కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మరింత ఎక్కువ అవధానం నిలపండి’

‘మరింత ఎక్కువ అవధానం నిలపండి’

‘మరింత ఎక్కువ అవధానం నిలపండి’

“కాబట్టి మనం విన్నవాటి నుండి కొట్టుకొనిపోకుండా వాటిపై మరింత ఎక్కువ అవధానం నిలపడం అవసరం.”​—⁠హెబ్రీయులు 2:⁠1, NW.

1. పరధ్యానం ఆకస్మిక దుర్ఘటనలకు ఎలా దారి తీసే అవకాశముందో విశదీకరించండి.

మోటారు వాహన ప్రమాదాలు, కేవలం అమెరికాలోనే ప్రతి సంవత్సరం దాదాపు 37,000 మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. డ్రైవర్లు రోడ్డుపై మరింత అవధానం నిలిపివుంటే వీటిలోని అనేక మరణాలు సంభవించకుండా ఉండేవని నిపుణులు చెబుతున్నారు. మోటారు వాహనాలు నడిపించే కొందరు, పోస్టర్ల వలన, బ్యానర్ల వలన లేదా సెల్‌ ఫోన్లను ఉపయోగించడం వలన తమ ఏకాగ్రతను కోల్పోతున్నారు. డ్రైవింగు చేసేటప్పుడు తిండి ధ్యాసలో పడిపోయేవారూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటిలోనూ పరధ్యానం ఆకస్మిక దుర్ఘటనలకు దారి తీసే అవకాశముంది.

2, 3. హీబ్రూ క్రైస్తవులను పౌలు ఏమని హెచ్చరించాడు, ఆయనిచ్చిన ఆ సలహా ఎందుకు సమంజసమైనది?

2 ఆటోమోబైల్‌ కనిపెట్టబడడానికి సుమారు 2,000 సంవత్సరాల పూర్వం, కొందరు హీబ్రూ క్రైస్తవులకు ఆకస్మిక విపత్తు కలుగజేస్తున్న ఒక విధమైన పరధ్యానాన్ని అపొస్తలుడైన పౌలు గుర్తించాడు. పునరుత్థానం చేయబడిన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు కాబట్టి, దేవదూతలందరికంటే ఉన్నతమైన స్థానం ఆయనకు ఇవ్వబడిందన్న విషయాన్ని పౌలు ప్రాముఖ్యంగా చెప్పాడు. ఆ తర్వాత అపొస్తలుడు ఇలా తెలియజేశాడు: “కాబట్టి మనం విన్నవాటి నుండి కొట్టుకొనిపోకుండా వాటిపై మరింత ఎక్కువ అవధానం నిలపడం అవసరం.”​—⁠హెబ్రీయులు 2:⁠1, NW.

3 హీబ్రూ క్రైస్తవులు యేసుకు సంబంధించి ‘తాము విన్నవాటిపై మరింత ఎక్కువ అవధానం నిలపాల్సిన’ అవసరం ఎందుకు ఉంది? ఎందుకంటే యేసు భూమిమీది నుండి వెళ్ళిపోయి అప్పటికి దాదాపు 30 సంవత్సరాలు గడిచాయి. తమ యజమాని దగ్గర లేకపోవడంతో కొందరు హీబ్రూ క్రైస్తవులు నిజ విశ్వాసం నుండి దూరంగా కొట్టుకుపోవడం ప్రారంభించారు. వారు తమ పూర్వపు ఆరాధనా విధానం వలన అంటే యూదా మతం వలన ఏకాగ్రతను కోల్పోతున్నారు.

వారు ఎక్కువ అవధానం నిలపాల్సిన అవసరముంది

4. కొందరు హీబ్రూ క్రైస్తవులు తిరిగి యూదా మతంలోకి వెళ్ళడానికి ఎందుకు ఆకర్షించబడివుండవచ్చు?

4 ఏ క్రైస్తవుడైనా తిరిగి యూదా మతంలోకి వెళ్ళేలా ఎందుకు ఆకర్షించబడి ఉండవచ్చు? ఎందుకంటే, ధర్మశాస్త్రం క్రింద చేసే ఆరాధనా విధానంలో కంటికి కనిపించేవి మిళితమై ఉన్నాయి. ప్రజలు యాజకులను చూడగలిగేవారు, దహనబలులను ఆఘ్రాణించగలిగేవారు. అయితే, కొన్ని విషయాల్లో క్రైస్తవత్వం పూర్తి భిన్నంగా ఉండేది. క్రైస్తవులకు ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ఉన్నాడు, కానీ ఆయన భూమిపైన కనబడడం మానేసి మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. (హెబ్రీయులు 4:​14) వారికి మందిరం ఉంది, కానీ స్వయంగా పరలోకమే దాని పరిశుద్ధస్థలం. (హెబ్రీయులు 9:​24) ధర్మశాస్త్రం క్రింద చేసుకునే భౌతిక సున్నతిలా కాకుండా, క్రైస్తవుల సున్నతి ‘హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగేది.’ (రోమీయులు 2:​29) ఆ కారణంగా హీబ్రూ క్రైస్తవులకు, క్రైస్తవత్వం ఆచరణకు అయోగ్యమైనదిగా అనిపించడం మొదలయ్యుండవచ్చు.

5. యేసు ఏర్పాటు చేసిన ఆరాధనా విధానం, ధర్మశాస్త్రం క్రింద చేసే ఆరాధన కంటే ఉన్నతమైనదని పౌలు ఎలా చూపించాడు?

5 హీబ్రూ క్రైస్తవులు క్రీస్తు ఏర్పాటు చేసిన ఆరాధనా విధానం గురించి చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. అది కంటికి కనిపించేదానిపైన కాదుగానీ విశ్వాసంపైనే ఎక్కువ ఆధారపడి ఉంది, అయినా అది మోషే ప్రవక్త ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనది. దాని గురించి పౌలు ఇలా వ్రాశాడు: “మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.” (హెబ్రీయులు 9:​13, 14) అవును, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలిపై ఉంచే విశ్వాసం ద్వారా లభించే క్షమాపణ, ధర్మశాస్త్రం క్రింద అర్పించబడే బలులు సాధ్యం చేసేవాటికంటే అనేక విధాలుగా ఎంతో ఉన్నతమైనది.​—⁠హెబ్రీయులు 7:​26-28.

6, 7. (ఎ) హీబ్రూ క్రైస్తవులు అత్యవసరంగా ‘తాము విన్నవాటిపై మరింత ఎక్కువ అవధానం’ నిలిపేలా చేసిన పరిస్థితి ఏమిటి? (బి) పౌలు హెబ్రీయులకు తన పత్రికను వ్రాసేటప్పటికి యెరూషలేముకు ఇంకా ఎంత సమయం ఉంది? (అధస్సూచి చూడండి.)

6 హీబ్రూ క్రైస్తవులు యేసు గురించి తాము విన్న విషయాలపై మరింత ఎక్కువ అవధానం నిలపాల్సిన అవసరాన్ని చూపించే మరో కారణముంది. యెరూషలేము నాశనం చేయబడుతుందని యేసు ప్రవచించాడు. ఆయనిలా అన్నాడు: “(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతోకూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచ్చు[ను].”​—⁠లూకా 19:​43, 44.

7 ఇది ఎప్పుడు జరుగుతుంది? యేసు ఆ దినం, గడియ ఎప్పుడన్నది బయలుపరచలేదు. బదులుగా, ఆయన ఈ సలహా ఇచ్చాడు: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు.” (లూకా 21:​20, 21) యేసు ఈ మాటలు అన్న తర్వాతి 30 సంవత్సరాల కాలంలో యెరూషలేములోని కొందరు క్రైస్తవులు తమ అత్యవసర భావాన్ని కోల్పోయి, పరధ్యానంలో పడిపోయారు. ఒక విధంగా వాళ్ళు, రోడ్డుపై నుండి తమ దృష్టి మళ్ళించినట్లుగా చేశారు. వారు తమ ఆలోచనా ధోరణిని సరిదిద్దుకోక పోయినట్లయితే, ఆకస్మిక విపత్తు తప్పదు. వారలా భావించినా భావించకపోయినా యెరూషలేము వినాశనం మాత్రం తథ్యం! * నిశ్చయంగా, యెరూషలేములోని ఆధ్యాత్మిక నిద్రమత్తులో ఉన్న క్రైస్తవులకు పౌలు సలహా నిశ్చయంగా మేలుకొలిపే పిలుపునిచ్చింది.

నేడు, ‘మరింత ఎక్కువ అవధానం నిలపడం’

8. మనం దేవుని వాక్య సత్యాలపై “మరింత ఎక్కువ అవధానం” ఎందుకు నిలపాలి?

8 మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లాగే మనం కూడా దేవుని వాక్య సత్యాలపై ‘మరింత ఎక్కువ అవధానం నిలపాల్సిన’ అవసరముంది. ఎందుకు? ఎందుకంటే మనం కూడా నాశనాన్ని ఎదుర్కోబోతున్నాం, కేవలం ఒక్క దేశం కాదు, మొత్తం వ్యవస్థే నాశనం కాబోతోంది. (ప్రకటన 11:​18; 16:​14-16) అయితే యెహోవా ఖచ్చితంగా ఏ రోజు, ఏ గడియలో ఈ చర్య తీసుకుంటాడో మనకు తెలియదు. (మత్తయి 24:​36) అయినా, “అంత్యదినములలో” జీవిస్తున్నామని స్పష్టంగా సూచించే బైబిలు ప్రవచనాల నెరవేర్పుకు మనం ప్రత్యక్ష సాక్షులం. (2 తిమోతి 3:​1-5) కాబట్టి, మన ధ్యాస మళ్ళించగలిగే దేని నుండైనా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని వాక్యంపై అవధానం నిలపాల్సిన అవసరమూ నిశితమైన అత్యవసర భావాన్ని కాపాడుకోవాల్సిన అవసరమూ ఉన్నాయి. అలా చేయడం ద్వారా మాత్రమే మనం ‘జరగబోయే వాటన్నింటి నుండి తప్పించుకోగలుగుతాం.’​—⁠లూకా 21:​36.

9, 10. (ఎ) మనం ఆధ్యాత్మిక విషయాలపై అవధానం నిలుపుతున్నామని ఎలా చూపించవచ్చు? (బి) దేవుని వాక్యం ‘మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగు’ ఎలా అయ్యింది?

9 ఈ ప్రాముఖ్యమైన సమయాల్లో మనం ఆధ్యాత్మిక విషయాలపై ‘మరింత ఎక్కువ అవధానం నిలుపు’తున్నామని ఎలా చూపించగలం? అందుకు ఒక మార్గమేమిటంటే, క్రైస్తవ కూటాలకూ ప్రాంతీయ, జిల్లా సమావేశాలకూ క్రమంగా హాజరవడం. మనం శ్రద్ధగల బైబిలు విద్యార్థులుగా కూడా ఉండాలి, అప్పుడే మనం బైబిలు గ్రంథకర్తయైన యెహోవాకు దగ్గరవగలం. (యాకోబు 4:⁠8) మనం వ్యక్తిగత అధ్యయనం ద్వారా కూటాల ద్వారా యెహోవాను గూర్చిన పరిజ్ఞానాన్ని పొందినట్లయితే, ఆయనతో ఈ మాటలన్న కీర్తనకర్తలాగే మనమూ అంటాం: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.”​—⁠కీర్తన 119:​105.

10 బైబిలు భవిష్యత్తు గురించిన దేవుని సంకల్పాలను మనకు తెలియజేసినప్పుడు అది ‘మన త్రోవకు వెలుగులా’ ఉపయోగపడుతోంది. అది ‘మన పాదములకు దీపము’ వంటిది కూడా. వేరే మాటల్లో చెప్పాలంటే, జీవితంలో మనల్ని కృంగదీసే కష్టాలను మనం ఎదుర్కొన్నప్పుడు, మనం వేసే ప్రతి అడుగులోనూ అది సహాయపడగలదు. అందుకే బోధించబడడానికి మన తోటి విశ్వాసులతో కూడుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా చదువుకునేటప్పుడు మనం ‘మరింత ఎక్కువ అవధానం నిలపడం’ ప్రాముఖ్యం. మనం పొందే సమాచారం, మనం యెహోవాకు సంతోషం కలిగించేందుకూ ఆయన హృదయాన్ని ఆనందింపజేసేందుకూ వివేకవంతమైన ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకునేలా మనకు సహాయపడుతుంది. (సామెతలు 27:​11; యెషయా 48:​17) దేవుడనుగ్రహించే ఆధ్యాత్మిక ఏర్పాట్ల నుండి అత్యధిక ప్రయోజనాన్ని పొందేందుకు, కూటాల్లోనూ వ్యక్తిగత అధ్యయన సమయాల్లోనూ మన అవధాన పరిధిని మనం ఎలా విస్తృతపరుచుకోవచ్చు?

కూటాల్లో మన ఏకాగ్రతను మెరుగుపరుచుకోవడం

11. క్రైస్తవ కూటాల్లో అవధానం నిలపడం అప్పుడప్పుడు ఎందుకు సవాలుగా ఉంటుంది?

11 క్రైస్తవ కూటాల్లో అవధానం నిలపడం అప్పుడప్పుడు సవాలుగా ఉంటుంది. మనసు చాలా సులభంగా పరధ్యానంలో పడిపోగలదు, బహుశా ఒక చిన్న పిల్లవాడు ఏడ్చినా ఆలస్యంగా వచ్చిన వ్యక్తి సీటు కోసం చూస్తున్నా ఏకాగ్రత చెదిరిపోతుంది. దినమంతా పని చేసిన మనం అలసిపోయి ఉండవచ్చు. వేదికపై నుండి ప్రసంగమిస్తున్న వ్యక్తి మనస్సుని ఆకట్టుకునేంతటి సామర్థ్యమున్న ప్రసంగీకుడు కాకపోవచ్చు, మనకు తెలియకుండానే పగటికలలు కనడంలో పడిపోవచ్చు​—⁠చివరికి జోగుతుండవచ్చు కూడా! అక్కడ చాలా ప్రాముఖ్యమైన సమాచారం అందించబడుతోంది కాబట్టి, సంఘ కూటాల్లో మన ఏకాగ్రతా శక్తులను మెరుగుపరుచుకోవడానికి మనం ప్రయత్నించాలి. కానీ దాన్ని మనమెలా చేసుకోగలం?

12. కూటాల్లో అవధానం నిలపడాన్ని సులభం చేసేది ఏమిటి?

12 సాధారణంగా మనం బాగా సిద్ధపడినట్లయితే, కూటాల్లో అవధానం నిలపడం చాలా సులభమవుతుంది. అలాంటప్పుడు, అక్కడ పరిశీలించబోయే విషయాలను ముందుగానే చూసుకోవడానికి కొంత సమయాన్ని ఎందుకు పక్కన పెట్టుకోకూడదు? వారం వారం చదవడానికి నియమించబడిన బైబిలు భాగంలోని అధ్యాయాలను చదివి ధ్యానించేందుకు ప్రతిరోజు కేవలం కొన్ని నిమిషాలు చాలు. కాస్త ప్లాను వేసుకుంటే, సంఘ పుస్తక అధ్యయనానికి కావలికోట అధ్యయనానికి కూడా సిద్ధపడేందుకు మనకు సమయం లభించే అవకాశముంది. మనం ఏ పట్టికను ఉపయోగించినా ఒక్కటి మాత్రం నిశ్చయం: సిద్ధపడడం, సంఘ కూటాల్లో పరిశీలించబడే సమాచారంపై అవధానం నిలపడానికి సహాయపడుతుంది.

13. కూటాల్లో చర్చించబడే విషయంపైనే మనసు కేంద్రీకరించి ఉంచడానికి మనకు ఏమి సహాయపడవచ్చు?

13 బాగా సిద్ధపడడంతోపాటు, కొందరు తాము రాజ్య మందిరంలో ముందు సీట్లలో కూర్చున్నప్పుడు ఎక్కువ అవధానం నిలపవచ్చని తెలుసుకున్నారు. ప్రసంగీకుడిపై నుండి దృష్టి మళ్ళించకుండా ఉండడం, బైబిలు నుండి వచనం చదవబడినప్పుడు దాన్ని మన బైబిలులో చూసుకోవడం, ముఖ్యాంశాలను వ్రాసుకోవడం వంటివి మన మనస్సు అటూ ఇటూ పోకుండా ఉంచుకునేందుకు దోహదపడే ఇతర మార్గాలు. అయినా, ఏకాగ్రతను ఉంచడానికి చేసే ఇతర అన్ని రకాల నైపుణ్యాల కంటే సిద్ధపడి ఉన్న హృదయమే ప్రాముఖ్యమైనది. మనం కూడుకోవడంలోనున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. మనం ప్రధానంగా యెహోవాను ఆరాధించడానికే మన తోటి విశ్వాసులతో కూడుకుంటాం. (కీర్తన 26:​12; లూకా 2:​36, 37) మనం ఆధ్యాత్మికంగా పోషించబడేందుకు ఒక ప్రాముఖ్యమైన మార్గం కూటాలు. (మత్తయి 24:​45-47) అంతేగాక అవి మనకు, ‘ప్రేమచూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకునే’ అవకాశాలనిస్తాయి.​—⁠హెబ్రీయులు 10:​24, 25.

14. ఒక కూటాన్ని నిజంగా విజయవంతం చేసేది ఏమిటి?

14 కొందరు కూటాల్లో భాగం వహించినవారి బోధనా సామర్థ్యాల ద్వారా కూటాల విలువను అంచనా వేయడానికి మొగ్గు చూపవచ్చు. ప్రసంగీకులు సమర్థవంతులైతే అది మంచి కూటం అని అంటుండవచ్చు. కానీ సమర్థవంతమైన బోధ లోపించినట్లనిపిస్తే, మనం ప్రతికూల దృక్పథాన్ని ఏర్పరుచుకోవచ్చు. కార్యక్రమంలో భాగం ఉన్నవారు తమ బోధనా నైపుణ్యాన్ని ఉపయోగించడానికీ ప్రత్యేకించి హృదయాలను చేరుకోవడానికీ శాయశక్తులా ప్రయత్నించాలన్నది నిజమే. (1 తిమోతి 4:​16) అయినా, శ్రోతలమైన మనం అనవసరంగా విమర్శించకూడదు. భాగం వహించేవారి బోధనా సామర్థ్యం ప్రాముఖ్యమే అయినప్పటికీ, కూటం విజయవంతం కావడానికి దోహదపడేది పూర్తిగా అదొక్కటే కాదు. ముఖ్యంగా శ్రద్ధ వహించాల్సింది మనం ఎంత బాగా వింటున్నామన్న దానిపైనే కానీ, ప్రసంగీకుడు ఎంత బాగా ప్రసంగిస్తున్నాడన్న దానిపైన కాదని మీరు అంగీకరించరా? మనం కూటాలకు హాజరై అక్కడ అందించబడేవాటిపై అవధానం నిలిపినప్పుడు, మనం దేవుని చిత్తానుసారంగా ఆయనను ఆరాధిస్తున్నట్లే. కూటాన్ని విజయవంతం చేసేది అదే. దేవుని పరిజ్ఞానాన్ని పొందాలన్న ఆతృత మనలో ఉంటే, ప్రసంగీకుడి సామర్థ్యాలు ఎలా ఉన్నా మనం కూటాల నుండి తప్పక ప్రయోజనం పొందుతాం. (సామెతలు 2:​1-5) అలాగైతే, మనం మన కూటాల్లో “మరింత ఎక్కువ అవధానం” నిలపాలన్న దృఢసంకల్పంతో ఉందాం.

వ్యక్తిగత అధ్యయనం నుండి పూర్తి ప్రయోజనం పొందండి

15. వ్యక్తిగత అధ్యయనం, ధ్యానించడం మనకెలా ప్రయోజనం చేకూరుస్తాయి?

15 వ్యక్తిగత అధ్యయనం చేసేటప్పుడూ ధ్యానించేటప్పుడూ ‘మరింత ఎక్కువ అవధానం నిలపడం’ ద్వారా మనం ఎంతో ప్రయోజనం పొందుతాం. బైబిలును, క్రైస్తవ ప్రచురణలను చదవడం వాటిని మననం చేసుకోవడం, దేవుని వాక్య సత్యాలను మన మనస్సులో ముద్రించుకునేందుకు విలువైన అవకాశాలనిస్తాయి. అది, మనం ఆలోచించే విధానంపై ప్రవర్తించే తీరుపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. నిజంగానే అది మనం యెహోవా చిత్తం చేయడంలో ఆనందాన్ని పొందేందుకు సహాయపడుతుంది. (కీర్తన 1:⁠2; 40:⁠8) కాబట్టి, మన ఏకాగ్రతా శక్తులను వృద్ధి చేసుకోవాలి, అలా చేస్తే అవి మనం అధ్యయనం చేసేటప్పుడు ప్రయోజనకరంగా ఉంటాయి. ధ్యాస మళ్ళడం చాలా సులభం! చిన్న చిన్న అడ్డంకులు​—⁠ఒక ఫోన్‌ కాల్‌ లేదా చిన్న శబ్దం కూడా​—⁠మన ఏకాగ్రతను చెదరగొట్టవచ్చు. లేదా మనం ఎక్కువ సేపు అవధానం నిలపలేకపోవచ్చు. సాధారణంగా మనం ఆధ్యాత్మికంగా పోషించబడాలన్న సదుద్దేశంతోనే కూర్చొని ఉండవచ్చు, కానీ త్వరలోనే మన మనస్సు ఇతర విషయాలపైకి మళ్ళుతుండవచ్చు. దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేసేటప్పుడు మనం ‘మరింత ఎక్కువ అవధానం నిలిపి’ ఎలా ఉండగలం?

16. (ఎ) వ్యక్తిగత అధ్యయనానికి సమయ పట్టిక తయారుచేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమైనది? (బి) దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మీరు సమయాన్ని ఎలా సంపాదించుకున్నారు?

16 ఒక పట్టికను తయారుచేసుకొని అధ్యయనానికి అత్యంత అనుకూలమైన ఒక స్థలాన్ని ఎంపిక చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనలో చాలామందికి సమయం, ఏకాంతం చాలా అరుదుగా దొరుకుతాయి. వేగమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక కొమ్మలాగే మనమూ దైనందిన సంఘటనల వేగం మనల్ని లాక్కుపోతున్నట్లు భావిస్తుండవచ్చు. ఇలాంటి వేగవంతమైన మన జీవితాల్లో అధ్యయనం కోసం కాస్త సమయాన్ని సంపాదించుకోవాలంటే మనం నిజంగానే పోరాడాలి. మనం అవకాశం కోసం చేతులు కట్టుకొని ఎదురు చూడలేము. బదులుగా, అధ్యయనం కోసం సమయాన్ని తీసుకోవడం ద్వారా పరిస్థితులను అదుపులో ఉంచుకోవాలి. (ఎఫెసీయులు 5:​15, 16) ధ్యాస మళ్ళించే అవకాశాలు తక్కువగా ఉండే ఉదయం పూట కాస్త సమయాన్ని కొందరు పక్కకు పెట్టుకుంటారు. మరి కొందరు సాయంత్ర సమయం చక్కని అవకాశాన్నిస్తుందని భావిస్తారు. ముఖ్య విషయమేమిటంటే, దేవుని గురించిన ఆయన కుమారుని గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని పొందవలసిన ప్రాముఖ్యమైన అవసరాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. (యోహాను 17:⁠3) కాబట్టి మనం వ్యక్తిగత అధ్యయనం కోసం సమయ పట్టికను వేసుకొని దాన్ని పాటించుదాం.

17. ధ్యానించడం అంటే ఏమిటి, అది మనకు ఎలా ప్రయోజనం చేకూర్చగలదు?

17 అధ్యయనంలో మనం నేర్చుకొన్నవాటిని మననం చేసుకోవడం, అంటే ధ్యానించడం అమూల్యమైనది. బైబిలులోని దేవుని ఆలోచనలు మన హృదయాల్లో నాటుకుపోయేందుకు అది మనకు సహాయం చేస్తుంది. ‘మనం వినువారం మాత్రమే కాక, వాక్యప్రకారము ప్రవర్తించువారమై’ ఉండేందుకు బైబిలు ఉపదేశాన్ని ఎలా అన్వయించుకోవాలో తెలుసుకోవడానికి మనకు ధ్యానించడం సహాయపడుతుంది. (యాకోబు 1:​22-25) అంతేగాక, మనం యెహోవాకు మరింత దగ్గరయ్యేందుకు ధ్యానించడం మనకు సహాయపడుతుంది, ఎందుకంటే అది మనం ఆయన లక్షణాల గురించీ అధ్యయన సమయంలో పరిశీలించబడుతున్న సమాచారంలో ఆ లక్షణాలు ప్రాముఖ్యంగా చెప్పబడిన విధానం గురించీ ఆలోచించగలిగేలా చేస్తుంది.

18. సమర్థవంతంగా ధ్యానించడానికి ఎలాంటి పరిస్థితులు కావాలి?

18 అధ్యయనం నుండీ ధ్యానించడం నుండీ పూర్తిగా ప్రయోజనం పొందడానికి మన మనస్సు పరధ్యానంలో పడకుండా నిర్మలంగా ఉంచుకోవాలి. మనం ధ్యానించేటప్పుడు కొత్త సమాచారాన్ని మనసులోకి తీసుకునేందుకు ప్రస్తుత దిన జీవనంలోని విషయాలు అడ్డంకులుగా రానీయకూడదు. అలా చేయడానికి సమయం, ఏకాంతం కావాలి. అయినా దేవుని వాక్యంలో లభించే ఆధ్యాత్మిక ఆహారాన్ని, సత్య జలాలను ఆస్వాదించడం ఎంత ఉత్తేజకరం!

19. (ఎ) వ్యక్తిగత అధ్యయనానికి సంబంధించి తమ అవధాన పరిధిని పెంపొందించుకోవడానికి కొందరికి ఏమి సహాయపడింది? (బి) అధ్యయనం పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి, ప్రాముఖ్యమైన ఈ కార్యం నుండి మనం ఏ ప్రయోజనాలను పొందవచ్చు?

19 మనం ఎక్కువ సేపు అవధానం నిలపలేకపోవడం వలన అధ్యయనంలో కాస్త సమయం గడపగానే మన మనస్సు అటూ ఇటూ మళ్ళితే ఎలా? కొందరు అధ్యయనం కోసం తక్కువ సమయంతో ప్రారంభించి నెమ్మదిగా ఆ సమయాన్ని అధికం చేసుకోవడం ద్వారా అధ్యయనం చేసేటప్పుడు ఏకాగ్రతా శక్తులను పెంపొందించుకోవచ్చని గ్రహించారు. సరిపడేంత సమయాన్ని అధ్యయనంలో గడపడమే మన లక్ష్యం కానీ గబగబా చదివేయడం కాదు. పరిశీలిస్తున్న విషయంపై ఆసక్తిని అధికం చేసుకోవడానికి కృషి చేయాలి. అందుకు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా అందించబడుతున్న విస్తృతమైన సమాచారాన్ని ఉపయోగిస్తూ మనం ఇంకా ఎక్కువ పరిశోధన చేయవచ్చు. “దేవుని మర్మముల” పైకి దృష్టి సారించడం ఎంతో విలువైనది. (1 కొరింథీయులు 2:​10) అలా చేయడం వలన మనం దేవుని గురించిన మన పరిజ్ఞానాన్ని, మన వివేచనా శక్తులను వృద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది. (హెబ్రీయులు 5:​14) శ్రద్ధగల దేవునివాక్య విద్యార్థులమైతే, మనం ‘ఇతరులకు బోధించుటకు సామర్థ్యముగల’వారిగా కూడా ఉంటాం.​—⁠2 తిమోతి 2:⁠2.

20. మనం యెహోవా దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఎలా వృద్ధి చేసుకొని దాన్ని కాపాడుకోగలం?

20 క్రైస్తవ కూటాలకు హాజరవడం, వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం యెహోవాతో మనం సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకొని దాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో సహాయం చేస్తాయి. “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను” అని దేవునితో అన్న కీర్తనకర్త అలాగే చేశాడని స్పష్టం అవుతోంది. (కీర్తన 119:​97) కాబట్టి, మనం కూటాలకూ సమావేశాలన్నింటికీ క్రమంగా హాజరవుదాం. వాటితోపాటు బైబిలు అధ్యయనం చేయడంలో, ధ్యానించడంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనం ‘మరింత ఎక్కువ అవధానం నిలపడం’ వల్ల మెండైన ప్రతిఫలాలను పొందుతాం.

[అధస్సూచి]

^ పేరా 7 హెబ్రీయులకు వ్రాసిన పత్రిక సా.శ. 61 లో వ్రాసినట్లనిపిస్తుంది. అది నిజమైతే, ఆ తర్వాత కేవలం అయిదు సంవత్సరాలకే సెస్టియస్‌ గాలస్‌ సైన్యం యెరూషలేమును చుట్టుముట్టింది. త్వరలోనే ఆ సైన్యం తిరిగి వెళ్ళిపోవడం వల్ల అప్రమత్తంగా ఉన్న క్రైస్తవులకు పారిపోవడానికి అవకాశం దొరికింది. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు జనరల్‌ టైటస్‌ ఆధ్వర్యంలో ఆ పట్టణం రోమా సైన్యం చేత నాశనం చేయబడింది.

మీకు జ్ఞాపకమున్నాయా?

• కొందరు హీబ్రూ క్రైస్తవులు నిజ విశ్వాసం నుండి ఎందుకు కొట్టుకుపోయారు?

• క్రైస్తవ కూటాల్లో మనం ఎలా అవధానాన్ని నిలపగలం?

• వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుండి, ధ్యానించడం నుండి ప్రయోజనం పొందేందుకు మనకు ఏది సహాయపడుతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[11వ పేజీలోని చిత్రం]

హీబ్రూ క్రైస్తవులు యెరూషలేముపైకి రాబోయే నాశనం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది

[13వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ కూటాల నుండి ప్రయోజనం పొందేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయవచ్చు