కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గొప్ప బోధకుడ్ని అనుకరించండి

గొప్ప బోధకుడ్ని అనుకరించండి

గొప్ప బోధకుడ్ని అనుకరించండి

“కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, . . . , నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.”​—⁠మత్తయి 28:​19, 20.

1, 2. (ఎ) ఒక విధంగా మనమందరం ఎలా బోధకులమై ఉన్నాము? (బి) బోధించే విషయానికి వచ్చేసరికి నిజ క్రైస్తవులకు ఎలాంటి విశేషమైన బాధ్యత ఉంది?

మీరు బోధకులా? ఒకవిధంగా మనమందరం బోధకులమే. దారి తప్పిన ఒక ప్రయాణికుడికి సూచనలిస్తున్నప్పుడు, సహోద్యోగికి ఒకానొక పనిని ఎలా చేయాలో చూపిస్తున్నప్పుడు, ఒక చిన్న పిల్లవాడికి తన బూటు లేసులు ఎలా కట్టుకోవాలో వివరిస్తున్నప్పుడు మీరు బోధిస్తున్నట్లే లెక్క. ఆ విధంగా ఇతరులకు సహాయపడడం కొంతమేరకు సంతృప్తినిస్తుంది, కాదంటారా?

2 బోధించే విషయానికి వచ్చేసరికి నిజ క్రైస్తవులకు ఒక విశేషమైన బాధ్యత ఉంది. “జనులను శిష్యులనుగా చేయుడి . . . , వారికి బోధించుడి” అని మనకు ఆదేశం ఇవ్వబడింది. (మత్తయి 28:​19, 20) సంఘం లోపల కూడా మనకు బోధించే అవకాశం ఉంటుంది. సంఘాన్ని అభివృద్ధిపరిచే దృక్కోణంతో అర్హులైన పురుషులు ‘కాపరులుగాను ఉపదేశకులుగాను’ సేవ చేయడానికి నియమించబడ్డారు. (ఎఫెసీయులు 4:​11-13) పరిణతి చెందిన స్త్రీలు, తమ దైనందిన క్రైస్తవ కార్యకలాపాల్లో యౌవనస్త్రీలకు ‘మంచి ఉపదేశము చేయువారై ఉండవలెను.’ (తీతు 2:​3-5) తోటి విశ్వాసులను ప్రోత్సహించాలని మనకందరికీ ఉద్బోధించబడింది, ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేయడానికి బైబిలును ఉపయోగించడం ద్వారా మనం ఆ ఆదేశాన్ని గైకొనగలం. (1 థెస్సలొనీకయులు 5:​11) దేవునివాక్య బోధకులుగా ఉండడమూ శాశ్వత ప్రయోజనాలనిచ్చే ఆధ్యాత్మిక విలువలను ఇతరులతో పంచుకోవడమూ ఎంత గొప్ప ఆధిక్యత!

3. బోధకులుగా మనం మన సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోగలం?

3 అయినా, బోధకులుగా మనం మన సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోగలం? ముఖ్యంగా గొప్ప బోధకుడైన యేసును అనుకరించడం ద్వారా మెరుగుపరుచుకోగలం. ‘కానీ యేసు పరిపూర్ణుడు కదా మనం ఆయనను ఎలా అనుకరించగలం?’ అని కొందరు ఆశ్చర్యపోతుండవచ్చు. నిజమే మనం పరిపూర్ణమైన బోధకులం కాలేము. అయినప్పటికీ, మన సామర్థ్యాలతో సంబంధం లేకుండానే మనం యేసు బోధించిన విధానాన్ని అనుకరించడానికి మనకు సాధ్యమైనంతలో శ్రేష్ఠమైనది చేయగలం. ఆయన ఉపయోగించిన నాలుగు పద్ధతులను​—⁠సరళత, సమర్థవంతమైన ప్రశ్నలు, సహేతుకమైన తర్కం, సరైన ఉపమానాలు​—⁠మనం ఎలా ఉపయోగించగలమో చర్చిద్దాం.

సరళతతో బోధించడం

4, 5. (ఎ) బైబిలు సత్యాన్ని అందించడంలో సరళత ఎందుకు కీలకమైన లక్షణం? (బి) సరళతతో బోధించడానికి మన పదపరిజ్ఞానంపై శ్రద్ధ వహించడం ఎందుకు ప్రాముఖ్యం?

4 దేవునివాక్య ప్రాథమిక సత్యాలు క్లిష్టమైనవి కావు. ప్రార్థనలో యేసు ఇలా అన్నాడు: “తండ్రీ, . . . నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.” (మత్తయి 11:​25) యెహోవా తన సంకల్పాలు యథార్థహృదయులకూ వినయహృదయులకూ వెల్లడిచేయబడేలా చూశాడు. (1 కొరింథీయులు 1:​26-29) అందుకే, సరళత బైబిలు సత్యానికి కీలకమైన లక్షణం.

5 ఆసక్తిగలవారితో మీరు గృహబైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నా పునర్దర్శనాలు చేస్తున్నా మీరు సరళతతో ఎలా బోధించగలరు? మనం గొప్ప బోధకుడి నుండి ఏమి నేర్చుకున్నాం? తన శ్రోతలకు​—⁠వారిలో చాలామంది ‘విద్యలేని పామరులు’​—⁠తాను చెప్పేది అర్థమవ్వాలని యేసు వారు గ్రహించగలిగే సరళమైన భాషను ఉపయోగించాడు. (అపొస్తలుల కార్యములు 4:​13) అలాంటప్పుడు, సరళతతో బోధించడానికి మొట్టమొదట కావలసింది మన పదపరిజ్ఞానంపై శ్రద్ధ వహించడం. దేవునివాక్య సత్యాన్ని ఇతరులు విశ్వసించేలా చేయడానికి వారిని ముగ్ధులను చేసే పదాలనో పద బంధాలనో మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలాంటి “వాక్చాతుర్యము” ప్రత్యేకించి పరిమితమైన విద్య లేదా పరిమితమైన సామర్థ్యం గలవారిని జడిపించగలదు. (1 కొరింథీయులు 2:​1, 2) జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న సరళమైన పదాలు సత్యాన్ని ఎక్కువ శక్తివంతంగా అందజేయగలవని యేసు ఉదాహరణ చూపిస్తోంది.

6. అధిక సమాచారంతో బైబిలు విద్యార్థిని ఉక్కిరిబిక్కిరి చేయకుండా మనమెలా జాగ్రత్తపడవచ్చు?

6 సరళతతో బోధించడానికి, అధిక సమాచారంతో బైబిలు విద్యార్థిని ఉక్కిరిబిక్కిరి చేయకుండా జాగ్రత్తపడడం కూడా అవసరం. యేసు తన శిష్యుల పరిమితులను దృష్టిలో పెట్టుకొనేవాడు. (యోహాను 16:​12) మనం కూడా విద్యార్థి పరిమితులను దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంతో బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నట్లయితే మనం ప్రతి విషయాన్నీ వివరించాల్సిన అవసరం లేదు. * అలాగే కొంతభాగాన్ని పూర్తి చేయాలన్నదే ప్రాముఖ్యమన్నట్లు గబగబా కూడా చేయవద్దు. బదులుగా, విద్యార్థి అవసరాలను సామర్థ్యాలను బట్టి అధ్యయన వేగాన్ని నిర్ణయించుకోవడం వివేకవంతమైనది. మన లక్ష్యం, ఆ విద్యార్థి క్రీస్తు శిష్యుడూ యెహోవా ఆరాధకుడూ అయ్యేందుకు సహాయం చేయడమే. తాను నేర్చుకుంటున్నది స్పష్టంగా గ్రహించడానికి ఆసక్తిగల విద్యార్థికి సహాయపడేందుకు మనం తగినంత సమయాన్ని తీసుకోవాలి. ఆ విధంగా సత్యం ఆయన హృదయాన్ని స్పృశించి ఆయన చర్య తీసుకోవడానికి పురిగొల్పుతుండవచ్చు.​—⁠రోమీయులు 12:⁠2.

7. మనం సంఘంలో ప్రసంగాలు ఇచ్చేటప్పుడు సరళతతో బోధించడానికి ఏ యే సలహాలు సహాయకరంగా ఉండగలవు?

7 సంఘంలో మనం ప్రసంగాలు ఇచ్చేటప్పుడు ప్రత్యేకించి ప్రేక్షకుల్లో క్రొత్తగా వచ్చినవారు ఉంటే ‘స్పష్టమైన మాటలు [“సులభంగా అర్థమయ్యేలా,”NW]’ ఎలా మాట్లాడగలం? (1 కొరింథీయులు 14:⁠9) మనకు సహాయకరంగా ఉండగల మూడు సలహాలను పరిశీలించండి. మొదటిది, పరిచయంలేని పదాలను వేటినైనా ఉపయోగించాల్సివస్తే ముందు వాటిని వివరించండి. దేవునివాక్యం విషయంలో మనకున్న అవగాహన మనకు విశేషమైన పద పరిజ్ఞానాన్నిచ్చింది. మనం ‘నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు,’ “వేరే గొఱ్ఱెలు,” “మహా బబులోను” వంటి పదాలను ఉపయోగించినట్లయితే, వాటి భావాన్ని స్పష్టంచేసే సులభమైన పదాలతో మనం వాటిని వివరించాల్సి ఉండవచ్చు. రెండవది, ఎక్కువ పదాలను ఉపయోగించకండి. అనేకమైన పదాలు, అధిక వివరణ ప్రేక్షకులు తమ ఆసక్తిని కోల్పోయేలా చేసే అవకాశముంది. అనవసరమైన పదాలనూ పదబంధాలనూ తీసివేస్తే చెబుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మూడవది, ఎక్కువ భాగాన్ని పూర్తి చేయాలని ప్రయత్నించకండి. మన పరిశోధనలో ఎన్నో ఆసక్తికరమైన వివరాలు వెల్లడవుతుండవచ్చు. కానీ మనం అందించాల్సిన భాగాన్ని కొన్ని ముఖ్యమైన అంశాలుగా సమకూర్చుకోవడం, ఆ అంశాలకు మద్దతునిస్తూ కేటాయించిన సమయంలోనే స్పష్టంగా అందించగల సమాచారాన్ని మాత్రమే ఉపయోగించడం శ్రేయస్కరం.

ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించడం

8, 9. గృహస్థుడి ఆసక్తికి అనుగుణమైన ప్రశ్నను మనమెలా ఎంపిక చేసుకోగలం? కొన్ని ఉదాహరణలివ్వండి.

8 తన శిష్యులు తమ మనస్సుల్లో ఉన్నదాన్ని వ్యక్తపరిచేలా వారిని పురికొల్పేందుకు, వారి ఆలోచనకు శిక్షణనిచ్చేందుకు ప్రశ్నలను ఉపయోగించడంలో యేసు ప్రావీణ్యుడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసు తన ప్రశ్నలతో వారి హృదయాలను చేరుకొని మృదువుగా స్పర్శించాడు. (మత్తయి 16:​13, 15; యోహాను 11:​26) యేసులాగే మనం కూడా ప్రశ్నలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించగలం?

9 ఇంటింటి ప్రకటనా పని చేస్తున్నప్పుడు, దేవుని రాజ్యం గురించి మాట్లాడేందుకు మార్గం సిద్ధం చేసుకుంటూ ఆసక్తిని రేకెత్తించడానికి మనం ప్రశ్నలను ఉపయోగించవచ్చు. గృహస్థుడి ఆసక్తికి అనుగుణమైన ప్రశ్నను మనమెలా ఎంపిక చేసుకోగలం? బాగా గమనించేవారిగా ఉండండి. ఏదైనా ఇంటిని సమీపిస్తుండగా పరిసరాలను ఒకసారి పరికించండి. ఆ ఇంట్లో చిన్నపిల్లలున్నారని సూచిస్తూ వాకిట్లో ఏమైనా బొమ్మలున్నాయా? అలా ఉంటే, ‘మీ పిల్లలు పెరిగి పెద్దవారయ్యేసరికి ఈ లోకం ఎలా ఉంటుందోనని మీరెప్పుడైనా ఆలోచించారా?’ అని మనం అడగవచ్చు. (కీర్తన 37:​10, 11) ముందు గుమ్మానికి రెండు మూడు తాళాలున్నాయా, లేక సెక్యూరిటీ సిస్టమ్‌ ఉందా? అవి గనుక ఉంటే, ‘మనలాంటివారు ఇంటిలోనూ వీధిలోనూ సురక్షితంగా ఉన్నామని భావించే కాలం ఎప్పుడైనా వస్తుందని మీరు అనుకుంటున్నారా?’ అని అడగవచ్చు. (మీకా 4:​3, 4) చక్రాల కుర్చీ కోసం నిర్మించబడిన ఏటవాలుగా ఉండే సిమెంటు దిమ్మెలాంటిదేదైనా ఉందా? అది కనుక ఉంటే ‘జీవించివున్న ప్రతి ఒక్కరూ చక్కని ఆరోగ్యంతో ఉండే కాలమెప్పుడైనా వస్తుందంటారా?’ అని అడగవచ్చు. (యెషయా 33:​24) బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో అనేక సలహాలు కనబడతాయి. *

10. బైబిలు విద్యార్థి హృదయంలోని ఆలోచనలను, భావాలను ‘పైకి చేదడానికి’ మనం ప్రశ్నలను ఎలా ఉపయోగించగలం, అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి?

10 బైబిలు అధ్యయనాలు నిర్వహించేటప్పుడు మనం ప్రశ్నలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించగలం? మనం యేసు వలె హృదయాలను చదవలేం. అయినప్పటికీ, పరిస్థితులను బట్టి తెలివిగా వేసే ప్రశ్నలు విద్యార్థి హృదయంలోని ఆలోచనలనూ భావాలనూ ‘పైకి చేదడానికి’ సహాయకరంగా ఉంటాయి. (సామెతలు 20:⁠5) ఉదాహరణకు, జ్ఞానము పుస్తకంలో మనం “దైవభక్తిగల జీవితాన్ని గడపడం ఎందుకు సంతోషాన్ని తెస్తుంది” అనే అధ్యాయాన్ని అధ్యయనం చేస్తున్నామనుకోండి. అది మోసం, వ్యభిచారంతోపాటు ఇతర విషయాలపై దేవుని దృక్కోణం గురించి చర్చిస్తోంది. ముద్రించబడిన ప్రశ్నలకు విద్యార్థి సరిగ్గానే జవాబు చెబుతుండవచ్చు, కానీ తాను నేర్చుకుంటున్న వాటితో ఆయన ఏకీభవిస్తున్నాడా? అందుకే మనమిలా అడగవచ్చు: ‘ఇలాంటి విషయాలపై దేవుని దృక్కోణం సహేతుకమైనదేనని మీకనిపిస్తోందా?’ ‘ఈ బైబిలు సూత్రాలను మీరు మీ జీవితంలో ఎలా అన్వయించుకోగలరు?’ అయితే, విద్యార్థికి గౌరవమిస్తూ మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరముందని గుర్తుంచుకోండి. బైబిలు విద్యార్థిని ఇబ్బంది పెట్టే లేదా కించపరిచే ప్రశ్నలను మనం అడగాలనుకోము.​—⁠సామెతలు 12:​18.

11. బహిరంగ ప్రసంగీకులు ప్రశ్నలను ఏయే విధాల్లో సమర్థవంతంగా ఉపయోగించవచ్చు?

11 బహిరంగ ప్రసంగీకులు కూడా ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఆలంకారిక ప్రశ్నలు​—⁠మన శ్రోతలు సమాధానం చెబుతారని ఎదురుచూడని ప్రశ్నలు—⁠ప్రేక్షకులను ఆలోచింపజేసి తర్కించుకునేందుకు సహాయపడగలవు. అలాంటి ప్రశ్నలను యేసు అప్పుడప్పుడు ఉపయోగించాడు. (మత్తయి 11:​7-9) దాంతోపాటు, ఉపోద్ఘాతం చెప్పిన తర్వాత ఒక ప్రసంగీకుడు తాను చర్చించబోయే ముఖ్యాంశాలను సంక్షిప్తంగా సూచించేందుకు ప్రశ్నలను ఉపయోగించవచ్చు. ఆయనిలా అనవచ్చు: “నేటి మన చర్చలో, ఈ ప్రశ్నలకు సమాధానాలను పరిశీలించబోతున్నాం . . .” ముగింపులో, ముఖ్యాంశాలను పునఃపరిశీలించేందుకు ఆయన ఆ ప్రశ్నలను తిరిగి వేయవచ్చు.

12. తోటి విశ్వాసి దేవునివాక్యం నుండి ఓదార్పు పొందడానికి సహాయపడేందుకు క్రైస్తవ పెద్దలు ప్రశ్నలను ఎలా ఉపయోగించవచ్చో చూపించడానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.

12 యెహోవావాక్యం నుండి ఓదార్పు పొందేలా ‘ధైర్యము చెడినవారికి’ సహాయపడేందుకు క్రైస్తవ పెద్దలు తమ కాపరిపనిలో ప్రశ్నలను ఉపయోగించవచ్చు. (1 థెస్సలొనీకయులు 5:​14) ఉదాహరణకు, నిరుత్సాహంగా ఉన్న ఒక వ్యక్తికి సహాయపడేందుకు ఒక పెద్ద, కీర్తన 34:18పైకి దృష్టిని మళ్ళించవచ్చు. అదిలా చెబుతోంది: “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు; నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” నిరుత్సాహంగా ఉన్న వ్యక్తి ఇది తనకు వ్యక్తిగతంగా ఎలా అన్వయిస్తుందో గ్రహించాడని నిర్ధారించుకునేందుకు ఆ పెద్ద ఇలా అడగవచ్చు: ‘యెహోవా ఎవరికి ఆసన్నుడు?’ మీరు అప్పుడప్పుడు మీ ‘హృదయము విరిగినట్లు,’ ‘మనస్సు నలిగినట్లు’ భావిస్తున్నారా? బైబిలు చెబుతున్న ప్రకారం, యెహోవా అలాంటివారికి సమీపంలోనే ఉన్నట్లయితే, దానర్థం ఆయన మీకు దగ్గర్లోనే ఉన్నాడని కాదా?’ అలాంటి మృదువైన ఓదార్పు దుఃఖంలో ఉన్నవారి ప్రాణమును ఉజ్జీవింపజేయగలదు.​—⁠యెషయా 57:​15.

సహేతుకమైన తర్కం

13, 14. (ఎ) తన కంటికి కనిపించని దేవుణ్ణి నమ్మలేననే వ్యక్తితో మనమెలా తర్కించవచ్చు? (బి) ప్రతి ఒక్కరూ ఒప్పించబడతారని మనం ఎందుకు ఎదురుచూడకూడదు?

13 మన పరిచర్యలో చక్కని, ఒప్పించే శక్తిగల తర్కంతో హృదయాలను చేరుకోవాలని కోరుకుంటాం. (అపొస్తలుల కార్యములు 19:⁠8; 28:​23, 24) అంటే దేవునివాక్య సత్యం గురించి ఇతరులను ఒప్పించడానికి మనం సంక్లిష్టమైన తర్కాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలని దాని భావమా? ఎంత మాత్రం కాదు. సరైన తర్కం సంక్లిష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. సరళమైన ధోరణిలో చేయబడిన తర్కసహితమైన వాదనలు తరచూ అత్యంత సమర్థవంతంగా ఉంటాయి. ఒక ఉదాహరణను పరిశీలించండి.

14 కంటికి కనిపించని దేవుణ్ణి తాను నమ్మలేనని ఒక వ్యక్తి అన్నప్పుడు మనమెలా ప్రతిస్పందించవచ్చు? మనం క్రియ-ప్రతిక్రియ అనే సహజ సూత్రం గురించి వారితో తర్కించవచ్చు. మనం ఒక ప్రతిక్రియను గమనించినప్పుడు దానికి ఒక క్రియ కారణమన్న విషయాన్ని మనం అంగీకరిస్తాం. మనమిలా అనవచ్చు: ‘మీరు ఒక మారుమూల ప్రాంతంలో ఉంటున్నట్లయితే చక్కగా నిర్మించబడి ఆహారపదార్థాలు నిలువ చేయబడిన ఒక ఇల్లు (ప్రతిక్రియ) మీకు కనబడినట్లయితే ఆ ఇంటిని నిర్మించి దానిలో ఆహారపదార్థాలను నింపివుంచడానికి ఎవరో (క్రియ) కారణమని మీరు వెంటనే అంగీకరిస్తారు. మరి మనకు కనిపిస్తున్న ప్రకృతి రూపకల్పననూ భూ “భక్ష్యాగారము”లోని పుష్కలమైన ఆహార పదార్థాలనూ (ప్రతిక్రియ) చూసినప్పుడు, వీటన్నింటికీ ఎవరో (క్రియ) కారణమని అంగీకరించడం సహేతుకంగా ఉండదా?’ ఈ వాస్తవాన్ని బైబిలు సరళంగా ఇలా చెబుతోంది: “ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.” (హెబ్రీయులు 3:​3, 4) అయితే మన తర్కం ఎంత సహేతుకమైనదైనా అందరూ ఒప్పించబడరు. “సరైన మనోవైఖరిగలవారు” మాత్రమే విశ్వాసులవుతారని బైబిలు మనకు గుర్తుచేస్తోంది.​—⁠అపొస్తలుల కార్యములు 13:​48, NW; 2 థెస్సలొనీకయులు 3:⁠2.

15. యెహోవా లక్షణాలను, విధానాలను నొక్కి చెప్పడానికి ఎలాంటి తర్క విధానాన్ని మనం ఉపయోగించవచ్చు, అలాంటి తర్కాన్ని ఎలా మనం ఉపయోగించవచ్చో తెలిపే రెండు ఉదాహరణలు ఏవి?

15 క్షేత్ర పరిచర్యలో గానీ సంఘంలో గానీ మనం బోధించేటప్పుడు, యెహోవా లక్షణాలనూ ఆయన విధానాలనూ నొక్కి చెప్పడానికి మనం సహేతుకమైన తర్కాన్ని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా “ఎంతో నిశ్చయముగా” అని యేసు అప్పుడప్పుడు ఉపయోగించిన పద్ధతి ప్రాముఖ్యంగా సమర్థవంతమైనది. (లూకా 11:​13; 12:​24) విభిన్నత ఆధారంగా చేసే ఇలాంటి తర్కం ఎంతో ప్రభావం చూపించగలదు. నరకాగ్ని సిద్ధాంతపు నిర్హేతుకతను బట్టబయలు చేయడానికి మనమిలా అనవచ్చు: ‘ప్రేమగల ఏ తండ్రి కూడా తన కుమారుడ్ని శిక్షించడానికి తన కుమారుడి చేతిని మంటల్లో కాల్చడు. నరకాగ్ని తలంపు కూడా మన ప్రేమగల పరలోకపు తండ్రికి ఇంకెంత అసహ్యకరమైనదిగా ఉంటుందో కదా! (యిర్మీయా 7:​31) యెహోవా తన సేవకుల్లో ఒక్కొక్కరిపై శ్రద్ధ చూపిస్తాడని బోధించడానికి, మనమిలా అనవచ్చు: ‘యెహోవా వందల కోట్ల నక్షత్రాలను పేర్లు పెట్టి పిలిచినట్లయితే, తన కుమారుని అమూల్యమైన రక్తంతో కొనబడినవారూ తనను ప్రేమించేవారూ అయిన మానవులపైన ఆయన ఇంకెంత నిశ్చయంగా శ్రద్ధ చూపిస్తాడో కదా!’ (యెషయా 40:​26; అపొస్తలుల కార్యములు 20:​28) అలాంటి బలమైన తర్కం ఇతరుల హృదయాలను చేరడానికి మనకు సహాయపడగలదు.

సరైన ఉపమానాలు

16. బోధలో ఉపమానాలు ఎందుకు విలువైనవి?

16 సమర్థవంతమైన ఉపమానాలు ఒక వంటకాన్ని రుచిగా ఉండేలా చేసే పదార్థాల్లాంటివి, అవి మన బోధ ఇతరులకు మరింత రుచికరంగా ఉండేలా చేయగలుగుతాయి. బోధలో ఉపమానాలు ఎందుకు విలువైనవి? ఒక బోధకుడు ఇలా వ్యక్తం చేస్తున్నాడు: “మనో నేత్రాలతో చూడకుండా దేని గురించైనా ఆలోచించడమనేది, మానవునికి అత్యంత కష్టమైన కార్యాల్లో ఒకటి.” ఉపమానాలు మనస్సులో అర్థవంతమైన ఊహా చిత్రాలను రూపొందించి తద్వారా క్రొత్త ఆలోచనలను మరింత పూర్తిగా అవగాహన చేసుకోవడానికి సహాయం చేస్తాయి. యేసు ఉపమానాలను చాలా అద్భుతంగా ఉపయోగించేవాడు. (మార్కు 4:​33, 34) ఈ బోధనా పద్ధతిని మనమెలా ఉపయోగించుకోవచ్చో పరిశీలిద్దాం.

17. ఒక ఉపమానాన్ని సమర్థవంతమైనదిగా చేసే నాలుగు కారకాలు ఏవి?

17 ఒక ఉపమానాన్ని సమర్థవంతంగా చేసేది ఏమిటి? మొదటిగా, అది మన ప్రేక్షకులు అన్వయించుకోగలిగేలా ఉండాలి, మన శ్రోతలు వెంటనే అర్థం చేసుకోగల పరిస్థితుల ఆధారంగా అది రూపొందించబడాలి. యేసు తన ఉపమానాల్లో అనేకమైన వాటిని తన శ్రోతల దైనందిన జీవితం నుండే రూపొందించాడని మనకు గుర్తుంది. రెండవది, మనం చెప్పదల్చుకున్న విషయానికి ఉపమానం సహేతుకంగా సరిపోలినదై ఉండాలి. సరిపోల్చి చెప్పేది తగిన విధంగా లేనట్లయితే, మన ఉపమానం శ్రోతల ధ్యాసను మళ్ళించగలదు. మూడవది, ఒక ఉపమానం అనవసరమైన అనేక వివరాలతో ఉండకూడదు. యేసు అవసరమైన నిర్దిష్టమైన వివరాలను మాత్రమే అందించి, అనవసరమైన వాటిని వదిలేశాడన్నది జ్ఞాపకం చేసుకోండి. నాలుగవది, మనం ఒక ఉపమానం ఉపయోగించేటప్పుడు దాని అన్వయింపు స్పష్టంగా ఉండేలా నిర్ధారించుకోవాలి. అలా చేయకపోతే విషయమేమిటో కొందరు అర్థం చేసుకోలేకపోవచ్చు.

18. సరైన ఉపమానాలను మనం ఎలా ఆలోచించగలం?

18 సరైన ఉపమానాలను మనం ఎలా ఆలోచించగలం? మనం చాలా సుదీర్ఘమైన, వివరణాత్మకమైన కథల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లుప్తమైన ఉపమానాలు చాలా సమర్థవంతంగా ఉండగలవు. కేవలం చర్చించబడుతున్న అంశపు ఉదాహరణల గురించే ఆలోచించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, మనం దేవుని క్షమాపణ గురించి చర్చిస్తూ, అపొస్తలుల కార్యములు 3:​20 లో మన పాపాలను ‘తుడిచివేస్తానని’ యెహోవా చెప్పిన విషయాన్ని సోదాహరణంగా తెలియజేయాలనుకుంటున్నామే అనుకుందాం. అప్పటికే అది విస్పష్టమైన ఆలంకారిక భాషలో ఉంది, కానీ ముఖ్యాంశాన్ని ఉపమానంగా చెప్పడానికి మనం ఏ వాస్తవికమైన ఉదాహరణను ఉపయోగించవచ్చు​—⁠ఒక రబ్బరునా? స్పాంజినా? మనమిలా అనవచ్చు: ‘యెహోవా మన పాపాలను క్షమించినప్పుడు, ఆయన ఒక స్పాంజితో (లేదా రబ్బరుతో) తుడిచివేసినట్లు మన పాపాలను తుడిచివేస్తాడు.’ ఇంత సరళమైన ఉపమానం అందజేసే విషయం చాలా సులభంగా అర్థమవుతుంది.

19, 20. (ఎ) మంచి ఉపమానాలను మనం ఎక్కడ పొందగలం? (బి) మన ప్రచురణల్లో ప్రచురించబడిన కొన్ని సమర్థవంతమైన ఉపమానాలు ఏవి? (బాక్సు చూడండి.)

19 నిజ జీవిత ఉదాహరణలతోపాటు సరైన ఉపమానాలను మీరు ఎక్కడ పొందగలరు? వాటి కోసం మీ సొంత జీవితంలో లేదా మీ తోటి విశ్వాసుల విభిన్న నేపథ్యాల్లోకి, అనుభవాల్లోకి పరికించండి. ఉపమానాలను ఇతర అనేక మూలాల నుండి అంటే ప్రాణం ఉన్న వాటినుండి, ప్రాణం లేని వస్తువులనుండి, ఇంట్లోని వస్తువులనుండి లేదా స్థానిక ప్రాంతంలో బాగా తెలిసిన తాజా సంఘటన నుండి కూడా ఎంపిక చేసుకోవచ్చు. మంచి ఉపమానాలను పొందడానికి కీలకమేమిటంటే ప్రతిదినం మన చుట్టుప్రక్కల జరుగుతున్న పరిస్థితులను జాగ్రత్తగా ‘చూస్తూ’ అప్రమత్తంగా ఉండడమే. (అపొస్తలుల కార్యములు 17:​22, 23) బహిరంగంగా ప్రసంగించడం గురించి ఒక గ్రంథం ఇలా తెలియజేస్తోంది: “మానవ జీవితాన్ని, దాని వివిధ కార్యకలాపాలను గమనించే ప్రసంగీకుడు అన్నిరకాల మనుష్యులతో మాట్లాడతాడు, విషయాలను నిశితంగా పరిశీలిస్తాడు వాటి గురించి సరైన అవగాహన కలిగేంతవరకు ప్రశ్నలు అడుగుతాడు, అవసరమైనప్పుడు ఎంతో సహాయకరంగా ఉండే ఉపమానాంశాలను బాగా సమకూర్చుకుంటాడు.”

20 సమర్థవంతమైన ఉపమానాలకు మరొక సమృద్ధికరమైన మూలం​—⁠యెహోవాసాక్షులు ముద్రించిన కావలికోట, తేజరిల్లు!, ఇతర ప్రచురణలు. ఈ ప్రచురణలు ఉపమానాలను ఎలా ఉపయోగించాయో గమనించడం ద్వారా మీరు చాలా నేర్చుకోవచ్చు. * ఉదాహరణకు, జ్ఞానము పుస్తకంలోని 17వ అధ్యాయం 11వ పేరాలో ఉపయోగించబడిన ఉపమానాన్ని పరిశీలించండి. అక్కడ సంఘంలోని విభిన్న వ్యక్తిత్వాలు రోడ్డుమీద మీ ప్రక్కనే ప్రయాణిస్తున్న వివిధ వాహనాలతో సరిపోల్చబడ్డాయి. దాన్ని అంత సమర్థవంతంగా చేసేదేమిటి? అది అనుదిన పరిస్థితులపైన ఆధారపడివుందన్నది గమనించండి, చెప్పాలనుకున్న విషయానికీ దానికీ ఎంతో పోలిక ఉంది, దాని అన్వయింపు స్పష్టంగా ఉంది. మనం ప్రచురించబడిన ఉపమానాలను మన బోధలో ఉపయోగించవచ్చు, బహుశా వాటిని బైబిలు విద్యార్థి అవసరాలకు అనుగుణంగా లేదా ఒక ప్రసంగంలో ఉపయోగించడానికి తగిన విధంగా మలుచుకోవచ్చు.

21. సమర్థవంతమైన దేవునివాక్య బోధకుడిగా ఉండడం వల్ల ఎలాంటి ప్రతిఫలాలు కలుగుతాయి?

21 సమర్థవంతమైన బోధకుడిగా ఉండడం వల్ల వచ్చే ప్రతిఫలాలు ఘననీయమైనవి. బోధించేటప్పుడు విషయాన్ని మనం ఇతరులతో పంచుకుంటాం; వారికి సహాయపడేందుకు మనం మన వనరుల్లో కొంత భాగాన్ని ఇస్తాం. అలా ఇవ్వడం సంతోషాన్ని తెస్తుంది, అందుకే బైబిలిలా చెబుతోంది: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:​35) యెహోవా గురించిన సత్యాన్ని​—⁠నిజమైనదీ శాశ్వతమైన విలువగలదీ అయిన సత్యాన్ని​—⁠ఇతరులతో పంచుకుంటున్నామని తెలుసుకోవడం వల్ల కలిగే ఆనందమే దేవునివాక్య బోధకులు పొందే సంతోషం. గొప్ప బోధకుడైన యేసుక్రీస్తును మనం అనుకరిస్తున్నామని తెలుసుకోవడం వల్ల కలిగే సంతృప్తిని కూడా మనం పొందగలం.

[అధస్సూచీలు]

^ పేరా 6 యెహోవాసాక్షులు ప్రచురించినది.

^ పేరా 9 యెహోవాసాక్షులు ప్రచురించినది, దీనిలో “ప్రాంతీయ సేవలో ఉపయోగించుటకు ఉపోద్ఘాతాలు” అనే విభాగాన్ని 2-7 పేజీల్లో చూడండి.

^ పేరా 20 ఉదాహరణల కోసం, వాచ్‌ టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ 1986-2000 లో “ఉపమానాలు” క్రింద చూడండి.​—⁠యెహోవాసాక్షులు దీన్ని అనేక భాషల్లో ప్రచురించారు.

మీకు జ్ఞాపకముందా?

• గృహ బైబిలు అధ్యయనం నిర్వహించేటప్పుడు మనం సరళతతో ఎలా బోధించవచ్చు? సంఘంలో ప్రసంగమిచ్చేటప్పుడు సరళతతో ఎలా బోధించవచ్చు?

•ఇంటింటికి ప్రకటించేటప్పుడు మనం ప్రశ్నలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించవచ్చు?

• యెహోవా లక్షణాలను, విధానాలను నొక్కి చెప్పడానికి మనం సహేతుకమైన తర్కాన్ని ఎలా ఉపయోగించవచ్చు?

• సరైన ఉపమానాలను మనం ఎక్కడ పొందవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[23వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఈ ఉపమానాలు మీకు జ్ఞాపకమున్నాయా?

సమర్థవంతమైన ఉపమానాల్లో ఈ క్రిందివి కేవలం కొన్ని మాత్రమే. ఇవ్వబడిన రెఫరెన్సు చూసి చర్చించబడుతున్న అంశాన్ని నొక్కి చెప్పడానికి ఆ ఉపమానం ఎలా సహాయపడిందో ఎందుకు గమనించకూడదు?

సర్కస్‌ చేసే వ్యక్తుల్లాగే లేదా ఐస్‌-స్కేటింగ్‌ చేసేవాళ్ళలాగే, మంచి వివాహ బంధాన్ని నిర్మించుకోవాలని కోరుకునేవారు మంచి భాగస్వామి మీదే ఎక్కువగా ఆధారపడతారు.​—⁠కావలికోట, మే 15, 2001, 16వ పేజీ.

మీ భావాలను వ్యక్తం చేయడం బంతి విసరడం లాంటిది. మీరు దాన్ని మెల్లగానూ విసరవచ్చు లేదా ఎదుటి వ్యక్తికి గాయమయ్యేలా బలంగానూ విసరవచ్చు.​—⁠తేజరిల్లు!, ఏప్రిల్‌-జూన్‌, 2001, 10వ పేజీ.

ప్రేమను వ్యక్తం చేయడాన్ని నేర్చుకోవడం ఒక కొత్త భాషను నేర్చుకోవడం వంటిది.​—⁠కావలికోట, ఫిబ్రవరి 15, 1999, 18, 22, 23 పేజీలు.

వారసత్వంగా పొందిన పాపాన్ని, సొట్టవున్న గిన్నెలో రొట్టెలు తయారుచేస్తే ఏమవుతుందో దానితో పోల్చవచ్చు.​—⁠మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు, 74వ పేజీ.

వేటగాళ్ళకు వల ఎటువంటిదో దయ్యాలకు అభిచారం అటువంటిది. అది ఎరను ఆకర్షిస్తుంది.​—⁠నిత్యజీవానికి నడిపించే జ్ఞానము, 111వ పేజీ.

ఆపరేషన్‌ చేయించుకుంటేనే తప్ప ప్రాణాలు దక్కని రోగంతో బాధపడుతూ అందుకు అయ్యే ఖర్చులు చెల్లించే స్తోమతలేని వ్యక్తి ఆపరేషన్‌కు చెల్లించబడిన మూల్యంతో ఆదాము సంతతిని కాపాడడానికి పంపించబడిన యేసును పోల్చవచ్చు.​—⁠కావలికోట, ఫిబ్రవరి 15, 1999, 13వ పేజీ.

కళా ప్రేమికుడు, అసూయగల ఒక విరోధి కారణంగా పాడైన తన అద్భుత కళాఖండాన్ని తిరిగి మంచిగా చేసుకోవాలని ఎంతో కోరుకుంటాడు, అదేవిధంగా యెహోవా అపరిపూర్ణ మానవజాతి పరిపూర్ణ పరిస్థితుల క్రింద నిత్యజీవము పొందాలని కోరుకుంటున్నాడు.​—⁠నిత్యజీవానికి నడిపించే జ్ఞానము, 181వ పేజీ.

[20వ పేజీలోని చిత్రాలు]

నిజ క్రైస్తవులు దేవునివాక్య బోధకులు

[21వ పేజీలోని చిత్రం]

దేవునివాక్యం నుండి ఓదార్పు పొందడంలో తోటి విశ్వాసులకు సహాయపడేందుకు పెద్దలు ప్రశ్నలను ఉపయోగించవచ్చు