కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అంతం సమీపిస్తుండగా విధేయతను అలవర్చుకోండి

అంతం సమీపిస్తుండగా విధేయతను అలవర్చుకోండి

అంతం సమీపిస్తుండగా విధేయతను అలవర్చుకోండి

‘ప్రజలు షిలోహుకు విధేయులై యుందురు.’​—⁠ఆదికాండము 49:​10.

1. (ఎ) గతంలో, యెహోవాకు విధేయత చూపించడంలో తరచూ ఏమి ఇమిడి ఉండేది? (బి) యాకోబు విధేయతను గురించిన ఏ ప్రవచనాన్ని చెప్పాడు?

యెహోవాకు విధేయత చూపించడంలో తరచూ ఆయన ప్రతినిధులకు విధేయత చూపించడం ఇమిడి ఉంది. ఈ ప్రతినిధుల్లో దేవదూతలు, పూర్వీకులు, న్యాయాధిపతులు, యాజకులు, ప్రవక్తలు, రాజులు ఉన్నారు. ఇశ్రాయేలు రాజుల సింహాసనం యెహోవా సింహాసనం అని కూడా పిలువబడింది. (1 దినవృత్తాంతములు 29:​23) అయితే విచారకరంగా, ఇశ్రాయేలు పరిపాలకులు చాలామంది దేవునికి అవిధేయత చూపించి, తమపైకి తమ ప్రజలపైకి విపత్తును తెచ్చుకున్నారు. కానీ యెహోవా తన యథార్థవంతులకు ఎలాంటి నిరీక్షణా ఇవ్వకుండా విడిచిపెట్టలేదు; నీతిమంతులు విధేయత చూపించడానికి ఇష్టపడే అక్షయుడైన రాజును ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేసి వారిని ఓదార్చాడు. (యెషయా 9:​6, 7) మరణించే ముందు పితరుడైన యాకోబు ఈ భవిష్యత్‌ పరిపాలకుడి గురించి ఇలా ప్రవచించాడు: “షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై యుందురు.”​—⁠ఆదికాండము 49:​10.

2. “షిలోహు” భావమేమిటి, ఆయన రాచరిక పరిపాలన క్రింద ఎవరెవరు ఉంటారు?

2 “షిలోహు” అనేది ఒక హీబ్రూ పదం, దానికి “అది ఎవరిదో ఆయన” లేదా “అది ఎవరికి చెందుతుందో ఆయన” అనే భావం ఉంది. అవును, దండము సూచిస్తున్నట్లుగా పరిపాలనా హక్కునూ రాజదండము సూచిస్తున్నట్లుగా ఆజ్ఞాపించే అధికారాన్నీ షిలోహు వారసత్వంగా పొందుతాడు. అంతేగాక, ఆయన రాచరిక పరిపాలన క్రింద ఉండేది కేవలం యాకోబు వంశస్థులే కాదు గానీ “ప్రజలు” అందరూ. ఇది, “నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. . . . భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును” అని యెహోవా అబ్రాహాముతో చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఉంది. (ఆదికాండము 22:​17, 18) సా.శ. 29 లో యెహోవా నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించినప్పుడు ఈ “సంతానము” ఎవరన్నది స్పష్టం చేశాడు.​—⁠లూకా 3:21-23, 34; గలతీయులు 3:​16.

యేసు మొదటి రాజ్యం

3. యేసు పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఏ పరిపాలనా దండమును పొందాడు?

3 యేసు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఈ లోక ప్రజలను పరిపాలించడమనే దండమును ఆయన వెంటనే చేపట్టలేదు. (కీర్తన 110:⁠1) అయితే, తనకు విధేయత చూపించే ప్రజలున్న ఒక ‘రాజ్యాన్ని’ మాత్రం పొందాడు. అపొస్తలుడైన పౌలు, ‘[దేవుడు] మనలను [ఆత్మాభిషిక్త క్రైస్తవులను] అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను’ అని వ్రాసినప్పుడు ఆ రాజ్యం ఏదో తెలియజేశాడు. (కొలొస్సయులు 1:​13) ఈ విడుదల సా.శ. 33 పెంతెకొస్తునాడు యేసు నమ్మకమైన అనుచరులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ప్రారంభమైంది.​—⁠అపొస్తలుల కార్యములు 2:1-4; 1 పేతురు 2:⁠9.

4. యేసు తొలి శిష్యులు ఏ యే విధాలుగా ఆయనకు విధేయతను చూపించారు, యేసు వారిని ఎలా ఒక గుంపుగా గుర్తించాడు?

4 ‘క్రీస్తుకు రాయబారులుగా’ ఆత్మాభిషిక్త శిష్యులు ఆయనయందు విధేయతతో, ఆ ఆధ్యాత్మిక రాజ్యంలో “ఏక పట్టణస్థులు” కాగల ఇతరులను సమకూర్చడం ప్రారంభించారు. (2 కొరింథీయులు 5:20; ఎఫెసీయులు 2:19; అపొస్తలుల కార్యములు 1:⁠8) అంతేగాక వీరు తమ రాజైన యేసుక్రీస్తు ఆమోదాన్ని పొందడానికి “యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను . . . సన్నద్ధులై” ఉండాలి. (1 కొరింథీయులు 1:​10) ఒక గుంపుగా వారు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ లేదా నమ్మకమైన గృహనిర్వాహక తరగతిగా ఏర్పడ్డారు.​—⁠మత్తయి 24:45; లూకా 12:42.

దేవుని ‘గృహనిర్వాహకునికి’ విధేయత చూపినందుకు ఆశీర్వదించబడ్డారు

5. ప్రాచీన కాలాల నుండి యెహోవా తన ప్రజలకు ఎలా బోధిస్తున్నాడు?

5 యెహోవా తన ప్రజలకు ఎల్లవేళలా బోధకులను అనుగ్రహించాడు. ఉదాహరణకు, యూదులు బబులోను నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎజ్రా, అర్హులైన ఇంకా అనేకమంది ఇతర పురుషులు, ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించడమే గాక దేవుని వాక్యమును “బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి.”​—⁠నెహెమ్యా 8:⁠8.

6, 7. దాసుని తరగతి తన పరిపాలక సభ ద్వారా సమయానుకూలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎలా అందజేసింది, దాసుని తరగతికి విధేయత చూపించడం ఎందుకు సముచితమైనది?

6 మొదటి శతాబ్దంలో, సా.శ. 49 లో సున్నతిని గురించిన వివాదాంశం తలెత్తినప్పుడు ఆ తొలి దాసుని తరగతి యొక్క పరిపాలక సభ విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా పరిశీలించి లేఖనాధారిత ముగింపుకు చేరుకుంది. పత్రిక ద్వారా వారు తమ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు సంఘాలు, ఇవ్వబడిన ఆ నడిపింపుకు విధేయత చూపించి దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని పొందాయి. (అపొస్తలుల కార్యములు 15:6-15, 22-29; 16:​4, 5) అదే విధంగా ఆధునిక కాలాల్లో నమ్మకమైన దాసుడు తన పరిపాలక సభ ద్వారా క్రైస్తవ తటస్థత, రక్తాన్ని గురించిన పరిశుద్ధత, మాదకద్రవ్యాలు పొగాకులను ఉపయోగించడం లాంటి ప్రాముఖ్యమైన వివాదాంశాలను మరింత స్పష్టం చేసింది. (యెషయా 2:4; అపొస్తలుల కార్యములు 21:25; 2 కొరింథీయులు 7:⁠1) యెహోవా తన ప్రజలు తన వాక్యానికి, నమ్మకమైన దాసునికి చూపించిన విధేయతకై వారిని ఆశీర్వదించాడు.

7 దాసుని తరగతికి విధేయత చూపించడం ద్వారా దేవుని ప్రజలు తమ యజమానియైన యేసుక్రీస్తుకు కూడా విధేయులవుతారు. యాకోబు మరణశయ్యపై చేసిన ప్రవచనంలో ముందే తెలియజేయబడినట్లుగా, యేసుకు ఇవ్వబడిన విస్తృతమైన అధికారం మూలంగా ఆధునిక కాలాల్లో అలాంటి విధేయత మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.

షిలోహు హక్కుదారుడైన భూ పరిపాలకుడవుతాడు

8. క్రీస్తు అధికారం ఎప్పుడు ఎలా విస్తరించింది?

8 షిలోహుకు ‘ప్రజలు విధేయులై’ ఉంటారని యాకోబు ప్రవచనం ముందే తెలియజేసింది. కాబట్టి క్రీస్తు పరిపాలన ఆధ్యాత్మిక ఇశ్రాయేలును మించి విస్తరిస్తుందని స్పష్టమవుతోంది. అది ఎంత వరకు విస్తరిస్తుంది? ప్రకటన 11:⁠15 ఇలా సమాధానమిస్తుంది: ‘ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలును.’ యేసు ఆ అధికారాన్ని, ప్రవచనార్థక “ఏడు కాలముల” అంటే “అన్యజనముల కాలముల” ముగింపులో, 1914 లో పొందాడని బైబిలు వెల్లడి చేస్తోంది. * (దానియేలు 4:16, 17; లూకా 21:​24) ఆ సంవత్సరంలో, క్రీస్తు ‘తన శత్రువులమధ్య పరిపాలన చేసే’ సమయం ప్రారంభమైనట్లుగానే మెస్సీయ రాజుగా, ఆయన అదృశ్య “ప్రత్యక్షత” కూడా ప్రారంభమైంది.​—⁠కీర్తన 110:⁠2; మత్తయి 24:​3, NW.

9. యేసు తాను తన రాజ్యాన్ని పొందిన తర్వాత ఏమి చేశాడు, అది మానవజాతిపై, ప్రాముఖ్యంగా ఆయన శిష్యులపై పరోక్షంగా ఏ ప్రభావం చూపించింది?

9 రాజుగా అధికారాన్ని పొందిన తర్వాత యేసు తీసుకున్న మొదటి చర్య, అవిధేయతకు ప్రతిరూపమైన సాతానును, అతని దయ్యాలను “భూమిమీద”కు పడద్రోయడం. అప్పటి నుండి, ఈ దుష్టాత్మలు మానవజాతిపైకి అంతులేని వేదనను తీసుకురావడమే గాక యెహోవాకు విధేయత చూపించడం ఒక సవాలుగా మారే వాతావరణాన్ని పెంపొందింపజేస్తున్నాయి. (ప్రకటన 12:7-12; 2 తిమోతి 3:​1-5) వాస్తవానికి సాతాను తాను చేస్తున్న ఆధ్యాత్మిక యుద్ధంలో, “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు” ఉన్న యెహోవా అభిషిక్తులపైన, వారి సహవాసులైన “వేరే గొఱ్ఱెల”పైన దాడి చేయాలన్నదే అతని ముఖ్య ఉద్దేశం.​—⁠ప్రకటన 12:17; యోహాను 10:16.

10. బైబిలులోని ఏ ప్రవచనాల నెరవేర్పు నిజ క్రైస్తవులతో సాతాను చేస్తున్న యుద్ధం విఫలమవుతుందని హామీ ఇస్తుంది?

10 అయితే సాతాను పూర్తిగా విఫలం కావాల్సిందే ఎందుకంటే ఇది ‘ప్రభువు దినము,’ యేసు ‘జయించుటకు బయలువెళ్ళడాన్ని’ ఏదీ ఆపలేదు. (ప్రకటన 1:​10, 11; 6:⁠2) ఉదాహరణకు ఆయన 1,44,000 మంది ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు ముద్రించబడేలా నిశ్చయపర్చుకుంటాడు. “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము”ను కూడా ఆయన కాపాడతాడు. (ప్రకటన 7:​1-4, 9, 14-16) అయితే వీరు తమ అభిషిక్త సహవాసులకు భిన్నంగా భూమిపైనే ఉండి యేసుకు విధేయులై ఉంటారు. (దానియేలు 7:​13, 14) వారు నేడు ఈ భూమ్మీద ఉండడమే షిలోహు “లోకరాజ్యము”నకు నిజంగా పరిపాలకుడై ఉన్నాడనడానికి సుస్పష్టమైన నిదర్శనాన్నిస్తుంది.​—⁠ప్రకటన 11:15.

‘సువార్తకు లోబడవలసిన’ సమయమిదే

11, 12. (ఎ) ప్రస్తుత విధానాంతాన్ని కేవలం ఎవరు మాత్రమే తప్పించుకుని జీవించగలరు? (బి) “లౌకికాత్మ” ప్రభావానికి లోనైనవారిలో ఏ విధమైన వ్యక్తిత్వ లక్షణాలు వృద్ధి అవుతాయి?

11 నిత్యజీవం కావాలనుకునే వారందరూ విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఎందుకంటే, ‘దేవుని నెరుగనివారు మన ప్రభువైన యేసు సువార్తకు లోబడనివారు’ దేవుని ప్రతిదండన దినాన్ని తప్పించుకుని జీవించలేరని బైబిలు స్పష్టంగా తెలియజేస్తోంది. (2 థెస్సలొనీకయులు 1:⁠6-8) అయితే, ప్రస్తుతమున్న చెడ్డ వాతావరణమూ బైబిలు నియమాలకు సూత్రాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే దాని స్ఫూర్తీ సువార్తకు లోబడడాన్ని ఒక సవాలుగా చేస్తున్నాయి.

12 దేవుడ్ని ధిక్కరించే ఈ స్ఫూర్తిని బైబిలు “లౌకికాత్మ” అని వర్ణిస్తుంది. (1 కొరింథీయులు 2:​12) అది ప్రజలపై చూపించే ప్రభావాన్ని వివరిస్తూ అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమవారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి.”​—⁠ఎఫెసీయులు 2:2, 3.

13. లోకాత్మను క్రైస్తవులు విజయవంతంగా ఎలా నిరోధించగలరు, దాని వల్ల ప్రయోజనకరమైన ఏ ఫలితాలు చేకూరుతాయి?

13 సంతోషకరంగా, ఎఫెసులోని క్రైస్తవులు ఆ అవిధేయతా స్ఫూర్తికి బానిసలుగా ఉండిపోలేదు. బదులుగా, వారు దేవుని ఆత్మకు లోబడి దాని సమృద్ధికరమైన, ఆరోగ్యదాయకమైన ఫలాలను ఫలించడం ద్వారా ఆయనకు విధేయులైన పిల్లలయ్యారు. (గలతీయులు 5:​22) అలాగే నేడు, విశ్వమంతటిలో అత్యంత శక్తివంతమైనదైన దేవుని ఆత్మ, యెహోవాకు విధేయులయ్యేలా లక్షలాదిమందికి సహాయం చేస్తోంది, తద్వారా వారు ‘తుదకు పరిపూర్ణమయ్యే నిరీక్షణను’ పొందగల్గుతారు.​—⁠హెబ్రీయులు 6:​11, 12; జెకర్యా 4:⁠6, 7.

14. తమ విధేయతను పరీక్షించే నిర్దిష్టమైన విషయాల గురించి యేసు అంత్యదినాల్లో జీవిస్తున్న క్రైస్తవులందరినీ ఎలా అప్రమత్తులను చేశాడు?

14 షిలోహు శక్తివంతమైన మద్దతు కూడా మనకుందని మనస్సులో ఉంచుకోండి, ఏ శత్రువూ​—⁠దయ్యాలే అయినా మానవులే అయినా​—⁠మనం సహించగలిగినదాన్ని మించి మన విధేయతను పరీక్షించడానికి ఆయనా ఆయన తండ్రీ అనుమతించరు. (1 కొరింథీయులు 10:​13) వాస్తవానికి, మన ఆధ్యాత్మిక యుద్ధంలో మనకు సహాయం చేసేందుకు యేసు, ఈ అంత్య దినాల్లో మనం ఎదుర్కొనే అనేక నిర్దిష్ట సమస్యలను వర్ణించాడు. ఆయన అపొస్తలుడైన యోహానుకు ఒక దర్శనంలో ఇచ్చిన ఏడు పత్రికల్లో ఆ సమస్యల గురించి పేర్కొన్నాడు. (ప్రకటన 1:​10, 11) అవి ఆ కాలంనాటి క్రైస్తవులకు ప్రాముఖ్యమైన ఉపదేశాన్ని కలిగి ఉన్నాయన్నది నిజమే అయినప్పటికీ, వాటి నిజమైన అన్వయింపు 1914 నుండి అంటే ‘ప్రభువు దినానికి’ ముఖ్యంగా వర్తిస్తుంది. కాబట్టి, మనం ఈ సందేశాలకు అవధానమివ్వడం ఎంత సముచితమో కదా! *

ఉదాసీనతను, లైంగిక అనైతికతను, దురాశను నివారించండి

15. ఎఫెసులోని సంఘాన్ని ప్రభావితం చేసిన సమస్య నుండి మనల్ని మనం ఎందుకు కాపాడుకోవాలి, అది మనం ఎలా చేయవచ్చు? (2 పేతురు 1:5-8)

15 యేసు మొదటి పత్రికను ఎఫెసు సంఘానికి వ్రాయించాడు. సంఘం చూపించిన సహనాన్ని బట్టి దాన్ని మెచ్చుకున్న తర్వాత యేసు ఇలా పేర్కొన్నాడు: “అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.” (ప్రకటన 2:​1-4) అలాగే నేడు, ఒకప్పుడు ఆసక్తిగల క్రైస్తవులుగా ఉన్న కొందరు తమకు దేవునిపట్ల మునుపున్న ప్రగాఢమైన ప్రేమను కోల్పోయారు. అలా కోల్పోవడం దేవునితో ఒకరికున్న సంబంధాన్ని బలహీనపర్చగలదు కాబట్టి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. అలాంటి ప్రేమను ఎలా పునరుత్తేజపర్చవచ్చు? క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం, కూటాలకు హాజరు కావడం, ప్రార్థించడం, ధ్యానించడం వంటివాటి ద్వారా అది సాధ్యమవుతుంది. (1 యోహాను 5:⁠3) నిజమే దీనికి “తీవ్రమైన కృషి” అవసరమే, అయితే కష్టానికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది. (2 పేతురు 1:​5-8, NW) నిజాయితీతో చేసుకున్న ఆత్మపరిశీలన మీ ప్రేమ చల్లబడిందని వెల్లడి చేస్తే, “నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము” అని యేసు చేసిన ఉద్బోధకు విధేయత చూపిస్తూ వెంటనే పరిస్థితిని చక్కబరుచుకోండి.​—⁠ప్రకటన 2:⁠5.

16. పెర్గము, తుయతైర సంఘాల్లో ఆధ్యాత్మికంగా ఎలాంటి ప్రమాదకరమైన ప్రభావాలున్నాయి, యేసు వారితో పలికిన మాటలు నేడు ఎందుకు సముచితమైనవి?

16 పెర్గము, తుయతైర సంఘాల్లోని క్రైస్తవులు తమ యథార్థతను, సహనాన్ని, ఆసక్తిని బట్టి మెచ్చుకోబడ్డారు. (ప్రకటన 2:12, 13, 18, 19) అయినప్పటికీ లైంగిక అనైతికత, బయలు ఆరాధనల ద్వారా ప్రాచీన ఇశ్రాయేలులో కలుషితపరిచే ప్రభావాలుగా పనిచేసిన బిలాము, యెజెబెలుల దుష్ట స్ఫూర్తిని చూపిస్తున్న కొందరినిబట్టి వారు ప్రభావితులయ్యారు. (సంఖ్యాకాండము 31:16; 1 రాజులు 16:30, 31; ప్రకటన 2:​14, 16, 20-23) కానీ ‘ప్రభువు దినం,’ అంటే మన కాలం సంగతేమిటి? అవే దుష్ట ప్రభావాలు కనిపిస్తున్నాయా? అవును, ఎందుకంటే దేవుని ప్రజల్లో కొందరు బహిష్కరించబడడానికి ఖచ్చితంగా ముఖ్య కారణం లైంగిక దుర్నీతే. కాబట్టి, నైతికంగా కలుషితపరిచే ప్రభావం చూపేవారు సంఘంలోని వారైనా వెలుపలి వారైనా అలాంటి వ్యక్తులందరితో సహవాసం చేయకపోవడం చాలా ప్రాముఖ్యం! (1 కొరింథీయులు 5:​9-11; 15:​33) షిలోహుకు విధేయత చూపించాలనుకునే వారు కూడా సరైనది కాని వినోదాన్ని, ముద్రిత, అలాగే ఇంటర్‌నెట్‌ పోర్నోగ్రఫీని నివారిస్తారు.​—⁠ఆమోసు 5:15; మత్తయి 5:​28, 29.

17. సార్దీస్‌లోనూ లవొదికయలోనూ ఉన్నవారి దృక్కోణం గురించి, దృక్పథం గురించి వారి ఆధ్యాత్మిక స్థితి గురించి యేసుకున్న దృక్కోణంతో పోలిస్తే ఏమి తేడా ఉంది?

17 ఎవరో కొంతమంది వ్యక్తులు మినహాయించి, సార్దీస్‌లోని సంఘం అసలు ఏ ప్రశంసనూ పొందలేదు. అది సజీవంగా ఉందన్నది “పేరు”కు మాత్రమే, లేదా సజీవంగా ఉన్నట్లు కనిపిస్తోంది, గానీ దానిలో ఆధ్యాత్మిక ఉదాసీనత ఎంతగా పాతుకుపోయిందంటే యేసు దృష్టిలో అది ‘మృతమైనదే.’ సువార్తకు లోబడడమన్నది కేవలం యాంత్రికం మాత్రమే. ఎంతటి నేరారోపణ! (ప్రకటన 3:​1-3) లవొదికయలోని సంఘం కూడా అలాంటి స్థితిలోనే ఉంది. “నేను ధనవంతుడను,” అని చెప్పుకుంటూ అది తన వస్తుసంపదల గురించి ప్రగల్భాలు పలికింది కానీ క్రీస్తుకు మాత్రం అది ‘దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గ్రుడ్డివాడు, దిగంబరుడు’ అన్నట్లే ఉంది.​—⁠ప్రకటన 3:​14-17.

18. దేవుని దృష్టిలో, ఆధ్యాత్మికంగా నులివెచ్చగా తయారవ్వడాన్ని ఒకరు ఎలా నివారించవచ్చు?

18 ఒకప్పుడు నమ్మకంగా ఉన్న కొంతమంది క్రైస్తవులు నేడు అలాంటి అవిధేయతనే చూపించారు. బహుశా వారు తమ అత్యవసర భావం అణగారిపోయేలా చేసేందుకు లౌకికాత్మను అనుమతించి, బైబిలు అధ్యయనం చేయడం, ప్రార్థించడం, క్రైస్తవ కూటాలకు హాజరు కావడం, పరిచర్య చేయడం వంటివాటి పట్ల ఆధ్యాత్మికంగా నులివెచ్చని దృక్పథాన్ని వృద్ధి చేసుకుని ఉండవచ్చు. (2 పేతురు 3:3, 4, 11, 12) అలాంటి వారు ఆధ్యాత్మిక సంపదలకు పెట్టుబడి పెట్టడం ద్వారా అవును, ‘అగ్నిలో పుటమువేయబడిన బంగారమును [క్రీస్తు] వద్ద కొనడం’ ద్వారా క్రీస్తుకు విధేయత చూపించడం ఎంత ప్రాముఖ్యమో కదా! (ప్రకటన 3:​18) అలాంటి నిజమైన సంపదలో, ‘సత్‌క్రియలు అను ధనము, ఔదార్యము కల్గివుండడం, తమ ధనములో ఇతరులకు పాలివ్వడం’ ఇమిడి ఉన్నాయి. నిజంగా అమూల్యమైనవైన ఈ ఆస్తులకు పెట్టుబడి పెట్టడం ద్వారా మనం ‘వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది మన కొరకు వేసుకుంటాము.’​—⁠1 తిమోతి 6:​17-19.

తమ విధేయతను బట్టి ప్రశంసించబడ్డారు

19. స్ముర్న, ఫిలదెల్ఫియలలోని క్రైస్తవులను యేసు ఏమని మెచ్చుకున్నాడు, వారికి ఏమని ప్రబోధించాడు?

19 స్ముర్న, ఫిలదెల్ఫియలలోని సంఘాలు విధేయత చూపించడంలో విశేషమైన మాదిరులుగా ఉన్నాయి, ఎందుకంటే యేసు వారికి వ్రాసిన పత్రికల్లో ఎటువంటి గద్దింపూ లేదు. స్ముర్నలోని వారికి ఆయనిలా చెప్పాడు: “నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే.” (ప్రకటన 2:⁠9) వీరికీ వాస్తవానికి దరిద్రతలో ఉన్నప్పటికీ లోకసంబంధమైన సంపద ఉన్నట్లు గొప్పలు చెప్పుకున్న లవొదికయవారికీ ఎంత తేడా! నిజమే క్రీస్తుకు ఎవరు నమ్మకంగా ఉండి విధేయత చూపించినా అపవాది దాన్ని బట్టి ఆనందించలేదు. అందుకే యేసు ఇలా హెచ్చరించాడు: “నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.” (ప్రకటన 2:​9, 10) అలాగే, ‘నీవు నా వాక్యమును గైకొని [లేక నాకు విధేయత చూపి] నా నామము ఎరుగననలేదు. . . . నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము’ అంటూ యేసు ఫిలదెల్ఫియ వారిని మెచ్చుకున్నాడు.​—⁠ప్రకటన 3:​8, 11.

20. నేడు లక్షలాదిమంది యేసు వాక్యమును ఎలా గైకొన్నారు, ఎలాంటి పరిస్థితులున్నప్పటికీ వారలా చేశారు?

20 ఒక నమ్మకమైన శేషము, 1914 లో ‘ప్రభువు దినము’ ప్రారంభమైనప్పటి నుండి, ఇప్పుడు లక్షల సంఖ్యలోవున్న వేరే గొఱ్ఱెలైన వారి సహవాసులు, ఆసక్తితో పరిచర్యలో భాగం వహించడం ద్వారా, తమ యథార్థతను కాపాడుకోవడం ద్వారా యేసు వాక్యమును గైకొన్నారు. తమ మొదటి శతాబ్దపు సహోదరుల్లాగే కొందరు క్రీస్తుకు విధేయత చూపించినందుకు బాధలు అనుభవించారు, చివరికి చెరసాలల్లో నిర్బంధ శిబిరాల్లో వేయబడ్డారు. తమ చుట్టూ ధనసమృద్ధి, దురాశ ఉన్నప్పటికీ ‘కంటిని తేటగా’ ఉంచుకోవడం ద్వారా యేసు వాక్యమును గైకొన్నారు. (మత్తయి 6:​22, 23) అవును, ఎలాంటి వాతావరణంలోనైనా ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నిజ క్రైస్తవులు తమ విధేయత ద్వారా యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తూనే ఉన్నారు.​—⁠సామెతలు 27:​11.

21. (ఎ) దాసుని తరగతి ఏ ఆధ్యాత్మిక బాధ్యతను నెరవేర్చడంలో కొనసాగుతోంది? (బి) మనం షిలోహుకు విధేయత చూపించాలని నిజంగా కోరుకుంటున్నామని ఎలా చూపించవచ్చు?

21 మనం మహా శ్రమలను సమీపిస్తుండగా, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ తాను తన యజమాని అయిన క్రీస్తుకు చూపించే విధేయత విషయంలో ఎంతమాత్రం రాజీ పడకూడదని నిశ్చయించుకున్నాడు. అలా విధేయత చూపించడంలో దేవుని ఇంటివారికి సమయానికి తగినట్లు ఆధ్యాత్మిక ఆహారాన్ని సిద్ధం చేయడం ఇమిడి ఉంది. కాబట్టి మనం యెహోవా అద్భుతమైన దైవపరిపాలనా సంస్థను, అది అందజేసేదాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండడంలో కొనసాగుదాము. ఈ విధంగా, మనం షిలోహుకు మన విధేయతను చూపిస్తాము, తనకు విధేయత చూపించేవారందరికీ ఆయన నిత్యజీవాన్ని ప్రతిఫలంగా ఇస్తాడు.​—⁠మత్తయి 24:45-47; 25:40; యోహాను 5:​22-24.

[అధస్సూచీలు]

^ పేరా 8 “ఏడు కాలముల”ను గురించిన వివరణ కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని 10వ అధ్యాయాన్ని చూడండి.

^ పేరా 14 ఏడు పత్రికల సవివరమైన చర్చ కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన ప్రకటన​—⁠దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలో 33వ పేజీ నుండి చూడండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

• మరణశయ్య పైనుండి యాకోబు ప్రవచించిన ప్రవచనంలో ముందే చెప్పబడినట్లుగా యేసు ఏ పాత్ర నిర్వహించవలసి ఉంది?

• యేసును షిలోహుగా మనం ఎలా అంగీకరిస్తాము, ఏ స్ఫూర్తిని మనం నివారించాలి?

• ప్రకటనలోని ఏడు సంఘాలకు వ్రాయబడిన పత్రికల్లో మన కాలం కోసం ఏ సముచితమైన ఉపదేశం ఉంది?

• ప్రాచీన స్ముర్న, ఫిలదెల్ఫియ సంఘాల్లోని వారిని మనం ఏ యే విధాలుగా అనుకరించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[18వ పేజీలోని చిత్రాలు]

నమ్మకమైన ‘గృహనిర్వాహకుడికి’ విధేయత చూపించినందుకు యెహోవా తన ప్రజలను ఆశీర్వదిస్తాడు

[19వ పేజీలోని చిత్రం]

సాతాను ప్రభావం, దేవునికి విధేయత చూపించడం ఒక సవాలుగా పరిణమించేలా చేస్తుంది

[21వ పేజీలోని చిత్రాలు]

యెహోవాతో పటిష్ఠమైన సంబంధం కలిగి ఉండడం ఆయనకు విధేయత చూపించడానికి మనకు సహాయం చేస్తుంది