కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నేను దేన్నీ మార్చను!”

“నేను దేన్నీ మార్చను!”

జీవితకథ

“నేను దేన్నీ మార్చను!”

గ్లాడిస్‌ ఆల్లెన్‌ చెప్పినది

“మీరు మీ జీవితాన్ని మళ్ళీ మొదటినుండి జీవించాల్సి వస్తే, దేన్ని మారుస్తారు?” అని నన్ను కొన్నిసార్లు అడగడం జరిగింది. “నేను దేన్నీ మార్చను!” అని హృదయపూర్వకంగా సమాధానమివ్వగలను. నేను ఎందుకలా భావిస్తున్నానో వివరించనివ్వండి.

నాకు రెండు సంవత్సరాల వయస్సున్నప్పుడు, 1929వ సంవత్సరపు వేసవికాలంలో, మా నాన్నగారైన మాథ్యూ ఆల్లెన్‌ జీవితంలో అద్భుతమైన విషయం ఒకటి జరిగింది. అంతర్జాతీయ బైబిలు విద్యార్థులు అని అప్పట్లో పిలువబడిన యెహోవాసాక్షులు ప్రచురించిన ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది ఇంకెన్నడూ మరణించరు! (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని ఆయన పొందారు. ఆతురతతో కేవలం కొన్ని పేజీలు చదివి, “నేను ఎన్నడూ ఇంత అద్భుతమైన విషయం చదవలేదు!” అని నాన్నగారు సంతోషంతో కేకవేశారు.

ఆ తర్వాత కొద్ది కాలానికే, బైబిలు విద్యార్థుల ఇతర ప్రచురణల్ని కూడా నాన్నగారు సంపాదించుకున్నారు. తాను నేర్చుకున్న వాటిని ఆయన వెంటనే పొరుగువారందరితో పంచుకోవడం ప్రారంభించారు. అయితే, మా గ్రామీణ ప్రాంతంలో యెహోవాసాక్షుల సంఘం లేదు. క్రైస్తవులతో క్రమంగా సహవసించవలసిన అవసరతను గుర్తించి నాన్నగారు 1935వ సంవత్సరంలో మా కుటుంబాన్ని కెనడాలోని ఒంటారీయోలో ఉన్న ఆరెంజ్‌విల్లాకు మార్చారు, ఎందుకంటే అక్కడ ఒక సంఘం ఉంది.

ఆ రోజుల్లో, పిల్లలు సంఘ కూటాలకు హాజరవ్వాలని ప్రోత్సహించబడేవారు కాదు; సాధారణంగా వారు కూటం జరిగే స్థలం బయట ఉండి కూటం అయిపోయేంతవరకు ఆడుకునేవారు. కానీ నాన్నగారికి అది నచ్చలేదు. “కూటాలు నాకు మంచివైతే, నా పిల్లలకు కూడా మంచివే” అని ఆయన అనుకున్నారు. కాబట్టి, మేము సంఘంతో క్రొత్తగా సహవసిస్తున్నప్పటికీ మా అన్నయ్య బాబ్‌, మా అక్కలు ఎల్లా, రూబీలతో పాటు నేను కూడా పెద్దవారితో కలిసి కూటాలకు హాజరవ్వాలని నాన్నగారు మాకు చెప్పారు, మేము అలాగే హాజరయ్యాము. కొంత కాలానికి, ఇతర సాక్షుల పిల్లలు కూడా కూటాలకు హాజరవ్వడం ప్రారంభించారు. కూటాలకు హాజరవ్వడం, వ్యాఖ్యానించడం మా జీవితాల్లో ఒక ప్రముఖ భాగంగా తయారయ్యాయి.

నాన్నగారికి బైబిలంటే చాలా ఇష్టం, ఆయన బైబిలు కథలను ఆహ్లాదకరమైన పద్ధతిలో చక్కగా నటించి చూపించేవారు. ఈ ప్రదర్శనల ద్వారా ఆయన మా లేత మనస్సులపై ప్రాముఖ్యమైన పాఠాలను గాఢంగా ముద్రించారు, ఆ పాఠాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. వాటిలో, యెహోవా తనకు విధేయత చూపేవారిని ఆశీర్వదిస్తాడు అన్న పాఠం నాకు బాగా గుర్తుంది.

మా విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి బైబిలును ఎలా ఉపయోగించాలో కూడా నాన్నగారు మాకు నేర్పించారు. మేము దాన్ని ఒక ఆటలా ఆడేవాళ్ళం. నాన్నగారు, “నేను చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్తాను అని నమ్ముతున్నాను. కానీ నేను పరలోకానికి వెళ్ళనని మీరు ఇప్పుడు నాకు రుజువుచెయ్యండి” అనేవారు. ఆ బోధ తప్పు అని నిరూపించడానికి మేము ఉపయోగించగల లేఖనాలను కనుగొనడానికి రూబీ, నేను కాంకార్డెన్స్‌లో వెదికేవాళ్ళం. మేము కనుగొన్న లేఖనాలను ఆయనకు చదివి వినిపించిన తర్వాత, “ఇది చాలా ఆసక్తికరంగా ఉంది, కానీ నాకు ఇంకా నమ్మకం కుదరడం లేదు” అనేవారు. మేము మళ్ళీ లేఖనాల కోసం కాంకార్డెన్స్‌లో వెదకడం ప్రారంభించేవాళ్ళం. మేము ఇచ్చే సమాధానాలు నాన్నగారికి సంతృప్తిగా అనిపించేంత వరకూ అలా గంటల తరబడి మేము వెదుకుతూనే ఉండేవాళ్ళం. తత్ఫలితంగా, మా నమ్మకాలను వివరించడానికీ మా విశ్వాసాన్ని సమర్థించుకోవడానికీ రూబీ, నేను సర్వసన్నద్ధులమయ్యాము.

మనుష్యులకు భయపడడాన్ని అధిగమించడం

ఇంటిలోనూ సంఘ కూటాల్లోనూ నాకు మంచి శిక్షణ లభించినప్పటికీ క్రైస్తవురాలిగా నేను చేయవలసిన కొన్ని అంశాలు నాకు కష్టంగా ఉండేవని నేను అంగీకరించాల్సిందే. చాలామంది యౌవనస్థుల్లా ఇతరుల నుండి ప్రత్యేకించి నా క్లాస్‌మేట్స్‌ నుండి వేరుగా ఉండడాన్ని నేను ఇష్టపడేదాన్ని కాదు. నా విశ్వాసానికి వచ్చిన తొలి పరీక్ష, సమాచార ప్రదర్శనలు అని మేము పిలిచే ప్రదర్శనలకు సంబంధించినది.

ఈ ప్రదర్శనల్లో సహోదర సహోదరీల గుంపు, నినాదాలు వ్రాసివున్న అట్టలను పట్టుకుని ముఖ్యమైన వీధులగుండా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలి. మా నగరంలో దాదాపు 3,000 మంది జనాభా మాత్రమే ఉండేవారు కాబట్టి అందరూ ఒకరికొకరు తెలుసు. ఒక సమాచార ప్రదర్శనలో “మతం ఒక ఉరి, అదొక కుంభకోణం” అని వ్రాసివున్న అట్టను పట్టుకుని నేను లైను చివర నడుస్తున్నాను. నా స్కూల్‌పిల్లలు కొందరు నన్ను చూసి వెంటనే వచ్చి లైనులో నా వెనుక నిలబడి అప్పట్లో కెనడా జాతీయగీతమైన “గాడ్‌ సేవ్‌ ద కింగ్‌” అనే గీతాన్ని పాడడం మొదలుపెట్టారు. నేను ఆ పరిస్థితితో ఎలా వ్యవహరించాను? కొనసాగేందుకు శక్తినివ్వమని పట్టుదలతో ప్రార్థించాను. చివరకు ప్రదర్శన ముగిసిన తర్వాత, నా దగ్గరవున్న అట్టను తిరిగి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడానికి నేను త్వరగా రాజ్యమందిరానికి వెళ్ళాను. అయితే, అక్కడున్న సహోదరుడు ఇంకొక ప్రదర్శన మొదలవ్వబోతోందనీ అందులో ఒక అట్ట పట్టుకోవడానికి మరో వ్యక్తి అవసరమనీ చెప్పాడు. నేను మరింత పట్టుదలతో ప్రార్థించుకుని మళ్ళీ బయలుదేరాను. అయితే, ఆ సమయానికల్లా నా క్లాస్‌మేట్‌లు అలసిపోయి అప్పటికే ఇంటికి వెళ్ళిపోయారు. శక్తినివ్వమని నేను చేసిన ప్రార్థనలు ఇప్పుడు దేవునికి కృతజ్ఞతా ప్రార్థనలుగా మారిపోయాయి.​—⁠సామెతలు 3:⁠5.

పూర్తికాల సేవకుల కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. వారు ఆనందభరితులైన ప్రజలు, వారికి ఆతిధ్యమివ్వడం మాకు ఆహ్లాదాన్నిచ్చేది. నా చిన్ననాటి జ్ఞాపకాల ప్రకారం మా తల్లిదండ్రులు పూర్తికాల సేవను శ్రేష్ఠమైన కెరీర్‌గా మా ముందుంచారు.

వారి ప్రోత్సాహానికి ప్రతిస్పందించి, 1945వ సంవత్సరంలో నేను పూర్తికాల సేవను నా కెరీర్‌గా ప్రారంభించాను. ఆ తర్వాత, లండన్‌లోని ఒంటారియోలో పయినీరు సేవ చేస్తున్న మా అక్క ఎల్లాతో కలిసి సేవచేయడం ప్రారంభించాను. అక్కడ పరిచర్య చేసే ఒక భిన్నమైన పద్ధతి నాకు పరిచయం చేయబడింది. నేను ఎప్పటికీ ఆ పని చేయలేనని అనుకున్నాను. సహోదరులు స్థానిక బార్లలో కొనుగోలుదార్లకు కావలికోట, కన్సోలేషన్‌ (ఇప్పుడు తేజరిల్లు!) పత్రికలను అందించడానికి ఒక టేబుల్‌నుండి ఇంకొక టేబుల్‌కు వెళ్ళేవారు. సంతోషకరంగా, ఆ పని శనివారం మధ్యాహ్నాలు జరిగేది, కాబట్టి నేను ఆ పనికి వెళ్ళేందుకు ధైర్యాన్నివ్వమని ప్రార్థించుకోవడానికి నాకు పూర్తి వారం ఉండేది! ఆ పని నాకు అంత సులభంగా ఏమీ అనిపించలేదు, కానీ అది ప్రతిఫలదాయకంగా ఉండేది.

మరోవైపు, నాజీ నిర్బంధ శిబిరాలలో మన సహోదరుల హింస గురించి చెబుతున్న కన్సోలేషన్‌ పత్రిక ప్రత్యేక ప్రతులను అందించడం కూడా నేను నేర్చుకున్నాను, ప్రత్యేకించి కెనడాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను, పెద్ద పెద్ద కార్పొరేషన్‌ల ప్రెసిడెంట్లను కలిసి వారికి ఆ పత్రికలను ఇవ్వడం నేర్చుకున్నాను. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, మనం శక్తి కోసం యెహోవా మీద ఆధారపడినంత కాలం ఆయన మనకు ఎల్లప్పుడూ మద్దతునిస్తాడని నేను తెలుసుకున్నాను. మా నాన్నగారు చెప్పినట్లు, యెహోవాకు విధేయత చూపేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు.

క్యూబెక్‌లో సేవచేయమని వచ్చిన ఆహ్వానానికి ప్రతిస్పందించడం

1940వ సంవత్సరం, జూలై 4వ తేదీ నుండి, కెనడాలో యెహోవాసాక్షుల పని నిషేధించబడింది. ఆ తర్వాత నిషేధం ఎత్తివేయబడినప్పటికీ రోమన్‌ క్యాథలిక్‌ ప్రాంతమైన క్యూబెక్‌లో మమ్మల్ని ఇంకా హింసిస్తూనే ఉన్నారు. అక్కడున్న మన సహోదరులకు జరుగుతున్న అన్యాయం వైపుకు అవధానం మళ్ళించడానికి ఘాటైన పదాలతో వ్రాయబడిన దేవునిపట్ల, క్రీస్తుపట్ల, స్వాతంత్ర్యంపట్ల క్యూబెక్‌కున్న రగులుతున్న ద్వేషం మొత్తం కెనడాకే సిగ్గుచేటు (ఆంగ్లం) అనే కరపత్రాన్ని ఉపయోగిస్తూ ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన నేథన్‌ హెచ్‌. నార్‌, మేము చేయబోతున్నదేమిటో వివరించడానికి మాంట్రియల్‌ పట్టణంలోని వందలాది పయినీర్లను కలిశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరిస్తే, మేము అరెస్టు చేయబడి చెరసాలలో వేయబడతామని ఎదురుచూడవచ్చని సహోదరుడు నార్‌ మాకు చెప్పారు. ఖచ్చితంగా అదే జరిగింది! ఆ సమయంలో నేను 15 సార్లు అరెస్టు చేయబడ్డాను. మేము క్షేత్రసేవ చేయడానికి బయటికి వెళ్తున్నప్పుడు, ఆ రాత్రి ఒకవేళ చెరసాలలో గడపవలసి వస్తే పనికొస్తాయని మాతోపాటు టూత్‌బ్రష్‌, దువ్వెన ఉండేలా చూసుకునేవాళ్ళం.

మొదట్లో, మా వైపుకు సాధ్యమైనంత తక్కువ అవధానం మళ్ళించబడేలా మా పనిలో చాలా భాగాన్ని రాత్రిపూటే చేసేవాళ్ళము. నా మెడమీదుగా కోటు లోపలనుండి వ్రేలాడేసుకున్న బ్యాగ్‌లో నేను కొన్ని అదనపు కరపత్రాలను తీసుకుని వెళ్ళేదాన్ని. కరపత్రాలతో నిండుగావున్న బ్యాగ్‌ చాలా లావుగా ఉండడంవల్ల నేను గర్భిణిలా కనిపించేదాన్ని. క్షేత్రానికి చేరుకోవడానికి నేను జనంతో క్రిక్కిరిసివున్న స్ట్రీట్‌కార్‌లో ఎక్కినప్పుడు ఇది నాకు చాలా ప్రయోజనకరంగా ఉండేది. చాలాసార్లు మర్యాదస్థులైన పురుషులు లేచి నుంచుని ఈ “గర్భిణి” స్త్రీకి తమ సీటు ఇచ్చేవారు.

కాలం గడుస్తున్న కొద్దీ, మేము కరపత్రాలను పంచిపెట్టే పనిలో ఉదయం పూట కూడా భాగం వహించడం ప్రారంభించాము. మేము మూడు నాలుగు తలుపుల దగ్గర కరపత్రాలను విడిచిపెట్టిన తర్వాత, మరో క్షేత్రానికి వెళ్ళేవాళ్ళము. సాధారణంగా, ఈ పద్ధతి విజయవంతంగా జరిగేది. అయితే, మేము ఆ ప్రాంతంలో ఉన్నామని రోమన్‌ క్యాథలిక్‌ ప్రీస్టుకు తెలిస్తే తప్పకుండా ఇబ్బంది కలిగించేవాడు. ఒక సందర్భంలో, ఒక ప్రీస్టు 50, 60మంది పెద్దలు పిల్లలు ఉన్న అల్లరిమూకను మాపై టమాటాలు, గ్రుడ్లు విసిరేలా ప్రేరేపించాడు. మేము ఒక క్రైస్తవ సహోదరి ఇంటిని ఆశ్రయించాము, ఆ రాత్రంతా మేము నేలపై పడుకోవలసి వచ్చింది.

క్యూబెక్‌లోని ఫ్రెంచ్‌ మాట్లాడే ప్రజలకు ప్రకటించడానికి పయినీర్ల అవసరత చాలా ఉండేది, కాబట్టి 1958, డిసెంబరులో నేనూ మా అక్క రూబీ ఫ్రెంచ్‌ భాష నేర్చుకోవడం ప్రారంభించాము. ఆ తర్వాత ఆ మండలంలోని అనేక ఫ్రెంచ్‌ భాషా ప్రాంతాలకు మేము నియమించబడ్డాము. ప్రతి నియామకం ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. ఒక ప్రాంతంలో, మేము రోజుకు ఎనిమిది గంటల చొప్పున రెండు సంవత్సరాలపాటు ఇంటింటికి వెళ్ళినా ఎవ్వరూ పలికేవారు కాదు! ప్రజలు చక్కగా తలుపు దగ్గరకు వచ్చి బ్లైండ్లు క్రిందకు దించి వెళ్ళిపోయేవారు. కానీ మేము నిరాశపడలేదు. నేడు, ఆ ప్రాంతంలో అభివృద్ధి సాధిస్తున్న రెండు సంఘాలు ఉన్నాయి.

యెహోవానుండి ప్రతివిధమైన సహాయం పొందడం

1965వ సంవత్సరం నుండి మేము ప్రత్యేక పయినీర్లుగా సేవ చేయడం ప్రారంభించాము. ఒక ప్రత్యేక పయినీరు నియామకంలో, 1 తిమోతి 6:​7, 8వ వచనంలో నమోదు చేయబడిన పౌలు వ్రాసిన ఈ మాటల పూర్తి భావాన్ని మేము అర్థం చేసుకున్నాము: “అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.” మా ఖర్చులను భరించడానికి మేము ఒక ఖచ్చితమైన బడ్జెట్‌ను అనుసరించవలసి వచ్చేది. కాబట్టి మేము రూమ్‌ను వెచ్చగా ఉంచుకోవడానికీ రెంట్‌కూ ఎలక్ట్రిసిటీకీ భోజనానికీ కొంత డబ్బు ప్రక్కకు తీసిపెట్టుకునేవాళ్ళము. ఈ అవసరాలన్నీ తీరిన తర్వాత నెలంతటికీ మాకు కావలసిన వాటికి ఖర్చుచేసుకోవడానికి మా దగ్గర 25 సెంట్లు మిగిలేవి.

డబ్బులు తక్కువగా ఉండడంవల్ల, రూమ్‌ను వెచ్చగా ఉంచుకోవడానికి హీటర్‌ను కేవలం రాత్రిపూట కొన్ని గంటలు మాత్రమే ఆన్‌చేసి ఉంచేవాళ్ళం. కాబట్టి, మా బెడ్‌రూమ్‌లో ఉష్ణోగ్రత ఎన్నడూ 15 డిగ్రీల సెల్సియస్‌ దాటేదే కాదు, తరచూ మా రూమ్‌ అంతకంటే చల్లగా కూడా ఉండేది. అయితే, ఒకరోజు రూబీ అధ్యయనం చేస్తున్న బైబిలు విద్యార్థుల్లో ఒకరి కొడుకు మమ్మల్ని కలవడానికి వచ్చాడు. ఆయన ఇంటికి వెళ్ళి తన తల్లికి మేము చాలా చలిలో ఉంటున్నామని చెప్పివుంటాడు, ఎందుకంటే నూనె కొని ఎప్పుడూ హీటర్‌ను ఆన్‌చేసి ఉంచుకునేందుకు వీలుగా అప్పటినుండి ఆమె మాకు ప్రతి నెలా మూడు వందల రూపాయలు పంపించేది. మాకు ఏ విధంగాను లేమివున్నట్లు మేము భావించలేదు. మేము ధనవంతులం కాదు, కానీ మాకు అవసరమైనవి ఎప్పుడూ ఉండేవి. మా దగ్గర ఏదైనా ఎక్కువగా ఉంటే అది ఆశీర్వాదమని భావించేవాళ్ళం. “నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు” అని కీర్తన 37:25వ వచనంలో ఉన్న మాటలు ఎంత నిజం!

మేము వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ నేను బైబిలు అధ్యయనాలు నిర్వహించిన అనేకమంది సత్యపు జ్ఞానాన్ని తెలుసుకోవడాన్ని చూసే ఆనందం నాకు లభించింది. వారిలో కొంతమంది పూర్తికాల సేవను తమ కెరీర్‌గా చేసుకోవడం నాకు ప్రత్యేక ఆనందాన్ని తెచ్చింది.

క్రొత్త సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కోవడం

1970 లో ఒంటారీయోలోని కార్న్‌వాల్‌లో మాకు క్రొత్త నియామకం లభించింది. మేము కార్న్‌వాల్‌కు వచ్చి దాదాపు ఒక సంవత్సరం గడిచిన తర్వాత, మా అమ్మ అనారోగ్యానికి గురయ్యింది. మా నాన్నగారు 1957 లో మరణించారు, 1972 లో మా అమ్మ చనిపోయేంత వరకూ ఆమెను మా ఇద్దరు అక్కలు, నేను వంతుల వారీగా చూసుకున్నాం. మా ప్రత్యేక పయినీరు భాగస్వాములైన ఎల్లా లిజిట్సా, ఆన్‌ కోలెంకో ఆ సమయంలో మేము దృఢంగా ఉండడానికి సహాయం చేసి ప్రేమపూర్వకమైన మద్దతునిచ్చారు. మేము లేని సమయాల్లో వారు మా బైబిలు అధ్యయనాలనూ ఇతర బాధ్యతలనూ చూసుకున్నారు. “సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు” అనే సామెతలు 18:24వ వచనంలోని మాటలు ఎంత నిజం!

జీవితం ఖచ్చితంగా కఠినమైన పరీక్షలతో నిండివుంటుంది. యెహోవా ప్రేమపూర్వక సహాయంతో నేను వాటిని ఎదుర్కోగలిగాను. నేను ఇప్పటికీ పూర్తికాల సేవచేస్తూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను. 1993 లో చనిపోయిన బాబ్‌, 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంపాటు పయినీరు సేవలో గడిపాడు, వాటిలో 10 విలువైన సంవత్సరాలను తన భార్య డాల్‌తో పయినీరు సేవచేస్తూ గడిపాడు. మా అక్క ఎల్లా 1998, అక్టోబరులో చనిపోయింది, ఆమె 30 సంవత్సరాలకంటే ఎక్కువ కాలంపాటు పయినీరు సేవ చేసింది, ఎప్పుడూ పయినీరు స్ఫూర్తిని కలిగివుండేది. 1991 లో మా అక్క రూబీకి కేన్సర్‌ వ్యాధి ఉందని తేలింది. అయినప్పటికీ ఆమె తనకున్న పరిమితమైన శక్తిని సువార్త ప్రకటించడానికి ఉపయోగించేది. 1999, సెప్టెంబరు 26వ తేదీ ఉదయాన తాను చనిపోయేంతవరకూ ఆమె ఉల్లాసంగానే ఉంది. మా అక్కలు ఇప్పుడు లేకపోయినప్పటికీ నేను ఉల్లాసంగా ఉండేందుకు సహాయం చేయడానికి ఆధ్యాత్మిక సహోదరసహోదరీల కుటుంబం నాకు ఉంది.

నేను నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు నేను దేన్ని మారుస్తాను? నేను పెళ్ళి చేసుకోలేదు, కానీ సత్యానికి తమ జీవితాల్లో మొదటి స్థానం ఇచ్చిన ప్రేమగల తల్లిదండ్రులు, సహోదరుడు, సహోదరీలను బట్టి నేను ఆశీర్వదించబడ్డాను. వారందర్నీ త్వరలోనే పునరుత్థానమందు చూడాలని ఎదురుచూస్తున్నాను. ఈ నిరీక్షణ నాకు ఎంత నిజమైనదిగా ఉందంటే, మా నాన్నగారు నన్ను కౌగిలించుకోవడం, నేను మా అమ్మను కౌగిలించుకుంటుంటే ఆమె కళ్ళనుంచి భాష్పాలు రాలడం నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఎల్లా, రూబీ, బాబ్‌లు ఆనందంతో గంతులు వేస్తుంటారు.

అప్పటివరకూ, నాకు మిగిలివున్న ఈ ఆరోగ్యాన్నీ శక్తినీ యెహోవాను స్తుతించడానికీ ఘనపర్చడానికీ ఉపయోగించడంలో కొనసాగాలనుకుంటున్నాను. పూర్తికాల పయినీరు సేవ అద్భుతమైన ప్రతిఫలదాయకమైన జీవితం. యెహోవా మార్గాల్లో నడిచేవారి గురించి కీర్తనకర్త చెప్పినట్లే ఉంటుంది ఆ జీవితం: “నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.”​—⁠కీర్తన 128:⁠1, 2.

[26వ పేజీలోని చిత్రాలు]

నాన్నగారికి బైబిలంటే చాలా ఇష్టం. మా విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి దాన్ని ఎలా ఉపయోగించాలో మాకు నేర్పించారు

[28వ పేజీలోని చిత్రం]

ఎడమనుండి కుడివైపుకు: రూబీ, నేను, బాబ్‌, ఎల్లా, అమ్మ, నాన్నగారు, 1947 లో

[28వ పేజీలోని చిత్రం]

ముందు వరుస, ఎడమనుండి కుడివైపుకు: ఒక జిల్లా సమావేశం దగ్గర నేను, రూబీ, ఎల్లా, 1998