కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీకు నీవే సాధకము చేసికొనుము”

“నీకు నీవే సాధకము చేసికొనుము”

“నీకు నీవే సాధకము చేసికొనుము”

మరింత వేగంగా, మరింత ఎత్తుగా, మరింత బలంగా! ప్రాచీన గ్రీస్‌, రోమ్‌లలోని క్రీడాకారులు ఈ ఆశయాలను చేరుకోవాలని గాఢంగా వాంఛించేవారు. ఒలింపియాలో, డెల్ఫీలో, నీమ్యాలో, కొరింథులోని ఇస్తుమస్‌లో, శతాబ్దాల వరకూ దేవతల “ఆశీర్వాదం”తో, వేలాదిమంది ప్రేక్షకులు ఆత్రుతతో చూస్తుండగా పెద్ద ఎత్తున క్రీడా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ ఆటలలో పోటీ చేసే ఆధిక్యత, ఎన్నో సంవత్సరాలుగా కష్టపడితే వచ్చిన ప్రతిఫలం. విజయం, విజేతలనూ వారి స్వంత పట్టణాలనూ కీర్తిలో ముంచెత్తేది.

ఇలాంటి సాంస్కృతిక నేపథ్యంలో, క్రైస్తవ గ్రీకు లేఖనాల రచయితలు క్రైస్తవుల ఆధ్యాత్మిక పందేన్ని క్రీడా కార్యక్రమాలతో పోల్చారంటే ఆశ్చర్యమేమీ లేదు. అపొస్తలులైన పేతురు, పౌలు బోధకు సంబంధించిన శక్తివంతమైన అంశాలను తెలియజేయడానికి ఆటల మీద ఆధారపడిన ఉపమానాలను ఎంతో నైపుణ్యవంతంగా ఉపయోగించారు. మన కాలంలో కూడా, అదే తీవ్రమైన క్రైస్తవ పందెం కొనసాగుతుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు యూదా విధానంతో వ్యవహరించవలసి వచ్చింది; నేడు మనం, నాశనానికి సమీపించిన ప్రపంచవ్యాప్త విధానంతో ‘పోరాడాలి.’ (2 తిమోతి 2:⁠5; 3:​1-5) కొందరికి తమ వ్యక్తిగత “విశ్వాసపు పందెం,” నిరంతర పోరాటంగా, అలసట కలిగించేదిగా ఉండవచ్చు. (1 తిమోతి 6:​12, ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) బైబిలులో క్రైస్తవ పందేనికీ, క్రీడా కార్యక్రమాలకూ మధ్యవున్న కొన్ని పోలికలను పరిశీలించడం మనకు విలువైన పాఠాలను నేర్పుతుంది.

ఉత్కృష్టమైన శిక్షకుడు

ఒక క్రీడాకారుని విజయం చాలావరకు అతని శిక్షకుడిపై ఆధారపడివుంటుంది. ప్రాచీన ఆటల గురించి ఆర్కయోలోజియా గ్రైకా అనే పుస్తకం ఇలా చెబుతోంది: “పోటీదారులు తాము పోటీకి సిద్ధపడడానికి పది నెలల పాటు వ్యాయామాలు చేశామని చెబుతూ ప్రమాణం చేయాల్సివచ్చేది.” క్రైస్తవులకు కూడా తీవ్రమైన శిక్షణ అవసరం. క్రైస్తవ పెద్దయైన తిమోతికి, “దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము [“శిక్షణనిచ్చుకో,” NW]” అని పౌలు సలహా ఇచ్చాడు. (1 తిమోతి 4:⁠7) క్రైస్తవ “క్రీడాకారునికి” శిక్షకుడు ఎవరు? యెహోవా దేవుడే! అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “సర్వకృపా నిధియగు దేవుడు, . . . తానే మిమ్మును పూర్ణులనుగాచేసి [“మీ శిక్షణను పూర్తి చేసి,” NW] స్థిరపరచి బలపరచును.” (ఇటాలిక్కులు మావి.)​—⁠1 పేతురు 5:​10.

‘మీ శిక్షణను పూర్తి చేస్తాడు’ అన్న మాటలు ఒక గ్రీకు క్రియాపదం నుండి వచ్చాయి. థియొలాజికల్‌ లెక్సికన్‌ ఆఫ్‌ ద న్యూ టెస్టమెంట్‌ ప్రకారం ఆ క్రియాపదానికి ప్రాథమికంగా, “ఒక వస్తువును [లేదా వ్యక్తిని] దాని సంకల్పానికి తగినట్లు తయారుచేయడం, దాన్ని సిద్ధపర్చడం, దాని ఉపయోగానికి తగినట్లు అనుకూలంగా మలచడం” అన్న అర్థం ఉంది. అలాగే ఈ క్రియాపదం “సిద్ధపరచు, శిక్షణనివ్వు, లేదా సంపూర్ణంగా సమకూర్చు” అని నిర్వచించబడవచ్చు అని లిడ్డెల్‌ మరియు స్కాట్‌ల గ్రీక్‌-ఇంగ్లీష్‌ లెక్సికన్‌ వ్యాఖ్యానిస్తుంది. ఎంతో కష్టతరమైన క్రైస్తవ పందెం కోసం యెహోవా మనల్ని ఏ విధంగా ‘సిద్ధపరిచి, శిక్షణనిచ్చి, సంపూర్ణంగా సమకూరుస్తాడు?’ ఈ పోలికను అర్థం చేసుకోవడానికి, శిక్షకులు ఉపయోగించే కొన్ని పద్ధతులను మనం పరిశీలిద్దాము.

ప్రాచీన గ్రీస్‌లో ఒలింపిక్‌ క్రీడలు (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా చెబుతోంది: “యువతకు శిక్షణనిచ్చేవారు రెండు ప్రాథమిక పద్ధతులను ఉపయోగించేవారు, మొదటి పద్ధతి అత్యుత్తమమైన ఫలితాలను సాధించడానికిగాను విద్యార్థిని సాధ్యమైనంత ఎక్కువగా శారీరక కృషి చేయమని ప్రోత్సహించేది, రెండవ పద్ధతి అతని కౌశల్యాన్ని, శైలిని మెరుగుపర్చేదిగా ఉండేది.”

అదేవిధంగా, మనం మన అత్యున్నత సామర్థ్యాన్ని చేరుకోవడానికి, ఆయన సేవలో మన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి యెహోవా మనల్ని ప్రోత్సహిస్తాడు, బలపరుస్తాడు. మన దేవుడు మనల్ని బైబిలు ద్వారా, తన భూసంస్థ ద్వారా, పరిణతి చెందిన తోటి క్రైస్తవుల ద్వారా ప్రోత్సహిస్తాడు. కొన్నిసార్లు ఆయన మనకు క్రమశిక్షణ ద్వారా శిక్షణనిస్తాడు. (హెబ్రీయులు 12:​4-6) మరితర సమయాల్లో, మనం సహనాన్ని పెంపొందించుకోగలిగేలా విభిన్నమైన శ్రమలు, కష్టాలు మనపై రావడానికి ఆయన అనుమతించవచ్చు. (యాకోబు 1:​2-4) ఆయన మనకు కావలసిన బలాన్ని అందిస్తాడు. ప్రవక్తయైన యెషయా ఇలా అంటున్నాడు: “యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.”​—⁠యెషయా 40:⁠31.

అన్నింటినీ మించి, దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు, ఆయనకు అంగీకారయోగ్యమైన సేవను చేయడంలో మనం కొనసాగేలా అది మనల్ని బలపరుస్తుంది. (లూకా 11:​13) చాలా సందర్భాల్లో దేవుని సేవకులు విశ్వాసానికి సంబంధించిన కష్టతరమైన శ్రమల్ని చాలాకాలం వరకూ సహించారు. అలా సహించినవారు మనలాగే సాధారణ స్త్రీపురుషులు. కానీ వారికి దేవునిపై ఉన్న సంపూర్ణ విశ్వాసం వారు వాటిని సహించడానికి సహాయపడింది. నిజంగా, ‘ఆ బలాధిక్యము వారి మూలమైనది కాక దేవునిదై యుంది.’​—⁠2 కొరింథీయులు 4:⁠7.

సహానుభూతిగల శిక్షకుడు

ప్రాచీన శిక్షకుడు చేయవలసిన పనుల్లో ఒకటి, “ఒక క్రీడాకారునికి వ్యక్తిగతంగా, ప్రత్యేకించి ఒక నిర్దిష్టమైన ఆటకు ఏ విధమైన వ్యాయామాలు ఎంత మోతాదులో అవసరమో నిర్ణయించడం” అని ఒక విద్వాంసుడు వ్యాఖ్యానించాడు. దేవుడు మనకి శిక్షణనిస్తుండగా, ఆయన మన వ్యక్తిగత పరిస్థితులను, మన సామర్థ్యాలను, మన మానసిక తత్వాన్ని, మన పరిమితులను పరిగణలోకి తీసుకుంటాడు. యెహోవా మనకు శిక్షణనిస్తున్నప్పుడు, చాలా తరచుగా యోబులా ఆయనను మనమిలా వేడుకుంటాము: “జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుము.” (యోబు 10:⁠9) సహానుభూతిగల మన శిక్షకుడు ఎలా ప్రతిస్పందిస్తాడు? “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు” అని యెహోవా గురించి దావీదు వ్రాశాడు.​—⁠కీర్తన 103:​14.

మీ పరిచర్యను పరిమితం చేసే గంభీరమైన ఆరోగ్య సమస్య మీకు ఉండవచ్చు లేదా మీరు ఆత్మన్యూనతా భావాలతో పోరాడుతుండవచ్చు. బహుశా మీరు ఏదైనా ఒక చెడు అలవాటును మానుకోవాలని కృషి చేస్తుండవచ్చు, లేదా మీరు పొరుగువారి ఒత్తిడిని, సహోద్యోగుల ఒత్తిడిని, తోటి విద్యార్థుల ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నారని భావించవచ్చు. మీ పరిస్థితులు ఏవైనప్పటికీ, యెహోవా వేరే ఎవరికన్నా బాగా​—⁠మీ కన్నా కూడా బాగా—⁠మీ సమస్యలను అర్థం చేసుకుంటాడని ఎన్నడూ మర్చిపోకండి! మీరు ఆయనకు దగ్గరైతే, ఒక చింతగల శిక్షకుడిగా మీకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు.​—⁠యాకోబు 4:⁠8.

ప్రాచీన శిక్షకులు “వ్యాయామాల వల్ల కాక, మానసిక కారణాల వల్ల, సరైన మనఃస్థితి లేనందువల్ల, కృంగుదల వల్ల మరితర కారణాల వల్ల కలిగిన అలసటను, బలహీనతను గుర్తించగలరు. . . . [శిక్షకుల] పరిధి ఎంత విస్తృతంగా ఉండేదంటే, వారు క్రీడాకారుల వ్యక్తిగత జీవితాలను కూడా పరీక్షించి, వారు అవసరమనుకున్న విషయాలలో కలుగజేసుకునేవారు.”

ఈ లోకంనుండి ఎడతెగకుండా వచ్చే ఒత్తిళ్ళ వల్ల, శోధనల వల్ల మీరు కొన్నిసార్లు అలసిపోయినట్లు, బలహీనమైపోయినట్లు భావిస్తారా? మీకు శిక్షణనిచ్చేవాడిగా, యెహోవాకు మీ విషయంలో అత్యంత శ్రద్ధ ఉంది. (1 పేతురు 5:⁠7) ఆధ్యాత్మిక బలహీనతకు లేదా అలసటకు సంబంధించి మీలో కనిపించే సూచనను ఆయన వెంటనే గుర్తిస్తాడు. మన స్వేచ్ఛా చిత్తాన్నీ, మన వ్యక్తిగత ఎంపికను యెహోవా పరిగణలోకి తీసుకున్నప్పటికీ, మన శాశ్వత సంక్షేమంపట్ల శ్రద్ధ కలిగివుండడం వల్ల, ఆయన మనకు అవసరమైనప్పుడు సహాయాన్ని, దిద్దుబాటును ధారాళంగా అందజేస్తాడు. (యెషయా 30:​21) ఎలా? బైబిలు ద్వారా, బైబిలు ఆధారిత ప్రచురణల ద్వారా, సంఘంలోని ఆధ్యాత్మిక పెద్దల ద్వారా మరియు ప్రేమగల మన సహోదరత్వం ద్వారా ఆయన అలా చేస్తాడు.

“అన్ని విషయములలోనూ ఆశానిగ్రహము”

నిజమే, విజయం సాధించడానికి ఒక మంచి శిక్షకుడు మాత్రమే సరిపోడు. స్వయంగా క్రీడాకారుని మీదా, తీవ్రమైన శిక్షణపట్ల అతని నిబద్ధత మీదా ఎంతో ఆధారపడి ఉంటుంది. శిక్షణా ప్రక్రియ కఠినంగా ఉండేది ఎందుకంటే లైంగిక సంబంధాలు, మద్యం సేవించడం వంటివాటినుండి ఖచ్చితంగా దూరంగా ఉండడం, ఆహారవిషయంలో చెప్పబడిన నియమాల ప్రకారం తినడం వంటివి పాటించాల్సి ఉంటుంది. సా.శ.పూ. మొదటి శతాబ్దపు కవి అయిన హోరేస్‌, “ఎంతో గాఢంగా వాంఛించిన గమ్యాన్ని చేరుకోవడానికి” పోటీదారులు “స్త్రీలనుండి మద్యంనుండి దూరంగా” ఉండేవారని చెప్పాడు. ఎఫ్‌. సి. కుక్‌ అనే బైబిలు విద్వాంసుని ప్రకారం, ఆటలలో పాల్గొనేవారు “ఆశానిగ్రహాన్ని పాటిస్తూ, పది నెలలపాటు . . . ఆరోగ్యకరమైన పరిమిత ఆహారాన్ని భుజించవలసివచ్చేది.”

దగ్గర్లో జరిగే ఇస్తుమియన్‌ ఆటలతో పరిచయమున్న కొరింథులోని క్రైస్తవులకు వ్రాసినప్పుడు పౌలు ఆ వాస్తవాన్ని సూచిస్తూ ఇలా అన్నాడు: “పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును.” (1 కొరింథీయులు 9:​25) నిజ క్రైస్తవులు లోకసంబంధమైన వస్తుదాయక, అనైతిక, అపరిశుభ్రమైన జీవిత విధానాలను నివారిస్తారు. (ఎఫెసీయులు 5:​3-5; 1 యోహాను 2:​15-17) భక్తిహీనమైన, లేఖన విరుద్ధమైన అలవాట్లను పరిత్యజించి వాటి స్థానంలో క్రీస్తువంటి లక్షణాలను అలవర్చుకోవలసిన అవసరం కూడా వుంది.​—⁠కొలొస్సయులు 3:​9, 10, 12.

అది ఎలా చేయవచ్చు? పౌలు ఒక శక్తివంతమైన ఉపమానం ద్వారా ఇచ్చిన సమాధానమును గమనించండి: “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.”​—⁠1 కొరింథీయులు 9:​27.

ఇక్కడ పౌలు ఎంత శక్తివంతమైన పాఠాన్ని చెప్పాడో కదా! మనల్ని మనం హింసించుకోవడాన్ని ఆయన ప్రోత్సహించడంలేదు. బదులుగా, ఆయనకు వ్యక్తిగతంగా అంతరంగ పోరాటాలు ఉన్నాయని ఒప్పుకున్నాడు. కొన్నిసార్లు, ఆయన తాను చేయకూడదనుకున్నవాటిని చేసేవాడు, చేయాలనుకున్నవాటిని చేయలేకపోయేవాడు కాదు. కానీ తన బలహీనతలు తనపై ఆధిక్యాన్ని పొందడానికి అనుమతించకుండా ఆయన పోరాడాడు. శరీరసంబంధమైన కోరికలను, అలవాట్లను బలంగా అణచివేస్తూ ఆయన తన ‘శరీరమును నలగగొట్టుకున్నాడు.’​—⁠రోమీయులు 7:​21-25.

క్రైస్తవులందరూ అదే చేయవలసిన అవసరం ఉంది. కొరింథులో మునుపు వ్యభిచారం, విగ్రహారాధన, స్వలింగ సంయోగం, దొంగతనం, మరితర పనుల్లో భాగం వహించిన కొంతమంది తమ జీవితాల్లో చేసుకున్న మార్పుల గురించి పౌలు చెప్పాడు. వారు అలా మారడానికి వారికి ఏమి సహాయపడింది? దేవుని వాక్యపు శక్తి మరియు పరిశుద్ధాత్మ, అలాగే దేవుని వాక్యానికి కట్టుబడి ఉండాలన్న తమ దృఢ తీర్మానం వారికి సహాయపడ్డాయి. “ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి” అన్నాడు పౌలు. (1 కొరింథీయులు 6:​9-11) అలాంటి చెడు అలవాట్లను విడిచిపెట్టిన వారి గురించి పేతురు కూడా అదేవిధంగా వ్రాశాడు. క్రైస్తవులుగా వారందరూ నిజంగా మార్పులు చేసుకున్నారు.​—⁠1 పేతురు 4:⁠3, 4.

చక్కగా గురిపెట్టిన కృషి

ఆధ్యాత్మిక లక్ష్యాలను వెంబడించడంలో పౌలు తన స్థిరత్వాన్ని, స్పష్టమైన గురిని ఉదహరిస్తూ ఇలా అన్నాడు: “గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు.” (1 కొరింథీయులు 9:​27) ఒక పోటీదారుడు తన దెబ్బలను లేదా పిడికిలి పోటులను ఎలా గురిపెడతాడు? గ్రీకులు మరియు రోమన్ల జీవితం (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా సమాధానమిస్తోంది: “పశుబలంతోపాటు ప్రత్యర్థిలోని బలహీనతలను గ్రహించడానికి తీక్షణమైన పరిశీలనా దృష్టి కూడా అవసరం. కుస్తీ పాఠశాలల్లో నేర్చుకున్న పిడికిలిని బిగించి ఒడుపుగా దెబ్బ వేయడం, ప్రత్యర్థిని మట్టుపెట్టడంలోని చురుకుదనం కూడా అంతే ప్రాముఖ్యం.”

మన ప్రత్యర్థుల్లో ఒకరు మన అపరిపూర్ణ శరీరం. మన వ్యక్తిగత “బలహీనతలను” మనం గుర్తించామా? ఇతరులు మనలను చూసినట్లు​—⁠ప్రత్యేకించి సాతాను మనలను చూసినట్లు​—⁠మనల్ని మనం చూసుకోవడానికి సుముఖంగా ఉన్నామా? దానికి యథార్థమైన స్వయం పరిశీలన అలాగే మార్పులు చేసుకోవడానికి సుముఖత అవసరం. అయితే ఆత్మవంచన చేసుకోవడం చాలా సులభం. (యాకోబు 1:​22) బుద్ధిహీన చర్యలను సమర్థించుకుంటూ సాకులు చెప్పడం ఎంత సులభం! (1 సమూయేలు 15:​13-15, 20, 21) ఇది ‘గాలిని కొట్టడంతో’ సమానం.

ఈ అంత్యదినాల్లో, యెహోవాను ప్రీతిపర్చి జీవాన్ని పొందాలని కోరుకునే వారు, సరైనదానికీ సరికానిదానికీ దేవుని సంఘానికీ దుష్ట లోకానికీ మధ్య ఎంపిక చేసుకునేటప్పుడు సందేహించకూడదు. వారు చంచలత్వంతో ‘ద్విమనస్కులై, తమ సమస్త మార్గములయందు అస్థిరులై’ ఉండడాన్ని నివారించాలి. (యాకోబు 1:⁠7, 8) వారు ఫలవంతంకాని వాటిపై తమ కృషిని వృథా చేసుకోకూడదు. ఒక వ్యక్తి ఈ నిష్కపటమైన స్థిరమైన విధానాన్ని అనుసరించినప్పుడు, ఆయన సంతోషంగా ఉంటాడు అలాగే అతని ‘అభివృద్ధి అందరికి తేటగా కనబడుతుంది.’​—⁠1 తిమోతి 4:​15.

అవును, క్రైస్తవ పందెం కొనసాగుతూనే ఉంటుంది. మనం సహించడానికీ మన అంతిమ విజయానికీ అవసరమైన ఉపదేశాన్ని, సహాయాన్ని మన మహాగొప్ప శిక్షకుడైన యెహోవా ప్రేమపూర్వకంగా అందిస్తాడు. (యెషయా 48:​17) ప్రాచీన క్రీడాకారుల వలే, మన విశ్వాసం కోసమైన పోరాటంలో మనం స్వయం-క్రమశిక్షణను, ఆశానిగ్రహాన్ని, స్థిరత్వాన్ని పెంపొందించుకోవడం అవసరం. సరైన రీతిలో గురిచూసి సల్పిన మన కృషి సమృద్ధిగా ఆశీర్వదించబడుతుంది.​—⁠హెబ్రీయులు 11:⁠6.

[31వ పేజీలోని బాక్సు]

‘అతనికి నూనె రాయండి’

ప్రాచీన గ్రీస్‌లో క్రీడాకారునికి ఇచ్చే శిక్షణలో, అభిషేకించే వ్యక్తి ఒక పాత్రను నిర్వహించేవాడు. వ్యాయామం చేయడానికి సిద్ధంగా ఉన్న పురుషుల శరీరాలను నూనెతో అభిషేకించడం అతని పని. శిక్షకులు, “శిక్షణకు ముందు నైపుణ్యవంతంగా కండరాలకు మసాజ్‌ చేయడం ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగివుంటుందని, చాలాసేపటి వరకూ శిక్షణ పొందిన తర్వాత క్రీడాకారుడు ఉపశమనం పొందడానికీ పూర్వ స్థితికి రావడానికీ జాగ్రత్తగా మృదువుగా చేసిన మసాజ్‌ సహాయపడుతుందనీ గమనించారు” అని ప్రాచీన గ్రీస్‌లో ఒలింపిక్‌ క్రీడలు (ఆంగ్లం) అనే పుస్తకం వ్యాఖ్యానిస్తుంది.

శరీరానికి అక్షరార్థమైన నూనెను రాయడం ఉపశమింపజేసేదిగా, చికిత్స చేసేదిగా, స్వస్థపరిచేదిగా ఎలా ఉంటుందో, అలసిపోయిన ఒక క్రైస్తవ “క్రీడాకారునికి” దేవుని వాక్యాన్ని అన్వయించడం, అతన్ని సరిదిద్ది, ఓదార్చి, స్వస్థపర్చగలదు. కాబట్టి, యెహోవానుండి వచ్చే నడిపింపును అనుసరించి సంఘంలోని పెద్దలు అలాంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా కోలుకోవడాన్ని సాధ్యంచేసేందుకు ఎంతో అవసరమైన విధంగా, సూచనార్థకంగా ‘ప్రభువు నామమున నూనె రాసి,’ అతని గురించి ప్రార్థించమని ఉపదేశించబడుతున్నారు.​—⁠యాకోబు 5:​13-15; కీర్తన 141:⁠5.

[31వ పేజీలోని చిత్రం]

ఒక బలి అర్పించిన తర్వాత, పదినెలల పాటు శిక్షణపొందామని క్రీడాకారులు ప్రమాణం చేయాలి

[చిత్రసౌజన్యం]

Musée du Louvre, Paris

[29వ పేజీలోని చిత్రసౌజన్యం]

Copyright British Museum