కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన పరిశుద్ధులు మీకెలా సహాయం చేయగలరు?

నిజమైన పరిశుద్ధులు మీకెలా సహాయం చేయగలరు?

నిజమైన పరిశుద్ధులు మీకెలా సహాయం చేయగలరు?

లేఖనాల్లో “పరిశుద్ధుడు” అని అనువదించబడిన గ్రీకు పదం ఎవరిని సూచిస్తుంది? “ఆ పదం విశ్వాసులకు సంబంధించి ఉపయోగించబడినట్లు బహువచనంలో ఉపయోగించబడినప్పుడు, కేవలం అసాధారణమైన పవిత్రత ఉన్న వ్యక్తులనో విశేషమైన సాహసోపేతమైన పనులకు పేరొంది చనిపోయిన వ్యక్తులనో మాత్రమే కాదు గానీ విశ్వాసులందరినీ సూచిస్తుంది” అని యాన్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్టమెంట్‌ వర్డ్స్‌ వ్యాఖ్యానిస్తుంది.

కాబట్టి అపొస్తలుడైన పౌలు తొలి క్రైస్తవులందరినీ నిజమైన పరిశుద్ధులు అని పేర్కొన్నాడు. ఉదాహరణకు సా.శ. మొదటి శతాబ్దంలో ‘కొరింథులోనున్న దేవుని సంఘమును, [రోమా మండలమైన] అకయయందంతటనున్న పరిశుద్ధులందరిని’ సంబోధిస్తూ ఒక పత్రికను వ్రాశాడు. (2 కొరింథీయులు 1:​1) ఆ తర్వాత పౌలు, “రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికి” ఒక పత్రిక వ్రాశాడు. (రోమీయులు 1:⁠2-7) ఇక్కడ ప్రస్తావించబడిన పరిశుద్ధులు అప్పటికింకా చనిపోలేదనీ అంతేకాకుండా వారికున్న గమనార్హమైన సద్గుణాలనుబట్టి వారు మిగతా విశ్వాసులకంటే ఉన్నతమైనవారిగా వర్గీకరించబడలేదనీ స్పష్టమవుతోంది. మరి దేని ఆధారంగా వారు పరిశుద్ధులుగా వర్గీకరించబడ్డారు?

దేవుని ద్వారా పవిత్రపర్చబడ్డారు

ఒక వ్యక్తి మనుష్యుల ద్వారా గానీ ఒక సంస్థ ద్వారా గానీ పరిశుద్ధునిగా ప్రకటించబడడు అని దేవుని వాక్యం చూపిస్తుంది. ‘మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమునుబట్టియు, తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో [దేవుడు] మనలను పిలిచెను’ అని లేఖనాలు పేర్కొంటున్నాయి. (2 తిమోతి 1:⁠9, 10) ఒక పరిశుద్ధుడు యెహోవా దేవుని పిలుపునుబట్టీ ఆయన అనర్హదయనుబట్టీ ఆయన సంకల్పానికి పొందికగా పవిత్రపర్చబడతాడు.

క్రైస్తవ సంఘానికి చెందిన పరిశుద్ధులు, ఒక “క్రొత్తనిబంధన”లో భాగస్థులు. యేసుక్రీస్తు చిందించిన రక్తం ఈ నిబంధనను స్థిరపరుస్తుంది, దానిలో భాగం వహించేవారిని పవిత్రపరుస్తుంది. (హెబ్రీయులు 9:​15; 10:​29; 13:​20, 21, 24) దేవుని దృష్టిలో పరిశుద్ధపర్చబడిన వీరు, ‘యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా’ ఉంటారు.​—⁠1 పేతురు 2:⁠5, 9.

సహాయానికీ మధ్యవర్తిత్వానికీ పరిశుద్ధులను అభ్యర్థించడం

“పరిశుద్ధులు” విశ్వాసులకు ప్రత్యేకమైన శక్తులను అనుగ్రహించగలరనే నమ్మకంతో కోట్లాదిమంది వారి స్మృతి చిహ్నాలను ఉపయోగించడం ద్వారా లేక వారిని మధ్యవర్తిత్వం చేయమని అభ్యర్థించడం ద్వారా వారిని పూజిస్తారు. ఇది బైబిలు బోధా? యేసు తాను కొండ మీద ఇచ్చిన ప్రసంగంలో, దేవుణ్ణి ఎలా సమీపించాలో తన శిష్యులకు బోధిస్తూ ఇలా చెప్పాడు: “కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి​—⁠పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక!” (మత్తయి 6:​9, 10) కేవలం యెహోవా దేవునికి మాత్రమే ప్రార్థనలు చేయడం సరైనది.

“పరిశుద్ధుల” మధ్యవర్తిత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తూ కొంతమంది తత్వవేత్తలు, రోమీయులు 15:​30-32 వచనాలను ఉదహరిస్తారు, ఆ వచనాల్లో మనమిలా చదువుతాము: “సహోదరులారా, . . . మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.” దేవుణ్ణి సమీపించడానికి తనకు ప్రార్థన చేయమని లేదా తన పేరున అభ్యర్థించమని ఆ విశ్వాసులను పౌలు ప్రోత్సహిస్తున్నాడా? లేదు. బైబిలులో నిజమైన పరిశుద్ధుల కొరకు చేయబడిన ప్రార్థనలు ప్రోత్సహించబడినప్పటికీ అలాంటి పరిశుద్ధులకే ప్రత్యక్షంగా ప్రార్థన చేయమని లేదా వారి ద్వారా ప్రార్థన చేయమని దేవుడు మనకు ఎక్కడా ఆజ్ఞాపించలేదు.​—⁠ఫిలిప్పీయులు 1:⁠1, 3-6.

అయితే, మన ప్రార్థనలకు దేవుడు ఒక మధ్యవర్తిని నియమించాడు. “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని యేసుక్రీస్తు చెప్పాడు. “మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును” అని కూడా ఆయన పేర్కొన్నాడు. (యోహాను 14:​6, 13, 14) యేసు నామములో చేయబడిన ప్రార్థనలను వినడానికి యెహోవా చూపే సుముఖత విషయమై మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు. “ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనముచేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు” అని యేసు గురించి బైబిలు చెబుతోంది.​—⁠హెబ్రీయులు 7:​25.

యేసు మన కోసం మధ్యవర్తిగా ఉండడానికి సుముఖంగా ఉన్నప్పుడు, క్రైస్తవమత సామ్రాజ్యంలోని ఆరాధకులు ఎందుకు తరచూ “పరిశుద్ధుల”ను అభ్యర్థిస్తున్నారు? చరిత్రకారుడైన విల్‌ డ్యూరంట్‌ ది ఏజ్‌ ఆఫ్‌ ఫేయిత్‌ అనే తన పుస్తకంలో ఈ ఆచార ప్రారంభాన్ని వివరించాడు. సర్వశక్తిగల దేవునిపట్ల భయం ఉండేదనీ యేసును సమీపించడం సులభమనిపించి ఉండవచ్చుననీ పేర్కొంటూ డ్యూరంట్‌ ఇలా నివేదిస్తున్నాడు: “[యేసు] కొండ మీద ఇచ్చిన ప్రసంగంలో చెప్పిన విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన తర్వాత ఆయనతో నేరుగా మాట్లాడడానికి ఎవ్వరూ ధైర్యం చేయగలిగేవారు కాదు. కాననైజేషన్‌ ద్వారా పరలోకంలో ఉన్నాడని ఆధికారికంగా ధృవపర్చబడిన పరిశుద్ధుని ముందు తమ ప్రార్థనను ఉంచడం, క్రీస్తుతో మధ్యవర్తిత్వం చేయమని ఆయనను లేక ఆమెను అభ్యర్థించడం యుక్తమని తోచింది.” యేసు ద్వారా దేవునికి ప్రత్యక్షంగా ప్రార్థన చేయడం గురించి వారికున్న ఈ చింతలు యుక్తమైనవేనా?

యేసు ద్వారా మనం దేవునికి ‘విశ్వాసముతో ధైర్యముగా నిర్భయముగా’ ప్రార్థించవచ్చని బైబిలు మనకు బోధిస్తున్నది. (ఎఫెసీయులు 3:​8-12) సర్వశక్తిగల దేవుడు మన ప్రార్థనలు వినడానికి వీలులేకుండా మానవజాతి నుండి ఎంతో దూరంలో ఏమీ లేడు. “ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు” అని కీర్తనకర్తయైన దావీదు ధృడవిశ్వాసంతో ప్రార్థించాడు. (కీర్తన 65:⁠2) చనిపోయిన “పరిశుద్ధుల” స్మృతి చిహ్నాల ద్వారా శక్తిని అందజేసే బదులు, విశ్వాసంతో అడిగేవారిమీద యెహోవా తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. యేసు ఇలా తర్కించాడు: ‘మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును!’​—⁠లూకా 11:​12, 13.

పరిశుద్ధుల పాత్ర

పౌలు పత్రికలు ఎవరికైతే వ్రాయబడ్డాయో ఆ పరిశుద్ధులు శతాబ్దాల పూర్వమే చనిపోయారు, సమయమొచ్చినప్పుడు, వారు ‘జీవకిరీటాన్ని’ పొందుతారు అంటే పరలోకానికి పునరుత్థానం చేయబడతారు. (ప్రకటన 2:​10) ఈ నిజమైన పరిశుద్ధులను పూజించడం, అనారోగ్యమూ ప్రకృతి వైపరీత్యాలూ ఆర్థిక అస్థిరతా వృద్ధాప్యం లేదా మరణం వంటివాటి నుండి రక్షణను ఇవ్వదని యెహోవా దేవుని ఆరాధకులు గ్రహిస్తారు. కాబట్టి, ‘దేవుని పరిశుద్ధులకు మన మీద నిజంగా శ్రద్ధ ఉందా? మన తరఫున వారు చర్య తీసుకుంటారని మనం ఆశించాలా?’ అని మీరు అడగవచ్చు.

దానియేలు నమోదుచేసిన ప్రవచనంలో పరిశుద్ధులు ప్రత్యేకంగా వర్ణించబడ్డారు. సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో, ఆయన ఉత్తేజకరమైన దర్శనాన్ని చూశాడు, ఆ దర్శన నెరవేర్పు మన కాలానికి కూడా వర్తిస్తుంది. మానవజాతి నిజమైన అవసరాలను తీర్చలేకపోతున్న మానవ ప్రభుత్వాలను సూచించే నాలుగు భయంకరమైన క్రూరమృగాలు సముద్రమునుండి బయటికి వచ్చాయి. అప్పుడు దానియేలు, “అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగయుగములు యుగయుగాంతములవరకు రాజ్యమేలుదురు” అని ప్రవచించాడు.​—⁠దానియేలు 7:​17, 18.

క్రీస్తుతోపాటు పరలోకంలో సహవారసులుగా ఉండడమనే ‘పరిశుద్ధుల స్వాస్థ్యము’ అయిన దీన్ని పౌలు ధృవీకరించాడు. (ఎఫెసీయులు 1:​17-21) యేసు రక్తం 1,44,000 మంది పరిశుద్ధులు పరలోక మహిమకు పునరుత్థానం చేయబడడానికి మార్గాన్ని తెరచింది. “ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు” అని అపొస్తలుడైన యోహాను ప్రకటించాడు. (ప్రకటన 20:​4, 6; 14:​1, 3) ఆ దర్శనంలో, పరలోక ప్రాణుల పెద్ద సమూహము మహిమపర్చబడిన యేసు ఎదుట ఇలా పాడడాన్ని యోహాను విన్నాడు: ‘నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురు.’ (ప్రకటన 5:​9, 10) ఎంతటి హామీ! ఈ స్త్రీపురుషులను యెహోవా దేవుడు తానే స్వయంగా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాడు. అంతేకాకుండా వారు మనుష్యులు అనుభవించే ప్రతి సమస్యనూ ఎదుర్కొంటూ భూమిమీద నమ్మకంగా సేవచేశారు. (1 కొరింథీయులు 10:​13) కాబట్టి, పునరుత్థానం చేయబడిన ఈ పరిశుద్ధులు మన బలహీనతలను పరిమితులను లెక్కలోకి తీసుకుంటూ దయాపూర్వకమైన, సహానుభూతిగల పరిపాలకులుగా ఉంటారని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు.

రాజ్య పరిపాలన క్రింద ఆశీర్వాదాలు

భూమిమీద నుండి సమస్త దుష్టత్వాన్నీ బాధనూ తీసివేయడానికి రాజ్య ప్రభుత్వము త్వరలోనే చర్య తీసుకుంటుంది. ఆ సమయంలో, మునుపెన్నటికంటే కూడా మానవులు దేవునికి మరింత దగ్గరౌతారు. యోహాను ఇలా వ్రాశాడు: ‘ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండునని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.’ ఇది మానవులకు అపరిమితమైన ఆశీర్వాదాలను తెస్తుంది, ఎందుకంటే ఆ ప్రవచనం ఇంకా ఇలా కొనసాగుతుంది: ‘ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.’​—⁠ప్రకటన 21:⁠3, 4.

అది ఎంతటి సంతోషకరమైన సమయంగా ఉంటుందో కదా! యేసుక్రీస్తు, 1,44,000 మంది పరిశుద్ధుల పరిపూర్ణమైన పరిపాలన వల్ల వచ్చే ఫలితాలు మీకా 4:​3, 4 వచనాల్లో నమోదుచేయబడిన ఈ మాటల్లో మరింతగా వర్ణించబడ్డాయి: “ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు, జనముమీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవా మాట యిచ్చియున్నాడు.”

ఇలాంటి ఆశీర్వాదాలలో పాలుపంచుకోమన్న ఆహ్వానం పరిశుద్ధుల ద్వారా ఇవ్వబడుతోంది. పెళ్ళికుమార్తె సూచిస్తున్న నిజమైన పరిశుద్ధులు, “రమ్ము!” అని ఆహ్వానిస్తూనే ఉంటారు. “వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” అని ఆ లేఖనం కొనసాగుతుంది. (ప్రకటన 22:​17) “జీవజలము”లో ఏమి ఇమిడివుంది? ఇతర విషయాలతో పాటు దేవుని సంకల్పాల గురించిన ఖచ్చితమైన జ్ఞానం కూడా ఇమిడివుంది. దేవునికి ప్రార్థిస్తూ యేసు ఇలా అన్నాడు: ‘అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను గురించిన, నీవు పంపిన యేసుక్రీస్తును గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడమే నిత్యజీవము.’ (యోహాను 17:⁠3, NW) ఈ జ్ఞానము బైబిలును క్రమంగా అధ్యయనం చేయడం ద్వారా లభిస్తుంది. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధుల నిజమైన గుర్తింపును గ్రహించగల్గుతున్నందుకు, మానవజాతికి శాశ్వత ప్రయోజనం చేకూర్చడానికి ఆయన వారిని ఎలా ఉపయోగిస్తాడన్నది నేర్చుకోగల్గుతున్నందుకు మనం ఎంత ఆనందించవచ్చో కదా!

[4వ పేజీలోని చిత్రం]

పౌలు నిజమైన పరిశుద్ధులకు ప్రేరేపిత పత్రికలను వ్రాశాడు

[4, 5వ పేజీలోని చిత్రం]

యేసు నమ్మకమైన అపొస్తలులు నిజమైన పరిశుద్ధులయ్యారు

[6వ పేజీలోని చిత్రం]

మనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి దృఢవిశ్వాసంతో ప్రార్థించవచ్చు

[7వ పేజీలోని చిత్రం]

పునరుత్థానం చేయబడిన పరిశుద్ధులు భూమిని పరిపాలించే దయగల పరిపాలకులుగా ఉంటారు