కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నూతనోత్తేజాన్నిచ్చే మంచు బిందువుల వంటి యౌవనస్థులు

నూతనోత్తేజాన్నిచ్చే మంచు బిందువుల వంటి యౌవనస్థులు

“నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును”

నూతనోత్తేజాన్నిచ్చే మంచు బిందువుల వంటి యౌవనస్థులు

‘నాయొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును [“నూతనోత్తేజాన్నిస్తాను,” NW]’ అని యేసుక్రీస్తు అన్నప్పుడు, నిస్సందేహంగా ఆయన తన అనుచరులలోని యౌవనస్థులను కూడా చేర్చుకున్నాడు. (మత్తయి 11:​28) ప్రజలు తమ పిల్లలను ఆయన వద్దకు తీసుకురావడం ప్రారంభించినప్పుడు, ఆయన శిష్యులు వారిని ఆపడానికి ప్రయత్నించారు. కానీ యేసు “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు” అన్నాడు. ఆయన ‘ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు’ కూడా. (మార్కు 10:​14-16) నిస్సందేహంగా యేసు చిన్నపిల్లలను అమూల్యమైనవారిగా దృష్టించాడు.

దేవుని సేవ చేయడంలో చక్కని మాదిరిని ఉంచిన నమ్మకస్థులైన యుక్తవయస్సులోని స్త్రీ పురుషులు, యౌవనస్థులు, చిన్న పిల్లల గురించి బైబిలు చెబుతోంది. మంచుబిందువులంత నూతనోత్తేజాన్నిచ్చే “యౌవనస్థుల” గురించి కీర్తనల గ్రంథంలో ప్రవచించబడింది. యెహోవా నామమును స్తుతించే “యౌవనులు, కన్యల” గురించి కూడా ఆ గ్రంథం చెబుతోంది.​—⁠కీర్తన 110:​3; 148:​12, 13.

యౌవనస్థులు వర్ధిల్లే స్థలం

యౌవనస్థులను మంచు బిందువులతో పోల్చడం సముచితమైనదే ఎందుకంటే మంచు, సమృద్ధికీ ఆశీర్వాదానికీ జతచేయబడింది. (ఆదికాండము 27:​28) మంచు బిందువులు మృదువైనవి, నూతనోత్తేజాన్నిస్తాయి. క్రీస్తు ప్రత్యక్షతకు సంబంధించిన ఈ కాలంలో, యౌవనులైన క్రైస్తవులు అధిక సంఖ్యలో ఇష్టపూర్వకంగా ఉత్సాహంగా తమను తాము సమర్పించుకుంటున్నారు. నూతనోత్తేజాన్నిచ్చే మంచు బిందువుల వలే, అనేకమంది యౌవన స్త్రీ పురుషులు ఆనందంగా దేవుని సేవచేస్తున్నారు, తమ తోటి ఆరాధకులకు సహాయం చేస్తున్నారు.​—⁠కీర్తన 71:​17.

క్రైస్తవ యువత కేవలం ఇతరులకు నూతనోత్తేజాన్నిచ్చేవారిగా ఉండడమే కాక, దేవునికి తాము చేస్తున్న సేవలో వ్యక్తిగతంగా కూడా నూతనోత్తేజాన్ని పొందుతారు. వారు వర్ధిల్లగల వాతావరణాన్ని దేవుని సంస్థ కల్పిస్తుంది. ఉన్నతమైన నైతిక ప్రమాణాలను పాటించడం ద్వారా యౌవన స్త్రీ పురుషులు దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోగల్గుతారు. (కీర్తన 119:⁠9) వారు సంఘంలోని ఆరోగ్యకరమైన కార్యకలాపాల్లో కూడా భాగం వహిస్తారు, అక్కడ మంచి స్నేహితులను కనుగొంటారు​—⁠ఇవి సంతృప్తికరమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి సహాయపడే కారకాలు.

‘స్వస్థత, నూతనోత్తేజం’

క్రైస్తవ యువత వ్యక్తిగతంగా తాము “మంచు” బిందువులమని భావిస్తారా? టాన్యా అనే యౌవన స్త్రీని కలవండి, ఆమె సంఘంలో చురుకుగా పనిచేస్తూ, ప్రతి నెలా 70 కంటే ఎక్కువ గంటలను పరిచర్య కోసం సంతోషంగా అంకితం చేస్తోంది. ఆమె ఎలా భావిస్తోంది? “నేను నూతనోత్తేజాన్ని పొందినట్లు, ఎంతో పైకెత్తబడినట్లు భావిస్తున్నాను” అని ఆమె అంటోంది. “నా జీవితంలో నేను యెహోవాను, ఆయన భూసంస్థను తెలుసుకోగల్గడం నాకు ‘స్వస్థతనూ నూతనోత్తేజాన్నీ ఇచ్చేదిగా’ ఉంది.”​—⁠సామెతలు 3:⁠8, NW.

మరొక పూర్తికాల సేవకురాలైన ఏరియల్‌, సంఘంనుండి తనకు లభించే ఆధ్యాత్మిక పోషణ విషయమై కృతజ్ఞత కలిగి ఉంది. “నేను క్రైస్తవ కూటాలకు, ప్రత్యేక, ప్రాంతీయ, జిల్లా సమావేశాలకు హాజరై యెహోవా ఆధ్యాత్మిక బల్లవద్ద భుజించగలిగినప్పుడు, అది నిజంగా నాకు ఎంతో ఆధ్యాత్మిక నూతనోత్తేజాన్నిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నాకు తోటి పనివారు ఉన్నారని తెలుసుకోవడం నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది” అని ఆమె వ్యాఖ్యానిస్తోంది. నూతనోత్తేజానికి ఏకైక మూలాన్ని వర్ణిస్తూ ఆమె ఇలా అంటోంది: “ప్రత్యేకించి ఈ విధానం ప్రజలపై చూపుతున్న ఘోరమైన ప్రభావాల గురించి నేను విన్నప్పుడు లేదా వాటిని చూసినప్పుడు యెహోవాను ఒక స్నేహితునిగా కలిగివుండడం ఎంతో నూతనోత్తేజాన్ని ఇస్తుంది.”​—⁠యాకోబు 2:​23.

అభీషై, 20 సంవత్సరాల వయస్సులో పూర్తికాల సువార్తికుడిగా, సంఘంలో పరిచర్య సేవకుడిగా సేవచేస్తున్నాడు. ఆయన తన అనుభవాన్ని ఈ మాటల్లో వర్ణిస్తున్నాడు: “ఈనాడు యౌవనస్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు కాబట్టి, నేను నూతనోత్తేజాన్ని పొందినట్లు భావిస్తున్నాను. పూర్ణమనస్సుతో యెహోవా సేవ చేయడానికి నేనేమి చెయ్యాలో దాని మీదే నా మనస్సు కేంద్రీకరించడానికి బైబిలు సత్యం నాకు సహాయపడింది.”

కౌమారదశలో ఉన్నప్పుడు ఆంట్వాన్‌కు ఊరికే కోపం వచ్చేది. ఆయన ఒకసారి తోటి విద్యార్థిని కుర్చీతో కొట్టాడు, ఇంకొకరిని పొడవడానికి పెన్సిల్‌ను ఉపయోగించాడు. ఆంట్వాన్‌ నూతనోత్తేజాన్నిచ్చే వ్యక్తి కాదు! కానీ బైబిలు ఉపదేశం అతని వైఖరిని మార్చేసింది. ఇప్పుడు 19 సంవత్సరాల ఆంట్వాన్‌ సంఘంలో పూర్తికాల సేవకుడిగా, పరిచర్య సేవకుడిగా సేవచేస్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “యెహోవా నేను తన గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుమతించినందుకు, ఆశానిగ్రహాన్ని కలిగివుండవలసిన అవసరాన్ని గ్రహించి నా ప్రవర్తనను మార్చుకోవడానికి సహాయపడినందుకు, నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ విధంగా నేను చాలా సమస్యలను నివారించుకున్నాను.”

యువ క్రైస్తవుల నూతనోత్తేజకరమైన వైఖరిని ఇతరులు కూడా గమనిస్తారు. మాట్టియో, ఇటలీలోని ఒక యువ సాక్షి. క్లాసులో ఎవరైనా బూతుమాట ఉపయోగిస్తే, వారు జరిమానాగా కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుందని ఆయన టీచరు నిర్ణయించింది. కొంతకాలం తర్వాత, పిల్లలు ఆ నియమాన్ని రద్దుచేయమని అడిగారు. ఎందుకంటే “చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండడం అసాధ్యం” అని వాళ్ళన్నారు. “కానీ, టీచరు అది అసాధ్యం కాదని చెప్పి అందుకు యెహోవాసాక్షుల్లో ఒకరినైన నన్ను ఉదాహరణగా చూపించింది, నేను మాట్లాడే శుద్ధమైన భాషకు నన్ను క్లాసంతటి ముందు మెచ్చుకుంది” అని మాట్టియో వివరిస్తున్నాడు.

థాయ్‌లాండ్‌లో అల్లరి పిల్లలున్న ఒక క్లాస్‌రూమ్‌లో, 11 సంవత్సరాల రాత్యాను టీచరు క్లాసు ఎదుట నిలబడమని చెప్పి, అతని ప్రవర్తన గురించి క్లాసంతటి ఎదుటా అతనిని మెచ్చుకుంది. ఆమె ఇలా అన్నది: “మీరందరూ ఇతనిని ఒక మాదిరిగా ఎందుకు తీసుకోకూడదు? ఇతను కష్టపడి చదువుతాడు, మంచిగా ప్రవర్తిస్తాడు.” ఆ తర్వాత ఆమె విద్యార్థులతో ఇలా అంది: “రాత్యాలా మీ ప్రవర్తనను మెరుగుపర్చుకోవడానికి మీరు కూడా యెహోవాసాక్షుల్లో ఒకరు కావాలేమో అని నాకనిపిస్తుంది.”

వేలాదిమంది యౌవనస్థులు యెహోవా గురించిన తమ జ్ఞానాన్ని పెంచుకుని, ఆయన చిత్తం చేయడాన్ని చూడడం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఇలాంటి యౌవనస్థులు సాధారణంగా పెద్దవయస్కులు కనపరిచే వివేచనను కనబరుస్తారు. వారు తమ ప్రస్తుత జీవితాన్ని విజయవంతం చేసుకోవడానికి దేవుడు వారికి సహాయం చేయడమే కాక, రాబోయే నూతనలోకంలో వారికి అద్భుతమైన భవిష్యత్తును కూడా ఇస్తాడు. (1 తిమోతి 4:⁠8) అసంతృప్తికి, ఆశాభంగానికి గురైన యౌవనస్థులతో నిండి, ఆధ్యాత్మికంగా బంజరు భూమిలావున్న ప్రస్తుత విధానంలో, క్రైస్తవ యౌవనస్థులు నూతనోత్తేజాన్నిచ్చే వ్యత్యాసాన్ని కనబరుస్తారు!