కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఒకరినొకరు క్షమించుకోండి’

‘ఒకరినొకరు క్షమించుకోండి’

‘ఒకరినొకరు క్షమించుకోండి’

దేవుడు మీ పాపాలను క్షమించేశాడని మీరు నమ్ముతున్నారా? అమెరికాలోని వయోజనుల్లో చాలామంది అలాగే నమ్ముతున్నట్లు కనిపిస్తుంది. 1,423 అమెరికన్లను ప్రశ్నించినప్పుడు, 45 సంవత్సరాలకంటే ఎక్కువ వయస్సున్న వయోజనులలో దాదాపు 80 శాతంమంది దేవుడు తమ పాపాలను క్షమించేశాడని చెప్పారని యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ వద్ద నిర్వహించబడిన ఒక అధ్యయనానికి మొదటి మూలకర్త అయిన డా. లోరెన్‌ టూసాంగ్‌ నివేదించాడు.

అయితే, ప్రశ్నించబడిన వారిలో కేవలం 57 శాతంమంది మాత్రమే తాము ఇతరులను క్షమించామని చెప్పారన్నది ఆసక్తికరమైన విషయం. ఈ గణాంకం, యేసు తాను కొండమీద చేసిన ప్రసంగంలో చెప్పిన మాటలను మనకు గుర్తు చేస్తుంది: “మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.” (మత్తయి 6:​14, 15) అవును, దేవుడు మన పాపాలను క్షమించడమనేది ఒక షరతుపై ఆధారపడి ఉంది. పాక్షికంగా అది, మనం ఇతరులను క్షమించడానికి చూపే సుముఖతపై ఆధారపడివుంది.

అపొస్తలుడైన పౌలు కొలొస్సయిలోని క్రైస్తవులకు ఈ సూత్రాన్ని గుర్తుచేశాడు. ఆయన వారిని ఇలా పురికొల్పాడు: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” (కొలొస్సయులు 3:​13) నిజమే, అలా చేయడం ఎల్లప్పుడూ అంత సులభమేమీ కాదు. ఉదాహరణకు, ఎవరైనా మీ గురించి అనాలోచితంగా నిర్దయగా మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి చేసినదానికి ఆయనను క్షమించడం కష్టంగానే ఉండవచ్చు.

అయినప్పటికీ క్షమించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు అనేకమున్నాయి. సామాజికవేత్తయైన డా. డేవిడ్‌ ఆర్‌. విలియమ్స్‌ తన పరిశోధన గురించి ఇలా అన్నాడు: “మధ్య వయస్కులు, వృద్ధులు అయిన అమెరికన్ల మానసిక ఆరోగ్యానికీ వారు ఇతరులను క్షమించడానికీ మధ్య ప్రాముఖ్యంగా బలమైన సంబంధాన్ని మేము కనుగొన్నాము.” దాదాపు 3,000 సంవత్సరాల క్రితం జ్ఞానియైన సొలొమోను రాజు చెప్పిన మాటలకు అది పొందికగా ఉంది. ఆయన ఇలా వ్రాశాడు: “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము.” (సామెతలు 14:​30) క్షమించే గుణం దేవునితోనూ మన పొరుగువారితోనూ మంచి సంబంధాలు కలిగివుండడానికి తోడ్పడుతుంది. కాబట్టి, మనం ఒకరినొకరం హృదయపూర్వకంగా క్షమించుకోవడానికి సుముఖత చూపేందుకు మనకు మంచి కారణమే ఉంది.​—⁠మత్తయి 18:​35.