కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు నేర్చుకొన్న వాటిని ఆచరిస్తూనే ఉండండి

మీరు నేర్చుకొన్న వాటిని ఆచరిస్తూనే ఉండండి

మీరు నేర్చుకొన్న వాటిని ఆచరిస్తూనే ఉండండి

“మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును.”​—⁠ఫిలిప్పీయులు 4:⁠9.

1, 2. తాము మతాన్ని పాటిస్తున్నామని సాధారణంగా చెప్పుకొనే ప్రజల జీవితాల్లో బైబిలు ప్రభావం చూపిస్తోందా? వివరించండి.

“మతమేమో ప్రబలిపోతోంది, నీతి మాత్రం నిర్బలమవుతోంది.” ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ అనే వార్తాపత్రికలో కనబడ్డ ఈ శీర్షిక, అమెరికా దేశమంతటా జరిపిన సర్వే ఫలితాలను క్లుప్తంగా తెలియజేస్తోంది. చర్చికి వెళ్తూ మతానికి తమ జీవితంలో ప్రాముఖ్యమైన స్థానం ఉందని చెప్పుకునేవారు అధికమవడాన్ని ఆ దేశం గమనించినట్లు స్పష్టమవుతోంది. ఆ నివేదిక ఇంకా ఇలా చెబుతోంది: “ఈ సంఖ్యలు గమనార్హంగా ఉన్నప్పటికీ, మత విశ్వాసం వ్యక్తిగత జీవితాలపై మొత్తంగా సమాజంపై చూపిస్తున్న ప్రభావాన్ని అనేకమంది అమెరికా దేశస్థులు స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు.”

2 ఇలాంటి పరిస్థితి ప్రత్యేకించి ఏదో ఒక్క దేశానికే పరిమితం కాదు. ప్రపంచమంతటా, తాము బైబిలును అంగీకరిస్తున్నామనీ మతాన్ని పాటిస్తున్నామనీ చెప్పుకునే అనేకమంది, లేఖనాలు తమ జీవితాల్లో నిజమైన ప్రభావం చూపించడానికి ఏమాత్రం అనుమతించడంలేదు. (2 తిమోతి 3:⁠5) ఒక పరిశోధనా జట్టు నాయకుడు ఇలా వ్యాఖ్యానించాడు: “మనం ఇప్పటికీ బైబిలును ఉన్నతమైనదిగానే ఎంచుతున్నాం, కానీ దాన్ని చదవడం, అధ్యయనం చేయడం, అన్వయించుకోవడం వంటివాటికి సమయాన్ని వెచ్చించే విషయానికి వస్తే మాత్రం అది గతకాలం నాటి మాటే.”

3. (ఎ) నిజ క్రైస్తవులుగా మారినవారిపై బైబిలు ఎలా ప్రభావం చూపిస్తుంది? (బి) ఫిలిప్పీయులు 4:⁠9 లోని పౌలు సలహాను యేసు అనుచరులు ఎలా అన్వయించుకుంటారు?

3 అయితే, నిజ క్రైస్తవుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దేవుని వాక్యంలోని ఉపదేశాన్ని అన్వయించుకోవడం వారి ఆలోచల్లోనూ ప్రవర్తనలోనూ మార్పులు తెచ్చింది. అంతేగాక వారు కనబరిచే నవీనస్వభావం ఇతరులు వెంటనే గుర్తించేలా ఉంటుంది. (కొలొస్సయులు 3:​5-10) యేసు అనుచరులకు బైబిలంటే దుమ్మూ ధూళీ పేరుకుపోయేలా ఒక మూలకు ఉంచే పుస్తకం కాదు. దానికి భిన్నంగా అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలోని క్రైస్తవులకు ఇలా చెప్పాడు: “మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును.” (ఇటాలిక్కులు మావి.) (ఫిలిప్పీయులు 4:⁠9) క్రైస్తవులు దేవుని వాక్య సత్యాన్ని అంగీకరించడంతోనే ఆగిపోరు. వారు తమ కుటుంబంలోనూ ఉద్యోగ స్థలంలోనూ సంఘంలోనూ జీవితంలోని ఇతర రంగాల్లోనూ బైబిలు సలహాను అన్వయించుకొంటూ తాము నేర్చుకొన్నవాటిని ఆచరణలో పెడతారు.

4. దేవుని నియమాలను ఆచరణలో పెట్టడం ఎందుకు సులభం కాదు?

4 దేవుని నియమాలను ప్రమాణాలను ఆచరణలో పెట్టడం సులభమేమీ కాదు. బైబిలు “ఈ యుగ సంబంధమైన దేవత” అని పిలుస్తున్న అపవాదియైన సాతాను ఆధీనంలో ఉన్న లోకంలో మనం జీవిస్తున్నాం. (2 కొరింథీయులు 4:⁠4; 1 యోహాను 5:​19) కాబట్టి యెహోవా దేవుని పట్ల యథార్థంగా జీవించడంలో కొనసాగకుండా వచ్చే ఆటంకం ఏదైనాసరే దాని నుండి జాగ్రత్తగా ఉండడం ప్రాముఖ్యం. మరి మనం యథార్థవంతులుగా ఎలా ఉండగలం?

“హితవాక్యప్రమాణమును” గైకొనండి

5. “నన్ను వెంబడిస్తుండాలి” అని యేసు చేసిన వ్యాఖ్యాన భావమేమిటి?

5 మనం నేర్చుకొన్నవాటిని ఆచరించడంలోని ఒక అంశం, మనం అవిశ్వాసుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ సత్యారాధనలో విశ్వసనీయంగా కొనసాగేలా చేస్తుంది. అలా కొనసాగాలంటే కృషి చేయడం అవసరం. “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను [“వెంబడిస్తుండాలి,” NW]” అని యేసు అన్నాడు. (మత్తయి 16:​24) మనం ఒక వారమో, ఒక నెలో ఒక సంవత్సరమో తనను వెంబడించాలని యేసు అనలేదు. బదులుగా “నన్ను వెంబడిస్తుండాలి” అని ఆయన అన్నాడు. మన శిష్యరికం మన జీవితంలోని కొద్ది కాలం ఉండేదో లేదా ఇవ్వాళ ఉండి రేపు గతించిపోయేలాంటి దైవభక్తి మాత్రమే కాదని ఆయన మాటలు సూచిస్తున్నాయి. సత్యారాధనలో విశ్వసనీయంగా కొనసాగడమంటే, మనం ఎంపిక చేసుకొన్న మార్గంలో ఏమెదురైనా నమ్మకంగా సహించడమని దాని భావం. దాన్ని మనమెలా చేయగలం?

6. మొదటి శతాబ్దపు క్రైస్తవులు పౌలు నుండి నేర్చుకొన్న హితవాక్యప్రమాణము ఏమిటి?

6 పౌలు తన తోటి పనివాడైన తిమోతికి ఇలా ఉద్బోధించాడు: “క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్యప్రమాణమును గైకొనుము.” (2 తిమోతి 1:​13) పౌలు మాటల భావమేమిటి? “ప్రమాణము” అని ఇక్కడ అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థ భావం ఒక కళాకారుడు వేసిన రేఖా చిత్రాన్ని సూచిస్తుంది. ఆ రేఖా చిత్రంలో అధిక వివరాలు లేకున్నా దాంట్లో బాగా స్ఫుటంగా గీయబడిన రేఖలు ఉంటాయి, వాటిని బట్టి సూక్ష్మదృష్టిగల చూపరి మొత్తానికి ఆ చిత్రమేమిటో గ్రహించగలుగుతాడు. అదేవిధంగా పౌలు తిమోతికి, ఇతరులకు నేర్పించిన సత్య ప్రమాణము, ఎదురవ్వగల ప్రతీ ప్రశ్నకు నిర్దిష్టంగా జవాబిచ్చే విధంగా రూపొందించబడలేదు. అయినప్పటికీ, ఆ బోధలు సోదాహరణంగా సంతృప్తికరమైన మార్గదర్శకాన్ని​—⁠చిత్రంలోని రేఖల్లాగా​—⁠అందిస్తాయి, ఆ విధంగా యథార్థహృదయులు యెహోవా తమ నుండి ఏమి కోరుతున్నాడన్నది గ్రహించగలుగుతారు. యెహోవాను సంతోషపరచడానికి వారు తాము నేర్చుకొన్నవాటిని ఆచరించడం ద్వారా సత్య ప్రమాణాన్ని కాపాడుకోవాలి.

7. హితవాక్యప్రమాణాన్ని క్రైస్తవులు ఎలా అంటిపెట్టుకొని ఉండగలరు?

7 మొదటి శతాబ్దంలో హుమెనై, అలెక్సంద్రు, ఫిలేతు వంటి వ్యక్తులు “హితవాక్యప్రమాణము”నకు అనుగుణంగా లేని ఆలోచనలను ప్రోత్సహించారు. (1 తిమోతి 1:​18-20; 2 తిమోతి 2:​16-18) మతభ్రష్టుల చేత తప్పుడు మార్గంలో పడకుండా తొలి క్రైస్తవులు ఎలా తప్పించుకోగలిగారు? ప్రేరేపిత రచనలను జాగ్రత్తగా అధ్యయనం చేయడం ద్వారా, వాటిని తమ జీవితాల్లో అన్వయించుకోవడం ద్వారా తప్పించుకోగలిగారు. పౌలు మరియు ఇతర నమ్మకమైన వారు ఉంచిన మాదిరికి అనుగుణంగా నడుచుకునేవారు, తమకు బోధించబడిన సత్యప్రమాణానికి అనుగుణంగా లేనిదాన్ని గుర్తించి, తిరస్కరించగలిగారు. (ఫిలిప్పీయులు 3:​17; హెబ్రీయులు 5:​14) “తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడు”టకు బదులుగా వారు సరైన దైవభక్తి మార్గంలో ముందుకుసాగారు. (1 తిమోతి 6:​3-6) మనం నేర్చుకొన్న సత్యాలను అన్వయించుకుంటూ ఉంటే మనమూ అలాగే ముందుకుసాగుతాం. భూవ్యాప్తంగా యెహోవాను సేవిస్తున్న లక్షలాదిమంది, తమకు బోధించబడిన బైబిలు సత్యప్రమాణాన్ని దృఢంగా అంటిపెట్టుకొని ఉండడాన్ని చూడడం మన విశ్వాసాన్ని ఎంతో బలపరుస్తుంది.​—⁠1 థెస్సలొనీకయులు 1:​2-5.

“కల్పనాకథల”ను తిరస్కరించండి

8. (ఎ) నేడు మన విశ్వాసాన్ని నాశనం చేయడానికి సాతాను ఎలా ప్రయత్నిస్తాడు? (బి) 2 తిమోతి 4:⁠3, 4 లో పౌలు ఏమని హెచ్చరించాడు?

8 మనకు బోధించబడిన వాటిగురించి సందేహాలను విత్తడం ద్వారా సాతాను మన యథార్థతను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. మొదటి శతాబ్దంలోలాగే నేడు కూడా మతభ్రష్టులు, ఇతరులు అమాయకుల విశ్వాసాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. (గలతీయులు 2:⁠4; 5:​7, 8) కొన్నిసార్లు వారు యెహోవా ప్రజల పద్ధతుల గురించీ వారి ఉద్దేశాల గురించీ తప్పుడు సమాచారాన్ని లేదా పచ్చి అబద్ధాలను కూడా వ్యాపింపజేయడానికి మాధ్యమాలను ఉపయోగిస్తారు. అందుకే కొందరు సత్యాన్ని వదిలిపెట్టే అవకాశముందని పౌలు హెచ్చరించాడు. “ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును” అని ఆయన వ్రాశాడు.​—⁠2 తిమోతి 4:⁠3, 4.

9. పౌలు ‘కల్పనాకథలు’ అని అన్నప్పుడు ఆయన మనస్సులో ఏమి ఉండివుండవచ్చు?

9 హితవాక్యప్రమాణాన్ని అంటిపెట్టుకొని ఉండడానికి బదులుగా కొందరు “కల్పనాకథలవైపు” ఆకర్షితులయ్యారు. ఏమిటా కల్పనాకథలు? బహుశా పౌలు మనస్సులో పౌరాణిక కథల పుస్తకమైన తోబితులో కనబడే కథల్లాంటి కల్పిత పురాణాలు ఉండవచ్చు. * కల్పనాకథల్లో సంచలనాత్మకమైన, అనిర్దిష్టమైన పుకార్లు కూడా ఉండవచ్చు. అప్పుడు కూడా కొందరు​—⁠‘తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల చేత’​—⁠దేవుని ప్రమాణాలపై తేలిక భావం ఏర్పరచుకున్నవారి లేదా సంఘంలో నాయకత్వం వహిస్తున్నవారిని విమర్శించేవారి మోసపూరిత తెలివికి మోసపోతుండవచ్చు. (3 యోహాను 9, 10; యూదా 4) ఎలాంటి ఆటంకాలున్నా, కొందరైతే దేవుని వాక్య సత్యాలకంటే అబద్ధాలనే ఇష్టపడ్డారని స్పష్టమవుతోంది. త్వరలోనే వారు తాము నేర్చుకొన్న విషయాలను ఆచరించడం మానివేశారు, అది వారి సొంత ఆధ్యాత్మికతకు హాని కలిగించింది.​—⁠2 పేతురు 3:​15, 16.

10. ఈ కాలంలోని కొన్ని కల్పనాకథలు ఏవి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని యోహాను ఎలా నొక్కి చెప్పాడు?

10 మనం ఏమి వింటున్నాం ఏమి చదువుతున్నామనేది నిశితంగా పరిశీలించుకుని వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే కల్పనాకథలవైపుకు మనం ఆకర్షించబడకుండా ఉండగలం. ఉదాహరణకు, ప్రచార మాధ్యం తరచూ అవినీతికరమైన లైంగికతను ప్రోత్సహిస్తుంది. అజ్ఞాతవాదాన్ని లేదా పూర్తి నాస్తికత్వాన్ని అనేకమంది ప్రోత్సహిస్తారు. అతి విమర్శకులు బైబిలు దైవ ప్రేరేపితమైనదనే విషయాన్ని పరిహసిస్తారు. క్రైస్తవుల విశ్వాసాన్ని కూలద్రోయడానికి ఆధునిక దిన మతభ్రష్టులు సందేహపు విత్తనాలను విత్తడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. మొదటి శతాబ్దంలో అబద్ధ ప్రవక్తలు లేవదీసిన ఇలాంటి ప్రమాదం గురించి అపొస్తలుడైన యోహాను ఇలా హెచ్చరించాడు: “ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.” (1 యోహాను 4:⁠1) కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.

11. మనం విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకోవడానికి ఒక మార్గం ఏమిటి?

11 ఈ విషయమై పౌలు ఇలా వ్రాశాడు: “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి.” (2 కొరింథీయులు 13:⁠5) క్రైస్తవ నమ్మకాలన్నింటినీ అంటిపెట్టుకుని ఉంటున్నామా లేదా అని నిర్ధారించుకోవడానికి మనల్ని మనం పరీక్షించుకొంటూ ఉండాలని అపొస్తలుడు ఉద్బోధించాడు. అసంతృప్తిగా ఉండేవారివైపు మన చెవులు మొగ్గు చూపుతున్నట్లయితే మనల్ని మనం ప్రార్థనాపూర్వకంగా పరీక్షించుకోవాలి. (కీర్తన 139:​23, 24) యెహోవా ప్రజల్లో తప్పులు పట్టడానికి మనం మొగ్గు చూపుతున్నామా? అలా చేస్తున్నట్లయితే ఎందుకు చేస్తున్నాం? ఎవరి మాటలైనా చర్యలైనా మన మనస్సును నొప్పించాయా? అలా జరిగినట్లయితే, మనం ఆ విషయాలను సరైన విధంగా పరిశీలిస్తున్నామా? ప్రస్తుత విధానంలో మనం ఎదుర్కొనే ఏ శ్రమ అయినా సరే అది తాత్కాలికమే. (2 కొరింథీయులు 4:​17) మనం సంఘంలో కొన్ని పరీక్షలకు గురైనంత మాత్రాన దేవుణ్ణి సేవించడాన్ని ఎందుకు మానుకోవాలి? మనకు ఏ విషయంలోనైనా అసంతృప్తి కలిగితే, ఆ విషయాన్ని సరళీకరించడానికి మనకు సాధ్యమైనదంతా చేసి ఆ తర్వాత దాన్ని యెహోవా చేతుల్లో వదిలేయడం ఎంతో శ్రేష్ఠమైనది కాదా?​—⁠కీర్తన 4:⁠4; సామెతలు 3:​5, 6; ఎఫెసీయులు 4:​26.

12. బెరయలోని వారు మనకు చక్కని మాదిరిని ఎలా ఉంచారు?

12 విమర్శించడానికి బదులుగా, వ్యక్తిగత అధ్యయనంలో సంఘ కూటాల్లో పొందే సమాచారంపై ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరమైన దృక్పథాన్ని కాపాడుకుందాం. (1 కొరింథీయులు 2:​14, 15) దేవుని వాక్యాన్ని సందేహించడానికి బదులుగా, మొదటి శతాబ్దంలో లేఖనాలను చాలా జాగ్రత్తగా పరిశీలించిన బెరయలోని వారు చూపించిన వైఖరినే చూపించడం ఎంత వివేకవంతం! (అపొస్తలుల కార్యములు 17:​10, 11) అలాంటప్పుడు, కల్పనాకథలను తిరస్కరించి సత్యాన్ని అంటిపెట్టుకొని, మనం నేర్చుకొన్నవాటి ప్రకారం నడుచుకొందాం.

13. మనకు తెలియకుండానే మనం కల్పనాకథలను ఎలా వ్యాప్తి చేస్తుండవచ్చు?

13 మనం జాగ్రత్తగా ఉండాల్సిన మరో విధమైన కల్పనాకథ ఉంది. తరచూ ఇ-మెయిల్‌ ద్వారా సంచలనాత్మకమైన వృత్తాంతాలు విస్తృతంగా పంపిణీ చేయబడుతుంటాయి. అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి ఆ సమాచారానికి అసలైన మూలం ఎవరో మనకు తెలియనప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మంచి పేరున్న ఒక క్రైస్తవుడు ఒక అనుభవాన్ని గానీ కథను గానీ పంపించినా సరే, దానిలోని వాస్తవాల గురించి ఆయనకు స్వయంగా తెలియకపోవచ్చు. అందుకే ఖచ్చితంగా నిర్ధారించబడని వృత్తాంతాలను రిపీట్‌ చేసే విషయంలో లేదా ఫార్వర్డ్‌ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ప్రాముఖ్యం. “నాస్తిక కట్టుకథలను” గానీ “పవిత్రమైనదాన్ని అతిక్రమించే కల్పనాకథలను” గానీ మనం ఎంత మాత్రం పునరుచ్ఛరించాలని కోరుకోము. (1 తిమోతి 4:⁠7, న్యూ ఇంటర్నేషనల్‌ వర్షన్‌) మనం పరస్పరం ఒకరితో ఒకరం సత్యమే మాట్లాడుకోవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి, మనకు తెలియకుండానే అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు కారణమయ్యేది ఏదైనా ఉంటే దాన్ని తిరస్కరిస్తే మనం వివేకవంతంగా ప్రవర్తిస్తున్నట్లే.​—⁠ఎఫెసీయులు 4:​25.

సత్యాన్ని అవలంబించడం వల్ల కలిగే సానుకూల ఫలితాలు

14. దేవుని వాక్యం నుండి మనం నేర్చుకొన్న విషయాలను ఆచరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

14 వ్యక్తిగత బైబిలు అధ్యయనం ద్వారా, క్రైస్తవ కూటాల ద్వారా మనం నేర్చుకొన్న వాటిని ఆచరించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు, విశ్వాస విషయంలో మనతో సంబంధమున్నవారితో మన సంబంధాలు వృద్ధి చెందడాన్ని మనం చూడవచ్చు. (గలతీయులు 6:​10) మనం బైబిలు సూత్రాలను అన్వయించుకున్నప్పుడు మన స్వభావం మంచిగా మారుతుంది. (కీర్తన 19:⁠8) అంతేకాదు, నేర్చుకొన్నవాటిని ఆచరించడం ద్వారా మనం ‘దేవుని ఉపదేశమును అలంకరిస్తాము,’ తద్వారా ఇతరులను సత్యారాధన వైపుకు ఆకర్షించవచ్చు.​—⁠తీతు 2:​6-10.

15. (ఎ) ఒక యౌవనస్థురాలు స్కూల్లో సాక్ష్యమివ్వడానికి ఎలా ధైర్యం తెచ్చుకొంది? (బి) ఈ అనుభవం నుండి మీరేమి నేర్చుకొన్నారు?

15 వ్యక్తిగత బైబిలు అధ్యయనం ద్వారా, క్రైస్తవ ప్రచురణల ద్వారా, సంఘ కూటాలకు క్రమంగా హాజరవడం ద్వారా తాము నేర్చుకొన్న విషయాలను ఆచరిస్తున్న యౌవనులు యెహోవాసాక్షుల్లో అనేకమంది ఉన్నారు. వారి చక్కని ప్రవర్తన, స్కూల్లోని ఉపాధ్యాయులకూ తోటి విద్యార్థులకూ శక్తివంతమైన సాక్ష్యం. (1 పేతురు 2:​12) అమెరికాలోని 13 సంవత్సరాల లెస్లీ విషయం గమనించండి. సాధారణంగా తన విశ్వాసం గురించి తోటి విద్యార్థులతో మాట్లాడడమంటే తనకు కష్టంగా ఉండేదని ఆమె ఒప్పుకుంటోంది, కానీ ఒకరోజు ఆ పరిస్థితి తారుమారయ్యింది. “క్లాసులో, ప్రజలు తమ వస్తువులను మీకు అమ్మడానికి ఎలా ప్రయత్నిస్తారనే విషయం గురించి చర్చ జరుగుతోంది. ఒక అమ్మాయి తన చేతిని పైకెత్తి, దానికి యెహోవాసాక్షులు ఒక ఉదాహరణ అని చెప్పింది.” ఒక యెహోవాసాక్షిగా లెస్లీ ఎలా ప్రతిస్పందించింది? “నేను నా విశ్వాసాన్ని సమర్థించుకొన్నాను, సాధారణంగా స్కూల్లో నెమ్మదిగా ఉండే నేను అలా ప్రతిస్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచిందనడంలో సందేహం లేదు” అని ఆమె అంటోంది. లెస్లీ ధైర్యానికి ఫలితం? “కొన్ని సందేహాలున్న ఒక విద్యార్థికి నేను ఒక బ్రోషుర్‌ను, ఒక కరపత్రాన్ని ఇవ్వగలిగాను” అని లెస్లీ చెబుతోంది. తాము నేర్చుకొన్న వాటిని ఆచరించే యౌవనులు స్కూల్లో సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యం తెచ్చుకొన్నప్పుడు యెహోవా ఎంత సంతోషిస్తాడో కదా!​—⁠సామెతలు 27:​11; హెబ్రీయులు 6:​10.

16. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ఒక యౌవన సాక్షికి ఎలా ప్రయోజనం చేకూర్చింది?

16 ఎలిజబెత్‌ది మరొక ఉదాహరణ. ఈ అమ్మాయి తనకు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో నియామకం ఉన్నప్పుడల్లా తన టీచర్లను రాజ్యమందిరానికి ఆహ్వానించడాన్ని తన ఏడవ ఏట ప్రారంభించి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నంత కాలం అలాగే చేసింది. ఏ టీచరైనా హాజరు కాలేకపోతే, ఎలిజబెత్‌ స్కూలు అయిపోయిన తర్వాత కాసేపు ఉండి ఆ టీచరు ఎదుట తన ప్రసంగాన్ని వినిపించేది. హైస్కూల్లోని తన చివరి సంవత్సరంలో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎలిజబెత్‌ పది పేజీల నివేదికను తయారుచేసి నలుగురు టీచర్ల సమక్షంలో సమర్పించింది. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో జరిగే ఒక ప్రసంగ మాదిరిని ఇవ్వడానికి కూడా ఆమె ఆహ్వానించబడింది, అప్పుడు ఆమె “దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు?” అనే అంశాన్ని ఎంపిక చేసుకుంది. యెహోవాసాక్షులు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ద్వారా నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమం నుండి ఎలిజబెత్‌ ప్రయోజనాన్ని పొందింది. యెహోవా వాక్యం నుండి తాము నేర్చుకొన్న వాటిని ఆచరించడం ద్వారా ఆయనకు కీర్తిని తీసుకువస్తున్న అనేక యువ క్రైస్తవుల్లో ఆమె కేవలం ఒక్కర్తె మాత్రమే.

17, 18. (ఎ) నిజాయితీ విషయంలో బైబిలు ఏమని ఉపదేశిస్తోంది? (బి) ఒక యెహోవాసాక్షి నిజాయితీ గల ప్రవర్తనకు ఒక వ్యక్తి ఎలా ప్రభావితుడయ్యాడు?

17 అన్ని విషయాల్లోనూ నిజాయితీగా ప్రవర్తించమని బైబిలు క్రైస్తవులను ఉద్బోధిస్తోంది. (హెబ్రీయులు 13:​18) వంచన, ఇతరులతో ఉన్న సంబంధాన్నేగాక, ప్రాముఖ్యంగా యెహోవాతో ఉన్న సంబంధాన్ని కూడా నాశనం చేయగలదు. (సామెతలు 12:​22) విశ్వసనీయమైన మన ప్రవర్తన మనం నేర్చుకొన్న విషయాలను ఆచరిస్తున్నామనే దానికి రుజువునిస్తుంది, అనేకమంది యెహోవాసాక్షుల పట్ల ప్రగాఢ గౌరవాన్ని కలిగివుండేందుకు అది హేతువయ్యింది.

18 మిలటరీలో పనిచేస్తున్న ఫిలిప్పు అనే ఒక వ్యక్తి అనుభవాన్ని గమనించండి. ఆయన సంతకం చేసిన ఒక బ్లాంకు చెక్కును ఎక్కడో పొగొట్టుకున్నాడు, ఆ విషయం ఆయన తనకు పోస్టులో ఆ చెక్కు తిరిగి వచ్చేంతవరకు గమనించుకోలేదు. ఆ చెక్కు ఒక యెహోవాసాక్షికి దొరికింది, ఆ చెక్కును తిరిగి పంపడానికి తన మత విశ్వాసాల పురికొల్పే కారణమని దానితో పాటు ఉన్న ఒక కాగితం ద్వారా తెలిసింది. ఫిలిప్పు విస్మయమొందాడు. “మొత్తం డబ్బు 4,32,000 రూపాయలను తీసుకొని నన్ను దివాలా తీయించే అవకాశం వారికి ఉంది!” అని ఆయన అన్నాడు. మరొక సందర్భంలో తన టోపీ చర్చిలో దొంగిలించబడినందుకు ఆయన నిరాశచెందాడు. స్పష్టంగా, ఒక పరిచితుడు ఆయన టోపీని తీసుకున్నాడు, మరోవైపున ఒక అపరిచితుడు లక్షల విలువగల చెక్కును తిరిగి పంపించాడు! నిజంగానే, నిజాయితీ గల క్రైస్తవులు యెహోవాకు కీర్తిని తీసుకువస్తారు!

మీరు నేర్చుకొన్న వాటిని ఆచరించడంలో కొనసాగండి

19, 20. మనం నేర్చుకొనే లేఖనాధార విషయాల ప్రకారం ప్రవర్తించినట్లయితే మనమెలా ప్రయోజనం పొందుతాము?

19 దేవుని వాక్యం నుండి తాము నేర్చుకొన్న వాటిని ఆచరించేవారు ప్రయోజనాలను సమృద్ధిగా పొందుతారు. శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.” (యాకోబు 1:​25) అవును, మనం నేర్చుకొన్న లేఖనాధారిత విషయాల ప్రకారం ప్రవర్తించినట్లయితే, నిజమైన సంతోషాన్ని పొందడంతోపాటు జీవితంలోని ఒత్తిళ్ళను చక్కగా ఎదుర్కోగలుగుతాం. మనలో అత్యధికులం యెహోవా ఆశీర్వాదాలను పొందుతాం, నిత్యజీవపు అపేక్షను కలిగివుంటాం.​—⁠సామెతలు 10:​22; 1 తిమోతి 6:⁠6.

20 అలాగైతే, ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూనే ఉండండి. యెహోవా ఆరాధకులతో క్రమంగా సమావేశమై, క్రైస్తవ కూటాల్లో అందించబడే సమాచారంపై అవధానం నిలపండి. మీరు నేర్చుకొన్న వాటిని అన్వయించుకోండి, ఆచరిస్తూనే ఉండండి, “అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును.”​—⁠ఫిలిప్పీయులు 4:⁠9.

[అధస్సూచి]

^ పేరా 9 సుమారు సా.శ.పూ. మూడవ శతాబ్దంలో వ్రాయబడిన తోబీతు అనే పుస్తకంలో, తోబియా అనే ఒక యూదుని గురించిన మూఢనమ్మకాలతో నిండిన కట్టుకథ ఉంది. అందులో ఆయన ఒక రాక్షస చేప యొక్క గుండె, పిత్తము, కాలేయాలను ఉపయోగించి రోగాన్ని నయంచేసే శక్తినీ దయ్యాన్ని వెళ్ళగొట్టే శక్తినీ పొందాడని చెప్పబడింది.

మీకు జ్ఞాపకమున్నాయా?

• “హితవాక్యప్రమాణము” అంటే ఏమిటి, దాన్ని మనమెలా అంటిపెట్టుకొని ఉండగలం?

• ఏ “కల్పనాకథల”ను మనం తిరస్కరించాలి?

• దేవుని వాక్యం నుండి తాము నేర్చుకొనే వాటిని ఆచరించేవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[17వ పేజీలోని చిత్రం]

మతభ్రష్టుల చేత తప్పుడు మార్గంలో పడకుండా తొలి క్రైస్తవులు ఎలా తప్పించుకోగలిగారు?

[18వ పేజీలోని చిత్రాలు]

మాధ్యమాల ద్వారా, ఇంటర్‌నెట్‌ ద్వారా, ఆధునిక దిన మతభ్రష్టుల ద్వారా సందేహాల విత్తనాలు విత్తబడగలవు

[19వ పేజీలోని చిత్రం]

నిర్ధారించబడని నివేదికలను పంపిణీ చేయడం భావ్యం కాదు

[20వ పేజీలోని చిత్రాలు]

ఉద్యోగ స్థలంలో, స్కూల్లో, మరితర స్థలాల్లో యెహోవాసాక్షులు తాము దేవుని వాక్యంలో చదివే దాన్ని అన్వయించుకుంటారు