కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యుద్ధానంతర విస్తరణలో భాగం వహించే ఆధిక్యత

యుద్ధానంతర విస్తరణలో భాగం వహించే ఆధిక్యత

జీ వి త క థ

యుద్ధానంతర విస్తరణలో భాగం వహించే ఆధిక్యత

ఫిలిప్‌ ఎస్‌. హాఫ్‌మాన్‌ చెప్పినది

రెండవ ప్రపంచయుద్ధం 1945 మే నెలలో ముగిసింది. ఆ సంవత్సరం డిసెంబరు నెలలో, ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల ప్రకటనా పనిని పర్యవేక్షించే బాధ్యతగల నేథన్‌ హెచ్‌. నార్‌, 25 సంవత్సరాల వయసున్న తన కార్యదర్శి మిల్టన్‌ జి. హెన్షెల్‌తో కలిసి డెన్మార్క్‌ను సందర్శించారు. ఎంతో ఆతురతతో నిరీక్షించబడిన ఆ సందర్శనం కోసం ఒక పెద్ద హాలును రెంట్‌కు తీసుకోవడం జరిగింది. యౌవనస్థులమైన మాకు, సహోదరుడైన హెన్షెల్‌ ఇచ్చిన ప్రసంగం చాలా ఉత్తేజకరంగా అనిపించింది, ఎందుకంటే ఆయనది కూడా మా వయస్సే. మరో కారణం ఆయన ఎంపిక చేసుకున్న అంశం: “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”​—⁠ప్రసంగి 12:⁠2.

ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిలో అభివృద్ధి సాధించడానికి ఉత్తేజకరమైన పనులు జరుగుతున్నాయనీ వాటిలో మమ్మల్ని చేర్చుకునే అవకాశం ఉందనీ మేము ఆ సందర్శనంలో తెలుసుకున్నాము. (మత్తయి 24:​14) ఉదాహరణకు, యౌవనస్థులైన స్త్రీపురుషులకు మిషనరీ సేవ విషయమై శిక్షణనివ్వడానికి అమెరికాలో ఒక క్రొత్త స్కూలు ప్రారంభించబడింది. ఒకవేళ మేము ఆ స్కూలుకు ఆహ్వానించబడితే, మాకు “కేవలం వన్‌ వే టికెట్‌ మాత్రమే” లభిస్తుందనీ మేము ఎక్కడ నియమించబడతామో మాకు ముందుగా చెప్పబడదనీ నొక్కి చెప్పారు. అయినప్పటికీ, మాలో కొందరం దానికి అప్లై చేశాము.

రెండవ ప్రపంచయుద్ధానంతరం నాకు ఎదురైన అనుభవాలను వివరించేముందు, 1919వ సంవత్సరంలో నేను జన్మించిన కాలానికి తిరిగి వెళ్ళనివ్వండి. యుద్ధానికి ముందు, యుద్ధం జరుగుతుండగా నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి.

ఒక వ్యర్థుడి నుండి బైబిలు సత్యం

తన మొదటి బిడ్డనైన నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు, ఒకవేళ అబ్బాయి పుడితే ఒక మిషనరీ అవ్వాలని ఆమె ప్రార్థించింది. మా అమ్మ వాళ్ళన్నయ్య యెహోవాసాక్షులు అప్పట్లో పిలువబడుతున్నట్లుగా ఒక బైబిలు విద్యార్థి, కానీ ఆమె కుటుంబంలోని ఇతర సభ్యులు అతన్ని ఒక వ్యర్థుడిగా చూసేవారు. మా ఇల్లు కోపెన్‌హాగన్‌కి దగ్గర్లో ఉండేది, బైబిలు విద్యార్థులు ఆ ప్రాంతంలో తమ వార్షిక సమావేశాలను జరుపుకున్నప్పుడు, కొంచెం దూరంలో నివసించే థామస్‌ మామయ్యను వచ్చి మాతో ఉండమని అమ్మ ఆహ్వానించేది. ఆయనకున్న అద్భుతమైన బైబిలు పరిజ్ఞానము, తార్కికమైన వాదన, 1930వ సంవత్సరానికల్లా అమ్మ కూడా ఒక బైబిలు విద్యార్థి అయ్యేలా ఆమెను ఒప్పించాయి.

అమ్మ బైబిలును ఎంతో ఇష్టపడేది. ద్వితీయోపదేశకాండము 6:7 లో ఇవ్వబడిన ఆజ్ఞానుసారంగా అమ్మ, నాకూ చెల్లికీ ‘తన ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును’ బోధించింది. కొద్దికాలానికి, నేను ఇంటింటి ప్రకటనా పనిలో భాగం వహించడం ప్రారంభించాను. చర్చీలు బోధిస్తున్న అమర్త్యమైన ఆత్మ, నరకాగ్ని వంటి విషయాలను చర్చించడానికి నేను ఎంతో ఇష్టపడేవాణ్ణి. ఇలాంటి బోధలు తప్పు అని బైబిలు నుండి ప్రభావవంతంగా చూపించగలిగేవాడిని.​—⁠కీర్తన 146:​3, 4; ప్రసంగి 9:​5, 10.

మా కుటుంబం ఐక్యమయ్యింది

1937వ సంవత్సరంలో కోపెన్‌హాగెన్‌లో సమావేశం అయిపోయిన తర్వాత, డెన్మార్క్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలోని సాహిత్య విభాగంలో తాత్కాలిక సహాయం అవసరమయ్యింది. బిజినెస్‌ కాలేజీ నుండి అప్పుడే విద్య పూర్తి చేసిన నాకు ఎలాంటి బాధ్యతలు లేవు, కాబట్టి ఆ విభాగంలో సహాయం చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఆ విభాగంలో పని పూర్తయిన తర్వాత బ్రాంచి కార్యాలయం వద్ద సహాయం చేయమని నన్ను కోరారు. ఆ తర్వాత, నేను ఇంకా బాప్తిస్మం తీసుకోకపోయినప్పటికీ ఇల్లు వదిలి కోపెన్‌హాగన్‌లోని బ్రాంచి కార్యాలయంలో ఉండడానికి వెళ్ళాను. పరిణతి చెందిన క్రైస్తవులతో రోజూ సహవసించడం నేను ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడానికి సహాయపడింది. ఆ తర్వాతి సంవత్సరం 1938, జనవరి 1వ తేదీన నేను యెహోవా దేవునికి చేసుకున్న సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించాను.

1939వ సంవత్సరం సెప్టెంబరు నెలలో రెండవ ప్రపంచయుద్ధం మొదలయ్యింది. 1940, ఏప్రిల్‌ 9వ తేదీన జర్మన్‌ దళాలు డెన్మార్క్‌ను ఆక్రమించాయి. డెన్మార్క్‌ ప్రజలకు చెప్పుకోదగినంత వ్యక్తిగత స్వాతంత్ర్యం ఇవ్వబడేది కాబట్టి మేము మా ప్రకటనా కార్యకలాపాలను కొనసాగించడానికి వీలయ్యింది.

అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మా కుటుంబ సంతోషాన్ని పరిపూర్ణంచేస్తూ నాన్నగారు కూడా చురుకైన, విశ్వసనీయమైన సాక్షిగా మారారు. కాబట్టి నలుగురు డెన్మార్క్‌ సహోదరులతో పాటు గిలియడ్‌ స్కూలులో ఎనిమిదవ తరగతికి హాజరవ్వమని నన్ను ఆహ్వానించినప్పుడు, నా కుటుంబమంతా నన్ను ప్రోత్సహించింది. 1946, సెప్టెంబరులో మొదలైన ఐదునెలల స్కూలు కోర్సు, న్యూయార్క్‌ రాష్ట్రంలోని సౌత్‌ లాన్‌సింగ్‌కి బయట అందమైన క్యాంపస్‌లో నిర్వహించబడింది.

గిలియడ్‌లోను, గిలియడ్‌ తర్వాత పొందిన శిక్షణ

అద్భుతమైన క్రొత్త స్నేహితులను సంపాదించుకోవడానికి గిలియడ్‌ అవకాశాలను అందించింది. ఇంగ్లండ్‌ నుండి వచ్చిన హెరాల్డ్‌ కింగ్‌తో ఒక సాయంత్రం క్యాంపస్‌లో నడుస్తుండగా, శిక్షణ పూర్తయిన తర్వాత మమ్మల్ని ఎక్కడకి పంపించే అవకాశం ఉందన్న విషయాన్ని మేము మాట్లాడుకున్నాము. “నేను డోవర్‌లోని తెల్లని కొండలను మళ్ళీ చూస్తానని నాకు నమ్మకముంది” అని హెరాల్డ్‌ అన్నాడు. ఆయన చెప్పింది నిజమే, కానీ ఆయన ఆ కొండలను మళ్ళీ చూడడానికి 17 సంవత్సరాలు పట్టింది, వాటిలో నాలుగున్నర సంవత్సరాలు ఆయన చైనా చెరసాలలో ఏకాంత నిర్బంధంలో గడిపాడు! *

మా గ్రాడ్యుయేషన్‌ తర్వాత, యెహోవాసాక్షుల సంఘాలను సందర్శిస్తూ వారికి ఆధ్యాత్మిక సహాయం చేసేందుకు ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేయడానికి నన్ను అమెరికాలోని టెక్సాస్‌కు పంపించడం జరిగింది. అక్కడివారు నన్ను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. టెక్సాస్‌లోని సహోదరులకు, అప్పుడే గిలియడ్‌ నుండి వచ్చిన యూరోపియన్‌ కుర్రవాడితో పనిచేయడం ఆసక్తికరంగా తోచింది. కానీ టెక్సాస్‌లో కేవలం ఏడు నెలలు ఉన్న తర్వాత, నేను న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయానికి పిలువబడ్డాను. అక్కడ, సహోదరుడు నార్‌, అన్ని డిపార్ట్‌మెంట్‌లలో పని ఎలా జరుగుతుందో నేర్చుకోమన్న ఆదేశాలతో నన్ను ఆఫీసు పని చేయడానికి నియమించారు. ఆ తర్వాత నేను డెన్మార్క్‌కు తిరిగి వెళ్ళి ఇక్కడ నేర్చుకున్నవి అన్వయించాలి, అంటే బ్రూక్లిన్‌లో జరుగుతున్నట్లుగానే అక్కడ కూడా అంతా సవ్యంగా జరుగుతుందని నిశ్చయపర్చుకోవాలి. మరింత ప్రభావవంతంగా ఉండడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాంచిలలోని పనులను ఐక్యపర్చాలన్నదే ఉద్దేశించబడింది. తర్వాత సహోదరుడు నార్‌ నన్ను జర్మనీకి ట్రాన్స్‌ఫర్‌ చేశారు.

ఉపదేశాలను బ్రాంచీలకు అన్వయించడం

జూలై 1949 లో నేను జర్మనీలోని వీస్‌బాడెన్‌కు వచ్చినప్పుడు, జర్మనీకి చెందిన చాలా పట్టణాలు అప్పటికింకా శిథిలావస్థలోనే ఉన్నాయి. ప్రకటనా పనిలో నాయకత్వం వహించే పురుషులు 1933 లో హిట్లర్‌ పరిపాలన ప్రారంభించినప్పటినుండి హింసించబడిన వారు. కొందరు ఎనిమిది నుండి పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం చెరసాలలోనూ నిర్బంధ శిబిరాలలోనూ ఉన్నారు! యెహోవా సేవకులైన ఇలాంటివారితో నేను మూడున్నర సంవత్సరాలు పనిచేశాను. వారి అసాధారణమైన మాదిరి, జర్మన్‌ చరిత్రకారుడైన గాబ్రీయేలా యోనాన్‌ వ్యాఖ్యానాన్ని నాకు గుర్తుచేస్తుంది, అతనిలా వ్రాశాడు: “నాజీల నిరంకుశాధికారం క్రింద ఈ స్థిరమైన క్రైస్తవ గుంపు యొక్క మాదిరి లేకపోయి ఉంటే​—⁠ఆష్‌విట్జ్‌ మరియు హోలోకాస్ట్‌ తర్వాత​—⁠యేసు చేసిన క్రైస్తవ బోధలను నెరవేర్చడం అసలు సాధ్యమేనా అని సందేహించవలసి వచ్చేది.”

ఈ బ్రాంచిలో నా పని, నేను డెన్మార్క్‌లో చేసిన పనే: సంస్థాపరమైన విషయాలతో వ్యవహరించడానికి ఒక క్రొత్త ఏకీకృత విధానాన్ని ప్రవేశపెట్టడం. చేయబడుతున్న సవరింపులు వారి పనిని విమర్శించడానికి కాదు కానీ వివిధ బ్రాంచిలకు, ముఖ్య కార్యాలయాలకు మధ్య మరింత సన్నిహితమైన సహకారం ఉండాల్సిన సమయం వచ్చినందుకే అని జర్మన్‌ సహోదరులు అర్థం చేసుకున్న వెంటనే వారు ప్రోత్సహించబడి, సహకరించే స్ఫూర్తితో నింపబడ్డారు.

1952వ సంవత్సరంలో సహోదరుడు నార్‌ ఆఫీసు నుండి వచ్చిన ఉత్తరం, స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఉన్న బ్రాంచికి వెళ్ళమని నన్ను ఆదేశించింది. 1953, జనవరి నెల మొదలుకొని అక్కడ నేను బ్రాంచి పైవిచారణకర్తగా నియమించబడ్డాను.

స్విట్జర్లాండ్‌లో క్రొత్త ఆనందాలు

స్విట్జర్లాండ్‌కు వచ్చిన కొంత కాలానికి ఒక సమావేశంలో నేను ఎస్తేర్‌ని కలిశాను, ఆ తర్వాత కొద్దికాలానికే మేము ప్రధానం చేసుకున్నాము. 1954వ సంవత్సరం ఆగస్టు నెలలో సహోదరుడు నార్‌ నన్ను బ్రూక్లిన్‌కు రమ్మని కోరారు. అక్కడ నాకు ఒక క్రొత్త ఉత్తేజకరమైన పని గురించి వెల్లడిచేయబడింది. ప్రపంచవ్యాప్తంగా బ్రాంచి కార్యాలయాల సంఖ్య, వాటి పరిమాణము ఎంతో పెరిగిపోవడం వల్ల, ఒక క్రొత్త విధానం ప్రవేశపెట్టడం జరుగుతోంది. ప్రపంచం జోనులుగా విభాగించబడి, ప్రతి జోను ఒక జోను పైవిచారణకర్త ద్వారా పర్యవేక్షించబడుతుంది. నాకు రెండు జోనులు ఇవ్వబడ్డాయి: యురోప్‌, మధ్యధరా ప్రాంతం.

నేను బ్రూక్లిన్‌ను స్వల్పకాలికంగా సందర్శించిన తర్వాత, వెంటనే, స్విట్జర్లాండ్‌కు తిరిగివచ్చి జోను పనికి సిద్ధపడ్డాను. నేను, ఎస్తేర్‌ వివాహం చేసుకున్నాము, స్విట్జర్లాండ్‌లోని బ్రాంచి కార్యాలయంలో ఆమె నాతోపాటు సేవచేసింది. నా మొదటి ప్రయాణంలో నేను ఇటలీ, గ్రీస్‌, సైప్రస్‌, మధ్యప్రాచ్య దేశాలు, ఉత్తర ఆఫ్రికా తీరం వెంబడి ఉన్న దేశాలు, స్పెయిన్‌, పోర్చుగల్‌​—⁠మొత్తం కలిపి 13 దేశాలలోని మిషనరీ గృహాలకు, బ్రాంచీలకు వెళ్ళాను. బెర్న్‌ని సందర్శించిన తర్వాత, నా ప్రయాణం ఐరన్‌ కర్టెన్‌కు పశ్చిమంలోని ఇతర యూరోపియన్‌ దేశాలను సందర్శించడంలో కొనసాగింది. మా పెళ్ళి జరిగిన తర్వాత మొదటి సంవత్సరం, నేను మన క్రైస్తవ సహోదరులకు సేవచేస్తూ ఆరు నెలలు ఇంటి నుండి దూరంగా ఉన్నాను.

పరిస్థితులలో మార్పు

1957వ సంవత్సరంలో, ఎస్తేర్‌కు తాను గర్భవతినని తెలిసింది. బ్రాంచి పిల్లలున్న తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేయబడలేదు. కాబట్టి మేము డెన్మార్క్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. అక్కడ నా తండ్రి మమ్మల్ని అయనతోపాటు ఉండమని ఆహ్వానించాడు. ఎస్తేర్‌ మా కుమార్తె రాకెల్‌ను, నా తండ్రిని చూసుకునేది, క్రొత్తగా కట్టిన బ్రాంచిలోని పనిలో నేను సహాయం చేసేవాడిని. సంఘ పైవిచారణకర్తల కోసం జరిగే రాజ్యపరిచర్య పాఠశాలలో నేను ఉపదేశకుడిగా సేవచేశాను, జోను పైవిచారణకర్తగా సేవచేయడంలో కొనసాగాను.

జోను పని చేయడమంటే దీర్ఘకాలం పాటు ప్రయాణంలోనే ఉండాల్సి వచ్చేది, ఆ కారణంవల్ల నేను మా కుమార్తెనుండి ఎక్కువకాలం పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. దాని పర్యవసానాలు దానికి ఉన్నాయి. నేను ప్యారిస్‌లో కొంతకాలం ఉన్నాను, అక్కడ మేము ఒక చిన్న ప్రింటరీని స్థాపించాము. ఎస్తేర్‌, రాకెల్‌ నన్ను చూడడానికి ట్రెయిన్‌లో వచ్చి గార్‌ డూయీ నార్‌ వద్ద దిగారు. నేనూ, బ్రాంచి నుండి వచ్చిన లేయోపాల్‌ జోన్టా వారిని కలవడానికి వెళ్ళాము. రాకెల్‌ ప్లాట్‌ఫారంలో మెట్టు దగ్గర నుండి లేయోపాల్‌ను చూసి, తర్వాత నా వైపు చూసి మళ్ళీ లేయోపాల్‌ను చూసి అతనే నేను అనుకుని అతన్ని కౌగిలించుకుంది!

నాకు 45 సంవత్సరాల వయసున్నప్పుడు, నా కుటుంబాన్ని పోషించేందుకుగాను ఉద్యోగం చేయడానికి నేను పూర్తికాల సేవను వదిలిపెట్టడం అనేది మరో ఆశ్చర్యకరమైన మార్పు. యెహోవాసాక్షుల సేవకుడిగా నాకున్న అనుభవంతో, నేను ఎక్స్‌పోర్ట్‌ మానేజర్‌గా ఉద్యోగం సంపాదించుకోగలిగాను. ఆ కంపెనీ కోసం నేను దాదాపు తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన తర్వాత, రాకెల్‌ తన స్కూలు చదువులు ముగించిన తర్వాత, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడకు వెళ్ళమని ఇవ్వబడిన ప్రోత్సాహానికి ప్రతిస్పందించాలని మేము నిర్ణయించుకున్నాము.

నార్వేలో ఉద్యోగ అవకాశాల గురించి ఆలోచిస్తూ, అక్కడ ఉద్యోగం గురించి ఒక ఏజెన్సీని అడిగాను. సమాధానం అంత ప్రోత్సాహకరంగా లేదు. 55 సంవత్సరాల వ్యక్తికి ఉద్యోగం దొరికే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ, ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకంతో నేను ఓస్లోలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించి, డ్రోబాక్‌ పట్టణానికి దగ్గర్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాను. నాకు ఉద్యోగం దొరికింది, తర్వాత నార్వేలో చాలా ఆనందకరమైన రాజ్య పరిచర్య చేశాము.

మా సంఘంలో అధిక శాతం మంది నియమించబడని క్షేత్రంలో పనిచేయడానికి ఉత్తరం వైపుకు ప్రయాణించి వెళ్ళిన సమయాలు అత్యంత సంతోషకరమైన సమయాలు. ఒక క్యాంపింగ్‌ సైట్‌ వద్ద మేము కాటేజ్‌లను అద్దెకు తీసుకునేవాళ్ళము, అద్భుతమైన కొండలలో అక్కడక్కడా ఉన్న ఫార్మ్‌లను ప్రతిరోజు సందర్శించేవాళ్ళము. స్నేహపూర్వకమైన ఈ ప్రజలకు దేవుని రాజ్యం గురించి చెప్పడం అత్యంత ఆనందదాయకంగా ఉండేది. ఎంతో సాహిత్యం అందించేవాళ్ళం, కానీ పునర్దర్శనాలు చేయడానికి తర్వాతి సంవత్సరం వరకూ వేచివుండవలసి వచ్చేది. అయినప్పటికీ, ప్రజలు మమ్మల్ని మరచిపోయేవారు కాదు! మేము మళ్ళీ సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడో తప్పిపోయిన కుటుంబ సభ్యుల్లా వారు మమ్మల్ని కౌగిలించుకునే విషయం ఎస్తేర్‌, రాకెల్‌ ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. నార్వేలో మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత మేము డెన్మార్క్‌కు తిరిగి వచ్చాము.

కుటుంబ జీవితపు ఆనందాలు

రాకెల్‌, ఆసక్తిగల పూర్తికాల పయినీరు సేవకుడైన నీల్స్‌ హోయియోతో ప్రధానం చేసుకుంది. వారు వివాహం చేసుకున్న తర్వాత, వారికి పిల్లలు పుట్టేంతవరకూ నీల్స్‌, రాకెల్‌ పయినీరు సేవచేశారు. నీల్స్‌ తన కుటుంబంపట్ల నిజమైన శ్రద్ధ చూపుతూ ఒక మంచి భర్తగా మంచి తండ్రిగా ఉన్నాడు. ఒక రోజు ఉదయం సూర్యోదయాన్ని చూడడానికి ఆయన తన కొడుకును తీసుకుని సైకిల్‌ మీద సముద్రతీరానికి వెళ్ళాడు. మీరు అక్కడ ఏమి చేశారని పొరుగింటి వ్యక్తి అడిగాడు. “మేము యెహోవాకు ప్రార్థించాము” అని వాడు సమాధానమిచ్చాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత, అందరికంటే పెద్దవారైన మా మనవడు బెంజమిన్‌, మా మనవరాలు నాడ్యా బాప్తిస్మం తీసుకోవడాన్ని నేను ఎస్తేర్‌ కళ్ళారా చూశాము. బాప్తిస్మాన్ని వీక్షించేవారిలో నీల్స్‌ కూడా ఉన్నాడు, అతను అకస్మాత్తుగా నా ఎదురుగా నిలబడి, నన్ను చూసి “నిజమైన పురుషులు ఏడవరు” అన్నాడు. కానీ మరుక్షణం మేమిద్దరం కౌగిలించుకుని ఇద్దరమూ ఏడ్చాము. కలిసి నవ్వి కలిసి ఏడవగలిగే అల్లుడు ఉండడం ఎంత ఆనందకరం!

ఇప్పటికీ పరిస్థితులకు అనువుగా సర్దుబాట్లు చేసుకోవడం

నన్నూ ఎస్తేర్‌నూ డెన్మార్క్‌ బ్రాంచి కార్యాలయంలో సేవచేయడానికి తిరిగి రమ్మని కోరినప్పుడు మరో ఆశీర్వాదం మాకు లభించింది. అయితే, అప్పటికి హోల్‌బెక్‌లో మరింత పెద్ద బ్రాంచిని నిర్మించడానికి ఏర్పాట్లు చేయబడుతున్నాయి. నిర్మాణ పనిని పర్యవేక్షించే పనిలో భాగం వహించే ఆధిక్యత నాకు లభించింది, నిర్మాణపు పని మొత్తం, జీతం లేకుండా స్వచ్ఛందంగా పనిచేసిన సేవకుల ద్వారా జరిగింది. విపరీతమైన చలిలో కూడా 1982 సంవత్సరంతానికల్లా ఆ ప్రాజెక్టు దాదాపు పూర్తిచేయబడింది. మరింత పెద్దవైన, అభివృద్ధి చేయబడిన బిల్డింగులలోకి మారడానికి మేమందరం ఎంతో ఆనందించాము!

నన్ను ఆఫీసు పనిలో చేర్చుకున్నారు, ఆ పని నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఎస్తేర్‌ టెలిఫోను స్విచ్‌బోర్డును ఆపరేట్‌ చేసేది. అయితే, ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమెకు హిప్‌-రిప్లేస్‌మెంట్‌ సర్జరీ జరిగింది, ఒకటిన్నర సంవత్సరాల తర్వాత తను గాల్‌బ్లాడర్‌ ఆపరేషన్‌ చేయించుకోవలసి వచ్చింది. బ్రాంచి సభ్యులు మాకు దయాపూర్వకమైన శ్రద్ధ చూపించినప్పటికీ, మేము బ్రాంచి వదిలి వెళ్తేనే మంచిదని నిర్ణయించుకున్నాము. మా కూతురు మరియు మా కుటుంబం ఉన్న సంఘానికి మేము మారాము.

ఇప్పుడు, ఎస్తేర్‌ ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంటుంది. అయినప్పటికీ, మేమిద్దరం కలిసి సేవచేసిన సంవత్సరాలన్నింటిలో, పరిస్థితులలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ, ఆమె నాకు అద్భుతమైన మద్దతునిస్తూ మంచి సహచరిణిగా ఉందని నేను చెప్పగలను. ఆరోగ్యం అంతకంతకూ పాడైపోతున్నప్పటికీ, మేమిద్దరం ఇప్పుడు కూడా ప్రకటనా పనిలో భాగం వహిస్తున్నాము. నేను నా జీవితం గురించి ఆలోచించినప్పుడు కీర్తనకర్త మాటలను నేను కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుచేసుకుంటాను: “దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి.”​—⁠కీర్తన 71:​17.

[అధస్సూచి]

^ పేరా 15 కావలికోట (ఆంగ్లం), జూలై 15, 1963, 437-42 పేజీలను చూడండి.

[24వ పేజీలోని చిత్రం]

1949 లో నిర్మాణ పనిలో ఉన్న జర్మనీ బ్రాంచి వద్ద సాహిత్య సరఫరాను క్రిందకు దించుతూ

[25వ పేజీలోని చిత్రం]

నా పని సహచరులలో, నిర్బంధ శిబిరాలనుండి తిరిగి వచ్చిన ఇలాంటి సాక్షులు ఉన్నారు

[26వ పేజీలోని చిత్రాలు]

ఎస్తేర్‌తో ఇప్పుడు మరియు 1955 అక్టోబరులో బెర్న్‌ బేతేలులో మా వివాహమప్పుడు