“రక్షణ యెహోవాది”
“రక్షణ యెహోవాది”
జాతీయ సంక్షోభం, అంతర్జాతీయ ఉద్రిక్తత సమయాల్లో ప్రజలు రక్షణ కోసం భద్రత కోసం తమ తమ ప్రభుత్వాల వైపు చూస్తారు. ప్రభుత్వాలు తమ వంతుగా, ప్రజలందరి మద్దతును కూడదీయడానికి రూపొందించబడిన ప్రణాళికలను తీవ్రతరం చేస్తాయి. ఇలాంటివి దేశభక్తిని ఎంత ఎక్కువగా ప్రోత్సహిస్తే, దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాలు అంత ఉత్సాహంగా, అంత తరచుగా నిర్వహించబడతాయి.
దేశానికి ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ప్రజలకున్న ప్రగాఢమైన దేశభక్తి తరచూ వారికి ఐక్యతాభావాన్ని, శక్తిని ఇస్తుంది, వారి మధ్య పరస్పరం సహకరించుకునే స్ఫూర్తిని ప్రోత్సహించి సమాజ అవసరాలకూ ఆసక్తులకూ సుముఖంగా ప్రతిస్పందించేలా చేయవచ్చు. అయితే, “దేశభక్తి వేరే ఇతర భావోద్రేకాల్లా ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము” ఎందుకంటే “ఒకసారి అదుపులేకుండా వ్యక్తం చేయబడడానికి అనుమతిస్తే, అది చాలా ఘోరమైన విధాల్లో వ్యక్తం చేయబడగలదు” అని ద న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్‌లోని ఒక ఆర్టికల్ నివేదించింది. దేశభక్తికి సంబంధించిన సాధారణ వ్యక్తీకరణలు, పౌరసంబంధ స్వేచ్ఛపై, దేశంలోని నిర్దిష్ట పౌరుల మతస్వాతంత్ర్యంపై అన్యాయంగా ఆక్రమణ చేసే చర్యలుగా మారవచ్చు. ప్రత్యేకించి నిజక్రైస్తవులు తమ నమ్మకాలతో రాజీపడేందుకు ఒత్తిడి చేయబడతారు. తమ చుట్టూవున్న లోకాన్ని ఇలాంటి వాతావరణం ఆవరించినప్పుడు వారు ఎలా నడుచుకుంటారు? వివేచనతో వ్యవహరించడానికి, దేవునిపట్ల యథార్థతను కాపాడుకోవడానికి వారికి ఏ లేఖనాధారిత సూత్రాలు సహాయపడతాయి?
“వాటికి సాగిలపడకూడదు”
కొన్నిసార్లు, జాతీయ పతాకానికి వందనం చేయడం దేశభక్తి భావాలను వ్యక్తం చేయడానికి ప్రజాదరణ పొందిన పద్ధతి అవుతుంది. కానీ జెండాలపై తరచూ, నక్షత్రాల వంటి ఆకాశమందున్నవాటి చిత్రాలు, భూమిపైనున్నవాటి చిత్రాలు ఉంటాయి. “పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను” అని యెహోవా తన ప్రజలకు ఆజ్ఞాపించినప్పుడు, అలాంటి వాటికి సాగిలపడడం విషయంలో తన దృక్కోణాన్ని వ్యక్తంచేశాడు.—నిర్గమకాండము 20:4, 5.
ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించే జెండాకు వందనం చేయడం లేదా దాని ఎదురుగా మోకరిల్లడం, యెహోవా దేవునికి అనితర భక్తిని చూపడానికి నిజంగా వ్యతిరేకమైనదా? అరణ్యప్రాంతంలో ఉన్నప్పుడు తమ మూడు తెగల ధ్వజములు కూడుకోవడానికి ప్రాచీన ఇశ్రాయేలీయులకు “చిహ్నాలు” లేక ప్రమాణాలు ఉండేవి. (సంఖ్యాకాండము 2:1, 2, NW) అలాంటి ప్రమాణాలను నిర్దేశించే హీబ్రూ పదాల గురించి వ్యాఖ్యానిస్తూ మాక్‌క్లింటాక్ మరియు స్ట్రాంగ్‌ల సైక్లోపీడియా ఇలా అంటోంది: “ఆ హీబ్రూ పదాలలో ఏదీ కూడా ‘ప్రమాణం’ అనే పదం మన మనస్సుకు తెచ్చే తలంపును అంటే జెండా అనే తలంపును వ్యక్తం చేయడంలేదు.” అంతేకాకుండా, ఇశ్రాయేలీయుల ప్రమాణాలు పవిత్రమైనవిగా దృష్టించబడేవి కావు, వాటి ఉపయోగానికి సంబంధించి ఎటువంటి లాంఛనాలు జతచేయబడేవి కాదు. అవి కేవలం ప్రజలు ఎక్కడ కూడుకోవాలో చూపించడానికి చిహ్నాలుగా ఆచరణాత్మకంగా ఉపయోగపడేవి.
గుడారములో, సొలొమోను ఆలయంలో ఉన్న కెరూబుల ప్రతిరూపాలు ప్రాథమికంగా పరలోకములోని కెరూబులను వర్ణించే చిత్రాలుగా ఉపయోగించబడేవి. (నిర్గమకాండము 25:18; 26:1, 31, 33; 1 రాజులు 6:23, 28, 29; హెబ్రీయులు 9:23, 24) కెరూబుల ఈ కళాత్మకమైన ప్రతిరూపాలు ఆరాధించబడడానికి కాదన్న విషయం, సాధారణ ప్రజలు వాటిని ఎన్నడూ చూసే అవకాశం లేదన్న వాస్తవం నుండి, దేవదూతలు కూడా ఆరాధించబడకూడదన్న వాస్తవం నుండి స్పష్టమవుతోంది.—కొలొస్సయులు 2:18, 19; ప్రకటన 19:10; 22:8, 9.
ఇశ్రాయేలీయులు అరణ్యప్రాంతంలో తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకున్నప్పుడు ప్రవక్తయైన మోషే తయారుచేసిన ఇత్తడి సర్పం గురించి కూడా ఆలోచించండి. ఆ రూపం లేదా ప్రతిమ ఒక చిహ్నంగా ఉపయోగపడింది, దానికి ప్రవచనార్థక ప్రాధాన్యత ఉండేది. (సంఖ్యాకాండము 21:4-9; యోహాను 3:14, 15) అది గౌరవించబడలేదు, ఆరాధన కోసం ఉపయోగించబడలేదు. అయితే, మోషే కాలం గడిచిన శతాబ్దాల తర్వాత, ఇశ్రాయేలీయులు అదే ప్రతిమను అనుచితంగా ఆరాధించడం ప్రారంభించారు, దానికి ధూపం కూడా వేసేవారు. కాబట్టి, యూదా రాజైన హిజ్కియా దాన్ని ఛిన్నాభిన్నములుగా చేశాడు.—2 రాజులు 18:1-4.
జాతీయ జెండాలు కేవలం ఏదో ఉపయోగకరమైన కార్యాన్ని నెరవేర్చే చిహ్నాలు మాత్రమేనా? అవి దేనిని సూచిస్తాయి? “జెండా, జాతీయతకున్న ప్రధానమైన విశ్వాసపు చిహ్నం, ఆరాధనకు కేంద్ర వస్తువు” అని జె. పౌల్ విలియమ్స్ అనే రచయిత పేర్కొన్నాడు. ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా ఇలా అంటోంది: “సిలువ వలే జెండా కూడా పవిత్రమైనది.” జెండా ఒక దేశానికి చిహ్నంగా ఉంటుంది. కాబట్టి, దానికి సాగిలపడడం లేదా దానికి వందనం చేయడం, దేశానికి భక్తిని చూపే ఒక మతపరమైన లాంఛనం. అలాంటి చర్య దేశం తమను రక్షిస్తుందన్న భావాన్నిస్తుంది, అది విగ్రహారాధన గురించి బైబిలు చెబుతున్నదానితో పొందికగా ఉండదు.
“రక్షణ యెహోవాది” అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. (కీర్తన 3:8) మానవ సంస్థలకు లేదా వాటి చిహ్నాలకు రక్షణను ఆపాదించకూడదు. “నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపొండి” అని అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు ఉద్బోధించాడు. (1 కొరింథీయులు 10:14) తొలి క్రైస్తవులు దేశాన్ని ఆరాధించే చర్యలలో భాగం వహించలేదు. దోస్ ఎబౌట్ టు డై అనే పుస్తకంలో డానియల్ పి. మాన్నిక్స్ ఇలా వ్యాఖ్యానిస్తున్నారు: “[రోమన్] చక్రవర్తి యొక్క సంరక్షక ఆత్మకు బలులు అర్పించడానికి . . . క్రైస్తవులు నిరాకరించారు—ఇది నేడు జెండా వందనం చేయడానికి నిరాకరించడంతో దాదాపు సమానం.” నేడు, నిజ క్రైస్తవులు కూడా అలాగే చేస్తారు. యెహోవాకు అనితర భక్తిని చూపడానికి, వారు ఏ దేశ జెండాకైనా సరే వందనం చేయడాన్ని నివారిస్తారు. అలా చేయడం ద్వారా, ప్రభుత్వాలకూ పరిపాలకులకూ గౌరవం చూపిస్తూనే, వారు దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచుతారు. అవును, ప్రభుత్వానికి సంబంధించిన “పై అధికారులకు” లోబడవలసిన తమ బాధ్యతను వారు గుర్తిస్తారు. (రోమీయులు 13:1-7) అయితే మరి, జాతీయగీతాల వంటి దేశభక్తి గీతాలను పాడే విషయంలో లేఖనాధారిత దృక్కోణం ఏమిటి?
జాతీయగీతాలంటే ఏమిటి?
“జాతీయగీతాలు దేశభక్తిని వ్యక్తంచేసే పదబంధాలు, వాటిలో తరచూ ప్రజలకూ పరిపాలకులకూ దైవిక నడిపింపునివ్వమని, రక్షించమని చేసే అభ్యర్థనలు ఉంటాయి” అని ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా చెబుతోంది. జాతీయగీతం నిజానికి దేశం కోసం చేసే భజన కీర్తన లేదా ప్రార్థన. అది సాధారణంగా దేశం వస్తుసంపదలతో వర్ధిల్లాలనీ దీర్ఘకాలంపాటు నిలిచివుండాలనీ అభ్యర్థిస్తుంది. నిజ క్రైస్తవులు ఇలాంటి ప్రార్థనల్లో పాల్గొనాలా?
ప్రవక్తయైన యిర్మీయా, దేవుడ్ని సేవిస్తున్నామని చెప్పుకునే ప్రజల మధ్య జీవించాడు. అయినప్పటికీ, “నీవు ఈ జనము కొరకు ప్రార్థనచేయకుము, వారికొరకు మొఱ్ఱనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను” అని యెహోవా ఆయనకు ఆజ్ఞాపించాడు. (యిర్మీయా 7:16; 11:14; 14:11) యిర్మీయాకు ఈ ఆజ్ఞ ఎందుకివ్వబడింది? ఎందుకంటే వారి సమాజం జారచోర క్రియలతో, నరహత్యలతో, అబద్ధసాక్ష్యాలతో, విగ్రహారాధనతో నిండివుంది.—యిర్మీయా 7:9, 10.
యేసుక్రీస్తు, ‘నేను లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించియున్న వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను’ అని చెప్పినప్పుడు ఒక మాదిరిని ఉంచాడు. (యోహాను 17:9) ‘లోకమంతయు దుష్టుని యందున్నది,’ అది ‘గతించిపోవుచున్నది’ అని లేఖనాలు చెబుతున్నాయి. (1 యోహాను 2:17; 5:19) అలాంటప్పుడు, ఈ విధానం వర్ధిల్లాలనీ దీర్ఘకాలం నిలిచివుండాలనీ నిజక్రైస్తవులు మనఃపూర్వకంగా ఎలా ప్రార్థించగలరు?
నిజమే, అన్ని జాతీయగీతాలలోనూ దేవునికి చేసే అభ్యర్థనలు ఉండవు. “జాతీయగీతాల భావాలు భిన్నంగా ఉంటాయి, అది చక్రవర్తి కోసం చేసే ప్రార్థన కావచ్చు, దేశానికి సంబంధించి జరిగిన ప్రాముఖ్యమైన యుద్ధాల గురించిన లేదా విప్లవాల గురించిన ప్రస్తావన కావచ్చు, దేశభక్తి భావాలు వ్యక్తం చేయడం కావచ్చు” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. కానీ దేవుణ్ణి ప్రీతిపర్చాలనుకునేవారు ఏ దేశమైనా చేసే యుద్ధాలను విప్లవాలను బట్టి సంతోషించవచ్చా? సత్యారాధకుల గురించి యెషయా ఇలా ప్రవచించాడు: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు.” యెషయా 2:4) ‘మనము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీరప్రకారము యుద్ధము చేయము. మన యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావు’ అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.—2 కొరింథీయులు 10:3, 4.
(జాతీయగీతాలు తరచూ జాతీయ అహంభావానికి లేదా ఉన్నతత్వానికి సంబంధించిన భావాలను వ్యక్తం చేస్తాయి. ఈ దృక్కోణానికి లేఖనాధారం లేదు. ‘యావద్భూమిమీద కాపురముండుటకు [యెహోవా దేవుడు] యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించాడు’ అని అపొస్తలుడైన పౌలు అరేయొపగు కొండ మీద ఇచ్చిన ప్రసంగంలో చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 17:26, 27) ‘దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును’ అని అపొస్తలుడైన పేతురు పేర్కొన్నాడు.—అపొస్తలుల కార్యములు 10:34, 35.
బైబిలు గురించి తమకున్న అవగాహనను బట్టి చాలామంది జెండా వందనం చేయకూడదని, దేశభక్తి గీతాలను పాడకూడదని వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇలాంటి విషయాలు వారికి వ్యక్తిగతంగా ఎదురయ్యే పరిస్థితులలో వారు ఎలా నడుచుకుంటారు?
గౌరవపూర్వకంగా నివారించండి
ప్రాచీన బబులోను రాజైన నెబుకద్నెజరు తన సామ్రాజ్య ఐక్యతను బలపర్చడానికి ప్రయత్నిస్తూ దూరా మైదానంలో ఒక పెద్ద బంగారు ప్రతిమను నిలబెట్టించాడు. ఆ తర్వాత ఆయన ఒక ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, దానికి తన అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఇతర పై అధికారులను ఆహ్వానించాడు. అక్కడ కూడుకున్నవారందరూ సంగీతం వినబడగానే సాగిలపడి ఆ ప్రతిమను ఆరాధించాలి. ఆ సందర్భంలో అక్కడ ఉండవలసిన వారిలో ముగ్గురు యౌవన హెబ్రీయులు—షద్రకు, మేషాకు, అబేద్నెగో—ఉన్నారు. తాము ఈ మతపరమైన లాంఛనంలో పాల్గొనడం లేదని వారు ఎలా చూపించారు? సంగీతం ప్రారంభమైనప్పుడు, అక్కడున్నవారందరూ ప్రతిమ ఎదుట సాగిలపడితే ఈ ముగ్గురు హెబ్రీయులు మాత్రం నిలబడే ఉండిపోయారు.—దానియేలు 3:1-12.
నేడు, సాధారణంగా చెయ్యి చాపడం ద్వారా, చెయ్యిని నుదురు దగ్గర పెట్టుకోవడం ద్వారా లేదా చెయ్యిని హృదయంపై పెట్టుకోవడం ద్వారా జెండా వందనం చేస్తారు. కొన్నిసార్లు, ప్రత్యేకమైన శరీర భంగిమలు అవసరం కావచ్చు. కొన్ని దేశాలలో, స్కూలు పిల్లలు జెండా ఎదుట మోకరిల్లి దాన్ని ముద్దుపెట్టుకోవాలని ఆశించబడుతుంది. ఇతరులు జెండా వందనం చేస్తుండగా నిజ క్రైస్తవులు నిశ్శబ్దంగా నిలబడడం ద్వారా తాము గౌరవపూర్వకమైన ప్రేక్షకులమని స్పష్టం చేస్తారు.
కేవలం నిలబడడం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు స్పష్టం చేసేవిధంగా ఒక జెండా లాంఛనం
నిర్వహించబడితే ఎలా? ఉదాహరణకు, మొత్తం స్కూలుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఒక విద్యార్థి ఎంపిక చేయబడ్డాడనుకోండి, ఆ విద్యార్థి బయట జెండా వందనం చేస్తుండగా మిగతా విద్యార్థులందరూ క్లాసురూములో శ్రద్ధతో నిటారుగా నిలబడాలని ఆశించబడుతుంది. ఈ సందర్భంలో కేవలం నిలబడడం కూడా, బయటవున్న విద్యార్థి జెండా వందనం చేసేటప్పుడు వ్యక్తిగతంగా తనకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడని అంగీకరిస్తున్నట్లు చూపిస్తుంది. ఏ విధంగా నిలబడినప్పటికీ, అది ఆ లాంఛనంలో భాగం వహించడాన్నే సూచిస్తుంది. ఇలాంటి సందర్భంలో, కేవలం గౌరవపూర్వకమైన ప్రేక్షకులుగా ఉండాలని కోరుకునేవారు నిశ్శబ్దంగా కూర్చునే ఉంటారు. క్లాసులోని వారందరూ అప్పటికే నిలబడి ఉండగా ఒక లాంఛనం ప్రారంభమైతే, అప్పుడెలా? ఈ సందర్భంలో నిలబడే ఉండడం, దానిలో పాల్గొంటున్నట్లు సూచించదు.ఒక ఊరేగింపులో లేదా క్లాసురూములో జెండా వందనం చేయవద్దు కానీ ఇతరులు చేయడానికి వీలుగా జెండా పట్టుకోమని అడగడం జరిగిందనుకోండి. అది, లేఖనాలలో ఆజ్ఞాపించబడినట్లు ‘విగ్రహారాధన నుండి దూరముగా పారిపోవడానికి’ బదులు ఆ లాంఛనం జరిగేటప్పుడు కేంద్రస్థానంలో ఉన్నట్లు అవుతుంది. దేశభక్తికి సంబంధించిన ఊరేగింపులలో పాల్గొనడం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అలా చేస్తే ఆ ఊరేగింపు ద్వారా ఏదైతే గౌరవించబడుతుందో దానికి మద్దతునిచ్చినట్లవుతుంది. కాబట్టి నిజ క్రైస్తవులు మనస్సాక్షిపూర్వకంగా దాన్ని చేయరు.
జాతీయగీతాలు ప్లే చేయబడుతున్నప్పుడు, సాధారణంగా ఒక వ్యక్తి తాను కూడా ఆ పాటలోని భావాలను కలిగివున్నాడని చూపించడానికి కేవలం లేచి నిలబడాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో, క్రైస్తవులు కూర్చునే ఉంటారు. అయితే జాతీయగీతం ప్లే చేయబడుతున్నప్పుడు వారు అప్పటికే నిలబడి ఉంటే, అప్పుడు ప్రత్యేకించి కూర్చోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యేకించి జాతీయగీతం కోసం నిలబడాలనేమీ వారు ఎంపిక చేసుకోలేదు. మరోవైపు, ఒక గుంపు లేచి నిలబడి పాడాలని ఆశించబడితే అప్పుడు గౌరవంతో కేవలం లేచి నిలబడి, పాడకుండా ఉండడం ఆ పాటలోని భావాలతో ఏకీభవిస్తున్నట్లు సూచించదు.
‘నిర్మలమైన మనస్సాక్షి కలిగివుండండి’
పూజకోసం మానవుడు చేసుకున్న వస్తువుల అశక్తతను వర్ణించిన తర్వాత కీర్తనకర్త ఇలా అన్నాడు: “వాటిని చేయువారును కీర్తన 115:4-8) కాబట్టి జాతీయ జెండాలతో సహా పూజకు అవసరమైన వస్తువుల ఉత్పత్తి ప్రత్యక్షంగా చేరివున్న ఏ ఉద్యోగమైనప్పటికీ యెహోవా ఆరాధకులకు అంగీకారయోగ్యమైనది కాదని స్పష్టమవుతోంది. (1 యోహాను 5:21) క్రైస్తవులు తాము జెండాను లేదా అది దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందో దానిని ఆరాధించరు కానీ కేవలం యెహోవానే ఆరాధిస్తారు అని గౌరవపూర్వకంగా చూపాల్సిన ఇతర ఉద్యోగపరమైన పరిస్థితులు కూడా ఎదురవ్వవచ్చు.
వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.” (ఉదాహరణకు, ఒక యజమాని తన క్రింద పనిచేసే ఉద్యోగస్థుడిని ఒక బిల్డింగు దగ్గరున్న జెండాను ఎగరేయమనో క్రిందికి దించమనో అడగవచ్చు. ఒక వ్యక్తి అలా చేస్తాడా చేయడా అనేది ఆయన పరిస్థితులను వ్యక్తిగతంగా ఎలా దృష్టిస్తాడన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. జెండాను ఎగరేయడం లేదా క్రిందికి దించడం ఒక ప్రత్యేకమైన లాంఛనంలో భాగమైతే, అక్కడున్న ప్రజలు శ్రద్ధతో నిటారుగా నిలబడి జెండా వందనం చేస్తుంటే అప్పుడు ఆ పని చేయడం ఆ కార్యక్రమంలో భాగం వహించినట్లే అవుతుంది.
మరోవైపు, జెండాను ఎగరేయడం లేదా క్రిందకి దించడంతోపాటు ఏ లాంఛనం లేకపోతే అప్పుడు ఆ పని చేయడమనేది ఆ బిల్డింగ్‌ను ఉపయోగించడానికి దాన్ని సిద్ధపర్చడం, తలుపులకు తాళాలు వేయడమూ తీయడమూ, కిటికీలు తెరవడమూ మూయడమూ వంటి పనులు చేయడంతో సమానంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో, జెండా కేవలం ఆ దేశానికి సంబంధించిన చిహ్నం మాత్రమే. చేయవలసిన ఇతర నిత్యకృత్యాలతో పాటు జెండాను ఎగరేయడం లేదా క్రిందికి దించడం అనేది ఒక వ్యక్తి బైబిలు శిక్షిత మనస్సాక్షి ఆదేశాల ఆధారంగా తీసుకునే వ్యక్తిగత నిర్ణయమై ఉంటుంది. (గలతీయులు 6:5) ఆ వ్యక్తి జెండాను ఎగరేయడానికి, క్రిందికి దించడానికి వేరే ఉద్యోగస్థుడిని నియమించమని తన సూపర్‌వైజర్‌ను అడగడానికి ఆయన మనస్సాక్షి ఆయనను కదిలించవచ్చు. మరొక క్రైస్తవుడు, జెండాతో వ్యవహరించేటప్పుడు దానితో ఏ లాంఛనం ముడిపడి లేనంత వరకూ తాను అలా చేయడానికి తన మనస్సాక్షి అనుమతిస్తుందని భావించవచ్చు. నిర్ణయం ఏదైనప్పటికీ నిజ ఆరాధకులు దేవుని యెదుట ‘నిర్మలమైన మనస్సాక్షిని కలిగివుండాలి.’—1 పేతురు 3:15, 16.
జాతీయ జెండాలు ఎగరేయబడివున్న భవనాలలో అంటే మున్సిపల్ కార్యాలయాలు, స్కూళ్ళు వంటి ప్రజాసంబంధ భవనాలలో పనిచేయడానికి ఎటువంటి లేఖనాధారిత అభ్యంతరమూ లేదు. పోస్టేజి స్టాంపుల మీదా, వాహనాల లైసెన్సు ప్లేట్ల మీదా, ప్రభుత్వం తయారుచేసిన ఇతర వస్తువుల మీదా కూడా జెండా ఉండవచ్చు. అలాంటి వస్తువులను ఉపయోగించినంత మాత్రాన వ్యక్తులు భక్తిపరమైన పనుల్లో పాల్గొంటున్నారని కాదు. ఇక్కడ ప్రాముఖ్యమైనది, జెండా ఉందా దాని చిత్రం ఉందా అన్నది కాదు, ఒక వ్యక్తి దానిపట్ల ఎలా ప్రవర్తిస్తాడు అన్నదే ప్రాముఖ్యము.
తరచూ జెండాలు కిటికీల మీదా, తలుపుల మీదా, కార్ల మీదా, టేబుళ్ళ మీదా, మరితర వస్తువుల మీదా ప్రదర్శించబడతాయి. జెండా గుర్తు ముద్రించబడివున్న వస్త్రాలను కూడా కొనుగోలు చేయవచ్చు. కొన్ని దేశాలలో అలాంటి దుస్తులను ధరించడం చట్టవిరుద్ధమైనది. ఒకవేళ అలాంటి దుస్తులను ధరించడం చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాకపోయినా, ఈ లోకానికి సంబంధించి ఒక వ్యక్తికున్న స్థానాన్ని గురించి అది ఏమని సూచిస్తుంది? తన అనుచరుల గురించి యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:16) అలాంటి చర్య తోటి విశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది కొందరి మనస్సాక్షిని గాయపర్చగలదా? విశ్వాసంలో దృఢంగా ఉండాలన్న వారి తీర్మానాన్ని అది బలహీనపర్చగలదా? “మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు . . . నిష్కపటులును నిర్దోషులును కావలెనని” పౌలు క్రైస్తవులకు ఉపదేశించాడు.—ఫిలిప్పీయులు 1:9-11.
“అందరి యెడల సాధువుగా”
ఈ “అపాయకరమైన కాలముల”లో ప్రపంచ పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతుండగా, దేశభక్తి భావాలు తీవ్రతరమయ్యే అవకాశముంది. (2 తిమోతి 3:1) దేవుణ్ణి ప్రేమించేవారు ఎప్పటికీ రక్షణ యెహోవాది మాత్రమే అన్న విషయం మర్చిపోకుండా ఉందురు గాక. ఆయన అనితర భక్తికి అర్హుడు. యెహోవా చిత్తానికి వ్యతిరేకమైనది చేయమని అడిగినప్పుడు, యేసు అపొస్తలులు, “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా” అని అన్నారు.—అపొస్తలుల కార్యములు 5:29.
“ప్రభువుయొక్క దాసుడు . . . జగడమాడక అందరి యెడల సాధువుగా . . . ఉండవలెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (2 తిమోతి 2:24-26) కాబట్టి, క్రైస్తవులు జెండా వందనం చేయడానికి సంబంధించి, జాతీయగీతం పాడడానికి సంబంధించి తమ బైబిలు శిక్షిత మనస్సాక్షిపై ఆధారపడి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు శాంతంగా, గౌరవపూర్వకంగా, సాత్వికంగా ఉండడానికి కృషి చేస్తారు.
[23వ పేజీలోని చిత్రం]
దృఢంగానే అయినా గౌరవపూర్వకంగా, ముగ్గురు హెబ్రీయులు దేవుణ్ణి ప్రీతిపర్చడాన్ని ఎంపిక చేసుకున్నారు
[24వ పేజీలోని చిత్రం]
దేశభక్తికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుండగా ఒక క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలి?