పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
• లూసిఫర్ అనేది బైబిలు సాతానుకు ఉపయోగించే ఒక పేరా?
లూసిఫర్ అనే పేరు లేఖనాల్లో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది, అది కూడా కేవలం కొన్ని బైబిలు అనువాదాలలోనే ఉంటుంది. ఉదాహరణకు, యెషయా 14:12వ వచనాన్ని కింగ్ జేమ్స్ వర్షన్ ఇలా అనువదించింది: “ఓ లూసిఫర్, ఉదయ పుత్రుడా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి!”
“లూసిఫర్” అని అనువదించబడిన హీబ్రూ పదానికి “ప్రకాశించే వాడు” అని అర్థం. సెప్టాజింట్ “అరుణోదయాన్ని తెచ్చేవాడు” అనే అర్థంగల గ్రీకు పదాన్ని ఉపయోగిస్తుంది. కాబట్టి, కొన్ని అనువాదాలు మూల హీబ్రూ పదాన్ని “తేజోనక్షత్రము” లేదా “వేకువచుక్క” అని అనువదించాయి. కానీ, జెరోమ్ యొక్క లాటిన్ వల్గేట్ “లూసిఫర్” (వెలుగు తెచ్చేవాడు) అని ఉపయోగిస్తుంది, అందుకే అనేక ఇతర బైబిలు వర్షన్లలో ఆ పదం ప్రత్యక్షమయ్యింది.
ఈ లూసిఫర్ ఎవరు? “బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము” వలె ప్రకటించమని ఇశ్రాయేలీయులకు ప్రవచనార్థకంగా యెషయా ఆజ్ఞాపించిన ఆ గీతములో “ప్రకాశించే వాడు,” లేదా “లూసిఫర్” అనే పదం కనిపిస్తుంది. కాబట్టి, ప్రాథమికంగా బబులోను వంశాన్ని ఉద్దేశించి చెప్పబడినదానిలో ఆ పదం ఒక భాగం. “ప్రకాశించే వాడు” అన్న వర్ణన ఒక మనుష్యునికి ఇవ్వబడింది కానీ ఒక ఆత్మప్రాణికి కాదన్న విషయాన్ని ‘నీవు పాతాళమునకు త్రోయబడుదువు’ అనే వాక్యం మరింత ధృవీకరిస్తుంది. పాతాళము మానవుని సాధారణ సమాధి, అది అపవాదియగు సాతాను ఆక్రమించుకున్న స్థలము కాదు. అంతేకాకుండా, లూసిఫర్ ఆ పరిస్థితికి తీసుకురాబడడాన్ని చూసినవారు ఇలా ప్రశ్నిస్తారు: “భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా?” స్పష్టంగా, “లూసిఫర్” అనే పేరు ఆత్మప్రాణిని కాదుకానీ ఒక మానవుని సూచిస్తుంది. (ఇటాలిక్కులు మావి.)—యెషయా 14:3, 4, 15-17.
బబులోను వంశానికి ఇంత ఉత్కృష్టమైన వర్ణన ఎందుకివ్వబడింది? బబులోను రాజు రాజకీయంగా పతనమైన తర్వాత ఎగతాళి చేయబడడానికి మాత్రమే ప్రకాశించే వాడు అని పిలువబడ్డాడని మనం గ్రహించాలి. (యెషయా 14:3, 4) బబులోను రాజులకున్న అహంభావం, వారు తమను తాము తమ చుట్టూవున్నవారికి పైగా ఉన్నతపర్చుకునేలా ప్రోత్సహించింది. ఈ వంశంవారి అహంభావం ఎంత ఎక్కువగా ఉందంటే అదిలా ప్రగల్భాలు పలికినట్లు చిత్రించబడింది: “నేను ఆకాశమున కెక్కిపోయెదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును . . . మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును.”—యెషయా 14:13, 14.
‘దేవుని నక్షత్రములు’ దావీదు రాజ వంశంలోని రాజులు. (సంఖ్యాకాండము 24:17) దావీదు రాజు మొదలుకొని ఈ ‘నక్షత్రములు’ సీయోను పర్వతంనుండి పరిపాలించారు. సొలొమోను యెరూషలేములో ఆలయం కట్టిన తర్వాత, సీయోను అనే పేరు మొత్తం పట్టణానికి అన్వయించడం ప్రారంభమైంది. ధర్మశాస్త్ర నిబంధన క్రింద, ఇశ్రాయేలీయులలోని పురుషులందరూ సంవత్సరానికి మూడు సార్లు సీయోనుకు ప్రయాణించాలని ఆజ్ఞాపించబడ్డారు. కాబట్టి అది “సభాపర్వతము”గా మారింది. యూదా రాజులను జయించి, ఆ తర్వాత వారిని ఆ పర్వతమునుండి తీసివేయాలని నిర్ణయించుకోవడం ద్వారా నెబుకద్నెజరు ఆ “నక్షత్రములకు” పైగా తనను తాను ఉంచుకోవాలనే తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. యూదా రాజుల మీద సాధించిన విజయానికి ఘనతను యెహోవాకు ఇచ్చే బదులు, ఆయన అహంభావంతో తనను తాను యెహోవా స్థానంలో ఉంచుకున్నాడు. కాబట్టి బబులోను వంశం పతనమైన తర్వాత, అపహాస్యంగా అది “ప్రకాశించే వాడు” అని పిలువబడింది.
బబులోను పరిపాలకుల అహంభావం, నిజానికి “ఈ యుగ సంబంధమైన దేవత” అయిన అపవాదియగు సాతాను వైఖరిని ప్రతిబింబిస్తుంది. (2 కొరింథీయులు 4:4) అతను కూడా అధికారం కోసం తీవ్రంగా వాంఛిస్తాడు, తనను తాను యెహోవా దేవునికంటే ఉన్నతునిగా చేసుకోవడానికి అపేక్షిస్తాడు. అంతేగానీ లూసిఫర్ అనేది లేఖనాధారంగా సాతానుకు ఇవ్వబడిన పేరు కాదు.
• 1 సమూయేలు 16:10, 11 దావీదు యెష్షయి ఎనిమిదవ కుమారుడని సూచిస్తుంటే, 1 దినవృత్తాంతములు 2:13-15 దావీదును యెష్షయి ఏడవ కుమారునిగా ఎందుకు చెబుతుంది?
ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సౌలు సత్యారాధన నుండి వైదొలగిపోయిన తర్వాత, యెహోవా దేవుడు యెష్షయి కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించమని ప్రవక్తయైన సమూయేలును పంపించాడు. సా.శ.పూ. 11వ శతాబ్దంలో స్వయంగా సమూయేలు వ్రాసిన ఈ చారిత్రాత్మక సంఘటన గురించిన బైబిలు నివేదిక దావీదును యెష్షయి ఎనిమిదవ కుమారునిగా చెబుతోంది. (1 సమూయేలు 16:10-13) అయినప్పటికీ, దాదాపు 600 సంవత్సరాల తర్వాత, యాజకుడైన ఎజ్రా వ్రాసిన నివేదిక ఇలా అంటుంది: “యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని ఆరవవాడైన ఓజెమును ఏడవవాడైన దావీదును కనెను.” (1 దినవృత్తాంతములు 2:13-15) దావీదు సహోదరులలో ఒకరికి ఏమయ్యింది, ఎజ్రా అతని పేరును ఎందుకు చేర్చలేదు?
యెష్షయికి “ఎనమండుగురు కుమాళ్లుండిరి” అని లేఖనాలు నివేదిస్తున్నాయి. (1 సమూయేలు 17:12) ఆయన కుమారులలో ఒకరు వివాహం చేసుకుని, పిల్లలను కనేంత వరకు జీవించలేదని స్పష్టమవుతుంది. ఆయనకు వారసులు లేనందువల్ల, తెగలకు సంబంధించిన వారసత్వంలో ఆయనకు భాగం ఉండదు, అంతేకాకుండా యెష్షయి వంశానికి చెందిన వంశానుక్రమమైన రికార్డులతో ఆయనకు సంబంధం ఉండదు.
ఇప్పుడు మనం ఎజ్రా కాలం గురించి ఆలోచిద్దాము. ఆయన దినవృత్తాంతములను ఏ పరిస్థితుల మధ్య సమకూర్చాడో పరిశీలించండి. బబులోనులోని బానిసత్వం దాదాపు 77 సంవత్సరాల క్రితం ముగిసింది, యూదులు తమ దేశంలో మళ్ళీ స్థిరపడ్డారు. న్యాయాధిపతులను, దేవుని ధర్మశాస్త్ర బోధకులను నియమించడానికి, యెహోవా గృహాన్ని అందంగా తీర్చిదిద్దడానికి పర్షియా రాజు ఎజ్రాకు అధికారాన్నిచ్చాడు. తెగలకు సంబంధించిన వారసత్వాలను నిశ్చయపర్చుకోవడానికి, అధికారం గలవారు మాత్రమే యాజకత్వంలో సేవచేసేలా చూడడానికి ఖచ్చితమైన వంశానుక్రమమైన రికార్డులు అవసరమయ్యాయి. కాబట్టి, ఎజ్రా యూదా వంశావళికి, దావీదు వంశావళికి సంబంధించిన ఖచ్చితమైన, నమ్మదగిన రికార్డుతో పాటు మొత్తం జనాంగ చరిత్రకు సంబంధించిన పూర్తి నివేదిక తయారుచేశాడు. కుమారులు లేకుండానే చనిపోయిన యెష్షయి కుమారుని పేరు అప్రస్తుతం. కాబట్టి ఎజ్రా అతని పేరును చేర్చలేదు.