క్షేమము కలిగిందని మైమరచిపోయేవారిలా ఉండాలా?
క్షేమము కలిగిందని మైమరచిపోయేవారిలా ఉండాలా?
ఆయన చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా, సహనశీలిగా ఉంటాడని నలుగురూ తమ గురించి చెప్పుకోవడం నిజంగా ప్రశంసనీయం అని బహుశా చాలామంది అనుకుంటుండవచ్చు. కానీ ఆ లక్షణాలు తరచూ, “క్షేమము కలిగినదని మైమరచి” పోయేలా చేయగలవు. బైబిలు ఇలా చెబుతుంది: “బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు.” (సామెతలు 1:32) దాని భావమేమిటి?
మూల హీబ్రూ పదాన్ని ఇతర బైబిలు అనువాదాలు ‘లేని క్షేమాన్ని ఊహించుకోవడం’ (పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం), “అవివేకము” (పవిత్ర గ్రంథము, క్యాతలిక్ అనువాదము), ‘బుద్ధిహీనపద్ధతులు’ (ఈజీ-టు-రీడ్ వర్షన్) అని అనువదిస్తున్నాయి. కాబట్టి, క్షేమము కలిగినదని మైమరచిపోవడం బద్ధకంతోనూ అజాగ్రత్తతోనూ జతచేయబడుతోంది, ఆ విధంగా అది బుద్ధిహీనతతో లేదా మూర్ఖత్వంతో కూడా జతచేయబడుతోంది.
మొదటి శతాబ్దంలో, లవొదికయ సంఘంలోని క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక లోపాలను ఏమాత్రం గ్రహించకుండా ఉన్నారు లేదా ఆత్మసంతృప్తితో ఉన్నారు. వారు ‘మాకేమియు కొదువలేదని’ అవివేకంగా గొప్పలు చెప్పుకున్నారు. కానీ వారు తమ క్రైస్తవ ఆసక్తిని పునరుత్తేజపరుచుకోవలసిన అవసరం ఉందని చెబుతూ యేసుక్రీస్తు వారిని సరిదిద్దాడు.—ప్రకటన 3:14-19.
క్షేమము కలిగిందని మైమరచిపోతూ ఆత్మసంతృప్తితో ఉండడం నోవహు కాలంనాటి ప్రజలలో కూడా ఉండేది. యేసు ఇలా అన్నాడు, “వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచు” ఇహలోక సంబంధ విషయాల్లో మునిగిపోయి “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి.” తర్వాత యేసు ఇలా జతచేశాడు: “ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ [“ప్రత్యక్షత,” NW] ఉండును.”—మత్తయి 24:37-39.
మనం “మనుష్యకుమారుని” అంటే యేసుక్రీస్తు “ప్రత్యక్షత” సమయంలో జీవిస్తున్నామని ఇప్పటి వరకు నెరవేరిన బైబిలు ప్రవచనాలు సూచిస్తున్నాయి. మనం ఎన్నటికీ ఆత్మసంతృప్తిగలవారముగా, అజాగ్రత్తపరులముగా, బుద్ధిహీనులముగా అంటే “క్షేమము కలిగినదని మైమరచి”పోయేవారముగా కాకుండా ఉందాము.—లూకా 21:29-36.