కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానం మనకు ఓదార్పునిస్తుంది

దేవుని గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానం మనకు ఓదార్పునిస్తుంది

దేవుని గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానం మనకు ఓదార్పునిస్తుంది

దేవుని ప్రేమాకనికరాల గురించి బైబిలు చెబుతున్న విషయం కొంతమందిలో కలవరపరిచే ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది. వారిలా అడుగుతారు: దేవుడు దుష్టత్వాన్ని నిర్మూలించాలనుకుంటే, దాన్ని ఎలా నిర్మూలించాలో ఆయనకు తెలిస్తే, అలా నిర్మూలించే శక్తే ఆయనకుంటే, మరెందుకు దుష్టత్వం అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది? వాళ్ళకు సమస్యేమిటంటే, పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నట్లున్న ఈ మూడు విషయాలను సమన్వయపరుచుకోవడం: (1) దేవుడు సర్వశక్తిమంతుడు; (2) దేవుడు ప్రేమగలవాడు, మంచివాడు; (3) విపత్కరమైన సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిలోని చివరి విషయం కాదనలేని వాస్తవం కాబట్టి బహుశా మిగతా రెండింటిలో కనీసం ఏదో ఒకటి నిజం కాకపోవచ్చునని వారు తమలో తాము తర్కించుకుంటారు. దేవుడు దుష్టత్వాన్ని ఆపలేకపోతున్నాడు లేదా ఆయనకు అస్సలు పట్టింపు లేదన్నది వారి అభిప్రాయం.

న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నాశనం చేయబడిన కొన్ని రోజుల తర్వాత, అమెరికాలోని ఒక ప్రముఖ మతనాయకుడు ఇలా అన్నాడు: “దేవుడు బాధావేదనలను ఎందుకు అనుమతిస్తాడని, నా జీవితంలో వందలసార్లు . . . నన్ను నేను ప్రశ్నించుకున్నాను. దానికి పూర్తి జవాబు నాకు నిజంగా తెలియదనే చెప్పాలి, చివరికి నన్ను నేను సంతృప్తిపరుచుకునే జవాబు కూడా నా దగ్గరలేదు.”

ఆ వ్యాఖ్యానానికి ప్రతిస్పందనగా ఒక దైవశాస్త్ర పండితుడు, ఆ మతనాయకుడు ప్రకటించిన “చక్కని వేదాంతం” తనను కదిలించిందని వ్రాశాడు. ఈ పండితుడు, “బాధను అర్థం చేసుకోవడంలోని అసాధ్యత, దేవుడ్ని అర్థం చేసుకోవడంలోని అసాధ్యతలో భాగమే” అని వ్రాసిన మరో పండితుడి దృక్కోణాన్ని సమర్థించే వ్యాఖ్యానాలు కూడా చేశాడు. కానీ దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడో అర్థం చేసుకోవడం నిజంగా అసాధ్యమా?

దుష్టత్వానికి మూలం

మతనాయకులు చెప్పేదానికి భిన్నంగా, దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడానికి కారణం అర్థం చేసుకోవడం సాధ్యమేనని బైబిలు చెబుతుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైన విషయం యెహోవా దుష్ట లోకాన్ని సృష్టించలేదన్నదే. ఆయన మొదటి మానవ జంటను పరిపూర్ణులుగా, ఏ పాపం లేనివారిగా సృష్టించాడు. యెహోవా తన ఈ సృష్టి కార్యాన్ని చూసి అది “చాలమంచిదిగ” ఉందని కనుగొన్నాడు. (ఆదికాండము 1:​26, 31) తన ప్రేమపూర్వకమైన సర్వాధిపత్య కాపుదల క్రింద ఆదాము హవ్వలు ఏదెనులోని పరదైసును భూమి అంతటా విస్తరింపజేసి, సంతోషభరితులైన ప్రజలతో దాన్ని నింపాలన్నది ఆయన సంకల్పం.​—⁠యెషయా 45:​18.

దేవునికి మొదట్లో నమ్మకంగానే ఉండిన ఒక ఆత్మ ప్రాణి తాను ఆరాధించబడాలనే కోరికను వృద్ధి చేసుకోవడంతో దుష్టత్వమన్నది ప్రారంభమైంది. (యాకోబు 1:​14, 15) దేవుడ్ని వ్యతిరేకించడంలో మొదటి మానవ జంట తనతో కలిసేలా అతడు వారిని ప్రభావితం చేసినప్పుడు అతడి తిరుగుబాటు ఈ భూమిపై బయల్పడింది. ఆదాము హవ్వలు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినవద్దని లేదా ముట్టవద్దని దేవుడిచ్చిన స్పష్టమైన ఆజ్ఞకు విధేయులయ్యే బదులు వాటిని తీసుకుని తిన్నారు. (ఆదికాండము 3:​1-6) అలా చేయడం ద్వారా వారు దేవునికి అవిధేయత చూపించడమే గాక తాము ఆయన నుండి స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నామని కూడా చూపించారు.

ఒక నైతిక వివాదాంశం లేవదీయబడింది

ఏదెనులో జరిగిన ఈ తిరుగుబాటు ఒక నైతిక వివాదాంశాన్ని అంటే విశ్వమంతటిలో అతిప్రాముఖ్యమైనదైన ఒక సవాలును లేవదీసింది. తిరుగుబాటుదారులైన మానవులు యెహోవా తన సృష్టిప్రాణులను సరైన విధంగా పరిపాలిస్తున్నాడా లేదా అనేదాన్ని ప్రశ్నించారు. మానవజాతి తనకు సంపూర్ణంగా విధేయులై ఉండాలని కోరే హక్కు సృష్టికర్తకు ఉందా? ప్రజలు స్వతంత్రంగా వ్యవహరిస్తే హాయిగా ఉంటారా?

యెహోవా తన పరిపాలనకు సంబంధించి లేవదీయబడిన ఈ సవాలుతో, ప్రేమ, న్యాయము, జ్ఞానము, శక్తిల పరిపూర్ణమైన సమతుల్యత వెల్లడయ్యే విధంగా వ్యవహరించాడు. నిజానికి తిరుగుబాటును వెంటనే అణచివేసేందుకు ఆయన తన శక్తిని ఉపయోగించి ఉండేవాడే. అలా చేసే హక్కు దేవునికి ఉంది కాబట్టి, అది న్యాయమైనదిగానే అనిపించి ఉండేది. కానీ అలా చేయడం, లేవదీయబడిన నైతిక ప్రశ్నలకు సమాధానం ఇచ్చివుండేది కాదు. మరో వైపున, దేవుడు పాపాన్ని చూసీచూడనట్లు వదిలేయగలిగేవాడే. నేడు కొంతమందికి అది ప్రేమతో కూడిన చర్యగా అనిపించవచ్చు. అయినప్పటికీ, మానవులు తమను తాము పరిపాలించుకుంటే హాయిగా ఉంటారన్న సాతాను ఆరోపణకు ఇది కూడా సమాధానాన్ని ఇచ్చివుండేది కాదు. అంతేగాక, అలాంటి చర్య ఇంకా ఇతరులు యెహోవా మార్గం నుండి ప్రక్కకు తొలగిపోయేలా ప్రోత్సహించి ఉండేది కాదా? దాని ఫలితం అంతులేని వేదనే అయ్యుండేది.

యెహోవా జ్ఞానయుక్తంగా, మానవులు కొంతకాలంపాటు స్వతంత్రంగా ఉండడానికి అనుమతించాడు. దీని మూలంగా దుష్టత్వాన్ని తాత్కాలికంగా అనుమతించవలసి వచ్చినప్పటికీ, తప్పేది ఒప్పేది అనే విషయంలో తమ సొంత ప్రమాణాల అనుసారంగా జీవిస్తూ దేవుని నుండి స్వతంత్రంగా ఉండి తమను తాము విజయవంతంగా పరిపాలించుకోగలరో లేదో నిరూపించుకునే అవకాశం మానవులకు ఇవ్వబడింది. దాని ఫలితమేమిటి? మానవ చరిత్రలో యుద్ధాలు, అన్యాయం, అణచివేత, వేదన లేని కాలమంటూ ఎప్పుడూ లేదు. యెహోవాకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు తుది వైఫల్యం ఏదెనులో లేవదీయబడిన వివాదాంశాలను శాశ్వతంగా పరిష్కరిస్తుంది.

ఈలోగా, తన మానవ జీవాన్ని విమోచన క్రయధన బలిగా అర్పించిన తన కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించడం ద్వారా దేవుడు తన ప్రేమను చూపించాడు. ఇది, ఆదాము అవిధేయత వల్ల శాపాలుగా వచ్చిన పాప మరణాల నుండి విముక్తి పొందడానికి విధేయులైన మానవులకు సహాయం చేస్తుంది. యేసు మీద విశ్వాసం ఉంచే వారందరూ నిత్యజీవాన్ని పొందడానికి విమోచన క్రయధనం మార్గాన్ని తెరిచింది.​—⁠యోహాను 3:​16.

మానవులు అనుభవిస్తున్న బాధలు తాత్కాలికమైనవనే ఆదరణనిచ్చే యెహోవా హామీ మనకుంది. “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు” అని కీర్తనకర్త వ్రాశాడు.​—⁠కీర్తన 37:​10, 11.

సురక్షితమైన, సంతోషభరితమైన భవిష్యత్తు

అనారోగ్యాన్నీ దుఃఖమరణాలనూ దేవుడు అంతమొందించే సమయం సమీపించిందని బైబిలు ప్రవచనాల నెరవేర్పు చూపిస్తోంది. అపొస్తలుడైన యోహానుకు రాబోయే వాటిని గురించిన ఎంత అద్భుతమైన దర్శనం ఇవ్వబడిందో గమనించండి. ‘నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. . . . దేవుడు తానే [మానవజాతికి] దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను]’ అని ఆయన వ్రాశాడు. ఈ వాగ్దానాల నమ్మకత్వాన్ని నొక్కి చెప్పే వ్యాఖ్యానంలో, “ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయు[ము]” అని యోహానుకు చెప్పబడింది.​—⁠ప్రకటన 21:​1-5.

ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పటి నుండి మరణించిన కోటానుకోట్లమంది నిర్దోషుల మాటేమిటి? ఇప్పుడు మరణమందు నిద్రిస్తున్న ప్రజలను తిరిగి సజీవులను చేస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని . . . దేవునియందు నిరీక్షణయుంచి” ఉన్నాను అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (అపొస్తలుల కార్యములు 24:​14, 15) వీరికి ‘నీతి నివసించే’ లోకంలో జీవించే నిరీక్షణ ఉంటుంది.​—⁠2 పేతురు 3:​13.

ఒక బాధాకరమైన శస్త్రచికిత్స తన కుమారుడికి శాశ్వత ప్రయోజనాలను చేకూరుస్తుందని తెలిస్తే ఒక ప్రేమగల తండ్రి ఎలాగైతే దానికి ఒప్పుకుంటాడో, అలాగే మానవులు భూమిపై దుష్టత్వాన్ని తాత్కాలికంగా అనుభవించడానికి యెహోవా అనుమతించాడు. అయినా, దేవుని చిత్తం చేయడానికి ప్రయత్నించేవారందరి కోసం శాశ్వత ఆశీర్వాదాలు వేచి ఉన్నాయి. పౌలు ఇలా వర్ణించాడు: “సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.”​—⁠రోమీయులు 8:​20, 21.

ఇది నిజంగా మనం టీవీల్లో చూసే లేదా వార్తాపత్రికల్లో చదివేలాంటి వార్త కాదు గానీ ఇదొక సువార్త. మన గురించి నిజంగా శ్రద్ధ కలిగివున్న “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” చెబుతున్న సర్వశ్రేష్ఠమైన వార్త.​—⁠2 కొరింథీయులు 1:⁠3.

[6వ పేజీలోని చిత్రాలు]

దేవుని నుండి వేరై స్వతంత్రంగా మానవజాతి తమను తాము విజయవంతంగా పరిపాలించుకోలేదని కాలం చూపించింది

[చిత్రసౌజన్యం]

సొమాలియా కుటుంబం: UN PHOTO 159849/M. GRANT; అణు బాంబు: USAF photo; నిర్బంధ శిబిరం: U.S. National Archives photo