కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పొరుగువారంతా ఏమైపోయారు?

పొరుగువారంతా ఏమైపోయారు?

పొరుగువారంతా ఏమైపోయారు?

“ఆధునిక సమాజం పొరుగువారిని ఎరుగదు.”​—⁠బెంజమిన్‌ డిశ్రాయేలి, 19వ శతాబ్దపు ఆంగ్ల రాజనీతిజ్ఞుడు.

క్యూబా ద్వీపవాసులలోని వృద్ధులు అసాధారణమైన రీతిలో, ఇరుగుపొరుగు నెట్‌వర్క్‌లని లేదా తాతామామ్మల గుంపులని పిలువబడే వివిధ గుంపుల ద్వారా సమాజ సంక్షేమాన్ని ప్రోత్సహిస్తారు. 1997వ సంవత్సరంలోని ఒక నివేదిక ప్రకారం, క్యూబా ద్వీపంలో నివసించే వృద్ధుల్లోని ఐదుగురిలో ఒకరు అలాంటి గుంపులకు చెందినవారే, ఆ గుంపుల్లో వారు ఆరోగ్యకరమైన జీవితవిధానంలో కొనసాగడానికి కావలసిన సహవాసాన్నీ మద్దతునూ ఆచరణాత్మక సహాయాన్నీ పొందుతారు. “ఇరుగుపొరుగున ఉన్న ఫ్యామిలీ డాక్టర్లకు వాక్సినేషన్‌కు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమానికి సహాయం అవసరమైనప్పుడల్లా, సహాయం చేయడానికి సుముఖంగా ఉండే సమర్థులైన వ్యక్తులు ఈ తాతామామ్మల గుంపుల్లోనే లభిస్తారు” అని వరల్డ్‌-హెల్త్‌ పత్రిక చెబుతోంది.

అయితే, విచారకరంగా ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో పొరుగువారి మీద శ్రద్ధ చూపే ఇలాంటి సమాజాలు ఇప్పుడు లేవు. ఉదాహరణకు, పశ్చిమ యూరప్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లో నివసించిన వుల్ఫ్‌గాంగ్‌ డ్రిక్స్‌ అనే వ్యక్తికి సంబంధించిన విషాదకరమైన సంఘటననే తీసుకోండి. వుల్ఫ్‌గాంగ్‌ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే నివసిస్తున్న 17 కుటుంబాలు, ఆయన చాలారోజుల నుండి కనపడడంలేదని గమనించినప్పటికీ “ఆయన ఇంటి తలుపు తట్టాలని ఎవ్వరికీ అనిపించలేదు” అని ద కాన్‌బెర్రా టైమ్స్‌ కొన్ని సంవత్సరాల క్రితం నివేదించింది. చివరికి ఆ అపార్ట్‌మెంట్‌ ఓనరు అక్కడికి వచ్చినప్పుడు ఆయనకు “టీ.వీ. ముందు కూర్చుని వున్న ఒక అస్థిపంజరం కనిపించింది.” ఆ అస్థిపంజరం ఒడిలో టీ.వీ. కార్యక్రమాల వివరాలున్న 1993, డిసెంబరు 5 నాటి పత్రిక ఉంది. వుల్ఫ్‌గాంగ్‌ చనిపోయి అప్పటికి ఐదు సంవత్సరాలు అయ్యింది. స్నేహపూర్వకమైన ఆసక్తి, శ్రద్ధ విషయంలో వైఫల్యానికి ఎంత విచారకరమైన ధృవీకరణ! ద న్యూయార్క్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌లో ఒక రచయిత, తానుంటున్న స్థానిక సమాజం కూడా అనేక ఇతర సమాజాలవలే “అపరిచితుల సమాజం”గా తయారయ్యిందని పేర్కొనడంలో ఆశ్చర్యం లేదు. మీ ఇరుగుపొరుగున కూడా ఇదే పరిస్థితి ఉందా?

కొన్ని గ్రామీణ సమాజాలు ఇప్పటికీ యథార్థమైన స్నేహశీలతను అనుభవిస్తున్నాయన్నది, కొన్ని పట్టణ సమాజాలు పొరుగువారిపై మరింత శ్రద్ధ కనబర్చడానికి కృషి చేస్తున్నాయన్నది నిజం. అయినప్పటికీ, పట్టణాలలో నివసిస్తున్న చాలామంది తమ స్వంత ఇరుగుపొరుగునే తాము ఒంటరివారైపోయినట్లు, ప్రమాదానికి గురయ్యే స్థితిలో ఉన్నట్లు భావిస్తున్నారు. వారు అజ్ఞాత గోడల వెనుక ఒంటరివారైపోయారు. అదెలా?

అజ్ఞాత గోడల వెనుక

నిజమే, మనకందరికీ సమీపంలో నివసిస్తున్న పొరుగువారు ఉన్నారు. టీ.వీ. నుండి వచ్చే మిణుకుమిణుకుమనే వెలుగు, కిటీకీల దగ్గర కదిలే నీడలు, ఆన్‌ చేయబడి ఆఫ్‌ చేయబడే లైట్లు, వచ్చీ పోయే కార్ల శబ్దాలు, కారిడార్‌లలో అడుగుల చప్పుడు, తలుపులు తెరుచుకోవడం మూసుకోవడం, ఇవన్నీ ఇరుగుపొరుగు అంతా “సజీవంగా” ఉందనడానికి సూచనలు. అయితే, సమీపంలో నివసిస్తున్న ప్రజలు అజ్ఞాత గోడల వెనుక దాక్కున్నప్పుడు లేదా చాలా బిజీగా ఉండే తమ జీవన విధానంలో ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకున్నప్పుడు, పొరుగువారు చూపించవలసిన శ్రద్ధకున్న నిజమైన అర్థం మటుమాయమైపోతుంది. పొరుగువారితో ఏ విధమైన సంబంధాలు పెట్టుకోనవసరం లేదనీ ఏ విధంగానూ వారికి తాము ఋణపడి ఉండవలసిన అవసరం లేదనీ ప్రజలు భావించవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన హెరాల్డ్‌ సన్‌ అనే వార్తాపత్రిక ఇలా ఒప్పుకుంటోంది: “వ్యక్తులు తమ చుట్టుప్రక్కలనున్న ప్రాంతాల్లో మరింత అజ్ఞాతంగా ఉంటున్నారు, కాబట్టి సామాజిక బాధ్యతా బంధాలకు వారు తక్కువ కట్టుబడి ఉంటున్నారు. సామాజికంగా ఆకర్షణీయంగా లేని ప్రజలను నిర్లక్ష్యం చేయడం లేదా వారిని వేరుగా ఉంచడం ఇప్పుడు చాలా సులభం.”

ఈ పరిస్థితి ఆశ్చర్యకరమైనది కాదు. ప్రజలు “స్వార్థప్రియులు”గా ఉన్న ఈ లోకంలో, అలాంటివారు కేవలం తమకోసమే జీవిస్తుండడం వల్ల వచ్చే పర్యవసానాల ప్రభావం ఇరుగుపొరుగువారి మీద పడుతోంది. (2 తిమోతి 3:⁠2) దాని ఫలితం, అంతటా వ్యాపించివున్న ఒంటరితనం, ఒకరికి ఒకరు దూరమైపోవడమే. ఇలా ఒకరినుండి మరొకరు దూరమవ్వడం ఒకరి మీద మరొకరికి నమ్మకం లేకుండా చేస్తుంది, ప్రత్యేకించి దౌర్జన్యం, నేరం ఇరుగుపొరుగువారిని విడువక ప్రమాదంలో పడేస్తుంటే పరిస్థితి అలానే ఉంటుంది. ఆ అపనమ్మకం మానవ కనికరాన్ని నశింపజేస్తుంది.

మీ ఇరుగుపొరుగున పరిస్థితి ఏదైనప్పటికీ మంచి పొరుగువారు సమాజానికి విలువైనవారని మీరు నిస్సందేహంగా అంగీకరిస్తారు. ప్రజలు ఒకే గమ్యాన్ని చేరుకోవడానికి కృషిచేస్తే ఎంతో సాధించవచ్చు. మంచి పొరుగువారు ఒక ఆశీర్వాదంగా కూడా ఉండగలరు. అదెలాగో తర్వాతి ఆర్టికల్‌ చూపిస్తుంది.