మంచి పొరుగువారు ఒక ఆశీర్వాదం
మంచి పొరుగువారు ఒక ఆశీర్వాదం
“దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి.”—సామెతలు 27:10.
సా.శ. మొదటి శతాబ్దానికి చెందిన ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ‘నా పొరుగువాడెవడు?’ అని యేసును అడిగాడు. దానికి సమాధానంగా యేసు అతని పొరుగువాడు ఎవరో చెప్పలేదు కానీ ఒక వ్యక్తిని నిజమైన పొరుగువానిగా ఏది చేస్తుందో చెప్పాడు. యేసు చెప్పిన ఉపమానం గురించి మీకు తెలిసే ఉంటుంది. మంచి సమరయుని దృష్టాంతంగా చాలామందికి తెలిసిన ఆ ఉపమానం లూకా సువార్తలో నమోదుచేయబడి ఉంది. యేసు ఆ కథను ఇలా చెప్పాడు:
“ఒక మనుష్యుడు యెరూషలేమునుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగలచేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూటకూళ్లవానికిచ్చి—ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది?”—లూకా 10:29-36.
లూకా 10:37) నిజమైన పొరుగువానిగా ఉండడమంటే ఏమిటో తెలియజేసే ఎంత శక్తివంతమైన ఉపమానం! యేసు చెప్పిన ఉపమానం, మనం వ్యక్తిగతంగా ఇలా ప్రశ్నించుకోవడానికి మనలను పురికొల్పవచ్చు: ‘నేను ఎటువంటి పొరుగువాడిని? నా పొరుగువారు ఎవరో నిర్ణయించుకునేటప్పుడు నా జాతి నేపథ్యంగానీ జాతీయ నేపథ్యంగానీ నన్ను ప్రభావితం చేస్తున్నాయా? కష్టంలోవున్న పొరుగువారిని చూసినప్పుడు వారికి సహాయపడవలసిన నా బాధ్యతను ఇలాంటి విషయాలు పరిమితం చేస్తున్నాయా? మంచి పొరుగువానిగా ఉండడానికి నేను అసాధారణమైన కృషి చేస్తానా?’
ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఉపమాన సారాంశాన్ని అర్థం చేసుకున్నాడన్నది స్పష్టమవుతుంది. ఆయన నిస్సంశయంగా, గాయపడిన వ్యక్తికి పొరుగువాడు “అతనిమీద జాలిపడినవాడే” అని సరిగ్గా గుర్తుపట్టాడు. ఆ తర్వాత యేసు ఆయనకు “నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను.” (ఎక్కడ ప్రారంభించాలి?
ఈ విషయంలో మనం మెరుగుపర్చుకోవాల్సిన అవసరత ఉందని మనకనిపిస్తే, మనం మన మనోవైఖరిని మెరుగుపర్చుకోవడం ద్వారా ప్రారంభించాలి. మంచి పొరుగువారిగా ఉండే విషయంపై మన శ్రద్ధ కేంద్రీకరించబడి ఉండాలి. మనం మంచి పొరుగువారిని కలిగివుండేందుకు కూడా ఇది సహాయపడగలదు. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం, యేసు తాను కొండ మీద ఇచ్చిన ప్రసంగంలో మానవ సంబంధాల గురించిన ఆ ప్రాముఖ్యమైన సూత్రాన్ని నొక్కి చెప్పాడు. “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి” అని ఆయన చెప్పాడు. (మత్తయి 7:12) ఇతరులతో గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా దయాపూర్వకంగా వ్యవహరించడం, వారు కూడా మీతో అదేవిధంగా వ్యవహరించేందుకు వారిని ప్రోత్సహిస్తుంది.
ద నేషన్ సిన్స్ 1865 అనే పత్రికలో వచ్చిన “మీ పొరుగువారిని ప్రేమించడం” (ఆంగ్లం) అనే ఆర్టికల్‌లో, ఇరుగుపొరుగువారి మధ్య స్నేహశీలతను ప్రోత్సహించడానికి చేయదగిన సరళమైన విషయాలను కొన్నింటిని రచయిత్రి, విలేఖరి అయిన లిసే ఫండర్‌బర్గ్ ప్రస్తావించింది. ఆమె ఇలా వ్రాసింది: “ఇంటి ముందున్న వార్తాపత్రికలను తీసి వారి చేతికివ్వడం, తల్లిదండ్రులు బయటకు వెళ్ళినప్పుడు పిల్లలను చూసుకోవడం, దుకాణం నుండి ఏమైనా తీసుకురావడం వంటి దయతో కూడిన అనేక చిన్న చిన్న పనులను ఇరుగుపొరుగునున్నవారు ఒకరి కోసం ఒకరు చేసుకోవడం ద్వారా పొరుగువారితో తమకున్న వ్యక్తిగత సంబంధం వ్యక్తపర్చబడాలి . . . అన్నదే నా కోరిక. ప్రజలు ఒకరినుండి మరొకరు ఎంతో దూరమైపోతున్న ఈ లోకంలో, భయాలతో నేరాలతో భద్రత లేకుండా పోవడంవల్ల సమాజాలు బలహీనమైపోయాయి. ఈ లోకంలో నాకు ఇలాంటి సంబంధాలు కావాలి.” ఆమె ఇంకా ఇలా అంటుంది: “మీరు ఎక్కడో ఒకచోట ప్రారంభించాలి. అది మీ పొరుగువారితోనే ప్రారంభించవచ్చు.”
కెనెడియన్ జియోగ్రఫిక్ అనే పత్రిక, పొరుగువారు ఒకరిపట్ల ఒకరు ఆరోగ్యకరమైన వైఖరిని పెంపొందించుకోవడానికి సహాయకరంగా ఉండే ఒక విషయాన్ని చెప్పింది. రచయిత మార్నీ జాక్సన్ తన అభిప్రాయాన్ని ఇలా చెప్పింది: “మీరు మీ కుటుంబ సభ్యులను ఎలాగైతే ఎంపిక చేసుకోలేరో అలాగే అన్నివేళలా మీ పొరుగువారిని ఎంపిక చేసుకోలేరు. ఈ సంబంధాలకు నేర్పు, సహాయకరమైన చర్యలు, ఇతరుల నమ్మకాలు మన నమ్మకాలతో కలవకపోయినా వారిపట్ల సహానుభూతి చూపడం అవసరం.”
మంచి పొరుగువారు—ఇష్టపూర్వకంగా ఇచ్చేవారు
నిజమే, మనలో చాలామందిమి మన పొరుగువారిని సమీపించడానికి ఇబ్బంది పడుతుండవచ్చు. వారితో కలవకుండా, మనల్ని మనం వేరుపర్చుకోవడం ఎంతో సులభం అనిపించవచ్చు. కానీ “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని బైబిలు చెబుతుంది. (అపొస్తలుల కార్యములు 20:35) కాబట్టి, మంచి పొరుగువారు తమ చుట్టూ ఉన్న ప్రజలతో పరిచయం పెంచుకునేందుకు కృషిచేయడానికి ప్రయత్నిస్తారు. పొరుగువారితో తప్పనిసరిగా చాలా దగ్గరి స్నేహా బంధాలను పెంపొందించుకోవాలని కాకపోయినా, బహుశా స్నేహపూర్వకంగా చిరునవ్వు చిందించడం, చెయ్యి ఊపడం వంటివాటితో మొదలుపెట్టి అప్పుడప్పుడు ఆహ్లాదకరంగా సంభాషిస్తారు.
పైన నివేదించబడినట్లు, ఇరుగుపొరుగువారు ఒకరి కోసం మరొకరు చేసుకునే “దయతో కూడిన అనేక చిన్న చిన్న పనులు” స్నేహ సంబంధాలను నెలకొల్పుకుని వాటిని కొనసాగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. కాబట్టి మీరు మీ పొరుగువారి కోసం చేయగల దయాపూర్వకమైన పనుల గురించి ఆలోచించడం మంచిది, అలా చేయడం తరచూ సహకార స్ఫూర్తికీ పరస్పర గౌరవానికీ దారితీస్తుంది. అంతేకాకుండా, అలా చేయడం ద్వారా మనం బైబిలు ఇస్తున్న ఈ ఉపదేశాన్ని అనుసరిస్తాము: “మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.”—సామెతలు 3:27; యాకోబు 2:14-17.
మంచి పొరుగువారు—మెప్పుదలతో స్వీకరించేవారు
ప్రతి ఒక్కరూ సహాయాన్నీ బహుమానాలనూ కృతజ్ఞతా భావంతో స్వీకరిస్తారని మనం చెప్పగలిగితే బాగానే ఉంటుంది. కానీ విచారకరంగా అన్నిసార్లూ అలా జరగదు. చాలాసార్లు సహాయం చేస్తామన్నప్పుడు గానీ మంచి ఉద్దేశంతోనే బహుమానాలు ఇచ్చినప్పుడు గానీ వాటిని ఏమాత్రం
మెప్పుదల లేకుండా స్వీకరిస్తుంటారు, అప్పుడు యథార్థంగా ఇచ్చిన వ్యక్తి, “మళ్ళీ ఇంకెప్పుడూ అలా చేయను!” అని అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో, మీరు స్నేహపూర్వకంగా పలకరించినప్పుడు గానీ మీ పొరుగువారిని చూసి చెయ్యి ఊపినప్పుడు గానీ అవతలివారు తమకు ఇష్టంలేదని సూచిస్తూ కేవలం తల ఊపవచ్చు.అయినప్పటికీ చాలా సందర్భాల్లో, స్వీకరించేవారు పైకి అలా కనపడినప్పటికీ వారికి మెప్పుదల లేదని కాదు. బహుశా ఆయన సాంస్కృతిక నేపథ్యం ఆయన అలా వెనకాడేలా లేదా ఇబ్బందిపడేలా చేయవచ్చు, తనకేమీ పట్టనట్టు ప్రవర్తించేలా చేయవచ్చు, ఇది మనకు స్నేహపూర్వకంగా లేదన్నట్లు కనిపించవచ్చు. మరోవైపు కృతజ్ఞతలేని ఈ లోకంలో, కొంతమంది మీ స్నేహశీలతను అసాధారణమైనదిగా పరిగణించవచ్చు, మీ ఉద్దేశాలను కూడా వారు తప్పుపట్టవచ్చు. వారికి కొంత హామీ అవసరమవ్వవచ్చు. కాబట్టి, స్నేహపూర్వక సంబంధాలను ఏర్పర్చుకోవడానికి సమయం, సహనం అవసరం. అయితే మంచిగా ఇచ్చేవారిగా, మంచిగా స్వీకరించేవారిగా ఉండే కళను నేర్చుకునే పొరుగువారు, ఇరుగుపొరుగున శాంతియుతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొనడానికి మద్దతునివ్వడంలో తమ వంతు తాము చేస్తారు.
విపత్తు సంభవించినప్పుడు
ప్రత్యేకించి దుర్ఘటనలు సంభవించినప్పుడు మంచి పొరుగువారు ఒక విలువైన ఆశీర్వాదంగా ఉండగలరు. విపత్కర సమయాల్లో, పొరుగువారికుండవలసిన నిజమైన స్ఫూర్తి వెల్లడవుతుంది. ఇలాంటి సమయాల్లో పొరుగువారు చేసిన నిస్వార్థమైన పనుల గురించిన నివేదికలు ఎన్నో ఉన్నాయి. అందరికీ ఒకేసారి సంభవించిన విపత్తు, పొరుగువారు ఒకరితో ఒకరు వెంటనే సహకరించుకోవడానికీ ఒకరి కోసం ఒకరు కష్టపడడానికీ కారణమైనట్లు కనిపిస్తుంది. ఆ సమయంలో భిన్నమైన దృక్కోణాలున్నవారు కూడా తరచూ కలిసి పనిచేస్తారు.
ఉదాహరణకు 1999 లో టర్కీలో వినాశకరమైన భూకంపం సంభవించినప్పుడు, ఎంతోకాలంగా శత్రువులుగా ఉన్నవారు కూడా స్నేహభావంతో ఐక్యమయ్యారని ద న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అన్నా స్టార్‌యేయూ అనే గ్రీక్ పత్రికా విలేఖరి ఒక ఏథెన్సు వార్తాపత్రికలో ఇలా వ్రాసింది: “టర్కీ ప్రజలను ద్వేషించాలని మాకు ఎన్నో సంవత్సరాలుగా నేర్పించబడింది. కానీ వారు అనుభవిస్తున్న అసాధారణమైన బాధ మాకు సంతోషాన్నివ్వదు. మేము ఆందోళన చెందాము, చనిపోయిన శిశువులను చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మా ద్వేషం అదృశ్యమైపోయినట్లుగా మేము ఏడ్చాము.” సహాయ కార్యకలాపాలు ఆధికారికంగా నిలిపి వేయబడినప్పడు, గ్రీస్ రక్షక దళాలు బ్రతికివున్నవారి కోసం గాలించడాన్ని నిలిపివేయడానికి నిరాకరించాయి.
విపత్తు సంభవించిన తర్వాత రక్షక పనిలో భాగం వహించడం ఖచ్చితంగా ఉన్నతమైన, సాహసోపేతమైన, స్నేహపూర్వకమైన పనే. అయితే విపత్తు సంభవించడానికి ముందే హెచ్చరించడం ద్వారా పొరుగువారి ప్రాణాల్ని కాపాడడం, మరింత విలువైన స్నేహపూర్వకమైన పనిగా తప్పకుండా పరిగణించబడగలదు. విచారకరంగా, హెచ్చరించే సమయంలో, రాబోయే విపత్తు వెంటనే గ్రహించగలిగేలా ఉండదు కాబట్టి తమ పొరుగువారిని రాబోయే విపత్తుల గురించి హెచ్చరించేవారు తరచూ సంతోషంతో స్వీకరించబడరని చరిత్ర వెల్లడిచేస్తోంది. హెచ్చరించేవారు తరచూ తిరస్కరించబడతారు. తామున్న ప్రమాదకరమైన పరిస్థితి గురించి తెలియని ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నించేవారెవరైనా ఎంతో పట్టుదలతో స్వయంత్యాగ స్ఫూర్తితో పనిచేయవలసి ఉంటుంది.
అతిగొప్ప స్నేహపూర్వకమైన పని
ఈనాడు, ప్రకృతి వైపరీత్యాల కంటే ఎంతో గమనార్హమైనది మానవజాతి పైకి రాబోతోంది. అదేమిటంటే, భూమి మీద నుండి నేరాలనూ దుష్టత్వాన్నీ తత్సంబంధిత ఇతర సమస్యలనూ తీసివేయడానికి సర్వశక్తిగల దేవుడు తీసుకుంటాడని ప్రవచింపబడిన చర్య. (ప్రకటన 16:15, 16; 21:3, 4) ఈ గమనార్హమైన సంఘటన, జరిగే అవకాశం చాలా తక్కువగా ఉన్న సంఘటన కాదు, అది ఖచ్చితంగా జరుగుతుంది! ప్రపంచాన్నంతటినీ కదిలించే రాబోయే ఈ సంఘటన నుండి తప్పించుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని ఎంతమందితో సాధ్యమైతే అంతమందితోనూ పంచుకోవడానికి యెహోవాసాక్షులు ఆతురతతో ఉన్నారు. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రకటనా పనిలో వారు అంత పట్టుదలతో భాగం వహిస్తున్నారు. (మత్తయి 24:14) వారు ఈ పనిని ఇష్టపూర్వకంగానూ దేవునిపట్ల, పొరుగువారిపట్ల తమకున్న ప్రేమను బట్టీ చేస్తున్నారు.
కాబట్టి, సాక్షులు మీ ఇంటికి వచ్చినప్పుడు లేదా మరెక్కడైనా మిమ్మల్ని కలిసినప్పుడు వారు చెప్పేది మీరు వినకుండా పక్షపాతం గానీ విసుగు గానీ మిమ్మల్ని ఆటంకపర్చడానికి అనుమతించకండి. వారు మంచి పొరుగువారిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి, మీతో బైబిలు అధ్యయనం చేస్తామని వారు కోరినప్పుడు దానికి అంగీకరించండి. ఇరుగుపొరుగువారు భవిష్యత్తులో సంతోషంగా కలిసి జీవించడం త్వరలోనే జరగబోతోందని దేవుని వాక్యం ఎలా హామీ ఇస్తుందో నేర్చుకోండి. ఆ సమయంలో మనమందరం నిజంగా కోరుకునే స్నేహపూర్వకమైన సంబంధాలను జాతిపరమైన మతపరమైన లేదా వర్గపరమైన విభజనలు ఇక ఏమాత్రం పాడుచేయవు.
[6, 7వ పేజీలోని చిత్రాలు]
మీ ఇరుగుపొరుగులో దయతో కూడిన పనులు చేయడం మంచిది
[చిత్రసౌజన్యం]
భూగోళం: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.