కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“సెప్టాజింట్‌” నాడూ నేడూ ఉపయోగకరమైనదే

“సెప్టాజింట్‌” నాడూ నేడూ ఉపయోగకరమైనదే

“సెప్టాజింట్‌” నాడూ నేడూ ఉపయోగకరమైనదే

ఐతియొపీయలోని సుప్రసిద్ధుడైన ఒక వ్యక్తి యెరూషలేము నుండి తన ఇంటికి వెళ్తున్నాడు. ఆయన అరణ్యమార్గం గుండా తన రథంలో ప్రయాణిస్తూ, మతసంబంధమైన ఒక గ్రంథాన్ని బిగ్గరగా చదువుతున్నాడు. ఆయన చదివిన మాటల వివరణ ఆయనపై ఎంత గాఢంగా ప్రభావం చూపిందంటే అప్పటి నుండి ఆయన జీవితమే మారిపోయింది. (అపొస్తలుల కార్యములు 8:​26-38) ఆయన యెషయా 53:​7, 8 వచనాలను బైబిలు మొట్టమొదటి అనువాదమైన గ్రీకు సెప్టాజింట్‌ నుండి చదివాడు. ఆ గ్రంథం శతాబ్దాలపాటుగా బైబిలు సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ఎంత ప్రముఖ పాత్ర వహించిందంటే అది లోకాన్నే మార్చివేసిన ఒక బైబిలు అనువాదం అని పిలువబడింది.

సెప్టాజింట్‌ ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో సిద్ధం చేయబడింది? అలాంటి అనువాదం ఎందుకు అవసరమైంది? గడిచిన శతాబ్దాల్లో అది ఎంత ప్రయోజనకరమైనదిగా రుజువయ్యింది? సెప్టాజింట్‌ నేడు మనకు నేర్పించగలిగేది ఏదైనా ఉంటే, అది ఏమిటి?

గ్రీకు భాష మాట్లాడే యూదుల కోసం సిద్ధం చేయబడింది

సా.శ.పూ. 332 లో అలెగ్జాండర్‌ చక్రవర్తి ఫేనీకే నగరమైన తూరును నాశనం చేసిన తర్వాత ఈజిప్టుకు వచ్చినప్పుడు, ఆయన ఒక విమోచకుడిగా ఆహ్వానించబడ్డాడు. అక్కడే ఆయన ప్రాచీన ప్రపంచంలోని విద్యా కేంద్రమైన అలెగ్జాండ్రియా నగరాన్ని స్థాపించాడు. తాను జయించిన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు గ్రీకు సంస్కృతిని వ్యాపింపజేయాలన్న కోరికతో, అలెగ్జాండర్‌ సువిశాలమైన తన సామ్రాజ్యమంతటా సామాన్య గ్రీకు (కొయిని) భాషను పరిచయం చేశాడు.

సా.శ.పూ. మూడవ శతాబ్దంలో అలెగ్జాండ్రియా విస్తృతమైన యూదుల జనాభాకు నివాసమయ్యింది. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత పాలస్తీనా నగరపు శివార్లలో అక్కడక్కడా చెదరివున్న కాలనీల్లో నివసిస్తున్న అనేకమంది యూదులు అలెగ్జాండ్రియాకు వలసవెళ్ళారు. ఈ యూదులకు హీబ్రూ భాష ఎంత బాగా తెలుసు? మాక్లింటాక్‌ మరియు స్ట్రాంగ్‌ల సైక్లోపీడియా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత యూదులు తమకు తెలిసిన ప్రాచీన హీబ్రూ భాషా పరిజ్ఞానాన్ని చాలా మట్టుకు కోల్పోవడంతో పాలస్తీనాలోని సమాజ మందిరాల్లో మోషే పుస్తకాలను చదివినప్పుడు అవి కల్దీయుల భాషలో వివరించబడేవి . . . అలెగ్జాండ్రియాలోని యూదులకు బహుశా హీబ్రూ భాష ఇంకా చాలా తక్కువగా తెలిసి ఉండవచ్చు; వారికి బాగా తెలిసిన భాష అలెగ్జాండ్రియన్‌ గ్రీకు భాషే.” అలెగ్జాండ్రియాలోని పరిస్థితి హీబ్రూ లేఖనాలను గ్రీకులోకి అనువదించడానికి తగినట్టుగా ఉందని స్పష్టమవుతోంది.

సా.శ.పూ. రెండవ శతాబ్దంలో జీవించిన అరిస్టోబులస్‌ అనే ఒక యూదుడు హీబ్రూ ధర్మశాస్త్రం యొక్క వర్షన్‌ ఒకటి గ్రీకు భాషలోకి అనువదించబడిందనీ అది టోలమీ ఫిలడెల్ఫస్‌ (సా.శ.పూ. 285-246) పరిపాలనా కాలంలో పూర్తయ్యిందనీ వ్రాశాడు. అరిస్టోబులస్‌ దేన్ని ఉద్దేశించి “ధర్మశాస్త్రం” అని చెప్పాడన్న దానిపై విభిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఆయన కేవలం మొదటి అయిదు పుస్తకాలనే సూచిస్తున్నాడని కొందరు అనుకుంటారు, అయితే ఆయన ఉద్దేశం మొత్తం హీబ్రూ లేఖనాలై ఉండవచ్చు అని కొందరు అంటారు.

ఏది ఏమైనా, హీబ్రూ నుండి గ్రీకులోకి అనువాదం చేయబడిన లేఖనాల మొదటి లిఖిత అనువాదంలో, సంప్రదాయం ప్రకారం దాదాపు 72 మంది యూదా పండితులు పాల్గొన్నారని చెప్పబడుతోంది. తర్వాత 70 సంఖ్యనే ఉపయోగించడం ప్రారంభించారు. ఆ కారణంగానే ఆ వర్షన్‌ సెప్టాజింట్‌ అంటే 70 అని పిలువబడింది, 70కి రోమన్‌ సంఖ్య అయిన LXX సంకేతం దానికి ఇవ్వబడింది. సా.శ.పూ. రెండవ శతాబ్దం చివరికి హీబ్రూ లేఖనాల్లోని అన్ని పుస్తకాలూ గ్రీకులో చదవగలిగేవారు. ఆ విధంగా, గ్రీకులోకి అనువదించబడిన మొత్తం హీబ్రూ లేఖనాలకు సెప్టాజింట్‌ అనే పేరు వచ్చింది.

మొదటి శతాబ్దంలో దాని ఉపయోగం

యేసుక్రీస్తు కాలంలోనూ ఆయన అపొస్తలుల కాలంలోనూ అంతకు ముందటి కాలంలోనూ, గ్రీకు మాట్లాడే యూదులు సెప్టాజింట్‌ను విస్తృతంగా ఉపయోగించారు. సా.శ. 33 పెంతెకొస్తు దినమున యెరూషలేములో సమకూడిన యూదుల్లో యూదామత ప్రవిష్ఠుల్లో అనేకమంది ఆసియ, ఐగుప్తు, లిబియ, రోమా, క్రేతుల నుండి వచ్చినవారే​—⁠ఆ ప్రాంతాల్లోని ప్రజలు గ్రీకు భాష మాట్లాడేవారు. అలవాటు ప్రకారం వారు సెప్టాజింట్‌ నుండే చదివేవారనే విషయంలో సందేహమేమీ లేదు. (అపొస్తలుల కార్యములు 2:​9-11) ఆ విధంగా, మొదటి శతాబ్దంలో సువార్తను వ్యాపింపజేయడంలో ఈ వర్షన్‌ శక్తివంతమైనదిగా నిరూపించబడింది.

ఉదాహరణకు కురేనీ, అలెక్సంద్రియ, కిలికియ, ఆసియ నుండి వచ్చినవారితో శిష్యుడైన స్తెఫను మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నాడు: “యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను; వారు డెబ్బదియయిదుగురు.” (అపొస్తలుల కార్యములు 6:​8-10; 7:​12-14) హీబ్రూ గ్రంథంలో ఆదికాండము 46వ అధ్యాయం యోసేపు బంధువుల సంఖ్య డెబ్బది అని చెబుతోంది. కానీ సెప్టాజింట్‌ డెబ్బదియయిదు సంఖ్యను ఉపయోగించింది. దీన్నిబట్టి స్తెఫను సెప్టాజింట్‌ నుండే ఎత్తి చెప్పాడని స్పష్టమవుతోంది.​—⁠ఆదికాండము 46:​20, 26, 27.

అపొస్తలుడైన పౌలు తన రెండవ మూడవ మిషనరీ పర్యటనలలో ఆసియ మైనరు, గ్రీకుదేశమంతటా ప్రయాణించినప్పుడు దేవునికి భయపడే అనేకమంది అన్యజనులకు, “భక్తిపరులగు గ్రీసుదేశస్థుల”కు ప్రకటించాడు. (అపొస్తలుల కార్యములు 13:​16, 26; 17:⁠4) ఈ ప్రజలు సెప్టాజింట్‌ నుండి దేవుని గురించి కొంత పరిజ్ఞానాన్ని పొందారు కాబట్టే, వారు దేవునికి భయపడేవారు లేదా ఆయనను ఆరాధించేవారు. గ్రీకు భాష మాట్లాడే ఈ ప్రజలకు ప్రకటించేటప్పుడు పౌలు తరచూ ఆ అనువాదం నుండే ఉదాహరించాడు లేదా అందులోని భాగాల తాత్పర్యం చెప్పాడు.​—⁠ఆదికాండము 22:​18; గలతీయులు 3:⁠8.

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో నుండి, హీబ్రూ లేఖనాల్లో నుండి ఉదాహరించినవీ సూచించినవీ మొత్తం కలిపి బహుశా 890 ఉండవచ్చు, వాటిలో నేరుగా తీసుకున్న ఉదాహరణలు 320 ఉన్నాయి. వీటిలో అధిక శాతం సెప్టాజింట్‌ మీద ఆధారపడినవే. తత్ఫలితంగా, హీబ్రూ మూల ప్రతుల నుండి కాక సెప్టాజింట్‌ నుండి తీసుకున్న ఉదాహరణలు ప్రేరేపిత క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో భాగమయ్యాయి. అదెంత గమనార్హమైన వాస్తవం! రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడుతుందని యేసు ప్రవచించాడు. (మత్తయి 24:​14) దీన్ని నెరవేర్చడానికి, యెహోవా తన ప్రేరేపిత వాక్యాన్ని లోకంలోని ప్రజలు చదివే వివిధ భాషల్లోకి అనువదించబడడానికి అనుమతిస్తాడు.

నేడూ ఉపయోగకరమైనదే

సెప్టాజింట్‌ నేడు కూడా విలువైనదే, తర్వాతి కాలంలో నకలు వ్రాసేవారు హీబ్రూ మూలప్రతుల నుండి నకలు వ్రాసేటప్పుడు దొర్లిన పొరపాట్లను బయలుపరచడానికి అది ఉపయోగించబడుతోంది. ఉదాహరణకు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌లో ఆదికాండము 4:8 లోని వృత్తాంతం ఇలా చెబుతోంది: “‘మనం పొలంలోకి వెళ్దాం రా’ అన్నాడు కయీను తన తమ్ముడైన హేబెలుతో. కనుక కయీను, హేబెలు పొలంలోకి వెళ్ళారు. అప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపేసాడు.”

“మనం పొలంలోకి వెళ్దాం రా” అనే భాగం, సా.శ. పదవ శతాబ్దం నుండి ఉన్న తేదీలుగల హీబ్రూ మూలప్రతుల్లో కనబడదు. అందుకే కొన్ని బైబిలు అనువాదాల్లో ఆ భాగం కనబడదు. కానీ, అది పురాతన సెప్టాజింట్‌ మూలప్రతుల్లోనూ కొన్ని ఇతర తొలి గ్రంథాల్లోనూ కనబడుతుంది. ఆ హీబ్రూ మూలప్రతుల్లో, సాధారణంగా సంభాషణను పరిచయం చేసే మాటలున్నాయి కానీ దాని తర్వాతి మాటలు లేవు. ఏమై ఉండవచ్చు? ఆదికాండము 4:8 లో రెండు క్రమానుగత ఉపవాక్యాలున్నాయి, అవి రెండూ “పొలంలో(కి)” అనే మాటతో అంతమవుతాయి. “బహుశా హీబ్రూలో నకలు చేసిన వ్యక్తి దృష్టిని రెండు ఉపవాక్యాల ముగింపులో ఉన్న [ఒకేలా ఉన్న] పదం తప్పుదారి పట్టించి ఉండవచ్చు” అని మాక్‌క్లింటాక్‌ మరియు స్ట్రాంగ్‌ల సైక్లోపీడియా సూచిస్తోంది. అందుకే నకలు వ్రాసిన వ్యక్తి “పొలంలో(కి)” అనే మాటతో అంతమయ్యే మొదటి ఉపవాక్యాన్ని గమనించకపోయి ఉండవచ్చు. కాబట్టి తర్వాత నకలు వ్రాయబడిన హీబ్రూ మూలప్రతుల కాపీల్లోని పొరపాట్లను గుర్తించేందుకు సెప్టాజింట్‌తోపాటు ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఇతర పాత మూలప్రతులు ఉపయోగకరమైనవేనని స్పష్టంగా తెలుస్తోంది.

మరో వైపున, సెప్టాజింట్‌ కాపీల్లో కూడా పొరపాట్లు దొర్లాయి, గ్రీకులోని తప్పులను సరిదిద్దడానికి అప్పుడప్పుడు హీబ్రూ మూలప్రతిని సంప్రదించారు. ఆ విధంగా హీబ్రూ మూలప్రతులను గ్రీకు మూలప్రతులతోనూ ఇతర భాషల అనువాదాలతోనూ పోల్చడం, అనువాదకుల పొరపాట్లను, నకలు వ్రాసినవారి పొరపాట్లను బయటపెట్టడమే కాకుండా దేవుని వాక్యం ఖచ్చితంగా ప్రతిరూపణ చేయబడుతోందనే హామీనిస్తోంది.

నేడు ఉనికిలో ఉన్న మొత్తం సెప్టాజింట్‌ కాపీలు సా.శ. నాలుగవ శతాబ్దం కాలం నాటివి. అలాంటి మూలప్రతుల్లోనూ తర్వాతి కాపీల్లోనూ, హీబ్రూ భాషలోని నాలుగక్షరాల టెట్రాగ్రామటన్‌ (YHWH) ద్వారా సూచించబడే దేవుని పేరు​—⁠యెహోవా​—⁠లేదు. హీబ్రూ మూలగ్రంథంలో ఎక్కడెక్కడ ఆ హీబ్రూ నాలుగక్షరాలు ఉన్నాయో దానికి ప్రత్యామ్నాయంగా ఈ కాపీలు, “దేవుడు,” “ప్రభువు” కోసం గ్రీకులో ఉపయోగించబడే పదాలను ఉపయోగించాయి. అయినప్పటికీ, పాలస్తీనాలో దాదాపు 50 సంవత్సరాల క్రితం కనుగొనబడిన ఒక అంశం ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. మృతసముద్రపు పశ్చిమ తీరానికి సమీపంలోని గుహలను పరిశీలిస్తున్న ఒక బృందం ప్రాచీనకాలం నాటి ఒక చర్మపు గ్రంథానికి చెందిన అవశేషాలను బయలుపరిచింది, అది గ్రీకులో వ్రాయబడిన 12 మంది ప్రవక్తల (హోషేయ నుండి మలాకీ వరకు) గ్రంథం. ఈ గ్రంథాలు సా.శ.పూ. 50 నుండి సా.శ. 50 మధ్యకాలానికి చెందినవి. ఈ పురాతన అవశేషాల్లో హీబ్రూ నాలుగక్షరాలున్న స్థానంలో “దేవుడు,” “ప్రభువు” అనే వాటికోసమైన గ్రీకు పదాలు పెట్టబడిలేవు. దీన్నిబట్టి దేవుని పేరు తొలి సెప్టాజింట్‌ వర్షన్‌లో ఉపయోగించబడిందనే విషయం ధ్రువీకరించబడింది.

రెల్లుతో తయారుచేసిన కాగితపు ప్రాచీన గ్రంథపు అవశేషాల గురించిన ఒక ప్రచురణ (Fouad 266 Papyri) 1971వ సంవత్సరంలో విడుదల చేయబడింది. సా.శ.పూ. రెండవ లేదా మొదటి శతాబ్దపునాటి ఈ సెప్టాజింట్‌ భాగాలు ఏమి వెల్లడిచేస్తున్నాయి? వాటిలో కూడా దేవుని పేరు కాపాడబడింది. సెప్టాజింట్‌కి చెందిన ఈ తొలి అవశేషాలు, యేసుకూ మొదటి శతాబ్దంలోని ఆయన శిష్యులకూ దేవుని పేరు తెలుసనీ దాన్ని వారు ఉపయోగించారనీ బలమైన సాక్ష్యాన్నిస్తున్నాయి.

నేడు, బైబిలు చరిత్రలో అత్యధికంగా అనువదించబడిన పుస్తకం. 90 శాతం కంటే ఎక్కువ మానవాళి దాన్ని, కనీసం దానిలోని కొంత భాగమైనా తమ సొంత భాషలో చదవగలరు. ప్రత్యేకించి మనం ఖచ్చితమైన ఒక ఆధునిక భాషానువాదమైన న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌ గురించి ఎంతో కృతజ్ఞులం, అది ఇప్పుడు పూర్తిగా లేదా పాక్షికంగా 40 కంటే ఎక్కువ భాషల్లో లభ్యమవుతోంది. న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌​—⁠విత్‌ రెఫరెన్సెస్‌లో సెప్టాజింట్‌నూ ఇతర ప్రాచీన మూలప్రతులనూ సూచించే వందలాది అధస్సూచికలు ఉన్నాయి. నిజంగానే మన కాలంలోని బైబిలు విద్యార్థులకు సెప్టాజింట్‌ ఎల్లప్పుడూ ఆసక్తికరమైనదిగా విలువైనదిగా ఉంటుంది.

[26వ పేజీలోని చిత్రం]

శిష్యుడైన ఫిలిప్పు “సెప్టాజింట్‌” నుండి చదవబడిన ఒక భాగాన్ని వివరించాడు

[29వ పేజీలోని చిత్రాలు]

అపొస్తలుడైన పౌలు తరచూ “సెప్టాజింట్‌” నుండి ఉదాహరించాడు