు ఆయన అప్పటికప్పుడు సమయం తీసుకున్నాడు. ప్రశ్నలకున్న విలువను యేసు బాగా అర్థం చేసుకున్నాడని ఇది స్పష్టం చేయడంలేదూ?

సుస్పష్టమైన అతిశయోక్తి

12, 13. (ఎ) అతిశయోక్తి అంటే ఏమిటి? (బి) మన సహోదరుల చిన్న చిన్న తప్పులను విమర్శించడం మూర్ఖత్వమని నొక్కి చెప్పేందుకు యేసు అతిశయోక్తిని ఎలా ఉపయోగించాడు?

12 యేసు తన పరిచర్యలో అనేకసార్లు ఉపయోగించిన మరొక సమర్థవంతమైన పద్ధతి​—⁠అతిశయోక్తి. ఇది విషయ ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి కావాలనే హెచ్చించి చెప్పడం. అతిశయోక్తుల ద్వారా యేసు మరపురాని మనోచిత్రాలను సృష్టించాడు. కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం.

13 కొండమీది ప్రసంగంలో ఇతరులపై ‘తీర్పు తీర్చకూడదు’ అనే విషయాన్ని నొక్కి చెబుతున్నప్పుడు “నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?” అని యేసు అన్నాడు. (మత్తయి 7:​1-3) మీరు ఆ దృశ్యాన్ని ఊహించుకోగలరా? విమర్శించేందుకు ఉన్ముఖంగా ఉన్న ఒక వ్యక్తి తన సహోదరుని “కంటిలోనున్న” స్వల్పమైన ఒక నలుసును తీస్తానంటున్నాడు. తన సహోదరుడు తీర్పును అంగీకరించాల్సివస్తుందని విషయాలను తగినంత స్పష్టంగా చూడలేకపోతున్నాడని విమర్శకుడు వాదిస్తుండవచ్చు. కానీ తన కంటిలోని “దూలము”​—⁠ఇంటి పైకప్పుకు ఆసరాగా ఉపయోగించబడే ఒక కొయ్యదుంగ లేదా అడ్డదూలం​—⁠మూలంగా విమర్శకుడి సొంత సామర్థ్యం బలహీనపడింది. మనలోనే బహుశా పెద్ద పెద్ద తప్పులుండగా మన సహోదరుల చిన్న చిన్న తప్పులను విమర్శించడం ఎంతటి మూర్ఖత్వమో నొక్కి చెప్పేందుకు ఇది ఎంతటి మరిచిపోలేనటువంటి పద్ధతి!

14. దోమను వడగట్టి ఒంటెను దిగమ్రింగడం గురించి యేసు చెప్పిన మాటలు ఎందుకు ప్రాముఖ్యంగా శక్తివంతమైన అతిశయోక్తిగా ఉన్నాయి?

14 మరొక సందర్భంలో యేసు పరిసయ్యులను “అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగువారు మీరే” అని అందరి ముందూ అన్నాడు. (మత్తయి 23:​24) ఇది ప్రాముఖ్యంగా అతిశయోక్తిని శక్తివంతంగా ఉపయోగించిన విధానం. ఎందుకు? ఒక చిన్న దోమకూ, యేసు శ్రోతలకు బాగా తెలిసిన పెద్ద జంతువుల్లో ఒకటైన ఒక ఒంటెకూ మధ్యనున్న వ్యత్యాసం నిశ్చయంగా గమనించదగినది. దాదాపు ఏడు కోట్ల దోమలు ఒక సగటు ఒంటె బరువుకు సమానం కావచ్చని అంచనా! అంతేగాక, పరిసయ్యులు జల్లించే గుడ్డలో ద్రాక్షారసాన్ని వడియగడతారని యేసుకు బాగా తెలుసు. ఖచ్చితత్త్వం కోసం పట్టుబట్టే ఆ పరిసయ్యులు దోమను మ్రింగడం ద్వారా ఆచారరీత్యా అపవిత్రులు కాకుండా ఉండేందుకు అలా చేసేవారు. అయినా వారు అలంకారికంగా ఒంటెను దిగమ్రింగారు, అది కూడా అపవిత్రమైనదే. (లేవీయకాండము 11:​4, 21-24) యేసు చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగా ఉంది. పరిసయ్యులు ధర్మశాస్త్రంలోని అతి స్వల్పమైన విషయాలను జాగ్రత్తగా పాటించారు కానీ ‘న్యాయము కనికరము విశ్వాసమువంటి’ గంభీరమైన విషయాలను నిర్లక్ష్యం చేశారు. (మత్తయి 23:​23) వారు ఎలాంటివారన్నది యేసు ఎంత స్పష్టంగా బట్టబయలు చేశాడు!

15. యేసు అతిశయోక్తిని ఉపయోగించి బోధించిన కొన్ని పాఠాలు ఏవి?

15 తన పరిచర్య అంతటిలో యేసు అతిశయోక్తిని తరచుగా ఉపయోగించాడు. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి. చిన్న “ఆవగింజంత విశ్వాసము” ఒక కొండను కదిలించగలదు​—⁠స్వల్ప విశ్వాసమైనా ఎంతో సాధించగలదనే విషయాన్ని నొక్కి చెప్పేందుకు ఇంతకంటే సమర్థవంతమైన పద్ధతి బహుశా యేసుకు దొరక్కపోయుండవచ్చు. (మత్తయి 17:​20, 21) ఒక పెద్ద ఒంటె సూదిబెజ్జము గుండా దూరేందుకు ప్రయత్నించడం​—⁠ఆడంబరమైన జీవనశైలిని కొనసాగిస్తూ దేవుణ్ణి సేవించడానికి ప్రయత్నించే ఒక ధనవంతుడికి ఎదురయ్యే కష్టాన్ని అది ఎంత చక్కగా తెలియజేస్తోంది! (మత్తయి 19:​24) యేసు ఉపయోగించిన సుస్పష్టమైన ఆలంకారిక పదబంధాలకూ అతి తక్కువ మాటలతో ఎంతో ప్రభావాన్ని చూపించగలిగిన ఆయన సామర్థ్యానికీ మీరు ఆశ్చర్యపోరా?

ఖండించలేని తర్కం

16. యేసు తన చురుకైన తెలివితేటలను ఎల్లప్పుడూ ఏ విధంగా ఉపయోగించాడు?

16 తన పరిపూర్ణ మనస్సుతో ప్రజలతో హేతుబద్ధంగా తర్కించడంలో యేసు నైపుణ్యవంతుడు. కానీ ఆ సామర్థ్యాన్ని ఆయన ఎన్నడూ దుర్వినియోగం చేయలేదు. తన బోధలో సత్యాన్ని ముందుకు నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ తన చురుకైన తెలివితేటలను ఉపయోగించాడు. కొన్నిసార్లు, మతసంబంధ వ్యతిరేకులు తనపై వేసే అపనిందలు తప్పని రుజువు చేసేందుకు ఆయన శక్తివంతమైన తర్కాన్ని ఉపయోగించాడు. అనేక సందర్భాల్లో, తన శిష్యులకు ముఖ్యమైన పాఠాలను బోధించేందుకు ఆయన హేతుబద్ధమైన తర్కాన్ని ఉపయోగించాడు. తర్కాన్ని ఉపయోగించడంలో యేసుకున్న నైపుణ్యవంతమైన సామర్థ్యాన్ని చూద్దాం.

17, 18. పరిసయ్యులు మోపిన నిందను ఖండించేందుకు యేసు శక్తివంతమైన ఏ తర్కాన్ని ఉపయోగించాడు?

17 దయ్యముపట్టిన గ్రుడ్డివాడూ మూగవాడూ అయిన ఒక వ్యక్తిని యేసు నయం చేసినప్పటి సందర్భాన్ని పరిశీలించండి. దాని గురించి విన్న పరిసయ్యులు ‘వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే [సాతానుచేతనే] దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదు’ అని అన్నారు. సాతానుకు చెందిన దయ్యాలను వెళ్ళగొట్టడానికి మానవాతీత శక్తి అవసరమన్న విషయాన్ని పరిసయ్యులు ఒప్పుకోవడాన్ని గమనించండి. అయినప్పటికీ, ప్రజలు యేసును విశ్వసించకుండా ఉండేలా చేసేందుకని వారు ఆయన సాతాను శక్తితోనే చేస్తున్నాడని అన్నారు. వారు తమ వాదనకు తార్కికమైన పర్యవసానం గురించి సరిగ్గా ఆలోచించలేదని సూచిస్తూ యేసు, “తనకుతానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు. సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?” అని జవాబిచ్చాడు. (మత్తయి 12:​22-26) ఒక విధంగా చెప్పాలంటే యేసు ఇలా అంటున్నాడు: ‘మీరు అంటున్నట్లుగా నేను సాతాను ప్రతినిధిగా సాతాను చేసినవాటినే నిష్ఫలం చేస్తున్నట్లయితే, సాతాను తానే తన ఉద్దేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లవుతుంది, అలాంటప్పుడు అతను త్వరలోనే పడిపోతాడు.’ తిరుగులేని తర్కం, కదా?

18 ఈ విషయంపై యేసు ఇంకా తర్కించాడు. పరిసయ్యుల శిష్యులు కొందరు దయ్యాలను వెళ్ళగొట్టారని ఆయనకు తెలుసు. అందుకే ఆయన చిన్నదే అయినా వారి వాదన తప్పని నిరూపించే ప్రశ్నవేశాడు: “నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టుచున్నారు?” (మత్తయి 12:​27) ఒకవిధంగా యేసు వాదానికి భావం ఇది: ‘నిజంగానే నేను సాతాను శక్తితో దయ్యాలను వెళ్ళగొడుతున్నట్లయితే మీ శిష్యులు కూడా అదే శక్తితో వెళ్ళగొడుతుండాలి.’ పరిసయ్యులు ఏమి చెప్పగలరు? వారు తమ శిష్యులు సాతాను శక్తితో వెళ్ళగొడుతున్నారని ఎన్నటికీ ఒప్పుకోరు. యేసు ఖండించలేని తర్కంతో, వారు తనమీద మోపిన నింద హాస్యాస్పదమైనదని రుజువు చేశాడు.

19, 20. (ఎ) యేసు ప్రోత్సాహకరమైన ఏ రీతిలో తర్కాన్ని ఉపయోగించాడు? (బి) ఎలా ప్రార్థించాలో బోధించమని తన శిష్యులు కోరినప్పుడు యేసు “ఎంతో నిశ్చయముగా” అనే తర్క విధానాన్ని ఎలా ఉపయోగించాడు?

19 యేసు తన వ్యతిరేకుల నోరు మూయించేందుకు తర్కాన్ని ఉపయోగించడంతో పాటు, యెహోవా గురించిన ప్రోత్సాహకరమైన మనోల్లాసకరమైన సత్యాలను బోధించడానికి సహేతుకమైన తర్కాలను, ఒప్పించే తార్కికవాదాలను కూడా ఉపయోగించాడు. తన శ్రోతలు తమకు తెలిసిన సత్యం నుండి దృఢవిశ్వాసాన్ని మరింత వృద్ధి చేసుకొనే స్థాయికి ఎదిగేందుకు సహాయపడడానికి ఆయన “ఎంతో నిశ్చయముగా” అని చెప్పగల తర్కవిధానాన్ని అనేకసార్లు ఉపయోగించాడు. కేవలం రెండు ఉదాహరణలను పరిశీలిద్దాం.

20 ఎలా ప్రార్థించాలో బోధించమని తన శిష్యులు కోరినప్పుడు దానికి జవాబుగా యేసు, విముఖత చూపిస్తున్న తన స్నేహితుడి నుండి “మాటిమాటికి అడుగుటవలన” చివరికి తను కావాలనుకున్నది పొందిన ఒక వ్యక్తి ఉదాహరణ చెప్పాడు. తమ పిల్లలకు ‘మంచి ఈవులను ఇవ్వడానికి’ తల్లిదండ్రులకు ఉండే సంసిద్ధత గురించి కూడా యేసు వర్ణించాడు. చివరికి ఆయన ఇలా అంటూ ముగించాడు: ‘మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.’ (లూకా 11:​1-13) యేసు చెబుతున్న అంశానికి ఆధారం భిన్నత్వమే కానీ సారూప్యత కాదు. విముఖత చూపిస్తున్న ఒక స్నేహితుడు తన పొరుగువాడు కోరింది ఇవ్వడానికి చివరికి ఒప్పుకున్నట్లయితే, అపరిపూర్ణ మానవ తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలపట్ల శ్రద్ధవహించినట్లయితే, మన ప్రేమపూర్వక పరలోకపు తండ్రి ప్రార్థన ద్వారా తన దగ్గరకు వినయంగా వచ్చే తన నమ్మకమైన సేవకులకు పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడు.

21, 22. (ఎ) భౌతిక విషయాల గురించిన చింతతో వ్యవహరించడం గురించి సలహా ఇచ్చేటప్పుడు యేసు ఎలాంటి తర్కాన్ని ఉపయోగించాడు? (బి) యేసు బోధనా పద్ధతులను కొన్నింటిని పరిశీలించిన తర్వాత మనం ఏ ముగింపుకు వస్తాం?

21 భౌతిక విషయాల గురించిన చింతతో వ్యవహరించడం గురించి సలహా ఇచ్చేటప్పుడు కూడా యేసు అలాంటి తర్కాన్నే ఉపయోగించాడు. ఆయనిలా అన్నాడు: ‘కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు. పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు; అయినను నేడు పొలములో ఉండి, రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును.’ (లూకా 12:​24, 27, 28) అవును యెహోవా పక్షులనూ పువ్వులనూ శ్రద్ధగా చూసుకుంటున్నట్లయితే తన సేవకులను మరెంతో నిశ్చయముగా శ్రద్ధగా చూసుకుంటాడు! మృదువైనదే అయినా శక్తివంతంగా ఉండే అలాంటి తర్కం యేసు శ్రోతల హృదయాలను స్పృశించిందనడంలో సందేహం లేదు.

22 యేసు బోధనా పద్ధతులను కొన్నింటిని పునర్విచారణ చేసిన తర్వాత, యేసును బంధించలేకపోయిన ఆ బంట్రౌతులు ‘ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవరూ ఎన్నడూ మాటలాడలేదు’ అని అన్నప్పుడు వారు గోరంతలు కొండంతలుగా చేసి ఎంత మాత్రం చెప్పడం లేదని మనం సులభంగానే అర్థంచేసుకోగలం. కానీ యేసు బాగా పేరుగాంచింది బహుశా ఉపమానాలను లేదా దృష్టాంతాలను ఉపయోగించడమనే బోధనా పద్ధతి వల్లనే కావచ్చు. ఆయన ఈ పద్ధతిని ఎందుకు ఉపయోగించాడు? ఆయన ఉపమానాలు అంత సమర్థవంతంగా ఉండడానికి కారణమేమిటి? తర్వాతి ఆర్టికల్‌లో ఈ ప్రశ్నలు చర్చించబడతాయి.

[అధస్సూచీలు]

^ పేరా 1 బంట్రౌతులు బహుశా మహాసభ ప్రతినిధులు, ప్రధానయాజకుల అధికారం క్రింద ఉండేవారు అయ్యుండవచ్చు.

^ పేరా 3 ఆగస్టు 15, 2002 కావలికోటలోని “మీకు మాదిరి ఉంచాను,” “నన్ను వెంబడించడంలో కొనసాగండి” అనే ఆర్టికల్‌లను చూడండి.

^ పేరా 6 అపొస్తలుల కార్యములు 20:⁠35 లో కనబడే ఈ చివరి వ్యాఖ్యానాన్ని అపొస్తలుడైన పౌలు మాత్రమే ఉదాహరించాడు, అయినా ఆ పదాల భావం సువార్తల్లో కనబడుతుంది. పౌలు ఆ వ్యాఖ్యానాన్ని బహుశా మౌఖికంగా (యేసు దాన్ని చెప్పినప్పుడు విన్న ఒక శిష్యుడి ద్వారానైనా పునరుత్థానుడైన యేసు ద్వారానైనా) విని ఉండవచ్చు లేదా దేవుడే బయలుపరిచి ఉండవచ్చు.​—⁠అపొస్తలుల కార్యములు 22:​6-15; 1 కొరింథీయులు 15:⁠6, 8.

^ పేరా 8 యూదులు సంవత్సరానికి ఒకసారి దేవాలయపు పన్నుగా అరషెకెలు (దాదాపు రెండు రోజుల వేతనం) చెల్లించాలి. ఆ పన్ను డబ్బు దేవాలయ సంరక్షణ కోసం అక్కడ నిర్వహించబడే సేవకు, ప్రజల తరఫున రోజూ అర్పించబడే బలుల కోసం ఉపయోగించబడేది.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• యేసు సరళతతో స్పష్టతతో బోధించాడని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?

• యేసు తాను బోధించేటప్పుడు ప్రశ్నలను ఎందుకు ఉపయోగించాడు?

• అతిశయోక్తి అంటే ఏమిటి, యేసు ఈ బోధనా పద్ధతిని ఎలా ఉపయోగించాడు?

• యేసు తన శిష్యులకు యెహోవా గురించిన మనోల్లాసకరమైన సత్యాలను బోధించేందుకు సహేతుకమైన తర్కాన్ని ఎలా ఉపయోగించాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రం]

యేసు సాధారణ ప్రజలు అర్థంచేసుకోగల సరళమైన భాషను ఉపయోగించాడు

[10వ పేజీలోని చిత్రం]

పరిసయ్యులు ‘దోమలేకుండా వడగట్టారు కానీ ఒంటెను మ్రింగారు’